211. రెండువందల పదికొండవ అధ్యాయము

సుందోపసుందుల మరణము; ద్రపది పట్ల పాండవుల నియమము.

నారద ఉవాచ
జిత్వా తు పృథివీం దైత్యౌ నిఃసపత్నౌ గతవ్యథౌ ।
కృత్వా త్రైలోక్యమవ్యగ్రం కృతకృత్యౌ బభూవతుః ॥ 1
నారదుడు అన్నాడు - యుధిష్ఠిరా! సుందోపసుందు - లిరువురు భూమండలాన్ని అంతటిని జయించి శత్రువులు, పీడలు లేనివారై ముల్లోకాలను వశపరచుకొని కృతకృత్యత పొందారు. (1)
దేవగంధర్వయక్షాణాం నాగపార్థివరక్షసామ్ ।
ఆదాయ సర్వరత్నాని పరాం తుష్టిముపాగతౌ ॥ 2
దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు, మానవుల నుంచి రత్నాల నపహరించి మిక్కిలి సంతుష్టి చెందారు. (2)
యదా న ప్రతిషేద్ధారః తయోః సంతీహ కేచన ।
నిరుద్యోగౌ తథా భూత్వా విజహ్రాతేఽమరావివ ॥ 3
ముల్లోకాల్లోను వారిని ఎదుర్కొనేవారు లేని కారణంగా వారు దేవతల వలె కర్మలు విడచి భోగలాలసులు అయ్యారు. (3)
స్త్రీభిర్మాల్యైశ్చ గంధైశ్చ భక్ష్యభోజ్యైః సుపుష్కలైః ।
పానైశ్చ వివిధైర్హృద్యైః పరాం ప్రీతిమవాపతుః ॥ 4
సుందరస్త్రీలు, మృదుమాలలు, భక్ష్యాలు, భోజ్యాలు, సుగంధద్రవ్యాలు, హృద్యాలైన పానాలతో మిక్కిలి ప్రీతిని అనుభవించారు. (4)
అంతఃపురనోద్యానే పర్వతేషు వనేషు చ ।
యథేప్సితేషు దేశేషు విజహ్రాతేఽ మరావివ ॥ 5
అంతఃపురాలలోని వనాలు, ఉద్యానాలు, పర్వతాలు మొదలైన మనసుకు నచ్చిన ప్రదేశాలలో దేవతల వలె విహరించారు. (5)
తతః కదాచిత్ వింధ్యస్య ప్రస్థే సమశిలాతలే ।
పుష్పితాగ్రేషు శాలేషు విహారమభిజగ్ముతుః ॥ 6
పిమ్మట ఒకనాడు సమతలమైన వింధ్యపర్వతశిఖరాన పుష్పించిన శాలవృక్షశోభగల ప్రదేశాలకు విహారం కోసం వెళ్ళారు. (6)
దివ్యేషు సర్వకామేషు సమానీతేషు తావుభౌ ।
వరాసనేషు సంహృష్టౌ సహస్త్రీభిర్నిషీదతుః ॥ 7
వారిరువురు దివ్యసర్వభోగాలు సమకూర్చగా శ్రేష్ఠాసనాలపై స్త్రీలతో కలిసి కూర్చుని ఆనందంలో మునిగారు. (7)
తతో వాదిత్రనృత్యాభ్యామ్ ఉపాతిష్ఠమ్త తౌ స్త్రియః ।
గీతైశ్చ స్తుతిసంయుక్తైః ప్రీత్యా సముపజగ్మిరే ॥ 8
చాలా మంది స్త్రీలు వారివద్దకు వచ్చి నృత్యవాద్యాలతో, స్తుతిపాఠాలతో వారిని ఆనందపెట్టారు. (8)
తతస్తిలోత్తమా తత్ర వనే పుష్పాణి చిన్వతీ ।
వేశం సాఽఽక్షిప్తమాధాయ రక్తేనైకేన వాససా ॥ 9
అదేసమయాన తిలోత్తమ ఒకే ఒక ఎఱ్ఱటి వస్త్రం ధరించి పూలు కోస్తూ వారిని ఉన్మత్తులను చేసింది. (9)
నదీతీరేషు జాతాన్ సా కర్ణికారాన్ ప్రచిన్వతీ ।
శనైర్జగామ తం దేశం యత్రాస్తాం తౌ మహాసురౌ ॥ 10
నదీ తీరాలలోని కర్ణికార పుష్పాలను కోస్తూ రాక్షసులు ఇరువురూ ఉన్న ఆ ప్రదేశానికి వచ్చింది. (10)
తౌ తు పీత్వా వరం పానమ్ మదరక్తాంతలోచనౌ ।
దృష్ట్వైవ తాం వరారోహామ్ వ్యధితౌ సంబభూవతుః ॥ 11
వారిరువురు మధుసేవ చేశారు. వారి కన్నులు మదంతో ఎఱ్ఱబడ్డాయి. అందమైన తిలోత్తమను చూచి వ్యథను పొందసాగారు. (11)
తావుత్థాయాసనం హిత్వా జగ్మతుర్యత్ర సా స్థితా ।
ఉభౌ చ కామసమ్మత్తౌ ఉభౌ ప్రార్థయతశ్చ తామ్ ॥ 12
వారు వారి ఆసనాల్ని విడచి ఆమె ఉన్న ప్రదేశానికి చేరారు. ప్రమత్తులై ఇరువురూ ఆమెను కోరారు. (12)
దక్షిణే తాం కరే సుభ్రూం సుందో జగ్రాహ ।
పాణినా ఉపసుందోఽపి జగ్రాహ వామే పాణౌ తిలోత్తమామ్ ॥ 13
సుందరమైన కనుబొమలు గల ఆమె కుడిచేతిని సుందుడు పట్టుకొన్నాడు. ఉపసుందుడు ఆమె ఎడమచేతిని గ్రహించాడు. (13)
వరప్రదానమత్తౌ తావౌరసేన బలేన చ ।
ధనరత్నమదాభ్యాం చ సురాపానమదేన చ ॥ 14
వారు ఇరువురు మొదట వరగర్వితులు, తరువాత బలసంపన్నులు. ఆపై ధన, రత్న, సురాపాన మత్తులై ఉన్నారు. (14)
సర్వైరేతైర్మదైర్మత్తౌ అన్యోన్యభ్రుకుటీకృతౌ ।
(తౌ కటాక్షేణ దైత్యేంద్రావాకర్షతి ముహుర్ముహుః ।
దక్షిణేన కటాక్షేణ సుందం జగ్రాహ కామినీ ॥
వామేనైవ కటాక్షేణ ఉపసుందం జిఘృక్షతీ ।
గంధాభరణరూపైస్తౌ వ్యామోహం జగ్మతుస్తదా ॥)
మదకామసమావిష్టౌ పరస్పరమథోచతుః ॥ 15
మదగర్వితులైన సుందోపసుందులు ఒకరిపై ఒకరు కళ్ళు ఎఱ్ఱజేశారు. ఆరాక్షసులను మాటిమాటికి తిలోత్తమ ఆకర్షించింది. కుడిక్రీగంటి చూపుతో సుందుని, ఎడమక్రీగంటి చూపుతో ఉపసుందుని వశపరచుకుంది. ఆమె గంధ, ఆభరణ, రూపాలతో వ్యామోహం చెంది వారిరువురు మద, కామాలతో పీడితులై ఒకరితో ఒకరు ఇలా పలికారు. (15)
మమ భార్యా తవ గురుః ఇతి సుందోఽభ్యభాషత ।
మమ భార్యా తవ వధూః ఉపసుందోఽభ్యభాషత ॥ 16
సుందుడు ఉపసుందునితో "ఈమె నాభార్య నీకు తల్లితో సమానం" అన్నాడు. ఉపసుందుడు సుందునితో "ఈమె నాభార్య నీకు కోడలితో సమానం" అన్నాడు. (16)
నైషా తవ మమైవేతి తతస్తౌ మన్యురావిశత్ ।
తస్యా రూపేణ సమ్మత్తౌ విగతస్నేహ సౌహృదౌ ॥ 17
ఈమె నీది కాదు, నాది అని పలుకుతున్న వారిలో క్రోధం పెరిగింది. తిలోత్తమ సౌందర్యంతో మోహితులైన వారిలో స్నేహం, సౌహార్దం నశించాయి. (17)
తస్యా హేతోర్గదే భీమే సంగృహ్ణీతావుభౌ తదా ।
ప్రగృహ్య చ గదే భీమే తస్యాంతౌ కామమోహితౌ ॥ 18
ఆమెను పొందాలనే సంకల్పంతో ఇరువురూ భయంకర గదలు చేతుల్లోకి తీసుకొన్నారు. వారిద్దరు ఆమె విషయంలో కామమోహితులు అయ్యారు. (18)
అహం పూర్వమహంపూర్వమ్ ఇత్యన్యోన్యం నిజఘ్నతుః ।
తౌ గదాభిహతౌ భీమౌ పేతతుర్ధరణీతలే ॥ 19
అమెను పొందటంలో నేను ముందంటే, నేను ముందని పలుకుతూ పరస్పరం గదలతో మొదుకొన్నారు. గదాఘాతాలతో వారు ఇద్దరు భూమిపై పడ్డారు. (19)
రుధిరేణావసిక్తాంగౌ ద్వావివార్కౌ నభశ్చ్యుతౌ ।
తతస్తా విద్రుతా నార్యః స చ దైత్యగణస్తథా ॥ 20
పాతాలమగమత్ సర్వః విషాదభయకంపితః ।
తతః పితామహస్త్రత సహ దేవైర్మహర్షిభిః ॥ 21
ఆజగామ విశుద్ధాత్మా పూజయంశ్చ తిలోత్తమామ్ ।
వరేణ చ్ఛందయామాస భగవాన్ ప్రపితామహః ॥ 22
వారి సర్వాంగాలు రక్తసిక్తాలయ్యాయి. ఆకాశం నుంచి జారిన ఇద్దరు సూర్యులవలె ప్రకాశించారు. వారు మరణించాక స్త్రీలు, రాక్షసులు భయపడి విషాదంలో మునిగి పాతాళంలో చొరబడ్డారు. విశుద్ధమైన అంతరాత్మతో భగవంతుడైన బ్రహ్మ దేవతలతో, ఋషులతో కలిసి తిలోత్తమను ప్రశంసించాడు. వరమివ్వటానికి కూడా సంసిద్ధత వ్యక్తమ్ చేశాడు. (20-22)
వరం దిత్సుః స తత్రైనాం ప్రీతః పాహ పితామహః ।
ఆదిత్యచరితాంల్లోకాన్ విచరిష్యసి భామిని ॥ 23
తేజసా చ సుదృష్టాం స్వామ్ న కరిష్యతి కశ్చన ।
ఏవం తస్యై వరం దత్త్వా సర్వలోకపితామహః ॥ 24
ఇంద్రే త్రైలోక్యమాధాయ బ్రహ్మలోకం గతః ప్రభుః ।
వరం ఇవ్వాలని ప్రసన్నుడై బ్రహ్మ ఆమెతో పలికాడు. "తిలోత్తమా! ఎక్కడి వరకు సూర్యుడు సంచరిస్తాడో అకక్డి వరకు నీవు సంచరిస్తావు. నీ తేజం ఇతరులు చూడలేరు." ఇట్లు తిలోత్తమకు వరాన్ని ఇచ్చి త్రిలోకరాజ్యం ఇంద్రునిపై ఉంచి తనలోకానికి వెళ్ళాడు. (23-24 1/2)
నారద ఉవాచ
ఏవం తౌ సహితౌ భూత్వా సర్వార్థేష్వేకనిశ్చయౌ ॥ 25
తిలోత్తమార్థం సంక్రుద్ధావన్యోన్యమభిజగ్ముతుః ।
తస్మాద్ బ్రవీతి వః స్నేహాత్ సర్వాన్ భరతసత్తమాః ॥ 26
యథా వో నాత్ర భేదః స్యాత్ సర్వేషాం ద్రౌపదీకృతే ।
తథా కురుత భద్రం వో మమ చేత్ ప్రియమిచ్ఛథ ॥ 27
నారదుడు అన్నాడు - ఈ విధంగా అన్నివిషయాల్లో కలిసి ఉన్నా, ఒకే నిశ్చయం గలవారిరువురు కోపించి ఒకరినొకరు తిలోత్తమ కారణంగా చంపుకున్నారు. భరతశ్రేష్ఠులారా! మీ అందరిపై ప్రేమతో ఆదేశిస్తాను. మీలో మీకు భేదం లేకుండ నియమాలు నిర్ణయించాలి. ద్రౌపది కారణంగా మీరు మరణించకూడదు. మీకు శుభమగుగాక! (25-27)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తా మహాత్మానః నారదేన మహర్షిణా ।
సమయం చక్రిరే రాజన్ తేఽన్యోన్యవశమాగతాః ।
సమక్షం తస్య దేవర్షేః నారదస్యామితౌజసః ॥ 28
(ఏకైకస్య గృహే కృష్టా వసేద్ వర్షమకల్మషా ।)
ద్రౌపద్యా నః సహాసీనానన్యోన్యం యోఽభిదర్శయేత్ ।
స నో ద్వాదశ వర్షాణి బ్రహ్మచారీ వనే వసేత్ ॥ 29
మన అయిదుగురి భవనాల్లో పాపం లేని ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం నివసించాలి. ఏకాంతంలో ద్రౌపదితో కలిసి ఉన్న వానిని వేరొక సోదరుడు చూస్తే అతడు పండ్రెండు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. (29)
కృతే తు సమయే తస్మిన్ పాండవైర్ధర్మచారిభిః ।
నారదోఽప్యగమత్ ప్రీతః ఇష్టం దేశం మహామునిః ॥ 30
ధర్మచారులు, పాండవులు ఈ నిర్ణయం ప్రకటించిన పిమ్మట నారదుడు స్వేచ్ఛగా తాను కోరిన చోటికి వెళ్ళాడు. (30)
ఏవం తైః సమయః పూర్వం కృతో నారదచోదితైః ।
న చాభిద్యంత తే సర్వే తదాన్యోన్యేన భారత ॥ 31
భారత! నారదప్రేరణచే పాండవులు ఈ నియమం పాటించారు. కావున వారిలో వారికి విరోధం కలుగలేదు. (31)
(ఏతద్ విస్తరశః సర్వమాఖ్యాతం తే నరేశ్వర ।
కాలే చ తస్మిన్ సంపన్నం యథావజ్జనమేజయ ॥)
జనమేజయా! ఆ సమయాన జరిగిన వృత్తాంతం పూర్తిగా, జరిగింది జరిగినట్లుగా నీకు తెలుపబడింది.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలంభపర్వణి సుందోపసుందోపాఖ్యానే ఏకాదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 211 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వమను
ఉపపర్వమున సుందోపసుందో పాఖ్యానమను రెండువందల పదునొకండవ అధ్యాయము. (211)
(దాక్షిణాత్య అధికపాఠము 3 1/2 శ్లోకాలు కలిపి మొత్తం 34 1/2 శ్లోకాలు)