17. పదునేడవ అధ్యాయము
అమృత మథనము
సూత ఉవాచ
ఏతస్మిన్నేవ కాలే తు భగిన్యౌ తే తపోధన ।
అపశ్యతాం సమాయాతే ఉచ్చైఃశ్రవసమంతికాత్ ॥ 1
యం తం దేవగణాః సర్వే హృష్టరూపమపూజయన్ ।
మథ్యమానేఽమృతం జ్ఞాతమ్ అశ్వరత్నమనుత్తమమ్ ॥ 2
అమోఘబలమశ్వానామ్ ఉత్తమం జగతాం వరమ్ ।
శ్రీమంతమజరం దివ్యం సర్వలక్షణపూజితమ్ ॥ 3
సూతుడు శౌనకాదులకు చెప్పాడు. ఒకనాడు ఆ కద్రూవినతలు సముద్రతీరానికి విహారం కోసం వెళ్లినపుడు ఉచ్చైఃశ్రవమనే గుఱ్ఱాన్ని చూశారు. అది దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మథిస్తున్నపుడు పుట్టింది. దాన్ని వారందరూ ఎంతో గొప్పగా పూజించారు. ఆ అశ్వరాజం అమోఘమయిన బలం కలిగి సర్వశుభలక్షణాలతో సుందరంగా ఉంది. (1-3)
శౌనక ఉవాచ
కథం తదమృతం దేవైః మథితం క్వ చ శంస మే ।
యత్ర జజ్ఞే మహావీర్యః సోఽశ్వరాజో మహాద్యుతిః ॥ 4
అపుడు శౌనకుడు సూతునితో "దేవతలు అమృత సంపాదనకై పాలసముద్రాన్ని ఎట్లా మథించారు? ఆ అశ్వరాజం ఎలా వచ్చింది? దీన్ని సవిస్తరంగా చెప్పు" అని అడిగాడు. (4)
సౌతి రువాచ
జ్వలంతమచలం మేరుం తేజోరాశిమనుత్తమమ్ ।
ఆక్షిపంతం ప్రభం భానోః సశృంగైః కాంచనోజ్జ్వలైః ॥ 5
కనకాభరణం చిత్రం దేవగంధర్వసేవితమ్ ।
అప్రమేయమనాధృష్యమ్ అధర్మబహుళైర్జనైః ॥ 6
అపుడు సౌతి ఆ కథను చెపుతున్నాడు. శౌనకా! మేరువు అనే ప్రసిద్ధపర్వతం ఒకటి ఉంది. అది గొప్ప తేజోరాశి. దాని బంగారు శిఖరాలు సూర్యకాంతి కంటె కూడా మిక్కిలి ప్రకాశవంతంగా ఉంటాయి. ఆ బంగారుపర్వతంపై దేవతలు, గంధర్వులు నివాసం ఉంటారు. ఆధర్మపరులైన జనులకు అది భావింపరానిది, ఎక్కరానిది. (5,6)
వ్యాలైరవారితం ఘోరైః దివ్యౌషధివిదీపితమ్ ।
నాకమావృత్య తిష్ఠంతమ్ ఉచ్ఛ్రయేణ మహాగిరిమ్ ॥ 7
అగమ్యం మనసాప్యన్యైః నదీవృక్ష సమన్వితమ్ ।
నానాపతగసంఘైశ్చ నాదితం సుమనోహరైః ॥ 8
అక్కడ భయంకర సర్పాలు, దివ్య ఔషధాలు ఉన్నాయి. ఆ మహాపర్వతం తన శిఖరాలతో స్వర్గాన్నే ఆక్రమించినట్లున్నది. మహానదులతోను, వృక్షాలతోను, అనేక పక్షుల కలకల ధ్వనులతోను కూడిన ఆ పర్వతాన్ని అందరూ చేరలేరు. (7,8)
తస్య శృంగముపారుహ్య బహురత్నాచితం శుభమ్ ।
అనంతకల్పముద్విద్దం సురాః సర్వే మహౌజసః ॥ 9
తే మంత్రయుతుమారబ్ధాః తత్రాసీనా దివౌకసః ।
అమృతాయ సమాగమ్య తపోనియమసంయుతాః ॥ 10
తత్ర నారాయణో దేవః బ్రహ్మాణమిదమబ్రవీత్ ।
చింతయత్సు సురేష్వేవం మంత్రయత్సు చ సర్వశః ॥ 11
దేవైరసురసంఘైశ్చ మథ్యతాం కలశోదధిః ।
భవిష్యత్యమృతం తత్ర మథ్యమానే మహోదధౌ ॥ 12
ఆకాశం వలె ఎత్తయిన ఆ పర్వతశిఖరం అనేకరత్నాలతో ప్రకాశిస్తోంది. అక్కడ తపోనియమాలు కల దేవతలందరూ చేరి అమృతం పొందడానికి ఉపాయం ఏమిటా? అని ఆలోచింపసాగారు. అపుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మతో "మీరూ, దానవులూ పాలసముద్రాన్ని చిలకండి. ఆ మహాసముద్రం నుండి అమృతం ఉధ్బవిస్తుంది. (9-12)
సర్వౌషధీః సమావాప్య సర్వరత్నాని చైవ హ ।
మంథధ్వముదధిం దేవాః వేత్స్యధ్వమమృతం తతః ॥ 13
దేవతలారా! ఆ సముద్రంలో ముందు సకల ఔషధాల్ని, అన్ని రకాల రత్నాలనూ పొంది ఇంకా మథించండి. అపుడు అమృతం వస్తుంది. (13)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి అమృతమంథనే సప్తదశోఽధ్యాయః ॥ 17 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున అమృతమథనము అను పదునేడవ అధ్యాయము. (17)