224. రెండువందల ఇరువది నాలుగవ అధ్యాయము

అగ్ని శ్రీకృష్ణార్జునులకు ఆయుధము లిచ్చుట, ఖాండవ దహనము చేయుట.

వైశంపాయన ఉవాచ
ఏవముక్తః స భగవాన్ ధూమకేతుర్హుతాశనః ।
చింతయామాస వరుణం లోకపాలం దిదృక్షయా ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - అర్జునుని మాటలు విన్న అగ్ని లోకపాలకుడైన వరుణుని చూడాలని ధ్యానించాడు. (1)
ఆదిత్యముదకే దేవం నివసంతం జలేశ్వరమ్ ।
స చ తచ్చింతితం జ్ఞాత్వా దర్శయామాస పావకమ్ ॥ 2
అదితికుమారుడు, జలంలో నివసించేవాడు, జలస్వామి అయిన వరుణుడు తనను అగ్ని ధ్యానించాడని తెలిసి ప్రత్యక్షమయ్యాడు. (2)
తమబ్రవీద్ ధూమకేతుః ప్రతిగృహ్య జలేశ్వరమ్ ।
చతుర్థం లోకపాలానాం దేవదేవం సనాతనమ్ ॥ 3
నలుగురు లోకపాలురలో సనాతనుడూ, జలేశ్వరుడూ అయిన వరుణుని చూచి అగ్ని అతనితో ఇలా అన్నాడు. (3)
సోమేన రాజ్ఞా యద్ దత్తం ధనుశ్చైవేషుధీ చ తే ।
తత్ ప్రయచ్ఛోభయం శీఘ్రం రథం చ కపిలక్షణమ్ ॥ 4
వరుణదేవా! రాజైన సోముడు మీకిచ్చిన ధనుస్సును, అక్షయతూణీరాన్ని, కపిధ్వజంతో ప్రకాశిమ్చే రథాన్ని నాకోసం అర్పించండి. (4)
కార్యం చ సుమహత్ పార్థః గాండీవేన కరిష్యతి ।
చక్రేణ వాసుదేవశ్చ తన్మమాద్య ప్రదీయతామ్ ॥ 5
ఈ పార్థుడు ఆ గాండీవంతో గొప్పసాధనకు పూనుకొన్నాడు. వాసుదేవుడు చక్రంతో నాకు సహాయపడాలి. కావున ఆ రెండింటిని నాకు ఇమ్ము. (5)
దదానీత్యేవ వరుణః పావకం ప్రత్యభాషత ।
తదద్భుతం మహావీర్యం యశఃకీర్తివివర్ధనమ్ ॥ 6
సర్వశస్త్రైరనాధృష్యం సర్వశస్త్రప్రమాథి చ ।
సర్వాయుధమహామాత్రం పరసైన్యప్రధర్షణమ్ ॥ 7
ఏకం శతసహస్రేణ సమ్మితం రాష్ట్రవర్ధనమ్ ।
చిత్రముచ్చావచైర్వర్ణైః శోభితం శ్లక్ష్ణమవ్రణమ్ ॥ 8
దేవదానవగంధర్వైః పూజితం శాశ్వతీః సమాః ।
ప్రాదాచ్చైవ ధనూరత్నమ్ అక్షయ్యే చ మహేషుధీ ॥ 9
అప్పుడు వరుణుడు "ఇప్పుడే ఇస్తున్నాను" అని అగ్నితో అన్నాడు. అద్భుతమైన కీర్తిని పెంచే గాండీవాన్ని, అక్షయతూణీరాన్ని ఇచ్చాడు. ఇతరుల శస్త్రాస్త్రాలకు నశించదు. సర్వశస్త్రాస్త్రాల్ని నశింపచేస్తుంది గాండీవం. ప్రమాణంలో మిగతా ధనుస్సుల కంటె పెద్దది. పదివేల ధనుస్సుల పెట్టు. అది ధరించిన వారి దేశాన్ని వృద్ధి చేస్తుంది. చిత్రవిచిత్రవర్ణాలతో ప్రకాశిస్తూ ఛిద్రాలు లేనిది. అనేకవేల సంవత్సరాలు దేవ, దానవ, గంధర్వ గణాలచే పూజింపబడింది. ఆ ధనుస్సును, అక్షయతూణీరాల్ని అగ్నికి ఇచ్చాడు. (6-9)
రథం చ దివ్యాశ్వయుజం కపిప్రవరకేతనమ్ ।
ఉపేతం రాజతైరశ్వైః గాంధర్వైర్హేమమాలిభిః ॥ 10
దివ్యాశ్వాలు పూన్చి కపిరాజు జెండాపై గల రథాన్ని సమర్పించాడు. ఆ గుఱ్ఱాలు శ్వేతవర్ణం కలవి. గంధర్వదేశంలో పుట్టి బంగారు మాలలు ధరించాయి. (10)
పాండురాభ్రప్రతీకాశైః మనోవాయుసమైర్జవే ।
సర్వోపకరణైర్యుక్తమ్ అజయ్యం దేవదానవైః ॥ 11
ఆ గుఱ్ఱాల కాంతి తెల్లని మేఘాల రంగువలె ఉంది. మనోవాయువేగాలు కలది. ఈ రథం ఆవశ్యకాలైన యుద్ధ సామగ్రితో నిండి దేవదానవులకు అజేయమై ఉంది. (11)
భానుమంతం మహాఘోషం సర్వరత్నమనోరమమ్ ।
ససర్జ యం సుతపసా భౌమనో భువనప్రభుః ॥ 12
ప్రజాపతిరనిర్దేశ్యం యస్య రూపం రవేరివ ।
యం స్మ సోమః సమారుహ్య దానవానజయత్ ప్రభుః ॥ 13
ఆ రథం తేజోమయకిరణాల్ని ప్రసరింపజేస్తోంది. గొప్ప ధ్వనికలిగింది. రత్నాలు పొదిగి మనోహరంగా ఉంది. తపస్సుచే విశ్వకర్మ ఆ ధనుస్సును నిర్మించాడు. దానిరూపం ఇది అని వర్ణించటం చాలా కష్టం. పూర్వకాలం చంద్రుడు ఈ రథాన్నే అధిరోహించి దానవులను జయించాడు. (12,13)
నవమేఘప్రతీకాశం జ్వలంతమివ చ శ్రియా ।
ఆశ్రితౌ తం రథశ్రేష్ఠం శక్రాయుధసమావుభౌ ॥ 14
నూతన మేఘం వలె ఆ రథం ప్రకాశిస్తోంది. దివ్యశోభలతో వెలిగిపోతోంది. ఆ శ్రేష్ఠరథాన్ని ఇంద్రధనుస్సువలె ప్రకాశించే కృష్ణార్జునులు సమీపించారు. (14)
తాపనీయా సురుచిరా ధ్వజయష్ఠిరనుత్తమా ।
తస్యాం తు వానరో దివ్యః సింహశార్దూలకేతనః ॥ 15
ఆ రథంధ్వజదండం సుందరమైంది. సువర్ణనిర్మితమైంది. దానిపై సింహ, శార్దూల సమానాకారం గల వానరుడొకడు కూర్చుని ఉన్నాడు. (15)
దిధక్షన్నివ తత్ర స్మ సంస్థితో మూర్ధ్న్యశోభత ।
ధ్వజే భూతాని తత్రాసన్ వివిధాని మహాంతి చ ॥ 16
నాదేన రిపుసైన్యానామ్ యేషాం సంజ్ఞా ప్రణశ్యతి ।
ఆ రథశిఖరంపై గల వానరుడు శత్రునాశనానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఉన్నాడు. ఆ ధ్వజంపై వివిధాలైన భయంకర జంతువులున్నాయి. వాటినాదం వింటే శత్రుసైనికుల ప్రాణాలు పై నుంచి పైకే ఎగిరిపోతాయి. (16 1/2)
స తం నానాపతాకాభిః శోభితం రథసత్తమమ్ ॥ 17
ప్రదక్షిణముపావృత్య దైవతేభ్యః ప్రణమ్య చ ।
సంనద్ధః కవచీ ఖడ్గీ బద్ధగోధాంగుళిత్రకః ॥ 18
ఆరురోహ తదా పార్థః విమానం సుకృతీ యథా ।
ఆ రథం వివిధపతాకలతో ప్రకాశిస్తోంది. దానికి ప్రదక్షిణం చేసి దేవతలకు నమస్కరించి, కవచం, ఖడ్గం, వ్రేళ్ళకు తొడుగులు దాల్చి పుణ్యాత్ముడైన అర్జునుడు దివ్యవిమానం అదిరోహించినట్లు రథాన్ని అధిరోహించాడు. (17-18 1/2)
తచ్చ దివ్యం ధనుఃశ్రేష్ఠం బ్రహ్మణా నిర్మితం పురా ॥ 19
గాండీవముపసంగృహ్య బభూవ ముదితోఽర్జునః ।
హుతాశనం పురస్కృత్య తతస్తదపి వీర్యవాన్ ॥ 20
జగ్రాహ బలమాస్థాయ జ్యయా చ యుయుజే ధనుః ।
మౌర్వ్యాం తు యోజ్యమానాయాం బలినా పాండవేణ హ ॥ 21
యేఽశృణ్వన్ కూజితం తత్ర తేషాం వై వ్యథితం మనః ।
పూర్వం బ్రహ్మ నిర్మించిన ఆ శ్రేష్ఠమైన గాండీవాన్ని పొంది అర్జునుడు సంతోషించాడు. అగ్నిదేవుని ఎదుట పరాక్రమవంతుడైన అర్జునుడు ఆ ధనుస్సుకు నారి బిగించాడు. ఆ సమయంలో ఉత్పన్నమైన ధ్వని విన్న ప్రాణుల మనస్సు ఒక్కసారిగా వ్యాకులమైపోతుంది. (19- 21 1/2)
లబ్ధ్వా రథం ధనుశ్చైవ తథాక్షయ్యే మహేషుధీ ॥ 22
బభూవ కల్యః కౌంతేయః ప్రహృష్టః సాహ్యకర్మణి ।
వజ్రనాభం తతశ్చక్రం దదౌ కృష్ణాయ పావకః ॥ 23
ఆ దివ్యరథాన్ని, అక్షయతూణీరాన్ని, గాండీవాన్ని పొందిన అర్జునుడు ప్రసన్నుడై అగ్నికి సహాయం చేయటానికి సమర్థుడు అయ్యాడు. అగ్నిదేవుడు ఇంతలో వజ్రంతో సమానమైన మధ్యబలం (నాభి) గల చక్రాన్ని శ్రీకృష్ణునికి ఇచ్చాడు. (22,23)
ఆగ్నేయమస్త్రం దయితం చ స కల్యోఽభవత్ తదా ।
అబ్రవీత్ పావకశ్చైవమ్ ఏతేన మధుసూదన ॥ 24
అమానుషానపి రణే జేష్యసి త్వమసంశయమ్ ।
అనేన తు మనుష్యాణాం దేవానామపి చాహనే ॥ 25
రక్షఃపిశాచదైత్యానాం నాగానాం చాధికస్తథా ।
భవిష్యసి న సందేహః ప్రవరోఽపి నిబర్హణే ॥ 26
అగ్నిదత్తమూ, ప్రియమూ అయిన చక్రాన్ని పొంది సహాయపడటానికి శ్రీకృష్ణుడు సమర్థుడు అయ్యాడు. శ్రీకృష్ణునితో అగ్నిదేవుడు అన్నాడు-అమానుషులైన రాక్షసులు, పిశాచాలు, నాగులు, దైత్యులు, దేవతలను కూడ యుద్ధంలో నీవు గెలుస్తావు. వీరందరినీ సంహరించి సర్వశ్రేష్ఠుడవు అవుతావు. (24-26)
క్షిప్తం క్షిప్తం రణే చైతత్ త్వయా మాధవ శత్రుషు ।
హత్వా ప్రతిహతం సంఖ్యే పాణిమేష్యతి తే పునః ॥ 27
మాధవా! యుద్ధంలో శత్రువులపై నీవు విసిరినప్పుడల్లా శత్రువులను చంపి ఈ చక్రం తిరిగి నీచేతికి చేరుతుంది. (27)
వరుణశ్చ దదౌ తస్మై గదామశనినిఃస్వనామ్ ।
దైత్యాంతకరణిం ఘోరాం నామ్నా కౌమోదకీం ప్రభుః ॥ 28
పిడుగువలె ధ్వనిస్తూ శత్రునాశనం చేసే కౌమోదకి అనే పేరు గల గదను కూడ వరుణుడు శ్రీకృష్ణునికి ఇచ్చాడు. (28)
తతః పావకమబ్రూతాం ప్రహృష్టావర్జునాచ్యుతౌ ।
కృతాస్త్రౌ శస్త్రసంపన్నౌ రథినౌ ధ్వజినావపి ॥ 29
కల్యౌ స్వో భగవన్ యోద్ధుమ్ అపి సర్వైః సురాసురైః ।
కిం పునర్వజ్రిణైకేన పన్నగార్థే యుయుత్సతా ॥ 30
మిక్కిలి సంతుష్టులైన కృష్ణార్జునులు శస్త్రాస్త్రాలు, రథం, కేతనం కలిగి సురాసురులందరితో పోరాడగల సమర్థులు అయ్యారు. ఇక పన్నగాలకై యుద్ధం చేసే వజ్రాయుధునితో ఎందుకు యుద్ధం చెయ్యలేరు? (29,30)
అర్జున ఉవాచ
చక్రపాణిర్హృషికేశః విచరన్ యుధి వీర్యవాన్ ।
చక్రేణ భస్మసాత్ సర్వం విసృష్టేన తు వీర్యవాన్ ।
త్రిషు లోకేషు తన్నాస్తి యన్నకుర్యాజ్జనార్దనః ॥ 31
అర్జునుడు పలికాడు - అగ్నిదేవా! అందరి ఇంద్రియాలను ప్రేరేపించగల ఈ జనార్దనుడు చక్రాన్ని తీసుకొని యుద్ధం చేస్తే ముల్లోకాల్లోను భస్మం కాని వస్తు వనేదే ఉండదు. (31)
గాండీవం ధనురాదాయ తథాక్షయ్యే మహేషుధీ ।
అహమప్యుత్సహే లోకాన్ విజేతుం యుధి పావక ॥ 32
అగ్నిదేవా! గాండీవాన్ని, రెండు అక్షయతూణీరాలనూ తీసికొని నేను కూడ అన్నిలోకాలను యుద్ధంలో గెలవాలనే ఉత్సాహంలో ఉన్నాను. (32)
సర్వతః పరివార్యైవం దావమేతం మహాప్రభో ।
కామం సంప్రజ్వలాద్వైవ కల్యౌ స్వః సాహ్యకర్మని ॥ 33
మహాత్మా! మీరిప్పుడు ఈ వనాన్ని నాలుగు వైపుల నుంచి దహించండి. మేమిద్దరం మీకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాం. (33)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః స భగవాన్ దాశార్హేణార్జునేన చ ।
తైజసం రూపమాస్థాయ దావం దగ్ధుం ప్రచక్రమే ॥ 34
వైశంపాయనుడు చెపుతున్నాడు. శ్రీకృష్ణార్జునుల పలుకులు విని అగ్నిదేవుడు తేజోరూపాన్ని స్వీకరించి ఖాండవదహనానికి పూనుకొన్నాడు. (34)
సర్వతః పరివార్యాథ సప్తార్చిర్జ్వలనస్తథా ।
దదాహ ఖాండవం దావం యుగాంతమివ దర్శయన్ ॥ 35
ఏడుజ్వాలలు గల అగ్ని ఖాండవవనాన్ని అన్నివైపుల నుంచి యుగాంతమని భ్రమింపచేస్తూ దహిస్తున్నాడు. (35)
ప్రతిగృహ్య సమావిశ్య తద్ వనం భరతర్షభ ।
మేఘస్తనితనిర్ఘోషః సర్వభూతాన్యకంపయత్ ॥ 36
అగ్నిదేవుడు ఆ వనాన్ని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి లోపల బాగా వ్యాపించి మేఘ గర్జనతో సమంగా ప్రాణులన్నిటిని కంపింపచేశాడు. (36)
దహ్యతస్తస్య చ బభౌ రూపం దావస్య భారత ।
మేరోరివ నగేంద్రస్య కీర్ణస్యాంశుమతోఽంశుభిః ॥ 37
అగ్నిచే దహింపబడే ఆ ఖాండవవనం సూర్యకిరణాలచే వ్యాప్తమైన మేరుపర్వత సంపూర్ణస్వరూపం ప్రకాశిస్తున్నట్లుగా కనిపించింది. (37)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహపర్వణి గాండీవాదిదానే చతుర్వింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 224 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఖాండవదాహపర్వమను
ఉపపర్వమున గాండీవాదిదానమను రెండువందల ఇరువది నాలుగవ అధ్యాయము. (224)