45. నలువది అయిదవ అధ్యాయము

జరత్కారుడు పితరులను దర్శించుట.

సౌతిరువాచ
ఏతస్మిన్నేవ కాలే తు జరత్కారుర్మహాతపాః ।
చచార పృథివీం కృత్స్నాం యత్ర సాయంగృహో మునిః ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. జనమేజయుడు రాజ్యం పరిపాలిస్తున్న కాలంలో మహాతపోధనుడయిన జరత్కారుడు దేశం అంతా సంచారం చేస్తున్నాడు. ఏ గ్రామంలో లేదా ఏ స్థానంలో ఉన్నపుడు సాయంకాలం అవుతుందో అపుడు అక్కడే ఉండిపోతాడు. ఇది ఆ మహామునీంద్రుని నియమం. (1)
చరన్ దీక్షాం మహాతేజాః దుశ్చరామకృతాత్మభిః ।
తీర్థేష్వాప్లవనం కృత్వా పుణ్యేషు విచచార హ ॥ 2
ఆ ముని అవలంబిస్తున్న ఆ కఠోరనియమాన్ని అకృతాత్ములు ఆచరింపలేరు. పుణ్యతీర్థాలలో పవిత్రస్నానాలు చేస్తూ దేశసంచారాన్ని కొనసాగిస్తున్నాడు. (2)
వాయుభక్షో నిరాహారః శుష్యన్నహరహర్మునిః ।
స దదర్శ పితౄన్ గర్తే లంబమానానధోముఖాన్ ॥ 3
ఎకతంత్వవశిష్టం వై వీరణస్తంబమాశ్రితాన్ ।
తం తంతు చ శనైరాఖుమ్ ఆదదానం బిలేశయమ్ ॥ 4
ఆ ముని వాయువును మాత్రమే భక్షిస్తూ రోజురోజుకీ శరీరాన్ని శుష్కింపచేస్తున్నాడు. ఒకనాడు ఒక గుంటలో అవురుగంటును పట్టుకొని తలక్రిందులుగ వ్రేలాడుతున్న తన పితరులను చూశాడు. వేళ్లన్నీ ఎలుకలు కొరికివేశాయి. ఒకవేరు మాత్రమే ఉన్నది. ఈ వేరును కూడా అక్కడ కన్నంలో ఉన్న ఎలుక మాటిమాటికి కొరుకుతున్నది. ఇట్టి వేరును పట్టుకొని వ్రేలాడుతూ కృశించిన తన పితరుల్ని జరత్కారుడు చూశాడు. (3,4)
నిరాహారాన్ కృశాన్ దీనాన్ గర్తే స్వత్రాణమిచ్ఛతః ।
ఉపసృత్య స తాన్ దీనాన్ దీనరూపోఽభ్యభాషత ॥ 5
ఆ పితరులు నిరాహారులై కృశాంగులై దీనంగా తమ రక్షణ కోరుతూ గుంటలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. జరత్కారుడు వారి దయనీయ పరిస్థితిని చూసి, దీనవదనంతో వారితో ఈ విధంగా అన్నాడు. (5)
కే భవంతోఽ వలంబంతే వీరణస్తంబమాశ్రితాః ।
దుర్బలం ఖాదితైర్మూలైః ఆఖునా బిలవాసినా ॥ 6
"అయ్యా! మీరెవరు? ఎందుకు ఈ విధంగా వ్రేలాడుతున్నారు? ఈ వేరును గూడా ఈ బిలంలో ఉంటున్న ఎలుక తినివేస్తున్నది గదా! ఈ వేరు చాలా బలహీనంగా ఉంది కదా! (6)
వీరనస్తంబకే మూలం యదప్యేకమిహ స్థితమ్ ।
తదప్యయం శనైరాఖుః ఆదత్తే దశనైః శితైః ॥ 7
ఈ వీరణస్తంభానికి ఒక్క వేరే మిగిలి ఉంది. ఈ ఒక్క వేరును కూడా ఆ ఎలుక మెల్లగా తన పదునైన పళ్లతో కొరికేస్తోంది. (7)
ఛేత్స్యతేఽల్పావశిష్టత్వాద్ ఏతదప్యచిరాదివ ।
తతస్తు పతితారోఽత్ర గర్తే వ్యక్తమధోముఖాః ॥ 8
చాలా తక్కువ సమయంలోనే ఈ వేరు కూడా తెగిపోతుంది. అధోముఖులైన మీరు ఈ గుంటలో తప్పక పడిపోతారు గదా! (8)
తస్య మే దుఃఖముత్పన్నం దృష్ట్వా యుష్మానధోముఖాన్ ।
కృచ్ఛ్రమాపదమాపన్నాన్ ప్రియం కిం కరవాణి వః ॥ 9
తపసోఽ స్య చతుర్థేన తృతీయేనాథవా పునః ।
అర్ధేన వాపి నిస్తర్తుమ్ ఆపదం బ్రూత మా చిరమ్ ॥ 10
ఈ విధంగా అధోముఖులై దీనావస్థలోఉన్న మిమ్ము చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతున్నది. అయ్యా! మీరు చాలా కష్టదశలో ఉన్నారు. నేను మీకు ఏమిచేస్తే సంతోషం కలుగుతుంది? నా తపస్సులో నాల్గవవంతు లేదా మూడవవంతు లేదా సగభాగం ఇచ్చి అయినా మీకష్టాన్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఆజ్ఞాపించండి. (9,10)
అథవాపి సమగ్రేన తరంతు తపసా మమ ।
భవంతః సర్వ ఏవేహ కాంఅమేవం విధీయతామ్ ॥ 11
లేదా నా సంపూర్ణ తపఃఫలాన్ని ధారపోసి మిమ్ము ఆపద నుండి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను ఏ విధంగా సహాయపడాలో ఆజ్ఞాపించండి." (11)
పితర ఊచుః
వృద్ధో భవాన్ బ్రహ్మచారీ యో నస్త్రాతుమిహేచ్ఛసి ।
న తు విప్రాగ్ర్య తపసా శక్యతే తద్ వ్యపోహితుమ్ ॥ 12
పితరులు అన్నారు. "బ్రాహ్మణోత్తమా! నీవు వృద్ధుడవైన బ్రహ్మచారివి. నీవు మమ్మల్ని రక్షించాలని కోరుకొంటున్నావు. కాని మా కష్టం తపస్సు వల్ల తీరేది కాదు. (12)
అస్తి నస్తాత తపనః ఫలం ప్రవదతాం వర ।
సంతానప్రక్షయాద్ బ్రహ్మన్ పతామ నిరయేఽశూచౌ ॥ 13
నాయనా! మేము చేసిన తపస్సు యొక్క పుణ్యఫలం మా దగ్గర కుడా ఉంది. మాకు వంశపారంపర్యంగా వచ్చే సంతానం క్షీణిస్తుండటం వల్ల మాకు ఇటువంటి అపవిత్రమైన నరకం కలుగబోతున్నది. (13)
సంతానం హి పరో ధర్మః ఏవమాహ పితామహః ।
లంబతామిహ నస్తాత న్ జ్ఞానం ప్రతిభాతి వై ॥ 4
సంతానాన్ని పొందడమే గొప్ప ధర్మం అని బ్రహ్మదేవుడే చెప్పాడు. మా సంతానం క్షీణిస్తోంది. ఈ విధంగా వ్రేలాడుతున్న మాకు ఏమీ తోచటం లేదు.. (14)
యేన త్వా నాభిజానీమః లోకే విఖ్యాతపౌరుషమ్ ।
వృద్ధో భవాన్ మహాభాగః యొ నః శోచ్యాన్ సుదుఃఖితాన్ ॥ 15
శోచతే చైవ కారుణ్యాత్ శృణు యే వై నయం ద్విజ ।
యాయావరా నామ వయమ్ ఋషయః సంశితవ్రతాః ॥ 16
లోకంలో ప్రసిద్ధికెక్కిన మహాపురుషులైన మీవంటి మహానుభావుల్ని గుర్తించలేకపోయాం. మహాభాగా! నీవు వృద్ధుడవు మహాపురుషుడవు. ఎంతో కష్టంలో బాధపడుతున్న మమ్ము చూసి నీవు దుఃఖించావు. నాయనా! మేము అత్యంత కఠినవ్రతాన్ని ఆచరిస్తున్న యాయావరులు అనే మహర్షులం. (15,16)
లోకాత్ పుణ్యాదిహ భ్రష్టాః సంతానప్రక్షయాన్మునే ।
ప్రణష్టం నస్తపస్తీవ్రం న హి నస్తంతురస్తి వై ॥ 17
వంశపారంపర్యంగా సంతానం నశిస్తుండటం వలన మేము పుణ్యలోకం నుండి భ్రష్టులమయ్యాము. మేము చేసిన తీవ్రమైన తపస్సంతా నష్టమైపోయింది. ఇపుడు మా వంశంలో ఒక్క సంతానం కూడా లేదు. (17)
అస్తి త్వేకోఽద్య నస్తంతుః సోఽపి నాస్తి యథా తథా ।
మందభాగ్యోఽల్పభాగ్యానాం తప ఏకం సమాస్థితః ॥ 18
ఇప్పుడు మా వంశపరంపరలో ఒకే ఒక్కవేరు అనగా ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు. మా దురదృష్టం వల్ల ఆ మందభాగ్యుడు కూడా వివాహం చేసుకోకుండా తపోనిష్ఠలో ఉన్నాడు. (18)
జరత్కారురితి ఖ్యాతః వేదవేదాంగపారగః ।
నియతాత్మా మహాత్మాచ సువ్రతః సుమహాతపాః ॥ 19
అతడు వేదవేదాంగపారగుడై, నియమనిష్ఠలతో సువ్రతుడై, మహాతపోధనుడై, జరత్కారుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినాడు. (19)
తేన స్మ తపసో లోభాత్ కృచ్ఛ్రమాపాదితా వయమ్ ।
న తస్య భార్యా పుత్రో వా బాంధవో వాస్తి కశ్చన ॥ 20
అతడు తపస్సు చేసుకోవడమే ఇష్టపడుతూ మమ్మల్ని ఈ కష్టంలో పడవేశాడు. అతడికి భార్యగాని, పుత్రులుగాని, బంధువులుగాని ఎవ్వరూ లేరు. (20)
తస్మాల్లంబామహే గర్తే నష్టసంజ్ఞా హ్యనాథవత్ ।
స వక్తవ్యస్త్వయా దృష్టః హ్యస్మాకం నాథవత్తథా ॥ 21
అందుచేత మేమంతా బుద్ధిహీనులమై అనాథల్లాగ ఈ గుంటలో వ్రేలాడుతున్నాము. అతడు నీకు కనిపిస్తే అనాథులమైన మమ్మల్ని సనాథులుగా చేయడానికి అతనికి ఈ విధంగా చెప్పు. (21)
పితరస్తేఽ వలంబంతే గర్తే దీనా అధోముఖాః ।
సాధు దారాన్ కురుష్వేతి ప్రజాముత్పాదయేతి చ ॥ 22
"నీ పితరులు దీనాతిదీనులై తలక్రిందులుగా గుంటలో వేలాడుతున్నారు. నీవు సముచితరీతిలో ఒక కన్యను వివాహం చేసుకొని సంతానాన్ని పొందు." అని. (22)
కులతంతుర్హి నః శిష్టః త్వమేవైకస్తపోధన ।
యస్త్వం పశ్యసి నో బ్రహ్మన్ వీరణస్తంబమాశ్రితాన్ ॥ 23
ఏషోఽస్మాకం కులస్తంబః ఆస్తే స్వకులవర్ధనః ।
యాని పశ్యసి వై బ్రహ్మన్ మూలానీహాస్య వీరుధః ॥ 24
ఏతే నస్తంతవస్తాత కాలేన పరిభక్షితాః ।
యత్వేతత్ పశ్యసి బ్రహ్మన్ మూలమస్త్యార్ధభక్షితమ్ ॥ 25
యత్ర లంబామహే గర్తే సోఽప్యేకస్తప ఆస్థితః ।
యమాఖుం పశ్యసి బ్రహ్మన్ కాల ఏష మహాబలః ॥ 26
తపోధనా! మా వంశతంతువులో ఒకటే మిగిలింది. అది నీవే. నీవు చూస్తున్న తంతువులన్నీ కాలునిచేత భక్షింపబడుతున్నాయి. మిగిలిన ఒక తంతువూ కూడ సగం కాలుడు కొరికేశాడు. నీవు చూసిన ఎలుక ఎవరో కాదు. మహాబలుడయిన కాలుడు. (23-26)
స తుం తపోరతం మందం శనైః క్షపయతే తుదన్ ।
జరత్కారుం తపోలబ్ధం మందాత్మానమచేతసమ్ ॥ 27
తపస్వి, మూర్ఖుడైన ఆ జరత్కారుడు తపస్సే గొప్పదిగా భావిస్తూ మనసు లేకుండా మందబుద్ధితో ఉంటే ఈ ఒక్క వేరు కూడా తెగిపోతుంది. (27)
న హి నస్తద్ తపస్తస్య తారయిష్యతి సత్తమ ।
భిన్నమూలాన్ పరిభ్రష్టాన్ కాలోపహతచేతసః ॥ 28
అధఃప్రవిష్టాన్ పశ్యాస్మాన్ యథా దుష్కృతినస్తథా ।
అస్మాసు పతితేష్వత్ర సహ సర్వైః సబాంధవైః ॥ 29
భిన్నం కాలేన సోఽప్యత్ర గంతా వై నరకం తతః ।
తపో వాప్యథనా యజ్ఞః యచ్చాన్యత్ పావనం మహత్ ॥ 30
తత్ సర్వమపరం తాత న సంతత్యా సమం మతమ్ ।
స తాత దృష్ట్వా బ్రూయాస్తం జరత్కారుం తపోధన ॥ 31
యథాదృష్టమిదం చాత్ర త్వయాఖ్యేయమశేషతః ।
యథా దారాన్ ప్రకుర్యాత్ స పుత్రానుత్పాదయేద్ యథా ॥ 32
తథా బ్రహ్మంస్త్వయా వాచ్యః సోఽస్మాకం నాథవత్తథా ।
బాంధవానాం హితస్యేహ యథా చాత్మకులం తథా ॥ 33
కస్త్వం బంధుమివాస్మాకమ్ అనుశోచసి సత్తమ ।
శ్రోతుమిచ్ఛామ సర్వేషాం కో భవానిహ తిష్ఠతి ॥ 34
ఆ జరత్కారుడు చేసే తీవ్ర తపస్సు మా ఈ కష్టాన్ని పోగొట్టలేదు. మేము వేలాడుతున్న వేరు కాలునివల్ల తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. పాపం చేసిన వారివలె గుంటలో ప్రవేశించిన మమ్మల్ని చుడు. మేము పడిపోతే బంధువులందరితో కలిసిన మమ్ము కాలుడు నరకానికి లాక్కుపోతాడు. నాయనా! తపస్సుగాని, యజ్ఞంగాని, ఏ ఇతర సాధనంగాని అవన్నీ సంతానంతో సమానం కావు. నీవు ఆ జరత్కారుడితో ఈ విషయాలన్నీ చెప్పు, నీవు జరత్కారుని కలిస్తే ఇక్కడ చూసిన విషయలన్నీ అతనికి చెప్పు. మమ్మల్ని నీవు సనాథులుగా చెయ్యదలిస్తే ఈ మాటలన్నీ అతనికి చెప్పు. వివాహం చేసుకో, ధర్మపత్ని ద్వారా సంతానాన్ని పొందు. అని. మేము జరత్కారుని బంధువులం. నీవు కూడా మా బంధువులాగా మాకోసం దుఃఖించావు. కుమారా! నీవు ఎవరివి? పూర్తిగా తెలుసుకోవాలని అనుకొంటున్నాం. (28-34)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి జరత్కారు పితృదర్శనే పంచచత్వారింశోఽధ్యాః ॥ 45 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున జరత్కారుని పితృదర్శనము అను నలువది ఐదవ అధ్యాయము. (45)