76. డెబ్బది ఆరవ అధ్యాయము
కచుడు శుక్రుని దగ్గర మృతసంజీవినీ విద్యను పొందుట.
జనమేజయ ఉవాచ
యయాతిః పూర్వజో ఽస్మాకం దశమో యః ప్రజాపతేః ।
కథం స శుక్రతనయాం లేభే పరమదుర్లభామ్ ॥ 1
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ తపోధన ।
ఆనుపూర్వ్యా చ మే శంస రాజ్ఞో వంశకరాన్ పృథక్ ॥ 2
జనమేజయుడు ఇలా అడిగాడు. తపోధనా! ప్రజాపతికి పదవతరంలో పుట్టిన యయాతి మిక్కిలి ద్ర్లభ అయిన శుక్రునికూతురగు దేవయానిని ఎలా పొంద గలిగాడు? ఈ విషయాన్ని విస్తరంగా వినాలనుకొంటున్నాడు. వంశకర్త లయిన రాజులను గురించి వేరుగా కాలానుక్రమంగా నాకు చెప్పు. (1,2)
వైశంపాయన ఉవాచ
యయాతి రాసీన్నృపతిః దేవరాజసమద్యుతిః ।
తం శుక్రవృషపర్వాణౌ వవ్రాతే వై యథా పురా ॥ 3
తత్ తే-హం సంప్రవక్ష్యామి పృచ్ఛతే జనమేజయ ।
దేవయాన్యాశ్చ సంయోగం యయాతే ర్నాహుషస్య చ ॥ 4
వైశంపాయనుడిలా చెప్పాడు - దేవేంద్రునితో సమానమైన తేజస్సుగల యయాతి అనే రాజున్నాడు. అతనిని పూర్వకాలం శుక్రుడు, వృషపర్వుడుకూడా అల్లునిగా స్వీకరించారు. జనమేజయా! ఆ విషయం నీకు చెపుతాను. నహుష నందనుడైన యయాతీ దేవయానీ కలుసుకొనడం కూడా చెపుతాను. (3,4)
సురాణా మసురాణాం చ సమజాయత వై మిథః ।
ఐశ్వర్యం ప్రతి సంఘర్షః త్రైలోక్య సచరాచరే ॥ 5
చరాచరాలతోనున్న ముల్లోకాల్లోని ఐశ్వర్యం గురించి సురాసురులకు పరస్పరం సంఘర్షణ జరిగింది. (5)
జిగీషయా తతో దేవాః వవ్రిరే ఽంగిరసం మునిమ్ ।
పౌరోహిత్యేన యాజ్యార్థే కావ్యం తూశనసం పరే ॥ 6
బ్రాహ్మణౌ తావుభౌ నిత్యమ్ అన్యోన్యస్పర్ధినౌ భృశమ్ ।
తత్ర దేవా నిజఘ్నుర్యాన్ దానవాన్ యుధి సంగతాన్ ॥ 7
తాన్ పునర్జీవయామాస కావ్యో విద్యాబలాశ్రయాత్ ।
తతస్తే పునరుత్థాయ యోధయాంచక్రిరే సురాన్ ॥8
జయించాలనే కోరికతో దేవతలు అంగిరసుని కుమారుడయిన బృహస్పతిమహర్షిని యజ్ఞనిర్వహణకోసం పురోహితునిగా కోరారు. రాక్షసులు కూడ కావ్యుడైన శుక్రాచార్యుని కోరారు. శుక్రాచార్య బృహస్పతులిరువురూ బ్రాహ్మణులు, పరస్పర స్పర్ధ కలవారు. అక్కడ యుద్ధంలో మరణించిన దానవులను శుక్రాచార్యుడు తన విద్యాబలాన్ని ఉపయోగించి మళ్ళీ ఉజ్జీవింపజేస్తున్నాడు. అందువల్ల రాక్షస యోధులు మళ్ళీ లేచి సురలపై యుద్ధం చేసేవారు. (6-8)
అసురాస్తు నిజఘ్నుర్యాన్ సురాన్ సమరమూర్ధవి ।
న తాన్ సంజీవయామాస బృహస్పతిరుదారధీః ॥ 9
యుద్ధరంగంలో అసురులు చంపిన సురలను మాత్రమ్ ఉదారబుద్ధుగల బృహస్పతి తిరిగి బ్రతికింపలేదు. (9)
న హి వేద స తాం విద్యాం యాం కావ్యో వేత్తి వీర్యవాన్ ।
సంజీవినీం తతో దేవాః విషాదమగమన్ పరమ్ ॥ 10
తేజోవంతుడయిన శుక్రునికి తెలిసిన మృతసంజీవనీ విద్య బృహస్పతి ఎరుగడు. అందువల్ల దేవతలు మిక్కిలి విషాదాన్ని పొందారు. (10)
తే తు దేవా భయోద్విగ్నాః కావ్యాదుశనసస్తదా ।
ఊచుః కచముపాగమ్య జ్యేష్ఠం పుత్రం బృహస్పతేః ॥ 11
శుక్రునివల్ల భయంతో విచారిస్తున్న దేవతలు బృహస్పతి పెద్దకొడుకైన కచుని సమీపించి ఇలా అన్నారు. (11)
భజమానాన్ భజస్వాస్మాన్ కురు నః సాహ్యముత్తమమ్ ।
యా సా విద్యా నివసతి బ్రాహ్మణే ఽమితతేజసి ॥ 12
శుక్రే తామాహర క్షిప్రం భాగభాఙ్నో భవిష్యసి ।
వృషపర్వసమీపే హి శక్యో ద్రష్టుం త్వయా ద్విజః ॥ 13
నిన్ను సేవిస్తున్న మమ్మల్ని ఆదరించు. మాకు ఉత్తమమైన సాహాయ్యం చెయ్యి. తేజస్సుగల బ్రాహ్మణుడైన శుక్రునిలో ఉన్నవిద్యను ఇక్కడకు వేగంగా అపహరించుకొనిరా! అపుడు నీవు హవిర్భాగాన్ని మాతోపాటు స్వీకరింపగలవు. ఆ శుక్రాచార్యుని వృషపర్వుని దగ్గర చూడగలవు. (12,13)
రక్షతే దానవాంస్తత్ర న స రక్షత్యదానవాన్ ।
తమారాధయితుం శక్తః భవాన్ పూర్వవయాః కవిమ్ ॥ 14
శుక్రుడు దానవులను మాత్రమే రక్షిస్తున్నాడు. దేవతలను రక్షించడంలేదు. యౌవనంలో ఉన్న నీవు ఆ శుక్రుని ఆరాధించడానికి సమర్థుడవు. (14)
దేవయానీం చ దయితాం సుతాం తస్య మహాత్మనః ।
త్వ మారాధయితుం శక్తః నాన్యః కశ్చన విద్యతే ॥ 15
ఆ మహాత్ముని కూతురు ప్రీతిపాత్రురాలు అయిన దేవయానిని సేవించడానికి కూడ నీవే సమర్థుడవు. మరొకరు ఎవరూ ఆ పని చేయగలవారు లేరు. (15)
శీలదాక్షిణ్యమాధుర్యైః ఆచారేణ దమేన చ ।
దేవయాన్యాం హి తుష్టాయాం విద్యామ్ తాం ప్రాప్స్యసి ధ్రువమ్ ॥ 16
నడవడిక, దయ, తీయనిమాటలు, ఆచారం, ఇంద్రియ నిగ్రహం వీటన్నింటిచేత దేవయానిని సంతుష్టురాలిని చేస్తే ఆ విద్యను నిశ్చయంగా పొందగలవు. (16)
తథేత్యుక్త్వా తతః ప్రాయాద్ బృహస్పతిసుతః కచః ।
తదాభిపూజితో దేవైః సమీపే వృషపర్వణః ॥ 17
'అలాగే' అని పలికి బృహస్పతి కుమారుడైన కచుడు అపుడు దేవతలచే పూజింపబడి అక్కడనుండి వృషపర్వుని సమీపానికి వెళ్లాడు. (17)
స గత్వా త్వరితో రాజన్ దేవైః సంప్రేషితః కచః ।
అనురేంద్రపురే శుక్రం దృష్ట్వా వాక్యమువాచ హ ॥ 18
రాజా! దేవతలచే పంపబడ్డ ఆ కచుడు తొందరగా రాక్షసరాజయిన వృషపర్వుని నగరానికి వెళ్ళి, శుక్రుని దర్శించి ఇలా పలికాడు. (18)
ఋషే రంగిరసః పౌత్రం పుత్రం సాక్షాద్ బృహస్పతేః ।
నామ్నా కచమితి ఖ్యాతం శిష్యుం గృహ్ణాతు మాం భవాన్ ॥ 19
అంగిరసుని పౌత్రుడు, సాక్షాత్తూ బృహస్పతి కుమారుడు, కచుడని పిలువబడే నన్ను శిష్యునిగా తమరు స్వీకరింపగొరుతున్నాను. (19)
బ్రహ్మచర్యమ్ చరిష్యామి త్వయ్యహం పరమం గురౌ ।
అనుమన్యస్వ మాం బ్రహ్మన్ సహస్రం పరివత్సరాన్ ॥ 20
బ్రాహ్మాణోత్తమా! గురువైన నీపట్ల నేను వేయిసంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. నన్ను శిష్యునిగా అంగీకరించగోరుతున్నాను. (20)
శుక్ర ఉవాచ
కచ సుస్వాగతం తేస్తు ప్రతిగృహ్ణామి తే వచః ।
అర్చయిష్యేఽహమర్చ్యం త్వామ్ అర్చితో ఽస్తు బృహస్పతిః ॥ 21
అపుడు శుక్రుడిలా అన్నాడు - కచా! నీకు స్వాగతం! నీ మాటను అంగీకరిస్తున్నాను. గౌరవింపదగిన నిన్ను గౌరవిస్తే బృహస్పతిని గౌరవించినట్లే. (21)
వైశంపాయన ఉవాచ
కచస్తు తం తథేత్యుక్త్వా ప్రతిజగ్రాహ తద్ వ్రతమ్ ।
ఆదిష్టం కవిపుత్రేణ శుక్రేణోశనసా స్వయమ్ ॥ 22
వైశంపాయనుడిలా అన్నాడు- కచుడు శుక్రునితో 'అలాగే' అనిపలికి ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు. కవిపుత్రుడైన శుక్రునిచే స్వయంగా ఆదేశింపబడిన ఆ వ్రతాన్ని స్వీకరించాడు. (22)
వ్రతస్య ప్రాప్తకాలం సః యథోక్తం ప్రత్యగృహ్ణాత ।
ఆరాధయన్నుపాధ్యాయం దేవయానీం చ భారత ॥ 23
నిత్యమారాధయిష్యంస్తౌ యువా యౌవనగోచరే ।
గాయన్ నృత్యన్ వాదయంశ్చ దేవయానీమతోషయత్ ॥ 24
ఆ కచుడు శుక్రుడు చెప్పినప్రకారం వ్రతానికి అదే తగిన సమయంగా భావించి స్వీకరించాడు. భరతశ్రేష్ఠా! ఉపాధ్యాయుని, దేవయానిని అతడు సేవిస్తూ ఉన్నాడు. నిత్యమూ వారిద్దరిని సేవిస్తూ పాడుతూ, నృత్యంచేస్తూ, వీణాదులను వాయిస్తూ దేవయానిని సంతోష పెట్టాడు. (23,24)
స శీలయన్ దేవయానీం కన్యాం సంప్రాప్తయౌవనామ్ ।
పుష్పైః ఫలైః ప్రేషణైశ్చ తోషయామాస భారత ॥ 25
మంచినడవడిక గల ఆ కచుడు యౌవనంలో ఉన్న కన్య అయిన దేవయానిని పూలతో, పలాలతో సంతోషపెట్టాడు. ఆమె ఆజ్ఞలను నిర్వర్తించి సంతోషపెట్టాడు. (25)
దేవయాన్యపి తం విప్రం నియమవ్రతధారణమ్ ।
గాయంతీ చ లలంతీ చ రహః పర్యచరత్ తథా ॥ 26
దేవయాని కూడా బ్రహ్మచర్యవ్రత నియమం పాటిస్తూన్న ఆ బ్రాహ్మణుని పాడుతూ, ఆడుతూ ఏకాంతంగా సేవించింది. (26)
పంచవర్షశతాన్యేవం కచస్య చరతో వ్రతమ్ ।
తత్రాతీయురథో బుద్ధ్వా దానవాస్తం తతః కచమ్ ॥ 27
గా రక్షంతం వనే దృష్ట్వా రహస్యేకమమర్షితాః ।
జఘ్ను ర్బృహస్పతేర్ద్వేషాద్ విద్యారక్షార్థమేవ చ ॥ 28
ఈవిధంగా బ్రహ్మచర్యవ్రతం ఆచరిస్తున్న కచునికి అక్కడ ఐదువందల సంవత్సరాలు గడిచాయి. దానవులు అతని గురించి తెలుసుకొని, అడవిలో ఒంటరిగా గోవులను రక్షిస్తూన్న కచుని చూసి, సహింపలేక, బృహస్పతిమీది ద్వేషం వల్ల, మృతసంజీవినీ విద్యను రక్షించడంకోసం అతనిని చంపేశారు. (27,28)
హత్వా శాలావృకేభ్యశ్చ ప్రాయచ్ఛన్ లవశః కృతమ్ ।
తతో గావో నివృత్తాస్తా అగోపాః స్వం నివేశనమ్ ॥ 29
వారు కచుని చంపి ముక్కముక్కలుగా చేసి తోడేళ్ళకు వేశారు. సాయంకాలానికి గోవులు, గోపాలకుడు (కచుడు) లేకుండానే స్వయంగా తమనివాసానికి తిరిగి వచ్చాయి. (29)
సా దృష్ట్వా రహితా గాశ్చ కచేనాభ్యాగతా వనాత్ ।
ఉవాచ వచనం కాలే దేవయాన్యభ భారత ॥ 30
అడవి నుండి కచుడులేకుండా తిరిగి వచ్చిన గోవులను దేవయాని చూసి, తగిన సమయంలో తండ్రితో ఇలా పలికింది. (30)
దేవయాన్యువాచ
ఆహుతం చాగ్నిహోత్రం తే సూర్యశ్చాస్తం గతః ప్రభో ।
అగోపాశ్చాగతా గావః కచస్తాత న దృశ్యతే ॥ 31
దేవయాని ఇలా అంది - ప్రభూ! నీ అగ్నిహోత్రంలో హోమం చేయబడింది. సూర్యుడు కూడ అస్తమించాడు. గోవులు గోపాలకుడు లేకుండానే తిరిగివచ్చాయి. నాయనా! కచుడు కనబడటంలేదు. (31)
వ్యక్తం హతో మృతో వాపి కచస్తాత భవిష్యతి ।
తం వినా వ చ జీవేయమ్ ఇతి సత్యం బ్రవీమి తే ॥ 32
తండ్రీ! కచుడు చంపబడి ఉంటాడు, లేదా మరణించి ఉంటాడు, ఇది స్పష్టం. అతడు లేకుండా నేను జీవింపలేను. ఇది నిజం. నీకు చెపుతున్నాను. (32)
శుక్ర ఉవాచ
అయమేహీతి సంశబ్ద్య మృతం సంజీవయామ్యహమ్ ।
తతః సంజీవినీం విద్యాం ప్రయుజ్య కచమాహ్వయత్ ॥ 33
అప్పుడు శుక్రుడిలా అన్నాడు - 'ఇదుగో ఇలా రా' అని పలికి 'మరణించిన కచుని నేను మరల జీవింపజేస్తాను.' అని చెప్పి వెంటనే సంజీవినీ విద్యను ప్రయోగించి కచుని ఆహ్వానించాడు. (33)
భిత్వా భిత్వా శరీరాణి వృకాణాం స వినిర్గతః ।
ఆహూతః ప్రాదురభవత్ కచో హృషోఽథ విద్యయా ॥ 34
అలా శుక్రునిచే పిలువబడ్డ కచుడు తోడేళ్ళ శరీరాలను చీల్చుకుని బయటకు వచ్చి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. కచుడు ఆ విద్యతో ఆనందించాడు. (34)
కస్మాచ్చిరాయితో ఽసీతి పృష్టస్తామాహ భార్గవీమ్ ।
సమిధశ్చ కుశాదీని కాష్ఠభారం చ భామిని ॥ 35
గృహీత్వా శ్రమభారార్తః వటవృక్షం సమాశ్రితః ।
గావశ్చ సహితాః సర్వా వృక్షచ్ఛాయాముపాశ్రితాః ॥ 36
దేవయాని 'ఎందువల్ల ఆలస్యం చేశావు' అని కచుని అడిగింది. ఆమెతో అతడిలా అన్నాడు - సమిధలు, కుశలు మొదలగువానిని, కాష్ఠాలను తీసికొని వస్తూ శ్రమవల్ల భారంవల్ల బాధకల్గి వటవృక్షాన్ని ఆశ్రయించాను. గోవులుకూడా చెట్టునీడను ఆశ్రయించాయి. (35,36)
అసురాస్తత్ర మాం దృష్ట్వా కస్త్వమిత్యభ్యచోదయన్ ।
బృహస్పతిసుతశ్చాహం కచ ఇత్యభివిశ్రుతః ॥ 37
అసురులు అక్కడ నన్ను చూసి నీవెవరు? అని అడిగారు. బృహస్పతి కుమారుడను. కచుడని పేరు. (37)
ఇత్యుక్తమాత్రే మాం హత్వా పేషీకృత్వా తు దానవాః ।
దత్వా శాలావ్ఱ్రుకేభ్యస్తు సుఖం జగ్ముః స్వమాలయమ్ ॥ 38
అని చెప్పినమాత్రాన, నన్ను చంపి, ముద్దచేసి రాక్షసులు కుక్కలకు తోడేళ్ళకు వేసి, సుఖంగా తమనివాసానికి వెళ్లారు. (38)
ఆహూతో విద్యయా భద్రే భార్గవేణ మహాత్మనా ।
త్వత్సమీపమిహాయాతః కథంచిత్ సమజీవితః ॥ 39
భద్రా! మహాత్ముడైన భార్గవుడు తన విద్యచేత పిలువగానే నీదగ్గరకు ఇక్కడకు వచ్చాను. ఎట్లాగో బ్రతికాను. (39)
హతో ఽహమితి చాచఖ్యౌ పృష్టో బ్రాహ్మణకన్యయా ।
స పునర్దేవయాన్యోక్తః పుష్పాహారో యదృచ్ఛయా ॥ 40
ఈవిధంగా బ్రాహ్మణకన్య దేవయాని అడగ్గానే 'నేను చంపబడ్డాను' అని తన వృత్తాంతాన్ని చెప్పాడు. మళ్లీ దేవయాని చెప్పగా మరొకరోజు అతడు అనుకోకుండా పూలు తేవడానికి వెళ్లాడు. (40)
వనం యయౌ కచో విప్రః దదృశుర్దానవాశ్చ తమ్ ।
పునస్తం పేషయిత్వా తు సముద్రాంభస్యమిశ్రయన్ ॥ 41
బ్రాహ్మణుడైన కచుడు (పూలకోసం) వనానికి వెళ్లాడు. దానవులు అతడిని చూశారు. మళ్లీ అతనిని చంపి ముద్దచేసి సముద్రజలాల్లో కలిపారు. (41)
చిరం గతం పునః కన్యా పిత్రే తం సంన్యవేదయత్ ।
విప్రేణ పునరాహూతః విద్యయా గురుదేహజః ।
పునరావృత్య తద్ వృత్తం న్యవేదయత తద్ యథా ॥ 42
కచుడు వెళ్ళి చాలాసేపయింది. దేవయాని తండ్రికి అతని గురించి నివేదించింది. భార్గవుడు మళ్ళీ విద్యచేత ఆహ్వానించాడు. బృహస్పతి కుమారుడైన కచుడు మళ్ళీ వచ్చి జరిగిన వృత్తాంతాన్ని ఉన్నదున్నట్లుగా నివేదించాడు. (42)
తతస్తృతీయం హత్వా తం దగ్ధ్వా కృత్వా చ చూర్ణశః ।
ప్రాయచ్ఛన్ బ్రాహ్మణాయైవ సురాయామసురా స్తదా ॥ 43
తరువాత మూడవసారి రాక్షసులు చంపి, తగలబెట్టి. పొడిచేసి, మద్యంలో కలిపి శుక్రాచార్యునికే ఇచ్చారు. (43)
దేవయాన్యథ భూయోఽపి పితరం వాక్యమబ్రవీత్ ।
పుష్పాహారః ప్రేషణకృత్ కచస్తాత న దృశ్యతే ॥ 44
అటుపై దేవయాని మళ్లీ తండ్రితో ఇలా అన్నది. నాయనా! పూలు తేవడానికి పంపాను. కచుడు కనబడడంలేదు'. (44)
వ్యక్తం హతో మృతో వాపి కచస్తాత భవిష్యతి ।
తం వినా న జీవేయం కచం సత్యం బ్రవీమి తే ॥ 45
తండ్రీ! కచుడు చనిపోయిఉంటాడు. లేదా చంపబడి ఉంటాడు. నేను నిజం చెపుతున్నాను. కచుడు లేకపోతే నేను బ్రతుకను. (45)
శుక్ర ఉవాచ
బృహస్పతేః సుతః పుత్రి కచః ప్రేత్గతిం గతః ।
విద్యయా జీవితోఽప్యేవం హన్యతే కరవాణి కిమ్ ॥ 46
మైవం శుచో మా రుద దేవయాని
న త్వాదృశీ మర్త్యమనుప్రశోచతే ।
యస్యాస్తవ బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చ
సేంద్రా దేవా వసవోఽథాశ్వినౌ చ ॥ 47
సురద్విషశ్చైవ జగచ్చ సర్వమ్
ఉపస్థానే సంనమంతి ప్రభావాత్ ।
అశక్యోఽసౌ జీవయితుం ద్విజాతిః
సంజీవితో బధ్యతే చైవ భూయః ॥ 48
శుక్రుడిలా అన్నాడు - అమ్మాయీ! బృహస్పతి కుమారుడైన కచుడు ప్రేతమార్గంలో వెళ్లాడు, మరణించాడు. నావిద్యచే జీవితుడౌతున్నా మరల మరల చంపబడుతున్నాడు. నేనేం చెయ్యను. దేవయానీ! ఇలా దుఃఖించకు. నీవంటిది మరణించిన వానిని గురించి దుఃఖించకూడదు. బ్రహ్మ, బ్రాహ్మణులు, ఇంద్రాది దేవతలు, వసువులు, అశ్వినులు, రాక్షసులు, సమస్తజగత్తు సంధ్యాసమయంలో నాప్రభావం వల్ల నీకు శిరస్సువంచి నమస్కరిస్తారు. (అటువంటి నీవు దుఃఖించడమేమిటి?) ఈ బ్రాహ్మణుడు మరల జీవింపచేయడానికి శక్యం కాడు. జీవింపజెసినా మళ్ళీ బంధింపబడుతూ చంపబడుతూనే ఉన్నాడు. (46-48)
దేవయాన్యువాచ
యస్యాంగిరా వృద్ధతమః పితామహో
బృహస్పతిశ్చాపి పితా తపోనిధిః ।
ఋషే పుత్రం తమథో వాపి పౌత్రం
కథం న శోచేయమహం న రుద్యామ్ ॥ 49
దేవయాని ఇలా అంది - మిక్కిలి వృద్ధుడయిన అంగిరసుని మనుమడు, తపోనిధి బృహస్పతి కొడుకు అయిన కచుని గురించి ఎలా దుఃఖించకుండా ఉంటాను? నేను ఏడవకుండా ఎలా ఉండగలను? (49)
స పీడితో దేవయాన్యా మహర్షిః
సమాహ్వయత్ సంరంభాచ్చైవ కావ్యః ।
అసంశయం మామసురా ద్విషంతి
యే మే శిష్యానాగతాన్ సూదయంతి ॥ 51
వైశంపాయనుడిలా అన్నాడు - దేవయాని చేత బాధనొందిన ఆ శుక్రాచార్యుడు కూతురుపట్ల కంగారువల్ల కచుని ఆహ్వానించాడు. నాదగ్గరకు వచ్చిన శిష్యులను చంపుతున్న రాక్షసులు నన్ను ద్వేషిస్తారు. ఇందులో సందేహం లేదు. (51)
అబ్రాహ్మణం కర్తుమిచ్ఛంతి రౌద్రాః
తే మాం యథా వ్యభిచరంతి నిత్యమ్ ।
అప్యస్య పాపస్య భవేదిహాంతః
కం బ్రహ్మహత్యా న దహేదపీంద్రమ్ ॥ 52
రౌద్రస్వభావం గల ఈ రాక్షసులు నన్ను అబ్రాహ్మణూనిగా చేయగోరుతున్నారు. అందుకే నిత్యమూ నాకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రహ్మ హత్యా పాపానికి అంతం లేదు! బ్రహ్మహత్య ఎవరిని దహింపదు? ఇంద్రుని కూడా దహిస్తుంది. (52)
గురోర్హి భీతో విద్యయా చోపహూతః
శనైర్వాక్యం జఠరే వ్యాజహార ।
గురువు వల్ల భయపడి, అతని విద్యచే పిలువబడి కచుడు ఉదరంలో ఉండి మెల్లగా ఇలా మాట్లాడాడు.
(కచ ఉవాచ
ప్రసీద భగవన్ మహ్యం కచోఽహమభివాదయే ।
యథా బహుమతః పుత్రస్తథా మన్యంతు మాం భవాన్ ॥)
కచుడు ఇలా అన్నాడు - పూజ్యుడా! నన్ను అనుగ్రహించు. కచుడను నేను నమస్కరిస్తున్నాను. మీకుమారుడు మిక్కిలి ఇష్టుడైనట్లే నన్నుకూడ భావించండి.
వైశంపాయన్ ఉవాచ
తమబ్రవీత్ కేన పథొపనీతః
త్వం చోదరే తిష్ఠసి బ్రూహి విప్ర ॥ 53
వైశంపాయనుడిలా అన్నాడు - విప్రా! నీవు నా ఉదరంలో ఉన్నావు. అక్కడికి ఏవిధంగా వెళ్లావు? చెప్పు. (53)
కచ ఉవాచ
తవ ప్రసాదాన్న జహాతి మాం స్మృతిః
స్మరామి సర్వం యచ్చ యథా చ వృత్తమ్ ।
న త్వేవం స్యాత్ తపసః సంక్షయో మే
తతః క్లేశం ఘోరమిమం సహామి ॥ 54
కచుడిలా అన్నాడు - నీ అనుగ్రహం వల్ల నాస్మృతి పోలేదు. ఏది ఏవిధంగా జరిగిందో అదంతా స్మరిస్తున్నాను. ఈవిధంగా నాతపస్సు క్షీణించలేదు. అందువల్లనే ఘోరమైన ఈక్లేశాన్ని సహిస్తున్నాను. (54)
అసురైః సురాయాం భవతోఽస్మి దత్తః
హత్వా దగ్ధ్వా చూర్ణయిత్వా చ కావ్య ।
బ్రాహ్మీం మాయాం చాసురీం విప్ర మాయాం
త్వయి స్థితే కథమేవాతివర్తేత్ ॥ 55
కావ్యా! రాక్షసులు నన్ను చంపి, దహించి, పొడిచేసి సురలోకలిపి నీకు ఇచ్చారు. విప్రా! మీరుండగా నేను దైవీమాయనుగాని, ఆసురీమాయనుగాని ఏవిధంగా ఉల్లంఘించగలను. (55)
శుక్ర ఉవాచ
కిం తే ప్రియం కరవాణ్యద్య వత్సే
వధేన మే జీవితం స్యాత్ కచస్య ।
నాన్యత్ర కుక్షేర్మమ భేదనేన
దృశ్యేత్ కచో మద్గతో దేవయాని ॥ 56
శుక్రుడిలా అన్నాడు - అమ్మాయీ! ఇపుడు నేను నీకు ఇష్టమైనదేది చేయాలి? నామకరణంచేతనే కచుడు జీవిస్తాడు. నాఉదరాన్ని భేదించడంకంటె వేరొక ఉపాయంలేదు. అలా అయితేనే నాఉదరంలోని కచుడు ఎదురుగా కనబడగలడు. (56)
దేవయాన్యువాచ
ద్వౌ మాం శోకావగ్నికల్పౌ దహేతాం
కచస్య నాశస్తవ చైవోపఘాతః ।
కచస్య నాశే మమ నాస్తి శర్మ
తవోపఘాతే జీవితుం నాస్మి శక్తా ॥ 57
దేవయాని ఇలా అంది - నన్ను ఈ రెండుదుఃఖాలు అగ్నివలె దహిస్తున్నాయి. కచుని నాశనం, నీకుహాని. కచుడు నశిస్తే నాకు శాంతిలేదు. నీకు హాని జరిగితే నేను జీవించలేను. (57)
శుక్ర ఉవాచ
సంసిద్ధరూపోఽసి బృహస్పతేః సుత
యత్ త్వాం భక్తం భజతే దేవయానీ ।
విద్యామిమాం ప్రాప్నుహి జీవినీం త్వం
న చేదింద్రః కచరూపీ త్వమద్య ॥ 58
శుక్రుడిలా అన్నాడు - బృహస్పతి కుమారా! ఇపుడు నీవు (కార్య) సిద్ధి పొందినవాడవు. ఎందుకంటే దేవయాని భక్తుడవైన నిన్ను కోరుకొంటోంది. నీవు కచరూపంలో ఉన్న ఇంద్రుడవు కాకపోతే, ఈ సంజీవినీ విద్యను పొందు. (58)
న నివర్తేత్ పునర్జీవన్ కశ్చిదన్యో మమోదరాత్ ।
బ్రాహ్మణం వర్జయిత్వైకం తస్మాద్ విద్యామవాప్నుహి ॥ 59
ఒక్క బ్రాహ్మణుడు తప్ప వేరొకడెవడూ నాఉదరం నుండి మళ్ళీ జీవిస్తూ బయటకు రాకూడదు. అందువల్ల ఈవిద్యను పొందు. (59)
పుత్రో భూత్వా భావయ భావితో మామ్
అస్మద్దేహాదుపనిష్క్రమ్య తాత ।
సమీక్షేథా ధర్మవతీ మవేక్షాం
గురోః సకాశాత్ ప్రాప్య విద్యాం సవిద్యః ॥ 60
నాయనా! నా శరీరంనుండి జీవంతో బయటకు వచ్చి నాఖు పుత్రతుల్యుడవై, నన్ను మరల భావించి జీవింపచెయ్యి. గురువునుండి విద్యనుపొంది, విద్వాంసుడవైన తవాతకూడ ధర్మబద్ధమయిన దృష్టితో చూడాలి. (60)
వైశంపాయన ఉవాచ
గురోః సకాశాత్ సమవాప్య విద్యాం
భిత్వా కుక్షిం నిర్విచక్రామ విప్రః ।
కచో ఽభిరూప స్తత్క్షణాద్ బ్రాహ్మణస్య
శుక్లాత్యయే పౌర్ణమాస్యామివేందుః ॥ 61
వైశంపాయనుడిలా అన్నాడు - గురువు దగ్గర నుండి విద్యపొంది, శుక్రుని ఉదరం చీల్చుకొని కచుడు తత్ క్షణం బయటకు వచ్చాడు. అపుడతడు శుక్లపక్షం చివరవచ్చే పున్నమినాటి చంద్రునిలా ఉన్నాడు. (61)
దృష్ట్వా చ తం పతితం బ్రహ్మరాశిమ్
ఉత్థాపయామాస మృతం కచోఽపి ।
విద్యాం సిద్ధాం తామవాప్యాభివాద్య
తతః కచతం గురుమిత్యువాచ ॥ 62
కచుడు బ్రహ్మరాశివలె పడిఉన్న ఆ శుక్రుని చూచి, తాను పొందిన విద్యచేత శుక్రుని బ్రతికించి పైకి లేవదిశాడు. సంజీవినీవిద్యను పొంది కచుడు నమస్కరించి పిమ్మట ఇలా అన్నాడు. (62)
యః శ్రోత్రయోరమృతం సంనిషించేద్
విద్యామవిద్యస్య యథా మమాయమ్ ।
తం మన్యేఽహం పితరం మాతరం చ
తస్మై న ద్రుహ్యేత్ కృతమస్య జానన్ ॥ 63
విద్యలేని నాచెవులలో అమృతంవంటి మృతసంజీవినీ విద్యను నింపిన ఈ శుక్రాచార్యుని నేను నాతల్లిగా, తండ్రిగాకూడ భావిస్తున్నాను. అతడు చేసిన దానిని (ఉపకారాన్ని) గుర్తుంచుకొని అతనికి ద్రోహం చేయరాదు. (63)
ఋతస్య దాతారమనుత్తమస్య
నిధిం నిధీనామపి లబ్ధవిద్యాః ।
యే నాద్రియంతే గురుమర్చనీయం
పాపాన్ లోకంస్తే వ్రజంత్యప్రతిష్ఠాః ॥ 64
సర్వోత్తమమైన వేదజ్ఞానాన్ని ఇచ్చి, నిధులన్నింటికి పెన్నిధి అయిన గురువునుండి విద్యలను పొంది పూజింపదగిన గురువును ఆదరించనివారు లోకంలో అప్రతిష్ఠను పొంది, పాపలోకాలకు వెళ్తారు. (64)
వైశంపాయన ఉవాచ
సురాపానాద్ వంచనాం ప్రాప్య విద్వాన్
సంజ్ఞానాశం చైవ మహాతిఘోరమ్ ।
దృష్ట్వా కచం చాపి తథాభిరూపం
పీతం తదా సురయా మోహితేన ॥ 65
సమన్యురుత్థామ మహానుభావః
తదోశనా విప్రహితం చికీర్షుః ।
సురాపానం ప్రతి సంజాతమన్యుః
కావ్యః స్వయం వాక్యమిదం జగాద ॥ 66
వైశంపాయనుడిలా అన్నాడు - విద్వాంసుడైన శుక్రుడు సురాపానంవల్ల మోసగింపబడి, గుర్తు (జ్ఞానం) నశించి మిక్కిలి ఘోరమైన స్థితిని పొందాడు. ఆ స్థితిలో తనకు ప్రియశిష్యుడైన కచుని చూసి కూడా, మద్యంచేత మోహితుడై మద్యాన్ని త్రాగాడు. ఈవిషయం తలుచుకొని మహానుభావుడైన శుక్రుడు కోపంతో లేచి, విప్రులకు హితాన్ను చేయగోరి, సురాపానం పట్ల కోపించి స్వయంగా ఈ మాటలన్నాడు. (65,66)
యో బ్రాహ్మణొఽద్యప్రభృతీహ కశ్చిత్
మోహాత్ సురాం పాస్యతి మందబుద్ధిః ।
అపేతధర్మా బ్రహ్మహా చైవ స స్యాద్
అస్మింల్లోకే గర్హితః స్యాత్ పరే చ ॥ 67
ఈ లోకంలో ఇప్పటినుండి ఏ బ్రాహ్మణుడైనా తెలివితక్కువతనంతో మోహంవల్ల మద్యాన్ని త్రాగితే, అతడు ధర్మం తప్పినవాడు, బ్రహ్మహత్య చేసినవాడూ కాగలడు. ఈలోకంలోను, పరలోకంలోను నిందితుడౌతాడు. (67)
మయా చైతాం విప్రదర్మోక్తిసీమాం
మర్యాదాం వై స్థాపితాం సర్వలోకే ।
సంతో విప్రాః శుశ్రువాంసో గురూణాం
దేవా లోకాశ్చోపశృణ్వంతు సర్వే ॥ 68
సమస్తలోకంలోను విప్రధర్మశాస్త్రానికి హద్దయిన ఈ మర్యాదను నేను స్థాపిస్తున్నాను. గురువులకు సేవచేయాలనుకొనే శిష్యులు, సత్పురుషులు, విప్రులు సమస్తదేవలోకాలు ఈ మాటను వినండి. (68)
ఇతీదముక్త్వా స మహానుభావః
తపోనిధీనాం నిధిరప్రమేయః ।
తాన్ దానవాన్ దైవవిమూశబుద్ధీన్
ఇదం సమాహూయ వచోఽభ్యువాచ ॥ 69
అని ఈ విధంగా చెప్పి తపోనిధులకు నిధి, కొలవశక్యం గాని మహానుభావుడు అయిన శుక్రుడు దైవంపట్ల విముఖమైన బుద్ధిగల ఆ దానవులను పిలిచి ఇలా చెప్పాడు. (69)
ఆచక్షే వో దానవా బాలిశాః స్థ
సిద్ధః కచో వత్స్యతి మత్సకాశే ।
సంజీవినీం ప్రాప్య విద్యాం మహాత్మా
తుల్యప్రభావో బ్రాహ్మణో బ్రహ్మభూతః ॥ 70
దానవులారా! మీకు చెపుతున్నాను. మీరు ఇంకా బాలచేష్టలు చేస్తున్నారు. కచుడు విద్యాసిద్ధి పొందినవాడు. నాదగ్గరే ఉంటాడు. సంజీవినీ విద్యను పొంది నాతో సమానమైన ప్రభావం కలవాడు, మహాత్ముడు, బ్రాహ్మణుడు, బ్రహ్మస్వరూపుడూను. (70)
(యోఽకార్షీద్దుష్కరం కర్మ దేవానాం కారణాత్ కచః ।
న తత్కీర్తిర్జరాం గచ్ఛేద్ యజ్ఞియశ్చ భవిష్యతి ॥)
ఏతావదుక్త్వా వచనం విరరామ స భార్గవః ।
దానవా విస్మయావిష్టాః ప్రయయుః స్వం నివేశనమ్ ॥ 71
(దేవతల కారణంగా దుష్కరమైన కర్మను కచుడు చేశాడు. దానివల్ల కలిగిన కీర్తి జీర్ణించిపోదు. యజ్ఞభాగం కూడ ఉంటుంది.) ఇంతమాత్రం చెప్పి భార్గవుడు విరమించాడు. దానవులు ఆశ్చర్యపడి స్వనివాసాలకు వెళ్ళారు. (71)
గురోరుష్య సకాశే తు దశవర్షశతాని సః ।
అనుజ్ఞాతః కచో గంతుమ్ ఇయేష త్రిదశాలయమ్ ॥ 72
ఆ కచుడు గురువు వద్ద వెయ్యిసంవత్సరాలు ఉండి, గురువుచే అనుమతింపబడి స్వర్గానికి వెళ్ళగోరాడు. (72)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే షట్ సప్తతితమోఽధ్యాయః ॥ 76 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమను డెబ్బది ఆరవ అధ్యాయము. (76)
(దాక్షిణాత్య అధికపాఠము 2 శ్లోకాలతో కలిపి మొత్తం 74 శ్లోకాలు)