154. నూట ఏబది నాల్గవ అధ్యాయము
భీమ హిడింబల కలయిక - ఘటోత్కచుని పుట్టుక.
(వైశంపాయన ఉవాచ)
సా తానేవాపతత్ తూర్ణం భగినీ తస్య రక్షసః ।
అబ్రువాణా హిడింబా తు రాక్షసీ పాండవాన్ ప్రతి ॥
అభివాద్య తతః కుంతీం ధర్మరాజం చ పాండవమ్ ।
అభిపూజ్య చ తాన్ సర్వాన్ భీమసేనమభాషత ॥
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! హిడింబుని సోదరి, హిడింబ మాట్లాడకుండా పాండవులను శీఘ్రంగా అనుసరించటం ప్రారంభించింది. వారిని సమీపించింది. మిగిలిన వారినందరినీ గౌరవిస్తూ భీమసేనునితో ఇలా అంది.
హిడింబో వాచ
అహం తే దర్శనాదేవ మన్మథస్య వశం గతా ।
క్రూరం భ్రాతృవచో హిత్వా సా త్వామేవానురుంధతీ ॥
రాక్షసే రౌద్రసంకాశే తవాపశ్యం విచేష్టితమ్ ।
అహం శుశ్రూఘరిచ్ఛేయం తవ గాత్రం నిషేవితుమ్ ॥)
హిడింబ ఇలా అంది. నేను మిమ్మల్ని చూసినప్పటి నుండీ మన్మథుని వశమయ్యాను. క్రూరమైన సోదరుని మాటను కాదని మిమ్మల్నే అనుసరిస్తున్నాను. అతి భయంకరుడైన రాక్షసునిపై మీరు చేసిన పరాక్రమాన్ని చూశాను. నేను మిమ్మల్ని, నీశరీరాన్ని సేవిస్తాను.
భీమసేన ఉవాచ
స్మరంతి వైరం రక్షాంసి మాయామాశ్రిత్య మోహినీమ్ ।
హిడింబే వ్రజ పంథానం త్వమిమం భ్రాతృసేవితమ్ ॥ 1
భీమసేనుడిలా అన్నాడు. హిడింబా! రాక్షసులు మోహాన్ని కల్గించే మాయతో ప్రవర్తిస్తారు. అయినా వారి మనస్సుల్లో వైరం ఎప్పటికీ మాసిపోదు. కనుక నీవు కూడా నీ అన్నగారి మార్గాన్ని ఆశ్రయించటం మంచిది. (1)
యుధిష్ఠిర ఉవాచ
క్రుద్ధోపి పురుషవ్యాఘ్ర భీమ మాస్మ స్త్రియం వధీః ।
శరీరగుప్త్యభ్యధికం ధర్మం గోపాయ పాండవ ॥ 2
యుధిష్ఠిరుడన్నాడు - పురుషశ్రేష్ఠా! భీమసేనా! ఎంత కోపం ఉన్నా స్త్రీని చంపవద్దు. పాండవ! శరీర రక్షణం కంటె ధర్మరక్షణ ముఖ్యం. (2)
వధాభిప్రాయమాయాంతమ్ అవధీస్త్వం మహాబలమ్ ।
రక్షసస్తస్య భగినీ కిం నః క్రుద్ధా కరిష్యతి ॥ 3
చంపడానికి వస్తున్న మహాబలుని హిడింబుని నీవు చంపనే చంపావు. అతని సోదరి ఈమె. ఈమెకు కోపం వస్తే మనల నేం చెయ్యగలదు? (3)
వైశంపాయన ఉవాచ
హిడింబా తు తతః కుంతీమ్ అభివాద్య కృతాంజలిః ।
యుధిష్ఠిరం తు కౌంతేయమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! వెంటనే హిడింబ చేతులు జోడించి, కుంతికి, యుధిష్ఠిరునికీ నమస్కరిస్తూ ఇలా పలికింది. (4)
ఆర్యే జానాసి యద్ దుఃఖం ఇహ స్త్రీణామనంగజమ్ ।
తదిదం మామనుప్రాప్తం భీమసేనకృతం శుభే ॥ 5
పూజ్యురాలా! స్త్రీలు అనంగుని వల్ల ఎంత దుఃఖిస్తారో నీకు తెలుసు. శుభాంగీ! భీమసేనుని మీద ప్రేమతో నాకలాంటి దుఃఖం ఏర్పడింది. (5)
సోఢం తత్ పరమం దుఃఖం మయా కాలప్రతీక్షయా ।
సోఽయమభ్యాగతః కాలః భవితా మే సుఖోదయః ॥ 6
ఆ మహాదుఃఖాన్ని సరియైన సమయం కోసం ఎదురుచూస్తూ సహించాను. ఆ శుభతరుణం ఇప్పుడు వచ్చింది. నాకు సుఖం లభించే కాలం వచ్చిందనుకొంటున్నాను. (6)
మయా హ్యుత్సృజ్య సుహృదః స్వధర్మం స్వజనం తథా ।
వృతోఽయం పురుషవ్యాఘ్రః తవ పుత్రః పతిః శుభే ॥ 7
నేను స్నేహితులను, స్వధర్మాన్ని, నావారిని విడిచిపెట్టాను. పవిత్రురాలా! నీపుత్రుని-పురుషశ్రేష్ఠుని-భర్తగా వరించాను. (7)
వీరేణాహం తథానేన త్వయా చాపి యశస్విని ।
ప్రత్యాఖ్యాతా న జీవామి సత్యమేతద్బ్రవీమి తే ॥ 8
యశస్వినీ! ఈ వీరునిచేత, నీచేత నేను తిరస్కరింపబడితే ఇక నేను జీవించలేను. ఇది ముమ్మాటికీ నిజం. (8)
తదర్హసి కృపాం కర్తుం మయి త్వం వరవర్ణిని ।
మత్వా మూఢేతి తన్మాత్వం భక్తా వానుగతేతి వా ॥ 9
వరవర్ణినీ! నీవు నా విషయంలో దయచూపాలి. మూర్ఖురాలనో, భక్తురాలనో, సేవకురాలనో అనుకొని నా మీద దయచూపించు. (9)
భర్త్రానేన మహాభాగే సంయోజయ సుతేన హ ।
తముపాదాయ గచ్ఛేయం యథేష్టం దేవరూపిణమ్ ।
పునశ్చైవానయిష్యామి విస్రంభం కురు మే శుభే ॥ 10
పూజ్యురాలా! నీకుమారుడైన భీమసేనుని నాకు భర్తగా అనుగ్రహించు. దేవరూపుడైన ఆయనను తీసుకొని నేను స్వేచ్ఛగా విహరిస్తాను. శుభాంగీ! నన్ను విశ్వసించు. నీ ఆనతి ప్రకారం తిరిగి భీముని వెనక్కు తీసుకొని వస్తాను. (10)
అహం హి మనసా ధ్యాతా సర్వాన్ నేష్యామి వః సదా ।
(న యాతుధాన్యహం త్వార్యే న చాస్మి రజనీచరీ ।
కన్యా రక్షస్సు సాధ్వ్యస్మి రాజ్ఞి సాలకటంకటీ ॥
పుత్రేణ తవ సంయుక్తా యువతిర్దేవవర్ణినీ।
సర్వాన్ వోఽహముపస్థాస్యే పురస్కృత్య వృకోదరమ్ ॥
అప్రమత్తా ప్రమత్తేషు శుశ్రూషురసకృత్ త్వహమ్ ।)
వృజినాత్ తారయిష్యామి దుర్గేషు విషమేషు చ ॥ 11
పృష్ఠేన వో వహిష్యామి శీఘ్రం గతిమభీప్సతః ।
యూయం ప్రసాదం కురుత భీమసేనో భజేత మామ్ ॥ 12
నేను ఎల్లవేళలా మీరు స్మరించగానే మీ ముందుకు వస్తాను. మీరు కోరుకొన్న ప్రదేశానికి అందరినీ చేరుస్తాను. ఆర్యా! నన్ను యాతుధానిగా, నిశాచరిగా భావించవద్దు. మహారాణీ! నేను రాక్షసజాతిలో పుట్టిన కన్యకను. మంచి శీలవతిని. నాపేరు సాలకటంకటి. నేను యువతిని. దివ్యమైన రూపసంపద కలదానిని. నీ పుత్రుని వృకోదరుని వరించాను. అతనితోపాటు మీ అందరికీ సేవలు చేయాలని భావిస్తున్నాను. మీరందరూ అజాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా నేను అప్రమత్తంగా మిమ్మల్ని రక్షిస్తాను. ఎల్లవేళలా మీకు సేవ చేస్తాను. మీరు దుర్గమప్రదేశాల్లో, ఎత్తుపల్లాల్లో శీఘ్రంగా ప్రయాణించాలనుకొన్నప్పుడు మీఅందరినీ మోసుకొని పోతాను. మీరు అనుగ్రహించండి. భీముని అంగీకరింపచేయండి. (11,12)
ఆపదస్తరణే ప్రాణాన్ ధారయేద్ యేన తేన వా ।
సర్వమావృత్య కర్తవ్యం తం ధర్మమనువర్తతా ॥ 13
ఆపదలను తొలగించికోవాటానికి, ప్రాణాలను, నిలబెట్టుకోవటానికి, ఏదో ఒక ఉపాయాన్ని స్వీకరించాలి. ధర్మమార్గాన్ని అనుసరించేవారు తప్పక అవసరమైన ఉపాయాన్ని అంగీకరించాలి. (13)
ఆపత్సు యో ధారయతి ధర్మం ధర్మవిదుత్తమః ।
వ్యసనం హ్యేవ ధర్మస్య ధర్మిణా మాపదుచ్యతే ॥ 14
ఎవడు ఆపదల్లో కూడా ధర్మాన్ని పాటిస్తాడో వాడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడవుతాడు. ధర్మానికి అపాయం ఏర్పడటమే ధర్మాత్ములకు గొప్ప ఆపద అవుతుంది. (14)
పుణ్యం ప్రాణాన్ ధారయతి పుణ్యం ప్రాణదముచ్యతే ।
యేన యేనాచరేద్ ధర్మం తస్మిన్ గర్హా న విద్యతే ॥ 15
చేసుకున్న పుణ్యమే ప్రాణాన్ని కాపాడుతుంది. కనుకనే పుణ్యానికి ప్రాణదం - అని పేరు వచ్చింది. ధర్మ సాధనకు అనుసరించే ఉపాయం ఏదయినా దానిని అనుసరించాలి. అలా చేస్తే నిందరాదు. (15)
(మహతోఽత్ర స్త్రియం కామాద్ బాధితాం త్రాహి మామపి ।
ధర్మార్థ కామమోక్షేఘ దయాం కుర్వంతి సాధవః ॥
తం తు ధర్మమితి ప్రాహుః మునయో ధర్మవత్సలాః ।
దివ్యజ్ఞానేన పశ్యామి అతీతానాగతానహమ్ ॥
తస్మాద్ వక్ష్యామి వః శ్రేయః ఆసన్నం సర ఉత్తమమ్ ।
అద్యాసాద్య సరః స్నాత్వా విశ్రమ్య చ వనస్పతౌ ॥
వ్యాసం కమలపత్రాక్షం దృష్ట్వా శోకం విహాస్యథ ॥
ధార్తరాష్ట్రాత్ వివాసశ్చ దహనం వారణావతే ।
త్రాణం చ విదురాత్తుభ్యం విదితం జ్ఞానచక్షుషా ॥
ఆవాసే శాలిహోత్రస్య స చ వాసం విధాస్యతి ।
వర్షవాతాతపసహః అయం పుణ్యో వనస్పతిః ॥
పీతమాత్రే తు పానీయే క్షుత్పిపాసే వినశ్యతః ।
తపసా శాలిహోత్రేణ సరో వృక్షశ్చ నిర్మితః ॥
కాదంబా సారసాః హంసాః కురర్యః కురరైః సహ ।
రువంతి మధురం గీతం గాంధర్వస్వనమిశ్రితమ్ ॥
అమ్మా! అతి తీవ్రమైన కోరికతో నేను బాధపడుతున్నాను. అలాంటి స్త్రీని నన్ను రక్షించు. సాధుశీలులు ధర్మార్థ కామమోక్షాల విషయంలో దయతో ప్రవర్తిస్తారు. ధర్మాదుల విషయంలో పరుల పట్ల దయతో ప్రవర్తించటం గొప్పధర్మమని ధర్మవిదులు చెపుతున్నారు. నాకు దివ్యజ్ఞానం ఉంది. జరిగిపోయిన వాటిని, జరగబోయే సంఘటనలను నేను చూడగలను. కనుక చెప్పగలుగుతున్నాను. మీకు శ్రేయస్సు కల్గబోతున్నది. ఇచ్చట ఒక గొప్ప సరస్సున్నది. దానిలో మీరు స్నానం చేసి, ప్రక్కనే ఉన్న చెట్టు వద్ద విశ్రాంతిని పొందండి. అక్కడ మీరు పద్మలోచనుడైన వ్యాసుని దర్శిస్తారు. మీ బాధలన్నీ తొలగిపోతాయి. దుర్యోధనుడు మిమ్మల్ని నగరాన్నుంచి బహిష్కరించటం, వారణావతనగరంలో ఇల్లు తగులబడటం, విదురుని వల్ల మీరందరూ రక్షించబడడం, ఈ విషయాలను నేను జ్ఞాననేత్రంతో చూడగల్గుతున్నాను. వ్యాసమహర్షి శాలిహోత్రుని ఆశ్రమంలో ఉంటాడు. అచటనున్న వృక్షం పరమ పవిత్రమైనది. అది వర్షం, ఎండ, గాలులు అన్నింటి నుండీ మిమ్మల్ని రక్షిస్తుంది. అచటి సరస్సులో నీరు త్రాగితే చాలు, ఆకలి దప్పులు నశిస్తాయి. శాలిహోత్రమహర్షి తన తపఃఫలంతో ఆ సరస్సును, వృక్షాన్ని నిర్మించాడు. బూడిదరంగుహంసలు, బెగ్గురుపక్షులు, హంసలు, గొర్రెల జంటలు అక్కడ తియ్యని గంధర్వగానం చేస్తుంటాయి.
వైశంపాయన ఉవాచ
తస్యాస్తద్ వచనం శ్రుత్వా కుంతీ వచనమబ్రవీత్ ।
యుధిష్ఠిరం మహాప్రాజ్ఞం సర్వశాస్త్రవిశారదమ్ ॥
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! హిడింబమాటలను విన్న కుంతి, గొప్పవిజ్ఞత కల్గి, సమస్త శాస్త్రాల్లో పండితుడయిన యుధిష్ఠిరునితో ఇలా అంది.
కుంత్యువాచ
త్వం హి ధర్మభృతాం శ్రేష్ఠ మయోక్తం శృణు భారత ।
రాక్షస్యేషా హి వాక్యేన ధర్మం వదతి సాధు వై ॥
భావేన దుష్టా భీమం సా కిం కరిష్యతి రాక్షసీ ।
భజతాం పాండవం వీరమ్ అపత్యార్థం యదీచ్ఛసి ॥)
కుంతి పలికింది. భారతా! నీవు ధర్మాత్ములలో శ్రేష్ఠుడవు. నేను చెప్పింది శ్రద్ధగా విను. ఈమె రాక్షసస్త్రీ అయినా ధర్మాన్ని చక్కగ వివరించింది. ఒక వేళ ఈమె భావంలో ఏదైనా దోషం ఉన్నా, ఈమె భీముణ్ణి ఏమి చేయగల్గుతుంది? నీవు సమ్మతిస్తే వీరుడైన భీమసేనుని, ఈమె సంతతి కోసం భర్తగా స్వీకరిస్తుంది.
యుధిష్ఠిర ఉవాచ
ఏవమేతద్ యదాఽఽత్థ త్వం హిడింబే నాత్ర సంశయః ।
స్థాతవ్యం తు త్వయా సత్యే యథా బ్రూయాం సుమధ్యమే ॥ 16
యుధిష్ఠిరుడన్నాడు. హిడింబా! నీవు చెప్పినదంతా నిజమే. అందులో సందేహం లేదు. కానీ సుమధ్యమా! నేను చెప్పినవిధంగా నీవు ప్రవర్తించాలి. సత్యాన్ని ఒప్పందాన్ని అతిక్రమించరాదు. (16)
స్నాతం కృతాహ్నికం భద్రే కృతకౌతుకమంగలమ్ ।
భీమసేనం భజేథాస్త్వం ప్రాగస్తగమనాద్రవేః ॥ 17
హిడింబా! స్నానం చేసి, నిత్యకర్మలను ఆచరించి, మంగళకరవేషభాషలతో ఉన్న భీమసేనునితో నీవు విహరించవచ్చు. కానీ సూర్యాస్తమయం కాకుండా నీవు భీమసేనుని తిరిగి పంపించాలి. (17)
అహస్సు విహరానేన యథాకామం మనోజవా ।
అయం త్వానయితవ్యస్తే భీమసేనః సదా నిశి ॥ 18
పగలంతా భీమునితో స్వేచ్ఛగా విహరించు. మనోవేగం కల్గిన నీవు రాత్రి మాత్రం ప్రతిరోజు మావద్దకు తీసుకొనిరావాలి. (18)
(ప్రాక్ సంధ్యాతో విమోక్తవ్యః రక్షితవ్యశ్చ నిత్యశః ।
ఏవం రమస్వ భీమేన యావద్ గర్భస్య వేదనమ్ ॥
ఏష తే సమయో భద్రే శుశ్రూష్యశ్చాప్రమత్తయా ।
నిత్యానుకూలయా భూత్వా కర్తవ్యం శోభనం త్వయా ॥
నీవు ఇతడిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండాలి. సంధ్యాకాలానికి ముందే ఇతనిని విడిచిపెట్టాలి. ఇలా నివు ప్రసవవేదన వరకు విహరించవచ్చు. భద్రా! ఇది నీవు పాటించవలసిన నియమం. భీముని అప్రమత్తంగా సేవించు. నిరంతరం మనస్సుకు అనుకూలంగా వ్యవహరించు. అతనికి మేలు చేయటానికి ప్రయత్నించు.
యుధిష్ఠిరేణైవముక్తా కుంత్యా చాంకేఽధిరోపితా ।
భీమార్జునాంతరగతా యమాభ్యాం చ పురస్కృతా ॥
తిర్యగ్ యుధిష్ఠిరే యాతి హిడింబా భీమగామినీ ।
శాలిహోత్రసరో రమ్యమ్ ఆసేదుస్తే జలార్థినః ॥
తత్తథేతి ప్రతిజ్ఞాయ హిడింబా రాక్షసీ తదా ।
వనస్పతి తలం గత్వా పరిమృజ్య గృహం యథా ॥
పాండవానాం చ వాసం సా కృత్వా పర్ణమయం తథా ।
ఆత్మనశ్చ తథా కుంత్యాః ఏకోద్దేశే చకార సా ॥
పాండవాస్తు తతః స్నాత్వా శుద్ధాః సంధ్యాముపాస్య చ ।
తృషితాః క్షుత్పిపాసార్తాః జలమాత్రేణ వర్తయన్ ॥
శాలిహోత్రస్తతో జ్ఞాత్వా క్షుధార్తాన్ పాండవాంస్తదా ।
మనసా చింతయామాస పానీయం భోజనం మహత్ ॥
తతస్తే పాండవాః సర్వే విశ్రాంతాః పృథయా సహ ।
యథా జతుగృహే వృత్తం రాక్షసేన కృతం చ యత్ ॥
కృత్వా కథా బహువిధాః కథాంతే పాండునందనమ్ ।
కుంతిరాజసుతా వాక్యం భీమసేనమథాబ్రవీత్ ॥
యుధిష్ఠిరుని మాటలి విన్నది హిడింబ. కుంతిచేత గారవింపబడింది. యుధిష్ఠిరుడు ముందుగా నడుస్తున్నాడు. తరువాత నకులసహదేవులు, ఆ తర్వాత భీమసేనుడు, అతని వెనుక హిడింబ, హిడింబ వెనుక అర్జునుడు నడుస్తూ వారందరూ నీటికోసం శాలిహోత్రుని సరస్సు చేరుకొన్నారు. అక్కడకు చేరిన పిదప హిడింబ యుధిష్ఠిరుడు చెప్పినట్లే చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. పిదప అచటి చెట్టును సమీపించి హిడింబ, ఆ ప్రదేశాన్ని చక్కగా బాగుచేసి, పాండవులందరికీ నివసించటానికి ఆకులతో పర్ణశాలను నిర్మించింది. తనకూ, కుంతికి వేరే ఒకచోట పర్ణశాల ఏర్పరచింది. తర్వాత పాండవులందరూ సరస్సులో స్నానాలు చేశారు. పరిశుద్ధులై సంధ్యావందనం చేశారు. ఆకలి దప్పులతో నీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. శాలిహోత్రుడు పాండవులను ఆకలిగొనవారినిగా తెలిసికొని, గొప్ప భోజన్నాన్ని, వివిధ పానీయాలను వారికి కల్పించాడు.
తర్వాత పాండవులందరూ, కుంతి విశ్రమించారు. పిదప లక్కయిల్లు తగలబడటం, హిడింబుని వృత్తాంతం, ఇంకా అనేక విషయాలు మాట్లాడుకొన్నారు. చివరకు కుంతీదేవి భీమసేనునితో ఇలా అంది.
కుంత్యువాచ
యథా పాండుస్తథా మాన్యః తవ జ్యేష్ఠో యుధిష్ఠిరః ।
అహం ధర్మ విధానేన మాన్యా గురుతరా తవ ॥
తస్మాత్ పాండుహితార్థం మే యువరాజ హితం కురు ।
నికృతా ధార్తరాష్ట్రేణ పాపేనాకృతబుద్ధినా ॥
దుష్కృతస్య ప్రతీకారం న పశ్యామి వృకోదర ।
తస్మాత్ కతిపయాహేన యోగక్షేమం భవిష్యతి ॥
క్షేమం దుర్గమిమం వాసం వసిష్యామో యథా సుఖమ్ ।
ఇదమద్య మహత్ దుఃఖం ధర్మకృచ్ఛ్రం వృకోదర ॥
దృష్ట్వైవ త్వాం మహాప్రాజ్ఞ అనంగాభిప్రచోదితా ।
యుధిష్ఠిరం చ మాం చైవ వరయామాస ధర్మతః ॥
ధర్మార్థం దేహి పుత్రం త్వం స నః శ్రేయః కరిష్యతి ।
ప్రతివాక్యం తు నేచ్ఛామి హ్యావాభ్యం వచనం కురు ॥)
కుంతి చెప్పింది. నీకు పాండురాజు ఎలా మాన్యుడో యుధిష్ఠిరుడూ అంతే. ధర్మమాలోచిస్తే తల్లినైన నేను అంతకంటె మాన్యురాలను. కనుక పాండురాజు మేలుకోసం, యువరాజా! నేను చెప్పినట్లు చెయ్యి. వృకోదరా! పాపి దుర్బుద్ధి దుర్యోధనుడు అవమానించాడు అతనికి ప్రతీకారం ఎలా చెయ్యాలో అర్థం కాదు అయితే కొద్ది కాలంలో మనకు యోగక్షేమాలు కల్గుతాయి. ఈ నివాసం మనకు మంచిది. అన్యులకీ ప్రదేశం దుర్గమం. ఇక్కడే మనం సుఖంగా కాలక్షేపం చేద్దాం. వృకోదరా! నేడు మనకు ధర్మసంకటం వచ్చింది. మహాప్రాజ్ఞా! నిన్ను చూడగానే యీ హిడింబ మదనపరవశ అయింది. దాని కారణంగా దుఃఖిస్తోంది. ధర్మప్రకారం నన్ను, యుధిష్ఠిరుని ప్రార్థించింది. నిన్ను పెళ్లాడాలని కోరింది. ధర్మం కోసం నీవు ఈమెకు పుత్రుని ప్రసాదించు. అతనివల్ల మనకు మేలు జరుగుతుంది. నీవు వాదించవద్దు. నేను, యుధిష్ఠిరుడు చెప్పినట్లు చెయ్యి.
వైశంపాయన ఉవాచ
తథేతి తత్ ప్రతిజ్ఞాయ భీమసేనోఽబ్రవీదిదమ్ ।
శృణు రాక్షసి సత్యేన సమయం తే వదామ్యహమ్ ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! భీమసేనుడు తల్లి చెప్పిన మాటను అంగీకరించాడు. తర్వాత హిడింబతో అన్నాడు. రాక్షసీ! నీకు నేను ఒక నియమాన్ని చెప్తాను. శ్రద్ధగా విను. నిష్ఠగా పాటించు. (19)
యావత్ కాలేన భవతి పుత్రస్యోత్పాదనం శుభే ।
తావత్కాలం గమిష్యామి త్వయా సహ సుమధ్యమే ॥ 20
వైశంపాయన ఉవాచ
తథేతి తత్ ప్రతిజ్ఞాయ హిడింబా రాక్షసీ తదా ।
భీమసేనముపాదాయ సోర్ధ్వమాచక్రమే తతః ॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు హిడింబ, నీవు చెప్పినట్లే చేస్తానని ప్రతిజ్ఞ చేసి భీమసేనుని తీసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. (21)
శైలశృంగేషు రమ్యేషు దేవతాయతనేషు చ ।
మృగపక్షివిఘుష్టేషు రమణీయేషు సర్వదా ॥ 22
కృత్వా చ పరమం రూపం సర్వాభరణభూషితా ।
సంజల్పంతీ సుమధురం రమయామాస పాండవమ్ ॥ 23
తథైవ వనదుర్గేషు పుష్పితద్రుమవల్లిషు ।
సరస్సు రమణేయేషు పద్మోత్పలయుతేషు చ ॥ 24
నదీద్వీపప్రదేశేషు వైదూర్యసికతాసు చ ।
సుతీర్థవనతోయాసు తథా గిరినదీషు చ ॥ 25
కానమేషు విచిత్రేషు పుష్పితద్రుమవల్లిఘ ।
హిమవద్గిరికుంజేషు గుహాసు వివిధాసు చ ॥ 26
ప్రపుల్లశతపత్రేషు సరస్స్వమలవారిషు ।
సాగరస్య ప్రదేశేషు మణిహేమచితేషు చ ॥ 27
పల్వలేషు చ రమ్యేషు మహాశాలవనేషు చ ।
దేవారణ్యేషు పుణ్యేషు తథా పర్వతసానుషు ॥ 28
గుహ్యకానాం నివాసేషు తాపసాయతనేషు చ ।
సర్వర్తుఫలరమ్యేషు మానసేషు సరస్సు చ । 29
బిభ్రతీ పరమం రూపం రమయామాస పాండవమ్ ।
రమయంతీ తథా భీమం తత్ర తత్ర మనోజవా ॥ 30
ఆ హిడింబ భీమసేనునితో చక్కగా విహరించింది. అతనిని పరిపరివిధాల ఆనందపరిచింది. అందమైన కొండకొమ్ములలో, దేవాలయ ప్రాంతాల్లో, మృగాలు పక్షులతో నిండిన సుందర ప్రదేశాల్లో వారు సంచరించారు. హిడింబ
సర్వాభరణాలు, అందమైన రూపాన్ని ధరించి, తియ్యతియ్యగా మాట్లాడుతూ భీముని అలరించింది. తీగలు, చెట్లు పుష్పించిన దుర్గమారణ్యాల్లో, పద్మాలతో కలువలతో శోభించే అందమైన సరస్సుల్లో, నదుల్లో, ద్వీపాల్లో, వైదూర్యమణుల్లా భాసించే ఇసుకతిన్నెల్లో, మంచి తీర్థాల్లో, కొండవాగుల్లో, పుష్పించిన తీగలు చెట్లతో నిండిన ఆశ్చర్యకరమైన అడవుల్లో, హిమవత్పర్వతం మీది పొదరిళ్ళలో, పలువిధాలైన గుహల్లో, స్వచ్ఛమైన నీటితో వికసించిన శతపత్రపద్మసరోవరాల్లో, అందమైన నీటి చెలమల్లో, గొప్పవైన మద్ది వనాల్లో, దేవతలకు ప్రసిద్ధమైన అడవుల్లో, పుణ్యప్రదేశాల్లో, కొండచరియల్లో, యక్షులనివాస ప్రదేశాల్లో, తాపసాశ్రమాల్లో, అన్ని ఋతువుల ఫలాలతో అందమైన మానససరోవరప్రాంతాల్లో, అద్భుతమైన అందమైన రూపాన్ని ధరించి హిడింబ, భీముడిని ఆనందంలో ఓలలాడించింది. ఆయా ప్రదేశాల్లో మనోవేగాలతో ప్రయాణించింది. (22-30)
ప్రజజ్ఞే రాక్షసీ పుత్రం భీమసేనాన్మహాబలమ్ ।
విరూపాక్షం మహావక్త్రం శంకుకర్ణం విభీషణమ్ ॥ 31
ఆ రాక్షసి భీమసేనుని వల్ల ఒక పుత్రుడిని కన్నది. అతడు భయంకరలోచనుడు, పెద్దనోరు, శంకువుల్లాంటి చెవులు ఉన్నవాడు. భయంకరుడు. (31)
భీమనాదం సుతామ్రోష్ఠం తీక్ష్ణదంష్ట్రం మహాబలమ్ ।
మహేష్వాసం మహావీర్యం మహాసత్త్వం మహాభుజమ్ ॥ 32
మహాజవం మహాకాయం మహామాయమరిందమమ్ ।
దీర్ఘఘోణం మహోరస్కం వికటోద్బద్ధ పిండికమ్ ॥ 33
అతని కంఠధ్వని భయంకరమైనది. అటహ్డు ఎర్రని పెదవులు, వాడియైన కోరలు, గొప్పబలం, ధనుస్సు, పరాక్రమం, అమితమైనబలం, ఎగుభుజాలు, మహావేగం, పెద్దశరీరం, గొప్పమాయలు, పొడవైన ముక్కు, విశాలమైన వక్షఃస్థలం, భయంకరమైన పిక్కలు వీటితో శత్రుమర్దనుడుగా ఉన్నాడు. (32,33)
అమానుషం మానుషజం భీమవేగం మహాబలమ్ ।
యః పిశాచానతీత్యాన్యాన్ బభూవాతీవ రాక్షసాన్ ॥ 34
అతనివేగం భయంకరమైనది. అతని బలం చాలా గొప్పది. మనుష్యునికి పుట్టినా, అమానుషమైన శక్తికలవాడు. అతడు పిశాచాలను, రాక్షసులను అందరినీ జయించే శక్తి కలవాడు. (34)
బాలోఽపి యౌవనం ప్రాప్తః మానుషేషు విశాంపతే ।
సర్వాస్త్రేషు పరం వీరః ప్రకర్షమగమద్ బలీ ॥ 35
రాజా! అతడు బాలుడైనా, మనుష్యుల్లో యువకునిలా ఉన్నాడు. అతడు గొప్పవీరుడు. అన్ని అస్త్రాల విషయంలో గొప్ప ప్రజ్ఞను కలిగి ఉన్నాడు. అతడు ఎంతో బలవంతుడు. (35)
సద్యో హి గర్భాన్ రాక్షస్యః లభంతే ప్రసవంతి చ ।
కామరూపధరాశ్చైవ భవంతి బహురూపికాః ॥ 36
రాక్షస స్త్రీలు గర్భాన్ని ధరించిన వెంటనే ప్రసవిస్తారు. స్వేచ్ఛగా కావలసిన రూపాన్ని ధరిస్తారు. వారు అనేక రూపాలతో ఉండగలరు. (36)
ప్రణమ్య వికచః పాదౌ అగృహ్ణాత్ స పితుస్తదా ।
మాతుశ్చ పరమేష్వాసః తౌ చ నామాస్య చక్రతుః ॥ 37
గొప్ప వులుకాడైన ఆ బాలుడు ఆనందంగా తల్లితండ్రుల పాదాలకు నమస్కారం చేశాడు. తల్లితండ్రులు అతనికి పేరు పెట్టారు. (37)
ఘటో హ్యస్యోత్కచ ఇతి మాతా తం ప్రత్యభాషత ।
అబ్రవీత్ తేన నామాస్య ఘటోత్కచ ఇతి స్మహ ॥ 38
హిడింబ వీడి శిరస్సు జుట్టులేకుండా (పైకి లేచిన జుట్టుతో) ఉంది అన్నది. తల్లి ఇలా అనటం వల్ల వాడికి ఘటోత్కచుడని పేరు వచ్చింది. (38)
అనురక్తశ్చ తానాసీత్ పాండవాన్ స ఘటోత్కచః ।
తేషాం చ దయితో నిత్యమ్ ఆత్మనిత్యో బభూవ హ ॥ 39
ఆ ఘటోత్కచుడు పాండవులందరిపట్ల ప్రేమాభిమానాలు పెంచుకొన్నాడు. వారందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. పాండవులకు వాడు నిత్యం సేవాపరాయణుడుగా ఉన్నాడు. (39)
సంవాససమయో జీర్ణః ఇత్యాభాష్య తతస్తు తాన్ ।
హిడింబా సమయం కృత్వా స్వాం గతిం ప్రత్యపద్యత ॥ 40
పిదప హిడింబ, భీమసేనునితో కలిసి ఉండే సమయం అయిపోయిందని పాండవులతో చెప్పి, (ఎప్పుడు స్మరించినా వస్తాను) ప్రతిన చేసి తానుకోరుకొన్న చోటుకు వెళ్ళింది. (40)
ఘటోత్కచో మహాకాయః పాండవాన్ పృథయా సహ ।
అభివాద్య యథాన్యాయమ్ అబ్రవీచ్చ ప్రభాష్య తాన్ ॥ 41
కింకరోమ్యహమార్యాణాం నిఃశంకం వదతానఘాః ।
తం బ్రువంతం భైమసేనిం కుంతీ వచనమబ్రవీత్ ॥ 42
పెద్ద శరీరం కల ఘటోత్కచుడు కుంతితోసహ పాండవులందరికీ తగిన విధంగా నమస్కరించి, వారితో ఇలా అన్నాడు. 'పుణ్యాత్ములారా! పూజ్యులైన మీకు నేను ఏమిస్వ చెయ్యగలనో నిస్సందేహంగా సెలవివ్వండి.' అప్పుడు కుంతి భీమసేనుని కుమారునితో ఇలా పలికింది. (41,42)
త్వం కురూణాం కులే జాతః సాక్షాద్ భీమసమోహ్యసి ।
జ్యేష్ఠః పుత్రోసి పంచానాం సాహాయ్యం కురుపుత్రక ॥ 43
"ఘటోత్కచా! నీవు కురువంశంలో పుట్టావు. సాక్షాత్తుగా భీమసేనునితో అన్నివిధాలా సరిపోలి ఉన్నావు. పాండవులైదుగురికీ నీవు జ్యేష్ఠ పుత్రుడవు కనుక అందరికీ సహాయంగా ఉండవలసింది". (43)
వైశంపాయన ఉవాచ
పృథయాప్యేవముక్తస్తు ప్రణమ్యైవ వచోఽబ్రవీత్ ।
యథా హి రావణో లోకే ఇంద్రజిచ్చ మహాబలః ।
వర్ష్మవీర్యసమో లోకే విశిష్టశ్చాభవం నృషు ॥ 44
వైశంపాయనుడిలా అన్నాడు. కుంతి ఇలా అనగానే ఘటోత్కచుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు. రావణుడు, ఇంద్రజిత్తు ఇద్దరూ గొప్పబలవంతులు. అదేవిధంగా నేను కూడా మానవుల్లో ప్రత్యేకమైన వాడిని, దేహబలపరాక్రమాల్లో తండ్రి అంతటి వాడను. (44)
కృత్యకాల ఉపస్థాస్యే పితౄనితి ఘటోత్కచః ।
ఆమంత్య్ర రక్షసాం శ్రేష్ఠః ప్రతస్థే చోత్తరాం దిశమ్ ॥ 45
మీకు నాతోపని ఉన్న కాలంలో మీముందుకు వస్తాను అని తండ్రుల వద్ద సెలవు తీసుకుని, ఆ రాక్షసశ్రేష్ఠుడు ఉత్తరదిక్కుగా బయలుదేరి వెళ్లాడు. (45)
స హి సృష్టో మఘవతా శక్తిహేతోర్మహాత్మనా ।
కర్ణస్యాప్రతివీర్యస్య ప్రతియోద్దా మహారథః ॥ 46
అతడు, మహాత్ముడైన ఇంద్రుని చేత, 'శక్తి' ఆయుధం దెబ్బను తట్టుకునే వానిగా, అసమానపరాక్రమశాలి కర్ణునికి సరిజోడుగా, మహారథునిగా సృష్టింపబడ్డాడు. (46)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి హిడింబవధ పర్వణి ఘటోత్కచోత్పత్తౌ చతుష్పంచాశదధిక శతతమోఽధ్యాయః ॥ 154 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున హిడింబవధ పర్వమను ఉపపర్వమున ఘటోత్కచోత్పత్తి అను నూట ఏబది నాల్గవ అధ్యాయము. (154)
(దాక్షిణాత్య అధికపాఠం 33 శ్లోకాలు కలుపుకొని 79 శ్లోకాలు)