172. నూట డెబ్బది రెండవ అధ్యాయము
వసిష్ఠుని సహాయముతో తపతీ సంవరణుల వివాహము జరుగుట.
గంధర్వ ఉవాచ
ఏవముక్త్యా తతస్తూర్ణం జగామోర్ధ్వమనిందితా ।
స తు రాజా పునర్భూమౌ తత్రైవ నిపపాత హ ॥ 1
గంధర్వుడు చెప్పాడు. ఈ రీతిగా పలికి అనింద్య అయిన ఆ తపతి గగనతలానికి వెళ్ళిపోయింది. ఆ రాజు మరల అక్కడే నేలపై పడిపోయాడు. (1)
అన్వేషమాణః సబలః తం రాజానం నృపోత్తమమ్ ।
అమాత్యః సానుయాత్రశ్చ తం దదర్శ మహావనే ॥ 2
సేనతో అనుచరులతో కలిసి నరశ్రేష్ఠుడైన ఆ సంవరణమహారాజును వెదకుతూ ఆయన మంత్రి మహారణ్యంలో ఆ రాజును చూచాడు. (2)
క్షితౌ నిపతితం కాలే శక్రధ్వజమివోచ్ఛ్రితమ్ ।
తం హి దృష్ట్వా మహేష్వాసం నిరస్తం పతితం భువి ॥ 3
బభువ సోఽస్య సచివః సంప్రదీప్త ఇవాగ్నినా ।
త్వరయా చోపసంగమ్య స్నేహాదాగతసంభ్రమః ॥ 4
అదనులో కూలిపోయిన ఇంద్రధ్వజం వలె ఆ రాజు నేలపై పడి ఉన్నాడు. తపతిచే తిరస్కరింపబడి, నేలపై పడి ఉన్న ఆ మేటి విలుకాని చూచి ఆ అమాత్యుడు మండిపోయాడు వేగంగా ఆయనను సమీపించాడు. స్నేహంకారణంగా ఆయన మనస్సు కలతపడింది. (3,4)
తం సముత్థాపయామాస నృపతిం కామమోహితమ్ ।
భూతలాత్ భూమిపావేశం పితేవ పతితం సుతమ్ ॥ 5
ప్రజ్ఞయా వయసా చైవ వృద్ధః కీర్త్యానయేన చ ।
అమాత్యస్తం సముత్థాయ బభూవ విగతజ్వరః ॥ 6
ఆ అమాత్యుడు జ్ఞానవయోవృద్ధుడు. బుద్ధి, యశస్సు, రాజనీతిలో కూడా పెద్దవాడే. అటువంటి అమాత్యుడు కామమోహితుడై నేలగూలిన ఆ సంవరణ మహారాజును తండ్రి బిడ్డను ఎత్తుకొన్నట్టు నేలమీద నుండి లేపాడు. రాజు పైకి లేచి స్వస్థుడయిన తరువాత అమాత్యుడు నెమ్మది వహించాడు. (5,6)
ఉవాచ చైనం కళ్యాణ్యా వాచా మధురయోత్థితమ్ ।
మాభైః మనుజశార్దూల! భద్రమస్తు తవానఘ! ॥ 7
'నరోత్తమా! భయపడవద్దు. అనఘా! నీకు మేలే జరుగుతుంది'. అని శుభప్రదంఘా మధురంగా పైకి లేచిన ఆ మహారాజుతో అన్నాడు. (7)
క్షుత్పిపాసాపరిశ్రాంతం తర్కయామాస వై నృపమ్ ।
పతితం పాతనం సంఖ్యే శాత్రవాణాం మహీతలే ॥ 8
యుద్ధంలో శత్రువులను నేలగూల్చే మహారాజు తానే నేలబడి ఉండటానికి ఆకలిదప్పులతో అలసిపోవటమే కారణమై ఉంటుందని అమాత్యుడు భావించాడు. (8)
వారిణా చ సుశీతేన శిరః తస్యాభ్యషేచయత్ ।
అస్ఫుటన్ముకుటం రాజ్ఞః పుండరీకసుగంధినా ॥ 9
రాజుమస్తకంపై కిరీటం చెదరిపోలేదు. (కాబట్టి యుద్ధంలో గాయపడలేదని భావించి) అమాత్యుడు కమలసుగంధం కలిపిన చల్లని నీటితో రాజు శిరస్సును తడిపాడు. (9)
తతః ప్రత్యాగతప్రాణః తత్ బలం బలవాన్ నృపః ।
సర్వం విసర్జయామాస తమేకం సచివం వినా ॥ 10
దానితో రాజు మరల స్పృహలోనికి వచ్చాడు. బలిష్ఠుడైన ఆ రాజు అమాత్యుని తప్ప మిగిలిన పరివారాన్నంతా వెనక్కు పంపాడు. (10)
తతః తస్యాజ్ఞయా రాజ్ణః విపత్రస్థే మహత్ బలమ్ ।
స తు రాజా గిరిప్రస్థే తస్నిన్ పునరుపావిశత్ ॥ 11
రాజు ఆనతితో ఆ విశాలసేన వెను దిరిగింది. ఆ రాజు మాత్రం మరల ఆ గిరిశిఖరంపై కూర్చున్నాడు. (11)
తతః తస్మిన్ గిరివరే శుచిర్భూత్వా కృతాంజలిః ।
ఆరిరాధయిషుః సూర్యం తస్థావూర్థ్వముఖః క్షితౌ ॥ 12
ఆ తర్వాత ఆ మహాగిరిపై సూర్యుని ఆరాధింపగోరి శుచియై, చేతులు జోడించి తలపైకెత్తి నేలపై నిలిచాడు. (12)
జగామ మనసా చైవ వసిష్ఠం ఋషిసత్తమమ్ ।
పురోహితమమిత్రఘ్నః తదా సంవరణో నృపః ॥ 13
అప్పుడు శత్రుసూదనుడయిన సంవరణనరపాలుడు ఋషిసత్తముడూ, తన పురోహితుడూ అయిన వసిష్ఠుని మనస్సులో తలచాడు. (13)
నక్తం దినమథైకత్ర స్థితే తస్మిన్ జనాధిపే ।
అథాజగామ విప్రర్షిః తదా ద్వాదశమేఽహని ॥ 14
ఆ రాజు పగలూ, రేయీ కూడా ఒకే తావున నిలిచి తపస్సు చేయసాగాడు. తర్వాత పండ్రెండవరోజు బ్రహ్మర్షి అయిన వసిష్ఠుడు వచ్చాడు. (14)
స విదిత్వైవ నృపతిం తపత్యా హృతమానసమ్ ।
దివ్యేన విధినా జ్ఞాత్వా భావితాత్మా మహానృషిః ॥ 15
తపత్ సంవరణుని మనస్సును దోచినదని నిర్మలాంతఃకరణం గల వసిష్ఠమహర్షి దివ్యజ్ఞానంతో ముందుగానే గ్రహించాడు. (15)
తథా తు నియతాత్మానం తం నృపం మునిసత్తమః ।
ఆబభాషే స ధర్మాత్మా తస్మైవార్థచికీర్షయా ॥ 16
ఆ విధంగా ఇంద్రియాలనూ, మనస్సునూ అదుపులో నుంచుకొని తపోదీక్షితుడైన ఆ సంవరణునితో ఆ రాజు పనిని సాధించటానికే ధర్మాత్ముడైన వసిష్ఠుడు ఆయనతో మాటాడాడు. (16)
స తస్య మనుజేంద్రస్య పశ్యతో భగవానృషిః ।
ఊర్ధ్వమాచక్రమే ద్రష్ఠుం భాస్కరం భాస్కర ద్యుతిః ॥ 17
ఆపై సూర్యతేజస్సు గల పూజ్యుడు వసిష్ఠమహర్షి ఆ సంవరణ నరేంద్రుడు చూస్తూండగానే సూర్యుని కలవాలని పైకి పయనించాడు. (17)
సహస్రాంశుం తతో విప్రః కృతాంజలిరుపస్థితః ।
వసిష్ఠోఽహమితి ప్రీత్యా స చాత్మానం న్యవేదయత్ ॥ 18
తరువాత వసిష్ఠుడు చేతులు జోడించి సూర్యసన్నిధిలో నిలిచి "నేను వసిష్ఠుడను" అంటూ ప్రసన్నంగా తనను తాను పరిచయం చేసికొన్నాడు (18)
(వసిష్ఠ ఉవాచ
అజాయ లోకత్రయపావనాయ
భూతాత్మనే గోపతయే వృషాయ ।
సూర్యాయ సర్గప్రలయాలయాయ
నమో మహాకారుణికోత్తమాయ ॥
వివస్వతే జ్ఞానభృదంతరాత్మనే
జగత్ప్రదీపాయ జగద్దితైషిణే ।
స్వయంభువే దీప్తసహస్రచక్షుషే
సురోత్తమాయామితతేజసే నమః ।
నమః సవిత్రే జగదేకచక్షుషే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే ।
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే
విరించ నారాయణ శంకరాత్మనే ॥)
వసిష్ఠుడిలా అన్నాడు. అజుడు, లోకత్రయపావనుడు, సర్వ ప్రాణిస్వరూపుడు, కిరణాధిపతి, ధర్మరూపుడు, సర్గప్రళయాశ్రయుడు, పరమదయామయులలో ఉత్తముడు అయిన సూర్యునకు నమస్కారం. జ్ఞానుల అంతరాత్మ, జగత్ప్రదీపం, లోకహితకాంక్షి, స్వయంభువుడు, వేయివెలుగుల కన్నులవాడు, దేవతాశ్రేష్ఠుడు, అమితతేజస్వి అయిన సూర్యునకు నమస్కారం. జగత్తునకంతటికి కన్నువంటివాడు, లోకాల పుట్టుకకూ, స్థితికీ, ప్రళయానికీ కారణమైనవాడు, వేదత్రయస్వరూపుడు, త్రిగుణాలను ధరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరరూపాలతో ప్రసిద్ధుడూ అయిన సవితకు నమస్కారం.
తమువాచ మహాతేజాః వివస్వాన్ మునిసత్తమమ్ ।
మహర్షే స్వాగతం తేఽస్తు కథయస్వ యథేప్సితమ్ ॥ 19
మహాతేజస్వి అయిన సూర్యుడు మునిశ్రేష్ఠునితో ఇలా అన్నాడు. మహర్షీ! తమకు స్వాగతం. తమ కోరిక ఏమిటో చెప్పండి. (19)
యదిచ్ఛసి మహాభాగ మత్తః ప్రవదతాం వర ।
తత్ తే దద్యామభిప్రేతం యద్యపి స్యాత్ సుదుష్కరమ్ ॥ 20
మహాభాగా! ప్రవక్తా! నా నుండి తమకేమి కావాలి? తమరు కోరినది ఎంత దుష్కరమైనదయినా సరే నేనివ్వగలను. (20)
(స్తుతోఽస్మి వరదస్తేఽహం వరం వరయ సువ్రత ।
స్తుతిః త్వయోక్తా భక్తానాం జప్యేయం వరదోఽస్మ్యహమ్ ॥)
సువత్రా! తమరు నన్ను స్తుతించారు. తమకు వరమిస్తాను కోరుకోండి. తమరు చేసిన నా స్తుతి భక్తులు నిరంతరమూ జపించదగినది. నేను తమకు వరమివ్వదలచాను.
ఏవముక్తః స తేనర్షిః వసిష్ఠః ప్రత్యభాషత ।
ప్రణిపత్య వివస్వంతం భానుమంతం మహాతపాః ॥ 21
సూర్యుడిలా పలుకగానే మహాతపస్వి అయిన వసిష్ఠమహర్షి తేజస్వి అయిన సూర్యునకు నమస్కరించి ఇలా అన్నాడు. (21)
వసిష్ఠ ఉవాచ
యైషా తే తపతీ నామ సావిత్య్రవరజా సుతా ।
తాం త్వాం సంవరణస్యార్థే వరయామి విభావసో ॥ 22
వసిష్ఠుడిలా అన్నాడు. విభావసూ! నీ కుమార్తె, సావిత్రి చెల్లెలు అయిన తపతిని సంవరణుని కోసం నిన్ను అడుగుతున్నాను. (22)
స హి రాజా బృహత్కీర్తిః ధర్మార్థవిదుదారధీః ।
యుక్తః సంవరణో భర్తా దుహితుః తే విహంగమ ॥ 23
సూర్యా! ఆ సంవరణుడు గొప్ప కీర్తి గలవాడు. ధర్మార్థాల నెరిగినవాడు. ఉదారబుద్ధిగలవాడు. నీ కుమార్తెకు తగిన భర్త. (23)
ఇత్యుక్తః స తదా తేన దదానీత్యేవ నిశ్చితః ।
ప్రత్యభాషత తం విప్రం ప్రతినంద్య దివాకరః ॥ 24
వసిష్ఠుడిలా చెప్పగానే కుమార్తెనివ్వాలని మనస్సులో నిశ్చయించుకొని సూర్యుడు వసిష్ఠుని అభినందించి ఇలా అన్నాడు. (24)
వరః సంవరణో రాజ్ఞాం త్వం ఋషీణాం వరో మునే ।
తపతీ యోషితాం శ్రేష్ఠా కిమన్యదపవర్జనాత్ ॥ 25
మహర్షీ! సంవరణుడు రాజశ్రేష్ఠుడు. నీవు ముని శ్రేష్ఠుడవు తపతి వనితలలో శ్రేష్ఠురాలు. ఇవ్వటం తప్ప మరొకటేముంది? (25)
తతః సర్వానవద్యాంగీం తపతీం తపనః స్వయమ్ ।
దదౌ సంవరణస్యార్థే వసిష్ఠాయ మహాత్మనే ॥ 26
ఆ తరువాత సూర్యుడు స్వయంగా అనవద్యాంగి అయిన తపతిని సంవరణునకోసం వసిష్ఠమహాత్మునకిచ్చాడు. (26)
ప్రతిజగ్రాహ తాం కన్యాం మహర్షిః తపతీం తదా ।
వసిషోఽథ విసృష్టస్తు పునరేవాజగామ హ ॥ 27
అప్పుడు వసిష్ఠమహర్షి ఆ కన్యను-తపతిని-స్వీకరించి సూర్యుని దగ్గర సెలవు తీసికొని మరల సంవరణుని దగ్గరకు వచ్చాడు. (27)
యత్ర విఖ్యాతకీర్తిః స కురూణామృషభోఽభవత్ ।
స రాజా మన్మథావిష్టః తద్గతేనాంతరాత్మనా ॥ 28
కురువంశశ్రేష్ఠుడూ, విఖ్యాతకీర్తి అయిన సంవరణమహారాజు మదనావిష్టుడై తపతిని గూర్చియే తలపోస్తూ ఉన్న ప్రదేశానికి వసిష్ఠమహర్షి తపతిని తీసికొని వచ్చాడు. (28)
దృష్ట్వా చ దేవకన్యాం తాం తపతీం చారుహాసినీమ్ ।
వసిష్ఠేన సహాయాంతీం సంహృష్టోఽభ్యధికం బభౌ ॥ 29
మనోహరంగా నవ్వుతూ వసిష్ఠునితో సహా వస్తున్న ఆ దేవకన్యను-తపతిని-చూచి సంవరణుడు ఆనందంతో పొంగిపోతూ మరీ అందంగా కనిపించాడు. (29)
రురుచే సాధికం సుభ్రూః ఆపతంతీ నభస్తలాత్ ।
సౌదామినీవ విభ్రష్టా ద్యోతయంతీ దిశస్త్విషా ॥ 30
అందమైన కనుబొమలు గల ఆ తపతి గగనతలం నుండి క్రిందకు వస్తూ జారిపడిన మెరుపుతీగెవలె దిక్కులను ప్రకాశింపజేస్తూ మిక్కిలిగా వెలుగొందింది. (30)
కృచ్ఛ్రాత్ ద్వాదశరాత్రే తు తస్య రాజ్ఞః సమాహితే ।
ఆజగామ విశుద్ధాత్మా వసిష్ఠో భగవాన్ ఋషిః ॥ 31
ఆ రాజు క్లేశాలను సహిస్తూ ఏకాగ్రచిత్తుడై పండ్రెండు రాత్రులు గడిపాడు. అప్పుడు పవిత్రాంతఃకరణుడైన పూజనీయుడు, వసిష్ఠమహర్షి వచ్చాడు. (31)
తపసాఽఽరాధ్య వరదం దేవం గోపతిమీశ్వరమ్ ।
లేభే సంవరణో భార్యాం వసిష్ఠస్వైవ తేజసా ॥ 32
లోకపాలకుడు, వరదాయకుడు, కిరణాలకు అధిపతి అయిన సూర్యుని తపస్సుతో ఆరాధించి, సంవరణుడు వసిష్ఠ ప్రభావంతో తపతిని భార్యగా పొందాడు (32)
తతః తస్మిన్ గిరిశ్రేష్ఠే దేవగంధర్వసేవితే ।
జగ్రాహ విధివత్ పాణిం తపత్యాః స నరర్షభః ॥ 33
ఆపై ఆ మానవోత్తముడు దేవగంధర్వసేవితమైన ఆ పర్వతంపై శాస్త్రానుసారంగా తపతిపాణిగ్రహణం చేశాడు. (33)
వసిష్ఠేనాభ్యనుజ్ఞాతః తస్మిన్నేవ ధరాధరే ।
సోఽకామయత రాజర్షిః విహర్తుం సహ భార్యయా ॥ 34
ఆ తరువాత వసిష్ఠుని అనుమతి తీసికొని ఆ రాజర్షి ఆ పర్వతం మీదనే భార్యతో సహ విహరించాలని ముచ్చటపడ్డాడు. (34)
తతః పురే చ రాష్ట్రే చ వనేషూపవనేషు చ ।
ఆదిదేశ మహీపాలః తమేవ సచివం తదా ॥ 35
అటు తర్వాత సంవరణ మహారాజు నగర, రాష్ట్ర, వన, ఉపవన సంరక్షణకై ఆ మంత్రినే ఆదేశించి నియమించాడు. (35)
నృపతిం త్వభ్యనుజ్ఞాప్య వసిష్ఠోఽథాపచక్రమే ।
సోఽథ రాజా గిరౌ తస్మిన్ విజహారామరో యథా ॥ 36
వసిష్ఠుడు రాజు దగ్గర సెలవు తీసికొని నిష్క్రమించాడు ఆ తరువాత సంవరణుడు ఆ కొండపై అమరునివలె విహరించాడు. (36)
తతో ద్వాదశ వర్షాణి కాననేషు వనేషు చ ।
రేమే తస్మిన్ గిరౌ రాజా తథైవ సహభార్యయా ॥ 37
ఆ రాజు ఆ పర్వతం పై నున్న అడవులలో, వనాలలో తన భార్యతో సహా అదే విధంగా పండ్రెండు సంవత్సరాలు క్రీడించాడు. (37)
తస్య రాజ్ఞః పురే తస్మిన్ సమా ద్వాదశ సత్తమ ।
న వవర్ష సహస్రాక్షః రాష్ట్రే చైవాస్య భారత ॥ 38
సజ్జనశ్రేష్ఠా! అర్జునా! ఆ రాజు నగరంలోనూ, దేశంలోనూ పండ్రెండు సంవత్సరాల పర్యంతం ఇంద్రుడు వానలు కురిపించలేదు. (38)
తతః తస్యామనావృష్ట్యాం ప్రవృత్తాయామరిందమ ।
ప్రజాః క్షయముపాజగ్ముః సర్వాః సస్ధాణుజంగమాః ॥ 39
అరిందమా! ఆ అనావృష్టి సంభవించగా స్థావరజంగమ రూపధారులయిన సమస్త ప్రజలు క్షీణించిపోయారు. (39)
తస్మిన్ తథావిధే కాలే వర్తమానే సుదారుణే ।
నావశ్యాయః పపాతోర్వ్యాం తతః సస్యాని నారుహన్ ॥ 40
ఆ విధమైన తీవ్రమైన అనావృష్టికాలంలో ఒక్క మంచు బొట్టు కూడా నేలపై పడలేదు. దానితో మొక్క కూడా మొలవలేదు. (40)
తతో విభ్రాంతమనసః జనాః క్షుడ్భయపీడితాః ।
గృహాణి సంపరిత్యజ్య బభ్రముః ప్రదిశో దిశః ॥ 41
అప్పుడు ప్రజలందరి మనసులు క్షోభకు గురి అయ్యాయి. ఆకలి భయంతో వారందరూ ఇళ్ళను విడిచిపెట్టి దిక్కులలో, మూలలలో తిరుగసాగారు. (41)
తతః తస్మిన్ పురే రాష్ట్రే త్యక్తదారపరిగ్రహాః ।
పరస్పరమమర్యాదాః క్షుధార్తాః జఘ్నిరే జనాః ॥ 42
తత్ క్షుధార్త్తెః నిరాహారైః శవభూతైః తథా నరైః ।
అభవత్ ప్రేతరాజస్య పురం ప్రేతైరివావృతమ్ ॥ 43
ఆ సమయంలో ఆ నగరప్రజలూ, దేశప్రజలూ సనాతన మర్యాదలను పరిత్యజించి, ఆలుబిడ్డలనూ బంధువులనూ విడిచి ఆకలితో ఒకరినొకరు చంపుకొనసాగారు. ఆకలిచే పీడింపబడి, ఆహారం దొరకక శవాలవలె ఉన్న ప్రజలతో ఆదేశం ప్రేతాలతో నిండిన యమధర్మరాజనగరం (నరకం) లా తయారైంది (42,43)
తతః తత్ తాదృశం దృష్ట్వా స ఏవ భగవాన్ ఋషిః ।
అభ్యవర్షత ధర్మాత్మా వసిష్ఠో మునిసత్తమః ॥ 44
అప్పుడు ఆ ప్రజల ఆ దుస్థితిని చూచి పూజ్యుడు, మునిశ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు అయిన వసిష్ఠమహర్షి వర్షాన్ని కురిపించాడు. (44)
తం చ పార్థివ శార్దూలమ్ ఆనయామాస తత్ పురమ్ ।
తపత్యా సహితం రాజన్ వ్యుషితం శాశ్వతీః సమాః ।
తతః ప్రవృష్టః తత్రాసీద్ యథాపూర్వం సురారిహా ॥ 45
రాజా! దానితోపాటు చాలా సంవత్సరాలు రాజ్యానికి దూరంగా ఉన్న సంవరణుని తపతితో సహా రాజ్యానికి రప్పించాడు. అప్పుడు దేవేంద్రుడు అంతకు ముందు వలెనే వాన కురిపించాడు. (45)
తస్మిన్ నృపతిశార్దూలే ప్రవిష్టే నగరం పునః ।
ప్రవవర్ష సహస్రాక్షః సస్యాని జనయన్ ప్రభుః ॥ 46
రాజశ్రేష్ఠుడైన ఆ సంవరణుడు నగరంలో ప్రవేశించిన తర్వాత ప్రభువయిన దేవేంద్రుడు సస్యానుకూలంగా పెనువాన కురిపించాడు. (46)
తతః సరాష్ట్రం ముముదే తత్ పురం పరయా ముదా ।
తేన పార్థివముఖ్యేన భావితం భావితాత్మనా ॥ 47
రాజశ్రేష్ఠుడు, పవిత్రాంతఃకరణుడు అయిన ఆ సంవరణుని పాలనలో ఆ నగరంలోనూ, ఆదేశంలోనూ ఉన్న ప్రజలు పరమానందాన్ని అనుభవించారు. (47)
తతో ద్వాదశ వర్షాణి పునరీజే నరాధిపః ।
తపత్యా సహితః పత్న్యా యథా శచ్యా మరుత్పతిః ॥ 48
తరువాత సంవరణుడు భార్య అయిన తపతితో కలిసి శచితో కూడిన ఇంద్రుని వలె ప్రకాశిస్తూ పండ్రెండుసంవత్సరాల పర్యంతం యజ్ణం చేశాడు (48)
గంధర్వ ఉవాచ
ఏవమాసీత్ మహాభాగా తపతీ నామ పౌర్వికీ ।
తవ వైవస్వతీ పార్థ తాపత్యః త్వం యమా మతః ॥ 49
గంధర్వుడిలా అన్నాడు - అర్జునా! ఈ ప్రకారంగా భాగ్యశాలిని అయిన సూర్యసుత తపతి మీ పూర్వీకుడైన సంవరణునకు భార్య అయినది. అందువలన నేను 'తాపత్యా' అని నిన్ను సంబోధించాను. (49)
తస్యాం సంజనయామాస కురుం సంవరణో నృపః ।
తపత్యాం తపతాంశ్రేష్ఠ తాపత్యస్త్వం తతోఽర్జున ॥ 50
తాపసశ్రేష్ఠా! అర్జునా! ఆ తపతి యందు సంవరణ మహారాజు కురువును కన్నాడు. అందువలన నీవు తాపాత్యుడవయ్యావు. (50)
(కురూద్భవా యతో యూయం కౌరవాః కురవస్తథా ।
పౌరవాః ఆజమీఢాశ్చ భారతాః భరతర్షభ ॥
తాపత్యమఖిలం ప్రోక్తం వృత్తాంతం తవ పూర్వకమ్ ।
పురోహితముఖా యూయం భుంగ్ధ్వం వై పృథివీమిమామ్ ॥)
భరతశ్రేష్ఠా! కురువు వంశంలో పుట్టారు కాబట్టి మీరు కురువులు, కౌరవులూ అయ్యారు. పురువంశంలో పుట్టారు కాబట్టి పౌరవులు, అజమీఢ వంశంలో పుట్టినందువల్ల ఆజమీఢులు, భరతవంశంలో పుట్టి భారతులు అయ్యారు. తపతికి సంబంధించిన ప్రాచీన వృత్తాంతమంతా నీకు చెప్ఫాను. పురోహితుని ముందుంచుకొని మీరు భూమిని అనుభవిస్తూ, పరిపాలించండి.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి తపత్యుపాఖ్యానసమాప్తౌ ద్విసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 172 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున తపత్యుపాఖ్యాన సమాప్తియను నూట డెబ్బది రెండవ అధ్యాయము. (172)
(దాక్షిణాత్య అధికపాఠమైన 6 శ్లోకములతో కలిపి మొత్తము 56 శ్లోకములు)