110. నూటపదవ అధ్యాయము

కర్ణజననము.

వైశంపాయన ఉవాచ
శూరోనామ యదుశ్రేష్ఠః వసుదేవపితాభవత్ ।
తస్య కన్యా పృథా నామ రూపేణాప్రతిమా భువి ॥ 1
వైశంపాయనుడిలా చెప్పాడు. యదువంశస్థులలో శ్రేష్ఠుడు శూరుడు. ఆయన కొడుకు వసుదేవుడు. శూరునకు ఒక కూత్రురు. ఆమె పేరు పృథ. సాటిలేని సౌందర్యవతి ఆమె. (1)
పితృష్వస్రీయాయ స తామ్ అనపత్యాయ భారత ।
అగ్ర్యమగ్రే ప్రతిజ్ఞాయ స్వస్యాపత్యం స సత్యవాక్ ॥ 2
జనమేజయా! సత్యవచనుడయిన శూరుడు అనపత్యుడై ఉన్న తన మేనత్తకొడుకుకు తనకు పుట్టబోయే తొలి సంతానాన్ని ఇస్తానని ముందుగానే మాట ఇచ్చాడు. (2)
అగ్రజామథ తాం కన్యాం శూరోఽన్య్గ్రహకంక్షిణే ।
ప్రదదౌ కుంతిభోజాయ సఖా సఖ్యే మహాత్మనే ॥ 3
శూరునకు ముందుగా ఆడపిల్ల పుట్టింది. మంచిమిత్రుడైన ఆ శూరుడు తన అనుగ్రహాన్ని కోరుతున్న మహనీయుడు, తన మిత్రుడూ అయిన కుంతిభోజునకు ఆ బిడ్డ నిచ్చాడు. (3)
సా నియుక్తా పితుర్గేహే దేవతాతిథిపూజనే ।
ఉగ్రం పర్యచరత్ తత్ర బాహ్మణం సంశితవ్రతమ్ ॥ 4
నిగూఢనిశ్చయం ధర్మే యం తం దుర్వాసనం విదుః ।
తముగ్రం సంశితాత్మానం సర్వయత్నైరతోషయత్ ॥ 5
తండ్రి ఇంటిలో దేవతలనూ, అతిథులనూ పూజించే బాధ్యత ఆమెది. ఒకసారి దుర్వాసుడనే ముని వారి ఇంటికి వచ్చాడు. ఆయన వ్రతదీక్షగలవాడూ, ఉగ్రస్వభావుడు కూడా. పృథ ఆయనను సేవించ నారంభించింది. అన్ని విధాలా ప్రయత్నించి ఆ ఉగ్రస్వభావుని సంతోషపరచింది. (4,5)
వి: సం: దుర్వాసుడు బాహ్యంగా క్రూరుడుగా కనిపించినా అంతరంగా ధర్మనిశ్చయం గల మహర్షి. (నీల)
తస్యై స ప్రదదౌ మంత్రమ్ ఆపద్ధర్మాన్వవేక్షయా ।
అభిచారాభిసంయుక్తమ్ అబ్రవీచ్చైవ తాం మునిః ॥ 6
ఆ ముని పృథకు సంభవించబోయే ఆపదను గ్రహించి అపద్ధర్మంగా ఉపయోగించుకొనటానికి వశీకరణమంత్రాన్ని ఉపదేశించాడు. ఆమెతో ఇలా అన్నాడు- (6)
వి: సం: అన్వవేక్ష = భవిష్యత్తులో కుంతికి సంతాన
ప్రతిబంధయోగముందని ఆలోచించుట. (నీల)
అభిచారం = వశమగుట, ఆకర్షణకు లోనగుట మొదలగు ద్ఱ్రుష్టప్రయోజనం (నీల)
యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహయిష్యసి ।
తస్య తస్య ప్రసాదేన పుత్రస్తవ బవిష్యతి ॥ 7
ఈ మంత్రంతో నీవు ఏ దేవతల నాహ్వానించినా వారి అనుగ్రహంతో కుమారుని పొందగలవు. (7)
తథోక్తా తు విప్రేణ కుంతీ కౌతూహలాన్వితా ।
కన్యా సతీ దేవమర్కమ్ ఆజుహావ యశస్వినీ ॥ 8
ఆ బ్రాహ్మణుడు ఆవిధంగా చెప్పగా యశస్విని ఐన ఆ పృథ కుతూహలంతో కన్యగా ఉన్నప్పుడే సూర్యదేవుని ఆహ్వానించింది. (8)
సా దదర్శ తమాయాంతం భాస్కరం లోకభావనమ్ ।
విస్మితా చానవద్యాంగీ దృష్ట్వా తన్మహదద్భూతమ్ ॥ 9
అహ్వానించగానే తన దగ్గరకు వస్తున్న లోకభావనుడయిన ఆ సూర్యుని ఆమె చూచింది. సర్వాంగసుందరి అయిన ఆమె ఆ మహాద్భుతాన్ని చూచి ఆశ్చర్యపడింది. (9)
తాం సమాసాద్య దేవస్తు వివస్వానిదమబ్రవీత్ ।
అయమస్మ్యసితాపాంగి బ్రూమి కిం కరవాణి తే ॥ 10
సూర్యభగవానుడు ఆమెను సమీపించి ఇలా అన్నాడు- నల్లని కన్నులు గలదానా! నేను వచ్చాను. నీకోసమేమి చేయాలి? (10)
(ఆహూతోపస్థితం భద్రే ఋషిమంత్రేణ చోదితమ్ ।
విద్ధి మాం పుత్రలాభాయ దేవమర్కం శుచిస్మితే ॥)
కళ్యాణీ! నీవు పిలవగానే నేను వచ్చాను. ఇది ఋషిమంత్ర ప్రేరణ శుచిస్మితా! నేను సూర్యదేవుడను. నీకు పుత్రుని ఇవ్వటానికి వచ్చాను గ్రహించు.
కుంత్యువాచ
కశ్చిన్మే బ్రాహ్మణః ప్రాదాద్ వరం విద్యాం చ శత్రుహన్ ।
తద్విజిజ్ఞాసయాఽఽహ్వానం కృతవత్యస్మి తే విభో ॥ 11
కుంతి ఇలా అన్నది- శత్రుసంహర్తా! ఒక బ్రాహ్మణుడు నాకు ఈ విద్యనూ, వరాన్నీ అనుగ్రహించాడు. స్వామీ! దానిని పరీక్షించటానికి నిన్ను అహ్వానించాను. (11)
ఏతస్మిన్నపరాధే త్వాం శిరసాహం ప్రసాదయే ।
యోషితో హి సదా రక్ష్యాః స్వాపరాద్ధాపి నిత్యశః ॥ 12
ఈ తపస్సునకు నేను తలవంచి మిమ్ము ప్రార్థిస్తున్నాను. ప్రసన్నులు కండి. స్త్రీలు తప్పుచేస్తే ఉత్తమపురుషులు వారిని కాపాడాలి. (12)
సూర్య ఉవాచ
వేదాహం సర్వమేవైతద్ యద్ దుర్వాసా వరం దదౌ ।
సంత్యజ్య భయమేవేహ క్రియతాం సంగమో మమ ॥ 13
సూర్యుడిలా అన్నాడు. దుర్వాసుడు వరమివ్వట మిదంతా నాకు తెలుసు. భయాన్ని విడిచి ఇక్కడ నాతో సమాగమించు. (13)
అమోఘం దర్శనం మహ్యమ్ ఆహూతశ్చాస్మి తే శుభే ।
వృథాహ్వానేఽపి తే భీరు దోషః స్యాన్నాత్రసంశయః ॥ 14
కళ్యాణీ! నాదర్శనం అమోఘమైనది. నీవు నన్ను పిలిచావు. పిరికిదానా! నిష్ప్రయోజకంగా ఆహ్వానిస్తే అది కూడా తప్పే అవుతుంది. (14)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తా బహువిధం సాంత్వపూర్వం వివస్వతా ।
సా తు నైచ్ఛద్ వరారోహా కన్యాహమితి భారత ॥ 15
వైశంపాయనుడిలా అన్నాడు- జనమేజయా! ఈ విధంగా అనునయపూర్వకంగా సూర్యుడెంత చెప్పినా ఆ సుందరి 'తాను కన్య' అన్న భావంతో దానికంగీకరించలేదు. (15)
బంధుపక్షభయాద్ భీతా లజ్జయా చ యశస్వినీ ।
తామర్కః పునరేవేదమ్ అబ్రవీద్ భరతర్షభ ॥ 16
పేరుప్రతిష్ఠలు గల ఆకుంతికి బంధువులు ఏమనుకొంటారో అన్న భయం, సిగ్గూ కలిగాయి. జనమేజయా! మరలా సూర్యుడు ఆమెతో ఇలా అన్నాడు. (16)
(పుత్రస్తే నిర్మితః సుభ్రు శృణు యాదృక్ శుభాననే ॥
ఆదిత్యే కుండలే బిభ్రత్ కవచం చైవ మామకమ్ ।
శస్త్రాస్త్రాణామభేద్యం చ భవిష్యతి శుచిస్మితే ॥
న న కించన దేయంతు బ్రాహ్మణేభ్యో భవిష్యతి ।
చోద్యమానో మయాచ్చాపి నాక్షమం చింతయిష్యతి ।
దాస్యత్యేవ హి విప్రేభ్యః మానీ చైవ భవిష్యతి ।)
(మంచి కనుబొమలుగల) సుందరీ! నీకు పుట్టబోయే కొడుకు అదితి ఇచ్చిన కుండలాలనూ, నేను అనుగ్రహించిన కవచాన్నీ ధరించి ఉంటాడు. ఆకవచం శస్త్రాస్త్రాలతో భేదించరానిది. శుచిస్మితా! దానిని బ్రాహ్మణుల కెప్పుడూ ఇవ్వగూడదు. నేనే చెప్పినా కూడా అకృత్యాలను తానెన్నడూ చేయడు. బ్రాహ్మణులు ఏదడిగినా ఇస్తాడు. ఆత్మాభిమాని అవుతాడు.
మత్ప్రసాదాన్న తే రాజ్ఞి భవితా దోష ఇత్యుత ।
ఏవముక్త్వా స భగవాణ్ కుంతిరాజసుతాం తదా ॥ 17
ప్రకాశాకర్తా తపనః సంబభూవ తయా సహ ।
తత్ర వీరః సమభవత్ సర్వశస్త్రభృతాం వరః ।
ఆముక్తకవచః శ్రీమాన్ దేవగర్భః శ్రియాన్వితః ॥ 18
యువరాణి! నా అనుగ్రహం వలన నీకే దోషమూ అంటదు. ఆరీతిగా చెప్పి వెలుగునూ, వేడినీ ప్రసాదించే ఆ సూర్యభగవానుడు ఆకుంతీకుమారితో కలిశాడు. అప్పుడే ఆమెకొక కొడుకు పుట్టాడు. ఆ బాలుడు వీరుడూ, యోధులలో శ్రేష్ఠుడు. పుట్టుకతోనే కవచం ధరించిన శ్రీమంతుడు. దేవకుమారునివలె ప్రకాశిస్తున్నాడు. (17,18)
సహజం కవచం బిభ్రత్ కుండలోద్ద్యోతితాననః ।
అజాయత సుతః కర్ణః సర్వలోకేషు విశ్రుతః ॥ 19
సహజమైన కవచాన్ని ధరించి, కుండలాలతో మొగాన వెలుగులను నింపుకొన్న సర్వలోకప్రసిద్ధిగల కొడుకు-కర్ణుడు-పుట్టాడు. (19)
ప్రాదాచ్చ తస్యై కన్యాత్వం పునః స పరమద్యుతిః ।
దత్త్వా చ తపతాం శ్రేష్ఠః దివమాచక్రమే తతః ॥ 20
పరమశోభగల ఆ సూర్యుడు ఆమెకు కన్యాత్వాన్ని మరలా అనుగ్రహించాడు. అనుగ్రహించి దేవలోకానికి వెళ్ళిపోయాడు. (20)
దృష్ట్వా కుమారం జాతం సా వార్ష్ణేయీ దీనమానసా ।
ఏకాగ్రం చింతయామాస కిం కృత్వా సుకృతం భవేత్ ॥ 21
వృష్ణివంశస్థురాలయిన ఆ కుంతి పుట్టినకొడుకును చూచి కలవరపడింది. ఏం చేస్తే బాగుంటుంది? అని ఒంటరిగా ఆలోచించింది. (21)
గూహమానాపచారం సా బంధుపక్షభయాత్ తదా ।
ఉత్ససర్జ కుమారం తం జలే కుంతీ మహాబలమ్ ॥ 22
కుటుంబసభ్యులు ఏమంటారో అన్నభయంతో ఆమె తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకొనటానికి బలిష్ఠుడైన ఆ బాలుని నీటిలో వదలివేసింది. (22)
తముత్సృష్టం జలే గర్భం రాధాభర్తా మహాయశాః ।
పుత్రత్యే కల్పయామాస సభార్యః సూతనందనః ॥ 23
నీటిలో విడువబడిన ఆపసికందును సూతనందనుడు, యశస్వి అయిన రాధభర్త (అధిరథుడు) స్వీకరించాడు. ఆ ఇద్దరూ ఆ బాలుని కొడుకుగా భావించారు. (23)
నామధేయం చ చక్రాతే తస్య బాలస్య తావుభౌ ।
వసునా సహ జాతోఽయం వసుషేణో భవత్వితి ॥ 24
వారిద్దరు ఆ బాలునికి పేరుకూడా పెట్టారు. ధనంతో పాటు పుట్టాడు. కాబట్టి వసుషేణుడనే పేరు ప్రసిద్ధిచెందాలి అనుకొన్నారు. (24)
స వర్ధమానో బలవాన్ సర్వాస్త్రేషూద్యతోఽభవత్ ।
ఆపృష్ఠపాదాదిత్యమ్ ఉపాతిష్ఠత వీర్యవాన్ ॥ 25
బలిష్ఠుడయిన ఆ బాలుడు ఎదుగుతూ అస్త్రవిద్య లన్నింటిలో మేటి అయ్యాడు. సుఱ్యోదయం మొదలు సూర్యుడు వెనుకకు దిరిగేదాకా ఆ పరాక్రమవంతుడు సూర్యుని ఉపాసించేవాడు. (25)
తస్మిన్ కాలే తు జపతః తస్య వీరస్య ధీమతః ।
నాదేయం బ్రాహ్మణేష్వాసీత్ కించిద్ వసు మహీతలే ॥ 26
వీరుడూ, ధీమంతుడూ అయిన ఆ కర్ణుడు జపంచెస్తున్న వేళలో బ్రాహ్మణులు ఏమడిగినా దానంచేసేవాడు. ఇవ్వకూడనిదంటూ లోకంలో ఏదీ ఉండేది కాదు. (26)
(తతః కాలే తు కస్మింశ్చిత్ స్వప్నాంతే కర్ణమబ్రవీత్ ।
ఆదిత్యో బ్రాహ్మణో భూత్వా శృణు వీర వచో మమ ॥
ప్రభాతాయాం రజన్యాం త్వామ్ ఆగమిష్యతి వాసవః ।
న తస్య భిక్షా దాతవ్యా విప్రరూపీ భవిష్యతి ॥
నిశ్చయో-స్యాపహర్తుం తే కవచం కుండలే తథా ।
అతస్త్వాం బోధయామ్యేషః స్మర్తాసి వచనం మమ ॥
ఆ తరువాత కొంతకాలానికి సూర్యుడు బ్రాహ్మణరూపాన్ని ధరించి కలలో కనిపించి "వీరుడా! ఈ రాత్రి గడిచి తెలవారగానే ఇంద్రుడు నీదగ్గరకు వస్తాడు. విప్రరూపంలో నీ కవచకుండలాలను అపహరించాలన్న నిశ్చయింతో వస్తున్నాడు. అందుకని నీకు ముందే తెలియజేస్తున్నాను. నామాట గుర్తుంచుకో. ఆయనకు భిక్షనీయవద్దు."
కర్ణ ఉవాచ
శక్రో మాం విప్రరూపేణ యది వై యాచతే ద్విజ ।
కథం చాస్మై న దాస్యామి యథా చాస్మ్యవబోధితః ॥
విప్రాః పూజ్యాస్తు దేవానాం సతతం ప్రియమిచ్ఛతామ్ ।
తం దేవదేవం జానన్ వై న శక్నోమ్యవమంత్రణే ॥
కర్ణుడిలా అన్నాడు. ద్విజా! ఇంద్రుడు విప్రరూపంలో వచ్చి అడిగితే నీవు చెప్పావు గదా అని ఇవ్వకుండా ఎలా ఉండగలను. బ్రాహ్మణులు తమ మేలు కోరుతారు కాబట్టి దేవతలకు కూడా పూజనీయులు. దేవేంద్రుడే బ్రాహ్మణరూపంలో వచ్చాడని తెలిసినా కాదనలేను.
సూర్య ఉవాచ
యద్యేనం శృణు మే వీర్ వరం తే సోఽపి దాస్యతి ।
శక్తిం త్వమపి యాచేథాః సర్వశ్స్త్రవిబాధినీమ్ ॥
సూర్యుడిలా అన్నాడు- అలా అయితే వీరా! నామాటవిను. నీవు కూడా సకలశస్త్రాలనూ నిరోధించగల శక్తిని అడుగు. ఆయనకూడా వరమిస్తాడు.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా ద్విజః స్వప్నే తత్రైవాంతరధీయత ।
కర్ణః ప్రబుద్ధస్తం స్వప్నం చింతయానోఽభవత్ తదా ॥)
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ విధంగా చెప్పి ఆ బ్రాహ్మణుడు కలలో అంతర్ధానమయ్యాడు. కర్ణుడు మేల్కొని ఆ కలను గురించియే ఆలోచించసాగాడు.
తమింద్రో బ్రాహ్మణో భూత్వా భిక్షార్థీ సముపాగమత్ ।
కుండలే ప్రార్థయామాస కవచం చ మహాద్యుతిః ॥ 27
ఇంద్రుడు బ్రాహ్మణరూపాన్ని ధరించి భిక్షకై కర్ణుని దగ్గరకు వచ్చాడు. ఆమహానుభావుడు కవచకుండలాలను కోరాడు. (27)
స్వశరీరాత్ సముత్కృత్య కవచం స్వం నిసర్గజమ్ ।
కర్ణస్తు కుండలే ఛిత్త్వా ప్రాయచ్ఛత్ స క్ఱ్రుతాంజలిః ॥ 28
కర్ణుడు తనతో పుట్టుకతోనే ఉన్న కవచాన్ని శరీరం నుండి వేరు చేసి, కుండలాలను కోసి చేతులు జోడించి ఆయనకిచ్చాడు. (28)
ప్రతిగృహ్యతు దేవేశః తుష్టస్తేనాస్య కర్మణా ।
9అహో సాహసమిత్యేవం మనసా వాసవో హసన్ ।
దేవదానవయక్షాణాం గంధర్వోరగరక్షసామ్ ॥
న తం పశ్యామి కోహ్యేతత్ కర్మ కర్తా భవిష్యతి ।
ప్రీతోఽస్మి కర్మణా తేన వరం వృణు యమిచ్ఛసి ॥
దేవేంద్రుడు వాటిని స్వీకరించి కర్ణుని చేష్టతో సంతోషించి మనస్సులోనే అతని సాహసాన్ని అభినందించాడు. దేవదానవ యక్షులలో గానీ, గంధర్వ్ - ఉరగ రాక్షసులలో కానీ ఇటువంటి సాహసం గలవాడు కనిపించడని భావించాడు. "నీ సాహసకృత్యంతో సంతోషించాను. కావలసిన వరమ్ కోరుకో" అన్నాడు.
కర్ణ ఉవాచ
ఇచ్ఛామి భగవద్దత్తాం శక్తిం శత్రునిబర్హణీమ్ ।
కర్ణుడిలా అన్నాడు - శత్రుసంహారం చేయగల దివ్యశక్తిని కోరుతున్నాను.
వైశంపాయన ఉవాచ)
దదౌ శక్తిం సురపతిః వాక్యం చేదమువాఛ హ ॥ 29
వైశంపాయనుడిలా అన్నాడు. దేవేంద్రుడు శక్తినిచ్చి ఈ విధంగా పలికాడు. (29)
దేవాసురమనుష్యాణాం గంధర్వోరగరక్షసామ్ ।
యమేకం జేతుమిచ్ఛేథాః సోఽనయా న భవిష్యతి ॥ 30
దేవదానవ మనుష్య గంధర్వనాగ రాక్షసులలో నీవు గెలువదలచుకొన్న ఏ ఒక్కని మీదనైనా ఇది పనిచేస్తుంది. (30)
ప్రాఙ్ నామ తస్య కథితం వసుషేణ ఇతి క్షితౌ ।
కర్ణొ వైకర్తనశ్పైవ కర్మణా తేన సోఽభవత్ ॥ 31
ఇంతకుముందే లోకంలో వసుషేణుడని ఆయనకు పేరని చెప్పాను. ఇంద్రునకు కవచకుండల దానమనే ఘోరకృత్యంతో ఆయన కర్ణుడూ, వైకర్తనుడూ కూడా అయ్యాడు. (31)
వి: సం: వసుషేణుడు = వసువు-కుండలకవచాదులతో బద్ధుడు
కర్ణుడు = సహజకవచాన్ని ఒలిచాడు కాబట్టి కర్ణుడు
వైకర్తనుడు = విశేషించి కవచకుండలాలను కూడా ఒలిచి ఇచ్చినందువల్ల, వికర్తనుని (సూర్యుని) కుమారుడు కాబట్టి వైకర్తనుడు. (నీల)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి కర్ణసంభవే దశాధికశతతమోఽధ్యాయః ॥ 110 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున కర్ణసంభవమను నూటపదవ అధ్యాయము. (110)
(దాక్షిణాత్యాధిక పాఠము 13 1/2 శ్లోకాలు కలుపుకొని 44 1/2 శ్లోకాలు)