203. రెండు వందల మూడవ అధ్యాయము

ద్రోణుడు పాండవులను పిలిపించుమనుట, కర్ణుని తిరస్కారము.

ద్రోణ ఉవాచ
మంత్రాయ సముపానీతైః ధృతరాష్ట్ర హితైర్నృప ।
ధర్మ్యమర్థ్యం యశస్యం చ వాచ్యమిత్యనుశుశ్రుమ ॥ 1
ద్రోణుడు అన్నాడు - ధృతరాష్ట్రా! మంత్రాంగానికి పిలచిన వారు హితైషులై ధర్మకరం, అర్థకరం, కీర్తికరం అయిన అంశాలను ప్రతిపాదించాలి. అది మాకు గురుపరంపరచే లభించింది. (1)
మమాప్యేషా మతిస్తాత యా బీష్మస్య మహాత్మనః ।
సంవిభజ్యాస్తు కౌంతేయాః ధర్మ ఏష సనాతనః ॥ 2
దుర్యోధనా! నా అభిప్రాయం భీష్ముని అభిప్రాయంతో సమానం. కుంతీపుత్రులకు అర్ధరాజ్యం ఇవ్వడం సనాతనధర్మం. (2)
ప్రేష్యతాం ద్రుపదాయాశు నరః కశ్చిత్ ప్రియంవదః ।
బహులం రత్నమాదాయ తేషామర్థాయ భారత ॥ 3
భరతశ్రేష్ఠా! ద్రుపదుని దగ్గరకు మాటకారి అయిన దూతను శీఘ్రమే పంపు, ఆ దూత మణులను, రత్నాలను పాండవులకు సమర్పించాలి. (3)
మిథః కృత్యం చ తస్మై స ఆదాయ వసు గచ్ఛతు ।
వృద్ధిం చ పరమాం బ్రూయాత్ త్వత్సంయోగోద్భవాం తథా ॥ 4
సంప్రీయమాణమ్ త్వాం బ్రూయాత్ రాజన్ దుర్యోధనం తథా ।
అసకృత్ ద్రుపదే చైవ ధృష్టద్యుమ్నే చ భారత ॥ 5
ధృతరాష్ట్రుని నుండి ధనాన్ని, కానుకల్ని, గ్రహించి ఆ దూత ద్రౌపదికి ఇవ్వాలి. అతడు ద్రుపద, ధృష్టద్యుమ్నుల ఎదుట మాటిమాటికి వారి బాంధవ్యాన్ని ధృతరాష్ట్ర దుర్యోధనులు తమ వృద్ధిగా భావించారు అని, వారివిషయంలో ప్రసన్నతతో ఉన్నారని తెలపాలి. (4,5)
ఉచితత్వం ప్రియత్వం చ యోగస్యాపి చ వర్ణయేత్ ।
పునఃపునశ్చ కౌంతేయాన్ మాద్రీపుత్రా చ సాంత్వయన్ ॥ 6
అతడు కుంతీపుత్రులను, మాద్రీపుత్రులను ఊరడిస్తూ ఉచితమైన, ప్రియమైన ప్రసంగాలు చెయ్యాలి. (6)
హిరణ్మయాని శుభ్రాణి బహూన్యాభరణాని చ ।
వచనాత్ తవ రాజేంద్ర ద్రౌపద్యాః సంప్రయచ్ఛతు ॥ 7
రాజేంద్ర! మీ ఆజ్ఞగా ద్రౌపదికి సువర్ణాభరణాలు, సుందరాభరణాలు అందించాలి. (7)
తథా ద్రుపదపుత్రాణాం సర్వేషాం భరతర్షభ ।
పాండవానాం చ సర్వేషాం కుంత్యా యుక్తాని యాని చ ॥ 8
భరతకుల శ్రేష్ఠుడా! ద్రుపదుని కుమారులకు, పాండవులకు, కుంతికి ఉపయోగించే ఆభరణాలు విడివిడిగా పంపాలి. (8)
ఏవం సాంత్వసమాయుక్తం ద్రుపదం పాండవైః సహ ।
ఉక్త్వా సోఽనంతరం బ్రూయాత్ తేషామాగమనం ప్రతి ॥ 9
ఈ విధంగా కానుకలిచ్చి పాండవులను, ద్రుపదుని ఊరడించి పాండవుల హస్తినాపురాగమనాన్ని ఆ దూత ప్రస్తావించాలి. (9)
అనుజ్ఞాతేషు వీరేషు బలం గచ్ఛతు శోభనమ్ ।
దుశ్శాసనో వికర్ణశ్చాప్యానేతుం పాండవానిహ ॥ 10
ద్రుపదుని ఆజ్ఞతో పాండవులరాక నిశ్చయమైన పిమ్మట పెద్దసేనతో దుశ్శాసన, వికర్ణులను పాండవులను తీసుకొని వచ్చుటకు పంపాలి. (10)
తతస్తే పాండవాః శ్రేష్ఠాః పూజ్యమానాః సదా త్వయా ।
ప్రకృతీనామనుమతే పదే స్థాస్యంతి పైతృకే ॥ 11
ఇక్కడకు వచ్చినపిమ్మట శ్రేష్ఠులైన పాండవులు నీచే గౌరవసత్కారాన్ని పొందుతూ ప్రజల కోరిక ననుసరించి తండ్రి రాజ్యంపై ప్రతిష్ఠింపబడాలి. (11)
ఏతత్ తవ మహారాజ పుత్రేషు తేషు చైవ హి ।
వృత్తమౌపయికం మన్యే భీష్మేణ సహ భారత ॥ 12
భరతవంశజుడా! నీవు పాండవుల పట్ల, నీ పుత్రుల పట్ల పైన చెప్పినదాన్ని ఆచరించు. ఇది నాకూ, బీష్మునికీ సమ్మతమైన అంశం. (12)
కర్ణ ఉవాచ
యోజితా వర్ధమానాభ్యాం సర్వకార్యేష్వనంతరౌ ।
న మంత్రయేతా తచ్ఛ్రేయః కిమద్భుతతరం తతః ॥ 13
అపుడు కర్ణుడు - మహారాజా! మీరు భీష్మద్రోణులను పనులు పూర్తయిన పిదప ధన, సన్మానాలతో గౌరవించారు. వారు మీ ఆంతరంగికులని భావించారు. వారు, మీకు సరియైన మార్గాన్ని నిర్దేశించనప్పుడు ఇంతకంటె ఆశ్చర్యం ఏముంది. (13)
దుష్టేన మనసా యో వై ప్రచ్ఛన్నేనాంతరాత్మనా ।
బ్రూయాన్నిశ్శ్రేయసం నామ కథం కుర్యాత్ సతాం మతమ్ ॥ 14
దుష్టసంకల్పంతో, దోషహృదయంతో హితవును నమ్మపలికిన వారిని ఎలా విశ్వసించాలి? వారిని నమ్మినవారికి ఎలా శుభం కలుగుతుంది? (14)
న మిత్రాణ్యర్థకృచ్ఛ్రేషు శ్రేయసే చేతరాయ వా ।
విధిపూర్వం హి సర్వస్య దుఃఖం వా యది వా సుఖమ్ ॥ 15
కష్టం కలిగినప్పుడు, ధనసంకటాల యందు, మిత్రులు శుభాన్ని ఉపదేశించకపోతే ఆ రాజులకు భాగ్యానుసారం సుఖదుఃఖాలు కలుగుతాయి. (15)
కృతప్రజ్ఞోఽకృతప్రజ్ఞః బాలో వృద్ధశ్చ మానవః ।
ససహాయోఽసహాయశ్చ సర్వం సర్వత్ర విందతి ॥ 16
మానవుడు మూర్ఖుడైనా, బుద్ధిమంతుడైనా; బాలుడైనా, వృద్ధుడైనా, సహాయకులు ఉన్నా లేకున్నా దైవయోగం వల్లనే అన్ని ప్రదేశాల్లోను అన్నిటిని పొందుతాడు. (16)
శ్రూయతే హి పురా కశ్చిత్ అంబువీచ ఇతీశ్వరః ।
ఆసీత్ రాజగృహే రాజా మాగధానాం మహీక్షితామ్ ॥ 17
పూర్వకాలంలో అంబువీచుడు అనే ప్రసిద్ధి గలరాజు మగధవంశీయుడు రాజ్యపరిపాలన చేశాడు. (17)
స హీనః కరణైః సర్వైః ఉచ్ఛ్వాసపరమో నృపః ।
అమాత్యసంస్థః సర్వేషు కార్యేష్వేవాభవత్ తదా ॥ 18
అతడు శ్వాసరోగపీడితుడై, ఇంద్రియబలం లేక మంత్రుల అధీనంలో ఉండి కార్యాలను నడిపించాడు. (18)
తస్యామాత్యో మహాకర్ణిః బభూవైకేశ్వరస్తదా ।
స లబ్ధబలమాత్మానం మన్యమానోఽవమన్యతే ॥ 19
అతని మంత్రి పేరు మహాకర్ణి. అతడే రాజై సైనికబలాన్ని కూడదీసికొని రాజును అవహేళన చేయసాగాడు. (19)
స రాజ్ఞ ఉపభోగ్యాని స్త్రియో రత్నధనాని చ ।
ఆదదే సర్వశో మూఢః ఐశ్వర్యం చ స్వయం తదా ॥ 20
మహాకర్ణి రాజనుభవింపతగిన స్త్రీ, రత్నధనాల్ని మూఢుడై స్వయంగా అనుభవించసాగాడు. (20)
తదాదాయ చ లుబ్ధస్య లోభాల్లోభోఽప్యవర్ధత ।
తథా హి సర్వమాదాయ రాజ్యమస్య జిహీర్షతి ॥ 20
ఆ లోభి దుర్గుణాలు రోజురోజుకు పెరిగాయి. సమస్త వస్తువులను అపహరించి రాజ్యాన్ని అపహరించకోరాడు. (21)
హీనస్య కరణైః సర్వైఃఉచ్ఛ్వాసపరమస్య చ ।
యతమానోఽపి తద్రాజ్యం న శశాకేతి నః శ్రుతమ్ ॥ 22
శ్వాసరోగపీడితుడైన అతని రాజ్యాన్ని, ఇంద్రియబలం లేని కారణంగా అపహరించాలని ప్రయత్నించినా ఆ మహాకర్ణి అపహరించలేకపోయాడన్నది మనకు తెలిసిందే. (22)
కిమన్యత్ విహితా నూనం తస్య సా పురుషేంద్రతా ।
యది తే విహితం రాజ్యం భవిష్యతి విశాంపతే ॥ 23
మిషతః సర్వలోకస్య స్థాస్యతే త్వయి తద్ ధ్రువమ్ ।
అతోఽన్యథా చేద్ విహితం యతమానో న లప్స్యసే ॥ 24
రాజు అదృష్టం చేత రక్షింపబడ్డాడు. భాగ్యం కంటె వేరు సహాయం లేదు. అదృష్టం నీదైతే రాజ్యం వృద్ధిని పొంది నీ అదుపులో ఉంటుంది. తారుమారైతే ప్రయత్నించినా నీ అధీనంలో ఉండదు. (23,24)
ఏవం విద్వన్నుపాదత్స్వ మంత్రిణాం సాధ్యసాధుతామ్ ।
దృష్టానాం చైవ బోద్ధవ్యమ్ అదుష్టానాం చ భాషితమ్ ॥ 25
రాజా! మీరు మీ మాటలను విని మీ మంత్రుల మంచి, చెడులను తెలుసుకోండి. దోషులను, నిర్దోషులను వారి మాటలచే గుర్తించాలి. (25)
ద్రోణ ఉవాచ
విద్మ తే భావదోషేణ యదర్థమిదముచ్యతే ।
దుష్ట పాండవహేతోస్త్వం దోషమాఖ్యాపయస్యుత ॥ 26
ద్రోణుడు అన్నాడు - దుష్టుడా! నీవు ఎందుకు ఇట్లా మాట్లాడావో మాకు తెలుసు. పాండవుల మీది ద్వేషంతో ప్రేరితుడవై నా మాటలలో లేని దోషం కల్పించావు. (26)
హితం తు పరమం కర్ణ బ్రవీమి కులవర్ధనమ్ ।
అథ త్వం మన్యసే దుష్టం బ్రూహి యత్ పరమం హితమ్ ॥ 27
కర్ణా! నేను నా తెలివిని ఉపయోగించి కౌరవుల వృద్ధిని కోరి హితం ఉపదేశించాను. ఇది నీవు తప్పని అనుకొంటే కౌరవులకు దేని వలన హితం కలుగుతుందో దానిని ఉపదేశించు. (27)
అతోఽన్యథా చేత్ క్రియత్ యద్ బ్రవీమి పరమం హితమ్ ।
కురవో వై వినంక్ష్యంతి న చిరేణైవ మే మతిః ॥ 28
నేను ఆలోచించి హితాన్ని చెప్పాను. దీనికి భిన్నంగా ఆచరిస్తే కౌరవులు శీఘ్రంగా నాశనం పొందుతారని నా నమ్మకం. (28)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి
ద్రోణవాక్యే త్ర్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 203 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమనరాజ్యలంభపర్వమను
ఉపపర్వమున ద్రోణవాక్యము అను రెండు వందల మూడవ అధ్యాయము. (203)