148. నూట నలువది ఎనిమిదవ అధ్యాయము

విదురుడు పంపిన నావికుడు పాండవులను గంగానదిని దాటించుట.

వైశంపాయన ఉవాచ
ఏతస్మిన్నేవ కాలే తు యథా సంప్రత్యయం కవిః ।
విదురః ప్రేషయామాస తద్వనం పురుషం శుచిమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - ఇదే సమయంలో పరమజ్ఞాని విదురుడు తన అంతరాత్మ ప్రబోధానుసారం, విశుద్ధ చరిత్ర కల ఒకానొక పురుషుని పాండవులున్న అరణ్యానికి పంపాడు. (1)
స గత్వా తు యథోద్దేశం పాండవాన్ దదృశే వనే ।
జనన్యా సహ కౌరవ్య మాపయానాన్ నదీజలమ్ ॥ 2
కురునందనా! అతడు అరణ్యంలో సూచింపబడిన ప్రదేశానికి వెళ్ళి, నదీజలం ఎంతలోతుగా ఉన్నదో పరిశీలిస్తున్న పాండవులను, కుంతిని చూశాడు. (2)
విదితం తన్మహాబుద్ధేః విదురస్య మహాత్మనః ।
తతస్తస్యాపి చారేణ చేష్టితం పాపచేతసః ॥ 3
తతః ప్రవాసితో విద్వాన్ విదురేణ నరస్తదా ।
పార్థానాం దర్శయామాస మనోమారుతగామినీమ్ ॥ 4
సర్వవాతసహాం నావం యంత్రయుక్తాం పతాకినీమ్ ।
శివే భాగీరథీతీరే నరైర్విస్రంభిభిః కృతామ్ ॥ 5
బుద్ధిశాలి, మహాత్ముడు అయిన విదురునకు, తన చారుల ద్వారా పాపబుద్ధికల పురోచనును, దుర్మార్గపు చేష్టలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ కారణంగా విదురుని చేత విద్వాంసుడైన పురుషుడొకడు పాండవుల వద్దకు పంపబడ్డాడు. అతడు పవిత్రమైన గంగానదీ తీరంలో, విశ్వసింపదగిన పురుషులచే నిర్మింపబడి, వాయువేగమనోవేగాలతో ప్రయాణించేది, అన్ని విధాలైన గాలులను తట్టుకొంటూ జెండాలతోను యంత్రాలతోను కూడిన నౌకను పాండవులకు చూపించాడు. (3-5)
తతః పునరథోవాచ జ్ఞాపకం పూర్వచోదితమ్ ।
యుధిష్టిరనిబోధేదం సంజ్ఞార్థం వచనం కవేః ॥ 6
యుధిష్టిరా! మీరు నన్ను విశ్వసించడానికి పనికి వచ్చే, విదురుని వచనాన్ని వినవలసింది. పూర్వం మీకు విదురుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకంగా చెపుతున్నాను - అన్నాడు వచ్చిన పురుషుడు. (6)
కక్షఘ్నశ్శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః ।
న హంతీత్యేవ మాత్మానం యో రక్షతి స జీవతి ॥ 7
మహారణ్యంలో కార్చిచ్చు, సమస్తమునూ దహిస్తుంది. చలినీ పోగొట్టుతుంది. అయినా కలుగుల్లో నివసించే ప్రాణులను (ఎలుకలను) చంపలేదు. ఈ విధంగా ఎవడు తన్ను తాను రక్షించుకొంటాడో, వాడు జీవిస్తాడు. (7)
తేన మాం ప్రేషితం విద్ధి విశ్వస్తం సంజ్ఞయానయా ।
భూయశ్చైవాహ మాం క్షత్తా విదురః పర్వతోఽర్థవిత్ ॥ 8
కర్ణం దుర్యోధనం చైవ భ్రాతృభిస్సహితం రణే ।
శకునిం చైవ కౌంతేయ విజేతాసి న సంశయః ॥ 9
ఈ సంభాషణ రూపంలో ఉన్న గుర్తు చేత, నన్ను విదురుడు పంపిన నమ్మకమైన వ్యక్తిగా భావించండి. సర్వార్థవిదుడు విదురుడు మరొక్క విషయం కూడా చెప్పమన్నాడు. యుధిష్ఠిరా! నీవు యుద్ధరంగంలో, కర్ణుని, సోదరులతో కూడిన దుర్యోధనుని, శకునిని కూడా జయిస్తావనటంలో సందేహం లేదు. (8,9)
ఇయం వారిపథే యుక్తా నౌరప్సు సుఖగామినీ ।
మోచయిష్యతి వస్సర్వాన్ ఆస్మాద్దేశాన్న సంశయః ॥ 10
ఈ నౌక జలమార్గంలో ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది నీళ్ళలో సుఖంగా ప్రయాణిస్తుంది. మిమ్మల్నందరినీ ఈ ప్రదేశం నుండి బయటకు చేరుస్తుంది. (10)
అథ తాన్ వ్యథితాన్ దృష్ట్వా సహ మాత్రా నరోత్తమాన్ ।
నావమారోప్య గంగాయాం ప్రస్థితా నబ్రవీత్ పునః ॥ 11
ఆ నావికుడు, దుఃఖితులైన వారిని చూసి, తల్లితో సహా పురుషశ్రేష్ఠులైన పాండవులను నావపై ఎక్కించి, గంగలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈ విధంగా అన్నాడు. (11)
విదురో మూర్ద్న్యుపాఘ్రాయ పరిష్వజ్య వచో ముహుః ।
అరిష్టం గచ్ఛతావ్యగ్రాః పంథానమితి చాబ్రవీత్ ॥ 12
విదురుడు మీ అందరి శిరస్సులను ఆఘ్రాణించి, కౌగిలించుకొని, ఆదర పూర్వకంగా మీ యాత్ర కుశలంగాను, నిర్విఘ్నంగాను జరగాలని పదే పదే కోరుకొన్నాడు. మీ అందరినీ ఆశీర్వదించాడు. (12)
ఇత్యుక్త్వా స తు తాన్ వీరాన్ పుమాన్ విదురచోదితః ।
తారయామాస రాజేంద్ర గంగాం నావా నరర్షభాన్ ॥ 13
రాజేంద్రా! విదురుని పంపున వచ్చిన ఆ పురుషుడు, ఈ విధంగా నరశ్రేష్టులు, వీరులు అయిన పాండవులతో పలికి, నౌక ద్వారా వారిని గంగా నదిని దాటించాడు. (13)
తారయిత్వా తతో గంగాం పారం ప్రాప్తాంశ్చ సర్వశః ।
జయాశిషః ప్రయుజ్యాథ యథాగతమగాద్ధి సః ॥ 14
పిదప అతడు గంగను దాటిన వారందరికీ విజయాశీస్సులు పలికి, ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. (14)
పాండవాశ్చ మహాత్మానః ప్రతిసందిశ్య వై కవేః ।
గంగాముత్తీర్య వేగేన జగ్ముర్గూఢమలక్షితాః ॥ 15
మహాత్ములైన పాండవులు తగువిధంగా విడురునికి సందేశం పంపి, గంగను దాఠి, ఎవరికంటా పడకుండా వేగంగా,రహస్యంగా ప్రయాణం సాగించారు. (15)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి గంగోత్తరణే అష్టచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥148॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వ మను ఉపపర్వమున గంగోత్తరణమను నూట నలువది ఎనిమిదవ అధ్యాయము. (148)