51. ఏబది యొకటవ అధ్యాయము
జనమేజయుడు సర్పయాగము చేయుట.
సౌతిరువాచ
ఏవముక్త్వా తతః శ్రీమాన్ మంత్రిభిశ్చానుమోదితః ।
ఆరురోహ ప్రతిజ్ఞాం సః సర్పసత్రాయ పార్థివః ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. "మునీంద్రా! ఆ విధంగా పలికి, మంత్రుల ఆమోదాన్ని కూడా తీసుకొని శ్రీమంతుడైన జనమేజయమహారాజు సర్పయాగం చేస్తానని ప్రతిజ్ఞచేశాడు. (1)
బ్రహ్మన్ భరతశార్ధూలః రాజా పారిక్షితస్తదా ।
పురోహితమథాహూయ ఋత్విజో వసుధాధిపః ॥ 2
అబ్రవీద్ వాక్యసంపన్నః కార్యసంపత్కరం వచః ।
బ్రాహ్మణా! వసుధాధిపుడు, భరతవంశశ్రేష్ఠుడు అయిన జనమేజయుడు ఆ సమయంలో యాగనిమిత్తం పురోహితులను సంప్రదించాడు. ఋత్విజులను పిలిపించి కార్యసిద్ధిని గురించి వారితో ఇలా అన్నాడు. (2 1/2)
యో మే హింసితవాంస్తాతం తక్షకః స దురాత్మవాన్ ॥ 3
ప్రతికుర్యాం తథా తస్య తద్ భవంతో బ్రువంతు మే ।
అపి తత్ కర్మ విదితం భవతాం యేన పన్నగమ్ ॥ 4
తక్షకం సంప్రదీప్తేఽగ్నౌ ప్రక్షిపేయం సబాంధవమ్ ।
యథా తేన పితా మహ్యం పూర్వం దగ్ధో విషాగ్నినా ।
తథాహమపి తం పాపం దగ్ధుమిచ్ఛామి పన్నగమ్ ॥ 5
"పండితులారా! దురాత్ముడైన తక్షకుడు నా తండ్రిని హతమార్చాడు. నేను గూడా ఆ ప్రకారంగానే తక్షకునిపై బదులు తీర్చుకోవాలని అనుకొంటున్నాను. దీని కొరకు నేను ఏమి చేయాలో మీరు చెప్పండి. ఇటువంటి కార్యం గురించి మీకు తెలిస్తే ఆ కార్యం ద్వారా తక్షకుని మాత్రమేకాదు అతని బంధువులను గూడా ప్రజ్వలిస్తున్న అగ్నిలో దహించివేస్తాను. పూర్వం తన విషాగ్నితో తక్షకుడు నాతండ్రిని ఏ విధంగా దగ్ధం చేశాడో అట్లాగే నేనూ తక్షకుని దగ్ధం చేస్తాను. (3-5)
ఋత్విజ ఊచుః
అస్తి రాజన్ మహత్ సత్రం త్వదర్థం దేవనిర్మితమ్ ।
సర్పసత్రమితి ఖ్యాతం పురాణే పరిపఠ్యతే ॥ 6
ఋత్విజులు ఇలా చెప్పారు. మహారాజా! నీవు చెప్పినదానికి ఒక గొప్ప యజ్ఞం ఉన్నది. ఈ యజ్ఞాన్ని పూర్వమే దేవతలు సంకల్పించి సిద్ధంచేసి ఉంచారు. దీనికి సర్పయాగం అని పేరు పెట్టారు. (6)
ఆహర్తా తస్య సత్రస్య త్వన్నాన్యోఽస్తి నరాధిప ।
ఇతి పౌరాణికాః ప్రాహుః అస్మాకం చాస్తి స క్రతుః ॥ 7
ఈ యజ్ఞాన్ని చేయగల్గిన వాడవు నీవే తప్ప ఇతరులకు సాధ్యంకాదు. ఈ మాటల్ని పౌరాణికులైన విద్వాంసులు చెప్పారు. ఈ యజ్ఞం చేసే విధానం మాకు తెలుసు. (7)
ఏవముక్తః స రాజర్షిః మేనే దగ్ధం హి తక్షకమ్ ।
హుతాశనముఖే దీప్తే ప్రవిష్టమితి సత్తమ ॥ 8
శౌనకమునీంద్రా! ఋత్విజులు ఆ విధంగా చెప్పిన తరువాత జనమేజయుడికి తనకార్యసిద్ధిపై నమ్మకం కలిగి తక్షకుని అగ్నిలో దగ్ధం చేశాననే అనుకొన్నాడు. (8)
తతోఽబ్రవీన్మంత్రవిదః తాన్ రాజా బ్రాహ్మణాంస్తదా ।
ఆహరిష్యామి తత్ సత్రం సంభారాః సంభ్రియంతు మే ॥ 9
అపుడు జనమేజయుడు మంత్రవేత్తలయిన బ్రాహ్మణులతో ఇలా అన్నాడు. "నేను సర్పయాగాన్ని చేస్తాను. మీరు ఆ యజ్ఞానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయండి." (9)
తతస్తే ఋత్విజస్తస్య శాస్త్రతో ద్విజసత్తమ ।
తం దేశం మాపయామాసుః యజ్ఞాయతనకారణాత్ ॥ 10
శౌనకా! అపుడా ఋత్విజులు శాస్త్రంలో చెప్పిన విధంగా యజ్ఞమండపాన్ని తయారుచేయడానికి అక్కడ భూమిని కొలిచారు. (10)
యథావద్ వేదవిద్వాంసః సర్వే బుద్ధేః పరం గతాః ।
బుద్ధ్యా పరమయా యుక్తమ్ ఇష్టం ద్విజగణైర్యుతమ్ ॥ 11
ప్రభూతధనధాన్యాఢ్యం ఋత్విగ్భిః సునిషేవితమ్ ।
నిర్మాయ చాపి విధివద్ యజ్ఞాయతన మీప్సితమ్ ॥ 12
రాజానం దీక్షయామాసుః సర్పసత్రాప్తయే తదా ।
ఇదం చాసీత్ తత్ర పూర్వం సర్పసత్రే భవిష్యతి ॥ 13
ఋత్విజులందరు వేదవిద్వాంసులు, బుద్ధిమంతులు. వాళ్లు శాస్త్రప్రకారం యజ్ఞమండపాన్ని తయారు చేశారు. యజ్ఞశాల సంపూర్ణ ధనధాన్యాలతో, ఉత్తమోత్తములైన బ్రాహ్మణులతో పరిపూర్ణంగా విరాజిల్లుతున్నది. ఋత్విజులతో ఎంతో శోభాయమానంగా ఉన్నది. ఋత్విజులు సర్పయాగం నిర్విఘ్నంగా సిద్ధించడం కోసం జనమేజయుడికి దీక్షను ఇచ్చారు. ఇలా యజ్ఞం ప్రారంభం అవుతున్న సమయంలో ఈ క్రింది సంఘటన జరిగింది. (11-13)
నిమిత్తం మహదుత్పన్నం యజ్ఞవిఘ్నకరం తదా ।
యజ్ఞస్యాయతనే తస్మినే క్రియమాణే వచోఽబ్రవీద్ ॥ 14
స్థపతిర్వృద్ధిసంపన్నః వాస్తువిద్యావిశారదః ।
ఇత్యబ్రవీత్ సూత్రధారః సూతః పౌరాణికస్తదా ॥ 15
ఈయజ్ఞానికి విఘ్నం కలుగుతుందని ప్రకటింపబడింది. యజ్ఞమండపాన్ని తయారు చేస్తున్నపుడు వాస్తుశాస్త్ర పారంగతుడు, విద్వాంసుడు, మేధావి, అనుభవశాలి సూతపుత్రుడును అయిన శిల్పి "ఈ యజ్ఞానికి పెద్ద విఘ్నం ఏర్పడుతుంది" అని చెప్పాడు. (14,15)
యస్మిన్ దేశే చ కాలే చ మాపనేయం ప్రవర్తితా ।
బ్రాహ్మణం కారణం కృత్వా నాయం సంస్థాప్యతే క్రతుః ॥ 16
ఈ ప్రదేశంలో, ఈ కాలంలో కొలతలు జరిగినందువల్ల ఒక బ్రాహ్మణుని కారణంగా ఈ యజ్ఞం కొనసాగదు. (16)
ఏతచ్ఛ్రుత్వా తు రాజాసౌ ప్రాగ్దీక్షాకాలమబ్రవీత్ ।
క్షత్తారం న హి మే కశ్చిదజ్ఞాతః ప్రవిశేదితి ॥ 17
జనమేజయుడు ఆ శిల్పిపై కోపించి దీక్షకు ముందే సేవకునికి "నా అనుమతి లేకుండా అపరిచితు నెవరినీ యజ్ఞశాలకు రానీయవద్దు" అని ఆజ్ఞాపించాడు. (17)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్థీకపర్వణి సర్పసత్రోపక్రమే ఏకపంచాశత్తమోఽధ్యాయః ॥ 51 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పయాగప్రారంభము అను ఏబది యొకటవ అధ్యాయము. (51)