196. నూట తొంబది ఆరవ అధ్యాయము

ద్రౌపదీ పాండవుల పూర్వజన్మవృత్తాంతము.

వ్యాస ఉవాచ
పురా వై నైమిషారణ్యే దేవాః సత్రముపాసతే ।
తత్ర వైవస్వతో రాజన్ శామిత్రమకరోత్ తదా ॥ 1
వ్యాసుడు చెప్పనారంభించాడు. రాజా! పూర్వం నైమిశారణ్య క్షేత్రంలో దేవతలందరు ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో సూర్యపుత్రుడు యముడు అందు శామిత్రాన్ని నిర్వసిస్తున్నాడు. (1)
వి॥సం॥ శమితా యజ్ఞే పశువథ కర్తా, తస్య కర్మ శామిత్రమ్. అనగా యజ్ఞమున పశువధచేయువాడు శమిత (యముడు) అతని పనియే శామిత్రము. (నీల)
వి॥సం॥ సంయచ్ఛతీతి సంయత్ (యమః) మిత్రో రవిః తయోరర్థే ఏకో దీక్షితః శమిత్రః తస్యేదం కర్మ శామిత్రమ్.
నిరోధించువాడు యముడు. మిత్రుడనగా సూర్యుడు. వారిద్దరిలో దీక్షితుడు యముడు. అతడు చేయుపని శామిత్రము (యజ్ఞం). (దేవ)
తతో యమో దీక్షితస్తత్ర రాజన్
నామారయత్ కంచిదపి ప్రజానామ్ ।
తతః ప్రజాస్తా బహులా బభూవుః
కాలాతిపాతాన్మరణప్రహీణాః ॥ 2
రాజా! యముడు దీక్షితుడైన కారణాన ప్రజలను చంపటం లేదు. ఈ విధంగా మృత్యువుకు సమయం గడవటంతో మరణం లేక జనసంఖ్య పెరగసాగింది. (2)
వి॥సం॥ కాలాతిపాతాత్ (యమాతిక్రమణాత్) అని అర్థం.
అనగా యముడు నియమాన్ని అతిక్రమించటం వలన (దేవ)
సోమశ్చ శక్రో వరుణః కుబేరః
సాధ్యా రుద్రా వసవోఽథాశ్వినౌ చ ।
ప్రజాపతిర్భువనస్య ప్రణేతా
సమాజగ్ముస్తత్ర దేవాస్తథాన్యే ॥ 3
తతోఽబ్రువన్ లోకగురుం సమేతా
భయాత్ తీవ్రాన్మానుషాణాం చ వృద్ధ్యా ।
తస్మాద్భయా దుద్విజంతః సుఖేప్సవః
ప్రయామ సర్వే శరణం భవంతమ్ ॥ 4
చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, సాధ్యులు, రుద్రులు, వసువులు, అశ్వినీదేవతలు అందరూ కలిసి బ్రహ్మనివాసమైన సత్యలోకానికి పోయి "భగవంతుడా! మనుష్యుల సంఖ్య అధికమౌతోంది. మాకు తీవ్రమైన భయం కలుగుతోంది. మేమందఱమూ ఆ భయంతో కుమిలిపోతూ సుఖాన్ని కోరి నిన్ను శరణువేడుకొంటున్నాము." (3,4)
పితామహ ఉవాచ
కిం వో భయం మానుషేభ్యః యూయం సర్వే యదామరాః ।
మా వో మర్త్యసకాశాత్ వై భయం భవితుమర్హతి ॥ 5
బ్రహ్మ అన్నాడు - మీరు అమరులు. మీకు మనుష్యుల వల్ల భయమా! మీకు మనుష్యుల వల్ల ఎన్నడూ భయం కల్గదు. (5)
దేవా ఊచుః
మర్త్యా అమర్త్యా సంవృత్తాః న విశేషోఽస్తి కశ్చన ।
అవిశేషాదుద్విజంతః విశేషార్థమిమాగతాః ॥ 6
దేవతలు అన్నారు - మనుష్యులు అమరులైరి. మామధ్య భేదమే లేదు. అంతరం తొలగటంతో మా ప్రత్యేకతకై మీవద్దకు వచ్చాం. (6)
శ్రీ భగవానువాచ
వైవస్వతో వ్యాపృతః సత్రహేతోః
తేన త్విమే న మ్రియంతే మనుష్యాః ।
తస్మిన్నేకాగ్రే కృతసర్వకార్యే
తత ఏషాం భవితైవాంతకాలః ॥ 7
వైవస్వతస్వైవ తనుర్విభక్తా
వీర్యేణ యుష్మాకముత ప్రయుక్తా ।
సైషామంతో భవితా హ్యంతకాల్
న తత్ర వీర్యం భవితా నరేషు ॥ 8
బ్రహ్మ అన్నాడు - సూర్యపుత్రుడైన యముడు దీక్షితుడగుటచే మనుజులకు మరణం లేదు. అతని యజ్ఞం పూర్తికాగానే మనుజులకు మరణం సంభవిస్తుంది. మీ వీర్యంతో యముని శరీరాన్ని రెండుగా చేస్తే వాటిలో ఒకటి మారణకార్యాన్ని కొనసాగిస్తుంది. మనుజులకు మరణం కల్గుతుంది. వారికి అమృతత్వం తొలగిపోతుంది. (7,8)
వి॥సం॥ వీర్యం = దేవతాసామ్యం
వ్యాస ఉవాచ
తతస్తు తే పూర్వజదేవవాక్యం
శ్రుత్వా జగ్ముర్యత్ర దేవా యజంతే ।
సమాసీనాస్తే సమేతా మహాబలాః
భాగీరథ్యాం దదృశుః పుండరీకమ్ ॥ 9
వ్యాసుడు చెప్పాడు - రాజా! వారు బ్రహ్మమాటలు విని దేవతలు యజ్ఞం చేసే చోటికి వెళ్ళారు. ఒకనాడు వారందరూ గంగానదికి స్నానానికి పోయి అక్కడ ఒడ్డుపై కూర్చుంది గంగలో ఒక పద్మాన్ని చూచారు. (9)
దృష్ట్వా చ తద్ విస్మితాస్తే బభూవుః
తేషామింద్రస్తత్ర శూరో జగామ ।
సోఽపశ్యత్ యోషామథ పావకప్రభాం
యత్ర దేవీ గంగా సతతం ప్రసూతా ॥ 10
అది చూచి వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ కమలం జాడకై శూరుడైన ఇంద్రుడు వెళ్ళాడు. గంగాప్రవాహం ఆగినచోట అగ్ని తేజస్సు గల ఒక కాంతను చూశాడు. (10)
సా తత్ర యోషా రుదతీ జలార్థినీ
గంగాం దేవీం వ్యవగాహ్య వ్యతిష్ఠత్ ।
తస్యాశ్రుబిందుః పతితో జలే యః
తత్ పద్మమాసీదథ తత్ర కాంచనమ్ ॥ 11
జలంకోసం వచ్చిన ఆమె గంగలో మునిగి ఏడ్చింది. ఆమె కన్నీటిబొట్లు ఒక్కొక్కటిగా నీటిలో పడి బంగారుకమలాలు అయ్యాయి. (11)
తదద్భుతం ప్రేక్ష్య వజ్రీ తదానీం
అపృచ్ఛత్ తాం యోషితమంతికాద్ వై ।
కా త్వం భద్రే రోదషి కస్య హేతోః
వాక్యం తథ్యం కామయేఽహం బ్రవీహి ॥ 12
ఆ అద్భుతాన్ని చూచి ఇంద్రుడు ఆమెను సమీపిచి "కల్యాణీ! నీవెందులకు ఏడుస్తున్నావు? యథార్థం చెప్పు. వినాలని ఉంది." అన్నాడు. (12)
స్ర్త్యువాచ
త్వం వేత్స్యసే మామిహ యాస్మి శక్ర
యదర్థం చాహం రోదమి మందభాగ్యా ।
ఆగచ్ఛ రాజన్ పురతో గమిష్యే
ద్రష్టాసి తద్ రోదమి యత్కృతేఽహమ్ ॥ 13
ఆ కాంత ఇలా అన్నది - ఇంద్రా! నేను భాగ్యహీనురాలను. నేనెవరినో, ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలుస్తుంది. నీవు నా వెనుక రా. నా రోదన కారణం నీవు స్వయంగా తెలిసికొనవచ్చు. (13)
వ్యాస ఉవాచ
తాం గచ్ఛంతీమన్వగచ్ఛత్ తదానీం
సోఽపశ్యదారాత్ తరుణం దర్శనీయమ్ ।
సిద్ధాసనస్థం యువతీసహాయం
క్రీడంతమైక్షద్ గిరిరాజమూర్థ్ని ॥ 14
వ్యాసుడు అన్నాడు - ఆమెను అనుసరించిపోయి ఇంద్రుడు హిమాలయశిఖరం మీద సిద్ధాసనస్థుడై ఒక యువతితో క్రీడిస్తున్న అందమైన యువకుని చూచాడు. (14)
తమబ్రవీద్ దేవరాజో మమేదం
త్వం విద్ధి విద్వన్ భువనం వశే స్థితమ్ ।
ఈశోఽహమస్మీతి సమన్యురబ్రవీత్
దృష్ట్వా తమక్షైః సుభృశం ప్రమత్తమ్ ॥ 15
వారు అక్షక్రీడాసక్తులై ఉండగా ఇంద్రుడు దగ్గరకు చేరి ఆ యువకునితో "మహానుభావా! నేనీలోకానికి రాజును. ఈ లోకం నా అధీనంలో ఉంది" అని అన్నాడు. (15)
క్రుద్ధం చ శక్రం ప్రసమీక్ష్య దేవః
జహాస శక్రం చ శనైరుదైక్షత ।
సంస్తంభితోఽభూదథ దేవరాజః
తేనేక్షితః స్థాణురివావతస్థే ॥ 16
ఇంద్రునిక్రోధాన్ని చూచిన ఆ దేవపురుషుడు నవ్వి ఆ మెల్లగా ఇంద్రుని వైపు చూచాడు. అతని చూపు పడగానే ఇంద్రుడు కొయ్యబారి స్థాణువై పోయాడు. (16)
యదా తు పర్యాప్తమిహాస్య క్రీడయా
తదా దేవీం రుదతీం తామువాచ ।
ఆనీయతామేష యతోఽహమారాత్
నైనం దర్పః పునరప్యావిశేత ॥ 17
వారి క్రీడ ముగిసిన తర్వాత ఏడుస్తున్న ఆమెను పిలిచి " ఆ ఇంద్రుని నా వద్దకు తీసికొనిరా. ఇతనిలో తిరిగి గర్వం ప్రవేశించకుండ చేస్తాను" అని ఆ యువకుడు అన్నాడు. (17)
తతః శక్రః స్పృష్టమాత్రస్తయా తు
స్రస్తైరంగైః పతితోఽభూత్ ధరణ్యామ్ ।
తమబ్రవీత్ భగవానుగ్రతేజాః
మైవం పునః శక్ర కృథాః కథంచిత్ ॥ 18
అతని మాటలను విని ఆమె ఇంద్రుని శరీరాన్ని తాకగానే అతడు అవయవ సామర్థ్యాన్ని కోల్పోయి భూమిపై పడినాడు. అతనిని చూచి రుద్రుడు ఇక 'ఎప్పుడూ ఇలా చేయవద్దు' అని పలికాడు. (18)
నివర్తయైనం చ మహాద్రిరాజం
బలం చ వీర్యం చ తవాప్రమేయమ్ ।
ఛిద్రస్య చైవావిశ మధ్యమస్య
యత్రాసతే త్వద్విథాః సూర్యభాసః ॥ 19
"నీలో అమితమైన బలం, పరాక్రమం ఉన్నాయి. ఈ గుహా ద్వారానికి అడ్డమైన ఈ పెద్దకొండను తొలగించు. లోనికి ప్రవేశించు. నీతో సమానులైన ఇంద్రులు అక్కడ ఉన్నారు" అన్నాడు. (19)
స తత్ వివృత్య వివరం మహాగిరేః
తుల్యద్యుతీంశ్చతురోఽన్యాన్ దదర్శ ।
స తానభిప్రేక్ష్య బభువ దుఃఖితః
కచ్చిన్నాహం భవితా వై యథేమే ॥ 20
అతడు ఆ పర్వతబిలంలో ప్రవేశించి తనతో సమానులైన నల్గురు ఇంద్రులను చూచాడు. నేనూ వీరివలె దుర్దశలో పడగలనని భావించాడు. (20)
తతో దేవో గిరిశో వజ్రపాణిం
వివృత్య నేత్రే కుపితోఽభ్యువాచ ।
దరమేతాం ప్రవిశ త్వం శతక్రతో
యన్మాం బాల్యాదవమంస్థాః పురస్తాత్ ॥ 21
అప్పుడు శంకరుడు కళ్ళు పెద్దవి చేసి కోపంతో ఇంద్రుని చూచి " నీవు మూర్ఖత్వంతో నన్ను అవమానించావు. ఈ గుహలో ప్రవేశించు" అన్నాడు. (21)
వి॥ సం॥ బాల్యాత్ = మౌర్ఖ్యాత్ (మూర్ఖత్వంతో) (దేవ)
ఉక్తస్త్వేవం విభునా దేవరాజః
ప్రావేపతార్తో భృశమేవాభిషంగాత్ ।
స్రస్తైరంగైరనిలేనేవ నున్నం
అశ్వత్థపత్రం గిరిరాజమూర్ధ్ని ॥ 22
పర్వతశిఖరంపై శంకరుడావిధంగా అంటే ఇంద్రుడు శిథిలమైన అవయవాలతో గాలికి ఊగిసలాడే రావిఆకువలె కంపించిపోయాడు. (22)
స ప్రాంజలిర్వై వృషవాహనేన
ప్రవేపమానః సహసైవముక్తః ।
ఉవాచ దేవం బహురూపముగ్ర -
స్రష్టాశేషస్య భువనస్య త్వం భవాద్యః ॥ 23
ఇంద్రుడు కంపిస్తూ వెంటనే చేతులు జోడించి బహురూపుడవై, ఉగ్రుడవైన నీవు ఈ లోకానికంతకు ఆదిపురుషుడవు అని స్తుతించాడు. (23)
తమబ్రవీదుగ్రవర్చాః ప్రహస్య
నైవంశీలాః శేషమిహాప్నువంతి ।
ఏతేఽప్యేవం భవితారః పురస్తాత్
తస్మాదేతాం దరీమావిశ్య శేష్వ ॥ 24
భయంకరమైన తేజస్సు గల రుద్రుడు నవ్వి ఇలా అన్నాడు - నీవంటివారు ప్రసాదానికి అర్హులుకారు. వీరూ నీవలె పూర్వం ప్రవర్తించారు. నీవు అట్లే గుహలో ప్రవేశించి శయనించు. (24)
తత్ర హ్యేవం భవితారో న సంశయః
యోనిం సర్వే మానుషీమావిశధ్వమ్ ।
తత్ర యూయం కర్మ కృత్వావిషహ్యం
బహూనన్యాన్ నిధనం ప్రాపయిత్వా ॥ 25
ఆగంతారః పునరేవేంద్రలోకం
స్వకర్మణా పూర్వజితం మహార్హమ్ ।
సర్వం మయా భాషితమేతదేవం
కర్తవ్యమన్యత్ వివిధార్థయుక్తమ్ ॥ 26
మీరు నేను చెప్పినట్లే కార్యాలను నిర్వహిస్తారు. మీరందరు మానవులుగా పుడతారు. ఆ జన్మలో దుస్సహకర్మల నాచరించి చాలామంది రాజులను మృత్యువుకు ఎరచేసి తిరిగి మీశుభకర్మలచే పవిత్రులకు నిలయమైన స్వర్గానికి వస్తారు. నేను చెప్పిన పనులేకాక సార్థకమైన వేరు పనులు కూడా చేస్తారు. (25,26)
పూర్వేంద్రా ఊచుః
గమిష్యామో మానుషం దేవలోకాత్
దురాధరో విహితో యత్ర మోక్షః ।
దేవాస్త్వదస్మానాదధీరన్జనన్యాం
ధర్మో వాయుర్మఘవానశ్వినౌ చ ।
అస్త్రైర్దివ్యైర్మానుషాన్ యోధయిత్వా
ఆగంతారః పునరేవేంద్రలోకమ్ ॥ 27
పూర్వపు నల్గురు ఇంద్రులు అన్నారు - భగవంతుడా! మీ ఆజ్ఞను శిరసావహించి మేము దేవలోకాన్ని వీడి మనుష్యలోకానికి పోతాం. అక్కడ దుర్లభమైన మోక్షం సాధిస్తాం. మీరు మమ్మల్ని యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలతో కలిపి తల్లి గర్భంలో ప్రవేశపెట్టండి. దివ్యాస్త్రాలతో మానవులతో పోరు సలిపి తిరిగి ఇంద్రలోకం వస్తాం. (27)
వ్యాస ఉవాచ
ఏతచ్ర్ఛుత్వా వజ్రపాణిర్వచస్తు
దేవశ్రేష్ఠం పునరేవేదమాహ ।
వీర్యేణాహం పురుషం కార్యహేతోః
దద్యామేషాం పంచమం మత్ర్పసూతమ్ ॥ 28
విశ్వభుక్ భూతదామా చ శిబిరింద్రః మత్ర్పసూతమ్ ॥ 28
విశ్వభుక్ భూతదామా చ శిబిరింద్రః ప్రతాపవాన్ ।
శాంతిశ్చతుర్థస్తేషామ్ వై తేజస్వీ పంచమః స్మృతః ॥ 29
వ్యాసుడు ఇలా అన్నాడు - రాజా! వజ్రధారి ఇంద్రుడు పూర్వేంద్రుల మాటలను విని దేవతాశ్రేష్ఠుడైన శంకరునితో ఇలా పలికాడు "పూజ్యుడా! నా వీర్యంతో ఐదవవాడవుతాడు. సృజించి వీరికిస్తాను. వీరితో కలిసి అతడు ఐదవవాడగును. వారి పేర్లు వరుసగా వరుసగా విశ్వభుక్కు, భుతధామ, శిబి, శాంతి, తేజస్వి". (28,29)
తేషాం కామం భగవానుగ్రధన్వా
ప్రాదిష్ట సంనిసర్గాత్ యథోక్తమ్ ।
తాం చాప్యేషాం యోషితం లోకకాంతాం
శ్రియం భార్యం వ్యదధాన్మానుషేషు ॥ 30
శంకరుడు వారి కోర్కెను విని సాధుస్వభావంతో ఆనందించి వరమిచ్చాడు. ఆ సౌందర్యరాశిని (స్వర్గలక్ష్మి) మానవలోకంలో వారి భార్యను చేశాడు. (30)
తైరేవ సార్థం తు తతః స దేవః
జగామ నారాయణమప్రమేయమ్ ।
అనంతమవ్యక్తమజం పురాణం
సనాతనం విశ్వమనంతరూపమ్ ॥ 31
దేవదేవుడైన శంకరుడు వారితో కలిసి అనంతుడు, అవ్యక్తుడు, అప్రమేయుడు, అజుడు, ప్రాచీనుడు, సనాతనుడు, అనంతుడు, విశ్వరూపుడూ ఐన శ్రీహరి వద్దకు వెళ్ళాడు. (31)
స చాపి తత్ వ్యదధాత్ సర్వమేవ
తతః సర్వే సంబభూవుర్ధరణ్యామ్ ।
స చాపి కేశౌ అహ్రిరుద్బబర్హ
శుక్లమేకమపరం చాపి కృష్ణమ్ ॥ 32
అతడూ ఆ మాటలకు అంగీకరించాడు. పిమ్మట అందరు భూమిపై జన్మించారు. అదే సమయంలో శ్రీహరి తనకేశపాశం నుండి రెండు వెంట్రుకలను బయటకు తీశాడు. వాటిలో ఒకటి తెల్లనిది, మరొకటి నల్లనిది. (32)
తౌ చాపి కేశౌ నివిశేతాం యదూనాం
కులేస్త్రియౌ దేవకీం రోహిణీం చ ।
తయోరేకో బలదేవో బభూవ
యోఽసౌ శ్వేతస్తస్య దేవస్య కేశః ।
కృష్ణో ద్వితీయః కేశవః సంబభూవ
కేశో యోఽసౌ వర్ణతః కృష్ణ ఉక్తః ॥ 33
ఆ రెండు వెంట్రుకలు యదువంశస్త్రీలైన దేవకీరోహిణుల గర్భంలో ప్రవేశించాయి. తెల్లటికేశం బలరాముడు, నల్లటికేశం శ్రీకృష్ణుడు అయ్యారు. (33)
యే తే పూర్వం శక్రరూపా నిబద్ధాః
తస్యాం దర్యాం పర్యతస్యోత్తరస్య ।
ఇహైవ తే పాండవా వీర్యవంతః
శక్రస్యాంశః పాండవః సవ్యసాచీ ॥ 34
ఉత్తరహిమాలయ గుహలో బందీలైన నల్గురూ పరాక్రమవంతులైన పాండవులైరి. ఇంద్రాంశ గల పాండుపుత్రుడు సవ్యసాచి (అర్జునుడు). (34)
ఏవమేతే పాండవాః సంబభూవుః
యే తే రాజన్ పూర్వమింద్రా బభూవుః ।
లక్ష్మీశ్చైషాం పూర్వమేవోపదిష్టా
భార్యా చైషా ద్రౌపదీ దివ్యరూపా ॥ 35
కథమ్ హి స్త్రీ కర్మణా తే మహీతలాత్
సముత్తిష్ఠేదన్యతో దైవయోగాత్ ।
యస్యా రూపం సోమసూర్యప్రకాశం
గంధశ్చాస్యాః క్రోశమాత్రాత్ ప్రవాతి ॥ 36
రాజా! పూర్వం ఇంద్రులైనవారు పాండవులు. స్వర్గలక్ష్మి ద్రౌపది అయింది.
దైవయోగం లేనప్పుడు యజ్ఞవేదినుండి దివ్యకాంత ఎలా ఉదయిస్తుంది? ఆమె రూపం చంద్రసూర్యులవలె ఎలా ప్రకాశిస్తుంది? క్రోసు దూరం నుండి ఆమె దివ్య గంధమెలా వ్యాపిస్తుంది? (క్రోసు అనగా రెండు మైళ్ళు). (35,36)
ఇదం చాన్యత్ ప్రీతిపూర్వం నరేంద్ర
దదాని తే వరమత్యద్భుతం చ ।
దివ్యం చక్షుః పశ్య కుంతీసుతాంస్త్వం
పుణ్యైర్దివ్యైః పూర్వదేహైరుపేతాన్ ॥ 37
ద్రుపదమహారాజా! నేను నీకు ప్రసన్నతతో దివ్యదృష్టినిస్తాను. నీవు కుంతీపుత్రుల అలనాటి దివ్యరూపాలను చూస్తావు. (37)
వైశంపాయన ఉవాచ
తతో వ్యాసః పరమోదార కర్మా
శుచిర్విప్రస్తపసా తస్య రాజ్ఞః ।
చక్షుర్దివ్యం ప్రదదౌ తాంశ్చ సర్వాన్
రాజాపశ్యత్ పూర్వదేవైర్యథావత్ ॥ 38
వైశంపాయనుడు అన్నాడు - వెంటనే తన తపశ్శక్తిచే వ్యాసమహర్షి ద్రుపదునకు దివ్యచక్షువులిచ్చాడు. అతడు పాండవుల పూర్వదేహాలను చూచాడు. (38)
తతో దివ్యాన్ హేమకిరీటమాలినః
శక్రప్రఖ్యాన్ పావకాదిత్యవర్ణాన్ ।
బద్ధాపీడాంశ్చారురూపాంశ్చ యూనో
వ్యూఢోరస్కాంస్తాలమాత్రాన్ దదర్శ ॥ 39
స్వర్ణకిరీటధారులై, బంగారుమాలలు ధరించి, ఇంద్ర సమవర్చస్కులై, అగ్ని సూర్యాది దేవతల కాంతి కలవారై, యువకులై, విశాలవక్షఃస్థలులై, తాటిచెట్టు ప్రమాణమ్ గల ఇంద్రాదులు కనిపించారు. (37)
దివ్యైర్వస్త్రైరరజోభిః సుగంధైః
మాల్యైశ్చాగ్ర్యైః శోభమానానతీవ ।
సాక్షాత్ త్ర్యక్ష్యాన్ వా వసూంశ్చాపి రుద్రాన్
ఆదిత్యాన్ వా సర్వగుణోపన్నాన్ ॥ 40
వారు నిర్మల వస్త్రాలు, ఉత్తమగంధాలు, సుందరమైన మాలలు ధరించి మహాదేవ, వసు, రుద్ర, ఆదిత్య గణంగా ప్రకాశిస్తున్నారు. (40)
తాన్ పూర్వేంద్రానభివీక్ష్యాభిరూపాన్
శక్రాత్మజమ్ చేంద్రరూపం నిశమ్య ।
ప్రీతొ రాజా ద్రుపదో విస్మితశ్చ
దివ్యాం మాయాం తామవేక్ష్యాప్రమేయామ్ ॥ 41
నల్గురు పాండవుల పూర్వరూపాలనూ, ఇంద్రాత్మజుడైన అర్జునుని రూపాన్ని చూచి ప్రసన్నుడైన ద్రుపదుడు ఊహకందని ఆ మాయతో ఆశ్చర్యపోయాడు. (41)
తాం చైవాగ్ర్యాం స్త్రియమతిరూపయుక్తాం
దివ్యాం సాక్షాత్ సోమవహ్నిప్రకాశమ్ ।
యోగ్యాం తేషాం రూపతేజోయశోభిః
పత్నీం మత్వా దృష్టవాన్ పార్థివేంద్రః ॥ 42
రాజశ్రేష్ఠుడైన ద్రుపదుడు త్రిలోకసుందరీ, సోమవహ్ని తేజస్వినీ, రూప తేజో యశస్విని అయిన ద్రౌపదిని వారికి అన్నివిధాల తగిన దానినిగా భావించాడు. (42)
స తద్ దృష్ట్వా మహదాశ్చర్యరూపం
జగ్రాహ పాదౌ సత్యవత్యాః సుతస్య ।
నైతచ్చిత్రం పరమర్షే త్వయీతి
ప్రసన్న చేతాః స ఉవాచ చైనమ్ ॥ 43
ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచిన ద్రుపదుడు వ్యాసుని పాదాలపై పడ్డాడు. "మహర్షీ! మీలో ఈ అద్భుత శక్తికి ఆశ్చర్యమేమున్నది" అని ద్రుపదుడు పలుకగానే వ్యాసుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు. (43)
వ్యాస ఉవాచ
ఆసీత్ తపోవనే కాచిదృషేః కన్యా మహాత్మనః ।
నాధ్యగచ్ఛత్ పతిం సా తు కన్యా రూపవతీ సతీ ॥ 44
వ్యాసుడు చెప్పాడు - ఒకానొక తపోవనంలో ఒక ఋషికి ఒక కుమార్తె కలదు. ఆమె సౌందర్యసౌశీల్యాలు గలది అయినా పెండ్లి కుదరలేదు. (44)
తోషయామాస తపసా సా కిలోగ్రేణ శంకరమ్ ।
తామువాచేశ్వరః ప్రీతో వృణు కామమితి స్వయమ్ ॥ 45
ఆమె కఠినమైన తపస్సుచే శంకరుని మెప్పించింది. ఈశ్వరుడు సంతసించి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని ఆమెతో అన్నాడు. (45)
సైవముక్తాబ్రవీత్ కన్యా దేవం వరదమీశ్వరమ్ ।
పతిం సర్వగుణోపేతమ్ ఇచ్ఛమీతి పునః పునః ॥ 46
వరదుడైన శంకరుని మాట విని ఆమె పదేపదే అన్ని గుణాలు గల పతిని వరంగా కోరింది. (46)
దదౌ తస్యై స దేవేశస్తం వరం ప్రీతమానసః ।
పంచ తే పతయో భద్రే భవిష్యంతీతి శంకరః ॥ 47
ప్రీతమనస్కుడైన శంకరుడు "కల్యాణీ! నీకు అయిదుగురు భర్తలు ఉంటారు" అని ఆమె కోరిన వరాన్నిచ్చాడు. (47)
సా ప్రసాదయతీ దేవమ్ ఇదం భూయోఽభ్యభాషత ।
ఏకం పతిం గుణోపేతం త్వత్తోఽర్హామీతి శంకర ॥ 48
ఆమె శంకరుని బతిమాలుతూ తిరిగి అంది - "సర్వగున సంపన్నుడైన భర్త ఒక్కడు చాలు." (48)
తాం దేవదేవః ప్రీతాత్మా పునః ప్రాహ శుభం వచః ।
పంచకృత్వస్త్వయోక్తోఽహం పతిం దేహీతి వై పునః ॥ 49
తత్ తథా భవితా భద్రే వచస్తత్ భద్రమస్తు తే ।
దేహమన్యం గతాయాస్తే సర్వమేతత్ భవిష్యతి ॥ 50
ప్రసన్నుడైన శంకరుడు ప్రియంగా ఆమెతో ఇలా చెప్పాడు - " నీవు తొందరలో అయిదుసార్లు పతినిమ్మని కోరావు. అది అట్లే అవుతుంది. నీకు మంగళం. మరో జన్మలో ఈ వరాన్ని పొందుతావు." (49,50)
ద్రుపదైషా హి సా జజ్ఞే సుతా వై దేవరూపిణీం ।
పంచానాం విహితా పత్నీ కృష్ణా పార్షత్యనిందితా ॥ 51
ద్రుపదమహారాజా! ఆ ఋషికన్యకయే నీకు కుమార్తె అయింది. ఐదుగురు వీరులకు పత్నిగా పూర్వమే నిర్ణీతమయింది. (51)
స్వర్గశ్రీః పాండవార్థం తు సముత్పన్నా మహామఖే ।
సేహ తప్త్వా తపో ఘోరం దుహితృత్వం తవాగతా ॥ 52
ఈ స్వర్గలక్ష్మి ని యజ్ఞశాలలొ పాండవపత్నిగా జన్మించింది. ఆమె ఘోరమైన తపస్సు చేసి నీకు కుమార్తె అయింది. (52)
సైషా దేవీ రుచిరా దేవజుష్టా
పంచానామేకా స్వకృతేనేహ కర్మణా ।
సృష్టా స్వయం దేవపత్నీ స్వయంభువా
శ్రుత్వా రాజన్ ద్రుపదేష్టం కురుష్వ ॥ 53
ద్రుపద రాజా! ఆ సుందరియే ఐదుగురికి తన తపస్సుచే పత్ని అయింది. బ్రహ్మయే ఈమేను దేవపత్నిగా చేయతలపెట్టాడు. ఇది గ్రహించి నీ ఇష్టం వచ్చినట్లు చేయి. (53)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి పంచేంద్రోపాఖ్యానే షణ్ణవత్యధికశతతమోఽధ్యాయః ॥ 196 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున వైవాహికపర్వమను
ఉపపర్వమున పంచేంద్రోపాఖ్యానము అను నూట తొంబది ఆరవ అధ్యయము. (196)