198. నూట తొంబది ఎనిమిదవ అధ్యాయము
కుంతి ద్రౌపదిని ఆశీర్వదించుట, శ్రీకృష్ణుడు పాండవులకు కానుకలు పంపుట.
వైశంపాయన ఉవాచ
పాండవైః సహ సంయోగం గతస్య ద్రుపదస్య హ ।
న బభూవ భయం కించిత్ దేవేభ్యోఽపి కథంచన ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయమహారాజా! పాండవులతో సంబంధం కలిగిన ద్రుపదునికి దేవతల వల్ల కూడా భయం లేదు. ఇక మనుష్యుల విషయం చెప్పనవసరం లేదు. (1)
కుంతీమాసాద్య తా నార్యః ద్రుపదస్య మహాత్మనః ।
వామ సంకీర్తయంతోఽస్యాః జగ్ముః పాదౌ స్వమూర్ధభిః ॥ 2
ద్రుపదుడు పంపిన దాసీజనం కుంతి పేరును కీర్తిస్తూ కుంతికి సాష్టాంగ ప్రణామం చేశారు. (2)
కృష్ణా చ క్షౌమసంవీతా కృతకౌతుకమంగలా ।
కృతాభివాదనా శ్వశ్ర్వాః తస్థౌ ప్రహ్వా కృతాంజలిః ॥ 3
ద్రౌపది పట్టువస్త్రాలు ధరిమ్చి వివాహమంగళం పూర్తి కావించి, అత్తకు వంగి, దోసిలి ఘటించి, వినయంతో నమస్కరించింది. (3)
రూపలక్షణసంపన్నామ్ శీలాచారసమన్వితామ్ ।
ద్రౌపదీమదదత్ ప్రేమ్ణా పృథాఽఽశీర్వచనం స్నుషామ్ ॥ 4
అందం, శుభలక్షణాలు, శీలాచారాలు గల కోడలు ద్రౌపదిని కుంతి ప్రేమతో ఆశీర్వదించి పలికింది. (4)
యథేంద్రాణీ హరిహయే స్వాహా చైవ విభావసౌ ।
రోహిణీ చ యథా సోమే దమయంతీ యథా నలే ॥ 5
యథా వైశ్రవణే భద్రా వసిష్ఠే చాప్యరుంధతీ ।
యథా నారాయణే లక్ష్మీః తథా త్వం భవ భర్తృషు ॥ 6
ద్రౌపదీ! ఇంద్రాణి ఇమ్ద్రుని, స్వాహాదేవి అగ్నిని, రోహిణి చంద్రుని, దమయంతి నలుని, బద్ర కుబేరుని, అరుంధతి వసిష్ఠుని, లక్షీదేవి నారాయణుని, సేవించినట్లు నీభర్తలను ప్రేమతో సేవించు. (5,6)
జీవసూర్వీరసూర్భద్రే బహుసౌఖ్యసమన్వితా ।
సుభగా భోగసంపన్నా యజ్ఞపత్నీ పతివ్రతా ॥ 7
మంగళకరమైనదానా! నీవు సౌఖ్యాలతో కూడి చిరంజీవులు, వీరులూ అయిన కొడుకులను పొందు. సౌభాగ్య, భోగాలను పొంది యజ్ఞపత్నివి, పతివ్రతవు అగుము. (7)
అతిథీనాగతాన్ సాధూన్ వృద్ధాన్ బాలాంస్తథా గురూన్ ।
పూజయంత్యా యథాన్యాయం శశ్వత్ గచ్ఛంతు తే సమాః ॥ 8
ఇంటికి వచ్చిన అతిథులను, అభ్యాగతులను, వృద్ధులను, పెద్దలను తగినట్లు సేవిస్తూ అనేకవత్సరాలు గడిపెదవు గాక! (8)
కురు జాంగలముఖ్యేషు రాష్ట్రేషు నగరేషు చ ।
అను త్వమభిషిచ్యస్వ నృపతిం ధర్మవత్సలా ॥ 9
ధర్మవత్సలవైన నీవు కురుజాంగలం మొదలయిన రాష్ట్రాలకు, నగరాలకు భర్తతో కలిసి అభిషిక్తురాలవై పట్టపురాణివి కాగలవు. (9)
పతిభిర్నిర్జితాముర్వీమ్ విక్రమేణ మహాబలైః ।
కురు బ్రాహ్మణసాత్ సర్వామ్ ఆశ్వమేధే మహాక్రతౌ ॥ 10
మహాబలులైన నీభర్తలు పరాక్రమంతో భూమినంతటిని జయిస్తారు. అశ్వమేధయాగంలో ఆ భూమిని నీవు బ్రాహ్మణులకు ఇయ్యి. (10)
పృథివ్యాం యాని రత్నాని గుణవంతి గుణాన్వితే ।
తాన్యాప్నుహి త్వం కళ్యాణి సుఖినీ శరదామ్ శతమ్ ॥ 11
కల్యాణీ! గుణవంతురాలవైన నీవు భూమి మీది విలువైన రత్నాలన్నింటిని పొంది చిరకాలం సుఖాలు అనుభవించు! (11)
యథా చ త్వాభినందామి వధ్వద్య క్షౌమసంవృతామ్ ।
తథా భూయోఽభినందిష్యే జాతపుత్రాం గుణాన్వితామ్ ॥ 12
ద్రౌపదీ! పట్టువస్త్రాలు కట్టిన నిన్ను ఇపుడు అభినందిస్తున్నట్టే నీకు పుత్రులు కల్గినప్పుడు తిర్గి అబినందిస్తాను. (12)
వైశంపాయన ఉవాచ
తతస్తు కృతదారేభ్యః పాండుభ్యః ప్రాహిణోద్ధరిః ।
వైదూర్యమణిచిత్రాణి హైమాన్యాభరణాని చ ॥ 13
వాసాంసి చ మహార్హాణి నానాదేశ్యాని మాధవః ।
కంబలాజినరత్నాని స్పర్శవంతి శుభాని చ ॥ 14
శయనాసనయానాని వివిధాని మహాంతి చ ।
వైదూర్యవజ్రచిత్రాణి శతశో భాజనాని చ ॥ 15
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! వివాహం చేసికొని వచ్చిన పాండవులకు కృష్ణుడు వైడూర్యాలు పొదిగిన ఆభరణాలు, విలువైన వస్త్రాలు, వివిధదేశీయాలైన కంబళీలు, లేడి చర్మాలు, రత్నాలు, తల్పాలు, వాహనాలు, వైడూర్యాలు పొదిగిన పాత్రలు పంపాడు. (13-15)
రూపయౌవనదాక్షిణ్యైః ఉపేతాశ్చ స్వలంకృతాః ।
ప్రేష్యాః సంప్రదదౌ కృష్ణః నానాదేశ్యాః స్వలంకృతాః ॥ 16
రూపయౌవనదాక్షిణ్యాలు గలిగి, చక్కగా అలంకరింపబడిన వేర్వేరు దేశాల దాసీజనాన్ని పాండవులకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. (16)
గజాన్ వినీతాన్ భద్రాంశ్చ సదశ్వాంశ్చ స్వలంకృతాన్ ।
రథాంశ్చ దాంతాన్ సౌవర్ణైః శుభ్రైః పట్టైరలంకృతాన్ ॥ 17
కోటిశశ్చ సువర్ణం చ తేషామకృతకం తదా ।
వీథీకృతమమేయాత్మా ప్రాహిణోన్మధుసూదనః ॥ 18
అప్రమేయుడైన హరి మాటవినే ఏనుగులు, అలంకరింపబడిన గుఱ్ఱాలు, దంతనిర్మితాలైన రథాలు, బంగారు నాణాలు, కోట్ల కొలది స్వర్ణరాశులను బారులు తీర్చి పంపాడు. (17,18)
తత్ సర్వం ప్రతిజగ్రాహ ధర్మరాజో యుధిష్ఠిరః ।
ముదా పరమయా యుక్తః గోవిందప్రియకామ్యయా ॥ 19
ధర్మరాజైన యుధిష్ఠిరుడు మిక్కిలి సంతసించి శ్రీకృష్ణుని సంతోషం కోసం వాటినన్నింటిని స్వీకరించాడు. (19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి అష్టనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 198 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున వైవాహికపర్వమను
ఉపపర్వమున నూటతొంబది ఎనిమిదవ అధ్యాయము. (198)