178. నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము

ఔర్వుని కోపమును పితరులు నివారించుట.

బ్రాహ్మణ్యువాచ
వాహం గృహ్ణామి వస్తాతాః దృష్టీ ర్నాస్మి రుషాన్వితా ।
అయంతు భార్గవో మానమ్ ఊరుజః కుపితోఽద్య వై ॥ 1
బ్రాహ్మణి ఇలా అన్నది.
నాయనలారా! నేను మీ దృష్టిని అపహరించలేదు. నాకు కోపమూ లేదు. ఊరువుల నుండి పుట్టిన ఈ బార్గవుడే ఇప్పుడు కోపించి ఉన్నాడు. (1)
తేన చక్షూంషి వస్తాతాః వ్యక్తుం కోపాన్మహాత్మనా ।
స్మరతా నిహతాన్ బంధూన్ ఆదత్తాని న సంశయః ॥ 2
నాయనలారా! ఆ మహాత్ముడే మీరు చంపిన తన బంధువులను తలచుకొని కోపంతో మీ కంటిచూపును పోగొట్టినట్టుంది. సందేహం లేదు. (2)
గర్భానపి యదా యూయం భృగూణాం ఘ్నత పుత్రకాః ।
తదాయమూరునా గర్భో మయా వర్షశతం ధృతః ॥ 3
పుత్రులారా! మీరు బార్గవుల గర్భస్థ శిశువులను కూడా చంపారు. అప్పటి నుండి నేను ఈ గర్భాన్ని నా తొడలో వంద సంవత్సరాలు దాచి ఉంచాను! (3)
షడంగ శ్చాఖిలో వేదః ఇమం గర్భస్థ మేవ హ ।
వివేశ భృగువంశస్య భూయః ప్రియ చికీర్షయా ॥ 4
భృగువంశానికి మరల మేలు చేయాలన్న కోరికతో షడంగ సహితమైన వేదం ఇతనికి గర్భంలో నున్నపుడే సంక్రమించింది. (4)
సోయం పితృవధాద్వ్యక్తం క్రోధాద్వో హంతుమిచ్ఛతి ।
తేజసా తస్య దివ్యేన చక్షూంషి ముషితాని వః ॥ 5
అటువంటి ఈ బాలుడు పితృవధకు కోపించి మిమ్ములను చంపదలచినట్టు అనిపిస్తోంది. అతని దివ్యతేజస్సే మీ కంటి చూపు నపహరించింది. (5)
తమేవ యూయం యాచధ్వమ్ ఔర్వం మమ సుతోత్తమమ్ ।
అయం వః ప్రణిపాతేన తుష్టో దృష్టీః ప్రమోక్ష్యతి ॥ 6
కాబట్టి నా కుమారరత్నమయిన ఔర్వునే మీరు యాచించండి. మీరు శిరస్సు వాల్చితే తృప్తిపడి ఇతడే మీకు దృష్టి ననుగ్రహించగలడు. (6)
వసిష్ఠ ఉవాచ
ఏవముక్తా స్తతస్సర్వే రాజానస్తే తమూరుజమ్ ।
ఊచుః ప్రసీదేతి తదా ప్రసాదం చ చకార సః ॥ 7
వసిష్ఠుడిలా అన్నాడు.
ఇలా చెప్పగానే ఆ రాజులంతా ఊరువులనుండి పుట్టిన ఆ ఔర్వుని అనుగ్రహించమని కోరారు. అతడు అప్పుడు అనుగ్రహించాడు. (7)
అనేనైవచ విఖ్యాతో నామ్నా లోకేషు సత్తమః ।
స ఔర్వ ఇతి విప్రర్షిః ఊరుం భిత్త్వా వ్యజాయత ॥ 8
సజ్జనశ్రేష్ఠుడైన ఆ విప్రర్షి తండ్రి తొడలు చీల్చుకొని పుట్టాడు. కాబట్టి ఔర్వుడనే పేరుతో లోకంలో ప్రసిద్ధిపొందాడు. (8)
చక్షూంషి ప్ర్రతిలబ్ధా చ ప్రతిజగ్ముస్తతో నృపాః ।
భార్గవస్తు మునిర్మేనే సర్వలోకపరాభవమ్ ॥ 9
ఆపై రాజులంతా తిరిగి చూపును పొంది వెళ్ళిపోయారు. సర్వలోకాలకూ పరభవాన్ని చేయాలని భార్గవముని భావించాడు. (9)
స చక్రే తాత లోకానాం వినాశాయ మహామనాః ।
సర్వేషా మేవ కార్ త్స్న్యేన మనః ప్రవణమాత్మనః ॥ 10
నాయనా! పరాశరా! మహాత్ముడైన ఆ ముని సర్వలోకాలనూ పూర్తిగా నాశనం చేయాలన్న ఆలోచనలో మనస్సును లగ్నం చేశాడు. (10)
ఇచ్ఛన్నపచితిం కర్తుం భృగూణాం భృగునందనః ।
సర్వలోకవినాశాయ తపసా మహతైధితః ॥ 11
భృగువంశనందనుడైన ఆ కుమారుడు భృగువుల వధకు ప్రతిక్రియ చేయనెంచి సర్వలోకాలనూ నాశనం చేయదలచి ఘోరతపస్సుతో ఎదిగాడు. (11)
తాపయామాస తాంల్లోకాన్ సదేవాసురమానుషాన్ ।
తపసోగ్రేణ మహతా నందయిష్యన్ పితామహాన్ ॥ 12
పితరులకు ఆనందాన్ని కల్గించాలని తీవ్రంగా తపిస్తూ ఆ కుమారుడు దేవతలతో,అసురులతో, మానవులతో నిండిన సర్వలోకాలను తపింపజేశాడు. (12)
తతస్తం పితరస్తాత విజ్ఞాయ కులనందనమ్ ।
పితృలోకాదుపాగమ్య సర్వ ఊచురిదం వచః ॥ 13
నాయనా! అటు పిమ్మట అతనిని తమ వంశవర్ధనునిగా గ్రహించి పితరులు అందరు పితృలోకం నుండి వచ్చి ఇలా అన్నారు- (13)
పితర ఊచుః
ఔర్వ దృష్టః ప్రభావస్తే తపసోగ్రస్య పుత్రక ।
ప్రసాదం కురు లోకానాం నియచ్ఛ క్రోధమాత్మనః ॥ 14
పితరులిలా అన్నారు.
కుమారా! ఔర్వా! నీ తీవ్రతపః ప్రభావాన్ని చూచాం. లోకాలను అనుగ్రహించు. క్రోధాన్ని నియంత్రించుకో. (14)
నా నీశైర్హి తదా తాత భృగుభిర్బావితాత్మభిః ।
వధో హ్యేపేక్షితః సర్వైః క్షత్రియాణాం విహింసతామ్ ॥ 15
నాయనా! క్షత్రియులంతా మమ్ములను హింసించినప్పుడు పవిత్రాంతఃకరణులమైన మేము-భృగువంశ బ్రాహ్మణులం-అసమర్థులమై వంశవధను ఉపేక్షించామని భావించరాదు. (15)
ఆయుషా విప్రకృష్టేన యదా నః ఖేద ఆవిశత్ ।
తథాస్మాభిర్వధస్తాత క్షత్రియై రీప్సితః స్వయమ్ ॥ 16
నాయనా! మా ఆయుష్షు బాగా మించిపోయింది. ఆ దశలో మేమంతా భేదానికి గురి అయ్యాము. దానితో మేమే స్వయంగా క్షత్రియులు మమ్ము సంహరించటానికి అంగీకరించాం. (16)
నిఖాతం యచ్చ వై విత్తం కేనచి ద్భృగువేశ్మని ।
వైరాయైవ తదా న్యస్తం క్షత్రియాన్ కోపయిష్ణుభిః ॥ 17
ఒకానొక భృగువు ఇంటిలో త్రవ్వి ధనాన్ని దాచిపెట్టడం కూడా శత్రుత్వాన్ని పెంచటానికే చేశాము. మాపై క్షత్రియులకు కోపం కలగాలన్నదే మా అభీష్టం. (17)
కిం హి విత్తేన నః కార్యం స్వర్గేప్సూనాం ద్విజోత్తమ ।
యదస్మాకం ధనాధ్యక్షః ప్రభూతం ధనమాహరత్ ॥ 18
ద్విజోత్తమా! స్వర్గానికి వెళ్ళదలచుకొన్న మాకు డబ్బుతో పనేమిటి? సాక్షాత్తు కుబేరుడే మాకు ధనరాశిని తెచ్చి ఇచ్చాడు. (18)
యదాతు మృత్యురాదాతుం న నః శక్నోతి సర్వశః ।
తదాస్మాభిరయం దృష్టః ఉపాయః తాత సమ్మతః ॥ 19
నాయనా! మమ్ములను ఏ రీతిగానూ మృత్యువు వశం చేసికొన లేకపోయినందువలన మేమంతా కలిసి అందరి సమ్మతితో ఇ ఉపాయాన్ని అవలంబించాం. (19)
ఆత్మహా చ పుమాంస్తాత న లోకాంల్లభతే శుభాన్ ।
తతోఽస్మాభిః సమీక్ష్యైవం నాత్మనాఽఽత్మా నిపాతితః ॥ 20
నాయనా! ఆత్మహత్య చేసికొన్న వాడు పుణ్యలోకాలకు పోలేడు. కాబట్టి బాగా ఆలోచించియే మమ్ము మేము చంపుకొనలేదు. (20)
న చైతన్నః ప్రియం తాత యదిదం కర్తుమిచ్ఛసి ।
నియచ్ఛేదం మనః పాపాత్ సర్వలోకపరాభవాత్ ॥ 21
నాయనా! నీవు ప్రస్తుతం చేయదలచుకొన్న పని మాకిష్టమైనది కాదు. సర్వలోకాలను పరాభవించుట పెద్దపాపం. దాని నుండి మనస్సును మరల్చుకో. (21)
మా వధీః క్షత్రియాంస్తాత న లోకాన్ సప్త పుత్రక ।
దూషయంతం తపస్తేజః క్రోధముత్పతితం జహి ॥ 22
నాయనా! క్షత్రియులను చంపవద్దు. సప్తలోకాలనూ సంహరించవద్దు. తపోజనితమైన నీ తేజస్సుని దూరంచేసే క్రోధం నీలో కలిగింది. దానిని విడిచిపెట్టు. (22)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ఔర్వవారణే అష్టసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 178 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను
ఉపపర్వమున ఔర్వవారణము అను నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము (178)