146. నూట నలుబది ఆరవ అధ్యాయము
ఖనకుడు లక్క ఇంటిలో సురంగము నిర్మించుట.
వైశంపాయన ఉవాచ
విదురస్య సుహృత్ కశ్చిత్ ఖనకః కుశలో నరః ।
వివిక్తే పాండవాన్ రాజన్ ఇదం వచనమబ్రవీత్ ॥ 1
వైశంపాయనుడన్నాడు. రాజా! విదురునిమిత్రుడు, సురంగనిర్మాణం పనుల్లో ఆరితేరినవాడు ఒకడు, ఏకాంత-సమయంలో పాండవులను సమీపించి ఇలా అన్నాడు. (1)
ప్రహితో విదురేణాస్మి ఖనకః కుశలో హ్యహమ్ ।
పాండవానాం ప్రియం కార్యమ్ ఇతి కిం కరవాణి వః ॥ 2
ప్రచ్ఛన్నం విదురేణోక్తః శ్రేయస్త్వమితి పాండవాన్ ।
ప్రతిపాదయ విశ్వాసాద్ ఇతి కిం కరవాణి వః ॥ 3
నన్ను విదురుడు పంపాడు. సురంగ నిర్మాణంలో నాకు మంచి నేర్పు ఉంది. నేను పాండవులకు ప్రియం చెయ్యాలని వచ్ఛాను. నేను మీకు ఏమి చెయ్యాలో చెప్పండి. విదురుడు నాతో రహస్యంగా చెప్పాడు. పాండవులకు విశ్వాసంతో మేలు చెయ్యాలని విదురుని అభిమతం. ఏం చెయ్యాలో చెప్పండి. (2,3)
కృష్ణపక్షే చతుర్దశ్యాం రాత్రావస్యామ్ పురోచనః ।
భవనస్య తవ ద్వారి ప్రదాస్యతి హుతాశనమ్ ॥ 4
కృష్ణపక్షంలో, చతుర్ధశినాడు, రాథ్రివేళలో, మీ భవన ద్వారానికి పురోచనుడు నిప్పు అంటించబోతున్నాడు. (4)
మాత్రా సహ ప్రదగ్ధవ్యాః పాండవాః పురుషర్షభాః ।
ఇతి వ్యవసితం తస్య ధార్తరాష్ట్రస్య దుర్మతేః ॥ 5
పురుషశ్రేష్ఠులైన పాండవులను, తల్లితో సహా మంటలకు ఆహుతి చెయ్యాలని, దుర్బుద్ధికల దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడు. (5)
కించిచ్చ విదురేణోక్తః మ్లేచ్ఛవాచాసి పాండవ ।
త్వయా చ తత్ తథేత్యుక్తం ఏతద్విశ్వాసకారణమ్ ॥ 6
యుధిష్ఠిరా! విదురుడు, మ్లేచ్ఛభాషలో కొన్ని విషయాలు నీకు చెప్పాడు. నీవు కూడా విదురుడు చెప్పిన దానికి 'అది నిజమే' అంటూ సమాధానం ఇచ్చావు. ఈ విషయం నీవు నన్ను నమ్మటానికి పనికివస్తుంది. (6)
ఉవాచ తం సత్యధృతిః కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
అభిజానామి సౌమ్య త్వాం సుహృదం విదురస్య వై ॥ 7
శుచిమాప్తం ప్రియం చైవ సదా చ దృఢభక్తికమ్ ।
న విద్యతే కవేః కించి దవిజ్ఞాతం ప్రయోజనమ్ ॥ 8
సత్యవాది, కుంతీపుత్రుడు అయిన యుధిష్ఠిరుడు ఖనకునితో ఇలా అన్నాడు. సౌమ్యా! నిన్ను నేను విశ్వసిస్తున్నాడు. నీవు విదురునికి మిత్రుడవు, నిర్మలుడవు, విశ్వాసపాత్రుడవు, ఇష్టుడవు. నీకు ఎల్లవేళలా విదురునిపట్ల నిశ్చలమైన భక్తి ఉంది. మాకు చెయ్యవలసిన ఉపకారమేదో, విదురునికి తెలియనిది కాదు. (7,8) యథా తస్య తథా న స్త్వం ఆప్తుడవో అలాగే మాకూ ఆప్తుడవు. మేము విదురునీ, నిన్నూ సమానంగా భావిస్తున్నాము. మేము విదురునికి ఎటువంటివారమో, నీకూ అటువంటివారమే. విదురుడు మమ్మల్ని రక్షిస్తున్నట్లే, నీవు కూడా మమ్మల్ని ఆదుకోవాలి. (9)
ఇదం శరణ మాగ్నేయం మదర్థమితి మే మతిః ।
పురోచనేన వివాతం ధార్తరాష్ట్రస్య శాసనాత్ ॥ 10
దుర్యోధనుని ఆజ్ఞమేరకు పురోచనుడు ఈ ఇంటిని అగ్నిని పెంపొందించే వస్తువులతో మా నాశనం కోసం తయారు చేశాడని నేను భావిస్తున్నాను. (10)
స పాపః కోశవాంశ్చైవ ససహాయశ్చ దుర్మతిః ।
అస్మానపి చ పాపాత్మా నిత్యకాలం ప్రబాధతే ॥ 11
దుర్మతియైన దుర్యోధనుడు పాపాత్ముడు. అతనికి సహాయకులు ఉన్నారు. ధనబలం ఉంది. ఆ పాపి మమ్ము ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉన్నాడు. (11)
స భవాన్ మోక్షయత్వస్మాన్ యత్నేనాస్మాద్ధుతాశనాత్ ।
అస్మాస్విహ హి దగ్ధేషు సకామః స్యాత్ సుయోధనః ॥ 12
మేము ఈ లక్కయింటిలో కాలిపోతే సుయోధనుడి కోరిక నెరవేరుతుంది. కనుక నీవు ప్రయత్నం చేసి మేము ఈ అగ్ని బాధనుండి తప్పించుకునేటట్లు చెయ్యి. (12)
సమృద్ధ మాయుధాగారమ్ ఇదం తస్య దురాత్మనః ।
వప్రాంతం నిష్ప్రతీకారమ్ ఆశ్రిత్యేదం కృతం మహత్ ॥ 13
ఇదం తదశుభం నూనం తస్య కర్మ చికీర్షితమ్ ।
ప్రాగేవ విదురో వేద తేనాస్మానన్వబోధయత్ ॥ 14
ఈ ఇల్లు దుర్మారుడైన ఆ దుర్యోధనుని ఆయుధాగారం. పునాది నుండి ప్రాకారం దాకా ఆర్పటానికి వీలుకాని పదార్థాలతో నిర్మించబడింది. దుర్యోధనుని ఈ దురాలోచనను ముందుగానే విదురుడు పసిగట్టాడు. కనుకనే ముందుగా మమ్ములను హెచ్చరించాడు. (13,14)
సేయ మాపదనుప్రాప్తా క్షత్తా యాం దృష్టవాన్ పురా ।
పురోచనస్యావిదితాన్ అస్మాంస్త్వం ప్రతిమోచయ ॥ 15
విదురుడు పూర్వమే ఊహించిన ఆఫద, ఇప్పుడు ఎదురయింది. పురోచనునికి తెలియని విధంగా మమ్ములను ఈ ఆపద నుండి విడిపించు. (15)
స తథేతి ప్రతిశ్రుత్య ఖనకో యత్నమాస్థితః ।
పరిఖాముత్కిరన్నామ చకార చ మహాబిలమ్ ॥ 16
ఖనకుడు ఆ విధంగానే చేస్తానని శపథం చేసి ప్రయత్నాన్ని ప్రారంబించాడు. ఆవరణాన్ని పరిశుభ్రం చేసే నెపంతో గొప్ప సురంగాన్ని నిర్మించాడు. (16)
చక్రే చ వేశ్మనస్తస్య మధ్యేనాతిమహద్బిలమ్ ।
కపాటయుక మజాతం సమం భూమ్యాశ్చ భారత ॥ 17
భరతా! ఖనకుడు ఆయింటి మధ్యలో మరీ పెద్దది కాని సురంగాన్ని నిర్మించి, దానికి ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ఆద్వారం ఉన్నట్లు ఎవరికీ తెలియనివిధంగా భూమికి సమాంతరంగా నిర్మించాడు. (17)
పురోచనభయాదేవ వ్యదధాత్ సంవృతం ముఖమ్ ।
స తస్య తు గృహద్వారి వసత్యశుభధీః సదా ।
తత్ర తే సాయుధాః సర్వే వసంతి స్మ క్షపాం నృప ॥ 18
దివా చరంతి మృగయాం పాండవేయా వనాద్వనమ్ ।
విశ్వస్తవదవిశ్వస్తాః వంచయంతః పురోచనమ్ ।
అతుష్టాః తుష్టవద్ రాజన్ ఊషుః పరమవిస్మితాః ॥ 19
దుర్మార్గుడైన పురోచనుడు పాండవుల ఇంటి ద్వారం వద్దనే ఎప్పుడూ నివసిస్తుంటాడు. అతని భయం వల్లనే సురంగం ముఖద్వారం మూసివేయబడింది. పాండవులు రాత్రి వేళల్లో ఆయుధాలు ధరించి అప్రమత్తులుగా ఉంటున్నారు. పగలు మాత్రం ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి వేటకు వెడుతున్నారు. పురోచనుని మోసగించటానికి, పాండవులు, అపనమ్మకంతో ఉన్నా నమ్ముతున్నట్లు, దుఃఖంతో ఉన్నా సంతోషంగా ఉన్నట్లు, ఆశ్చర్యకరంగా జీవించసాగారు. (18,19)
న చైనానన్వబుధ్యంత నరా నగరవాసినః ।
అన్యత్ర విదురామాత్యాత్ తస్మాత్ ఖనకసత్తమాత్ ॥ 20
ఆ నగరంలో నివసించే పురజనులు పాండవుల విషయాలను ఎంతమాత్రం గమనించలేదు. విదురుని మంత్రియైన ఖనకశ్రేష్ఠునికి మాత్రమే పాండవుల విషయాలు తెలుసు. (20)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి జతుగృహవాసే షట్ చత్వారింశదధిక శతతమోఽధ్యాయః ॥146॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వ మను ఉపపర్వమున జతుగృహనివాసమను నూట నలుబది ఆరవ అధ్యాయము. (146)