144. నూటనలువది నాలుగవ అధ్యాయము

పాండవుల వారణావత ప్రయాణము-విదురుని రహస్యోపదేశము.

వైశంపాయన ఉవాచ
పాండవాస్తు రథాన్ యుక్తాన్ సదశ్వైరనిలోపమైః ।
ఆరోహమాణా భీష్మస్య పాదౌ జగృహురార్తవత్ ॥ 1
రాజ్ఞశ్చ ధృతరాష్ట్రస్య ద్రోణస్య చ మహాత్మనః ।
అన్యేషాం చైవ వృద్ధానాం కృపస్య విదురస్య చ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. పాండవులు వాయువేగం కల మంచి గుర్రాలు పూన్చిన రథాలను అదిరోహించడానికి ముందు, దుఃఖితుల వలె, భీష్మునికి పాదాభివందనం చేశారు. అదేవిధంగా ధృతరాష్ట్రమహారాజు, మహాత్ముడు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు, ఇతరులైన పెద్దల పాదాలకు నమస్కరించారు. (1,2)
ఏవం సర్వాన్ కురూన్ వృద్ధాన్ అభివాద్య యతవ్రతాః ।
సమాలింగ్య సమానాన్ వై బాలైశ్చాప్యభివాదితాః ॥ 3
ఈ విధంగా నియమదీక్షకల పాండవులు, కురువృద్ధులందరికీ నమస్కరించి, సమానులను కౌగిలించుకొని, బాలురచే నమస్కరింపబడుతూ బయలుదేరారు. (3)
సర్వా మాతౄస్తథాఽఽపృచ్ఛ్య కృత్వా చైవ ప్రదక్షిణమ్ ।
సర్వాః ప్రకృతయశ్చైవ ప్రయయు ర్వారణావతమ్ ॥ 4
పాండవులు తల్లులందరికీ ప్రదక్షిణం చేశారు. వారివద్ద, మంత్రులు, ప్రజాముఖ్యులు మొదలైన ప్రముఖుల వద్ద సెలవు తీసుకొని వారణావతానికి బయలు దేరి వెళ్ళారు. (4)
విదురశ్చ మహాప్రాజ్ఞః తథాన్యే కురుపుంగవాః ।
పౌరాశ్చ పురుషవ్యాఘ్రాన్ అన్వీయుః శోకకర్శితాః ॥ 5
తత్ర కేచిత్ బ్రువంతి స్మ బ్రాహ్మణా నిర్భయాస్తదా ।
దీనాన్ దృష్వా పాండుసుతాన్ అతీవభృశదుఃఖితాః ॥ 6
గొప్ప ప్రజ్ఞ గల విదురుడు, కొందరు కురుశ్రేష్ఠులు, పౌరులు దుఃఖితులై పురుషశ్రేష్ఠులైన పాండవులను అనుసరించారు. అప్పుడు భయపడని కొందరు బ్రాహ్మణులు, పాండవులదైన్యాన్ని చూచి, మిక్కిలి దుఃఖితులై ఇలా అన్నారు. (5,6)
విషమం పశ్యతే రాజా సర్వథా స సుమందధీః ।
కౌరవ్యో ధృతరాష్ట్రస్తు న చ ధర్మం ప్రపశ్యతి ॥ 7
మందమతి, కురువంశజుడు అయిన ధృతరాష్ట్రమహారాజు పాండవులను పక్షపాతబుద్ధితో చూస్తున్నాడు. ధర్మం గురించి ఎంతమాత్రం ఆలోచించటం లేదు. (7)
న హి పాప మపాపాత్మా రోచయిష్యతి పాండవః ।
భీమో వా బలినాం శ్రేష్ఠః కౌంతేయో వా ధనంజయః ॥ 8
పుణ్యాత్ముడు యుధిష్ఠిరుడు, బలవంతులో బలవంతుడు భీమసేనుడు, అర్జునుడు పాపకార్యాలను ఇష్టపడరు. (8)
కుత ఏవ మహాత్మానౌ మాద్రీపుత్రౌ కరిష్యతః ।
తాన్ రాజ్యం పితృతః ప్రాప్తాన్ ధృతరాష్ట్రో న మృష్యతే ॥ 9
మహాత్ములైన మాద్రికొడుకులు నకులసహదేవులు కూడా పాపాన్ని ఎలా చేస్తారు? తండ్రి నుండి సంక్రమించిన రాజ్యాన్ని పాండవులు పొందటం ధృతరాష్ట్రుడే సహించలేకున్నాడు. ఇందులో వారిపాపం లేదు. (9)
అధర్మ్య మిదమత్యంతం కథం భీష్మోనుమన్యతే ।
వివాస్యమానానస్థానే నగరే యోఽభిమన్యతే ॥ 10
ఇది చాలా అధర్మం. ఆ సమయంలో కాని ప్రదేశానికి పాండవులు పంపించబడుతుంటే భీష్ముడు, ఈ అధర్మాన్ని ఎలా అంగీకరిస్తాడు? (10)
పితేవ హి నృపోఽస్మాకం అభుచ్ఛాంతనవః పురా ।
విచిత్రవీర్యో రాజర్షిః పాండుశ్చ కురునందనఆఆ ॥ 11
శంతనుపుత్రుడు రాజర్షి అయిన విచిత్రవీర్యుడు, కురునందనుడు పాండురాజు, పూర్వం మాకు (ప్రజలకు) తండ్రివలె ఉండి పరిపాలన సాగించారు. (11)
స తస్మిన్ పురుషవ్యాఘ్రే దేవభావం గతే సతి ।
రాజపుత్రానిమాన్ బాలాన్ ధృతరాష్ట్రో న మృష్యతే ॥ 12
అటువంటి పురుషశ్రేష్ఠుడైన పాండురాజు కీర్తిశేషుడు కాగానే, బాలురైన ఈ పుత్రులను - పాండవులను - ధృతరాష్ట్రుడు చూసి సహించలేక పోతున్నాడు. (12)
వయమేతదనిచ్ఛంతః సర్వ ఏవ పురోత్తమాత్ ।
గృహన్ విహాయ గచ్చామః యత్ర గంతా యుధిష్ఠిరః ॥ 13
ఇది మాకు సమ్మతం కాదు. కనుక ఈ హస్తినాపురాన్ని, మా వాళ్ళను వదలి మేమందరం యుధిష్ఠిరుడున్న చోటికే వెళ్ళిపోతాము. (13)
తాంస్తథావాదినః పౌరాన్ దుఃఖితాన్ దుఃఖకర్శితః ।
ఉవాచ మనసా ధ్వాత్వా ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 14
ఆ విధంగా దుఃఖితులై మాట్లాడుతున్న పురజనులతో, ధర్మప్రభువైన యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి, ఇలా అన్నాడు. (14)
పితా మాన్యో గురుః శ్రేష్ఠః యదాహ పృథివీపతిః ।
అశంకమానైస్తత్ కార్యమ్ అస్మాభిరితి నో వ్రతమ్ ॥ 15
ఆర్యా! తండ్రి, గౌరవించదగ్గవాడు, పెద్దవాడు, శ్రేష్ఠుడు అయిన ధృతరాష్ట్రమహారాజు ఏమి చెపితే అది సందేహించకుండా నెరవేర్చాలన్నది మా వ్రతం. (15)
భవంతః సుహృదోఽస్మాకమ్ అస్మాన్ కృత్వా ప్రదక్షిణమ్ ।
ప్రతినంద్య తథాశీర్భిః నివర్తధ్వం యథా గృహమ్ ॥ 16
యదా తు కార్యమస్మాకం భవద్భిరుపపత్య్సతే ।
తదా కరిష్యథాస్మాకం ప్రియాణి చ హితాని చ ॥ 17
అయ్యా! మీరందరూ మాకు మిత్రులు. మీ హృదయాలు మంచివి. మమ్మల్ని ఆశీర్వదించండి. మా మీద గౌరవం చూపించారు. బాగుంది. ఇక మీతో సాధించవలసిన పని ఏర్పడినప్పుడు, మీరు మాకు ప్రియాన్ని, మేలును తప్పక చెయ్యగలరు. (16,17)
ఏవముక్తా స్తదా పౌరాః కృత్వా చాపి ప్రదక్షిణమ్ ।
ఆశీర్భిశ్చాభినంద్యైతాన్ జగ్ముర్నగరమేవ హి ॥ 18
యుధిష్ఠిరుని మాటలు విన్న పౌరులు, వారికి గౌరవ సూచకంగా ప్రదక్షిణం చెసి, వారిని ఆశీస్సులతో ఆనందపరిచి, తిరిగి నగరానికి వెళ్ళారు. (18)
పౌరేషు వినివృత్తేషు విదురః సత్యధర్మవిత్ ।
బోధయన్ పాండవ శ్రేష్ఠమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 19
పురజనులందరూ మరలిపోగానే, సత్య ధర్మాలు తెలిసిన విదురుడు, పాండవ శ్రేష్ఠుడైన ధర్మరాజును ప్రబోధిస్తూ ఇలా అన్నాడు. (19)
ప్రాజ్ఞః ప్రాజ్ఞప్రలాపజ్ఞః ప్రలాపజ్ఞమిదం వచః ।
ప్రాజ్ఞం ప్రాజ్ఞః ప్రలాపజ్ఞః ప్రలాపజ్ఞం వచోఽబ్రవీత్ ॥ 20
ముందు వెనుకల నెరిగినవాడు, బుద్ధిమంతుల మాటలలోని మర్మాన్ని గ్రహించగలవాడు అయిన విదురుడు, ముందు వెనుకలు తెలిసి, బుద్ధిమంతుల మాటలలోని మర్మాన్ని గ్రహించగలిగిన ధర్మరాజుతో, సామాన్యులకు సామాన్యంగాను, మర్మ విదులకు విశేషంగాను అర్థాన్ని ఇచ్చే విధంగా ఇలా అన్నాడు. (20)
వి: సం: విదురుడు పౌరులకే కాక భీమాదులకు కూడ తెలియరాని రీతిలో ధర్మరాజుకు హితాన్ని సుచిస్తున్నాడు. లుప్తవర్ణ, అధికవర్ణ, వికృతవర్ణాది పద్ధతులతో భాషించటం, లేదా అర్థం చేసికొనగలగటం అందరికీ సాధ్యంకాదు. విదురుడు ఆ రీతిగా మాటాడగల ప్రాజ్ఞప్రలాపజ్ఞుడు. ధర్మరాజు కూడా ప్రలాపజ్ఞుడు. (నీల)
యో జానాతి పరప్రజ్ఞాం నీతిశాస్తానుసారిణీమ్ ।
విజ్ఞాయేహ తథా కుర్యాద్ ఆపదం నిస్తరేద్యథా ॥ 21
నీతిశాస్త్రానికి అనుగుణమైన పరుల బుద్ధిని ఎరిగినవాడు, దాన్ని తెలుసుకొని, ఆపదలనుండి తప్పించుకొనేవిధంగా ప్రవర్తించవలసి ఉంటుంది. (21)
అలోహం నిశితం శస్త్రం శరీరపరికర్తనమ్ ।
యో వేత్తి న తు తం ఘ్నంతి ప్రతిఘాతవిదం ద్విషః ॥ 22
లోహాలతో నిర్మించబడి, శరీరాన్ని కోసే వాడియైన ఆయుధాన్ని నేర్పున్నవారినీ, శత్రువు హింసించలేడు. (22)
వి: సం: అలోహం - అనల+ఊహం - ఇక్కడ నకారం లోపించింది. అనలోహం అంటే దాహక ద్రవ్యాలతో కూడినది అని అర్థం.
నిశి+తం+శస్త్రం అని పదచ్ఛేదం. శస్త్రం అంటే ప్రాసాదం అని అర్థం. సస్తి అస్మిన్ అని వ్యుత్పత్తి. దానిలో శయనిస్తారు కాబట్టి. అయితే స కారం బదులు శ కారాన్ని వాడటం వర్ణ వికారం.
శరీరపరికర్తనమ్ - శరీరం పరిలుప్య కర్తనమ్ స్వరూపాన్ని కప్పిపుచ్చుకొని హింసించేది.
అర్థాత్తు - దాహకద్రవ్యాలయిన లక్క మొదలయినవి పైకి కనిపించకుండా గోడలు మొదలగు వాటిలో ఉంటాయి. అవి హింసించే పదార్థాలు. వాటిని రాత్రివేళ వినియోగించవచ్చు. ఆ ప్రాసాదాన్ని గమనించి ఉండాలి. అప్పుడు ఇబ్బంది లేదు అని విదురుని సూచన. (నీల)
కక్షఘ్నః శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః ।
న దహేదితి చాత్మానం యో రక్షతి స జీవతి ॥ 23
ఎండుగడ్డిని, ఎండిన అరణ్యాల్ని, చలిని సంహరిస్తుంది అగ్ని. కాని పరులకు, కానరాని కలుగులోనున్న ఎలుకలను దహించలేదు. తనను తాను రక్షించుకోగలవాడు మాత్రమే జీవించగలడు. (23)
వి: సం: కక్షఘ్నః = పార్శ్వచరుడు = పురోచనుడు
శిశిరఘ్నః = శిరఘ్నః = సంహరించువాడు
రెండు శికారాలను వాడటం - వర్ణాధిక్యం - రహస్యం కోసం.
బిలౌకసః = ఆ ఇంటి నుండి సొరంగాన్ని ఏర్పాటు చేసికోవాలని సూచన. (నీల)
వాచక్షుర్వేత్తి పంథానం నాచక్షుర్విందతే దిశః ।
వాధృతి ర్బుద్ధి మాప్నోతి బుధ్యస్వైనం ప్రబోధితః ॥ 24
కళ్ళు లేనివాడు మార్గాన్ని తెలుసుకోలేడు. నేత్రం లేనివాడికి దిక్కులు తెలియవు. ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు. ఈ ప్రబోధాన్ని జాగ్రత్తగా అర్థంచేసుకో. (24)
అనాప్తై ర్దత్తమాదత్తే నరః శస్త్రమలోహజమ్ ।
శ్వావిచ్ఛరణ మాసాద్య ప్రముచ్యేత హుతాశనాత్ ॥ 25
ఆప్తులు కానివారు ఇచ్చిన, అలోహమైన ఆయుదాన్ని ఏనరుడు స్వీకరిస్తాడో, వాడు కుక్క స్వభావాన్నెరిగి పవర్తించినపుడే అగ్ని నుండి బయటపడగల్గుతాడు. (కుక్క రాత్రి వేళ తక్కువగా నిద్రిస్తుంది. అప్రమత్తంగా ఉంటుంది). (25)
చరన్ మార్గాన్విజానాతి నక్షత్రైర్విందతే దిశః ।
ఆత్మనా చాత్మనః పంచ పీడయన్ నానుపీడ్యతే ॥ 26
తిరుగుతూ ఉంటే మార్గాలు తెలుస్తాయి. నక్షత్రాల్ని చూసి దిక్కులను గ్రహించవచ్చు. తాను తన జ్ఞానేంద్రియాలను అప్రమత్తంగా ఉంచుకొంటే పరులచే బాధింపబడదు. (26)
ఏవముక్తః ప్రత్యువాచ ధర్మరాజో యుధిష్ఠిరః ।
విదురం విదుషాం శ్రేష్ఠం జ్ఞాతమిత్యేవ పాండవః ॥ 27
విదురుని మాటలు విన్న ధర్మప్రభువు పాండుకుమారుడు యుధిష్ఠిరుడు, విద్వాంసులలో మిన్నయైన విదురునితో 'నీవు చెప్పింది నాకు తెలిసింది' అని చెప్పాడు. (27)
అనుశిక్ష్యానుగమ్యైతాన్ కృత్వా చైవ ప్రదక్షిణమ్ ।
పాండవా నభ్యనుజ్ఞాయ విదురః ప్రయయౌ గృహాన్ ॥ 28
ఈ విధంగా శిక్షణనిచ్చి, కొంతదూరం అనుసరించి, పాండవులకు మర్యాద సూచకంగా ప్రదక్షిణం చేసి, వారికి ప్రయాణానుమతిని ప్రసాదించి, విదురుడు తన ఇంటికి వెళ్ళాడు. (28)
నివృత్తే విదురే చాపి భీష్మే పౌరజనే తథా ।
అజాతశత్రుమాసాద్య కుంతీ వచనమబ్రవీత్ ॥ 29
భీష్ముడు, పురజనులు, విదురుడు అందరూ మరలి వెళ్ళిన తరువాత యుధిష్ఠిరుని సమీపించి కుంతి ఇలా అన్నది. (29)
క్షత్తా యదబ్రవీద్వాక్యం జనమధ్యేఽబ్రువన్నివ ।
త్వయా చ స తథేత్యుక్తః జానీమో న చ తద్వయమ్ ॥ 30
నాయనా! జనులమధ్యలో విదురుడు స్పష్టాతిస్పష్టంగా కొన్ని మాటలు చెప్పాడు. నీవు కూడా తెలిసింది - అని సమాధానమిచ్చావు. కానీ ఆ విషయాలేవీ మాకు బోధపడలేదు. (30)
యదీదం శక్య మస్మాభిః జ్ఞాతుం న చ స దోషవత్ ।
శ్రోతుమిచ్ఛామి తత్ సర్వం సంవాదం తవ తస్య చ ॥ 31
ఈ విషయం మాకు తెలియదగినదయితే, తెలుసుకోవటంలో తప్పు లేనట్లయితే, నీకూ విదురునకూ మధ్య జరిగిన మాటలు (మర్మాన్ని) వినాలనుకొంటున్నాను. (31)
యుధిష్ఠిర ఉవాచ
గృహాదగ్నిశ్చబోద్ధవ్యః ఇతి మాం విదురోఽబ్రవీత్ ।
సంథాశ్చ వో నావిదితః కశ్చిత్ స్యాదితి ధర్మధీః ॥ 32
యధిష్ఠిరుడిలా అన్నాడు. అమ్మా! గృహాల్లో అగ్ని ప్రమాదం జరగవచ్చుననీ, పయనించబోయే మార్గం లోగడ తెలిసినది కాక పోవచ్చని, కొత్త మార్గంలో పయనించవలసివస్తుందని ధర్మాతుడు విదురుడు వివరించాడు. (32)
జితేంద్రియశ్చ వసుధాం ప్రాప్స్యతీతి చ మేఽబ్రవీత్ ।
విజ్ఞాతమితి తత్సర్వం ప్రత్యుక్తో విదురో మయా ॥ 33
ఇంద్రియ నిగ్రహంకలవాడు భూమిని తప్పక పొందగలడని విదురుడు చెప్పాడు. నీవు చెప్పిన దాన్ని నేను గ్రహించానని విదురునికి నేను సమాధానం చెప్పాను. (33)
వైశంపాయన ఉవాచ
అష్టమేఽహని రోహిణ్యాం ప్రయాతాః ఫాల్గునస్య తే ।
వారణావత మాసాద్య దదృశుర్నాగరం జనమ్ ॥ 34
జనమేజయా! పాండవులు ఫాల్గున మాసంలో, శుక్ల అష్టమి తిథిలో, రోహిణీ నక్షత్రంలో చంద్రుడున్నపుడు వారణావతానికి బయలుదేరారు. అక్కడ నగరవాసుల్ని చూశారు. (34)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి వారణావతగమనే చతుశ్చత్వారింశదధిక శతతమోఽధ్యాయః ॥144॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున వారణావతగమనమను నూటన్లువది నాలుగవ అధ్యాయము. (144)