॥ఓం శ్రీగణేశాయ నమః॥
॥శ్రీ వేద వ్యాసాయ నమః॥
ఆది పర్వము
1. ప్రథమాధ్యాయము
(అనుక్రమణికా పర్వము)
గ్రంథారంభము - మహిమ.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥
(ఓమ్ నమో భగవతే వాసుదేవాయ
ఓమ్ నమః పితామహాయ
ఓమ్ నమః ప్రజాపతిభ్యః
ఓమ్ నమః కృష్ణద్వైపాయనాయ
ఓమ్ నమః సర్వవిఘ్న వినాయకేభ్యః)
నరుల మనస్సులే నివాస స్థానమైన నారాయణునికీ, నరోత్తమునికీ, సరస్వతీ దేవికీ, వ్యాసమహర్షికీ నమస్కరించి శ్రీమహాభారతమును చదువవలెను/చెప్పవలెను.
లోమహర్షణ పుత్ర ఉగ్రశ్రవాః సౌతిః పౌరాణికో నైమిషారణ్యే।
శౌనకస్య కులపతేః ద్వాదశ వార్షికే సత్రే-॥ 1
సుఖాసీనా నభ్యాగచ్ఛద్ బ్రహ్మర్షీన్ సంశితవ్రతాన్।
వినయావనతో భూత్వా కదాచిత్ సూతనందనః॥ 2
పూర్వం ఒకప్పుడు కులపతి అయిన శౌనకుడు నైమిశారణ్యంలో ద్వాదశవార్షిక యాగం (12 ఏళ్లపాటు చేసే యజ్ఞం) చేస్తున్నాడు. అచ్చట వ్రతదీక్షా పరులయిన బ్రహ్మర్షులు సుఖాసీనులయి ఉన్నారు. వారి దగ్గరకు లోమహర్షణుని పుత్రుడయిన ఉగ్రశ్రవుడనే పౌరాణికుడు వినయంతో వచ్చాడు. (1,2)
తమాశ్రమమనుప్రాప్తం నైమిషారణ్యవాసినామ్।
చిత్రాః శ్రోతుం కథాస్తత్ర పరివవ్రుస్తపస్వినః॥ 3
నైమిశారణ్యవాసులంతా ఆ ఉగ్రశ్రవుని నుండి చిత్రమయిన కథలు వినటానికి అతని చుట్టూ చేరారు. (3)
అభివాద్య మునీంస్తాంస్తు సర్వానేవ కృతాంజలిః।
అపృచ్ఛత్ స తపోవృద్ధిం సద్భిశ్చైవాభిపూజితః॥ 4
ఉగ్రశ్రవుడు ఆ మునులందరికీ నమస్కరించి "మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతోందా"? అని అడిగాడు - వారంతా ఉగ్రశ్రవునికి స్వాగత సత్కారాలు చేశారు. (4)
అథ తేషూపవిష్టేషు సర్వేష్వేవ తపస్విషు।
నిర్దిష్టమాసనం భేజే వినయాల్లౌమహర్షణిః॥ 5
తాపసులంతా కూర్చున్న తరువాత వారు వేసిన ఆసనం మీద ఉగ్రశ్రవుడు వినయంతో కూర్చున్నాడు. (5)
సుఖాసీనం తతస్తంతు విశ్రాంతముపలక్ష్య చ।
అథాపృచ్ఛద్ ఋషిస్తత్ర కశ్చిత్ ప్రస్తావయన్ కథాః॥ 6
సుఖంగా కూర్చుని విశ్రాంతి తీసుకొంటున్న ఉగ్రశ్రవసుని చూసి ఒక ముని ప్రస్తావనాత్మకంగా ఇలా అడిగాడు. (6)
కుత ఆగమ్యతే సౌతే క్వచాయం విహృతస్త్యయా।
కాలః కమలపత్రాక్ష శంసైతత్ పృచ్ఛతో మమ॥ 7
సూతపుత్రా! మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడెక్కడ ఎంతెంత కాలం ఉన్నారు? వివరంగా చెప్పండి. (7)
ఏవం పృష్టోఽబ్రవీత్ సమ్యక్ యథావల్లౌమహర్షణిః।
వాక్యం వచనసంపన్నః తేషాం చ చరితాశ్రయమ్॥ 8
తస్మిన్ సదసి విస్తీర్ణే మునీనాం భావితాత్మనామ్।
ఇలా అడిగిన మునితో, మహర్షిపూర్ణమయిన ఆ సభలో రౌమహర్షణి వచన రచనా చతురుడై ఇలా అన్నాడు. (8 1/2)
సౌతిరువాచ
జనమేజయస్య రాజర్షేః సర్పసత్రే మహాత్మనః ॥ 9
సమీపే పార్థివేంద్రస్య సమ్యక్ పారిక్షితస్య చ ।
కృష్ణద్వైపాయనప్రోక్తాః సుపుణ్యా వివిధాః కథాః॥ 10
కథితాశ్చాపి విధివత్ యా వైశంపాయనేన వై।
శ్రుత్వాహం తా విచిత్రార్థాః మహాభారతసంశ్రితాః ॥ 11
సూతపుత్రుడు ఇలా అన్నాడు. రాజర్షి అయిన జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. వ్యాసమహర్షి చెప్పిన వివిధ కథలను వైశంపాయనుడు అక్కడ చెప్పాడు. ఆ కథలన్నీ పుణ్య ప్రదాలు - మహాభారతానికి సంబంధించినవి - విచిత్రమయిన అర్థాలున్నవి. వాటిని విని... (ఇక్కడకు వచ్చాను). (9-11)
బహూని సంపరిక్రమ్య తీర్థాన్యాయతనాని చ।
సమంతపంచకం నామ పుణ్యం ద్విజనిషేవితమ్॥ 12
గతవానస్మి తం దేశం యుద్ధం యత్రాభవత్ పురా।
కురూణాం పాండవానాం చ సర్వేషాం చ మహీక్షితామ్॥ 13
చాలా పుణ్యతీర్థాలు తిరిగి విప్రసేవితమయిన శమంతపంచకం అనే పుణ్యప్రదేశానికి వెళ్లాను. పూర్వం అక్కడే కురుపాండవులకూ; మహారాజులందరకూ యుద్ధం జరిగింది. (12,13)
దిదృక్షురాగతస్తస్మాత్ సమీపం భవతామిహ।
ఆయుష్మంతః సర్వ ఏవ బ్రహ్మభూతా హి మే మతాః।
అస్మిన్ యజ్ఞే మహాభాగాః సూర్యపావకవర్చసః॥ 14
అక్కడ నుండి మీ దగ్గరకు వచ్చాను. మీరంతా పెద్దలు - బ్రహ్మభూతులని నా అభిప్రాయం. ఈ యజ్ఞంలో మీరు సూర్యుని వలె, అగ్నిహోత్రులవలె ప్రకాశిస్తున్నారు. (14)
కృతాభిషేకాః శుచయః కృతజప్యా హుతాగ్నయః।
భవంత ఆసనే స్వస్థాః బ్రవీమి కిమహం ద్విజాః॥ 15
పురాణ సంహితాః పుణ్యాః కథా ధర్మార్థసంశ్రితాః।
ఇతివృత్తం నరేంద్రాణాం ఋషీణాం చ మహాత్మనామ్ ॥ 16
విప్రులారా! మీరంతా స్నానంచేసి శుచులై జపం చేసుకొని అగ్నికార్యాలు తీర్చుకొని స్వస్థమయిన మనసుతో కూర్చున్నవారు. మీకు నేనేమి వినిపించాలి? మహాత్ములయిన రాజుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు, ధర్మార్థాలతో కూడిన పుణ్యపురాణకథలు చెప్పుదునా? (15,16)
ఋషయ ఊచుః
ద్వైపాయనేన యత్ ప్రోక్తం పురాణం పరమర్షిణా।
సురైర్ర్బహ్మర్షిభిశ్చైవ శ్రుత్వా యదభిపూజితమ్॥ 17
తస్యాఖ్యానవరిష్ఠస్య విచిత్రపదపర్వణః ।
సూక్ష్మార్థన్యాయయుక్తస్య వేదార్థైర్భూషితస్య చ॥ 18
భారతస్యేతిహాసస్య పుణ్యాం గ్రంథార్థసంయుతామ్ ।
సంస్కారోపగతాం బ్రాహ్మీం నానాశాస్త్రోపబృంహితామ్॥ 19
జనమేజయస్య యాం రాజ్ఞాం వైశంపాయన ఉక్తవాన్।
యథావత్ స ఋషిస్తుష్ట్యా సత్రే ద్వైపాయనాజ్ఞయా॥ 20
వేదైశ్చతుర్భిః సంయుక్తాం వ్యాసస్యాద్భుతకర్మణః।
సంహితాం శ్రోతుమిచ్ఛామః పుణ్యాం పాపభయాపహామ్॥ 21
అనగానే ఋషులు ఇలా అన్నారు. కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన భారతమనే ఇతిహాసం వినాలనుకొంటున్నాము. పూర్వం దాన్ని దేవతలూ, బ్రహ్మర్షులూ విని పూజించారట - అది విచిత్రమైన పదవిన్యాసాలతో కూడిన ఉత్తమకథ యట. సూక్ష్మార్థాలతోను న్యాయాలతోను కూడినది. వేదార్థాలతో నిండినది. పుణ్యప్రదము, గ్రంథార్థాలతో కూడినది. సంస్కార యుతమయిన వాగ్విశేషాలతో, అనేక శాస్త్రవిశేషాలతో నిండినది - జనమేజయుని యాగంలో ఆ భారతాన్ని వ్యాసమహర్షి ఆజ్ఞతో శిష్యుడయిన వైశంపాయనుడు విధియుక్తంగా చెప్పాడట. అలా చతుర్వేద విశేషాలతో కూడినదై, వ్యాసమహర్షి పరమాద్భుతంగా వ్రాసినదై, పుణ్యప్రదమై, పాప భయాలను పోగొట్టే భారతసంహితను వినాలని కోరుతున్నాము. (17-21)
సౌతిరువాచ
ఆద్యం పురుషమీశానం పురుహూతం పురుష్టుతమ్।
ఋతమేకాక్షరం బ్రహ్మ వ్యక్తావ్యక్తం సనాతనమ్ ॥ 22
అసచ్చ సదసచ్చైవ యద్విశ్వం సదసత్పరమ్।
పరావరాణాం స్రష్టారం పురాణం పరమవ్యయమ్ ॥23
మంగళ్యం మంగళం విష్ణుం వరేణ్యమనఘం శుచిమ్।
నమస్కృత్య హృషీకేశం చరాచరగురుం హరిమ్॥24
మహర్షేః పూజితస్యేహ సర్వలోకైర్మహాత్మనః।
ప్రవక్ష్యామి మతం పుణ్యం వ్యాసస్యాద్భుతకర్మణః॥25
వెంటనే ఉగ్రశ్రవుడు ఇలా అన్నాడు. ఆదిపురుషుడయిన వానికి నమస్కారం. ఆ ఆదిపురుషుడే సర్వేశ్వరుడు - యజ్ఞాలలో ఆయనను గురించియే హోమం చేస్తారు - ఆయననే ఆహ్వానం చేస్తారు. సత్యస్వరూపుడు అతడు. ఏకాక్షర స్వరూపమయిన బ్రహ్మ అతడే - వ్యక్తా వ్యక్తరూపుడు - సనాతనుడు - సత్తు, అసత్తుల రూపమై వీనికి మించిన వాడు - స్థూల సూక్ష్మ జగత్తులను అతడే సృష్టిస్తాడు. చాలా పూర్వుడు. తరగని వాడు - శుభప్రదుడైన శుభరూపుడు. అంతటా వ్యాపించి ఉండేవాడు. శ్రేష్ఠుడు, దోషరహితుడు. శుచియై ఇంద్రియాలను అదుపు చేసేవాడు. చరాచర ప్రపంచానికి గురువు. ఆ శ్రీహరికి నమస్కరించి వ్యాసమహర్షి మనసు నుండి ఉద్భవించిన శ్రీ మహాభారతాన్ని మీకు చెపుతాను అని రౌమహర్షణి ఇలా ఆరంభించాడు. (22-25)
ఆచఖ్యుః కవయః కేచిత్ సంప్రత్యాచక్షతే సరే।
ఆఖ్యాస్యంతి తథైవాన్యే ఇతిహాసమిమం భువి॥ 26
ఈ ఇతిహాసాన్ని ఈ భూమిపై చాలామంది కవులు పూర్వం చెప్పారు. ఇప్పుడూ కొంతమంది చెపుతున్నారు. ఇంకా చాలామంది ముందు చెపుతారు. (26)
ఇదం తు త్రిషు లోకేషు మహత్ జ్ఞానం ప్రతిష్ఠితమ్ ।
విస్తరైశ్చ సమాసైశ్చ ధార్యతే యద్ ద్విజాతిభిః॥27
మూడు లోకాల్లోనూ ఉన్న విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠితమై ఉంది. దీన్ని త్రివర్ణాల వారూ విస్తార రూపంగానూ, సంక్షేపరూపంగానూ చెప్పుకొంటారు. (27)
అలంకృతం శుభైశ్శబ్దైః సమయైర్దివ్యమానుషైః।
ఛందోవృత్తైశ్చ వివిధైః అన్వితం విదుషాం ప్రియమ్॥28
ఈ మహాభారతం శుభశబ్దాలతో అలంకృతమయింది. దివ్య, మానుష సంకేతాలతో (ఆచారాలతో) నిండి ఉంది. అనుష్టుప్పు మొదలయిన ఛందస్సులతో, వృత్తాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. (28)
(పుణ్యే హిమవతః పాదే మధ్యే గిరిగుహాలయే।
విశోధ్య దేహం ధర్మాత్మా దర్భసంస్తరమాశ్రితః॥
శుచిః సనియమో వ్యాసః శాంతాత్మా తపసి స్థితః।
భారతస్యేతిహాసస్య ధర్మేణాన్వీక్ష్య తాం గతిమ్॥
ప్రవిశ్య యోగం జ్ఞానేన సోఽపశ్యత్ సర్వమంతతః।)
వ్యాసమహర్షి హిమవత్పర్వతపాదంలో ఉన్న ఒక గుహలో దర్భాసనం మీద కూర్చున్నాడు. స్నానాదికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకొని కూర్చున్నాడు - నియమంతో శాంతాత్ముడై తపోనిష్ఠలో ధర్మదృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనం అంతా చూశాడు. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరిదాకా చూశాడు.
నిష్ప్రభేఽస్మిన్ నిరాలోకే సర్వతస్తమసావృతే।
బృహదండమభూదేకం ప్రజానాం బీజమవ్యయమ్॥ 29
సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంది. వెలుగులేదు - ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది. అది ప్రజల సృష్టికి తరగని బీజమయింది. (29)
యుగస్యాదౌ నిమిత్తం తత్ మహద్దివ్యం ప్రచక్షతే।
యస్మిన్ సంశ్రయతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనమ్॥ 30
యుగాదికి ఆ దివ్యమయిన అండమే కారణమయింది. దానిలోనే సత్యస్వరూపమూ, జ్యోతీరూపమూ, సనాతనమూ అయిన బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించింది. (30)
అద్భుతం చాప్యచింత్యం చ సర్వత్ర సమతాం గతమ్ ।
అవ్యక్తం కారణం సూక్ష్మం యత్తద్ సదసదాత్మకమ్ ॥ 31
ఆ బ్రహ్మము అద్భుతమయినది - భావింపశక్యం కానిది. అంతటా సమత్వం పొందినది. అవ్యక్తమూ, సూక్ష్మమూ, కారణరూపమూ అయినది. సదసదాత్మకం అయినది. (31)
యస్మాత్ పితామహో జజ్ఞే ప్రభురేకః ప్రజాపతిః ।
బ్రహ్మా సురగురుః స్థాణుః మనుః కః పరమేష్ట్యథ॥ 32
ప్రాచేతసః తథా దక్షాః దక్షపుత్రాశ్చ సప్త వై।
తతః ప్రజానాం పతయః ప్రాభవన్నేకవింశతిః॥ 33
దానినుండియే హిరణ్యగర్భుడు పుట్టాడు. అతడు ప్రథమ దేహధారి. ప్రజాపాలకుడయిన ప్రభువు. తరువాత త్రిగుణప్రధానులయిన బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఉద్భవించారు. తరువాత (బ్రహ్మ యొక్క సృష్టికార్యం కోసం) మనువు, ప్రజాపతి, పరమేష్ఠి, ప్రాచేతసుడు, దక్షుడు, దక్షపుత్రులేడుగురు పుట్టారు. ఆ తరువాత ఇరవై ఒక్క మంది ప్రజాపతులు పుట్టారు. (32-33)
పురుషశ్చాప్రమేయాత్మా యం సర్వఋషయో విదుః।
విశ్వేదేవాస్తథాదిత్యాః వసవోఽథాశ్వినావపి॥ 34
ఋషులందరికీ తెలిసిన అప్రమేయుడయిన పురుషుడు, విశ్వేదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీదేవతలు పుట్టారు. (34)
యక్షాః సాధ్యాః పిశాచాశ్చ గుహ్యకాః పితరస్తథా।
తతః ప్రసూతా విద్వాంసః శిష్టాః బ్రహ్మర్షిసత్తమాః ॥ 35
యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, శిష్టులై విద్వాంసులైన బ్రహ్మర్షి సత్తములూ పుట్టారు. (35)
రాజర్షయశ్చ బహవః సర్వే సముదితా గుణైః ।
ఆపో ద్యౌః పృథివీ వాయుః అంతరిక్షం దిశస్తథా॥ 36
సర్వలక్షణలక్షితులైన ఎంతో మంది రాజర్షులు ఉద్భవించారు. నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు ఉద్భవించాయి. (36)
సంవత్సరర్తవో మాసాః పక్షాహోరాత్రయః క్రమాత్ ।
యచ్చాన్యదపి తత్సర్వం సంభూతం లోకసాక్షికమ్ ॥ 37
సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రాలు క్రమంగా లోకసాక్షికాలయిన అన్నీ ఉద్భవించాయి. (37)
యదిదం దృశ్యతే కించిద్ భూతం స్థావరజంగమమ్ ।
పునః సంక్షిప్యతే సర్వం జగత్ ప్రాప్తే యుగక్షయే ॥ 38
పూర్వం ఉండి, ఇపుడు కనపడే స్థావర జంగమాత్మకమయిన జగత్తు అంతా యుగాంతంలో మళ్లీ లీనమయిపోతుంది. (38)
యథార్తావృతులింగాని నానారూపాణి పర్యయే ।
దృశ్యంతే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు ॥ 39
కొత్త ఋతువు వచ్చేసరికి కొత్త చిహ్నాలు (వసంత ఋతువులో చెట్లు చిగిరించడం మొదలయిన చిహ్నాలు) కనపడినట్లే ఆయా యుగాల మొదట్లో పూర్వయుగాల చిహ్నాలే కనపడతాయి. (39)
ఏవమేతదనాద్యంతం భూతసంహారకారకమ్।
అనాదినిధనం లోకే చక్రం సంపరివర్తతే॥ 40
ఇలా ఆదీ, అంతమూ లేకుండా ప్రాణులన్నిటి సంహారానికీ కారణమవుతూ ఆదీ అంతమూ లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. (40)
త్రయస్త్రింశత్సహస్రాణి త్రయస్త్రింశచ్ఛతాని చ।
త్రయస్త్రింశచ్చ దేవానాం సృష్టిః సంక్షేపలక్షణా॥ 41
ఇలా దేవతల సృష్టి ముప్పది మూడువేలు అనీ, ముప్పదిమూడు వందలనీ, ముప్పదిమూడు అనీ సంక్షేప లక్షణంగా చెప్పబడుతుంది. (36333) (41)
దివః పుత్రో బృహద్భానుః చక్షురాత్మా విభావసుః ।
సవితా స ఋచీకోఽర్కః భానురాశావహో రవిః ॥ 42
పురా వివస్వతః సర్వే మహ్యస్తేషాం తథావరః ।
దేవభ్రాట్ తనయస్తస్య సుభ్రాడితి తతః స్మృతః ॥ 43
దివఃపుత్రుడు, బృహద్భానుడు, చక్షుడు, ఆత్మ, విభావసుడు, సవిత, ఋచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి. పూర్వం ఈ శబ్దాలన్నీ సూర్యుని గురించే చెప్పబడేవి. వీరిలో చివరి 'రవి' శ్రేష్ఠుడు, మహ్యుడు. (మహిలో - భూమిలో గర్భస్థాపనం చేసేవాడు) ఆ రవికి కొడుకు దేవభ్రాట్టు - వాని కొడుకు సుభ్రాట్టు. (42-43)
సుభ్రాజస్తు త్రయః పుత్రాః ప్రజావంతో బహుశ్రుతాః।
దశజ్యోతిః శతజ్యోతిః సహస్రజ్యోతిరేవ చ ॥ 44
సుభ్రాట్టుకు ముగ్గురు కొడుకులు. వారంతా సంతాన వంతులు - చాలా శాస్త్రాలు చదివినవారు - ఆ కొడుకులు 1. దశజ్యోతి 2. శతజ్యోతి 3. సహస్రజ్యోతి అనేవారు. (44)
దశపుత్రసహస్రాణి దశజ్యోతేర్మహాత్మనః ।
తతో దశగుణాశ్చాన్యే శతజ్యోతేరిహాత్మజాః ॥ 45
అందులో మహాత్ముడయిన దశజ్యోతికి పదివేలమంది కొడుకులు. అతనికి పదిరెట్లు అనగా లక్షమంది కొడుకులు శతజ్యోతికి. (45)
భూయస్తతో దశగుణాః సహస్రజ్యోతిషః సుతాః।
తేభ్యోఽయం కురువంశశ్చ యదూనాం భరతస్య చ॥ 46
యయాతీక్ష్వాకువంశశ్చ రాజర్షీణాం చ సర్వశః ।
సంభూతా బహవో వంశాః భూతసర్గాః సువిస్తరాః ॥ 47
సహస్రజ్యోతికి ఇంకా పదిరెట్లు అనగా పది లక్షలమంది కొడుకులు. వారినుండే ఈ కురువంశమూ, యదువంశమూ, భరతవంశమూ, రాజర్షులయిన యయాతి, ఇక్ష్వాకు వంశాలూ, ఇలా చాలా వంశాలు ఉద్భవించాయి. అపుడే ప్రాణుల సృష్టిపరంపర ఎంతో విస్తరించింది. (46,47)
భూతస్థానాని సర్వాణి రహస్యం త్రివిధం చ యత్।
వేదా యోగః సవిజ్ఞానః ధర్మోఽర్థః కామ ఏవ చ ॥ 48
ధర్మకామార్థయుక్తాని శాస్త్రాణి వివిధాని చ ।
లోకయాత్రావిధానం చ సర్వం తద్ దృష్టవాన్ ఋషిః ॥ 49
వ్యాసమహర్షి తన జ్ఞాన దృష్టితో ప్రాణులన్నిటి నివాస స్థానాలూ; ధర్మం, అర్థం, కామం - వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞాన సహిత యోగం, ధర్మార్థ కామసహితాలైన వివిధ శాస్త్రాలు, లోకయాత్రావిధానం - అంతా చూశాడు. (48-49)
ఇతిహాసాః సవైయాఖ్యాః వివిధాః శ్రుతయోఽపి చ ।
ఇహ సర్వమనుక్రాంతం ఉక్తం గ్రంథస్య లక్షణమ్ ॥ 50
అందులోనే ఈ మహాభారత గ్రంథమూ వ్యాఖ్యతో కూడిన ఇతర ఇతిహాసాలూ, వివిధ శ్రుతులూ - అన్నీ కనిపించాయి. ఈ గ్రంథ లక్షణం కూడా చెప్పబడింది. (50)
విస్తీర్యైతత్ మహద్ జ్ఞానం ఋషిః సంక్షిప్య చాబ్రవీత్ ।
ఇష్టం హి విదుషాం లోకే సమాసవ్యాసధారణమ్ ॥ 51
ఈ మహావిజ్ఞానమంతా వేదవ్యాస మహర్షి విస్తరించీ చెప్పాడు. సంక్షేపంగానూ చెప్పాడు. ఇలా విస్తరంగానూ, సంక్షిప్తంగానూ రెండు విధాలా చెప్పడం (అప్పటి) పండితలోకానికి ఇష్టంగా ఉండేది. (51)
మన్వాదిభారతం కేచిత్ ఆస్తీకాది తథాపరే ।
తథోపరిచరాద్యన్యే విప్రాః సమ్యగధీయతే ॥ 52
కొంతమంది విప్రులు ఈ శ్రీ మహాభారతాన్ని మనువు దగ్గరనుంచి చదివేవారు. మరికొందరు ఆస్తీకచరితం దగ్గరనుంచి చదివేవారు. ఇంకా కొందరు ఉపరిచరవసువు కథనుంచి చక్కగా పఠించేవారు. (52)
వివిధం సంహితాజ్ఞానం దీపయంతి మనీషిణః ।
వ్యాఖ్యాతుం కుశలాః కేచిత్ గ్రంథాన్ ధారయితుం పరే ॥ 53
ఈ భారత సంహితలోని వివిధ విజ్ఞానం అంతా ధీమంతులు అనేక విధాల వెలుగులోకి తెచ్చేవారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేసేవారు. కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసి చెప్పేవారు. (53)
తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనమ్ ।
ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీసుతః ॥ 54
తపస్సు చేతను, బ్రహ్మచర్యం చేతనూ సనాతనమయిన వేదాన్ని వింగడించి/వ్యాసం చేసి సాత్యవతేయుడు పుణ్యప్రదమయిన ఈ ఇతిహాసాన్ని చేశాడు. (54)
పరాశరాత్మజో విద్వాన్ బ్రహ్మర్షిః సంశితవ్రతః ।
తదాఖ్యానవరిష్ఠం సః కృత్వా ద్వైపాయనః ప్రభుః ॥ 55
కథమధ్యాపయానీహ శిష్యాన్నిత్యన్వచింతయత్ ।
తస్య తచ్చింతితం జ్ఞాత్వా ఋషేర్ద్వైపాయనస్య చ ॥ 56
తత్రాజగామ భగవాన్ బ్రహ్మా లోకగురుః స్వయమ్ ।
ప్రీత్యర్థం తస్య చైవర్షేః లోకానాం హితకామ్యయా ॥ 57
పరాశరుని కొడుకయిన వ్యాసమహర్షి దీక్ష వహించి ఉత్తమమయిన ఈ భారతకథను చెప్పాక "దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి?" అని ఆలోచించాడు. వ్యాసమహర్షి మనసు తెలుసుకొని లోకగురువయిన బ్రహ్మదేవుడు వ్యాసునికీ, లోకానికంతకూ, ప్రీతీ, హితమూ చేకూర్చాలని స్వయంగా అక్కడకు వచ్చాడు. (55-57)
తం దృష్వా విస్మితో భూత్వా ప్రాంజలిః ప్రణత స్థితః ।
ఆసనం కల్పయామాస సర్వైర్మునిగణైర్వృతః ॥ 58
ప్రత్యక్షమయిన బ్రహ్మను చూసి ఆశ్చర్యంతో అంజలించాడు వ్యాసమహర్షి. వెంటనే మునులందరితో కలిసి పితామహునికి ఆసనం కల్పించాడు. (58)
హిరణ్యగర్భమాసీనం తస్మింస్తు పరమాసనే ।
పరివృత్యాసనాభ్యాశే వాసవేయః స్థితోఽభవత్ ॥ 59
ఆ ఉత్తమాసనం మీద కూర్చున్నాడు హిరణ్యగర్భుడు. అతనికి ప్రదక్షిణించి సమీపంలో కూర్చున్నాడు వ్యాసమహర్షి. (59)
అనుజ్ఞాతోఽథ కృష్ణస్తు బ్రహ్మణా పరమేష్ఠినా ।
నిషసాదాసనాభ్యాశే ప్రీయమాణః శుచిస్మితః ॥ 60
పరమేష్ఠి అయిన బ్రహ్మ వ్యాసమహర్షిని అనుమతించాక సంతోషంతో ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు వ్యాసుడు. (60)
ఉవాచ చ మహాతేజాః బ్రహ్మాణం పరమేష్ఠినమ్ ।
కృతం మయేదం భగవన్ కావ్యం పరమపూజితమ్ ॥ 61
అపుడు మహాతేజస్వి అయిన వ్యాసమహర్షి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. మహాత్మా! పరమ పూజ్యమయిన ఈ కావ్యం నాచేత రచింపబడింది. (61)
బ్రహ్మన్ వేదరహస్యం చ యచ్చాన్యత్ స్థాపితం మయా ।
సాంగోపనిషదాం చైవ వేదానాం విస్తరక్రియా ॥ 62
పితామహా! ఇందులో వేదరహస్యమూ, వేదాంగాల, ఉపనిషత్తుల సారమూ, విస్తారంగా స్థాపింపబడినాయి. (62)
ఇతిహాసపురాణానామ్ ఉన్మేషం నిర్మితం చ యత్ ।
భూతం భవ్యం భవిష్యం చ త్రివిధం కాల సంజ్ఞితమ్ ॥ 63
ఇతిహాస పురాణాల సారమంతా ఈ కావ్యంలో ప్రతిష్ఠింపబడింది. మూడు కాలాలకూ సంబంధించిన విశేషాలన్నీ ఉన్నాయి ఇందులో. (63)
జరామృత్యుభయవ్యాధి భావాభావవినిశ్చయః ।
వివిధస్య చ ధర్మస్య హ్యాశ్రమాణాం చ లక్షణమ్ ॥ 64
జరామరణాలు, భయాలు, వ్యాధులు వీని సత్యాసత్య (నిత్యానిత్య) నిశ్చయాలు, వివిధ ధర్మాలూ, ఆశ్రమాలు వీని లక్షణాలూ చెప్పబడినవి. (64)
చాతుర్వర్ణ్య విధానం చ పురాణానాం చ కృత్స్నశః ।
తపసో బ్రహ్మచర్యస్య పృథివ్యాశ్చంద్రసూర్యయోః ॥ 65
గ్రహనక్షత్ర తారాణాం ప్రమాణం చ యుగైః సహ ।
ఋచో యజూంషి సామాని వేదాధ్యాత్మం తథైవ చ ॥ 66
నాలుగు వర్ణాల విధానం, పురాణాలన్నిటి సారమంతా చెప్పబడింది. తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు - వీటి ప్రమాణాలు, యుగప్రమాణాలు చెప్పబడినవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధ్యాత్మవిద్య అన్నీ చెప్పబడినవి. (65,66)
న్యాయశిక్షా చికిత్సా చ దానం పాశుపతం తథా ।
హేతునైవ సమం జన్మ దివ్యమానుష సంజ్ఞితమ్ ॥ 67
న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం చెప్పబడ్డాయి. దివ్య, మానవ జన్మల కారణాలు వివరించబడినవి. (67)
తీర్థానం చైవ పుణ్యానాం దేశానాం చైవ కీర్తనమ్ ।
నదీనాం పర్వతానాం చ వనానాం సాగరస్య చ ॥ 68
పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలూ ... వీని వర్ణనలున్నాయి. (68)
పురాణాం చైవ దివ్యానాం కల్పానాం యుద్ధకౌశలమ్ ।
వాక్యజాతివిశేషాశ్చ లోకయాత్రాక్రమశ్చ యః ॥ 69
యచ్చాపి సర్వగం వస్తు తచ్చైవ ప్రతిపాదితమ్ ।
పరం న లేఖకః కశ్చిత్ ఏతస్య భువి విద్యతే ॥ 70
దివ్యనగరాలు, దుర్గాలు మొదలయిన వాని నిర్మాణాలు, యుద్ధకౌశలాలు, వీని వర్ణనలు ఉన్నాయి. వేర్వేరు భాషల, జాతుల విశేషాలున్నాయి. లోకవ్యవహార క్రమాలన్నీ ఉన్నాయి. లోకంలో ఉపకరించే సర్వ వస్తువర్ణనలూ ప్రతిపాదించబడినవి. కాని దీనిని వ్రాయటానికి తగిన లేఖకుడు మాత్రం ఈ భూమి మీద కనపడటంలేదు. (69,70)
బ్రహ్మోవాచ
తపోవిశిష్టాదపి వై విశిష్టాన్మునిసంచయాత్ ।
మన్యే శ్రేష్ఠతరం త్వాం వై రహస్యజ్ఞానవేదనాత్ ॥ 71
వ్యాసుని ఈ మాటలు విని బ్రహ్మ ఇలా అన్నాడు. మహర్షీ! నీకు గుప్తమయిన జ్ఞానమంతా తెలుసును. తపోవిశిష్టుడవు - మునులందరికంటే విశిష్టుడవు. అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడవని నేను భావిస్తున్నాను. (71)
జన్మప్రభృతి సత్యాం తే వేద్మి గాం బ్రహ్మవాదినీమ్ ।
త్వయా చ కావ్యమిత్యుక్తం తస్మాత్ కావ్యం భవిష్యతి ॥ 72
నీవు పుట్టినప్పటి నుండి నిన్ను బ్రహ్మవాదిని అయిన వాణి ఆశ్రయించి సత్యభాషణం చేయిస్తోంది. నీవు నీ రచనను కావ్యమని అన్నావు కదా! అందుచేత ఇది కావ్యమే అవుతుంది. (72)
అస్య కావ్యస్య కవయః న సమర్థా విశేషణే ।
విశేషణే గృహస్థస్య శేషాస్త్రయ ఇనాశ్రమాః ॥ 73
కావ్యస్య లేఖనార్థాయ గణేశః స్మర్యతాం మునే ।
ఈ కావ్యాన్ని ఇంతకంటె విశేషించి ఎవరూ చెప్పలేరు. మిగిలిన మూడు ఆశ్రమాల కంటె గృహస్థాశ్రమం శ్రేష్ఠమయినట్లే కావ్యాలన్నిటికంటె శ్రీ మహాభారతం శ్రేష్ఠమయింది. అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయటానికి గణేశుని స్మరించు. (73 1/2)
సౌతిరువాచ
ఏవ మాభాష్య తం బ్రహ్మా జగామ స్వం నివేశనమ్ ॥ 74
రౌమహర్షణి ఇలా అన్నాడు. ఇలా చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్లిపోయాడు. (74)
తతః సస్మార హేరంబం వ్యాసః సత్యవతీసుతః ।
స్మృతమాత్రో గణేశానః భక్తచింతితపూరకః ॥ 75
తత్రాజగామ విఘ్నేశః వేదవ్యాసో యతః స్థితః ।
పూజితశ్చోపవిష్టశ్చ వ్యాసేనోక్తస్తథానఘ ॥ 76
వెంటనే వ్యాసమహర్షి గణేశుని స్మరించాడు. భక్తుల మనోరథాన్ని తీర్చే విఘ్నేశ్వరుడు వ్యాసుడున్న చోటికి వచ్చాడు. వ్యాసుడు అతనిని యథావిధిగా పూజించాడు. గణాధిపుడు సుఖాసీనుడయ్యాక వ్యాసుడిట్లా అన్నాడు. (75,76)
లేఖకో భారతస్యాస్య భవ త్వం గణనాయక ।
మయైవ ప్రోచ్యమానస్య మనసా కల్పితస్య చ ॥ 77
గణాధిపా! నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ భారతానికి నీవు లేఖకుడవు కావాలి. (77)
శ్రుత్వైతత్ ప్రాహ విఘ్నేశః యది మే లేఖనీ క్షణమ్ ।
లిఖతో నావతిష్ఠేత తదా స్యాం లేఖకో హ్యహమ్ ॥ 78
ఆ మాట విన్న వెంటనే విఘ్నేశ్వరుడు "నా లేఖిని క్షణకాలం కూడ ఆగకుండా చెప్పితే అపుడు నేను లేఖకుడను అవుతాను" అన్నాడు. (78)
వ్యాసోఽప్యువాచ తం దేవమ్ అబుద్ధ్వా మాలిఖ క్వచిత్ ।
ఓమిత్యుక్త్వా గణేశోఽపి బభూవ కిల లేఖకః ॥ 79
వ్యాసుడు వెంటనే గణాధిపునితో "అర్థం తెలియకుండా ఎక్కడా వ్రాయకు" అన్నాడు. 'సరే!' అని వినాయకుడు లేఖకుడయ్యాడు. (79)
గ్రంథగ్రంథిం తదా చక్రే మునిర్గూఢం కుతూహలాత్ ।
యస్మిన్ ప్రతిజ్ఞయా ప్రాహ మునిర్ద్వైపాయనస్త్విదమ్ ॥ 80
వ్యాసమహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పడంతో, ఉద్దేశపూర్వకంగా గ్రంథగ్రంథిని కూర్చేవాడు. (గూఢమైన అర్థం ఉండేటట్లు ముడులతో వ్రాసే పద్ధతి గ్రంథగ్రంథి). (80)
అష్టౌ శ్లోకసహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ ।
అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తి వా న వా ॥ 81
అటువంటి శ్లోకాలు ఎనిమిదివేల ఎనిమిది వందలున్నాయి. ఆ శ్లోకాలకు అర్థం నాకు తెలుసు - శుకుడికి తెలుసు - సంజుయుడికి తెలుసునో లేదో ... (81)
తచ్ఛ్లోకకూటమద్యాపి గ్రథితం సుదృఢం మునే ।
భేత్తుం న శక్యతేఽర్థస్య గూఢత్వాత్ ప్రశ్రితస్యచ ॥ 82
గూఢంగా దృఢంగా కూర్చిన, ఆ శ్లోకాల సముదాయానికి అర్థం వివరించటానికి ఇప్పటికీ ఎవరికీ శక్యం కాదు. అవి అన్నీ గూఢార్థాలు, యోగార్థాలు, యోగరూఢాలు కలవి. (82)
సర్వజ్ఞోఽపి గణేశో యత్ క్షణమాస్తే విచారయన్ ।
తావచ్చకార వ్యాసోఽపి శ్లోకానన్యాన్ బహూనపి ॥ 83
వాటి అర్థం తెలుసుకొనడానికి గణేశుడు క్షణకాలం ఆలోచించేవాడు. అంతలో వ్యాసుడు చాలా శ్లోకాలు చెప్పేవాడు. (83)
అజ్ఞానతిమిరాంధస్య లోకస్య తు విచేష్టతః ।
జ్ఞానాంజనశలాకాభిః నేత్రోన్మీలనకారకమ్ ॥ 84
ధర్మార్థకామమోక్షార్థైః సమాసవ్యాసకీర్తనైః ।
తథా భారతసూర్యేణ నృణాం వినిహతం తమః ॥ 85
అజ్ఞానమనే చీకటిలో కనులు మూసుకుపోయిన లోకానికి జ్ఞానమనే కాటుక పుల్లలతో కనులు తెరిపిస్తుంది, వెలుగులనిస్తుంది శ్రీమహాభారతం. అలాగే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలతో విస్తారంగానూ, సంక్లిప్తంగానూ చెప్పిన ఈ మహాభారతం అనే సూర్యుని చేత లోకాల చీకట్లు పటాపంచలయ్యాయి. (84,85)
పురాణపూర్ణచంద్రేణ శ్రుతిజ్యోత్స్నాః ప్రకాశితాః ।
నృబుద్ధికైరవాణాం చ కృతమేతత్ప్రకాశనమ్ ॥ 86
పురాణమనే పూర్ణిమాచంద్రుని చేత వేదాల వెన్నెలలు విరిశాయి. దానితో మానవుల మనసులనే కలువలకు ప్రకాశమూ, వికాసమూ కలిగింది. (86)
ఇతిహాసప్రదీపేన మోహావరణఘాతినా ।
లోకగర్భగృహం కృత్స్నం యథావత్ సంప్రకాశితమ్ ॥ 87
అజ్ఞానమనే ఆవరణాన్ని పోగొట్టే ఈ ఇతిహాసం అనే దీపం లోకమనే గర్భాలయాన్ని సంపూర్ణంగా ప్రకాశింపజేసింది. (87)
సంగ్రహాధ్యాయబీజో వై పౌలోమాస్తీకమూలవాన్ ।
సంభవస్కంధవిస్తారః సభారణ్యవిటంకవాన్ ॥ 88
ఈ మహాభారతమనే మహావృక్షానికి సంగ్రహాధ్యాయం విత్తనం. పౌలోమపర్వం, ఆస్తీకపర్వం మూలం. సంభవపర్వం విస్తరించిన మాను. సభాపర్వం, అరణ్యపర్వం పక్షులుండే తొఱ్ఱ. (88)
అరణీపర్వరూపాఢ్యః విరాటోద్యోగ సారవాన్ ।
భీష్మపర్వమహాశాఖః ద్రోణపర్వపలాశవాన్ ॥ 89
అరణీపర్వం అందమైన రూపం. విరాటోద్యోగ పర్వాలు ఈ చెట్టుకు సారభూతమైనవి. భీష్మపర్వం అనేది పెద్దకొమ్మ. ద్రోణ పర్వం ఆకుల గుబురు. (89)
కర్ణపర్వసితైః పుష్పైః శల్యపర్వసుగంధిభిః ।
స్త్రీపర్వైషీకవిశ్రామః శాంతిపర్వమహాఫలః ॥ 90
కర్ణపర్వం, తెల్లని పుష్పాలు. శల్యపర్వం వాని సువాసనలు. స్త్రీ పర్వం, ఇషీకపర్వం అనేవి చెట్టు నీడలు. శాంతి పర్వం గొప్ప ఫలం - (మహాఫలం = మోక్షం) (90)
అశ్వమేధామృత రసస్త్వాశ్రమస్థాన సంశ్రయః ।
మౌసలః శ్రుతిసంక్షేపః శిష్టద్విజనిషేవితః ॥ 91
అశ్వమేధ పర్వం అమృత రసం. ఆశ్రమవాస పర్వం స్థిరమయిన ఆశ్రయం. మౌసల పర్వం సంక్లిప్త వేదం. అది శిష్టులయిన ద్విజులచే సేవింపబడుతుంది. (91)
సర్వేషాం కవిముఖ్యానామ్ ఉపజీవ్యో భవిష్యతి ।
పర్జన్య ఇవ భూతానామ్ అక్షయో భారతద్రుమః ॥ 92
ప్రాణులన్నిటికీ మేఘం జీవనప్రదాత. అలాగే మహాకవులందరికీ ఈ భారత మహావృక్షం ప్రధానాశ్రయం అవుతుంది. (92)
సౌతిరువాచ
తస్య వృక్షస్య వక్ష్యామి శశ్వత్ పుష్పఫలోదయమ్।
స్వాదుమేధ్యరసోపేతమ్ అచ్ఛేద్య మమరైరపి॥ 93
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు. ఆ వృక్షాన్ని గురించి చెపుతాను - దానికి ఎల్లప్పుడూ పూలూ పండ్లూ ఉదయిస్తూ ఉంటాయి. ఆ ఫలాల రసం చాలా ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, శుచియైనది. ఆ వృక్షం అమరులచేత కూడ నరుకబడదు. (93)
మాతుర్నియోగాద్ధర్మాత్మా గాంగేయస్య చ ధీమతః ।
క్షేత్రే విచిత్రవీర్యస్య కృష్ణద్వైపాయనః పురా॥ 94
త్రీనగ్నీనివ కౌరవ్యాన్ జనయామాస వీర్యవాన్ ।
ఉత్పాద్య ధృతరాష్ట్రం చ పాండుం విదురమేవ చ ॥ 95
తల్లియైన సత్యవతి ఆజ్ఞతోనూ, ధీమంతుడయిన భీష్ముని అనుజ్ఞతోనూ ధర్మాత్ముడయిన వ్యాసుడు విచిత్రవీర్యుని క్షేత్రాలలో మూడగ్నులవలె ముగ్గురు పుత్రులను కలిగించాడు. వారు ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. (94-95)
జగామ తపసే ధీమాన్ పునరేవాశ్రమం ప్రతి।
తేషు జాతేషు వృద్ధేషు గతేషు పరమాం గతిమ్॥ 96
అబ్రవీత్ భారతం లోకే మానుషేఽస్మిన్ మహానృషిః।
జనమేజయేన పృష్టస్సన్ బ్రాహ్మణైశ్చ సహస్రశః॥ 97
శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే।
స సదస్యైః సహాసీనః శ్రావయామాస భారతమ్॥ 98
కర్మాంతరేషు యజ్ఞస్య చోద్యమానః పునః పునః।
తరువాత వ్యాసుడు మళ్లీ తపస్సు చేసుకోనటానికి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. వారు పెద్దవాళ్లయి పరమగతిని పొందాక ఈ లోకంలో మహర్షి భారతం చెప్పాడు. జనమేజయుడూ, బ్రాహ్మణులూ అడిగితే వ్యాసమహర్షి తన సమీపమందున్న శిష్యుడు వైశంపాయనుని "భారతం చెప్పు" మని ఆదేశించాడు. ఆ వైశంపాయనుడు యజ్ఞంలో సదస్యులు మళ్లీ మళ్లీ అడిగితే యజ్ఞకర్మల మధ్యలో భారతం వినిపించాడు. (96-98 1/2)
విస్తరం కురువంశస్య గాంధార్యా ధర్మశీలతామ్॥ 99
క్షత్తుః ప్రజ్ఞాం ధృతిం కుంత్యాః సమ్యక్ ద్వైపాయనోఽబ్రవీత్।
వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాం చ సత్యతామ్॥ 100
దుర్వృత్తం ధార్తరాష్ట్రాణామ్ ఉక్తవాన్ భగవాన్ ఋషిః।
ఇదం శతసహస్రం తు లోకానాం పుణ్యకర్మణామ్॥ 101
ఉపాఖ్యానైః సహ జ్ఞేయమ్ ఆద్యం భారత ముత్తమమ్।
కురువంశం విస్తరించడం, గాంధారి యొక్క ధర్మశీలం, విదురుని ప్రజ్ఞ, కుంతీదేవి ధైర్యం, వీని అన్నిటినీ వ్యాసమహర్షి భారతంలో చెప్పాడు. శ్రీకృష్ణుని మాహాత్మ్యమూ, పాండవుల సత్యనిష్ఠ, ధార్తరాష్ట్రుల దుష్ప్రవర్తన అన్నీ వ్యాసుడు చెప్పాడు. పుణ్యాత్ములకు ఈ భారతం ముందుగా చదువదగింది. ఇది ఉపాఖ్యానాలతో సహా లక్ష శ్లోకాలతో కూడినది. (99-101 1/2)
చతుర్వింశతిసాహస్రీం చక్రే భారత సంహితామ్॥ 102
ఉపాఖ్యానైర్వినా తావత్ భారతం ప్రోచ్యతే బుధైః।
తతోఽప్యర్ధశతం భూయః సంక్షేపం కృతవాన్ ఋషిః॥ 103
అనుక్రమణికాధ్యాయం వృత్తాంతం సర్వపర్వణామ్।
ఇదం ద్వైపాయనః పూర్వం పుత్రమధ్యాపయచ్ఛుకమ్॥ 104
ఉపాఖ్యానాలు లేకుండా భారత సంహితను 24000 శ్లోకాలుగా బుధులు చెప్పేవారు. దానికంటె కూడా సంక్షేపంగా మహర్షి నూట ఏబది శ్లోకాల్లో చెప్పాడు. అన్ని పర్వాల కథతో కూడిన ఈ అనుక్రమణికాధ్యాయం వ్యాసుడు తన పుత్రుడయిన శుకునికి బోధించాడు. (102-104)
తతోఽన్యేభ్యోఽనురూపేభ్యః శిష్యేభ్యః ప్రదదౌ విభుః।
షష్టిం శతసహస్రాణి చకారాన్యాం స సంహితామ్॥ 105
అరవై లక్షల శ్లోకాలతో మరో సంహితను చేసి అనురూపులైన ఇతర శిష్యులకు ఇచ్చాడు వ్యాసుడు. (105)
త్రింశచ్ఛతసహస్రం చ దేవలోకే ప్రతిష్ఠితమ్।
పిత్ర్యే పంచదశ ప్రోక్తం గంధర్వేషు చతుర్దశ॥ 106
ముప్పది లక్షల శ్లోకాలు దేవలోకంలో ప్రతిష్ఠింపబడినవి. పితృలోకంలో పదిహేను లక్షల శ్లోకాలు, గంధర్వ లోకంలో పదునాల్గు లక్షల శ్లోకాలు విస్తరించాయి. (106)
ఏకం శతసహస్రం తు మానుషేషు ప్రతిష్ఠితమ్।
నారదోఽశ్రావయద్ దేవాన్ అసితో దేవలః పితౄన్ ॥ 107
ఒక లక్షశ్లోకాలు మనుష్యలోకంలో ప్రతిష్ఠించారు. నారదుడు దేవలోకంలోను, అసితుడయిన దేవలుడు పితృలోకంలోను వినిపించారు. (107)
గంధర్వయక్షరక్షాంసి శ్రావయామాస వై శుకః।
అస్మింస్తు మానుషే లోకే వైశంపాయన ఉక్తవాన్॥108
శిష్యో వ్యాసస్య ధర్మాత్మా సర్వవేదవిదాం వరః।
ఏకం శతసహస్రం తు మయోక్తం వై నిబోధత॥ 109
శుకుడు గంధర్వయక్ష రాక్షసులకు వినిపించాడు. ఈ మనుష్య లోకంలో వ్యాస శిష్యుడూ, సర్వవేదవేత్త, ధర్మాత్ముడూ అయిన వైశంపాయనుడు చెప్పాడు. ఇపుడా లక్ష శ్లోక పరిమితమయిన భారతం నేను చెపుతాను వినండి. (108,109)
దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః
స్కంధః కర్ణః శకునిస్తస్య శాఖాః।
దుశ్శాసనః పుష్పఫలే సమృద్ధే
మూలం రాజా ధృతరాష్ట్రోఽమనీషీ॥ 110
దుర్యోధనుడు క్రోధాసూయాత్మకమయిన మహావృక్షం. అందులో కర్ణుడు మ్రాను - శకుని దాని కొమ్మలు - దుశ్శాసనుడు పూలూ, పండ్లూ - బుద్ధిలేని ధృతరాష్ట్రమహారాజు మూలం. (110)
యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః
స్కంధోఽర్జునో భీమసేనోఽస్య శాఖాః।
మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే
మూలం కృష్ణో బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చ॥ 111
ధర్మరాజు ధర్మమయమయిన మహావృక్షం - అర్జునుడు స్కంధం - భీమసేనుడు కొమ్మలు - నకుల సహదేవులు పూలూ, పండ్లూ - కృష్ణుడు, వేదాలూ, బ్రాహ్మణులూ మూలం. (111)
పాండుర్జిత్వా బహూన్ దేశాన్ బుద్ధ్యా విక్రమణేన చ ।
అరణ్యే మృగయాశీలః న్యవసన్మునిభిః సహ॥ 112
తెలివితోనూ, పరాక్రమంతోనూ పాండురాజు చాలా దేశాలు జయించి, వేటమీది ఆసక్తితో అరణ్యాలలో మునులతో కలిసి నివసించేవాడు. (112)
మృగవ్యవాయనిధనాత్ కృచ్ఛ్రాం ప్రాప స ఆపదమ్।
జన్మప్రభృతి పార్థానాం తత్రాచారవిధిక్రమః॥ 113
రతిక్రీడలో ఉన్న మృగాన్ని చంపి పాండురాజు చాలా పెద్ద కష్టం తెచ్చుకున్నాడు. అయినా పాండవులకు పుట్టడం దగ్గర నుండి ఆచార విధులన్నీ సక్రమంగానే జరిగాయి. (113)
మాత్రోరభ్యుపపత్తిశ్చ ధర్మోపనిషదం ప్రతి।
ధర్మస్య వాయోః శక్రస్య దేవయోశ్చ తథాశ్వినోః॥ 114
ధర్మరహస్యాన్ని గురించి తల్లుల అనుగ్రహం ఉండటం చేతనూ, యమధర్మరాజ, వాయు, దేవేంద్రుల యొక్కయు, అశ్వినీ దేవతల యొక్కయు అనుగ్రహం వల్లనూ (ఆచార విధులన్నీ నిర్దోషంగా సాగాయి). (114)
(తతో ధర్మోపనిషదః శ్రుత్వా భర్తుః ప్రియా పృథా।
ధర్మానిలేంద్రాన్ స్తుతిభిః జుహావ సుతవాంఛయా॥
తద్దత్తోపనిషన్మాద్రీ చాశ్వినావాజుహావ చ।)
తాపసైః సహ సంవృద్ధా మాతృభ్యాం పరిరక్షితాః।
మేధ్యారణ్యేషు పుణ్యేషు మహతామాశ్రమేషు చ॥ 115
భర్తకు ప్రియమైన కుంతి ధర్మరహస్యాలు తెలుసుకొని పుత్రకాంక్షతో ధర్మ, వాయు, దేవేంద్రులను ఆహ్వానించింది. అలాగే కుంతి ఇచ్చిన మంత్రం ఉపయోగించి, మాద్రి అశ్వినీ దేవతలను ఆహ్వానించింది. వారివలన పాండవులుద్భవించారు. వారిని తల్లులు రక్షించారు. శుచియైన అరణ్యాల్లో పుణ్యాశ్రమాల్లో తాపసులు పెంచారు. (115)
ఋషిభిర్యత్తదానీతా ధార్తరాష్ట్రాన్ ప్రతి స్వయమ్।
శిశవశ్చాభిరూపాశ్చ జటిలా బ్రహ్మచారిణః॥ 116
(పాండురాజు చనిపోయాక) మహర్షులు పాండురాజు పుత్రులను కౌరవుల దగ్గరకు స్వయంగా తీసుకువచ్చి అప్పజెప్పారు. అపుడు పాండవులు జడలు దాల్చి బ్రహ్మచారులై ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. (116)
పుత్రాశ్చ భ్రాతరశ్చేమే శిష్యాశ్చ సుహృదశ్చ వః।
పాండవా ఏత ఇత్యుక్త్వా మునయోఽంతర్హితాస్తతః॥ 117
'మీకు పుత్రులూ, సోదరులూ, శిష్యులూ, స్నేహితులు అయిన పాండవులు వీరు' అని చెప్పి మహర్షులు అంతర్ధానమయిపోయారు. (117)
తాంస్తైర్నివేదితాన్ దృష్ట్వా పాండవాన్ కౌరవాస్తదా।
శిష్టాశ్చ వర్ణాః పౌరా యే తే హర్షాచ్చుక్రుశుర్భృశమ్॥ 118
పాండవులను చూసి కౌరవులు, మిగిలిన పౌరులూ ఎంతగానో సంతోషంతో గంతులు వేశారు. (118)
ఆహుః కేచిన్నతస్యైతే తస్యైత ఇతి చాపరే।
యదా చిరమృతః పాండుః కథం తస్యేతి చాపరే॥ 119
అయితే వీరు పాండురాజు పుత్రులు కారని కొందరన్నారు. పాండుపుత్రులే అని మరికొందరన్నారు. పాండురాజు ఎపుడో చనిపోయాడు. వానికిపుడు పుత్రులేమిటి? అని కొందరన్నారు. (119)
స్వాగతం సర్వథా దిష్ట్యా పాండోః పశ్యామ సంతతిమ్।
ఉచ్యతాం స్వాగతమితి వాచోఽశ్రూయంత సర్వశః॥ 120
"భాగ్యవశాత్తు పాండురాజు కుమారులను చూడగలిగాము. చాలా సంతోషం వీరి రాక - వీరికి స్వాగతం చెప్పండి" అనే మాటలు అంతటా వినిపించాయి. (120)
తస్మిన్నుపరతే శబ్దే దిశః సర్వా నినాదయన్।
అంతర్హితానాం భూతానాం నిఃస్వన స్తుములోఽభవత్॥ 121
ఈ శబ్దాలు తగ్గిన తరువాత దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తూ అదృశ్యదేవతల శబ్దాలు విశేషంగా వినవచ్చాయి. (121)
పుష్పవృష్టిః శుభా గంధాః శంఖదుందుభినిఃస్వనాః।
ఆసన్ ప్రవేశే పార్థానాం తదద్భుతమివాభవత్॥ 122
పరిమళయుతమయిన పూలవాన కురిసింది. పాండవుల ప్రవేశసమయంలో శంఖ దుందుభిస్వనాలు మ్రోగాయి. అదంతా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. (122)
తత్ప్రీత్యా చైవ సర్వేషాం పౌరాణాం హర్షసంభవః।
శబ్ద ఆసీన్మహాంస్తత్ర దివఃస్పృక్కీర్తివర్ధనః॥ 123
పాండవుల మీద ఉన్న ప్రీతితో పౌరులంతా సంతోషించిన శబ్దాలు మిన్నుముట్టాయి. (123)
తేఽధీత్య నిఖిలాన్ వేదాన్ శాస్త్రాణి వివిధాని చ।
న్యవసన్ పాండవాస్తత్ర పూజితా అకుతోభయాః॥ 124
పాండవులు అఖిలవేదాలూ, శాస్త్రాలూ చదువుతూ అక్కడ నిర్భయంగా సన్మానార్హులై ఉన్నారు. (124)
యుధిష్ఠిరస్య శౌచేన ప్రీతాః ప్రకృతయోఽభవన్।
ధృత్యా చ భీమసేనస్య విక్రమేణార్జునస్య చ॥ 125
గురుశుశ్రూషయా క్షాంత్యా యమయోర్వినయేన చ।
తుతోష లోకః సకలః తేషాం శౌర్యగుణేన చ॥ 126
దేశంలోని ప్రజలందరూ ధర్మరాజు యొక్క శుచిత్వంతో ప్రీతి చెందేవారు - భీమసేనుని ధైర్యానికీ, అర్జునుని పరాక్రమానికీ, నకుల సహదేవుల గురుశుశ్రూషకూ, సహనానికీ, వినయానికీ ఎంతగానో సంతోషించారు. పాండవుల పరాక్రమానికి లోకమంతా సంతోషించింది. (125-126)
సమవాయే తతో రాజ్ఞాం కన్యాం భర్తృస్వయంవరామ్।
ప్రాప్తవానర్జునః కృష్ణాం కృత్వా కర్మ సుదుష్కరమ్॥ 127
అర్జునుడు రాజులందరి సమక్షంలో దుష్కరమైన (మత్స్యయంత్రం కొట్టి) కార్యం చేసి, స్వయంవరంలో నిలిచిన కృష్ణను (ద్రౌపదిని) గ్రహించాడు. (127)
తతః ప్రభృతి లోకేఽస్మిన్ పూజ్యః సర్వధనుష్మతామ్।
ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యః సమరేష్వపి చాభవత్॥ 128
అప్పటినుండి అర్జునుడు ధనుర్ధారులందరిలోను పూజ్యుడయ్యాడు. యుద్ధాలలో అర్జునుడు సూర్యునివలె తేరిపార చూడరాని వాడయ్యాడు. (128)
స సర్వాన్ పార్థివాన్ జిత్వా సర్వాంశ్చ మహతో గణాన్।
ఆజహారార్జునో రాజ్ఞః రాజసూయం మహాక్రతుమ్॥129
అర్జునుడు పెద్దసైన్యం ఉన్న మహారాజులందరినీ జయించి ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాడు. (129)
అన్నవాన్ దక్షిణావాంశ్చ సర్వైః సముదితో గుణైః।
యుధిష్ఠిరేణ సంప్రాప్తః రాజసూయో మహాక్రతుః॥ 130
సునయాద్ వాసుదేవస్య భీమార్జున బలేన చ।
ఘాతయిత్వా జరాసంధం చైద్యం చ బలగర్వితమ్॥ 131
శ్రీకృష్ణుని రాజనీతితోను, భీమార్జునుల బలపరాక్రమాలతోను జరాసంధుని చంపించి, బలగర్వితుడయిన శిశుపాలుని చంపించి ధర్మరాజు రాజసూయ మహాక్రతువు చేశాడు. అతడు రాజసూయంలో భూరిదక్షిణలిచ్చి అందరినీ భోజనతృప్తులను చేశాడు. (130-131)
దుర్యోధనం సమాగచ్ఛన్ అర్హణాని తతస్తతః।
మణికాంచనరత్నాని గోహస్త్యశ్వధనాని చ॥ 132
విచిత్రాణి చ వాసాంసి ప్రావారావరణాని చ।
కంబలాజినరత్నాని రాంకవాస్తరణాని చ॥ 133
ఆ యజ్ఞంలో రాజులందరూ భూషణాలు, మణులు, బంగారం, రత్నాలు, గోవులు, గుర్రాలు, ఏనుగులు, విచిత్రమయిన వస్త్రాలు, పరదాలు, శిబిరాలు, కంబళ్లు, మృగచర్మాలు, గొఱ్ఱె చర్మాలతో చేసిన మృదువయిన తివాచీలు ఇచ్చారు. ఆ బహుమతులన్నిటినీ దుర్యోధనుడు స్వీకరించేవాడు. (132-133)
సమృద్ధాం తాం తదా దృష్ట్వా పాండవానాం తదా శ్రియమ్।
ఈర్ష్యాసముత్థః సుమహాన్ తస్య మన్యురజాయత॥ 134
సమృద్ధమైన పాండవుల సంపదను చూసి దుర్యోధనునికి ఈర్ష్య కలిగింది. దానితో దుర్యోధనునికి వారిపై చాలా అసహనమూ, కోపమూ కలిగాయి. (134)
విమానప్రతిమాం తత్ర మయేన సుకృతాం సభామ్।
పాండవానాముపహృతాం స దృష్ట్వా పర్యతప్యత॥ 135
మయుడు నిర్మించి, పాండవుల కోసం తెచ్చిన విమానం లాంటి సభా భవనాన్ని చూసి దుర్యోధనుడు చాలా పరితపించాడు. (135)
తత్రావహసితశ్చాసీత్ ప్రస్కందన్నివ సంభ్రమాత్।
ప్రత్యక్షం వాసుదేవస్య భీమేనానభిజాతవత్॥ 136
ఆ సభాభవనంలోనే తొందరపాటుతో పడి దుర్యోధనుడు పరిహసింపబడినాడు. అపుడే కృష్ణుని ఎదుట భీముడు తెలియని వాని నాక్షేపించినట్లు దుర్యోధనుని పరిహసించినాడు. (136)
స భోగాన్ వివిధాన్ భుంజన్ రత్నాని వివిధాని చ।
కథితో ధృతరాష్ట్రస్య వివర్ణో హరిణః కృశః॥ 137
ఆ దుర్యోధనుడు వివిధ భోగాలు అనుభవిస్తూ ఉన్నా, రత్నాభరణాలు ధరిస్తున్నా పాలిపోయి కృశించిపోతున్నట్లు ధృతరాష్ట్రునితో చెప్పాడు. (137)
అన్వజానాత్ తతో ద్యూతం ధృతరాష్ట్రః సుతప్రియః।
తచ్ఛ్రుత్వా వాసుదేవస్య కోపః సమభవన్ మహాన్॥ 138
తరువాత పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు ద్యూతానికి అనుమతించాడు. అది విని వాసుదేవునికి చాలా కోపం వచ్చింది. (138)
నాతిప్రీతమనాశ్చాసీద్ వివాదాంశ్చాన్వమోదత।
ద్యూతాదీననయాన్ ఘోరాన్ వివిధాంశ్చాప్యుపైక్షత॥ 139
ధృతరాష్ట్రుని మనస్సుకూ సంతోషం కలగలేదు. వివాదాలను అనుమోదించాడు. ద్యూతం దగ్గర నుండి ఎన్నో ఘోరకృత్యాలన్నీ ఉపేక్షించాడు. (139)
నిరస్య విదురం భీష్మం ద్రోణం శారద్వతం కృపమ్।
విగ్రహే తుములే తస్మిన్ దహన్ క్షత్రం పరస్పరమ్॥ 140
విదురునీ, భీష్మునీ, కృపద్రోణులనూ కాదని యుద్ధంలో పరస్పరం కొట్టుకొన్నారు. (140)
జయత్సు పాండుపుత్రేషు శ్రుత్వా సుమహదప్రియమ్।
దుర్యోధనమతం జ్ఞాత్వా కర్ణస్య శకునేస్తథా॥ 141
ధృతరాష్ట్రశ్చిరం ధ్యాత్వా సంజయం వాక్యమబ్రవీత్।
శృణు సంజయ సర్వం మే న చాసూయితుమర్హసి॥ 142
శ్రుతవానసి మేధావీ బుద్ధిమాన్ ప్రాజ్ఞసమ్మతః।
న విగ్రహే మమ మతిః న చ ప్రీయే కులక్షయే॥ 143
పాండవులు జయిస్తున్నారనే అప్రియవార్త విని, కర్ణ, శకుని, దుర్యోధనుల అభిప్రాయం గ్రహించి, ధృతరాష్ట్రుడు చాలా ఆలోచించి సంజయునితో ఇలా అన్నాడు. సంజయా! నేను చెప్పేదంతా విను. నన్ను తప్పు పట్టకు. నా మీద కోప్పడకు. నీవూ పండితుడవు - మేధావివి - బుద్ధిమంతుడవు - ప్రాజ్ఞసమ్మతుడవు. నాకు యుద్ధమంటే ఇష్టంలేదు - కులక్షయంతో నాకు ప్రీతి కలుగదు. (141-143)
న మే విశేషః పుత్రేషు స్వేషు పాండుసుతేషు వా।
వృద్ధం మామభ్యసూయంతి పుత్రా మన్యుపరాయణాః॥144
నా కొడుకుల మీద, పాండవుల మీద నాకు భేదభావం లేదు - కానీ పెద్దవాడినయిన నామీద క్రోధవశులై పుత్రులు దోషం ఆరోపిస్తున్నారు. (144)
అహం త్వచక్షుః కార్పణ్యాత్ పుత్రప్రీత్యా సహామి తత్।
ముహ్యంతం చానుముహ్యామి దుర్యోధనమచేతనమ్॥145
నేనా కనులు లేనివాడను. దీనభావంతోను, పుత్ర వ్యామోహంతోనూ కొంత అన్యాయాన్ని సహిస్తూ వచ్చాను. మందబుద్ధి అయిన దుర్యోధనుడు తాను అజ్ఞానంతో మునిగిపోతున్నాడు. వాడితో నేనూ మునిగిపోతున్నాను. (145)
రాజసూయే శ్రియం దృష్ట్వా పాండవస్య మహౌజసః।
తచ్చావహసనం ప్రాప్య సభారోహణదర్శనే॥ 146
అమర్షణః స్వయం జేతుం అశక్తః పాండవాన్ రణే।
నిరుత్సాహశ్చ సంప్రాప్తుం సుశ్రియం క్షత్రియోఽపి సన్॥147
గాంధారరాజసహితః ఛద్మద్యూతమమంత్రయత్।
తత్ర యద్ యద్ యథాజ్ఞాతం మయా సంజయ తచ్ఛృణు॥148
రాజసూయయాగంలో శక్తిశాలి అయిన ధర్మరాజు యొక్క సర్వోచ్చసంపదను చూసీ, ఆ మయసభను చూస్తూ పరిహసింపబడి సహింపలేకపోయాడు దుర్యోధనుడు. పాండవులను స్వయంగా యుద్ధంలో జయించలేక, సుక్షత్రియుడయినా ఉత్సాహం లేక శకునితో కపటద్యూతం ఆడటానికి ఆలోచించాడు. ఆ విషయాలు ఎప్పుడెప్పుడు నాకు ఎలా తెలిశాయో సంజయా చెపుతాను విను. (146-148)
శ్రుత్వా తు మమ వాక్యాని బుద్ధియుక్తాని తత్త్వతః।
తతో జ్ఞాస్యసి మాం సౌతే ప్రజ్ఞాచక్షుషమిత్యుత॥149
సూతపుత్రా! బుద్ధియుక్తములయిన నా మాటలు విని నన్ను ప్రజ్ఞాచక్షువుగా నీవే గ్రహిస్తావు. (149)
యదాశ్రౌషం ధనురాయమ్య చిత్రం
విద్ధం లక్ష్యం పాతితం వై పృథివ్యామ్।
కృష్ణాం హృతాం ప్రేక్షతాం సర్వరాజ్ఞాం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 150
సంజయా! విల్లు ఎక్కుపెట్టి, చిత్రమయిన లక్ష్యాన్ని (మత్స్యయంత్రాన్ని) నేల గూల్చి, రాజులు అందరూ చూస్తూ ఉండగా ద్రౌపదిని అర్జునుడు చేపట్టినట్లు విన్నప్పుడే నేను విజయం మీద ఆశ వదులుకొన్నాను. (150)
యదాశ్రౌషం ద్వారకాయాం సుభద్రాం
ప్రసహ్యోఢాం మాధవీమర్జునేన।
ఇంద్రప్రస్థం వృష్ణివీరౌ చ యాతౌ
తదా నాశంసే విజయాయ సంజయ॥ 151
ద్వారకలో (యాదవవీరుల) నెదిరించి సుభద్రను అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకొనిపోయినట్లూ, తరువాత బలరామకృష్ణులు కూడా ఇంద్రప్రస్థానికి వెళ్లినట్లు విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. (151)
యదాశ్రౌషం దేవరాజం ప్రవృష్టం
శరైర్దివ్యైర్వారితం చార్జునేన।
అగ్నిం తథా తర్పితం ఖాండవే చ
తదా నాశంసే విజయాయ సంజయ॥ 152
దేవేంద్రుని వర్షాన్ని దివ్యబాణాలతో ఆపి, ఖాండవవనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతి చేశాడని విన్నప్పుడే విజయం మీద ఆశలు పోయాయి. (152)
యదాశ్రౌషం జాతుషాత్ వేశ్మనస్తాన్
ముక్తాన్ పార్థాన్ పంచ కుంత్యా సమేతాన్।
యుక్తం చైషాం విదురం స్వార్థసిద్ధౌ
తదా నాశంసే విజయాయ సంజయ॥ 153
సంజయా! లక్క యింటి నుండి కుంతితో పాండవులందరూ విడివడి తప్పించుకొన్నారనీ ఆ పనిలో విదురుడు కూడా తోడ్పడినాడనీ విన్నప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. (153)
యదాశ్రౌషం ద్రౌపదీం రంగమధ్యే
లక్ష్యం భిత్త్వా నిర్జితామర్జునేన।
శూరాన్ పంచాలాన్ పాండవేయాంశ్చ యుక్తాన్
తదా నాశంసే విజయాయ సంజయ॥ 154
అర్జునుడు రంగమధ్యంలో లక్ష్యాన్ని (మత్స్యయంత్రం) భేదించి, ద్రౌపదిని స్వీకరించాడనీ, శూరులయిన పాంచాలురతో పాండవులు కలిసిపోయారనీ విన్నప్పటి నుండి నాకు విజయం మీద ఆశ లేదు. (154)
యదాశ్రౌషం మాగధానాం వరిష్ఠం
జరాసంధం క్షత్రమధ్యే జ్వలంతమ్।
దోర్భ్యాం హతం భీమసేనేన గత్వా
తదా నాశంసే విజయాయ సంజయ॥ 155
సంజయా! రాజుల మధ్య వెలిగిపోయే వాడు మగధరాజు జరాసంధుడు. భీమసేనుడు వెళ్లి వానిని ఏ ఆయుధమూ లేకుండా బాహుబలంతో చంపాడని విన్నపుడే నాకు విజయం మీద ఆశపోయింది. (155)
యదాశ్రౌషం దిగ్విజయే పాండుపుత్రైః
వశీకృతాన్ భూమిపాలాన్ ప్రసహ్య।
మహాక్రతుం రాజసూయం కృతం చ
తదా నాశంసే విజయాయ సంజయ॥ 156
పాండుపుత్రులు దిగ్విజయం చేసి రాజులను వశపరచుకొన్నారనీ, ధర్మరాజు రాజసూయ యాగం చేశాడనీ విన్నపుడే విజయం మీద ఆశపోయింది. (156)
యదాశ్రౌషం ద్రౌపదీమశ్రుకంఠీం
సభాం నీతాం దుఃఖితామేకవస్త్రామ్।
రజస్వలాం నాథవతీ మనాథవత్
తదా నాశంసే విజయాయ సంజయ॥ 157
సంజయా! భర్తలున్నా లేనిదానివలె ద్రౌపది విలపిస్తూ ఉన్నా, ఏకవస్త్రయై రజస్వలయై ఉన్నా సభలోకి లాగుకొని రాబడింది. అది విన్నప్పుడే విజయం మీద ఆశ పోయింది. (157)
యదాశ్రౌషం వాససాం తత్ర రాశిం
సమాక్షిపత్ కితవో మందబుద్ధిః।
దుశ్శాసనో గతవాన్ నైవ చాంతం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 158
కితవుడు, మందబుద్ధి అయిన దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాలను చివరి దాకా లాగలేక పోయాడనీ వస్త్రాలరాశి అక్కడ ఏర్పడిందనీ విన్నాక నాకు విజయం మీద ఆశ పోయింది. (158)
యదాశ్రౌషం హృతరాజ్యం యుధిష్ఠిరం
పరాజితం సౌబలేనాక్షవత్యామ్।
అన్యాగతం భ్రాతృభిరప్రమేయైః
తదా నాశంసే విజయాయ సంజయ॥ 159
ఊహించలేని పరాక్రమవంతులయిన తమ్ముళ్లతో ధర్మరాజు శకునిచేత జూదంలో ఓడిపోయి, రాజ్యం పోగొట్టుకొన్నాడని విన్నపుడే నాకు విజయాశ పోయింది సంజయా! (159)
యదాశ్రౌషం వివిధాస్తత్ర చేష్టాః
ధర్మాత్మనాం ప్రస్థితానాం వనాయ।
జ్యేష్ఠప్రీత్యా క్లిశ్యతాం పాండవానామ్
తదా నాశంసే విజయాయ సంజయ॥ 160
ధర్మాత్ములయిన పాండవులు వివిధ చేష్టలు చేస్తూ, బాధపడుతూ కూడా అన్నగారి మీది గౌరవంతో అడవికి వెళ్లారని విన్నపుడే నేను విజయం మీద ఆశ వదులుకొన్నాను సంజయా! (160)
యదాశ్రౌషం స్నాతకానాం సహస్రైః
అన్వాగతం ధర్మరాజం వనస్థమ్।
భిక్షాభుజాం బ్రాహ్మణానాం మహాత్మనాం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 161
అడవిలో ఉన్నా వేలకొద్దీ స్నాతకులు ధర్మరాజును అనుసరించి ఉన్నారనీ, భిక్షాటనం చేసుకొంటూ ఉన్న మహాత్ములయిన బ్రాహ్మణులు అతనిని సేవిస్తున్నారనీ విన్నపుడే నాకు విజయాశ పోయింది. (161)
యదాశ్రౌష మర్జునం దేవదేవం
కిరాతరూపం త్ర్యంబకం తోష్య యుద్ధే।
అవాప్తవంతం పాశుపతం మహాస్త్రం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 162
కిరాత రూపంలో వచ్చిన మహాదేవుని యుద్ధంలో సంతృప్తి పరచి అర్జునుడు పాశుపత మహాస్త్రం గ్రహించాడని విన్నపుడే నాకు విజయాశ పోయింది సంజయా! (162)
(యదాశ్రౌషం వనవాసే తు పార్థాన్
సమాగతాన్ మహర్షిభిః పురాణైః।
ఉపాస్యమానాన్ సగణైర్జాతసంఖ్యాన్
తదా నాశంసే విజయాయ సంజయ॥)
అరణ్యవాసం చేస్తున్నపుడు కూడా పాండవులను చాలామంది ప్రాచీనమహర్షులు వచ్చి, ఉపాసించే వారని తెలిసినపుడే విజయం మీద ఇక ఆశపెట్టుకోలేదు.
యదాశ్రౌషం త్రిదివస్థం ధనంజయం
శక్రాత్ సాక్షాత్ దివ్యమస్త్రం యథావత్।
అధీయానం శంసితం సత్యసంధం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 163
అర్జునుడు స్వర్గాన్ని అధిరోహించి ఇంద్రుని నుండి ప్రత్యక్షంగా యథావిధిగా దివ్యాస్త్రాలు నేర్చుకొని ప్రశంసలు పొందాడని, సత్యప్రతిజ్ఞుడయ్యాడని విన్నపుడే నాకు విజయాశ నశించింది. (163)
యదాశ్రౌషం కాలకేయాస్తతస్తే
పౌలోమానో వరదానాచ్చ దృప్తాః।
దేవైరజేయా నిర్జితాశ్చార్జునేన
తదా నాశంసే విజయాయ సంజయ॥ 164
వర గర్వితులై, దేవతలకు కూడా జయింప శక్యంకాని కాలకేయులను, పౌలోములను అర్జునుడు జయించాడని విన్నపుడే నాకు విజయం మీద ఇక ఆశ పోయింది. (164)
యదాశ్రౌషమసురాణాం వధార్థే
కిరీటినం యాంతమమిత్రకర్శనమ్।
కృతార్థం చాప్యాగతం శక్రలోకాత్
తదా నాశంసే విజయాయ సంజయ॥ 165
రాక్షసవధకోసం శత్రునాశకుడయిన అర్జునుడు వెళ్లాడనీ చరితార్థుడై, ఇంద్రలోకం నుండి వచ్చాడనీ విన్నపుడే విజయం మీద ఆశ పోయింది. (165)
(యదాశ్రౌషం తీర్థయాత్రాప్రవృత్తం
పాండోస్సుతం సహితం లోమశేన।
తస్మాదశ్రౌషీ దర్జునస్యార్థలాభం
తదా నాశంసే విజయాయ సంజయ॥)
తీర్థయాత్రలు చేయాలనుకొంటున్న ధర్మరాజు దగ్గరకు లోమశ మహర్షి వచ్చి చెప్పిన అర్జునుని దివ్యాస్త్రలాభం, విన్నపుడే నాకు విజయాశ నశించిపోయింది సంజయా!
యదాశ్రౌషం వైశ్రవణేన సార్థం
సమాగతం భీమమన్యాంశ్చ పార్థాన్।
తస్మిన్ దేశే మానుషాణా మగమ్యే
తదా నాశంసే విజయాయ సంజయ॥ 166
భీమసేనాది పాండవులు మనుష్యులకు ప్రవేశింపశక్యం కాని ప్రదేశానికి వెళ్లి కుబేరుని కలిసి వచ్చారని విన్నపుడే నాకు విజయాశ పోయింది. (166)
యదాశ్రౌషం ఘోషయాత్రాగతానాం
బంధం గంధర్వైర్మోక్షణం చార్జునేన।
స్వేషాం సుతానాం కర్ణబుద్ధౌ రతానాం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 167
కర్ణుని ప్రోత్సాహంతో ఘోషయాత్రకు వెళ్లిన నా పుత్రులను గంధర్వులు బంధించారనీ, అర్జునుడు విడిపించాడనీ విన్నపుడే నాకు విజయాశ పోయింది. (167)
యదాశ్రౌషం యక్షరూపేణ ధర్మం
సమాగతం ధర్మరాజేన సూత।
ప్రశ్నాన్ కాంశ్చిద్ విబ్రువాణం చ సమ్యక్
తదా నాశంసే విజయాయ సంజయ॥ 168
యక్షుని రూపంలో వచ్చి యముడు ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడిగాడనీ, వానికి ధర్మరాజు చక్కగా సమాధానాలు చెప్పాడనీ విన్నపుడే నాకు విజయాశపోయింది. (168)
యదాశ్రౌషం న విదుర్మామకాస్తాన్
ప్రచ్ఛన్నరూపాన్ వసతః పాండవేయాన్।
విరాటరాష్ట్రే సహ కృష్ణయా చ
తదా నాశంసే విజయాయ సంజయ॥ 169
విరాటనగరంలో ద్రౌపదితో సహా పాండవులు మారు వేషాల్లో నివసిస్తున్నారని నావాళ్లు తెలుసుకోలేక పోయారని విన్నపుడే నాకు విజయాశ లోపించింది. (169)
(యదాశ్రౌషం కీచకానాం వరిష్ఠం
నిషూదితం భ్రాతృశతేన సార్ధమ్।
ద్రౌపద్యర్థం భీమసేనేన సంఖ్యే
తదా నాశంసే విజయాయ సంజయ॥)
నూట అయిదుగురు తమ్ముళ్లతో సహా కీచకుని ద్రౌపది కోసం భీముడు చంపాడని విన్నపుడే నాకు విజయాశ పోయింది సంజయా!
యదాశ్రౌషం మామకానాం వరిష్ఠాన్
ధనంజయే నైకరథేన భగ్నాన్।
విరాటరాష్ట్రే వసతా మహాత్మనా
తదా నాశంసే విజయాయ సంజయ॥ 170
నా వీరులందరూ అసహాయుడయిన అర్జునుని చేతిలో ఉత్తరగోగ్రహణంలో ఓడిపోయారని విన్నపుడే నాకు విజయాశ నశించింది సంజయా! (170)
యదాశ్రౌషం సత్కృతాం మత్స్యరాజ్ఞా
సుతాం దత్తాముత్తరా మర్జునాయ।
తాం చార్జునః ప్రత్యగృహ్ణాత్ సుతార్థే
తదా నాశంసే విజయాయ సంజయ॥ 171
మత్స్యరాజు విరాటుడు తన కూతురు ఉత్తరను అర్జునునికి ఇస్తానన్నాడనీ, కానీ అర్జునుడు తన కొడుకు అభిమన్యునికి చేసుకొన్నాడనీ విన్నపుడే నాకు విజయాశ పోయింది సంజయా! (171)
యదాశ్రౌషం నిర్జితస్యాధనస్య
ప్రవ్రాజితస్య స్వజనాత్ ప్రచ్యుతస్య।
అక్షౌహిణీః సప్త యుధిష్ఠిరస్య
తదా నాశంసే విజయాయ సంజయ॥ 172
జూదంలో ఓడిపోయి, నిర్ధనుడై తనవారినందరినీ వదిలి అడవుల పాలయిన ధర్మరాజుకు ఏడు అక్షౌహిణుల సైన్యం చేరిందని విన్నపుడే నాకు విజయం మీద ఆశపోయింది. (172)
యదాశ్రౌషం మాధవం వాసుదేవం
సర్వాత్మనా పాండవార్థే నివిష్టమ్।
యస్యేమాం గాం విక్రమమేకమాహుః
తదా నాశంసే విజయాయ సంజయ॥ 173
ఈ భూమినంతటినీ ఒక్క కాలితో ఆక్రమించిన (వామనావతారంలో) వాసుదేవుడు నిండు మనస్సుతో పాండవుల కార్యసిద్ధిలో తత్పరుడయ్యాడని విన్నప్పటి నుండే నాకు విజయాశ లేకపోయింది. (173)
యదాశ్రౌషం నరనారాయణౌ తౌ
కృష్ణార్జునే వదతో నారదస్య।
అహం ద్రష్టా బ్రహ్మలోకే చ సమ్యక్
తదా నాశంసే విజయాయ సంజయ॥ 174
నర నారాయణులే ఈ కృష్ణార్జునులనీ, నేను వారిని బ్రహ్మలోకంలో చక్కగా చూశాననీ నారదుడు చెప్పుతుంటే విన్నపుడే నాకు విజయం మీద ఆశ చచ్చింది - సంజయా! (174)
యదాశ్రౌషం లోకహితాయ కృష్ణం
శమార్థినముపయాతం కురూణామ్।
శమం కుర్వాణ మకృతార్థం చ యాతం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 175
సంజయా! లోకకళ్యాణం కోసం కృష్ణుడు సంధికోరి కౌరవుల దగ్గరకు వచ్చి, సంధి చేయడంలో విఫలుడై వెళ్లిపోయాడని విన్నపుడే నేను విజయాన్ని ఆశించడం మానేశాను. (175)
యదాశ్రౌషం కర్ణదుర్యోధనాభ్యాం
బుద్ధిం కృతాం నిగ్రహే కేశవస్య।
తం చాత్మానం బహుధా దర్శయానం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 176
కర్ణదుర్యోధనులు కేశవుని బంధించాలని నిశ్చయించు కొన్నారని విన్నప్పుడూ; అపుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపుతున్నపుడే నాకు విజయం మీద ఆశ పోయింది. (176)
యదాశ్రౌషం వాసుదేవే ప్రయాతే
రథస్యైకామగ్రతస్తిష్ఠమానామ్।
ఆర్తాం పృథాం సాంత్వితాం కేశవేన
తదా నాశంసే విజయాయ సంజయ॥ 177
వాసుదేవుడు తిరిగి వెళ్లిపోతూ ఉంటే ఆర్తురాలై నిలిచిన కుంతిని కేశవుడు ఓదార్చాడని విన్నపుడే నేను విజయం గురించి ఆశించడం మానేశాను. (177)
యదాశ్రౌషం మంత్రిణం వాసుదేవం
తథా భీష్మం శాంతనవం చ తేషామ్।
భారద్వాజం చాశిషోఽనుబ్రువాణం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 178
మంత్రి అయిన వాసుదేవుడూ, భీష్ముడూ, ద్రోణుడూ పాండవులకు ఆశీస్సులిస్తున్నారని విన్నపుడే ఇక విజయాశ పోయింది సంజయా! (178)
యదాశ్రౌషం కర్ణ ఉవాచ భీష్మం
నాహం యోత్స్యే యుధ్యమానే త్వయీతి।
హిత్వా సేనామపచక్రామ చాపి
తదా నాశంసే విజయాయ సంజయ॥ 179
"నీవు యుద్ధం చేస్తూ ఉంటే నేను యుద్ధం చెయ్యను" అని కర్ణుడు భీష్మునితో అని, సేన విడిచి వెళ్లిపోయినపుడే నాకు విజయాశ కల్గడం మానేసింది. (179)
యదాశ్రౌషం వాసుదేవార్జునౌ తౌ
తథా ధనుర్గాండివమప్రమేయమ్।
త్రీణ్యుగ్రవీర్యాణి సమాగతాని
తదా నాశంసే విజయాయ సంజయ॥ 180
ఉగ్రపరాక్రమం కల వాసుదేవుడు, అర్జునుడు, గాండీవమూ ఒక చోట చేరాయని విన్నపుడే నాకు విజయాశ పోయింది సంజయా! (180)
యదాశ్రౌషం కశ్మలేనాభిపన్నే
రథోపస్థే సీదమానేఽర్జునే వై।
కృష్ణం లోకాన్ దర్శయానం శరీరే
తదా నాశంసే విజయాయ సంజయ॥ 181
అర్జునుడు మోహావిష్టుడై రథం నొగలిమీద చతికిల బడిపోయినపుడు కృష్ణుడు తన శరీరంలో లోకాలనన్నిటినీ అర్జునునకు చూపించాడని విన్నపుడే విజయాశ పోయింది. (181)
యదాశ్రౌషం భీష్మమమిత్రకర్శనం
నిఘ్నంతమాజావయుతం రథానామ్।
నైషాం కశ్చిద్ వధ్యతే ఖ్యాతరూపః
తదా నాశంసే విజయాయ సంజయ॥ 182
శత్రు సంహారకుడయిన భీష్ముడు యుద్ధంలో రోజుకు పదివేల మంది రథికులను చంపుతున్నా పాండవ పక్షాన ప్రసిద్ధుడొక్కడూ చావలేదని విన్నపుడే నాకు విజయాశ పోయింది సంజయా! (182)
యదాశ్రౌషం చాపగేయేన సంఖ్యే
స్వయం మృత్యుం విహితం ధార్మికేణ।
తచ్చాకార్షుః పాండువేయాః ప్రహృష్టాః
తదా నాశంసే విజయాయ సంజయ॥ 183
ధార్మికుడయిన భీష్ముడు యుద్ధంలో తన మరణానికి మార్గం చెప్పాడనీ, అది విని పాండవులు సంతోషించి ఆ పని చేశారనీ విన్నపుడే నాకు విజయాశ పోయింది సంజయా! (183)
యదాశ్రౌషం భీష్మమత్యంతశూరం
హతం పార్థేనాహవేష్వప్రధృష్యమ్।
శిఖండినం పురతః స్థాపయిత్వా
తదా నాశంసే విజయాయ సంజయ॥ 184
అర్జునుడు శిఖండిని ఎదుటపెట్టి యుద్ధంలో మిక్కిలి శూరుడయిన భీష్ముని చంపాడని విన్నపుడే విజయం ఆశించడం మానేశాను. (184)
యదాశ్రౌషం శరతల్పే శయానం
వృద్ధం వీరం సాదితం చిత్రపుంఖైః।
భీష్మం కృత్వా సోమకానల్పశేషాన్
తదా నాశంసే విజయాయ సంజయ॥ 185
సోమకవంశీయులను కొద్దిమందిని మాత్రమే మిగిల్చి (మిగిలిన వారందరినీ చంపి) అంపశయ్య మీద శయనించాడు వృద్ధవీరుడు భీష్ముడని విన్నపుడే నా విజయాశ పోయింది. (185)
యదాశ్రౌషం శాంతనవే శయానే
పానీయార్థే చోదితేనార్జునేన।
భూమిం భిత్వా తర్పితం తత్ర భీష్మం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 186
భీష్ముడు అంపశయ్య మీద పడినపుడు మంచినీరు అడిగితే అర్జునుడు భూమిని ఛేదించి నీళ్లు రప్పించి భీష్మునికి సంతృప్తి కలిగించాడని విన్నపుడే నాకు విజయాశ పోయింది. (186)
యదా వాయుశ్చంద్రసూర్యౌ చ యుక్తౌ
కౌంతేయానామనులోమా జయాయ।
నిత్యం చాస్మాన్ శ్వాపదా భీషయంతి
తదా నాశంసే విజయాయ సంజయ॥ 187
రోజూ పాండవులకు వాయువూ, సూర్యచంద్రులూ అనుకూలంగా ఉంటున్నారనీ, మా వాళ్లను కుక్కలు అరుస్తూ భయపెడుతున్నాయనీ విన్నపుడే నాకు జయాశ పోయింది. (187)
యదా ద్రోణో వివిధానస్త్రమార్గాన్
నిదర్శయన్ సమరే చిత్రయోధీ।
న పాండవాన్ శ్రేష్ఠతరాన్ నిహంతి
తదా నాశంసే విజయాయ సంజయ॥ 188
చిత్రంగా యుద్ధం చేయగల ద్రోణుడు వివిధ అస్త్రాలనూ ప్రదర్శిస్తూ ఉన్నా పాండవులను మాత్రం చంపటంలేదని విన్నపుడే నాకు జయాశ పోయింది. (188)
యదాశ్రౌషం చాస్మదీయాన్ మహారథాన్
వ్యవస్థితా నర్జునస్యాంతకాయ।
సంశప్తకాన్ నిహతానర్జునేన
తదా నాశంసే విజయాయ సంజయ॥ 189
అర్జునుని చంపటానికే ఉంచిన మహారథులైన మా సంశప్తకులు అర్జునుని చేత చనిపోయారని విన్నపుడే విజయం మీద ఆశ పోయింది. (189)
యదాశ్రౌషం వ్యూహమభేద్యమన్యైః
భారద్వాజేనాత్తశస్త్రేణ గుప్తమ్।
భిత్వా సౌభద్రం వీరమేకం ప్రవిష్ఠం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 190
ఇతరులకు అభేద్యంగా పన్ని ద్రోణుడు స్వయంగా రక్షించే పద్మవ్యూహంలో ఒక్క వీరుడు ఎవరూ లేకుండా అభిమన్యుడు ప్రవేశింపగలిగాడని విన్నపుడే నాకు జయాశ నశించింది. (190)
యదాభిమన్యుం పరివార్య బాలం
సర్వే హత్వా హృష్టరూపా బభూవుః।
మహారథాః పార్థమశక్నువంతః
తదా నాశంసే విజయాయ సంజయ॥ 191
మా మహారథులంతా అర్జునుని చంపలేక, అభిమన్యుని చుట్టుముట్టి అందరూ కలిసి బాలుడయిన అభిమన్యుని చంపి సంతోషించినపుడే నాకు విజయాశ పోయింది సంజయా! (191)
యదాశ్రౌషమభిమన్యుం నిహత్య
హర్షాన్మూఢాన్ క్రోశతో ధార్తరాష్ట్రాన్।
క్రోధాదుక్తం సైంధవే చార్జునేన
తదా నాశంసే విజయాయ సంజయ॥ 192
అభిమన్యుని చంపి సంతోషించే కౌరవులను గురించి, సైంధవుని గురించి అర్జునుడు క్రోధంతో ప్రతిజ్ఞ చేసినపుడే నాకు జయాశ ఎగిరిపోయింది. (192)
యదాశ్రౌషం సైంధవార్థే ప్రతిజ్ఞాం
ప్రతిజ్ఞాతాం తద్వధాయార్జునేన।
సత్యాం తీర్ణాం శత్రుమధ్యే చ తేన
తదా నాశంసే విజయాయ సంజయ॥ 193
సైంధవుని చంపుతానని చేసిన ప్రతిజ్ఞను (శత్రు మధ్యంలో సైంధవుని చంపి) అర్జునుడు నిలబెట్టుకొన్నాడని విన్నపుడే జయం మీద ఊహ లేకపోయింది. (193)
యదాశ్రౌషం శ్రాంతహయే ధనంజయే
ముక్త్వా హయాన్ పాయయిత్వోపవృత్తాన్।
పునర్యుక్త్వా వాసుదేవం ప్రయాతం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 194
గుర్రాలు అలిసిపోయాయి సేదదీరాలని కృష్ణుడన్నపుడు అర్జునుడు ఒక చెరువును సృష్టించి నీళ్లు త్రాగేటట్లు చేశాడు. తరువాతనే కృష్ణుడు వాటిని రథానికి పూన్చి బయలుదేరాడని విన్నపుడే నేను విజయం గురించి ఊహించటం మానేశాను. (194)
యదాశ్రౌషం వాహనేష్వక్షమేషు
రథోపస్థే తిష్ఠతా పాండవేన।
సర్వాన్ యోధాన్ వారితానర్జునేన
తదా నాశంసే విజయాయ సంజయ॥ 195
యుద్ధంలో గుర్రాలు రథాన్ని లాగలేకపోతే రథం నొగలి మీదనే ఉండి యోధులందరినీ వారించాడు అర్జునుడని విన్నపుడే విజయాశ వదలుకొన్నాను. (195)
యదాశ్రౌషం నాగబలైః సుదుఃసహం
ద్రోణానీకం యుయుధానం ప్రమథ్య।
యాతం వార్ష్ణేయం యత్ర తౌ కృష్ణపార్థౌ
తదా నాశంసే విజయాయ సంజయ॥ 196
సైంధవ వధ నాడు ధర్మరాజు సాత్యకిని అర్జునునికి సాయపడటానికి పంపితే ద్రోణుని ఏనుగుల సముదాయం అడ్డుపడింది. వాటిని సంహరించి సాత్యకి కృష్ణార్జునులను చేరాడని విన్నపుడే విజయాశ వదులుకొన్నాను. (196)
యదాశ్రౌషం కర్ణమాసాద్య ముక్తం
వధాద్భీమం కుత్సయిత్వా వచోభిః।
ధనుష్కోట్యాఽఽతుద్య కర్ణేన వీరం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 197
భీముని చంపకుండా కర్ణుడు కేవలం మాటలతో పరాభవించి వింటి కొప్పుతో పొడిచి విడిచిపెట్టాడని విన్నపుడే నాకు జయాశ పోయింది సంజయా! (197)
యదా ద్రోణః కృతవర్మా కృపశ్చ
కర్ణో ద్రౌణి ర్మద్రరాజశ్చ శూరః।
అమర్షయన్ సైంధవం వధ్యమానం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 198
ద్రోణుడూ, కృతవర్మా, కృపుడూ, కర్ణుడూ, అశ్వత్థామా, శల్యుడూ చంపబడే సైంధవుని రక్షించలేకపోయారని విన్నపుడే నేను విజయాశను విడిచిపెట్టాను. (198)
యదాశ్రౌషం దేవరాజేన దత్తాం
దివ్యాం శక్తిం వ్యంసితాం మాధవేన।
ఘటోత్కచే రాక్షసే ఘోరరూపే
తదా నాశంసే విజయాయ సంజయ॥ 199
ఇంద్రుడిచ్చిన దివ్యశక్తిని కృష్ణుడు కర్ణునిచేత ఘటోత్కచునిపై ప్రయోగింపజేశాడని విన్నపుడే నాకు విజయం మీద ఆశ పోయింది. (199)
యదాశ్రౌషం కర్ణఘటోత్కచాభ్యాం
యుద్ధే ముక్తాం సూతపుత్రేణ శక్తిమ్।
యయా వథ్యః సమరే సవ్యసాచీ
తదా నాశంసే విజయాయ సంజయ॥ 200
కర్ణుడు ఆ శక్తిని అర్జునునిపై ప్రయోగించవలసి ఉంది. కాని కర్ణ ఘటోత్కచుల యుద్ధంలో కర్ణుడా శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించాడని విన్నపుడే నాకు జయాశ అనేది లేకపోయింది. (200)
యదాశ్రౌషం ద్రోణమాచార్యమేకం
ధృష్టద్యుమ్నేనాభ్యతిక్రమ్య ధర్మమ్।
రథోపస్థే ప్రాయగతం విశస్తం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 201
ధృష్టద్యుఘ్నుడు ధర్మం అతిక్రమించి రథం నొగలిపై ప్రాయోపవిష్టుడై ఉన్న ద్రోణాచార్యుని తెగనరికాడని విన్నపుడే నేను జయాశ విడిచిపెట్టాను. (201)
యదాశ్రౌషం ద్రౌణినా ద్వైరథస్థం
మాద్రీసుతం నకులం లోకమధ్యే।
సమం యుద్ధే మండలేభ్యశ్చరంతం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 202
అశ్వత్థామతో ద్వైరథయుద్ధంలో రాజులందరూ చూస్తూ ఉండగా నకులుడు సమంగా చక్కగా మండలయుద్ధం చేశాడని విన్నపుడే జయాశ పోయింది సంజయా! (202)
యదా ద్రోణే నిహతే ద్రోణపుత్రః
నారాయణం దివ్యమస్త్రం వికుర్వన్।
నైషామంతం గతవాన్ పాండవానాం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 203
ద్రోణుడు చనిపోయాక అశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రం ప్రయోగించాడు. అయినా పాండవులు చనిపోలేదు. అపుడే నాకు జయం మీద ఆశ పోయింది. (203)
యదాశ్రౌషం భీమసేనేన పీతం
రక్తం భ్రాతుర్యుధి దుశ్శాసనస్య।
నివారితం నాన్యతమేన భీమం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 204
యుద్ధంలో భీముడు సోదరుడయిన దుశ్శాసనుని రక్తం త్రాగినపుడు ఎవరూ భీముని వారించలేకపోయారని విన్నపుడే నాకు విజయాశపోయింది. (204)
యదాశ్రౌషం కర్ణమత్యంతశూరం
మతం పార్థేనాహవేష్వప్రధృష్యమ్।
తస్మిన్ భ్రాతౄణాం విగ్రహే దేవగుహ్యే
తదా నాశంసే విజయాయ సంజయ॥ 205
సోదరులకు దేవరహస్యంగా యుద్ధం జరిగినపుడు, ఎదిరింపశక్యంకాని పరాక్రమవంతుడయిన కర్ణుని అర్జునుడు చంపాడని విన్నపుడే విజయం మీద ఆశపోయింది. (205)
యదాశ్రౌషం ద్రోణపుత్రం చ శూరం
దుఃశాసనం కృతవర్మాణముగ్రమ్।
యుధిష్ఠిరం ధర్మరాజం జయంతం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 206
ద్రోణపుత్రుడయిన అశ్వత్థామనూ, దుశ్శాసనునీ, కృతవర్మనూ ధర్మరాజు జయించాడని విన్నపుడే నాకు విజయాశ శూన్యమైపోయింది. (206)
యదాశ్రౌషం నిహతం మద్రరాజం
రణే శూరం ధర్మరాజేన సూత।
సదా సంగ్రామే స్పర్ధతే యస్తు కృష్ణం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 207
కృష్ణునితో ఎప్పుడూ పోటీపడే శూరుడు శల్యుడు యుద్ధంలో ధర్మరాజుచేత చనిపోయాడని విన్నపుడే నా జయాశ పోయింది. (207)
యదాశ్రౌషం కలహద్యూతమూలం
మాయాబలం సౌబలం పాండవేన।
హతం సంగ్రామే సహదేవేన పాపం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 208
కలహ ద్యూతానికి మూలమూ, మాయాబలుడూ అయిన శకుని యుద్ధంలో సహదేవుని చేత చనిపోయాడని విన్నపుడే విజయాశ పోయింది నాకు సంజయా! (208)
యదాశ్రౌషం శ్రాంతమేకం శయానం
హ్రదం గత్వా స్తంభయిత్వా తదంభః।
దుర్యోధనం విరథం భగ్నశక్తిం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 209
దుర్యోధనుడు విరథుడై శక్తి చచ్చి మడుగులో ప్రవేశించి నీటిని స్తంభింపజేసి అందులో విశ్రమించాడని విన్నపుడే విజయం ఆశించడం మానేశాను. (209)
యదాశ్రౌషం పాండవాస్తిష్ఠమానాన్
గత్వా హ్రదే వాసుదేవేన సార్ధమ్।
అమర్షణం ధర్షయతః సుతం మే
తదా నాశంసే విజయాయ సంజయ॥ 210
పాండవులు కృష్ణునితో సహా ఆ మడుగు దరిచేరి నా కొడుకు, అసహనశీలి అయిన దుర్యోధనుని రెచ్చగొట్టారని విన్నపుడే విజయాశ పోయింది. (210)
యదాశ్రౌషం వివిధాంశ్చిత్రమార్గాన్
గదాయుద్ధే మండలశశ్చరంతమ్।
మిధ్యాహతం వాసుదేవస్య బుద్ధ్యా
తదా నాశంసే విజయాయ సంజయ॥ 211
గదాయుద్ధంలో దుర్యోధనుడు చిత్రములైన వివిధ మార్గాల్లో మండలాకారంగా తిరుగుతూ వాసుదేవుని తెలివి వల్ల భీమసేనుని చేత అధర్మంగా చనిపోయాడని విన్నపుడే నాకు జయాశ ఉడిగిపోయింది సంజయా! (211)
యదాశ్రౌషం ద్రోణపుత్రాదిభిస్తైః
హతాన్ పంచాలాన్ ద్రౌపదేయాంశ్చ సుప్తాన్।
కృతం బీభత్సమయశస్యం చ కర్మ
తదా నాశంసే విజయాయ సంజయ॥ 212
అశ్వత్థామాదివీరులు అకీర్తికరమైన దుష్కర్మ చేసి నిద్రిస్తున్న ఉపపాండవులనూ, పాంచాలురనూ చంపారని విన్నపుడే నాకు జయాశ పోయింది. (212)
యదాశ్రౌషం భీమసేనానుయాతే
నాశ్వత్థామ్నా పరమాస్త్రం ప్రయుక్తమ్।
క్రుద్ధేనైషీకమవధీద్ యేన గర్భం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 213
భీమసేనుడు అశ్వత్థామను వెంటాడినపుడు అశ్వత్థామ ఇషీకాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ఉత్తరగర్భాన్ని మాత్రం ఛేదించిందని విన్నపుడే నాకు జయాశపోయింది. (213)
యదాశ్రౌషం బ్రహ్మశిరోఽర్జునేన
స్వస్తీత్యుక్త్వాస్త్రమస్త్రేణ శాంతమ్।
అశ్వత్థామ్నా మణిరత్నం చ దత్తం
తదా నాశంసే విజయాయ సంజయ॥ 214
అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినపుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపశమింపజేశాడు. అపుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని ఇచ్చాడని విన్నపుడే జయాశ పోయింది. (214)
యదాశ్రౌషం ద్రోణపుత్రేణ గర్భే
వైరాట్యా వై పాత్యమానే మహాస్త్రైః।
ద్వైపాయనః కేశవో ద్రోణపుత్రం
పరస్పరేణాభిశాపైః శశాప ॥ 215
ద్రోణపుత్రుని అస్త్రాలతో ఉత్తరాగర్భం పీడింపబడినపుడూ; వ్యాసుడూ, కృష్ణుడూ కూడా అశ్వత్థామను శాపాలతో బాధించారని విన్నపుడు జయాశ పోయింది. (215)
శోచ్యా గాంధారీ పుత్రపౌత్రై ర్విహీనా
తథా బంధుభిః పితృభిర్భ్రాతృభిశ్చ।
కృతం కార్యం దుష్కరం పాండవేయైః
ప్రాప్తం రాజ్యమసపత్నం పునస్తైః॥ 216
అపుడు గాంధారి అవస్థ చాలా శోచనీయమయింది. పుత్రులు, పౌత్రులు, బంధువులు, సోదరులు అందరూ పోయారు. పాండవులు చాలా దుష్కరకృత్యం చేశారు. శత్రురహితమైన రాజ్యం మళ్లీ పొందారు. (216)
కష్టం యుద్ధే దశశేషాః శ్రుతా మే
త్రయోఽస్మాకం పాండవానాం చ సప్త।
ద్వ్యూనా వింశతి రాహతాక్షౌహిణీనాం
తస్మిన్ సంగ్రామే భైరవే క్షత్రియాణామ్॥ 217
ఈ యుద్ధం వల్ల చాలా కష్టదశ వచ్చింది. మొత్తం పదిమంది మిగిలారని విన్నాను. మా పక్షంలో ముగ్గురు (అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు), పాండవ పక్షంలో ఏడుగురు - (పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి) ఈ ఘోర సంగ్రామంలో 18 అక్షౌహిణుల మంది చనిపోయారు. (217)
తమస్త్వతీవ విస్తీర్ణం మోహ ఆవిశతీవ మామ్।
సంజ్ఞానాం నోపలభే సూత మనో విహ్వలతీవ మే॥ 218
నాకు చీకటి అలముకొంది. నన్ను మోహం ఆవేశిస్తోంది. సంజయా స్పృహ పోతోంది. నా మనస్సు విహ్వలమయి పోతోంది. (218)
సౌతిరువాచ
ఇత్యుక్త్వా ధృతరాష్ట్రోఽథ విలప్య బహుదుఃఖితః।
మూర్ఛితః పునరాశ్వస్తః సంజయం వాక్యమబ్రవీత్॥ 219
సూతపుత్రుడు ఇలా అన్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు ఎంతగానో విలపించి మూర్ఛపోయాడు. సంజయుడు సేద దీర్చాడు. మళ్లీ ఇలా అన్నాడు సంజయునితో. (219)
ధృతరాష్ట్ర ఉవాచ
సంజయైవం గతే ప్రాణాన్ త్యక్తుమిచ్ఛామి మా చిరమ్।
స్తోకం హ్యపి న పశ్యామి ఫలం జీవితధారణే॥ 220
ధృతరాష్ట్రుడు అన్నాడు - సంజయా! ఇలాపోయే ప్రాణాలను శాశ్వతంగా వదిలి వేయాలనుకొంటున్నాను. ఈ జీవితాన్ని ధరించి నందువల్ల కించిత్తు కూడా ఫలం కనిపించటం లేదు. (220)
సౌతిరువాచ
తం తథా వాదినం దీనం విలపంతం మహీపతిమ్।
నిఃశ్వసంతం యథా నాగం ముహ్యమానం పునః పునః॥ 221
గావల్గణిరిదం ధీమాన్ మహార్థం వాక్యమబ్రవీత్।
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. ధృతరాష్ట్రుడు అలా అంటూ విలపిస్తున్నాడు. పాములాగా బుసలు కొడుతూ మళ్ళీ మళ్లీ మూర్ఛపోతున్నాడు. అపుడు ధీమంతుడయిన సంజయుడు అర్థవంతంగా ఇలా అన్నాడు. (221 1/2)
సంజయ ఉవాచ
శ్రుతవానసి వై రాజన్ మహోత్సాహాన్ మహాబలాన్॥ 222
ద్వైపాయనస్య వదతః నారదస్య చ ధీమతః।
సంజయుడు అంటున్నాడు. రాజా ధీమంతుడయిన నారదుడూ, వ్యాసభగవానుడూ చెపుతూ ఉండగా ఎంతోమంది ఉత్సాహపరులై బలవంతులయిన రాజులను గురించి వినే ఉన్నావు. (222 1/2)
మహత్సు రాజవంశేషు గుణైః సముదితేషు చ ॥ 223
జాతాన్ దివ్యాస్త్రవిదుషః శక్రప్రతిమతేజసః।
ధర్మేణ పృథివీం జిత్వా యజ్ఞై రిష్ట్వాప్తదక్షిణైః॥ 224
అస్మింల్లోకే యశః ప్రాప్య తతః కాలవశంగతాన్।
శైబ్యం మహారథం వీరం సృంజయం జయతాం వరమ్॥ 225
సుహోత్రం రంతిదేవం చ కాక్షీవంతమథౌశిజమ్।
బాహ్లీకం దమనం చైద్యం శర్యాతిమజితం నలమ్॥ 226
విశ్వామిత్ర మమిత్రఘ్నం అంబరీషం మహాబలమ్।
మరుత్తం మనుమిక్ష్వాకుం గయం భరతమేవ చ॥227
రామం దాశరథిం చైవ శశబిందుం భగీరథమ్।
కృతవీర్యం మహాభాగం తథైవ జనమేజయమ్॥ 228
యయాతిం శుభకర్మాణం దేవైర్యో యాజితః స్వయమ్।
చైత్యయూపాంకితా భూమిః యస్యేయం సవనాకరా॥ 229
ఇతి రాజ్ఞాం చతుర్వింశత్ నారదేన సురర్షిణా।
పుత్రశోకాభితప్తాయ పురా శ్వైత్యాయ కీర్తితమ్॥ 230
గొప్పగొప్ప రాజవంశాల్లో పుట్టి సద్గుణవంతులయి, దివ్యాస్త్రవేత్తలయి, ఇంద్రసమాన తేజస్వులై ధార్మికంగా భూమిని జయించి, భూరిదక్షిణలతో యజ్ఞాలు చేసి, ఈ లోకంలో ఎంతో కీర్తిగడించి చివరకు వారంతా కాలధర్మం చెందారు. మహారథుడయిన శైబ్యుడు, జయశీలులలో ఉత్తముడయిన సృంజయుడు, సుహోత్రుడు, రంతిదేవుడు, కాక్షీవంతుడు ఔశిజుడు, బాహ్లీకుడు, దమనుడు, చైద్యుడు, శర్యాతి, నలుడు, శత్రుసంహారకుడయిన విశ్వామిత్రుడు, మహాబలుడయిన అంబరీషుడు, మరుత్తుడు, మనువు, ఇక్ష్వాకువు, గయుడు, భరతుడు, దశరథపుత్రుడయిన రాముడు, శశబిందుడు, భగీరథుడు, కృతవీర్యుడు, జనమేజయుడు, యయాతి, (ఈయన చేత దేవతలు స్వయంగా యజ్ఞం చేయించారు. అతని కాలంలో భూమి అంతా యూపస్తంభాలతో నిండిపోయింది.) ఇలా ఇరవై నలుగురు రాజులగురించి దేవర్షి నారదుడు పుత్రశోకంతో విలపించే శ్వైత్యునికి చెప్పాడు. వీరంతా సద్గుణ వంతులయినా, ఎన్ని సత్కృత్యాలు చేసినా చివరకు అన్నీ వదలి కాలధర్మం చెందవలసి వచ్చింది. (223-230)
తేభ్యశ్చాన్యే గతాః పూర్వం రాజానో బలవత్తరాః।
మహారథా మహాత్మానః సర్వైః సముదితా గుణైః॥ 231
పూరుః కురుర్యదుః శూరః విష్వగశ్వో మహాద్యుతిః।
అణుహో యువనాశ్వశ్చ కకుత్స్థో విక్రమీ రఘుః॥ 232
విజయో వీతిహోత్రోఽంగః భవః శ్వేతో బృహద్గురుః।
ఉశీనరః శతరథః కంకః దులిదుహో ద్రుమః॥ 233
దంభోద్భవః పరో వేనః సగరః సంకృతి ర్నిమిః।
అజేయః పరశుః పుండ్రః శంభుర్దేవావృధోఽనఘః॥ 234
దేవాహ్వయః సుప్రతిమః సుప్రతీకో బృహద్రథః।
మహోత్సాహో వినీతాత్మా సుక్రతు ర్నైషధో నలః॥ 235
సత్యవ్రతః శాంతభయః సుమిత్రః సుబలః ప్రభుః।
జానుజంఘోఽనరణ్యోఽర్కః ప్రియభృత్యః శుచివ్రతః॥ 236
బలబంధు ర్నిరామర్దః కేతుశృంగో బృహద్బలః।
ధృష్టకేతు ర్బృహత్కేతుః దీప్తకేతు ర్నిరామయః॥ 237
అవీక్షి చ్చపలో ధూర్తః కృతబంధు ర్దృఢేషుధిః।
మహాపురాణ సంభావ్యః ప్రత్యంగః పరమా శ్రుతిః॥ 238
ఏతే చాన్యే చ రాజానః శతశోఽథ సహస్రశః।
శ్రూయంతే శతశశ్చాన్యే సంఖ్యాతాశ్చైవ పద్మశః॥ 239
హిత్వా సువిపులాన్ భోగాన్ బుద్ధిమంతో మహాబలాః।
రాజానో నిధనం ప్రాప్తాః తవ పుత్రా ఇవ ప్రభో॥ 240
వీరేకాదు వీరికంటె బలీయులు, మహారథులూ, మహాత్ములూ, సర్వసద్గుణశోభితులూ అయిన పూరుడు, కురువు, యదువు, శూరుడు, మహాతేజస్వి అయిన విష్వగశ్వుడు, అణుహుడు, యువనాశ్వుడు, కకుత్స్థుడు పరాక్రమవంతుడయిన రఘువు, విజయుడు, వీతిహోత్రుడు, అంగుడు, భవుడు, శ్వేతుడు, బృహద్గురుడు, ఉశీనరుడు, శతరథుడు, కంకుడు, దులిదుహుడు, ద్రుముడు, దంభోద్భవుడు, పరుడు, వేనుడు, సగరుడు, సంకృతి, నిమి, అజేయుడు, పరశుడు, పాండుడు, శంభుడు, దేవావృథుడు, దేవాహ్వయుడు, సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహద్రథుడు, మహోత్సాహమూ వినయమూ కల సుక్రతుడు, నిషధరాజు నలుడు, సత్యవ్రతుడు, శాంతభయుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభుడు, జానుజంఘుడు, అనరణ్యుడు, అర్కుడు, ప్రియభృత్యుడు, శుచివ్రతుడు, బలబంధుడు, నిరామర్దుడు, కేతుశృంగుడు, బృహద్బలుడు, ధృష్టకేతువు, బృహత్కేతువు, దీప్తకేతువు, నిరామయుడు, అవీక్షిత్తు, చపలుడు, ధూర్తుడు, కృతబంధుడు, దృఢేషుధి, మహాపురాణంలో సంభావింపబడిన ప్రత్యంగుడు, పరహుడు, శ్రుతి - ఇలా ఇంకా ఇతర రాజులెందరో వందలు వేలు, లక్షలూ మంది బుద్ధిశాలులూ బలవంతులూ కూడా ఈ విపులమయిన భోగాలు వదలి నీ పుత్రుల వలెనే చనిపోయారు. (231-240)
యేషాం దివ్యాని కర్మాణి విక్రమ స్త్యాగ ఏవ చ।
మహాత్మ్యమపి చాస్తిక్యం సత్యం శౌచం దయార్జవమ్॥ 241
విద్వద్భిః కథ్యతే లోకే పురాణే కవిసత్తమైః।
సర్వర్ధిగుణసంపన్నాః తే చాపి నిధనం గతాః॥ 242
ఎన్నో దివ్యకృత్యాలు పరాక్రమంలో చేసిన వారున్నారు. త్యాగబుద్ధి, శక్తి, ఆస్తిక్యం, సత్యం, శౌచం, దయ, ఆర్జవం కలవారున్నారు. విద్వాంసులంతా వారి సద్గుణాలను ప్రశంసించేవారు. పురాణాలలో కవులు వారిని శ్లాఘించేవారు. అభివృద్ధికరములయిన సర్వసద్గుణాలూ కలవారు ఉన్నారు. వారంతా కూడా చనిపోయారు. (241,242)
తవ పుత్రా దురాత్మానః ప్రతప్తాశ్చైవ మన్యునా।
లుబ్ధా దుర్వృత్తభూయిష్ఠాః న తాన్ శోచితుమర్హసిః॥ 243
నీ పుత్రులు దుష్టులు, క్రోధంతో ఉడికిపోయేవారు. లుబ్ధులు, దుష్ప్రవర్తన కలవారు. అందుచేత వారికోసం దుఃఖించవలసిన పనిలేదు. (243)
శ్రుతవానసి మేధావీ బుద్ధిమాన్ ప్రాజ్ఞసమ్మతః।
యేషాం శాస్త్రానుగా బుద్ధిః న తే ముహ్యంతి భారత॥ 244
భరతశ్రేష్ఠా! నీవు బాగా చదువుకొన్నవాడవు. ప్రజ్ఞావంతుడవు. బుద్ధిమంతుడవు. పండితులకు ఇష్టమైనవాడవు. శాస్త్రానుసారమయిన బుద్ధికలిగిన వారు శోక మోహాలకు వశం కారు. (244)
నిగ్రహానుగ్రహౌ చాపి విదితౌ తే నరాధిప।
నాత్యంతమేవానువృత్తిః కార్యా తే పుత్రరక్షణే॥ 245
రాజా! నీకు నిగ్రహానుగ్రహాలు రెండూ కూడా తెలుసును. నీ పుత్రులను రక్షించుకోవడం కోసం ఇంత వ్యాకుల పడవలసిన పనిలేదు. (245)
భవితవ్యం తథా తచ్చ నానుశోచితు మర్హసి।
దైవం ప్రజ్ఞావిశేషేణ కో నివర్తితు మర్హతి॥ 246
అది అట్లా జరగవలసి ఉన్నపుడు నీవు దుఃఖించవలసిన పనిలేదు. తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు మళ్లించగలరు? (246)
విధాతృవిహితం మార్గం న కశ్చిదతివర్తతే।
కాలమూలమిదం సర్వం భావాభావౌ సుఖాసుఖే॥ 247
బ్రహ్మగారు నిశ్చయించిన మార్గాన్ని ఎవడూ దాటలేడు. ఈ జనన మరణాలూ, సుఖదుఃఖాలు దీనికంతకూ మూల కారణం కాలం. (247)
కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః।
సంహరంతం ప్రజాః కాలం కాలః శమయతే పునః॥ 248
ప్రాణులన్నిటినీ కాలమే సృష్టిస్తుంది. కాలమే ప్రజలను సంహరిస్తుంది. కాలం ప్రజలను సంహరిస్తూనే శమించిపోతుంది. (248)
కాలో హి కురుతే భావాన్ సర్వలోకే శుభాశుభాన్।
కాలః సంక్షిపతే సర్వాః ప్రజా విసృజతే పునః॥ 249
ఈ లోకాలన్నిటా శుభాలు కానీ అశుభాలు కానీ సర్వ భావాలను కాలం సృష్టిస్తుంది. మళ్లీ ఆ కాలమే అన్నిటినీ సంహరిస్తుంది. మళ్లీ సృష్టిస్తూ ఉంటుంది. (అందుకే కాలం చక్రంలా తిరుగుతుంది.) (249)
కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః।
కాలః సర్వేషు భూతేషు చరత్యవిధృతః సమః॥ 250
అతీతానాగతా భావాః యే చ వర్తంతి సాంప్రతమ్।
తాన్ కాలనిర్మితాన్ బుద్ధ్వా న సంజ్ఞాం హాతుమర్హసి॥ 251
నిద్రించేవారిని కాలమే మేల్కొలుపుతుంది. కాలం అతిక్రమింపరానిది. అన్ని ప్రాణులపట్ల ఆ కాలం వదలకుండా సమానంగా ప్రవర్తిస్తుంది. భూతకాలంలోనివి కాని, భవిష్యత్తు లోనివి కాని, ఇపుడున్న భావాలు కాని కాలనిర్మితాలని తెలుసుకో. వివేకం పోగొట్టుకోరాదు. (250,251)
సౌతిరువాచ
ఇత్యేవం పుత్రోశోకార్తం ధృతరాష్ట్రం జనేశ్వరమ్।
ఆశ్వాస్య స్వస్థమకరోత్ సూతో గావల్గణి స్తదా॥ 252
అత్రోపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయనోఽబ్రవీత్।
విద్వద్భిః కథ్యతే లోకే పురాణే కవిసత్తమైః॥ 253
ఉగ్రశ్రవుడు చెప్పాడు. ఇలా సంజయుడు పుత్ర శోకంతో దుఃఖిస్తున్న ధృతరాష్ట్రమహారాజును ఓదార్చి స్వస్థచిత్తుని చేశాడు. ఈ కథను ఆధారం చేసుకొని పుణ్యప్రదమైన ఉపనిషత్తులాంటి భారతాన్ని కృష్ణద్వైపాయనుడు చెప్పాడు. అది విద్వత్ కవీశ్వరులచేత లోకంలో చాలాకాలంగా చెప్పబడుతోంది. (252,253)
భారతాధ్యయనం పుణ్యమ్ అపి పాదమధీయతః।
శ్రద్దధానస్య పూయంతే సర్వపాపాన్యశేషతః॥ 254
ఒక పాదం చదివినా భారతం పుణ్యప్రదం. శ్రద్ధగా చదివిన వాని పాపాలన్నీ తుడిచి పెట్టుకొనిపోతాయి. (254)
దేవా దేవర్షయో హ్యత్ర తథా బ్రహ్మర్షయోఽమలాః।
కీర్త్యంతే శుభకర్మాణః తథా యక్షా మహోరగాః॥ 255
ఇందులో దేవతల గురించి, దేవర్షుల గురించి బ్రహ్మర్షుల గురించి, అలాగే సత్కార్యాచరణం చేసే యక్షుల గురించి, ఉరగుల గురించి కీర్తింప బడింది. (255)
భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేఽత్ర సనాతనః ।
స హి సత్యం ఋతం చైవ పవిత్రం పుణ్యమేవ చ ॥ 256
సనాతనుడయిన భగవంతుడు వాసుదేవుడు ఇందులో కీర్తింపబడినాడు. అతడే సత్యస్వరూపుడు - ఋతస్వరూపుడు - పవిత్రరూపుడు - పుణ్యస్వరూపుడు. (256)
శ్వాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతి స్సనాతనమ్ ।
యస్య దివ్యాని కర్మాణి కథయంతి మనీషిణః ॥ 257
ఆ వాసుదేవుడే శాశ్వతుడయిన పరబ్రహ్మ. సనాతనమై శాశ్వతమయిన వెలుగు అతడే. ఆయన దివ్యకృత్యాలనే తెలివైనవారు కీర్తిస్తూ ఉంటారు. (257)
అసచ్చ సదసచ్చైవ యస్మాద్విశ్వం ప్రవర్తతే ।
సంతతిశ్చ ప్రవృత్తిశ్చ జన్మమృత్యుపునర్భవాః ॥ 258
ఆయన వల్లనే ఈ విశ్వం (సత్తు, అసత్తు, సదసత్తు రూపంలో) ప్రవర్తిస్తోంది. అతని నుండియే ప్రాణులు, ప్రజలు, ఉద్భవించారు. ప్రవృత్తి (కర్తవ్యం - కర్మ) ఏర్పడింది. జనన మరణాలూ అలాగే పునర్జన్మ ఏర్పడ్డాయి. (258)
అధ్యాత్మం శ్రూయతే యచ్చ పంచభూతగుణాత్మకమ్ ।
అవ్యక్తాది పరం యచ్చ స ఏవ పరిగీయతే ॥259
ఈ భారతంలో పంచభూతాలగురించి త్రిగుణాల గురించి, జీవాత్మ గురించి చెప్పబడింది. అవ్యక్త ప్రకృతి మొదలు మూలకారణమయిన పరబ్రహ్మం కూడా చక్కగా చెప్పబడింది. (259)
యత్తద్ యతివరా ముక్తాః ధ్యానయోగబలాన్వితాః ।
ప్రతిబింబమివాదర్శే పశ్యంత్యాత్మన్యవస్థితమ్ ॥ 260
దీనివల్లనే ముక్తులయిన యతీశ్వరులు ధ్యానబలంతోనూ యోగబలంతోనూ అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లు తమలో పరమాత్మను చూస్తున్నారు. (260)
శ్రద్దధానః సదా యుక్తః సదా ధర్మపరాయణః ।
ఆసేవన్నిమమధ్యాయం నరః పాపాత్ ప్రముచ్యతే ॥ 261
నిత్యమూ శ్రద్ధతో, ధర్మపరాయణూడై ఈ అధ్యాయాన్ని పఠించేవాడూ, వినేవాడూ పాపం నుండి విడివడుతాడు. (261)
అనుక్రమణికాధ్యాయం భారతస్యేమమాదితః।
ఆస్తికః సతతం శృణ్వన్ న కృచ్ఛ్రేష్వవసీదతి ॥ 262
భారతం యొక్క ఈ అనుక్రమణీక్యాధ్యాయం మొదటినుండీ చివరిదాకా వినే ఆస్తికుడు ఆపత్కాలంలో కూడా దుఃఖం పొందడు. (262)
ఉభే సంధ్యే జపన్ కించిత్ సద్యో ముచ్యేత కిల్బిషాత్ ।
అనుక్రమణ్యా యావత్స్యాత్ అహ్నా రాత్ర్యా చ సంచితమ్ ॥ 263
ఉభయ సంధ్యలలోనూ ఈ అనుక్రమణికాధ్యాయాన్ని వీలయినంత చదివేవాడు ఆ పగలూ, రాత్రీ చేసిన పాపాల నుండి వెంటనే ముక్తుడవుతాడు. (263)
భారతస్య వపుర్హ్యేతత్ సత్యం చామృతమేవ చ ।
నవనీతం యథా దధ్నుః ద్విపదాం బ్రాహ్మణో యథా ॥ 264
ఆరణ్యకం చ వేదేభ్యః ఓషధిభ్యోఽమృతం యథా।
హ్రదానాముదధిః శ్రేష్ఠః గౌర్వరిష్ఠా చతుష్పదామ్ ॥ 265
యథైతానీతిహాసానాం తథా భారతముచ్యతే ।
యశ్పైనం శ్రావయేత్ శ్రౌద్ధే బ్రాహ్మణాన్ పాదమంతతః ॥ 266
అక్తయ్యమన్నపానం వై పితౄంస్తస్యోపతిష్ఠతే ।
ఈ అధ్యాయం భారతానికి మూలశరీరం- (తత్వం-బీజం) సత్యస్వరూపం- అమృతస్వరూపం. పెరుగులో వెన్నవలె, మానవులలో బ్రహ్మజ్ఞానివలె, వేదాలలో ఆరణ్యకాలవలె, ఓషధులలో అమృతం వలె, మడుగులలో సముద్రం వలె, పశువులలో ఆవులవలె, ఇతిహాసాలలో ఈ భారతం శ్రేష్ఠమయినది. దీన్ని శ్రౌద్ధసమయంలో బ్రాహ్మణులకు ఒక్కపాదమయినా వినిపించే వాని పితరులకు అన్నపానాలు అక్షయమవుతాయి. (264-266 1/2)
ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ ॥ 267
బిభేత్యల్పశ్రుతాద్వేదః మామయం ప్రహరిష్యతి ।
కార్ష్ణం వేదమిమం విద్వాన్ శ్రావయిత్వార్థమశ్నుతే ॥ 268
ఇతిహాసపురాణాలతో వేదానికి పుష్టి చేకూర్చాలి. సరిగా చదువుకోని వాడికి వేదం "వీడు నన్ను కొడుతున్నాడని" భయపడి పోతుంది. ఇది కృష్ణద్వైపాయనుడు చెప్పినవేదం. విద్వాంసుడు దీన్ని చక్కగా వినిపిస్తే అర్థం/పురుషార్థం పొందుతాడు. (ప్రయోజనం, సత్ఫలితం, సంపద పొందుతాడు.) (267, 268)
భ్రూణహత్యాదికం చాపి పాపం జహ్యాదసంశయమ్ ।
య ఇమం శుచిరధ్యాయం పఠేత్ పర్వణి పర్వణి ॥ 269
అధీతం భారతం తేన కృత్స్నం స్యా దితి మే మతిః ।
యశ్పైనం శృణుయాన్నిత్యమ్ ఆర్షం శ్రద్ధాసమన్వితః ॥ 270
సుదీర్ఘమాయుః కీర్తిం చ స్వర్గతిం చాప్నుయాన్నరః ।
ఏకతశ్చతురో వేదాన్ భారతం చైతదేకతః ॥ 271
పురా కిల సురైః సర్వైః సమేత్య తులయా ధృతమ్ ।
చతుర్భ్యః సరహస్యేభ్యః వేదేభ్యో హ్యధికం యదా ॥ 272
తదా ప్రభృతి లోకేఽస్మిన్ మహాభారతముచ్యతే ।
మహత్త్వే చ గురుత్వే చ ధ్రియమాణం యతోఽధికమ్ ॥ 273
ఈ అధ్యాయాన్ని ప్రతిపర్వం చివర/(పర్వ సమయాల్లోనూ, శుచియై చదివేవాడు నిస్సంశయంగా భ్రూణహత్యాది పాపాలు విడిచిపెడతాడు. వాడు భారతమంతా చదివినట్లే అని నా అభిప్రాయం. వాడు దీర్ఘాయువునూ, కీర్తినీ, స్వర్గాన్నీ పొందుతాడు. పూర్వం దేవతలంతా నాలుగువేదాలనూ ఒక ప్రక్క, భారతాన్ని ఒక ప్రక్క త్రాసులో ఉంచి తూచారు. అపుడు రహస్యాలతో కూడిన నాల్గువేదాల కంటె భారతమే బరువుగా కనపడింది. అప్పటినుండి ఇది లోకంలో "విలువలోనూ బరువులోనూ అధికం అవడం వల్ల" మహాభారతం అయింది. (మహత్త్వం-గొప్పదనం-విలువ; గురుత్వం = బరువు) (269-273)
మహత్త్వాత్ భారవత్త్వాచ్చ మహాభారతముచ్యతే ।
నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే ॥ 274
మహత్త్వం వల్లనూ, బరువు వల్లనూ ఇది మహాభారతం అయింది. దీని ఈ అర్థాన్ని తెలుసుకొన్నవాడు సర్వపాపాల నుండి విడివడుతాడు. (274)
తపో న కల్కోఽధ్యయనం న కల్కః
స్వాభావికో వేదవిధిర్న కల్కః ।
ప్రసహ్య విత్తాహరణం న కల్కః
తాన్యేవ భావోపహతాని కల్కః ॥ 275
తపస్సు దోషం/పాపం కాదు. వేదాధ్యయనం దోషం కాదు. స్వాభావికమయిన వేదవిధుల్ని ఆచరించడం దోషం కాదు. కష్టాలు సహించి ధనం సంపాదించడం దోషం కాదు. కాని ఇవే భావాలు దెబ్బతింటే దోషాలు. అనగా దంభం కోసం, గొప్పకోసం చేయరాదు. ఇష్టంగా శ్రద్ధతో చెయ్యాలి. గొప్ప కోసం చేస్తే దోషమే. భావశుద్ధి ప్రధానమని భావం. (275)
ఇతి శ్రీమహాభారతే ఆది పర్వణి అనుక్రమణికాపర్వణి ప్రథమోఽధ్యాయః ॥ 1 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అనుక్రమణికాపర్వమను ఉపపర్వమున మొదటి అధ్యాయము. (1)
(దాక్షిణాత్య అధికపాఠము 7 శ్లోకాలు కలిపి మొత్తం 282 శ్లోకాలు)