160. నూట అరువదవ అధ్యాయము

కుంతి - బ్రాహ్మణుల సంభాషణ.

కుంత్యువాచ
న విషాదస్త్వయా కార్యః భయాదస్మాత్ కథంచన ।
ఉపాయః పరిదృష్టోఽత్ర తస్మాన్మోక్షాయ రక్షసః ॥ 1
కుంతి ఇలా అంది. బ్రాహ్మణా! రాక్ససుని భయం వల్ల నీవు దుఃఖింపపనిలేదు. ఆ రాక్షసుని నుండి విముక్తిని పొందటానికి తగ్గ ఉపాయం నాకు కన్పిస్తోంది. (1)
ఏకస్తవ సుతో బాలః కన్యా చైకా తపస్వినీ ।
న చైతయోస్తథా పత్న్యాః గమనం తవ రోచయే ॥ 2
బ్రాహ్మణా! నీకు ఒక్కడే కొడుకు, బాలుడు. ఒక్కగానొక్క కుమార్తె, దీనురాలు. వీరిద్దరూ గాని, నీ భార్యగాని, నీవుగాని రాక్షసుని వద్దకు ఆహారంగా వెళ్ళడం నాకు సమ్మతం కాదు. (2)
మమ పంచసుతా బ్రహ్మన్ తేషామేకో గమిష్యతి ।
త్వదర్థం బలిమాదాయ తస్య పాపస్య రక్షసః ॥ 3
విప్రా! నాకు ఐదుగురు కొడుకులున్నారు. వారిలో ఒకడు మీ బదులు, ఆహారపదార్థాన్ని తీసుకొని పాపాత్ముడైన ఆ రాక్షసుని వద్దకు వెడతాడు. (3)
బ్రాహ్మణ ఉవాచ
నాహమేతద్ కరిష్యామి జీవితార్థీ కథంచన ।
బ్రాహ్మణస్యాతిథేశ్చైవ, స్వార్థే ప్రాణాన్ వియోజయన్ ॥ 4
బ్రాహ్మణుడన్నాడు. నే నీపని చెయ్యను. నా జీవితం కోసం, అతిథియైన బ్రాహ్మణుని యొక్క జీవితాన్ని బలి చెయ్యను. (4)
న త్వేతదకులీనాసు నాధర్మిష్ఠాసు విద్యతే ।
యద్ బ్రాహ్మణార్థం విసృజేద్ ఆత్మానమపి చాత్మజమ్ ॥ 5
కులహీనులు, అధర్మపరులు కూడా ఇలాంటి పనులు చెయ్యరు. ఒక బ్రాహ్మణుని ప్రయోజనం కోసం తననుగాని, తన కుమారుని గాని విడిచిపెట్టడమే ఉచితం. (5)
ఆత్మనస్తు మయా శ్రేయః బోద్ధవ్యమితి రోచతే ।
బ్రహ్మవధ్యాఽఽత్మవధ్యా వా శ్రేయానాత్మవధో మమ ॥ 6
బ్రహ్మవధ్యా పరం పాపం నిష్కృతిర్నాత్ర విద్యతే।
అబుద్ధిపూర్వం కృత్వాపి వరమాత్మవధో మమ ॥ 7
నాకు ఏది మేలు కల్గిస్తుందో, దానిని నిశ్చయించుకోవాలి. బ్రహ్మహత్యకు ఒప్పుకోవటమా, ఆత్మహత్యకు అంగీకరించడమా? ఈ రెంటిలో నాకు ఆత్మవధయే మేలు చేస్తుంది. బ్రహ్మహత్య మహాపాపం. దాన్నుండి బయట పడలేము. ఆత్మహత్య బుద్ధిపూర్వకంగా చేయటం లేదు. కనుక ఆత్మవధకు అంగీకరించడమే నాకు మేలు. (6,7)
న త్వహం వధమాకాంక్షే స్వయమేవాత్మనః శుభే ।
పరైః కృతే వధే పాపం న కించిన్మయి విద్యతే ॥ 8
భద్రా! నేను నాకుగా మృత్యువును కోరటం లేదు. పరులు నన్ను చంపితే, దాని వల్ల నాకు పాపం ఎంతమాత్రం రాదు. (8)
అభిసంధికృతే తస్మిన్ బ్రాహ్మణస్య వధే మయా ।
నిష్కృతిం న ప్రపశ్యామి నృశంసం క్షుద్రమేవ చ ॥ 9
ఆగతస్య గృహం త్యాగః తథైవ శరణార్థినః ।
యాచమానస్య చ వధః నృశంసో గర్హితో బుధైః ॥ 10
బుద్ధిపూర్వకంగా నేను బ్రాహ్మణవధకు అంగీకరిస్తే అంతకంటె నీచమైన, క్రూరమైన పని మరొకటి ఉండదు. దీనికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ఇంటికి వచ్చిన వాడిని, శరణు వేడుకున్నవాడిని, ప్రాణాలకోసం ప్రార్థిస్తున్నవాడిని, చంపటం చాలా నీచమైనది. పండితులు అసహ్యించుకొంటారు. (9,10)
వి: తె: దీనికి నన్నయ్య చక్కని తెలుగు చేసినాడు
ధృతిసెడి వేఁడెడు వానిని
నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁజంపఁగ నొడఁబడు దు
ర్మతి కిహముం బరముఁగలదె మదిఁబరికింపన్. (1-6-274)
కుర్యాన్న నిందితం కర్మ న నృశంసం కథంచన ।
ఇతి పూర్వే మహాత్మానః ఆపద్ధర్మవిదో విదుః ॥ 11
శ్రేయాంస్తు సహదారస్య వినాశోఽద్య మమ స్వయమ్ ।
బ్రాహ్మణస్య వధం నాహం అనుమంస్యే కదాచన ॥ 12
నలుగురూ నిందించే పని చేయరాదు. నీచమైన పనిని ఎట్టిపరిస్థితుల్లోనూ చెయ్యకూడదు. ఈ విధంగా ఆపత్కాలంలో చేయదగిన ధర్మాలను తెలిసిన మహాత్ములు చెపుతున్నారు. కనుక భార్యాపుత్రసహితంగా నేను స్వయంగా మరణించటమే మంచిది. ఏ పరిస్థితుల్లోనూ బ్రాహ్మణవధకు నేను అనుమతించను. (11,12)
కుంత్యువాచ
మమాప్యేషా మతిర్బ్రహ్మన్ విప్రా రక్ష్యా ఇతి స్థిరా ।
న చాప్యనిష్టః పుత్రో మే యది పుత్రశతం భవేత్ ॥ 13
న చాసౌ రాక్షసః శక్తః మమ పుత్రవినాశనే ।
వీర్యవాన్ మంత్రసిద్ధశ్చ తేజస్వీ చ సుతో మమ ॥ 14
విప్రా! బ్రాహ్మణుల్ని రక్షించాలన్నదే నా స్థిరమైన అభిప్రాయం. నాకు వందమంది కుమారులున్నా, ఏ కుమారుడూ అనిష్టమైనవాడు కాదు. కానీ ఈ రాక్షసుడు నా కుమారుని చంపటానికి సమర్థుడు కాదు. నా కొడుకు చాలా శక్తికలవాడు, మంత్రసిద్ధిని పొందినవాడు. తేజశ్శాలి. (13,14)
రాక్షసాయ చ తత్సర్వం ప్రాపయిష్యతి భోజనమ్ ।
మోక్షయిష్యతి చాత్మానం ఇతి మే నిశ్చితా మతిః ॥ 15
మీరు పంపిన భోజనాన్ని నాకొడుకు రాక్షసుని వద్దకు చేరుస్తాడు. రాక్షసుని నుండి తాను విముక్తిని కూడా పొందుతాడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. (15)
సమాగతాశ్చ వీరేణ దృష్టపూర్వాశ్చ రాక్షసాః ।
బలవంతో మహాకాయాః నిహతా శ్చాప్యనేకశః ॥ 16
నా పుత్రుడు చాలా మంది రాక్షసుల్ని ఢీకొన్నాడు. ఎంతో మంది రాక్షసుల్ని చూశాడు. వారెంతో బలవంతులు. మహాశరీరులు. కాని వారందరూ నాకొడుకు చేతిలో చచ్చిపోయారు. (16)
న త్విదం కేషుచిద్ బ్రహ్మన్ వ్యాహర్తవ్యం కథంచన ।
విద్యార్థినో హి మే పుత్రాన్ విప్రకుర్యుః కుతూహలాత్ ॥ 17
ఈ విషయం మీరు ఎవ్వరితోను చెప్పవద్దు. కుతూహలంతో విద్యల్ని ఆశించేవారు. నాకొడుకులను నాకు దూరం చేసే ప్రమాదమున్నది. (17)
గురుణా చాననుజ్ఞాతః గ్రాహయేత్ యత్ సుతో మమ ।
న స కుర్యాత్ తథా కార్యం విద్యయేతి సతాం మతమ్ ॥ 18
ఒకవేళ నాసుతులు గురువు ఆజ్ఞను పొందకుండా, ఏదైనా విద్యను ఉపదేశించినా, ఆ విద్య ఆశించిన ఫలితాన్నివ్వదని పెద్దలంటారు. (18)
ఏవముక్తస్తు పృథయా స విప్రో భార్యయా సహ ।
హృష్టః సంపూజయామాస తద్వాక్యమమృతోపమమ్ ॥ 19
కుంతి ఇలా చెప్పగానే ఆ విప్రుడు, భార్య పరమానంద పడ్డారు. అమృతసమానమైన కుంతి మాటలు విని, వారు ఆమెను గౌరవించారు. (19)
తతః కుంతీ చ విప్రశ్చ సహితావనిలాత్మజమ్ ।
తమబ్రూతాం కురుష్వేతి స తథేత్యబ్రవీచ్చ తౌ ॥ 20
తర్వాత కుంతి, బ్రాహ్మణుడు కలసి భీమసేనునితో చెయ్యవలసినది చెప్పారు. భీముడు అలాగే చేస్తానని వారిద్దరకు చెప్పాడు. (20)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి బకవధ పర్వణి భీమ బకవధాంగీకారే, షష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 160 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున బకవధపర్వమను ఉపపర్వమున భీమబకవధాంగికార మను నూట అరువదియవ అధ్యాయము. (160)