TODO: Page 309 - Chapter beginning is missing
పునశ్చ నాహుషో రాజా మృగలిప్సుర్యదృచ్ఛయా ॥ 4
తమేవ దేశం సంప్రాప్తః జలార్థీ శ్రమకర్శితః ।
దదృశే దేవయానీం స శర్మిష్ఠాం తాశ్చ యోషితః ॥ 5
దాసీ సహస్రంతో, శర్మిష్ఠతో పాటు వనంలో (ఇంతకు ముందు నూతిలో పడిన) ఆ ప్రదేశానికి దేవయాని వెళ్ళింది. స్వేచ్ఛగా సంచరించింది. చెలులతో బాటు అందరూ ఆనందంతో ఆటలాడుతున్నారు. పరస్పరం ప్రీతితో మధుమాసంలో తేనె త్రాగుతున్నారు. ఎన్నో విధాల భక్ష్యాలను, ఫలాలను తింటున్నారు. ఆ సమయంలో మళ్లీ నహుషుని కుమారుడైన యయాతి మృగాలను వేటాడుతూ దాహంతో అలసటతో కృశించి అనుకోకుండా వారున్న ప్రదేశానికి వచ్చాడు. దేవయానిని, శర్మిష్ఠను, ఆస్త్రీలను అతడు చూశాడు. (2-5)
పిబంతీర్లలమానాశ్చ దివ్యాభరణభూషితాః ।
(ఆసనే ప్రవరే దివ్యే సర్వాభరణభూషితే ।)
ఉపవిష్టాం చ దదృశే దేవయానీం శుచిస్మితామ్ ॥ 6
మధువును త్రాగుతూ, ఆడుతూ, దివ్యమైన ఆభరణాలతో అలంకరింపబడిన వారినందరినీ చూశాడు. దివ్యమైన ఆభరణాలతో అలంకరింపబడిన ఒక ఆసనం మీద కూర్చుని చిరునవ్వు నవ్వుతున్న దేవయానిని చూశాడు. (6)
రూపేణాప్రతిమాం తాసాం స్త్రీణాం మధ్యే వరాంగనామ్ ।
శర్మిష్ఠయా సేవ్యమానాం పాదసంవాహనాదిభిః ॥ 7
సాటిలేని రూపంతో, స్త్రీల మధ్యలో శర్మిష్ఠ చేత పాద సంవాహనం చేయించుకొంటున్న శ్రేష్ఠమైన స్త్రీని చూశాడు. (7)
యయాతిరువాచ
ద్వాభ్యాం కన్యాసహస్రాభ్యాం ద్వే కన్యే పరివారితే ।
గోత్రే చ నామనీ చైవ ద్వయోః పృచ్ఛామ్యహం శుభే ॥ 8
యయాతి ఇలా అన్నాడు - రెండు వేల కన్యలతో కలిసి మీరిద్దరు కన్యలు ఉన్నారు. మీ వంశాలేవి? పేర్లు ఏమిటి? నేనడుగుతున్నాను, చెప్పండి. (8)
దేవయాన్యువాచ
ఆఖ్యాస్యామ్యహమాదత్స్వ వచనం మే నరాధిప ।
శుక్రో నామాసురగురుః సుతాం జానీహి తస్య మామ్ ॥ 9
దేవయాని ఇలా అంది - నరాధిపా! నేను చెప్తాను, నామాటను గ్రహించు. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు, అతని కూతురిని నేను. (9)
ఇయం చ మే సఖీ దాసీ యత్రాహం తత్ర గామినీ ।
దుహితా దానవేంద్రస్య శర్మిష్ఠా వృషపర్వణః ॥ 10
ఈమె దానవేంద్రుడు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ, నాకు సఖి, దాసి. నేనెక్కడకు వెళితే అక్కడకు వస్తుంది. (10)
యయాతి రువాచ
కథం తు తే సఖీ దాసీ కన్యేయం వరవర్ణినీ ।
అసురేంద్రసుతా సుభ్రూః పరం కౌతూహలం హి మే ॥ 11
యయాతి ఇలా అంది - సుందరీ! ఈ కన్య నీకు సఖి, దాసి ఎలా అయింది? ఈమె రాక్షసరాజు కూతురు కదా! నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. (11)
దేవయాన్యువాచ
సర్వ ఏవ నరశ్రేష్ఠ విధానమనువర్తతే ।
విధానవిహితం మత్వా మా విచిత్రాః కథాః కృథాః ॥ 12
దేవయాని ఇలా అంది - నరశ్రేష్ఠా! ఈ లోకంలో అన్నీ విధిననుసరించి జరుగుతాయి. విధి విహితమని గ్రహించు. ఆశ్చర్యకరాలైన సంఘటనలను గురించి ప్రశ్నించవద్దు. (12)
రాజవద్రూపవేషౌ తే బ్రాహ్మీం వాచం బిభర్షి చ ।
కో నామ త్వం కుతశ్చాపి కస్య పుత్రశ్చ శంస మే ॥ 13
ఈ నీ రూపం, వేషం, రాజువివలె ఉన్నాయి. మాటమాత్రం బ్రాహ్మణుని మాటలా ఉంది. నీవెవరు? ఎక్కడ నుండి వచ్చావు. ఎవరి కుమారుడివి? నాకు చెప్పు. (13)
యయాతిరువాచ
బ్రహ్మచర్యేణ వేదో మే కృత్స్నః శ్రుతిపథం గతః ।
రాజాహం రాజపుత్రశ్చ యయాతిరితి విశ్రుతః ॥ 14
యయాతి ఇలా అన్నాడు - బ్రహ్మచర్యంతో నేను సంపూర్ణమైన వేదాన్ని అధ్యయనం చేశాను. నేను రాజును. రాజకుమారుడిని. యయాతి అని ప్రసిద్ధికెక్కాను. (14)
దేవయాన్యువాచ
కేనాస్యర్థేన నృపతే ఇమం దేశముపాగతః ।
జిఘృక్షుర్వారిజం కించిద్ అథవా మృగలిప్సయా ॥ 15
దేవయాని ఇలా అంది - రాజా! నీవు ఏ పనిమీద ఈ ప్రదేశానికి వచ్చావు? పద్మగంధాన్ని ఆస్వాదించడం కోసం ఇక్కడకు వచ్చావా? లేక మృగాన్ని వెంటాడుతూ ఇలా వచ్చావా? (15)
యయాతి రువాచ
మృగలిప్సురహం భద్రే పానీయార్థముపాగతః ।
బహుధాప్యనుయుక్తోఽస్మి తదనుజ్ఞాతుమర్హసి ॥ 16
యయాతి ఇలా చెప్పాడు - కళ్యాణీ! మృగాన్ని వెంటాడుతూ నేను నీటికోసం ఇక్కడకు వచ్చాను. మిక్కిలి అలసి ఉన్నాను. అందువల్ల ఇంక నేను వెళ్ళడానికి అనుమతించు. (16)
దేవయాన్యువాచ
ద్వాభ్యాం కన్యాసహస్రాభ్యాం దాస్యా శర్మిష్ఠయా సహ ।
త్వదధీనాస్మి భద్రం తే సఖా భర్తా చ మే భవ ॥ 17
దేవయాని ఇలా అంది - రెండు వేల దాసీలతో ఉన్న దాసియైన శర్మిష్ఠతోపాటుగా నీకు అధీనురాలినవుతున్నాను. నాకు సఖుడవు. భర్తవు కమ్ము. నీకు శుభమగుగాక. (17)
యయాతి రువాచ
విద్ధ్యౌశనసి భద్రం తే న త్వామర్హోస్మి భావిని ।
అవివాహ్యా హి రాజానః దేవయాని పితుస్తవ ॥ 18
యయాతి ఇలా అన్నాడు - శుక్రుని కూతురగు దేవయానీ! నీకు శుభమగుగాక. భావిని! నిన్ను వివాహమాడటానికి నేను తగినవాడను కాను. నీ తండ్రితో క్షత్రియులు వివాహసంబంధానికి యోగ్యులు కారు కదా! (18)
దేవయాన్యువాచ
సంసృష్టం బ్రహ్మణా క్షత్రం క్షత్రేణ బ్రహ్మ సంహితమ్ ।
ఋషిశ్చాప్యృషిపుత్రశ్చ నాహుషాంగ వహస్వ మామ్ ॥ 19
దేవయాని ఇలా అంది - యయాతీ! బ్రాహ్మణులతో క్షత్రియులు, క్షత్రియులతో బ్రాహ్మణులు మునుపే కలిశారు. నీవు రాజర్షివి, రాజర్షిపుత్రుడవు కూడా. నన్ను వివాహమాడు. (19)
యయాతిరువాచ
ఏకదేహోద్భవా వర్ణాః చత్వారోఽపి వరాంగనే ।
పృథగ్ ధర్మాః పృథక్ శౌచాః తేషాం తు బ్రాహ్మణో వరః ॥ 20
యయాతి ఇలా అన్నాడు - సుందరీ! ఈ బ్రాహ్మణాదివర్ణాలు నాలుగూ ఒక దేహం నుండి పుట్టినవే. కాని వేరు వేరు ధర్మాలు, వేరు వేరు శౌచాలు (ఆచార వ్యవహారాలు) వారికి ఉన్నాయి. వారిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. (20)
దేవయాన్యువాచ
పాణిధర్మో నాహుషాయం న పుంభిః సేవితః పురా ।
తం మే త్వమగ్రహీరగ్రే వృణోమి త్వామహం తతః ॥ 21
దేవయాని ఇలా అంది - నహుషకుమారా! పాణిగ్రహణ మనే ధర్మం స్త్రీలకి ముఖ్యమైంది. మునుపు ఏ పురుషుడూ నన్ను స్వీకరించలేదు. ఇంతకు ముందే నీవు నాపాణిని (చేతిని) గ్రహించావు. అందుకే నేను నిన్ను వరిస్తున్నాను. (21)
కథం ను మే మనస్విన్యాః పాణిమన్యః పుమాన్ స్పృశేత్ ।
గృహీత మృషిపుత్రేణ స్వయం వాప్యృషిణా త్వయా ॥ 22
మనస్సు తన అధీనంలో గల నా చేతిని వేరొక పురుషుడు ఎలా తాకగలడు? ఋషి పుత్రుడవో, స్వయంగా ఋషివో అయిన నీవు నా చేతిని పట్టుకొన్న తర్వాత, వేరొకడు ఎలా పట్టుకొంటాడు? (22)
యయాతిరువాచ
క్రుద్ధాదాశీవిషాత్ సర్పాత్ జ్వలనాత్ సర్వతోముఖాత్ ।
దురాధర్షతరో విప్రః జ్ఞేయః పుంసా విజానతా ॥ 23
యయాతి ఇలా అన్నాడు - కోపించిన విషసర్పం కంటె, మండుతున్న అగ్నికంటెకూడ విప్రుడు భయంకరమైన వాడని విజ్ఞుడైన పురుషుడు గ్రహించాలి. (23)
దేవయాన్యువాచ
కథమాశీవిషాత్ సర్పాత్ జ్వలనాత్ సర్వతోముఖాత్ ।
దురాధర్షతరో విప్రః ఇత్యాత్థ పురుషర్షభ ॥ 24
దేవయాని ఇలా అంది - పురుషోత్తమా! విషసర్పంకంటే, మండుతున్న అగ్నికంటే కూడా విప్రుడు భయంకరమైన వాడని ఎలా చెపుతున్నావు? (24)
యయాతిరువాచ
ఏకమాశీవిషో హంతి శస్త్రేణైకశ్చ వధ్యతే ।
హంతి విప్రః సరాష్ట్రాణి పురాణ్యపి హి కోపితః ॥ 25
దురాధర్షతరో విప్రః తస్మాద్ భీరు మతో మమ ।
అతో ఽదత్తాం చ పిత్రా త్వాం భద్రే న వివహామ్యహమ్ ॥ 26
యయాతి ఇలా అన్నాడు - సర్పం ఒక్కడినే చంపుతుంది. ఆయుధం చేత ఒకడే చంపబడతాడు. కాని కోపించిన విప్రుడు నగరాలను, రాష్ట్రాలను కూడ నాశనం చేయగలడు. అందువల్లనే విప్రుడు మిక్కిలి భయంకరమైన వాడు అని నా అభిప్రాయం. కళ్యాణీ! అందువల్ల నీ తండ్రి ఇవ్వకుండా, నిన్ను నేను వివాహం చేసుకోలేను. (25,26)
దేవయాన్యువాచ
దత్తాం వహస్య తన్మాం త్వం పిత్రా రాజన్ వృతో మయా ।
అయాచతో భయం నాస్తి దత్తాం చ ప్రతిగృహ్ణతః ॥ 27
(తిష్ఠ రాజన్ ముహూర్తం తు ప్రేషయిష్యామ్యహం పితుః ।
దేవయాని ఇలా అంది - రాజా! అలాగయితే నా తండ్రి ఇచ్చాక నన్ను స్వీకరించు. నెను నిన్ను వరించాను. అడగకుండగా, ఇతరులు ఇచ్చిన దాన్ని తీసికొనేవాడికి భయంలేదు. (27)
(రాజా! ఒక ముహూర్తకాలం వేచి ఉండు. నేను తండ్రికి వర్తమానం పంపుతాను.)
గచ్ఛత్వం ధాత్రికే శీఘ్రం బ్రహ్మకల్పమిహానయ ॥
స్వయం వరే వృతం శీఘ్రం నివేదయ చ నాహుషమ్ ॥)
ధాత్రీ! నివు వెళ్ళు. బ్రహ్మకల్పుడైన నా తండ్రిని ఇక్కడకు తీసికొనిరా. నహుషకుమారుని స్వయంవరంలో వరించానని చెప్పు.
వైశంపాయన ఉవాచ
త్వరితం దేవయాన్యాథ సందిష్టం పితురాత్మనః ।
సర్వం నివేదయామాస ధాత్రీ తస్మై యథాతథమ్ ॥ 28
వైశంపాయనుడిలా అన్నాడు - అలా దేవయాని తొందరగా తన తండ్రి దగ్గరకు సందేశాన్ని పంపింది. ధాత్రి ఉన్నదున్నట్లుగా అతడకి అంతా నివేదించింది. (28)
శ్రుత్వైవ చ స రాజానం దర్శయామాస భార్గవః ।
దృష్ట్వైవ చాగతం శుక్రం యయాతిః పృథివీపతిః ।
వవందే బ్రాహ్మణం కావ్యం ప్రాంజలిః ప్రణతః స్థితః ॥ 29
వినగానే భార్గవుడు వచ్చి రాజును చూశాడు. శుక్రాచార్యుడు రావడం చూసిన వెంటనే రాజు యయాతి శుక్రునికి నమస్కరించాడు. కవికుమారుడు బ్రహ్మతేజస్వి అయిన శుక్రునికి చేతులు జోడించి నమస్కరిస్తూ నిలిచాడు. (29)
దేవయాన్యువాచ
రాజాయం నాహుష స్తాత దుర్గమే పాణిమగ్రహీత్ ।
నమస్తే దేహి మామస్మై లోకే నాన్యం పతిం వృణే ॥ 30
దేవయాని ఇలా అంది - తండ్రీ! ఇతడు రాజు. నహుషుని కుమారుడు. అరణ్యంలో నాపాణిని గ్రహించాడు. నీకు నమస్కారం. నన్ను ఇతనికియ్యి. లోకంలో ఇతురుడెవ్వరినీ పతిగా వరించను. (30)
శుక్ర ఉవాచ
వృతో ఽనయా పతిర్వీర సుతయా త్వం మమేష్టయా ।
గృహాణేమాం మయా దత్తాం మహిషీం నాహుషాత్మజ ॥ 31
శుక్రుడిలా అన్నాడు - వీరా! నాకు ఇష్టురాలయిన నా కూతురు నిన్ను పతిగా వరించింది. నహుషకుమారా! నేనీమెను నీకు దానం చేస్తున్నాను. నీవీమెను పట్టమహిషిగా స్వీకరించు. (31)
యయాతిరువాచ
అధర్మో న స్పృశేదేషః మహాన్ మామిహ భార్గవ ।
వర్ణసంకరజో బ్రహ్మన్నితి త్వాం ప్రవృణోమ్యహమ్ ॥ 32
యయాతి ఇలా అన్నాడు - భార్గవా! ఈమెను స్వీకరించిన పిదప వర్ణసాంకర్యం వల్ల వచ్చే మహాపాపం నన్ను తాకకూడదు. అలా అనుగ్రహింపగోరుతున్నాను. (32)
శుక్ర ఉవాచ
అధర్మాత్ త్వాం విముంచామి వృణు త్వం వరమీప్సితమ్ ।
అస్మిన్ వివాహే మా మ్లాసీః అహం పాపం నుదామి తే ॥ 33
శుక్రుడిలా అన్నాడు - నిన్ను అధర్మం నుండి విముక్తుని చేస్తున్నాను. నీకిష్టమైన వరాన్ని కోరుకో. ఈ వివాహ విషయంలో నీకు దుఃఖం కలుగదు. నీకు కలిగే పాపాన్ని నేను పోగొడతాను. (33)
వహస్వ భార్యాం ధర్మేణ దేవయానీం సుమధ్యమామ్ ।
అనయా సహ సంప్రీతిమ్ అతులాం సమవాప్నుహి ॥ 34
సుందరియైన దేవయానిని ధర్మం ప్రకారంగా భార్యగా స్వీకరించు. ఈమెతో కలిసి అసాధారణమైన ఆనందాన్ని అనుభవించు. (34)
ఇయమ్ చాపి కుమారీ తే శర్మిష్ఠా వార్షపర్వణీ ।
సంపూజ్యా సతతం రాజన్ మా చైనాం శయనే హ్వయేః ॥ 35
ఈ వృషపర్వుని కూతురు శర్మిష్ఠ కుడ కన్యయే. రాజా! ఈమెను నీవు గౌరవించాలి. అంతేగాని (పక్క) శయనం మీదికి ఎప్పుడూ ఆహ్వానించకూడదు. (35)
(రహస్యేనాం సమాహూయ న వదేర్న చ సంస్పృశేః ।
వహస్వ భార్యాం భద్రం తే యథాకామమవాప్య్ససి ॥)
ఈమెను రహస్యంగా పిలిచి మాట్లాడటం, తాకడం చేయకూడదు. నీకోరిక ననుసరించి నీభార్యను నీవు వహించు. నీకు మంగళమవుతుంది.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తో యయాతిస్తు శుక్రం కృత్వా ప్రదక్షిణమ్ ।
శాస్త్రోక్తవిధినా రాజా వివాహమకరోచ్ఛుభమ్ ॥ 36
వైశంపాయనుడిలా అన్నాడు - ఇలా చెప్పాక యయాతి శుక్రునికి ప్రదక్షిణం చేసి శాస్త్రోక్తప్రకారంగా వివాహ శుభకార్యాన్ని ఆచరించాడు. (36)
లబ్ధ్వా శుక్రాన్మహద్ విత్తం దేవయానీం తదోత్తమామ్ ।
ద్విసహస్రేణ కన్యానాం తథా శ్ర్మిష్ఠయా సహ ॥ 37
సంపూజితశ్చ శుక్రేణ దైత్యైశ్చ నృపసత్తమః ।
జగామ స్వపురం హృష్టః అనుజ్ఞాతో ఽథ మహాత్మనా ॥ 38
శుక్రుని నుండి గొప్పధనాన్ని పొంది, రెండు వేల కన్యకలతో నున్న శర్మిష్ఠతో పాటుగా దేవయానిని స్వీకరించాడు. రాక్షసులు, శుక్రాచార్యుడు అతనిని పూజించారు. అనంతరం ఆనందంతో ఆ మహారాజు శుక్రుని అనుమతి తీసికొని తన నగరానికి వెళ్ళాడు. (37,38)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే ఏకాశీతితమోఽధ్యాయః ॥ 81 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమను ఎనుబది ఒకటవ అధ్యాయము. (81)
(దాక్షిణాత్య అధికపాఠము 3 శ్లోకాలతో కలిపి మొత్తం 41 శ్లోకాలు)