15. పదునైదవ అధ్యాయము
ఆస్తీకుని జన్మవృత్తాంతము.
సౌతి రువాచ
మాత్రా హి భుజగాః శప్తాః పూర్వం బ్రహ్మవిదాం వర ।
జనమేజయస్య వో యజ్ఞే ధక్ష్యత్యనిలసారథిః ॥ 1
ఉగ్రశ్రవసుడు ఈ విధంగా చెప్పాడు - "శౌనకమహర్షీ! పూర్వము నాగమాత అయిన కద్రువ తన కుమారులైన సర్పాలకు "మీరు జనమేజయుడు చేసే యజ్ఞంలో అగ్నిలో భస్మమగుదురుగాక" అని శాపమిచ్చింది. (1)
తస్య శాపస్య శాంత్యర్థే ప్రదదౌ పన్నగోత్తమః ।
స్వసారమృషయే తస్మై సువత్రాయ మహాత్మనే ॥ 2
స చ తాం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణా ।
ఆస్తీకో నామ పుత్రశ్చ తస్యాం జజ్ఞే మహామనాః ॥ 3
ఆ శాపానికి బలికాకుండా ఉండటానికి వాసుకి ఆ జరత్కారునకు తన చెల్లెలిని ఇచ్చి వివాహం చేశాడు. అతడు కూడా శాస్త్రోక్తంగా వివాహం చేసుకొన్నాడు. ఆ దంపతులకు ఆస్తీకుడు అనే కుమారుడు జన్మించాడు. (2,3)
తపస్వీ చ మహాత్మా చ వేదవేదాంగపారగః ।
సమః సర్వస్య లోకస్య పితృమాతృభయాపహః ॥ 4
ఆ ఆస్తీకుడు మహాతపస్వి. వేదవేదాంగాలలో పండితుడు. మహాత్ముడు. సర్వులయందు సమదృష్టి కలవాడు. అటు పితృవంశానికి, ఇటు మాతృవంశానికి భయాన్ని తొలగించి ఆనందం కల్గించేవాడు. (4)
అథ దీర్ఘస్య కాలస్య పాలడవేయో నరాధిపః ।
ఆజహార మహాయజ్ఞం సర్పసత్రమితి శ్రుతిః ॥ 5
తస్మిన్ ప్రవృత్తే సత్రే తు సర్పాణామంతకాయ వై ।
మోచయామాస తాన్ నాగాన్ ఆస్తీకః సుమహాతపాః ॥ 6
తరువాత కొంతకాలానికి పాండవవంశంవాడైన జనమేజయ మహారాజు సర్పయాగాన్ని తలపెట్టాడు. సర్పయాగంలో పాములు నశిస్తూండగా మహాతపస్సంపన్నుడైన ఆస్తీకుడు ఆ యజ్ఞశాలకు వచ్చి సర్పయాగాన్ని ఆపించి తన మాతృవంశాన్ని రక్షించాడు. (5,6)
భ్రాతౄంశ్చ మాతులాంశ్చైవ తథైవాన్యాన్ స పన్నగాన్ ।
పితౄంశ్చ తారయామాస సంతత్యా తపసా తథా ॥ 7
సర్పయాగం మాన్పించి తన మేనమామల్ని, సోదరుల్ని, ఇతర సర్పాల్ని అందరిని రక్షించాడు. అట్లాగే జరత్కారుని పుత్రుడవటం ద్వారా తన పితామహులకు ఊర్ధ్వలోకాన్ని కల్పించి ఉపకారం చేశాడు ఆస్తీకుడు. (7)
వ్రతైశ్చ వివిధైర్బ్రహ్మన్ స్వాధ్యాయైశ్చానృణోఽభవత్ ।
దేవాంశ్చ తర్పయామాస యజ్ఞైర్వివిధదక్షిణైః ॥ 8
ఋషీంశ్చ బ్రహ్మచర్యేణ సంతత్యా చ పితామహాన్ ।
అపహృత్య గురుం భారం పితౄణాం సంశితవ్రతః ॥ 9
జరత్కారుర్గతః స్వర్గే సహితః స్వైః పితామహైః ।
ఆస్తీకం చ సుతం ప్రాప్య ధర్మే చానుత్తమం మునిః ॥ 10
జరత్కారుః సుమహతా కాలేన స్వర్గమేయివాన్ ।
ఏతదాఖ్యానమాస్తీకం యథావత్ కథితం మయా ।
ప్రబ్రూహి భృగుశార్దూల కిమన్యత్ కథయామి తే ॥ 11
బ్రాహ్మణోత్తమా! ఆ ఆస్తీకుడు భృగుమహర్షి కుమారుడైన చ్యవనునికడ వేదవేదాంగాలను అభ్యసించాడు. అనేక వ్రతాలు, యజ్ఞయాగాదులు చేసి దేవతల్ని, పితృదేవతల్ని ఎంతగానో సంతోషపరచాడు. తరువాత ఆస్తీకుడనే కొడుకును కని ఉత్తమ ధర్మాచరణం చేసి జరత్కారుడు చాలాకాలానికి స్వర్గం చేరాడు. ఇది ఆస్తీకుని చరిత్ర. ఉన్నదంతా నీకు చెప్పాను. భార్గవోత్తమా! ఇంకా నేను నీకు ఏమి చెప్పాలో చెప్పు. (8-11)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పాణాం మాతృశాపప్రస్తావే పంచదశోఽధ్యాయః ॥ 15 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పముల మాతృశాప ప్రస్తావన అను పదునైదవ అధ్యాయము. (15)