48. నలువది యెనిమిదవ అధ్యాయము

ఆస్తీకుని జననము.

సౌతిరువాచ
గతమాత్రం తు భర్తారం జరత్కారురవేదయత్ ।
భ్రాతుః సకాశమాగత్య యాథాతథ్యం తపోధన ॥ 1
సౌతి ఇట్లన్నాడు. మునీంద్రా! భర్త తనను విడిచి వెళ్లిపోయిన తరువాత జరత్కారువు తనసోదరుడైన వాసుకి దగ్గరకు వెళ్లి తనభర్తకూ తనకూ జరిగిన సంభాషణ ఉన్నదున్నట్లు చెప్పింది. (1)
తతః స భుజగశ్రేష్ఠః శ్రుత్వా సుమహదప్రియమ్ ।
ఉవాచ భగినీం దీవాం తదా దీనతరః స్వయమ్ ॥ 2
వాసుకి ఈ అప్రియమైన విషయాన్ని విని మిక్కిలి దుఃఖించాడు. దుఃఖితురాలైన తనసోదరితో వాసుకి మరింత దీనంగా ఇలా చెపుతున్నాడు. (2)
వాసుకి రువాచ
జానాసి భద్రే యత్ కార్యం ప్రదానే కారణం చ యత్ ।
పన్నాగానాం హితార్థాయ పుత్రస్తే ప్యాత్ తతో యది ॥ 3
వాసుకి చెల్లెలితో ఇలా అన్నాడు. "సోదరీ! సర్పాలకు మహత్తరమైన ఒక కార్యం జరుగబోతున్నది. ఆ కార్యసాధనకై జరత్కారుమునితో నీకు వివాహం జరిపించాము. ఈ సంగతి నీకుగూడా తెలుసుగదా! జరత్కారుమునీంద్రుని ద్వారా నీకు జన్మించబోయే కుమారుడు సర్పజాతికి మహోపకారం చేయబోతున్నాడు. (3)
స సర్పసత్రాత్ కిల నః మోక్షయిష్యతి వీర్యవాన్ ।
ఏవం పితామహః పూర్వమ్ ఉక్తవాంస్తు సురైః సహ ॥ 4
శక్తిసంపన్నుడైన నీ కుమారుడు జనమేజయుడు చేయబోయే సర్పయాగాన్ని నివారిస్తాడు. ఈ మాట దేవతల ఎదుట బ్రహ్మదేవుడే చెప్పాడు. (4)
అప్యస్తి గర్భః సుభగః తస్మాత్ తే మునిసత్తమాత్ ।
న చేచ్ఛామ్యఫలం తస్య దారకర్మ మనీషిణః ॥ 5
కార్యం చ మమ న న్యాయ్యం ప్రష్టుం త్వాం కార్యమీదృశమ్ ।
కిం తు కార్యగరీయస్త్వాత్ తతస్త్వాహమచూచుదమ్ ॥ 6
అమ్మా! ఆ మునీంద్రునివల్ల గర్భవతివి అయ్యావా? ఆ మహాత్మునితో నీ వివాహం నిష్ఫలం కారాదు. నేను నీ సోదరుడను. పుత్రోత్పత్తి విషయం గురించి నీతో మాట్లాడటం ఉచితం కాదని నాకు తెలుసు. కాని కార్యం యొక్క ఆవశ్యకాన్ని గుర్తించి నిన్ను కొన్ని విషయాలు అడగవలసి వస్తున్నది. (5,6)
దుర్వార్యతాం విదిత్వా చ భర్తుస్తేఽతి తపస్వినః ।
నైనమన్వాగమిష్యామి కదాచిద్ధి శపేత్ స మామ్ ॥ 7
మహాతపస్వి అయిన నీ భర్తను వెళ్లిపోకుండా ఆపుచేయటం చాలా కష్టం. ఈ సంగతి నాకు తెలిసే నేను అతనిని అనుసరించలేదు. ఒకవేళ అతనిని నేను ఆపుచెయ్యడానికి సిద్ధపడితే నన్ను శపించవచ్చు. (7)
ఆచక్ష్వ భద్రే భర్తుః స్వం సర్వమేవ విచేష్టితమ్ ।
ఉద్ధరస్వ చ శల్యం మే ఘోరం హృది చిరస్థితమ్ ॥ 8
సోదరీ! నీ భర్తయొక్క చరిత్రను అంతా చెప్పు. చాలాకాలం నుండి నా హృదయంలో ముల్లుగుచ్చుకున్నట్లు బాధపడుతున్నాను. ఆ ముల్లును నీవే తీసివేయాలి." (8)
జరత్కారుస్తతో వాక్యమ్ ఇత్యుక్తా ప్రత్యభాషత ।
అశ్వాసయంతీ సంతప్తం వాసుకిం పన్నగేశ్వరమ్ ॥ 9
అన్నగారు ఈవిధంగా అడిగిన తరువాత జరత్కారువు దుఃఖపడుతున్న వాసుకిని శాంతింపచేయాలని అనుకొని ఈ విధంగా చెపుతోంది. (9)
జరత్కారురువాఛ
పృష్టో మయాపత్యహేతోః స మహాత్మా మహాతపాః ।
అస్తీత్యుత్తరముద్దిశ్య మమేదం గతవాంశ్చ సః ॥ 10
జరత్కారువు వాసుకితో అన్నది. సోదరా! నేను నా సంతానాన్ని గురించి నా పతిదేవుని అడిగాను ఆయన "ఆస్తి" అన్నాడు. (ఉన్నాడు) అని చెప్పి వెళ్లిపోయారు. (10)
స్వైరేష్వపి న తేనాహం స్మరామి వితథం వచః ।
ఉక్తపూర్వం కుతో రాజన్ సాంపరాయే స వక్ష్యతి ॥ 11
న సంతాపస్త్వయా కార్యః కార్యం ప్రతి భుజంగమే ।
ఉత్పత్స్యతి చ తే పుత్రః జ్వలనార్కసమప్రభః ॥ 12
ఇత్యుక్త్వా స హి మాం భ్రాతః గతో భర్తా తపోధనః ।
తస్మాద్ వ్యేతు పరం దుఃఖం తవేదం మనసి స్థితమ్ ॥ 13
ఆ మహానుభావుడు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ పరిహాసానికైనా అబద్ధం చెప్పలేదు. చెప్పినట్లు నాకు గుర్తుకూడా లేదు. ఈ కష్ట పరిస్థితిలో గూడా ఆ మహాతపోధనుడు అబద్ధం చెప్పవలసిన పనిలేదు. సోదరా! నా భర్త నిష్ఠాగరిష్ఠుడు. మహాతపస్వి. ఆయన నా నుండి వెళ్లిపోయేటప్పుడు ఇట్లా చెప్పాడు. "కాంతామణీ! నీ కార్యం తప్పక సిద్ధిస్తుంది. నీవు చింతించవలసిన పనిలేదు. నీ గర్భంలో అగ్నితోను, సూర్యునితోను సమానమైన తేజస్వి ఉన్నాడు." అని చెప్పి తపోవనానికి వెళ్లిపోయారు. కాబట్టి సోదరా! నీవు విచారింపవలసిన పనిలేదు." (11-13)
సౌతిరువాచ
ఏతచ్ఛ్రుత్వా స నాగేంద్రో వాసుకిః పరయా ముదా ।
ఏవమస్త్వితి తద్ వాక్యం భగిన్యాః ప్రత్యగ్ఱ్రుహ్ణత ॥ 14
ఉగ్రశ్రవుడు ఇలా అన్నాడు. "మునీంద్రా! ఆ మాటల్ని విన్న వాసుకి చాలా సంతోషించి ఆమెతో "అట్లే అగుగాక" అని అన్నాడు. జరత్కారువు కూడా అన్నగారికి తనమాట మీద నమ్మకం కలిగిందని సంతోషించింది. (14)
సాంత్వమానార్థదానైశ్చ పూజయా చానురూపయా ।
సోదర్యాం పూజయామాస స్వసారం పన్నగోత్తమః ॥ 15
పన్నగశ్రేష్ఠుడయిన వాసుకి తనసోదరికి సాంత్వన వాక్యాలతో గౌరవపురస్సరంగా ధనం మొదలైనవాటిని ఇస్తూ ఆమెకు మర్యాద చేస్తూ గౌరవిస్తున్నాడు. (15)
తతః ప్రవవృధే గర్భే మహాతేజా మహాప్రభః ।
యథా సోమో ద్విజశ్రేష్ఠ శుక్లపక్షోదితో దివి ॥ 16
బ్రాహ్మణోత్తమా! శుక్లపక్షంలోని చంద్రుడివలె ఆమె గర్భంలో మహాతేజస్వి, కాంతిమంతుడు అయిన కుమారుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. (16)
అథ కాలే తు సా బ్రహ్మన్ ప్రజజ్ఞే భుజగస్వసా ।
కుమారం దేవగర్భాభం పితృమాతృభయాపహమ్ ॥ 17
అనంతరం సమయం రాగానే వాసుకిసోదరి కుమారుని కన్నది. అతడు దేవకుమారునివలె ఉన్నాడు. అటు తల్లిపక్షాన, ఇటు తండ్రిపక్షాన ఉన్న భయాన్ని తొలగించేవాడుగా జన్మించాడు. (17)
వవృధే స తు తత్రైవ నాగరాజనివేశవే ।
వేదాంశ్చాధిజగే సాంగాన్ భార్గవాచ్చ్యవనామ్మనేః ॥ 18
ఆ బాలుడు నాగరాజైన వాసుకి భవనంలోనే పెరుగుతున్నాడు. పెద్దవాడు అయ్యాక ఆ బాలుడు భృగువంశ శ్రేష్ఠుడయిన చ్యవనమహర్షిదగ్గర వేదవేదాంగాల్ని అధ్యయనం చేశాడు. (18)
చీర్ణవ్రతో బాల ఏవ బుద్ధిసత్త్వగుణాన్వితః ।
నామ చాస్యాభవత్ ఖ్యాతం లోకేష్వాస్తీక ఇత్యుత ॥ 19
బాలుడై బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తున్నాడు. అతడు సత్వగుణసంపన్నుడై బుద్ధిమంతుడై లోకంలో ఆస్తీకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. (19)
అస్తీత్యుక్త్వా గతో యస్మాత్ పితా గర్భస్థమేవ తమ్ ।
వనం తస్మాదిదం తస్య నామాస్తీకేతి విశ్రుతమ్ ॥ 20
ఆ బాలుడు గర్భంలో ఉన్నపుడే అతని తండ్రి 'అస్తి' అని చెప్పి వెళ్లిపోయాడు కాబట్టి ఆస్తీకుడు ప్రసిద్ధ నామం ఏర్పడింది. (20)
స బాలఏవ తత్రస్థః చరన్నమితబుద్ధిమాన్ ।
గృహే పన్నగరాజస్య ప్రయత్నాత్ పరిరక్షితః ॥ 21
భగవానివ దేవేశః శూలపాణిర్హిరణ్మయః ।
వివర్ధమానః సర్వాంస్తాన్ పన్నగాసభ్యహర్షయత్ ॥ 22
బుద్ధిమంతుడయిన ఆస్తీకుడు బాల్యావస్థలో బ్రహ్మచర్యాన్ని అవలంబించి, ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆ నాగరాజు భవనంలో యత్నపూర్వకంగా రక్షింపబడుతున్నాడు. బంగారుకాంతితో సమానుడై శూలపాణి భగవంతుడు అయిన శివుడివలె దినదినాభివృద్ధి చెందుతూ నాగులందరికీ ఆనందాన్ని కల్గిస్తున్నాడు. (21,22)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ఆస్తీకోత్పత్తౌ అష్టౌచత్వారింశోఽధ్యాయః ॥ 48 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున ఆస్తీకజననము అను నలువది ఎనిమిదవ అధ్యాయము. (48)