103. నూట మూడవ అధ్యాయము

భీష్మ సత్యవతీ సంవాదము.

వైశంపాయన ఉవాచ
తతః సత్యవతీ దీనా కృపణా పుత్రగృద్ధినీ ।
పుత్రస్య కృత్వా కార్యాణి స్నుషాభ్యాం సహ భారత ॥ 1
సమాశ్వాస్య స్నుషే తే చ భీష్మం శస్త్రభృతాం వరమ్ ।
ధర్మం చ పితృవంశం చ మాతృవంశం చ భావినీ ।
ప్రసమీక్ష్య మహాభాగా గాంగేయం వాక్యమబ్రవీత్ ॥ 2
శాంతనోర్ధర్మనిత్యస్య కౌరవ్యస్య యశస్వినః ।
త్వయి పిండశ్చ కీర్తిశ్చ సంతానం చ ప్రతిష్ఠితమ్ ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆ తరువాత పుత్రవ్యామోహంతో సత్యవతి దీనురాలై, కోడళ్ళతో కలిసి విచిత్ర వీర్యునకు ప్రేతకార్యాలు నిర్వహింపజేసింది. కోడళ్ళనూ, మేటియోధుడయిన భీష్మునీ ఊరడించింది. మహానుభావురాలయిన ఆమె ధర్మాన్నీ, తన మాతృవంశాన్నీ, పితృవంశాన్నీ, మనసులో ఉంచుకొని భీష్మునితో ఇలా అన్నది- కౌరవవంశజుడూ, కీర్తిమంతుడూ, ధర్మాసక్తుడూ అయిన శాంతనునకు పిండమూ, కీర్తి, వంశాభివృద్ధి అన్నీ ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. (1-3)
యథా కర్మ శుభం కృత్వా స్వర్గోపగమనం ధ్రువమ్ ।
యథా చాయుర్ధ్రువం సత్యే త్వయి ధర్మస్తథా ధ్రువః ॥ 4
పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకప్రాప్తి నిశ్చితం. సత్యవచనంలో ఆయుర్వృద్ధి నిశ్చితం. అదే విధంగా నీవు ధర్మబద్ధుడవనుట కూడా నిశ్చితం. (4)
వేత్థ ధర్మాంశ్చ ధర్మజ్ఞ సమాసేనేతరేణ చ ।
వివిధాస్త్వం శ్రుతీర్వేత్థ వేదాంగాని చ సర్వశః ॥ 5
ధర్మాజ్ఞా! నీకు ధర్మాలన్నీ తెలుసు. ధర్మసూక్మాలు తెలుసు. ధర్మవిస్తృతీ తెలుసు. వివిధవేదాలూ, వేదాంగాలూ నీవు చక్కగా ఎఱుగుదువు. (5)
వ్యవస్థానం చ తే ధర్మే కులాచారం చ లక్షయే ।
ప్రతిపత్తించ కృచ్ఛ్రేషు శుక్రాంగిరసయోరివ ॥ 6
నీ ధర్మబద్ధతా, కులాచారపరిపాలనమూ నేను గమనిస్తూనే ఉన్నాను. ఇబ్బంది గలిగినప్పుడు శుక్రాచార్య, బృహస్పతులవలె కర్తవ్యనిర్ణయం చేయటంలో నివు మేటివి. (6)
తస్మాత్ సుభృశమాశ్వస్య త్వయి ధర్మభృతాం వర ।
కార్యే త్వాం వినియోక్ష్యామి తచ్ఛ్రుత్వా కర్తుమర్హసి ॥ 7
కాబట్టి, ధర్మజ్ఞశ్రేష్ఠా! నీ మీద గట్టి నమ్మకంతో నిన్నొక పనికి నియోగించబోతున్నాను. ముందు దానిని విని, ఆపై ఆచరించవలసినది. (7)
మమ పుత్రస్తవ భ్రాతా వీర్యవాన్ సుప్రియశ్చ తే ।
బాల ఏవ గతః స్వర్గమ్ అపుత్రః పురుషర్భభ ॥ 8
ఇమే మహిష్యౌ భ్రాతుస్తే కాశిరాజసుతే శుభే ।
రూపయౌవనసంపన్నే పుత్రకామే చ భారత ॥ 9
తమోరుత్పాదయాపత్యం సంతానాయ కులస్య నః ।
మన్నియోగాన్మహాబాహో ధర్మం కర్తుమిహార్హసి ॥ 10
పురుషశ్రేష్ఠా! నా కొడుకూ, నీకు తమ్ముడూ అయిన విచిత్ర వీర్యుడు పరాక్రమవంతుడే గాక నీకు ఇష్టమయిన వాడు. చిన్నప్పుడే సంతానం లేకుండానే మరణించాడు. భారతా! నీ సోదరుని భార్యలు, కాశిరాజు కుమార్తెలు మంచివారు. రూపయౌవనాలూ గలవారూ, సంతానాన్ని కోరుతున్న వారు కూడా. మహాబాహూ! మన వంశాభివృద్ధికై నా ఆజ్ఞతో వారియందు సంతానాన్ని పొందు. ఇది ధర్మబద్ధమయిన కార్యమే. (8-10)
రాజ్యే చైవాభిషిచ్యస్వ భారతాననుశాధి చ ।
దారాంశ్చ కురు ధర్మేణ మా నిమజ్జీః పితామహాన్ ॥ 11
రాజ్యపట్టాభిషేకం చేసికో. భారత ప్రజలను పరిపాలించు. ధర్మానుసారంగా పండ్లి చేసికో. పితరులను నరకంలో పడవేయవద్దు. (11)
వైశంపాయన ఉవాచ
తథోచ్యమాణో మాత్రా సః సుహృద్భిశ్చ పరంతపః ।
ఇత్యువాచాథ ధర్మాత్మా ధర్మ్యమేవోత్తరం వచః ॥ 12
వైశంపాయనుడిలా అన్నాడు. తల్లీ, మిత్రులూ ఆ రీతిగా పలుకగా పరంతపుడూ, ధర్మాత్ముడూ అయిన ఆ భీష్ముడు ధర్మానుకూలమైన సమాధానమిలా ఇచ్చాడు. (12)
అసంశయమ్ పరో ధర్మః త్వయా మాతరుదాహృతః ।
రాజ్యార్థే నాభిషించేయం నోపేయాం జాతు మైథునమ్ ।
త్వమపత్యం ప్రతి చ మే ప్రతిజ్ఞాం వేత్థ వై పరామ్ ॥ 13
జానాసి చ యథావృత్తం శుల్క హేతోస్త్వదంతరే ।
స సత్య్వతి సత్యం తే ప్రతిజానామ్యహం పునః ॥ 14
అమ్మా! నీవు చెప్పినది ధర్మబద్ధమే. సందేహమేమీ లెదు. కానీ నేను పట్టాభిషేకం చేసికొనను. ఎప్పుడూ వివాహం కూడా చేసికొనను. రాజ్యస్వీకారం, సంతానోత్పాదనం - ఈ రెండు విషయాల్లో నేను చేసిన తీవ్రప్రతిజ్ఞ నీకు తెలుసు. సత్యవతీ! నీకు శుల్కంగా ఇవ్వటానికి ఈ విషయంలో జరిగినదంతా నీకు తెలుసు. ఆ ప్రతిజ్ఞలను పాటించటానికై మరొకసారి నానిర్ణయాన్ని చెప్తున్నాను. (13,14)
పరిత్యజేయం త్రైలోక్యం రాజ్యం దేవేషు వా పునః ।
యద్ వాప్యధికమేతాభ్యాం న తు సత్యం కథంచన ॥ 15
మూడు లోకాల ఆధిపత్యాన్ని అయినా, దేవతా సామ్రాజ్యాన్ని అయినా - ఈ రెండింటిని మించిన దేనినయినా వదలగలను కానీ సత్యాన్ని మాత్రం ఎప్పుడూ విడనాడను. (15)
త్యజేచ్చ పృథివీ గంధమ్ ఆపశ్చ రసమాత్మనః ।
జ్యోతిస్తథా త్యజేద్ రూపం వాయుః స్పర్శగుణం త్యజేత్ ॥ 16
భూమి గంధాన్ని వదలి పెట్టవచ్చు. నీరు రుచిని వీడవచ్చు. తేజస్సు రూపాన్ని కోల్పోవచ్చు. గాలిస్పర్శను విడనాడవచ్చు. (16)
ప్రభాం సముత్సృజేదర్కః ధూమకేతుస్తథోష్మతామ్ ।
త్యజేచ్ఛబ్ధం తథాఽకాశం సోమః శీతాంశుతాం త్యజేత్ ॥ 17
సూర్యుడు వెలుగునూ, అగ్ని వేడినీ విడనాడవచ్చు. ఆకాశం శబ్ద గుణాన్ని వదలి పెట్టవచ్చు. చంద్రుడు చల్లదనాన్ని విడనాడవచ్చు. (17)
విక్రమం వృత్రహా జహ్యాద్ ధర్మం జహ్యాచ్చ ధర్మరాట్ ।
న త్వహం సత్యముత్స్రష్టుం వ్యవసేయం కథంచన ॥ 18
వృత్రుడు పరాక్రమాన్ని విడిచిపెట్టవచ్చు. యమధర్మరాజు ధర్మాన్ని వదలివేయవచ్చు. కానీ నేను ఏ రీతిగా కూడా సత్యపరిత్యాగానికి సిద్ధపడను. (18)
(తన్న జాత్వన్యథా కుర్యాం లోకానామపి సంక్షయే ।
అమరత్వస్య వా హేతోః త్రైలోక్యసదనస్య వా ॥
ఏవముక్తా తు పుత్రేణ భూరిద్రవిణతేజసా ।)
మాతా సత్యవతీ భీష్మమ్ ఉవాచ తదనంతరమ్ ॥ 19
జానామి తే స్థితిం సత్యే పరాం సత్యపరాక్రమ ।
ఇచ్ఛన్ సృజేథాః త్రీన్ లోకాన్ అన్యాంస్త్వం స్వేన తేజసా ॥ 20
జానామి చైవ సత్యం తత్ మదర్థే యచ్ఛ భాషితమ్ ।
ఆపద్ధర్మం త్వమావేక్ష్య వహ పైతామహీం ధురమ్ ॥ 21
లోకవినాశం ఏర్పడినా, నాకు అమరత్వం సిద్ధించినా, మూడులోకాల ఆధిపత్యమూ లభించినా నేను నా ప్రతిజ్ఞను విడనాడను. తేజస్సంపద గల భీష్ముడు ఆ విధంగా పలుకగా సత్యవతి ఇలా అన్నది - సత్యపరాక్రమా! నీసత్యనిష్ఠ తెలుసు. ణివు తలచుకొంటే ని తేజస్సుతో మరో మూడు లోకాలను సృష్టించగలవు అనీ తెలుసు. నా కోసమే నీవు చేసిన ఆ సత్యభాషణ కూడా తెలుసు. కానీ ఆపద్ధర్మంగా భావించి నీవు ఈ రాజ్యభారాన్ని వహించు. (19-21)
యథా తే కులతంతుశ్చ ధర్మశ్చ న పరాభవేత్ ।
సుహృదశ్చ ప్రహృష్యేరన్ తథా కురు పరంతప ॥ 22
పరంతపా! నీ వంశపరంపర నశించనిరీతిగా, ధర్మపరాభవం కలుగనిరీతిగా నీ మిత్రులందరూ మెచ్చుకొనేటట్లుగా నివు ఆచరించు. (22)
లాలప్యమానాం తామేవం కృపణాం పుత్రగృద్ధినీమ్ ।
ధర్మాదపేతం భ్రువతీం భీష్మో భూయోఽబ్రవీదిదమ్ ॥ 23
పుత్రకాంక్షతో దీనంగా ధర్మవిరుద్ధంగా మాటాడుతున్న సత్యవతితో భీష్ముడు మరలా ఇలా అన్నాడు - (23)
రాజ్ఞి ధర్మానవేక్షస్వ మా నః సర్వాన్ వ్యనీనశః ।
సత్యాచ్చ్యుతిః క్షత్రియస్య న ధర్మేషు ప్రశస్యతే ॥ 24
మహారాణీ! ధర్మాన్ని పరిశీలించు. అందరినీ నాశనం చేయవద్దు. క్షత్రియుడు సత్యభ్రష్టుడు కావటం ఏ ధర్మపద్ధతిలో కుడా నప్పదు. (24)
శాంతనోరపి సంతానం యథా స్యాదక్షయం భువి ।
తత్ తే ధర్మం ప్రవక్ష్యామి క్షాత్రం రాజ్ఞి సనాతనమ్ ॥ 25
మహారాణి! శాంతనుమహారాజ సంతతి కూడా భూలోకంలో అక్షయంగా నిలవ గల సనాతన క్షాత్రధర్మాన్ని చెపుతాను. (25)
శ్రుత్వా తం ప్రతిపద్యస్వ ప్రాజ్ఞైః సహ పురోహితైః ।
ఆపద్ధర్మార్థకుశలైః లోకతంత్రమవేక్ష్య చ ॥ 26
దానిని విని ప్రాజ్ఞులయిన పురోహితులతోనూ, ఆపద్ధర్మ విషయంలో నేర్పరులయిన వారితోనూ సంప్రతించి, లోకాచారాన్ని కూడా గమనించి నిశ్చయించుకో. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి భీష్మసత్యవతీ సంవాదే త్య్రధికశతతమోఽధ్యాయః ॥ 103 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున భీష్మసత్యవతీసంవాదమను నూట మూడవ అధ్యాయము. (103)