142. నూట నలువదిరెండవ అధ్యాయము

ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతమునకు పంపుట.

వైశంపాయన ఉవాచ
తతో దుర్యోధనో రాజా సర్వాః ప్రకృతయః శనైః ।
అర్థమానప్రదానాభ్యాం సంజహార సహానుజః ॥ 1
ధృతరాష్ట్రప్రయుక్తాస్తే కేచిత్ కుశలమంత్రిణః ।
కథయాంచక్రిరే రమ్యం నగరం వారణావతమ్ ॥ 2
అయం సమాజః సుమహాన్ రమణీయతమో భువి ।
ఉపస్థితః పశుపతేః నగరే వారణావతే ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు - పిదప దుర్యోధనుడు తన తమ్ములతో కూడి, ముఖ్యులైన ప్రజలను, నాయకులను ధనసత్కారాలతో లోబరుచుకొన్నాడు. ధృతరాష్ట్రుని ప్రోత్సాహంతో కొందరు మంత్రులు వారణావతనగరం అందచందాలను నేర్పుగా వర్ణించసాగారు. వారణావత నగరం పరమశివుని క్షేత్రం. ఇంత అందమైన ప్రదేశం మరెచ్చటా కానరాదు. అక్కడ త్వరలో గొప్ప ఉత్సవం జరుగబోతోంది. (1-3)
సర్వరత్నసమాకీర్ణే పుంసాం దేశే అనోరమే ।
ఇత్యేవం ధృతరాష్ట్రస్య వచనాచ్చక్రిరే కథాః ॥ 4
ఆ పవిత్రనగర రకరకాల రత్నాలతో నిండినది. ఆ ప్రదేశం మానవుల మనస్సులను మురిపిస్తుంది. ఈ విధంగా ధృతరాష్ట్రుని ప్రేరణతో మంత్రులు అనేక కథలను ప్రచారం చేశారు. (4)
కథ్యమానే తథా రమ్యే నగరే వారణావతే ।
గమనే పాండుపుత్రాణాం జజ్ఞే తత్ర మతిర్నృప ॥ 5
రాజా! ఈ విధంగా చెప్పబడుతున్న అందాల నగరం వారణావతాన్ని చూడాలని పాండవులకు కోరిక కలిగింది. (5)
యదా త్వమన్యత నృపః జాతకౌతూహలా ఇతి ।
ఉవాచైతానేత్య తదా పాండవానంబికాసుతః ॥ 6
ధృతరాష్ట్రుడు "పాండవులకు వారణావతం మీద మక్కువ కల్గింది" అని భావించాడు. అప్పుడు అంబికాసుతుడు వారిని పిలిపించి ఇలా చెప్పాడు. (6)
(అధీతాని చ శాస్త్రాణి యుష్మాభిరిహ కృత్స్నశః ।
అస్త్రాణి చ తథా ద్రోణాత్ గౌతమాచ్చ విశేషతః ॥
ఇదమేవం గతే తాతాః చింతయామి సమంతతః ।
రక్షణే వ్యవహారే చ రాజ్యస్య సతతం హితే ॥)
మమైతే పురుషా నిత్యం కథయంతి పునః పునః ।
రమణీయతమం లోకే నగరం వారణావతమ్ ॥ 7
(బిడ్డలారా! మీరు సకల శాస్త్రాలను చదివారు. సమస్తమైన అస్త్రాలను ద్రోణుని నుండి కృపాచార్యులనుండి విశేషంగా గ్రహించారు. నేను రాజ్యహితం, రాజకీయవ్యవహారాలు, రక్షణ విషయాలు అన్ని వైపులా ఆళోచిస్తున్నాను). మంత్రులు నిత్యం వారణావతం అందచందాళను, నాకు వివరిస్తున్నారు. (7)
తే తాతా యది మన్యధ్వమ్ ఉత్సవం వారణావతే ।
సగణాః సాన్వయాశ్చైవ విహరధ్వం యథామరాః ॥ 8
నాయనలారా! మీరు వారణావతంలో జరుగబోయే ఉత్సవాన్ని చూడాలని భావిస్తే, అందరూ సకుటుంబంగా సేవక గణాలతో కలసి, ఆ నగరంలో దేవతల్లా విహరించండి. (8)
బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని గాయకేభ్యశ్చ సర్వశః ।
ప్రయచ్ఛధ్వం యథాకామం దేవా ఇవ సువర్చసః ॥ 9
కంచిత్ కాలం విహృత్యైవమ్ అనుభూయ పరాం ముదమ్ ।
ఇదం వై హాస్తినపురం సుఖినః పునరేష్యథ ॥ 10
అక్కడ మీరు, బ్రాహ్మణులకు గాయకులకు మీ కోరిక మేరకు రత్నాలను విలువైన వస్తువులను, తేజస్వులైన దేవతల్లా దానం చేయవచ్చు. ఈ విధంగా కొంతకాలం విహరించి, పరమానందాన్ని అనుభవించి, తిరిగి హస్తినాపురానికి సుఖంగా రావచ్చు. (9,10)
వైశంపాయన ఉవాచ
ధృతరాష్ట్రస్య తం కామమ్ అనుబుధ్య యుధిష్ఠిరః ।
ఆత్మనశ్చాసహాయత్వం తథేతి ప్రత్యువాచ తమ్ ॥ 11
వైశంపాయనుడిలా అన్నాడు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని కోరికను గ్రహించాడు. తనకు సహాయం లేకపోవటాన్ని గమనించాడు. అలాగే నంటూ, తన సమ్మతిని ధృతరాష్ట్రునికి తెలియచేశాడు. (11)
తతో భీష్మం శాంతనవం విదురం చ మహామతిమ్ ।
ద్రోణం చ బాహ్లికం చైవ సోమదత్తం చ కౌరవమ్ ॥ 12
కృపమాచార్యపుత్రం చ భూరిశ్ర్వసమేవ చ ।
మాన్యానన్యా నమాత్యాంశ్చ బ్రాహ్మణాంశ్చ తపోధనాన్ ॥ 13
పురోహితాంశ్చ పౌరాంశ్చ గాంధారీం చ యశస్వినీమ్ ।
యుధిష్ఠిరః శనైర్దీనః ఉవాచేదం వచస్తదా ॥ 14
పిదప యుధిష్ఠిరుడు భీష్ముని, బుద్ధిశాలి విదురుని, ద్రోణుని, బాహ్లికుని, కురువంశజుడైన సోమదత్తుని కృపాచార్యుని, ద్రోణాచార్యపుత్రుడైన అశ్వత్థామను, బూరిశ్రవసుని, ముఖ్యులైన మిగిలిన వారిని, మంత్రులను, తపోధనులైన బ్రాహ్మణులను, పురోహితులను, పౌరులను కీర్తిశాలినియగు గాంధారిని, (విడివిడిగా) సమీపించి, మెల్ల మెల్లగా దీనంగా ఇలా అన్నాడు. (12-14)
రమణీయ జనాకీర్ణే నగరే వారణావతే ।
సగణాస్తత్ర యాస్యామః ధృతరాష్ట్రస్య శాసనాత్ ॥ 15
జనాలతో నిండిన సుందరమైన వారణావతనగరానికి ధృతరాష్ట్రుని ఆజ్ఞమేరకు సకుటుంబంగా వెడుతున్నాను. (15)
ప్రసన్నమనసః సర్వే పుణ్యా వాచో విముంచత ।
ఆశీర్భిర్బృంహితానస్మాన్ న పాపం ప్రసహిష్యతే ॥ 16
మీరందరూ నిర్మలమైన మనస్సుతో మాకు మేలు జరగాలని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతో మేము వృద్ధిని పొందుతాము. ఏ పాపాలు మాదరికి చేరవు. (16)
వి: సం: ఏ పాపాలూ మమ్ము బాధింపవు (దేవ)
ఏవముక్తాస్తు తే సర్వే పాండుపుత్రేణ కౌరవాః ।
ప్రసన్నవదనా భూత్వా తేఽన్వవర్తంత పాండవాన్ ॥ 17
స్వస్త్యస్తు వః పథి సదా భూతేభ్యశ్చైవ సర్వశః ।
మా చ వోఽస్త్వశుభం కించిత్ సర్వశః పాండునందనాః ॥ 18
పాండుస్తుడైన ధర్మజుని పలుకులు విని, కురుశ్రేష్టు లందరూ ప్రసన్నులై పాండవులను మనసారా ఆశీర్వదించారు. పాండుకుమారులారా! మార్గంలో మీకంతా మేలే జరగాలి. సమస్టహ్ ప్రాణులకు శుభం జరగాలి. మీకు అన్నివిధాలా ఎట్టి పరిస్థితుల్లోను చిన్నపాటి కీడుకూడా జరుగకుండుగాక! అని ఆశీర్వదించారు. (17,18)
తతః కృతస్వస్త్యయవాః రాజ్యలంభాయ పార్థివాః ।
కృత్వా సర్వాణి కార్యాణి ప్రయయుర్వారణావతమ్ ॥ 19
పిదప రాజ్యలాభం కోసం శుభాశీస్సులనుపొంది, అవసరమైన పనులను పుర్తిచేసుకుని, పాండవులందరూ వారనావతానికి పయనమయ్యారు. (19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి వారణావతయాత్రాయాం ద్విచత్వారింశదధిక శతతమోఽధ్యాయః ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున వారణావతయాత్ర అను నూటనలువది రెండవ అధ్యాయము (142)
(దాక్షిణాత్య అధికపాఠం 2 శ్లోకాలు కలిపి మొత్తం 21 శ్లోకాలు)