170. నూటడెబ్బదియవ అధ్యాయము

తపతిని చూచి సంవరణుడు మోహించుట.

అర్జున ఉవాచ
తాపత్య ఇతి యద్వాక్యమ్ ఉక్తవానసి మామిహ ।
తదహం జ్ఞాతుమిచ్ఛామి తాపత్యార్థం వినిశ్చితమ్ ॥ 1
అర్జునుడు ఇలా అన్నాడు. నన్ను తపతీనందనా అని సంబోధించి నాతో మాటాడావు. తాపత్య పదానికి స్పష్టమైన అర్థాన్ని తెలియగోరుతున్నాను. (1)
తపతీ నామ కా చైషా తాపత్యా యత్కృతే వయమ్ ।
కౌంతేయా హి వయం సాధో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ ॥ 2
తపతి అంటే ఎవరు? ఆ కారణంగానే గదా మమ్ములను తాపత్యులంటున్నావు. సాధుస్వభావా! మమ్ము మేము కౌంతేయుల మనుకొంటున్నాము. కాబట్టి వాస్తవికమైన తాపత్యపదార్థాన్ని తెలియగోరుతున్నాను. (2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః సః గంధర్వః కుంతీపుత్రం ధనంజయమ్ ।
విశ్రుతాం త్రిషు లోకేషు శ్రావయామాస వై కథామ్ ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ మాటలు విని ఆ గంధర్వుడు మూడులోకాలలోనూ ప్రసిద్ధి కెక్కిన ఆ కథను కౌంతేయుడైన అర్జునునకు వినిపించాడు. (3)
గంధర్వ ఉవాచ
హంత తే కథయిష్యామి కథామేతాం మనోరమామ్ ।
యథావదఖిలాం పార్థ! సర్వబుద్ధిమతాం వర ॥ 4
గంధర్వుడిలా అన్నాడు. సమస్తధీమంతులలో శ్రేష్ఠుడా! అర్జునా! మనోహరమైన ఈ కథనంతా ఉన్నదున్నట్లు నీకు చెపుతాను. (4)
ఉక్తవానస్మి యేన త్వాం తాపత్య ఇతి యత్ వచః ।
తత్ తేఽహం కథయిష్యామి శృణుష్వైకమనా భవ ॥ 5
నిన్ను నేను తాపత్యుడని వ్యవహరించాను గదా! దానికి సంబంధించిన కథను నీకు చెపుతాను. సావధానమనస్కుడవై విను. (5)
య ఏష దివి ధిష్ణ్యేన నాకం వ్యాప్నోతి తేజసా ।
ఏతస్య తపతీ నామ బభూవ సదృశీ సుతా ॥ 6
వివస్వతో వై దేవస్య సావిత్య్రవరజా విభో ।
విశ్రుతా త్రిషు లోకేషు తపతీ తపసా యుతా ॥ 7
ఆకాశంలో పుట్టి, తన తేజస్సుతో స్వర్గలోకం వరకూ వ్యాపించగలవాడు సూర్యుడు. ఆయనకొక పుత్రిక. ఆమెయే తపతి. ఆమె తండ్రికి తగిన కూతురు. ప్రభూ! ఆమె సావిత్రికి చిన్నచెల్లెలు. తన తపస్సువలన ఆమె మూడులోకాలలో ఖ్యాతినంది తపతి అయినది. (6,7)
న దేవీ నాసురీ చైవ న యక్షీ న చ రాక్షసీ ।
నాప్సరా న చ గంధర్వీ తథా రూపేణ కాచన ॥ 8
ఆమె వంటి రూపవతి దేవతలలో కానీ, అసురులలో కానీ, యక్షులలో కానీ, రాక్షసులలో కానీ, అప్సరసలలో కానీ, గంధర్వులలో కానీ లేదు. (8)
సువిభక్తానవద్యాంగీ స్వసితాయతలోచనా ।
స్వాచారా చైవ సాధ్వీ చ సువేషా చైవ భామినీ ॥ 9
న తస్యాః సదృశం కంచిత్ త్రిషు లోకేషు భారత ।
భర్తారం సవితా మేనే రూపశీలగుణశ్రుతైః ॥ 10
ఆమె శరీరం పొందిక గలది. నిర్దుష్టమైన శరీరావయవాలతో నల్లని విశాలనేత్రాలతో ఆమె శోభిల్లేది. ఆమె సువేషం, సదాచారం, సాధుస్వభావం గలది. భారతా! ఆమె రూప, శీల, గుణ, జ్ఞానాలను బట్టి ఆమెకు తగిన వరుడు మూడులోకాలలోనూ లేడని సూర్యుడు భావించాడు. (9,10)
సంప్త్రాప్తయౌవనాం పశ్యన్ దేయాం దుహితరం తు తామ్ ।
నోపలేభే తతః శాంతిం సంప్రదానం విచింతయన్ ॥ 11
ఆమె యౌవనంలో అడుగుపెట్టింది. వివాహకాలం సంప్రాప్తమైంది. ఆ స్థితిలో ఆమెను చూచి సూర్యుడు తగిన వరుని గురించి ఆలోచించసాగాడు. ఆ ఆలోచనతో అశాంతికి గురి అయ్యాడు. (11)
అథర్క్షపుత్రః కౌంతయే కురూణాం ఋషభో బలీ ।
సూర్యమారాధయామాస నృపః సంవరణస్తదా ॥ 12
కౌంతేయా! ఆ రోజులలో ఋక్షుని కొడుకైన సంవరణుడు కురుకుల శ్రేష్ఠుడు, బలిష్ఠుడు. ఆయన సూర్యుని ఆరాధించసాగాడు. (12)
అర్ఘ్యమాల్యోపహారాద్యైః గంధైశ్చ నియతః శుచిః ।
నియమైరుపవాసైశ్చ తపోభిర్వివిధైరపి ॥ 13
శుశ్రూషురనహంవాదీ శుచిః పౌరవనందన ।
అంశుమంతం సముద్యంతం పూజయామాస భక్తిమాన్ ॥ 14
పౌరవనందనా! ఆ సంవరణుడు శుద్ధుడూ, అహంకారం లేనివాడూ. మనస్సునూ, ఇంద్రియాలను అదుపులో నుంచుకొని పవిత్రుడై అర్ఘ్య, మాల్య, గంధ, నివేదనాదులతో, నియమాలతో, ఉపవాసాలతో, వివిధ తపశ్చర్యలతో, భక్తితో, సేవాతత్పరతతో ఉదయభానుని పూజించాడు. (13,14)
తతః కృతజ్ఞం ధర్మజ్ఞం రూపేణాసదృశం భువి ।
తపత్యాః సదృశం మేనే సూర్యః సంవరణం పతిమ్ ॥ 15
ఆ తరువాత లోకంలో సాటిలేని రూపంగలవాడై కృతజ్ఞుడూ, ధర్మజ్ఞుడూ అయిన సంవరణుని తపతికి తగిన భర్తగా భావించాడు సూర్యుడు. (15)
దాతుమైచ్ఛత్ తతః కన్యాం తస్మై సంవరణాయ తామ్ ।
నృపోత్తమాయ కౌరవ్య! విశ్రుతాభిజనాయ చ ॥ 16
కౌరవ్యా! లోకప్రసిద్ధి గల వంశానికి చెందిన, రాజశ్రేష్ఠుడైన సంవరణునకు కూతురు నివ్వాలని ఇష్టపడ్డాడు. (16)
యథా హి దివి దీప్తాంశుః ప్రభాసయతి తేజసా ।
తథా భువి మహీపాలః దీప్త్యా సంవరణోఽభవత్ ॥ 17
సూర్యుడు తన తేజస్సుతో ఆకాశంలో వెలుగులు నింపినట్లు భూలోకంలో సంవరణమహారాజు తన తేజస్సును ప్రసరింపజేశారు. (17)
యథార్చయంతి చాదిత్యమ్ ఉద్యంతం బ్రహ్మవాదినః ।
తథా సంవరణం పార్థ బ్రాహ్మణావరజాః ప్రజాః ॥ 18
బ్రహ్మవాదులయిన మహర్షులు ఉదయించే సూర్యుని ఆరాధిస్తున్నట్లు బ్రాహ్మణాది సర్వప్రజలూ సంవరణుని ఆరాధిస్తున్నారు. (18)
స సోమమతికామ్తత్వాత్ ఆదిత్యమతితేజసా ।
బభూవ నృపతిః శ్రీమాన్ సుహృదాం దుర్హృదామపి ॥ 19
ఆ సంవరణుడు కాంతిలో చంద్రునీ, తేజస్సులో సూర్యునీ మించినఽఆడు. మిత్రమండలిలోనూ, శత్రుసమూహంలోనూ దివ్యశోభతో వెలుగొందేవాడు. (19)
ఏవంగుణస్య నృపతేః తథావృత్తస్య కౌరవ ।
తస్మై దాతుం మనశ్చక్రే తపతీం తపనః స్వయమ్ । 20
కౌరవా! ఇటువంటి ఉత్తమగుణాలు, మంచినడవడి గల ఆ సంవరణునకు తపతి నివ్వాలని సూర్యుడు స్వయంగా నిర్ణయించుకొన్నాడు. (20)
స కదాచిదథో రాజా శ్రీమానమితవిక్రమః ।
చచార మృగయాం పార్థ పర్వతోపవనే కిల ॥ 21
అర్జునా! శ్రీమంతుడు, పరాక్రమవంతుడు అయిన సంవరణమహారాజు ఒక రోజు పర్వతపార్శ్యంలో ఉన్న ఉపవనంలో వేటాడసాగాడు. (21)
చరతో మృగయాం తస్య క్షుత్పిపాసాసమన్వితః ।
మమార రాజ్ఞః కౌంతేయ గిరావపత్రిమో హయః ॥ 23
స మృతాశ్వః చరన్ పార్థ పద్భ్యామేవ గిరౌ నృపః ।
దదర్శాసదృశీం లోకే కన్యామాయతలోచనామ్ ॥ 23
కౌంతేయా! ఆ సంవరణుడు వేటాడుతున్నప్పుడే ఆయన గుఱ్ఱాలలో ఒకటి ఆకలిదప్పులతో ఆ కొండపై మరణించింది. అర్జునా! గుఱ్ఱం చనిపోయినందువలన ఆ రాజు ఆ కొండపై నడక సాగిస్తూ విశాలాక్షి అయిన ఒక కన్యను చూచాడు. లోకంలో ఆమెకు సాటివచ్చే స్త్రీలు లేరు. (22,23)
స ఏక ఏకామాసాద్య కన్యాం పరబలార్దనః ।
తస్థౌ నృపతిశార్దూలః పశ్యన్నవిచలేక్షణః ॥ 24
శత్రుసేనల సంహరింపగల ఆ రాజశ్రేష్టుడు-సంవరణుడు-ఒంటరియై ఒంటరిగా ఉన్న ఆమెను తదేకదృష్టితో చూస్తూ నిలిచాడు. (24)
స హి తాం తర్కయామాస రూపతో నృపతిః శ్రియమ్ ।
పునః సంత్కరయామాస రవేః భ్రష్టామివ ప్రభామ్ ॥ 25
ఆమె రూపాన్ని చూచి ఆ రాజు ఆమెను సాక్షాత్తు లక్ష్మిగా భావించాడు. మరల ఆలోచిస్తూ సూర్యమండలం నుండి జారిపడిన సూర్యప్రభగా భావించాడు. (25)
వపుషా వర్చసా చైవ శిఖామివ విభావసోః ।
ప్రసన్నత్వేన కాంత్యా చ చంద్రరేఖామివామలామ్ ॥ 26
ఆమె శరీరం, తేజస్సు అగ్నిజ్వాల వలె ఉన్నాయి తనలోని ప్రసన్నత, కాంతి వలన ఆమె చంద్రరేఖవలె కనిపిస్తోంది. (26)
గిరిపృష్ఠే తు సా యస్మిన్ స్థితా స్వసితలోచనా ।
విభ్రాజమానా శుశుభే ప్రతిమేవ హిరణ్మయీ ॥ 27
అందమయిన, నల్లని కన్నులు గల ఆమె పర్వతశిఖరంపై నిలిచి బంగారు బొమ్మలాగా ప్రకాశిస్తోంది. (27)
తస్యాః రూపేణ స గిరిః వేషేణ చ విశేషతః ।
స సవృక్షక్షుపలతః హిరణ్మయ ఇవాభవత్ ॥ 28
విశేషించి ఆమె రూపం వలన, వేషం వలన వెలుగొందుతున్న ఆ కొండ చెట్లు, పొదలు, లతలతో సహ స్వర్ణమయంగా కనిపించింది. (28)
అవమేనే చ తాం దృష్ట్వా సర్వలోకేషు యోషితః ।
అవాప్తం చాత్మనో మేనే స రాజా చక్షుషః ఫలమ్ ॥ 29
ఆమెను చూచిన తరువాత సంవరణుడు లోకంలోని సమస్తస్త్రీలను తక్కువగా తలచాడు. తనకు కన్నులున్నందులకు ఫలితం లభించిందని కూడా భావించాడు. (29)
జన్మప్రభృతి యత్ కించిత్ దృష్టవాన్ స మహీపతిః ।
రూపం న సదృశం తస్యాః తర్కయామాస కించన ॥ 30
తాను పుట్టిన నాటి నుండి చూచిన ఏ రూపమూ ఆమె రూపానికి కొంచెమయినా సాటిరాదని ఆ రాజు అనుకొన్నాడు. (30)
తయా బద్ధమనశ్చక్షుః పాశైః గుణమయైస్తదా ।
న చచాల తతో దేశాత్ బుబుధే న చ కించన ॥ 31
అప్పుడు ఆమె ఉత్తమగుణా లనే పాశాలు ఆ సంవరణుని కళ్ళను, మనస్సును బంధించాయి. ఆయన అక్కడ నుండి కదలలేకపోయాడు. ఆయనకేమీ తెలియటం లేదు (31)
అస్యా నూనం విశాలాక్ష్యాః సదేవాసురమానుషమ్ ।
లోకం నిర్మథ్య ధాత్రేదం రూపమావిష్కృతం కృతమ్ ॥ 32
బ్రహ్మదేవుడు స్వర్గమర్త్యపాతాళ లోకాలను మథించి విశాలాక్షి అయిన ఆ కాంతరూపాన్ని ఆవిష్కరించి ఉంటాడని ఆయన భావించాడు. (32)
ఏవం సంతర్కయామాస రూపద్రవిణసంపదా ।
కన్యామసదృశీం లోకే నృపః సంవరణస్తదా ॥ 33
ఆ సమయంలో సంవరణుడు రూపసంపదలతో ఆకన్య లోకంలో సాటిలేనిదని వితర్కించాడు. (33)
తాం చ దృష్ట్వైవ కళ్యాణీం కళ్యాణాభిజనో నృపః ।
జగామ మనసా చింతాం కామబాణేన పీడితః ॥ 34
సద్వంశంలో పుట్టిన ఆ సంవరణరాజు కళ్యాణస్వరూపిణి అయిన ఆమెను చూడగానే మదనబాణాలచే పీడింపబడి మనస్సులో చింతించసాగాడు. (34)
దహ్యమానః సః తీవ్రేణ నృపతిః మన్మథాగ్నినా ।
అప్రగల్భాం ప్రగల్భస్తాం తదోవాచ మనోహరామ్ ॥ 35
తీవ్రమయిన మన్మథాగ్ని తనను దహిస్తుంటే సంవరణుడు లజ్జావతియై మనోహరంగా ఉన్న ఆమెతో నిస్సంకోచంగా ఇలా అన్నాడు. (35)
కాసి కస్యాసి రంభోరు కిమర్థం చేహ తిష్ఠసి ।
కథం చ నిర్జనఽరణ్యే చరస్యేకా శుచిస్మితే ॥ 36
రంభోరూ! నీవెర్తెవు? ఎవరి కూతురువు? ఇక్కడెందుకున్నావు? శుచిస్మితా! జనసంచారంలేని ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు. (36)
త్వం హి సర్వానవద్యాంగీ సర్వాభరణభూషితా ।
విభూషణమివైతేషాం భూషణానామభీప్సితమ్ ॥ 37
నీ శరీరావయవాలు నిర్దోషంగా ఉన్నాయి. సర్వాభరణాలను ధరించిన నీవు ఈ భూషణాలన్నీ మక్కువపడిన ఆభరణం వలె కనిపిస్తున్నావు. (37)
న దేవీం నాసురీం చైవ న యక్షం న చ రాక్షసమ్ ।
న చ భోగవతీం మన్యే న గంధర్వీం న మానుషీమ్ ॥ 38
నీవు దేవ కాంతవూ, గంధర్వస్త్రీ, మానవకాంతవూ కావని నేననుకొంటున్నాను. (38)
యా హి దృష్టా మయా కాశ్చిత్ శ్రుతా వాపి వరాంగనాః ।
న తాసాం సదృశృం మన్యే త్వామహం మత్తకాశిని ॥ 39
మత్తకాశిని! నేనింత వరకు అందగత్తెలనెందరినో చూచాను. చాలా మందిని గురించి విన్నాను. కాణి వారిలో ఏ ఒక్కరు కూడా నీకు సాటిరాలేరని భావిస్తున్నాను. (39)
దృష్ట్వైవ చారువదనే చంద్రాత్ కాంతతరం తవ ।
వదనం పద్మపత్రాక్షం మాం మథ్నాతీవ మన్మథః ॥ 40
చారువదనా! చంద్రుని మించిన వెలుగులతో తామరరేకుల వంటి కన్నులతో వెలుగొందుతున్న నీ ముఖాన్ని నేను చూడగానే మన్మథుడు నన్ను మథిస్తున్నట్లుంది. (40)
ఏవం తాం స మహీపాలః బభాషే న తు సా తదా ।
కామార్తం నిర్జనేఽరణ్యే ప్రత్యభాషత కించన । 41
ఈ ప్రకారంగా ఆ రాజు ఆమెతో మాటాడడు. కానీ ఆమె కామార్తుడైన ఆ రాజుకు ఆ నిర్జనారణ్యంలో ఏ సమాధానమూ చెప్పలేదు. (41)
తతో లాలప్యమానస్య పార్థివస్యాయతేక్షణా ।
సౌదామినీవ చాభ్రేషు తత్రైవాంతరధీయత ॥ 42
ఆ రాజు అలా ప్రలాపిస్తున్నప్పుడే విశాలనేత్రాలు గల ఆ తపతి మేఘాలలో మెరుపు లీనమైనట్లు అక్కడే అంతర్థానమైంది. (42)
తామన్వేష్టుం స నృపతిః పరిచక్రామ సర్వతః ।
వనం వనజపత్రాక్షీం భ్రమన్నున్మత్తవత్ తదా ॥ 43
అప్పుడు తామరరేకులవంటి కన్నులు గల ఆమెను వెతుకుతూ ఆ రాజు ఉన్మత్తునివలె ఆ వనమంతతా తిరిగాడు. (43)
అపశ్యమానః స తు తాం బహు తత్ర విలప్య చ ।
నిశ్చేష్టః పార్థివశ్రేష్ఠః ముహూర్తం స వతిష్ఠతః ॥ 44
ఆమె కనిపించనందువలన ఆ రాజశ్రేష్ఠుడు - సంవరణుడు - ఆమెను గూర్చి బహూధా విలపించి నిశ్చేష్ఠుడై కొంతకాలం అక్కడే నిలిచాడు. (44)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి తపత్యుపాఖ్యానే సప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 170 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున తపత్యుపాఖ్యానమను నూట డెబ్బదియవ అధ్యాయము. (170)