101. నూట ఒకటవ అధ్యాయము

చిత్రాంగద వృత్తాంతము.

వైశంపాయన ఉవాచ
(చేదిరాజసుతాం జ్ఞాత్వా దాశరాజేన వర్థితామ్ ।
వివాహం కారయామాస శాస్త్రదృష్టేన కర్మణా ॥)
తతో వివాహే నిర్వృతే స రాజా శాంతనుర్నృపః ।
తాం కన్యాం రూపసంపన్నాం స్వగృహే సంన్యవేశయత్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. సత్యవతి చేదిరాజు కుమార్తె అనీ, దాశరాజు దగ్గర పెరిగిందనీ తెలిసి శాంతనుడు ఆమెను శాస్త్రోక్తంగా వివాహమాడాడు. వివాహమైన తరువాత శాంతనుమహారాజు రూపసంపన్న అయిన సత్యవతిని అంతఃపురంలో ఉంచాడు. (1)
తతః శాంతనవో ధీమాన్ సత్యవత్యామజాయత ।
వీరశ్చిత్రాంగదో నామ వీర్యవాన్ పురుషేశ్వరః ॥ 2
కొంతకాలం తర్వాత సత్య్వతి గర్భంలో శాంతనునకు ఒక కొడుకు పుట్టాడు. అతడు బుద్ధిమంతుడు, వీరుడూ, పరాక్రమవంతుడూ, నరశ్రేష్ఠుడు కూడా. పేరు చిత్రాంగదుడు. (2)
అథాపరం మహేష్వాసం సత్యవత్యాం సుతం ప్రభుః ।
విచిత్రవీర్యం రాజానం జనయామాస వీర్యవాన్ ॥ 3
ఆ తర్వాత శాంతనుడు సత్యవతి ద్వారా, మరొక కొడుకును కన్నాడు. అతడు విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడు కూడా పరాక్రమవంతుడూ, మేటి విలుకాడు. (3)
అప్రాప్తవతి తస్మింస్తు యౌవనం పురుషర్షభే ।
స రాజా శాంతనుర్ధీమాన్ కాలధర్మముపేయివాన్ ॥ 4
పురుషశ్రేష్ఠుడైన విచిత్రవీర్యుడు యౌవనాన్ని పొందాక ధీమంతుడైన ఆ శాంతనుమహారాజు కాలధర్మాన్ని పొందాడు. (4)
స్వర్గతే శాంతనౌ భీష్మః చిత్రాంగదమరిందమమ్ ।
స్థాపయామాస వై రాజ్యే సత్యవత్యా మతే స్థితః ॥ 5
శాంతనుడు మరణించగా భీష్ముడు సత్యవతి అనుమతితో అరిందముడైన చిత్రాంగదుని రాజును చేశాడు. (5)
స తు చిత్రాంగదః శౌర్యాత్ సర్వాంశ్చిక్షేప పార్థివాన్ ।
మనుష్యం న హి మేనే సః కంచిత్ సదృశమాత్మనః ॥ 6
ఆ చిత్రాంగదుడు పరాక్రమంతో రాజులనందరినీ తిరస్కరించసాగాడు. తనతో సమానమైన మనుష్యుడొక్కడూ లేడని భావించాడు. (6)
తం క్షిపంతం సురాంశ్చైవ మనుష్యానసురాంస్తథా ।
గంధర్వరాజో బలవాన్ తుల్యనామాభ్యయాత్ తదా ॥ 7
మనుష్యులను, దేవతలనూ, రాక్షసులనూ ఆ విధంగా రెచ్చగొడుతున్న ఆ చిత్రాంగదునకు అదే పేరు గల బలిష్ఠుడైన ఒక గంధర్వరాజు తారసిల్లాడు. (7)
(గంధర్వ ఉవాచ
త్వం వై సదృశనామాసి యుద్ధం దేహి నృపాత్మజ ।
నామచాన్యత్ ప్రగీణీష్వ యది యుద్ధం న దాస్యసి ॥
త్వయాహం యుద్ధమిచ్ఛామి త్వత్సకాశాత్ తు నామతః ।
ఆగతోఽస్మి వృథాభాష్యః న గచ్ఛేన్నామతో యథా ॥)
గంధర్వుడిలా అన్నాడు. రాజకుమారా! నా పేరు నీవు పెట్టుకొన్నావు కాబట్టి నాతో యుద్ధం చేయి. యుద్ధం చేయటమిష్టం లేకపోతే పేరు మార్చుకో. నీతో నేను యుద్ధం చేయదలచాను. పేర్లు సమానం కాబట్టే నేణు నీ దగ్గరకు వచ్చాను. నా పేరుతో నిరర్థకంగా మాటాడే మనుష్యుడు నా దగ్గర నుండి క్షేమంగా వెళ్లగూడదు.
తేనాస్య సుమహద్ యుద్ధం కురుక్షేత్రే బభూవ హ ।
తయోర్బలవతోస్తత్ర గంధర్వకురుముఖ్యయోః ।
నద్యాస్తీరే సరస్వత్యాః సమాస్తిస్రోఽభవద్ రణః ॥ 8
తస్మిన్ విమర్ధే తుములే శస్త్రవర్షసమాకులే ।
మాయాధికోఽవధీద్ వీరం గంధర్వః కురుసత్తమమ్ ॥ 9
ఆ గంధర్వరాజుతో కురుక్షేత్రంలో చిత్రాంగదునకు ఘోరయుద్ధం జరిగింది. శస్త్రవర్ష సమాకులమై, ఘోరమయిన ఆ యుద్ధంలో మాయతో ఆధిక్యాన్ని ప్రదర్శించి గంధర్వుడు చిత్రాంగదుని చంపివేశాడు. (8,9)
స హత్వా తు నరశ్రేష్ఠం చిత్రాంగదమరిందమమ్ ।
అంతాయ క్ఠ్ఠుత్వా గంధర్వః దివమాచక్రమే తతః ॥ 10
అరిందముడూ, నరశ్రేష్ఠుడూ అయిన ఆ చిత్రాంగదుని చంపి గంధర్వుడు యుద్ధం ముగించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. (10)
తస్మిన్ పురుషశార్దూలే నిహతే భూరితేజసి ।
భీష్మః శాంతనవో రాజా ప్రేతకార్యాణ్యకారయత్ ॥ 11
పురుషశ్రేష్ఠుడై మహాపరాక్రమం గల ఆ చిత్రాంగదుడు మరణించగా భీష్ముడు అంత్యకియలు జరిపించాడు. (11)
విచిత్రవీర్యం చ తదా బాలమప్రాప్త్రయౌవనమ్ ।
కురురాజ్యే మహాబాహుః అభ్యషించదనంతరమ్ ॥ 12
అప్పుడు బాలుడై, ఇంకా యౌవనాన్ని పొందని విచిత్రవీర్యుని మహాబాహువయిన భీష్ముడు అనంతర నరపాలుని చేశాడు. (12)
విచిత్రవీర్యః స తదా భీష్మస్య వచనే స్థితః ।
అన్వశాసన్మహారాజ పితృపైతామహం పదమ్ ॥ 13
మహారాజా! అప్పుడు విచిత్రవీర్యుడు ఆ భీష్ముని మాట వింటూ వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యాన్ని పరిపాలించాడు. (13)
స ధర్మశాస్త్రకుశలం భీషమం శాంతనవం నృపః ।
పూజయామాస ధర్మేణ స చైనం ప్రత్యపాలయత్ ॥ 14
ఆ విచిత్రవీర్య మహారాజు ధర్మశాస్త్ర కుశలుడూ, శాంతను కుమారుడూ అయిన భీష్ముని ధర్మబద్ధంగా గౌరవించేవాడు. ఆ బీష్ముడు కూడా విచిత్రవీర్యుని సంరక్షించేవాడు. (14)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి చిత్రాంగదోపాఖ్యానే ఏకాధికశతతమోఽధ్యాయః ॥ 101 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున చిత్రాంగదోపాఖ్యానమను నూటయొకటవ అధ్యాయము. (101)
(దాక్షిణాత్య అధికపాఠం 3 శ్లోకాలతో కలిపి మొత్తం 17 శ్లోకాలు)