26. ఇరువది ఆరవ అధ్యాయము

ఇంద్రుడు వర్షమును కురిపించి సర్పాలను తేర్చుట.

సౌతిరువాచ
ఏవం స్తుతస్తదా కద్వ్రా భగవాన్ హరివాహనః ।
నీలజీమూతసంఘాతైః సర్వమంబరమావృణోత్ ॥ 1
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు. నాగుల తల్లి అయిన కద్రువ ఆ విధంగా ఇంద్రుని స్తుతించిన తరువాత అతడు సంతోషించి, ఆకాశమంతా నల్లటి మబ్బులతో ఆవరింప జేశాడు. (1)
మేఘానాజ్ఞాపయామాస వర్షధ్వమమృతం శుభమ్ ।
తే మేఘా ముముచుస్తోయం ప్రభూతం విద్యుదుజ్జ్వలాః ॥ 2
ఆ మేఘాలను వర్షింపుమని ఆజ్ఞాపించాడు. అతని ఆజ్ఞ ప్రకారం మేఘాలు ఆవరించి, వర్షించాయి. (2)
పరస్పరమివాత్యర్థం గర్జంతః సతతం దివి ।
సంవర్తితమివాకాశం జలదైః సుమహాద్భుతైః ॥ 3
సృజద్భిరతులం తోయమ్ అజస్రం సుమహారవైః ।
సంప్రనృత్తమివాకాశం ధారోర్మిభిరనేకశః ॥ 4
ఆ మేఘాలు ఆకాశం అంతా దద్దరిల్లేటట్లు గర్జిస్తూ ఉరుములతో మెఱుపులతో కుండపోతగా వర్షించాయి. ఎటు చూసినా నీరే. ఆకాశమనే సముద్రం వర్షధారలనే కెరటాలతో నృత్యం చేస్తున్నట్లు ఉంది. (3,4)
మేఘస్తనితనిర్ఘోషైః విద్యుత్పవనకంపితైః ।
తైర్మేఘైః సతతాసారం వర్షద్భిరనిశం తదా ॥ 5
నష్టచంద్రార్కకిరణమ్ అంబరం సమపద్యత ।
నాగానాముత్తమో హర్షః తథా వర్షతి వాసవే ॥ 6
మేఘాలు భయంకరంగా గర్జిస్తూ, మెఱుపులకూ, గాలివేగానికి కదుల్తూ నిరంతరం వర్షిస్తూనే ఉన్నాయి. సూర్య చంద్రుల కిరణాలు కనిపించకుండా వర్షించడం వల్ల నాగులన్నిటికి తాపం శమించి సంతోషం కలిగింది. (5,6)
ఆపూర్యత మహీ చాపి సలిలేన సమంతతః ।
రసాతలమనుప్రాప్తం శీతలం విమలం జలమ్ ॥ 7
భూమి అంతా జలమయం అయిపోయింది. చల్లని ఆ నీరు పాతాళందాకా వ్యాపించింది. (7)
తదా భూరభవచ్ఛన్నా జలోర్మిభిరనేకశః ।
రామణీయకమాగచ్ఛన్ మాత్రా సహ భుజంగమాః ॥ 8
ఆ సమయంలో భూమి అంతా అనేక జలతరంగాలతో కప్పబడింది. ఈ విధమైన వర్షానికి సంతోషించిన సర్పాలు తల్లితో సహా రమణీయమైన నాగద్వీపాన్ని చేరాయి. (8)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణాఖ్యానే షడ్వింశతితమోఽధ్యాయః ॥ 26 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమను ఇరువది ఆరవ అధ్యాయము. (26)