23. ఇరువది మూడవ అధ్యాయము

వినత కద్రువకు దాసి యగుట. గరుడుని పుట్టుక.

సౌతిరువాచ
తం సముద్రమతిక్రమ్య కద్రూ వినతయా సహ ।
న్యపతత్ తురగాభ్యాశే నాచిరాదివ శీఘ్రగా ॥ 1
తతస్తేతం హయశ్రేష్ఠం దదృశాతే మహాజవమ్ ।
శశాంకకిరణప్రఖ్యం కాలవాలముభే తదా ॥ 2
అనంతరం ఉత్సాహవంతురాలైన కద్రువ (తానే విజయం పొందుతాననే నిశ్చయంతో) వినతతో కూడా ఉచ్చైఃశ్రవ సమీపాన్ని చేరింది. చంద్రకిరణాలవలె తెల్లగా ఉన్న ఆ గుర్రం యొక్క తోక నల్లగా ఉన్నట్లు ఇద్దరూ చూశారు. (1,2)
నిశమ్య చ బహూన్ వాలాన్ కృష్ణాన్ పుచ్ఛసమాశ్రితామ్ ।
విషణ్ణరూపాం వినతాం కద్రూర్దాస్యే న్యయోజయత్ ॥ 3
కృష్ణసర్పాలతో ఆ గుఱ్ఱం యొక్క తోక నల్లగా ఉందని గ్రహించి విచారంతో ఉన్న వినతను కద్రువ దాస్యంలో నియోగించింది. (3)
తతః సా వినతా తస్మిన్ పణితేన పరాజితా ।
అభవద్ దుఃఖసంతప్తా దాసీభావం సమాస్థితా ॥ 4
అలా పందెంలో ఓడిపోయిన వినత తన సవతికి దాసిగా ఉండాల్సి వస్తున్నదని దుఃఖించింది. (4)
ఏతస్మిన్నంతరే చాపి గరుడః కాల ఆగతే ।
వినా మాత్రా మహాతేజాః విదార్యాండమజాయత ॥ 5
ఇలా దాసిగా కద్రువకు వినత సేవ చేస్తూండగా గరుత్మంతుడు పుట్టే సమయం సమీపించింది. తల్లియైన వినత సహాయం అక్కర లేకుండానే అండాన్ని చీల్చుకొని గరుత్మంతుడు పుట్టాడు. (5)
మహాసత్త్వబలోపేతః సర్వా విద్యోతయన్ దిశః ।
కామరూపః కామగమః కామవీర్యో విహంగమః ॥ 6
ఆ పక్షీంద్రుడు మహాబలసంపన్నుడు. సాహసపరాక్రమాలు కలిగిన వాడు. ఏ రూపం కావాలన్నా పొందగలడు. ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లగలడు. తన దివ్య తేజస్సుతో దిక్కుల్ని అన్నింటిని ఎంతో ప్రకాశవంతంగా చేస్తున్నాడు. (6)
అగ్నిరాశిరివోద్భాసన్ సమిద్ధోఽతిభయంకరః ।
విద్యుద్విస్పష్టంగాక్షః యుగాంతాగ్ని సమప్రభః ॥ 7
ఆ గరుడుడు మూర్తీభవించిన అగ్నిరాశిలా ప్రకాశిస్తున్నాడు. మెఱుపు తీగ వంటి పచ్చని కళ్లతో ప్రళయకాలంలోని అగ్నిహోత్రుని లాగ తేజోమూర్తియై ఉన్నాడు. (7)
ప్రవృద్ధః సహసా పక్షీ మహాకాయో నభోగతః ।
ఘోరో ఘోరస్వనో రౌద్రః వహ్నిరౌర్వ ఇవాపరః ॥
భయంకరాకారుడు, భయంకరమైన కంఠధ్వని కలవాడు, ఇతడే బడబాగ్ని అన్నట్లుగా ఉన్న ఆ పక్షీంద్రుడు పుట్టిన వెంటనే ఆకాశానికి ఎగిరి పోయాడు. (8)
తం దృష్ట్వా శరణం జగ్ముః దేవాః సర్వే విభావసుమ్ ।
ప్రణిపత్యాబ్రువంశ్చైనామ్ ఆసీనం విశ్వరూపిణమ్ ॥ 9
అలా ఎగిరి వస్తున్న ఆ గరుత్మంతుని చూసి దేవతలందరూ అగ్నిహోత్రుని శరణుకోరి, నమస్కరించి ఆ మహానుభావుని ఇలా ప్రార్థిస్తున్నారు. (9)
అగ్నే మా త్వం ప్రవర్ధిష్ఠాః కచ్చిన్నో న దిధక్షసి ।
అసౌ హి రాశిః సుమహాన్ సమిద్ధస్తవ సర్పతి ॥ 10
అగ్నిహోత్రుడా! ఇంతకుమునుపు నీవు ఎప్పుడూ ఇలా ప్రజ్వలిస్తూ అపకారం చేయలేదుకదా! ఇపుడు ఇలా ప్రజ్వలిస్తూ ఎందుకు విజృంభిస్తున్నావు? అని అడిగారు. (10)
అగ్నిరువాచ
నైతదేవం యథా యూయం మన్యధ్వమసురార్దనాః ।
గరుడో బలవానేషః మమ తుల్యశ్చ తేజసా ॥ 11
అగ్ని ఇలా అన్నాడు. దేవతలారా! మీరు అలా భావించకండి. మీరు అనుకొన్నట్లు ఆ తేజఃపుంజం నేను కాదు. నా తేజస్సుతో సమానమైన వాడు. మహాబలవంతుడు. గరుత్మంతుడు. అతడు వినతాకుమారుడు. (11)
జాతః పరమతేజస్వీ వినతానందవర్ధనః ।
తేజోరాశిమిమం దృష్ట్వా యుష్మాన్ మోహః సమావిశత్ ॥ 12
తల్లియైన వినతకు ఆనందం కలిగించే విధంగా పరమతేజస్వియైన కుమారుడు జన్మించాడు. ఆ తేజోమూర్తిని చూసి మీరు భ్రమపడ్డారు. (12)
నాగక్షయకరశ్చైవ కాశ్యపేయో మహాబలః ।
దేవానాం చ హితే యుక్తః త్వహితో దైత్యరక్షసామ్ ॥ 13
అతడు కశ్యప ప్రజాపతి కుమారుడు, మహాబలవంతుడు. సర్పాల బాధనుండి రక్షించడానికి వరప్రసాదంగా జన్మించాడు. దేవతలందరికి హితుడు, రాక్షసులకు శత్రువు. (13)
న భీః కార్యా కథం చాత్ర పశ్యధ్వం సహితా మమ ।
ఏవముక్తాస్తదా గత్వా గరుడం వాగ్భిరస్తువన్ ॥ 14
తే దూరాదభ్యుపేత్యైనం దేవాః సర్షిగణాస్తదా ।
"ఈ సందర్భంలో మీరు భయపడవలసిన పనిలేదు." అని అగ్నిహోత్రుడు తనతో కూడి ఆ మహనీయుని దర్శింపుమని కోరాడు. ఆ మాటలకు దేవతలు, ఋషులు సంతోషించి దూరంగా ఉండే ఆ గరుత్మంతుని చూచి ఇట్లా స్తుతించారు. (14 1/2)
దేవా ఊచుః
త్వం ఋషిస్త్వం మహాభాగః త్వం దేవః పతగేశ్వరః ॥ 15
దేవతలు ఈ విధంగా ఆ గరుడుని ప్రార్థిస్తున్నారు. "పక్షిరాజా! నీవు మహర్షివి. మంత్ర ద్రష్టవు. నీవు దేవుడవు. పక్షిరాజువు. (15)
త్వం ప్రభుస్తపనః సూర్యః పరమేష్ఠీ ప్రజాపతిః ।
త్వమింద్రస్త్వం హయముఖః త్వం శర్వస్త్వం జగత్పతిః ॥ 16
నీవే మాకు ప్రభువు, నీవే సూర్యుడవు, నీవే బ్రహ్మవు, ప్రజాపతివి. నీవే అగ్నివి, ఇంద్రుడవు, హయగ్రీవుడవు, శర్వుడవు, లోక రక్షకుడవు. (16)
వి: సం: ఇచట శరః అని పాఠము - త్రిపుర సంహారసమయంలో మహాదేవునకు శరమయిన విష్ణుమూర్తివి. (నీల)
త్వం ముఖం పద్మజో విప్రః త్వమగ్నిః పవనస్తథా ।
త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుః సురసత్తమః ॥ 17
నీవు పరమాత్ముని యొక్క ముఖస్వరూపుడవైన బ్రాహ్మణుడవు. పద్మజుడైన బ్రహ్మవు. అగ్నివి, వాయువువు. నీవే ధాతవు. విధాతవు. నీవు విష్ణు స్వరూపుడవే. (17)
వి: సం: విప్రః = విజ్ఞానం కలవాడు (నీల)
త్వం మహానభిభూః శశ్వత్ అమృతం త్వం మహద్ యశః ।
త్వం ప్రభాస్త్వమభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమమ్ ॥ 18
నీవు మహత్తువు-అహంకారానివి-సనాతనుడవు. మహాకీర్తివి. నీవు కాంతివి - కోరదగిన వాడవు. నీవు మా అందరికీ సర్వోత్తముడవైన రక్షకుడివి, అమృతస్వరూపుడవు. (18)
వి: సం: మహద్ యశః = నిర్గుణపరమాత్మ (నీల)
బలోర్మిమాన్ సాధురదీనసత్త్వః
సమృద్ధిమాన్ దుర్విషహస్త్వమేవ ।
త్వత్తః సృతం సర్వమహీనకీర్తే
హ్యనాగతం చోపగతం చ సర్వమ్ ॥ 19
నీవు బలసముద్రుడవు. సత్పురుషుడవు. ఔదార్యంతో కూడిన సాత్త్వికుడవు. ఐశ్వర్యశాలివి. అమిత వేగంతో సంచరించే నీకు ఎవ్వరూ సాటిరారు. అధికకీర్తిశాలీ! నీ నుండియే అంతా సృష్టింపబడింది. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీవే సుమా. (19)
త్వముత్తమః సర్వమిదం చరాచరం
గభస్తిభిర్భానురివావభాససే
సమాక్షిపన్ భానుమతః ప్రభాం ముహుః
త్వమంతకః సర్వమిదం ధ్రువాధ్రువమ్ ॥ 20
నీవు ఉత్తముడవు. నీ స్వయంప్రకాశత్వం చేత ఈ చరాచర జగత్తు నంతటినీ కాంతివంతంగా చేస్తున్నావు. సూర్యకాంతిని కూడా తిరస్కరింపజేయగల శక్తిమంతుడవు. క్షర - అక్షర రూపమైన జగత్తునంతటినీ అంతం చేయగలవాడవు. (20)
దివాకరః పరికుపితో యథా దహేత్
ప్రజాస్తథా దహసి హుతాశనప్రభ ।
భయంకరః ప్రలయ ఇవాగ్నిరుత్థితో
వినాశయన్ యుగపరివర్తనాంతకృత్ ॥ 21
అగ్నితో సమానంగా ప్రకాశించే పక్షిరాజా! సూర్యుడు కోపిస్తే ఎలా దహించగలడో అలాగే నీవు కూడా దహించగల శక్తి కల్గిన వాడవు. నీవు కాలాంతకుడైన యముడిలా ప్రళయకాలంలో సర్వాన్ని నాశనం చేయగలవాడవు. (21)
ఖగేశ్వరం శరణముపాగతా వయం
మహౌజసం జ్వలనసమానవర్చసమ్ ।
తడిత్ప్రభం వితిమిరమభ్రగోచరం
మహాబలం గరుడము పేత్య ఖేచరమ్ ॥ 22
నీవు సమస్త పక్షి లోకానికే కాదు, జీవకోటికి అందరికీ అధిపతివి. అగ్నితో సమానంగా ప్రకాశించే తేజోవంతుడవు. ఆకాశంలోని మెరుపు తీగలాగా ప్రకాశించేవాడివి. నీవు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుతావు. మహా బలాఢ్యుడవైన నిన్ను మేము శరణు కోరుతున్నాము. (22)
పరావరం వరదమజయ్యవిక్రమం
తవౌజసా సర్వమిదం ప్రతాపితమ్ ।
జగత్ప్రభో తప్తసువర్ణవర్చసా
త్వం పాహి సర్వాంశ్చ సురాన్ మహాత్మనః ॥ 23
జగదీశ్వరా! నీవే కార్య కారణరూపుడవు. నీ పరాక్రమం అజేయం. నీ తేజస్సుతో ఈ లోకమంతా వేడెక్కి మేల్కొంటుంది. బంగారంతో సమానమైన నీ దివ్యతేజస్సుతో దేవతల్ని, మహాత్ముల్ని అందరినీ రక్షించు. (23)
భయాన్వితా నభసి విమానగామినో
విమానితా విపథగతిం ప్రయాంతి తే ।
ఋషేః సుతస్త్వమసి దయావతః ప్రభో
మహాత్మనః ఖగవర కశ్యపస్య హ ॥ 24
పక్షిరాజా! విమానంలో చరించే దేవతలందరు నీ దివ్యతేజస్సును చూచి భయపడి అపమార్గంలో పోతున్నారు. నీవు పరమదయాళువైన కశ్యపమహర్షి కుమారుడవుగదా! (24)
స మా క్రుధః జగతో దయాం పరాం
త్వమీశ్వరః ప్రశమముపైహి పాహి నః ।
మహాశనిస్ఫురిత సమస్వనేన
దిశోఽంబరం త్రిదివమియం చ మేదినీ ॥ 25
చలంతి నః ఖగ హృదయాని చానిశం
నిగృహ్య తాం వపురిదమగ్నిసంనిభమ్ ।
తవ ద్యుతిం కుపితకృతాంతసంనిభాం
నిశమ్య నశ్చలతి మనోఽవ్యవస్థితమ్ ॥ 26
ప్రభూ! నీవు కోపించవద్దు. శాంతించు. ఈ సర్వజగత్తుపై దయను చూపించు. నీవు ఈశ్వరుడవు కదా! మా అందరికీ రక్షకుడుగా ఉండు. పిడుగుపాటు లాంటి నీ గర్జనధ్వనితో ఆకాశం, దిక్కులు, భూమి అంతా దద్దరిల్లుతోంది. మా హృదయాలన్నీ నిరంతరం కదలిపోతున్నాయి. ఖగశ్రేష్ఠా! అగ్ని సమానమైన నీరూపాన్ని ఉపసంహరించు. కుపితుడైన యమధర్మరాజులా ఉన్న నీ ఉగ్రస్వరూపాన్ని ఉపసంహరించు. ఆ రూపాన్ని చూస్తూంటే మా మనస్సులు చలిస్తున్నాయి. మా ప్రార్థనను మన్నించి ప్రసన్నుడవు కమ్ము. మాకోసం నీవు కల్యాణస్వరూపుడవు కమ్ము. మాకు సుఖప్రదాతవుగా ఉండు". (25,26)
ఏవం స్తుతః సుపర్ణస్తు దేవైః సర్షిగణైస్తదా ।
తేజసః ప్రతిసంహారమ్ ఆత్మనః స చకార హ ॥ 27
ఇలా ఋషులు దేవతలు అందరూ ఆ గరుత్మంతుని స్తుతించారు. ఉత్తమోత్తముడైన ఆ పక్షీంద్రుడు వారి మొర విని ఆ భయంకరరూపాన్ని దివ్యతేజస్సును ఉపసంహరించుకొన్నాడు. (27)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే త్రయోవింశోఽధ్యాయః ॥ 23 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణో పాఖ్యానమను ఇరువది మూడవ అధ్యాయము. (23)