64. అరువది నాలుగవ అధ్యాయము
దేవతలను తమ అంశలతో భూమిపై అవతరించమని బ్రహ్మ ఆదేశించుట.
జనమేజయ ఉవాచ
య ఏతే కీర్తితా బ్రహ్మన్ యేచాద్యే నానుకీర్తితాః ।
సమ్యక్ తాన్ శ్రోతుమిచ్ఛామి రాజ్ఞశ్చాన్యాన్ సహస్రశః ॥ 1
జనమేజయుడిలా అడిగాడు - బ్రాహ్మణోత్తమా! నీవు పేర్కొన్న రాజులను గురించి, ఇంకా పేర్కొనని రాజులను గురించి విశదంగా వినాలని కోరుకొంటున్నాను. (1)
యదర్థమిహ సంభూతాః దేవకల్పా మహారథాః ।
భువి తన్మే మహాభాగ సమ్యగాఖ్యాతుమర్హసి ॥ 2
మహాభాగా! దేవతుల్యులైన ఆ మహారథులంతా ఈ భూమి మీద ఎందుకోసం పుట్టారో ఆ విషయాన్నంతా సమగ్రంగా చెప్పండి. (2)
వైశంపాయన ఉవాచ
రహస్యం ఖల్విదం రాజన్ దేవానామితి నః శ్రుతమ్ ।
తత్తు తే కథయిష్యామి నమస్కృత్య స్వయంభువే ॥ 3
అపుడు వైశంపాయనుడిలా చెప్పాడు - రాజా! అది దేవతలకు సంబంధించిన రహస్యమని మేము విని ఉన్నాము. బ్రహ్మకు నమస్కరించి ఆ రహస్యాన్ని నీకు చెప్తాను. (3)
త్రిఃసప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షత్రియాం పురా ।
జామదగ్న్యస్తపస్తేపే మహేంద్రే పర్వతోత్తమే ॥ 4
తదా నిఃక్షత్రియే లోకే భార్గవేణ కృతే సతి ।
బ్రాహ్మణాన్ క్షత్రియాః రాజన్ సుతార్థిన్యోఽభిచక్రముః ॥ 5
పూర్వం జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఇరువది ఒక్కమార్లు భూమిపై క్షత్రియుడనే వానిని లేకుండా చేసి, మహేంద్ర పర్వతం మీదకు పోయి తపస్సు చేశాడు. అలా పరశురాముడు క్షత్రియుడు లేకుండా చేయగా, క్షత్రియకాంతలంతా పుత్రార్థినులై బ్రాహ్మణులను శరణువేడారు. (4,5)
తాభిః సహ సమాపేతుః బ్రాహ్మణాః సంశితవ్రతాః ।
ఋతావృతౌ నరవ్యాఘ్ర! న కామాన్నానృతౌ తథా ॥ 6
నరవ్యాఘ్రా! అపుడు కఠోర నియమాల్ని పాటిస్తూ బ్రాహ్మణులు కేవలం ఋతుకాలంలో మాత్రమే క్షత్రియ కాంతలతో సంగమించారు. కామవశం వల్లకాని, ఋతుకాలం కానపుడు కాని వారిని కలిసేవారు కాదు. (6)
తేభ్యశ్చ లేభిరే గర్భం క్షత్రియాస్తాః సహస్రశః ।
తతః సుషువిరే రాజన్ క్షత్రియాన్ వీర్యవత్తరాన్ ॥ 7
కుమారాంశ్చ కుమారీంశ్చ పునః క్షత్రాభివృద్ధయే ।
ఏవం తద్ బ్రాహ్మణైః క్షత్రం క్షత్రాయాసు తపస్విభిః ॥ 8
జాతం వృద్ధం చ ధర్మేణ సుదీర్ఘేణాయుషాన్వితమ్ ।
చత్వారోఽపి తతో వర్ణాః బభూవుర్బ్రాహ్మణోత్తరాః ॥ 9
క్షత్రియవంశాభివృద్ధికై వారి వల్ల గర్భం పొందిన క్షత్రియ స్త్రీలు మహాబలశాలులైన పుత్రులను, పుత్రికలను కన్నారు. ఈ విధంగా తపస్వులైన బ్రాహ్మణుల వల్ల క్షత్రియ స్త్రీల యందు ధర్మపూర్వకంగా క్షత్రవంశజననమూ, అభివృద్ధీ జరిగాయి. అనంతరం బ్రాహ్మణ ప్రధానమైన నాలుగు వర్ణాలు స్థిరపడ్డాయి. (7-9)
అభ్యగచ్ఛన్నృతౌ నారీం న కామాన్నానృతౌ తథా ।
తథైవాన్యాని భూతాని తిర్యగ్యోనిగతాన్యపి ॥ 10
ఋతౌ దారాంశ్చ గచ్ఛంతి తత్ తథా భరతర్షభ ।
తతోఽవర్ధత ధర్మేణ సహస్రశతజీవినః ॥ 11
పురుషులు ఋతుకాలంలోనే స్త్రీలతో కలిసేవారు. కామవశం వల్లకాని, ఋతుకాలం కానపుడు కాని సంగమించేవారు కాదు. పశుపక్ష్యాది ప్రాణులన్నీ నియమాన్ని అనుసరించేవి. ఆ విధమైన ధర్మం చేత వందల సంవత్సరాలు జీవించేవారు. (10,11)
తాః ప్రజాః పృథివీపాల! ధర్మవ్రతపరాయణాః ।
ఆధిభిర్వ్యాధిభిశ్చైవ విముక్తాః సర్వశో నరాః ॥ 12
రాజా! ఆనాటి ప్రజలు ధర్మవ్రతపరాయణులు. అందుకే ఆధులచేత, వ్యాధులచేత విముక్తులయ్యారు. (12)
అథేమాం సాగరాపాంగీం గాం గజేంద్రగతాఖిలామ్ ।
అధ్యతిష్ఠత్ పునః క్షత్త్రం సశైలవనపత్తనామ్ ॥ 13
తరువాత సముద్రపర్యంతం వ్యాపించి, పర్వతాలతో అడవులతో కూడిన ఈ భూమిపై క్షత్రియ జాతి ఏర్పడింది. (13)
ప్రశాసతి పునః క్షత్రే ధర్మేణేమాం వసుంధరామ్ ।
బ్రాహ్మణాద్యాస్తతో వర్ణాః లేభిరే ముదముత్తమామ్ ॥ 14
క్షత్రియజాతి ఈ భూమిని ధర్మంతో పాలిస్తూండగా బ్రాహ్మణాది వర్ణాలన్నీ మిక్కిలి ఆనందాన్ని పొందాయి. (14)
కామక్రోధోద్భవాన్ దోషాన్ నిరస్య చ నరాధిపాః ।
ధర్మేణ దండం దండ్యేషు ప్రణయంతోఽన్వపాలయన్ ॥ 15
నాటి ప్రజాపాలకులు కామక్రోధాలవల్ల కలిగే దోషాలను దరిచేరనీయక ధర్మానుసారంగా దండింపదగిన వారిని దండిస్తూ పరిపాలించారు. (15)
తథా ధర్మపరే క్షత్రే సహస్రాక్షః శతక్రతుః ।
స్వాదుదేశే చ కాలే చ వర్షేణాపాలయత్ ప్రజాః ॥ 16
ఆ విధంగా రాజు ధర్మపరుడుగా ఉండగా ఇంద్రుడు తగిన సమయంలో తగిన ప్రదేశంలో వర్షం ద్వారా ప్రజలను రక్షించేవాడు. (16)
న బాల ఏవ మ్రియతే తదా కశ్చిజ్జనాధిప ।
న చ స్త్రియం ప్రజానాతి కశ్చిదప్రాప్తయౌవనః ॥ 17
రాజా! ఆ నాడు ఒక్కబాలుడూ మరణించలేదు. యౌవనం రాకుండానే ఏ పురుషుడూ స్త్రీ సుఖాన్ని కోరుకోలేదు. (17)
ఏవమాయుష్మతీభిస్తు ప్రజాభిర్భరతర్షభ ।
ఇయం సాగరపర్యంతా సమాపూర్యత మేదినీ ॥18
భరతశ్రేష్ఠా! ఇలా సాగరపర్యంతం ఉన్న ఈ భూమండలమంతా దీర్ఘాయుష్మంతులైన ప్రజలతో నిండి ఉండేది. (18)
ఈజిరే చ మహాయజ్ఞైః క్షత్రియా బహుదక్షిణైః ।
సాంగోపనిషదాన్ వేదాన్ విప్రాశ్చాధీయతే తదా ॥ 19
క్షత్రియులు గొప్పగొప్ప దక్షిణలిస్తూ యజ్ఞాలు చేసేవారు. బ్రాహ్మణులు వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేసేవారు. (19)
న చ విక్రీణతే బ్రహ్మ బ్రాహ్మణాశ్చ తదా నృప ।
న చ శూద్రసమభ్యాశే వేదానుచ్చారయంత్యుత ॥ 20
రాజా! ఆనాడు బ్రాహ్మణులు వేదవిక్రయాన్ని చేయలేదు. శూద్రుల దగ్గర వేదాన్ని ఉచ్చరించే వారు కాదు. (20)
కారయంతః కృషిం గోభిః తథా వైశ్యాః క్షితావిహ ।
యుంజతే ధురి నో గాశ్చ కృశాంగాంశ్చాప్యజీవయన్ ॥ 21
వైశ్యులు ఎద్దులతో వ్యవసాయం చేసేవారు. కృశించిన ఎడ్లపై భారం మోపేవారు కాదు. వాటికి ఆహారాన్నిచ్చి జీవనాన్ని కల్పించేవారు. (21)
ఫేనపాంశ్చ తథా వత్సాన్ న దుహంతిస్మ మానవాః ।
న కూటమానైర్వణిజః పణ్యం విక్రీణతే తదా ॥ 22
పాలుత్రాగే దూడలుండగా పశువులపాలను పిండుకొనేవారు కాదు. వర్తకులు మోసపు కొలతలతో వస్తువులను అమ్మేవారు కాదు. (22)
కర్మాణి చ నరవ్యాఘ్ర! ధర్మోపేతాని మానవాః ।
ధర్మమేవానుపశ్యంతః చక్రుః ధర్మపరాయణాః ॥ 23
నరోత్తమా! మనుష్యులు ధర్మబద్ధమైన కర్మల నాచరిస్తూ ధర్మపరాయణులై, ధర్మం పట్ల దృష్టిపెట్టి వ్యవహరించేవారు. (23)
స్వకర్మనిరతాశ్చాసన్ సర్వే వర్ణా నరాధిప ।
ఏవం తదా నరవ్యాఘ్ర! ధర్మో న హ్రసతే క్వచిత్ ॥ 24
అన్ని వర్ణాల వారు వారి వారి కర్మలను శ్రద్ధగా ఆచరించేవారు. ఈ విధంగా ఆనాడు ధర్మం ఎక్కడా తక్కువ కాలేదు. (24)
కాలే గావః ప్రసూయంతే నార్యశ్చ భరతర్షభ ।
భవంత్యృతుషు వృక్షాణాం పుష్పాణి చ ఫలాని చ ॥ 25
సకాలంలో ఆవులు ఈనేవి. స్త్రీలు ప్రసవించేవారు. ఆయా ఋతువులలో వృక్షాలు పూలు పూచేవి. ఫలాలు ఇచ్చేవి. (25)
ఏవం కృతయుగే సమ్యగ్ వర్తమానే తదా నృప ।
ఆపూర్యత మహీ కృత్స్నా ప్రాణిభిర్బహుభిర్భృశమ్ ॥ 26
ఈ విధంగా కృతయుగంలో చక్కగా ఉండగా ఈ భూమంతా అనేక ప్రాణులతో నిండి ఉండేది. (26)
ఏనం సముదితే లోకే మానుషే భరతర్షభ ।
అసురా జజ్ఞిరే క్షేత్రే రాజ్ఞాం తు మనుజేశ్వర ॥ 27
భరత శ్రేష్ఠ! ఈ విధంగా మానవులతో ఈ లోకం ప్రసన్నంగా ఉండగా, క్షత్రియకాంతలకు అసురులు జన్మించారు. (27)
ఆదిత్యైర్హి తదా దైత్యాః బహుశో నిర్జితా యుధి ।
ఐశ్వర్యాద్ భ్రంశితాః స్వర్గాత్ సంబభూవుః క్షితావిహ ॥ 28
ఆదిత్యులచే (అదితికుమారులచే) దైత్యులు పలుమార్లు ఓడింపబడి స్వర్గం నుండి, ఐశ్వర్యం నుండి భ్రష్టులై ఈ భూమి మీద జన్మించారు. (28)
ఇహ దేవత్వమిచ్ఛంతః మానుషేషు మనస్వినః ।
జజ్ఞిరే భువి భూతేషు తేష్వసురా విభో ॥ 29
అభిమానం గల అసురులు ఈ భూమి మీద ప్రభుత్వాన్ని కోరుకొని, మనుష్యులయందు, ఇతర ప్రాణుల యందు జన్మించారు. (29)
గోష్వశ్వేషు చ రాజేంద్ర ఖరోష్ట్రమహిషేషు చ ।
క్రవ్యాత్సు చైవ భూతేషు గజేషు చ మృగేషు చ ॥ 30
జాతైరిహ మహీపాల జాయమానైశ్చ తైర్మహీ ।
న శశాకాత్మనాఽఽత్మానమ్ ఇయం ధారయితం ధరా ॥ 31
రాజేంద్ర! ఆ అసురులు ఆవులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, గేదెలు, మాంసాహారులైన పశువులు, ఏనుగులు, లేళ్ళు, ఇలా అన్ని జాతులయందు జన్మించారు. వారందరితో ఈ భూమి తనభారాన్ని తాను మోయలేకపోయింది. (30,31)
అథ జాతా మహీపాలాః కేచిద్ బహుమదాన్వితాః ।
దితేః పుత్రాః దనోశ్చైవ తదా లోక ఇహ చ్యుతాః ॥ 32
వీర్యవంతోఽవలిప్తాస్తే నానారూపధరా మహీమ్ ।
ఇమాం సాగరపర్యంతాం పరీయురరిమర్దనాః ॥ 33
భూమిపై జన్మించిన దైత్యులు, దానవులు అయిన కొందరు రాజులు మిక్కిలి గర్వంతో ఉండేవారు. బలవంతులు, గర్విష్ఠులు అయిన ఆ రాజులు శత్రువులను అణచివేస్తూ సాగరపర్యంతమైన ఈ భూమిపై సంచరించేవారు. (32,33)
బ్రాహ్మాణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవాప్యపీడయన్ ।
అన్యాని చైవ సత్త్వాని పీడయామాసురోజసా ॥ 34
తమ బలంతో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను, ఇతర ప్రాణులను హింసించసాగారు. (34)
త్రాసయంతోఽభినిఘ్నంతః సర్వభూతగణాంశ్చ తే ।
విచేరుః సర్వశో రాజన్ మహీం శతసహస్రశః ॥ 35
ప్రాణులందర్నీ భయపెడుతూ, హింసిస్తూ భూమండలమంతా పలుమార్లు తిరగసాగారు. (35)
ఆశ్రమస్థాన్ మహర్షీంశ్చ ధర్షయంతస్తతస్తతః ।
అబ్రహ్మణ్యా వీర్యమదాః మత్తా మదబలేన చ ॥ 36
వారు వేదబ్రాహ్మణ విరోధులై బలగర్వంతో అహంకారంతో ఇటూ అటూ తిరుగుతూ ఆశ్రమాలలో ఉన్న మహర్షులను కూడా అవమానింపసాగారు. (36)
ఏవం వీర్యబలోత్సిక్తైః భూరియత్నైర్మహాసురైః ।
పీడ్యమానా మహీ రాజన్ బ్రహ్మాణముపచక్రమే ॥ 37
అసురులు బలగర్వంతో పెద్ద ప్రయత్నంతో బాధింపగా భూమి బ్రహ్మను శరణువేడింది. (37)
న హ్యామీ భూతసత్త్వౌఘాః పన్నగాః సనగాం మహీమ్ ।
తదా ధారయితుం శేకుః సంక్రాంతాం దానవైర్బలాత ॥ 38
తతో మహీ మహీపాల భారార్తా భయపీడితా ।
జగామ శరణం దేవం సర్వభూతపితామహమ్ ॥ 39
సా సంవృతం మహాభాగైః దేవద్విజమహర్షిభిః ।
దదర్శ దేవం బ్రహ్మాణం లోకకర్తారమవ్యయమ్ ॥ 40
ఈ ప్రాణిసమూహాలన్నీ పర్వతవనాలతో ఉన్న ఈ భూమిపై దానవుల ప్రాబల్యం వల్ల జీవించలేకపోయాయి. రాజా! అపుడు భయపీడితురాలైన ఈ భూమి దేవద్విజ మహర్షులతో కలిసి సర్వభూతపితామహుడు, లోకకర్త అయిన బ్రహ్మదేవుని దర్శించింది. (38-40)
గంధర్వైరప్సరోభిశ్చ దైవకర్మసు నిష్ఠితైః ।
వంద్యమానం మదోపేతైః వవందే చైనమేత్య సా ॥ 41
దేవ కర్మలలో నిమగ్నమైన గంధర్వులు అప్సరలు నమస్కరిస్తూండగా, భూమి బ్రహ్మకు నమస్కరించింది. (41)
అథ విజ్ఞాపయామాస భూమిస్తం శరణార్థినీ ।
సంనిధౌ లోకపాలానాం సర్వేషామేవ భారత ॥ 42
తత్ ప్రధానాత్మనస్తస్య భూమేః కృత్యం స్వయంభువః ।
పూర్వమేవాభవద్ రాజన్ విదితం పరమేష్ఠినః ॥ 43
లోకపాలురందరి సంనిధిలో శరణార్థిగా వచ్చిన భూమి ఇలా విన్నవించుకొంది. సర్వకారణస్వరూపుడైన బ్రహ్మకు భూమి కోరే పని ముందే అవగతమయింది. (42,43)
స్రష్టా హి జగతః కస్మాత్ న సంబుధ్యేత భారత ।
ససురాసురలోకానాం అశేషేణ మనోగతమ్ ॥ 44
ఈ జగత్తంతటికి కర్తయైన బ్రహ్మ సమస్త సురాసురలోకాల మనోగతాన్ని ఎందుకు తెలియలేడు? (44)
తామువాచ మహారాజ భూమిం భూమిపతిః ప్రభుః ।
ప్రభవః సర్వభూతానామ్ ఈశః శంభుః ప్రజాపతిః ॥ 45
భూమికి రక్షకుడు, ప్రభువు, సర్వభూతాల ఉత్పత్తికి కారణుడు, అధీశ్వరుడు, ప్రజాపతి అయిన బ్రహ్మ ఆమెతో ఇలా అన్నాడు. (45)
బ్రహ్మోవాచ
యదర్థమభిసంప్రాప్తా మత్సకాశం వసుంధరే ।
తదర్థం సంనియోక్ష్యామి సర్వానేవ దివౌకసః ॥ 46
బ్రహ్మ ఇలా అన్నాడు - వసుంధరా! నీవు ఏ పనిమీద నా దగ్గరకు వచ్చావో ఆ పని కోసం దేవతలందర్నీ నియోగిస్తాను. (46)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా స మహీమ్ దేవః బ్రహ్మా రాజన్ విసృజ్య చ ।
ఆదిదేశ తదా సర్వాన్ విబుధాన్ భూతకృత్ స్వయమ్ ॥ 47
అస్యా భూమేర్నినసితుం భారం భాగైః పృథక్ పృథక్ ।
అస్యామేవ ప్రసూయధ్వం విరోధాయేతి చాబ్రవీత్ ॥ 48
వైశంపాయనుడిలా చెప్పాడు - ఆ విధంగా పలికి బ్రహ్మ భూమిని సాగనంపి, సమస్తదేవతలను ఇలా ఆజ్ఞాపించాడు - దేవతలారా! ఈ భూమి భారాన్ని తగ్గించడానికి అసురులతో విరోధించడానికై మీరు మీమీ అంశలతో వేరు వేరు చోట్ల భూమిపై జన్మించండి. (47,48)
తథైవ స సమానీయ గంధర్వాప్సరసాం గణాన్ ।
ఉవాచ భగవాన్ సర్వాన్ ఇదం వచనమర్థవత్ ॥ 49
అదేవిధంగా గంధర్వులను అప్సరలను పిలిపించి అర్థవంతమైన వచనాన్ని చెప్పాడు. (49)
బ్రహ్మోవాచ
స్వైః స్వైరంశైః ప్రసూయధ్వం యథేష్టం మానుషేషు చ ।
అథ శక్రాదయః సర్వే శ్రుత్వా సురగురోర్వచః ।
తథ్యమర్థ్యం చ పథ్యం చ తస్య తే జగృహుస్తదా ॥ 50
బ్రహ్మ ఇలా అన్నాడు - 'మీమీ అంశలతో మానవులలో యథేచ్ఛగా జన్మించండి' అనగానే శక్రాదులు తథ్యమూ, అర్థసాధకమూ, పథ్యమూ అయిన బ్రహ్మమాటను స్వీకరించారు. (50)
అథ తే సర్వశోంఽశైః స్వైఃగంతుం భూమిం కృతక్షణాః ।
నారాయణమమిత్రఘ్నం వైకుంఠముపచక్రముః ॥ 51
అటుపై వారు వారి వారి అంశలతో భూమిపై జన్మించటానికి శత్రుసంహారియైన నారాయణుని వైకుంఠానికి వెళ్లారు. (51)
యః స చక్రగదాపాణిః పీతవాసాః సితప్రభః ।
పద్మనాభః సురారిఘ్నః పృథుచార్వంచితేక్షణః ॥ 52
ఆ నారాయణుడు చక్రగదాపాణి, పీతాంబరుడు. నీలకాంతికలవాడు, పద్మనాభుడు, దేవతల శత్రువులను చంపేవాడు, విశాలమైన అందమైన చూపులు గలవాడూను. (52)
ప్రజాపతిపతిర్దేవః సురనాథో మహాబలః ।
శ్రీవత్సాంకో హృషీకేశః సర్వదైవతపూజితః ॥ 53
ప్రజాపతులకే ప్రభువు. దేవతలందరికి నాథుడు. మహాబలుడు, శ్రీవత్సాంకుడు, హృషీకేశుడు, దేవతలందరిచే పూజింపబడుతున్నవాడు. (53)
తం భువః శోభనాయేంద్రః ఉవాచ పురుషోత్తమమ్ ।
అంశేనావతరేత్యేవం తథేత్యాహ చ తం హరిః ॥ 54
అట్టి పురుషోత్తముని సమీపించి ఇంద్రుడు "ప్రభూ! భూభూరాన్ని తగ్గించడానికి మమ్ములను అంశతో అవతరించుటకు అనుమతించండి" అని ప్రార్థించాడు, అపుడు శ్రీహరి 'అలాగే' అని వారి ప్రార్థనను అంగీకరించాడు. (54)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి చతుఃషష్టితమోఽధ్యాయః ॥ 64 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అంశావతారపర్వమను ఉపపర్వమున అరువది నాల్గవ అధ్యాయము. (64)