226. రెండువందల ఇరువది ఆరవ అధ్యాయము

దేవతలతో శ్రీకృష్ణార్జునుల యుద్ధము.

వైశంపాయన ఉవాచ
వైశంపాయన ఉవాచ
తస్యాథ వర్షతో వారి పాండవః ప్రత్యవారయత్ ।
శరవర్షేన బీభత్సుః ఉత్తమాస్త్రాణి దర్శయన్ ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - జలాన్ని వర్షించే ఇంద్రుని జలధారను అర్జునుడు తన ఉత్తమాస్త్రాలను ప్రదర్శిస్తూ శరవర్షంతో నివారించాడు. (1)
ఖాండవం చ వనం సర్వం పాండవో బహుభిః శరైః ।
ఆచ్ఛాదయదమేయాత్మా నీహారేణేవ చంద్రమాః ॥ 2
ఆత్మబలసంపన్నుడైన అర్జునుడు బానవర్షం కురిపించి మంచు చంద్రుని ఆవహరించినట్లు ఖాండవవనమంతటిని కప్పివేశాడు. (2)
వ చ స్మ కించిచ్ఛక్నోతి భూతం నిశ్చరితుం తతః ।
సంఛాద్యమానే ఖే బాణైః అస్యతా సవ్యసాచినా ॥ 3
సవ్యసాచి అర్జునుడు విడచిన బాణాలు ఆకాశమంతా కప్పివేశాయి. అందుచే ఏ ఒక్కప్రాణీ ఖాండవవనం నుంచి బయటకు రాలేకపోయింది. (3)
తక్షకస్తు న తత్రాసీద్ నాగరాజో మహాబలః ।
దహ్యమానే వనే తస్మిన్ కురుక్షేత్రం గతో హి సః ॥ 4
అగ్ని ఖాండవవనాన్ని దహిస్తూండగా బలసంపన్నుడైన నాగరాజు తక్షకుడు అక్కడలేడు. కురుక్షేత్రానికి చేరాడు. (4)
అశ్వసేనో_భవత్ తత్ర తక్షకస్య సుతో బలీ ।
స యత్నమకరోత్ తీవ్రం మోక్షార్థం జాతవేదసః ॥ 5
కాని బలవంతుడైన తక్షకుని కుమారుడు అశ్వసేనుడు అగ్నిజ్వాలల నుండి బయటపడటానికి తీవ్రప్రయత్నం చేశాడు. (5)
న శశాక స నిర్గంతుం నిరుద్ధోఽర్జునపత్రిభిః ।
మోక్షయామాస తం మాతా నిగీర్య భుజగాత్మజా ॥ 6
అర్జునుని బాణాలతో కప్పబడి అతడు బయటకు రాలేకపోయాడు. అతని తల్లి సర్పిణి అతనిని తన శరీరంతో కప్పి విడిపించింది. (6)
తస్య పూర్వం శిరో గ్రస్తం పుచ్ఛమస్య నిగీర్య చ ।
నిగీర్యమాణా సాక్రామత్ సుతం నాగీ ముముక్షయా ॥ 7
ఆమె ముందుగా అతని తలను, తరువాత మెల్లమెల్లగా తోకవరకు బయటకు లాగింది. సర్పిణి అశ్వసేనుని రక్షింపతలంచి ఆకాశంలోకి ఎగిరింది. (7)
తస్యాః శరేన తిక్ష్ణేన పృథుధారేణ పాండవః ।
శిరశ్చిచ్ఛేద గచ్ఛంత్యాః తామపశ్యచ్ఛచీపతిః ॥ 8
వాడి అంచు గల తీక్ష్ణబాణంతో అర్జునుడు ఆమె శిరస్సును ఖండించాడు. శచీపతి ఇంద్రుడు ఈమె దురవస్థను తన కళ్ళారా చూశాడు. (8)
తం ముమోచయిషుర్వజ్రీ వాతవర్షేణ పాండవమ్ ।
మోహయామాస తత్కాలమ్ అశ్వసేనస్త్వమచ్యుత ॥ 9
ఇంద్రుడు అశ్వసేనుని విడిపించాలని గాలి, వర్షంతో అర్జునుని మభ్యపెట్టాడు - ఆ సమయంలో అశ్వసేనుడు తప్పించుకొన్నాడు. (9)
తాం చ మాయాం తదా దృష్ట్వా ఘోరాం నాగేన వంచితః ।
ద్విధా త్రిధా చ ఖగతాన్ ప్రాణినః పాండవోఽచ్ఛినత్ ॥ 10
ఆ భయానకమాయను చూచి సర్పవంచితుడైన అర్జునుడు ఆకాశగతులైన ప్రాణులను రెండుగా, మూడుగా ఖండించాడు. (10)
శశాప తం చ సంక్రుద్ధః బీభత్సుర్జిహ్మగామినమ్ ।
పావకో వాసుదేవశ్చాప్యప్రతిష్ఠో భవిష్యసి ॥ 11
అర్జునుడు కోపించి వక్రగామి అయిన సర్పాన్ని 'ఆశ్రయహీనుడ వగుము' అని శపించాడు. అగ్నివాసుదేవులు ఆ వచనాలను అంగీకరించారు. (11)
తతో జిష్ణుః సహస్రాక్షం ఖం వితత్యాశుగైః శరైః ।
యోధయామాస సంక్రుద్ధః వంచనాం తామనుస్మరన్ ॥ 12
జయశీలి అర్జునుడు కోపించి, ఇంద్రుని మోసాన్ని మాటిమాటికి స్మరిస్తూ, శీఘ్రగాములైన బాణాలతో ఆకాశాన్ని కప్పి, ఇంద్రునితో యుద్ధానికి దిగాడు. (12)
దేవరాజోఽపి తం దృష్ట్వా సంరంబ్ధం సమరేఽర్జునమ్ ।
స్వమస్త్రమసృజత్ తీవ్రం ఛాదయిత్వాఖిలం నభః ॥ 13
యుద్ధంలో కోపించిన అర్జునుని చూచి ఇంద్రుడు ఆకాశాన్ని అంతటిని కప్పివేయగల ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. (13)
తతో వాయుర్మహాఘోషః క్షోభయన్ సర్వసాగరాన్ ।
వియతృ జనయన్ మేఘాన్ జలధారాసమాకులాన్ ॥ 14
పిమ్మట మహాధ్వనితో వాయువు సర్వసాగరాలను కల్లోలపరుస్తూ జలధారలతో నిండిన మేఘాలను ఆకాశంలో పుట్టించసాగాడు. (14)
తతోఽశనిముచో ఘోరాన్ తడిత్త్సనితనిఃస్వనాన్ ।
తద్విఘాతార్థమసృజద్ అర్జునోఽప్యస్త్రముత్తమమ్ ॥ 15
వాయవ్యమభిమంత్రాథ ప్రతిపత్తివిశారదః ।
తేనేంద్రాశనిమేఘానాం వీర్యౌజస్తద్ వినాశితమ్ ॥ 16
ఇంద్రుడు భయంకరాలైన మెరుపుల తళతళలు గల ఘోరమైన వజ్రాయుధాన్ని అర్జునునిపై విడచాడు. అర్జునుడు కూడ ప్రతీకారనిపుణుడై వాయవ్యాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు. ఆ అస్త్రం ఇంద్రుడు పంపిన మేఘాల బలాన్ని, వేగాన్ని నాశనం చేసింది. (15,16)
జలధారాశ్చ తాః శోషం జగ్ముర్నేశుశ్చ విద్యుతః ।
క్షణేన చాభవద్ వ్యోమ సంప్రశాంతరజస్తమః ॥ 17
జలధారలు ఇంకిపోయి మెరుపుతీగలు నశించాయి. క్షణకాలంలో ఆకాశం ధూళి, అంధకారాలకు దూరమై స్వచ్ఛంగా కనిపించింది. (17)
సుఖశీతానిలవహమ్ ప్రకృతిస్థార్కమండలమ్ ।
నిష్ప్రతీకారహృష్టశ్చ హుతభుగ్ వివిదాకృతిః ॥ 18
సిచ్యమానో వసోఘైస్తైః ప్రాణినాం దేహనిఃసృతైః ।
ప్రజజ్వాలాథ సోఽర్చిష్మాన్ స్వనాదైః పూరయం జగత్ ॥ 19
సుఖం కలిగిమ్చే గాలి వీచసాగింది. సూర్యమండలం స్వాభావికస్థితిని పొందింది. ఎదురు లేకపోవటంతో అగ్ని సంతసించి వివిధరూపాలలో వెలిగిపోతూ ప్రాణుల దేహాన్నుంచి బయటకు వచ్చిన క్రొవ్వుతో మరింత ప్రజ్వలించాడు. అదే సమయంలో తన ధ్వనులను లోకాలన్నిటా వ్యాపింపచేశాడు. (18,19)
కృష్ణాభ్యాం రక్షితం దృష్ట్వా తం చ దావ మహంకృతాః ।
ఖముత్పేతుర్మహారాజ సుపర్ణాద్యాః పతత్రిణః ॥ 20
రాజా! కృష్ణార్జునులు రక్షిస్తున్న ఆ ఖాండవాన్ని చూచి అహంకరించిన గరుడజాతికి చెందిన పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరాయి. (20)
గరుత్మాన్ వజ్రసదృశైః పక్షతుమ్డనఖైస్తదా ।
ప్రహర్తుకామో న్యపతదాకాశాత్ కృష్ణపాండవౌ ॥ 21
ఒక గరుడ వంశపక్షి వజ్రం వంటి తన రెక్కలు, తుండం, నఖాలతో శ్రీకృష్ణార్జునులను బాధించాలని అనుకొని ఆకాశం నుంచి ఒక్కసారిగా వారిపై పడింది. (21)
తథైవోరగసంఘాతాః పాండవస్య సమీపతః ।
ఉత్సృజంతో విషం ఘోరం నిపేతుర్జ్వలితాననాః ॥ 22
అదేవిధంగా పాముల సముదాయాలన్నీ మండిపోయే ముఖాలతో ఘోరమైన కాలకూట విషాన్ని అర్జునుని దగ్గర విడిచిపెట్టాయి. (22)
తాంశ్చకర్త శరైః పార్థః సరోషాగ్నిసముక్షితైః ।
వివిశుశ్చాపి తం దీప్తం దేహాభావాయ పావకమ్ ॥ 23
ఇది చూచి అర్జునుడు క్రోధాగ్నిదీపితుడై బాణాలతో వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. దేహనాశం కోసం అవి అన్నీ ప్రకాశించే అగ్నిలో ప్రవేశించాయి. (23)
తతోఽసురాః సగంధర్వాః యక్షరాక్షసపన్నగాః ।
ఉత్పేతుర్నాదమతులమ్ ఉత్సృజంతో రణార్థినః ॥ 24
అటుపైన రాక్షసులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సర్పాలు యుద్ధం మీది ఉత్సుకతతో పోల్చరాని ధ్వనులు చేస్తూ వారిరువురిపై పడ్డాయి. (24)
అయఃకణపచక్రాశ్మభుశుండ్యుద్యతబాహవః ।
కృష్ణపార్థౌ జిఘాంసంతః క్రోధసంమూర్ఛితౌజసః ॥ 25
ఇనుపచక్రాలతో వదలే లోహపు ఉండలు గల ప్రేలుడు సామగ్రి చేతిలో దాల్చి శ్రీకృష్ణార్జునులను చంపాలని క్రోధం పరాక్రమం ప్రదర్శించాయి. (25)
తేషామతి వ్యాహరతాం శస్త్రవర్షం ప్రముంచతామ్ ।
ప్రమమాథోత్తమాంగాని బీభత్సుర్నిశితైః శరైః ॥ 26
పెద్దగా కోలాహలం చేస్తూ బాణవర్షం కురిపించే వారి శిరస్సులను అర్జునుడు నిశితాలైన శరాలతో హింసించాడు. (26)
కృష్ణశ్చ సుమహాతేజాః చక్రేణారివినాశనః ।
దైత్యదానవసంఘానామ్ చకార కదనం మహత్ ॥ 27
శత్రుసంహారశీలి, మహాతేజస్వి అయిన శ్రీకృష్ణుడు కూడ దైత్యదానవుల గుంపులతో యుద్ధంచేసి చంపివేశాడు. (27)
అథాపరే శరైర్విద్ధాః చక్రవేగేరితాస్తథా ।
వేలామివ సమాసాద్య వ్యతిష్ఠన్నమితౌజసః ॥ 28
మరికొందరు శరపీడితులై, చక్రవేగప్రేరితులై మహాతేజస్వులయినా సముద్రం ఒడ్డును చేరి ఆగిపోయినట్లు ముందుకు సాగలేకపోయారు. (28)
తతః శక్రో-తిసంక్రుద్ధః త్రిదశానామ్ మహేశ్వరః ।
పాండురం గజమాస్థాయ తావుభౌ సముపాద్రవత్ ॥ 29
ఇంద్రుడు మిక్కిలి కోపించి తెల్లని ఏనుగును ఎక్కి వారిరువురివైపు వచ్చాడు. (29)
వేగేనాశనిమాదాయ వజ్రమస్త్రం చ సోఽసృజత్ ।
హతావేతావితి ప్రాహ సురానసురసూదనః ॥ 30
రాక్షససంహారి ఇంద్రుడు వేగంగా పిడుగులాంటి వజ్రాయుధాన్ని తీసి విడుస్తూ దేవతలతో "వీరిద్దరూ చచ్చారులే" అన్నాడు. (30)
తతః సముద్యతాం దృష్ట్వా దేవేంద్రేన మహాశనిమ్ ।
జగృహుః సర్వశస్త్రాణి స్వాని స్వాని సురాస్తథా ॥ 31
దేవేంద్రునిచే పైకెత్తబడిన వజ్రాయుధాన్ని చూచి దేవతలందరూ అదే రీతిలో తమతమ ఆయుధాలన్నీ పైకి తీసి పట్టుకొన్నారు. (31)
కాలదండమ్ యమో రాజన్ గదాం చైవ ధనేశ్వరః ।
పాశాంశ్చ తత్ర వరుణః విచిత్రాం చ తథాశనిమ్ ॥ 32
రాజా! యముడు కాలదండాన్ని, కుబేరుడు గదను, వరుణుడు పాశాన్ని, విచిత్రమైన వజ్రాన్ని చేతితో తీశాడు. (32)
స్కందః శక్తిం సమాదాయ తస్థౌ మేరురివాచలః ।
ఓషధీర్దీప్యమానాశ్చ జగృహాతేఽశ్వినావపి ॥ 33
స్కందుడు శక్తిని తీసుకొని మేరు పర్వతంలా నిశ్చలంగా నిలిచాడు. అశ్వినీదేవతలు ప్రకాశించే ఓషధుల్ని గ్రహించారు. (33)
జగృహే చ ధనుర్ధాతా ముసలం తు జయస్తథా ।
పర్వతం చాపి జగ్రాహ క్రుద్ధస్త్వష్టా మహాబలః ॥ 34
ధాత ధనుస్సును, జయుడు రోకలిని, మహాబలసంపన్నుడు త్వష్టప్రజాపతి పర్వతాన్ని తీసికొని యుద్ధానికి దిగారు. (34)
అంశస్తు శక్తిం జగ్రాహ మృత్యుర్దేవ పరశ్వథమ్ ।
ప్రగృహ్య పరిఘం ఘోరం విచచారార్యమా అపి ॥ 35
అంశుడు శక్తిని, మృత్యుదేవత గండ్రగొడ్డలిని, అర్యముడు భయంకరమైన పరిఘను తీసికొని యుద్ధంలో సంచరించారు. (35)
మిత్రశ్చ క్షురపర్యంతం చక్రమాదాయ తస్థివాన్ ।
పూషా భరాశ్చ సంక్రుద్ధః సవితా చ విశాంపతే ॥ 36
ఆత్తకార్ముకనిస్త్రింశాః కృష్ణపార్థౌ ప్రదుద్రువుః ।
మిత్రుడు వాడి అంచుల చక్రాన్ని గ్రహించి ఎదురువచ్చాడు. పూష, భరుడు, కోపించిన సవిత ధనుస్సులు గ్రహించి శ్రీకృష్ణార్జునులను ఎదుర్కొన్నారు. (36 1/2)
రుద్రాశ్చ వసవశ్చైవ మరుతశ్చ మహాబలాః ॥ 37
విశ్వదేవాస్తథా సాధ్యాః దీప్యమానాః స్వతేజసా ।
ఏతే చాన్యే చ బహవః దేవాస్తౌ పురుషోత్తమౌ ॥ 38
కృష్ణపార్థౌ జిఘాంసంతః ప్రతీయుర్వివిధాయుధాః ।
రుద్రులు, వసువులు, బలసంపన్నులైన వాయువులు, విశ్వేదేవులు, సాధ్యులు, ఇంకా ఇతరులైన దేవతలు తమ తమ తేజాలతో వెలిగిపోతూ శ్రీకృష్ణార్జునులను చంపాలని వివిధాయుధాలను గ్రహించి వారివైపు వచ్చారు. (37,38 1/2)
తత్రాద్భుతాన్యదృశ్యంత నిమిత్తాని మహాహవే ॥ 39
యుగాంతసమరూపాణి భూతసమ్మోహనాని చ 7.
తథా దృష్ట్వా సుసంరబ్ధం శక్రం దేవైః సహాచ్యుతౌ ॥ 40
అభీతౌ యుధి దుర్ధర్షౌ తస్థతుః సజ్జకార్ముకౌ ।
ఆ మహాసంగ్రామంలో ప్రళయకాలంలో ప్రాణులను మొహపరవశులను చేసే అపశకునాలు గోచరించాయి. దేవతాసహితుడైన ఇంద్రుని క్రోధాగ్నికి భయపడని కృష్ణార్జునులు జయింపశక్యం కాని ధనుస్సులు దాల్చి యుద్ధసన్నద్ధులయ్యారు. (39, 40 1/2)
ఆగచ్ఛతస్తతో దేవాన్ ఉభౌ యుద్ధవిశారదౌ ॥ 41
వ్యతాడయేతాం సంక్రుద్ధౌ శరైర్వజ్రోపమైస్తదా ।
అనంతరమ్ యుద్ధవిశారదులైన వారిద్దరు కోపించి వజ్రసదృశాలైన బాణాలతో అక్కడి దేవతలందరినీ గాయపరిచారు. (41 1/2)
అసకృద్ భగ్నసంకల్పాః సురాశ్చ బహుశః కృతాః ॥ 42
భయాద్ రణమ్ పరిత్యజ్య శక్రమేవాభిశిశ్రియుః ।
దేవతలు అనేకవిధాలుగా పదేపదే ప్రయత్నించినా ఫలించలేదు. భయంతో యుద్ధం విడచి మరల ఇంద్రుని ఆశ్రయించారు. (42 1/2)
దృష్ట్వా నివారితాన్ దేవాన్ మాధవేనార్జునేన చ ॥ 43
ఆశ్చర్యమగమంస్తత్ర మునయో నభసి స్థితాః ।
శ్రీకృష్ణార్జునులు దేవతలను నివారించటం చూచి ఆకాశంలోని ఋషులందరు మిక్కిలి ఆశ్చర్యపోయారు. (43 1/2)
శక్రశ్చాపి తయోర్వీర్యమ్ ఉపలభ్యాసకృద్ రణే ॥ 44
బభూవ పరమప్రీతః భూయశ్చైతావయోధయత్ ।
ఇంద్రుడు కూడ యుద్ధంలో వారి పరాక్రమాన్ని పదే పదే చూచి మిక్కిలి ప్రీతుడై తిరిగివారితో యుద్ధం చేశాడు. (44 1/2)
తతోఽశ్మవర్షం సుమహద్ వ్యసృజత్ పాకశాసనః ॥ 45
భూయ ఏవ తదా వీర్యం జిజ్ఞాసుః సవ్యసాచినః ।
అర్జునుని పరాక్రమం తెలుసుకొనటానికి ఇంద్రుడు మళ్లీ రాళ్ళవర్షాన్ని కురిపించాడు. (45 1/2)
తచ్ఛరైరర్జునో వర్షం ప్రతిజఘ్నేఽత్యమర్షితః ॥ 46
విఫలం క్రియమాణం తత్ సమవేక్ష్య శతక్రతుః ।
భూయః సంవర్ధయామాస తద్వర్షం పాకశాసనః ॥ 47
అర్జునుడు మిక్కిలి అమర్షతో ఆ వర్షాన్ని బాణాల సహాయంతో నష్టపరిచాడు. విఫలమయిన రాళ్ళవర్షాన్ని ఇంకా పెంచి ఇంద్రుడు అర్జునునిపై కురిపించాడు. (46,47)
సోఽశ్మవర్షం మహావేగైః ఇషుభిః పాకశాసనిః ।
విలయం గమయామాస హర్షయన్ పితరం తథా ॥ 48
ఇంద్రకుమారుడు అర్జునుడు అది చూచి తండ్రికి సంతోషాన్ని కల్గిస్తూ వేగవంతమైన బాణాలతో ఆ రాళ్ళవర్షాన్ని నశింపచేశాడు. (48)
తత ఉత్పాట్య పాణిభ్యాం మందరాచ్ఛిఖరం మహత్ ।
సద్రుమం వ్యసృజచ్చక్రః జిఘాంసుః పాండునందనమ్ ॥ 49
తరువాత అర్జునుని చంపాలని ఇంద్రుడు స్వయంగా తన చేతులతో మందరపర్వతశిఖరాన్ని చెట్లతోసహా పెకలించి అర్జునునిపై విసిరాడు. (49)
తతోఽర్జునో వేగవద్భిః జ్వలితాగ్రైరజిహ్మగైః ।
శరైర్విధ్వంసయామాస గిరేః శృంగం సహస్రధా ॥ 50
ఇది చూచి అర్జునుడు వేగంగా, సూటిగా పోయే బాణాలతో ఆ పర్వతశిఖరాన్ని వేయి ముక్కలుగా చేశాడు. (50)
గిరేర్విశీర్యమాణస్య తస్య రూపం తదా బభౌ ।
సార్కచంద్రగ్రహస్యేవ నభసః పరిశీర్యతః ॥ 51
చీల్చబడిన ఆ పర్వతశిఖరరూపం ఆకాశం నుంచి విడి క్రింద పడే సూర్య, చంద్ర గ్రహాల వలె ప్రాకాశించింది. (51)
తేనాభిపతితా దావమ్ శైలేన మహతా భృశమ్ ।
శృంగేన నిహతాస్తత్ర ప్రాణినః ఖాండవాలయాః ॥ 52
క్రిందికి పడిపోయే ఆ పర్వతశిఖరం వల్ల ఖాండవ వనంలోని ప్రాణులెన్నో చనిపోయాయి. (52)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహపర్వణి దేవకృష్ణార్జున యుద్ధే షడ్వింశత్యధిక శతతమోఽధ్యాయః ॥ 226 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఖాండవదాహపర్వమను
ఉపపర్వమున దేవకృష్ణార్జున యుద్ధము అను రెండువందల ఇరువది ఆరవ అధ్యాయము. (226)