54. ఏబది నాల్గవ అధ్యాయము
ఆస్తీకుడు సర్పయాగమునకు వచ్చుట.
సౌతిరువాచ
తత ఆహూయ పుత్రం స్వం జరత్కారుర్భుజంగమా ।
వాసుకే ర్నాగరాజస్య వచనాదిదమబ్రవీత్ ॥ 1
ఉగ్రశ్రవుడు ఇలా చెపుతున్నాడు. నాగకన్య జరత్కారువు నాగరాజయిన వాసుకి తనతో చెప్పినట్లు తనకుమారుడైన ఆస్తీకుని పిలిచి ఇలా చెప్పింది. (1)
అహం తవ పితుః పుత్ర భ్రాత్రా దత్తా నిమిత్తతః ।
కాలః స చాయం సంప్రాప్తః తత్ కురుష్వ యథాతథమ్ ॥ 2
కుమారా! నా అన్న వాసుకి ఒక కారణంచేత నన్ను నీ తండ్రికి ఇచ్చి వివాహం చేశాడు. ఇపుడు ఆ సమయం వచ్చింది. కాబట్టి నీవు యథాతథంగా ఆ కోరికను నెరవేర్చు. (2)
ఆస్తీక ఉవాచ
కిం నిమిత్తం మమ పితుః దత్తా త్వం మాతులేన మే ।
తన్మమాచక్ష్వ తత్త్వేన శ్రుత్వా కర్తాస్మి తత్ తథా ॥ 3
ఆస్తీకుడు ఇలా అన్నాడు. "అమ్మా! నా మేనమామ ఏ కారణం చేత నిన్ను నా తండ్రికి ఇచ్చి వివాహం చేశాడు? ఈ విషయాన్ని నాకు పూర్తిగా చెప్పు. దానిని విన్న తరువాత కార్యసిద్ధికి ప్రయత్నం చేస్తాను". (3)
సౌతిరువాచ
తత ఆచష్ట సా తస్మై బాంధవానాం హితైషిణీ ।
భగినీ నాగరాజస్య జరత్కారురవిక్లబా ॥ 4
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. బంధువులయొక్క హితాన్నికోరి జరత్కారువు ఆస్తీకునితో ప్రశాంతచిత్తంతో ఇలా చెప్పింది. (4)
జరత్కారురువాచ
పన్నగానామశేషాణాం మాతా కద్రూరితి శ్రుతా ।
తయా శప్తా రుషితయా సుతా యస్మాన్నిబోధ తత్ ॥ 5
జరత్కారువు (ఆస్తీకునితో) ఇలా అంది. నాయనా! నాగులందరికీ తల్లి కద్రువ. ఒకపుడు ఆమెకు కోపం రాగా తన కుమారులకు ఆమె శాపం ఇచ్చింది. ఆ విషయాన్ని నీకు పూర్తిగా చెపుతాను. విను. (5)
ఉచ్పైఃశ్రవాః సోఽశ్వరాజః యన్మిథ్యా న కృతో మమ ।
వినతార్థాయ పణితే దాసీభావాయ పుత్రకాః ॥ 6
జనమేజయస్య వో యజ్ఞే ధక్ష్యత్యనిలసారథిః ।
తత్ర పంచత్వమాపన్నాః ప్రేతలోకం గమిష్యథ ॥ 7
మేటిగుర్రమయిన ఉచ్చైఃశ్రవం విషయంలో నాకు అనుకూలురై మీరు వినత మాటను వమ్ము చేయలేదు. నేను వినతతో దాస్యాన్ని పందెంగా అంగీకరించాను. నామాట విననందుకు మీరు జనమేజయ యాగంలో అగ్నిదగ్ధులై మరణించి ప్రేతలోకానికి చేరండి. (6,7)
తాం చ శస్తవతీం దేవః సాక్షాల్లోకపితామహః ।
ఏవమస్త్వితి తద్వాక్యం ప్రోవాచానుముమోద చ ॥ 8
కద్రువ శాపం ఇచ్చినపుడు సాక్షాత్తుగా లోకపితామహుడైన బ్రహ్మ ఆ శాపాన్ని విని ఆమోదించాడు. (8)
వాసుకిశ్చాపి తచ్ఛ్రుత్వా పితామహవచస్తథా ।
అమృతే మథితే తాత దేవాన్ శరణమీయివాన్ ॥ 9
కుమారా! నా అన్న వాసుకి కూడా బ్రహ్మవాక్కులను విన్నాడు. అమృతమథనం జరిగిన తరువాత వాసుకి దేవతలను శరణు కోరాడు. (9)
సిద్ధార్థాశ్చ సురాః సర్వే ప్రాప్యామృతమనుత్తమమ్ ।
భ్రాతరం మే పురస్కృత్య పితామహముపాగమన్ ॥ 10
తే తం ప్రసాదయామాసుః సురాః సర్వేఽబ్జసంభవమ్ ।
రాజ్ఞా వాసుకినా సార్ధం శాపోఽసౌ న భవేదితి ॥ 11
దేవతలు నా సోదరుని సహాయంతో అమృతాన్ని పొందిన తరువాత అతని మనోరథాన్ని తీర్చాలని అనుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. ఆ బ్రహ్మను దేవతలు వాసుకి అందరు కలిసి ప్రసన్నునిగా చేసుకొన్నారు. కద్రూశాపం జరగకుండా చేసుకోవాలని వీరి ఉద్దేశం. (10,11)
దేవా ఊచుః
వాసుకిర్నాగరాజోఽయం దుఃఖితో జ్ఞాతికారణాత్ ।
అభిశాపః స మాతుస్తు భగవన్ న భవేత్ కథమ్ ॥ 12
దేవతలు ఇలా అన్నారు. "పరమాత్మా! ఈ నాగరాజైన వాసుకి తన సోదరుల ఆపద గురించి దుఃఖిస్తున్నాడు. తల్లి ఇచ్చిన ఆ శాపం తప్పిపోయే మార్గమేది? (12)
బ్రహ్మోవాచ
జరతారుర్జరత్కారుం యాం భార్యాం సమవాప్స్యతి ।
తత్ర జాతో ద్విజః శాపాత్ మోక్షయిష్యతి పన్నగాన్ ॥ 13
బ్రహ్మ అన్నాడు. "జరత్కారుడనే ముని జరత్కారువును వివాహం చేసుకొంటే వారివలన జన్మించిన కుమారుడు కద్రువ ఇచ్చిన శాపాన్నుండి ముక్తి కలిగించగలడు. (13)
ఏతచ్ఛ్రుత్వా తు వచనం వాసుకిః పన్నగోత్తమః ।
ప్రాదాన్మామమరప్రఖ్య తవ పిత్రే మహాత్మనే ॥ 14
ప్రాగేవానాగతే కాలే తస్మాత్ త్వం మయ్యజాయథాః ।
అయం స కాలః సంప్రాప్తః భయాన్నస్త్రాతుమర్హసి ॥ 15
భ్రాతరం చాపి మే తస్మాత్ త్రాతుమర్హసి పావకాత్ ।
న మోఘం తు కృతం తత్ స్యాద్ యదహం తవ ధీమతే ।
పిత్రే దత్తా విమోక్షార్థం కథం వా పుత్ర మన్యసే ॥ 16
బ్రహ్మపలికిన ఆ మాటను విని నాగశ్రేష్ఠుడయిన వాసుకి నన్ను మహాత్ముడైన నీ తండ్రికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ పనికోసమే నా వివాహం జరిగింది. తరువాత ఆ తపోధనుని ద్వారా నా గర్భంలో నీవు జన్మించావు. జనమేజయుడు సర్పయాగం చేసే కాలం వచ్చేసింది. సర్పాలన్నీ యజ్ఞంలో పడి భస్మం అవుతున్నాయి. నీవు వాళ్లందర్నీ ఉద్ధరించాలి. నా సోదరుడు వాసుకి కూడా ఆ యాగాగ్నివల్ల భయపడుతున్నాడు. ఈ ఉద్దేశంతోనే ధీమంతుడైన నీ తండ్రి సేవకొరకు నన్ను అర్పించాడు. ఈ కార్యం వ్యర్థం కాకూడదు. కుమారా! సర్పాలకు కలిగిన ఈ కష్టం నుండి ఎలా విముక్తి కలిగిస్తావో ఉపాయం ఆలోచించు. (14-16)
సౌతిరువాచ
ఏవముక్తస్తథేత్యుక్త్వా సాస్తీకో మాతరం తదా ।
అబ్రవీద్ దుఃఖసంతప్తం వాసుకిం జీవయన్నివ ॥ 17
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. తల్లి ఈ విధంగా చెప్పిన తరువాత ఆస్తీకుడు తల్లితో "అమ్మా! నీవు చెప్పినట్లే చేస్తాను" అని దుఃఖంతో తపిస్తున్న వాసుకిని జీవింపచేస్తున్నట్లు వాసుకితో ఇలా అన్నాడు. (17)
అహం త్వాం మోక్షయిష్యామి వాసుకె పన్నగోత్తమ ।
తస్మాచ్ఛాపాన్మహాసత్త్వ సత్యమేతద్ బ్రవీమి తే ॥ 18
పన్నగోత్తమా! మీ తల్లి ఇచ్చిన శాపాన్నుండి మిమ్మల్ని విముక్తుని చేస్తాను. ఈ నామాట సత్యమే సుమా! (18)
భవ స్వస్థమనా నాగ న హి తే విద్యతే భయమ్ ।
ప్రయతిష్యే తథా రాజన్ యథా శ్రేయో భవిష్యతి ॥ 19
పన్నగ శ్రేష్ఠా! మీరు నిశ్చింతగా ఉండండి. ఏ మాత్రం భయపడవద్దు. రాజా! శుభం కలిగే విధంగా నేను తప్పక ప్రయత్నిస్తాను. (19)
న మే వాగనృతం ప్రాహ స్వైరేష్వపి కుతోఽన్యథా ।
తం వై నృపవరం గత్వా దీక్షితం జనమేజయమ్ ॥ 20
వాగ్భిర్మంగళయుక్తాభిః తోషయిష్యేఽద్య మాతుల ।
యథా స యజ్ఞో నృపతేః నివర్తిష్యతి సత్తమ ॥ 21
పరిహాసానికైనా నేను ఎప్పుడూ అసత్యం చెప్పలేదు. ఈ సంకట సమయంలో నేను అబద్ధం చెపుతానా? మీరు ఉత్తమోత్తములు. సర్పయాగం కోసం దీక్షవహించిన జనమేజయుని దగ్గరకు వెళ్లి శుభప్రదమైన మాటలతో ఆయనకు సంతోషం కలిగించి యజ్ఞాన్ని ముగింపజేస్తాను. (20,21)
స సంభావయ నాగేంద్ర మయి సర్వం మహామతే ।
న తే మయి మనో జాతు మిథ్యా భవితుమర్హతి ॥ 22
బుద్ధిశాలీ! నేను ఏమిచేస్తానని చెప్పానో ఆ మాటలను విశ్వసించండి. మీ మనస్సులో నాగురించి ఏమి ఆశిస్తున్నారో అది ఎన్నటికీ మిథ్యకాదు సుమా. (22)
వాసుకి రువాచ
ఆస్తీక పరిఘార్ణామి హృదయం మే విదీర్యతే ।
దిశో న ప్రతిజానామి బ్రహ్మదండనిపీడితః ॥ 23
వాసుకి ఇలా అన్నాడు. ఆస్తీకా! మా తల్లి ఇచ్చిన శాపరూపమైన బ్రహ్మదండంతో బాధపడుతున్నాను. నా గుండె పగిలిపోతోంది. నాకు దిక్కుతోచడం లేదు. (23)
ఆస్తీక ఉవాచ
న సంతాపస్త్వయా కార్యః కథంచిత్ పన్నగోత్తమ ।
ప్రదీప్తాగ్నేః సముత్పన్నం నాశయిష్యామి తే భయమ్ ॥ 24
ఆస్తీకుడు (వాసుకితో) ఇలా అన్నాడు. పన్నగోత్తమా! మీరు మనస్సులో ఏవిధంగానూ బాధ పడవద్దు. సర్పయజ్ఞంలో ధగధగా మండిపోతున్న అగ్ని నుండి మీకు కలుగుతున్న భయాన్ని నేను పోగొట్టగలను. (24)
బ్రహ్మదండం మహాఘోరం కాలాగ్ని సమతేజసమ్ ।
నాశయిష్యామి మాత్ర త్వం భయం కార్షీః కథంచన ॥ 25
ప్రళయ కాలాగ్నితో సమానమైన భయంకరమైన బ్రహ్మదండం నుండి రక్షిస్తాను. శాపాన్ని నాశనం చేస్తాను. ఇక ఏ మాత్రం భయపడకండి. (25)
సౌతిరువాచ
తతః స వాసుకేర్ఘోరమ్ అపనీయ మనోజ్వరమ్ ।
ఆధాయ చాత్మనోఽంగేషు జగామ త్వరితో భృశమ్ ॥ 26
జనమేజయస్య తం యజ్ఞం సర్వైః సముదితం గుణైః ।
మోక్షాయ భుజగేంద్రాణామ్ ఆస్తీకో ద్విజసత్తమః ॥ 27
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. పిమ్మట నాగరాజైన వాసుకియొక్క భయంకరమైన మనోజ్వరాన్ని పోగొట్టి వెంటనే వాసుకి మొదలయిన వారిని ప్రాణ సంకటం నుండి రక్షించడానికి జనమేజయుని యజ్ఞశాలకు ఆస్తీకుడు వెళ్లాడు. ఆ యజ్ఞం ఉత్తమగుణాలన్నింటితో విరాజిల్లుతోంది. (26,27)
స గత్వాపశ్యదాస్తీకః యజ్ఞాయతనముత్తమమ్ ।
వృతం సదస్యైర్బహుభిః సూర్యవహ్నిసమప్రభైః ॥ 28
ఆస్తీకుడు అక్కడకు వెళ్లి ఉత్తమోత్తమమయిన యజ్ఞశాలను చూశాడు. ఆ యజ్ఞశాల సూర్యునితోను, అగ్నితోను సమానులైన తేజస్వులైన సభ్యులతో నిండి ఉంది. (28)
స తత్ర వారితో ద్వాః స్థైః ప్రవిశన్ ద్విజసత్తమ।
అభితుష్ట్వావ తం యజ్ఞం ప్రవేశార్థీ పరంతపః ॥ 29
ద్విజోత్తముడయిన ఆస్తీకుడు యజ్ఞమండపంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అతడిని అడ్డగించారు. యజ్ఞశాలలోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆ యజ్ఞాన్ని అతడు స్తుతించాడు. (29)
స ప్రాప్య యజ్ఞాయతనం వరిష్ఠం
ద్విజోత్తమః పుణ్యకృతాం వరిష్ఠః ।
తుష్టావ రాజానమనంతకీర్తిం
ఋత్విక్ సదస్యాంశ్చ తథైవ చాగ్నిమ్ ॥ 30
ఉత్తమమైన యజ్ఞమండపానికి దగ్గరగా వెళ్లి, పుణ్యాత్ములలో శ్రేష్ఠుడయిన ఆ బ్రాహ్మణోత్తముడు అనంతమైన కీర్తి కల జనమేజయుని, ఋత్విక్కులను, సభ్యులను అగ్నిదేవుని స్తోత్రం చేయసాగాడు. (30)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పసత్రే ఆస్తీకాగమనే చతుష్పంచాశత్తమోఽధ్యాయః ॥ 54 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పయాగమునకు ఆస్తీకునిరాక అను ఏబదినాల్గవ అధ్యాయము. (54)