10. పదియవ అధ్యాయము
కుబేర సభావర్ణనము.
నారద ఉవాచ
సభా వైశ్రవణీ రాజన్ శతయోజనమాయతా ।
విస్తీర్ణా సప్తతిశ్చైవ యోజనాని సితప్రభా ॥ 1
నారదుడిలా అన్నాడు. రాజా! కుబేరసభ నూరుయోజనాల పొడవు, డెబ్బది యోజనాల వెడల్పు కలది. తెల్లని కాంతితో ప్రకాశించేది. (1)
తపసా నిర్జితా రాజన్ స్వయం వైశ్రవణేన సా ।
శశిప్రభా ప్రావరణా కైలాసశిఖరోపమా ॥ 2
రాజా! విశ్రవసుని కొడుకు కుబేరుడు దీనిని తపస్సు చేసి సాధించాడు. శ్వేతకాంతితో అది వెన్నెలలను తిరస్కరిస్తూ కైలాసశిఖరం వలె భాసిస్తుంది. (2)
గుహ్యకైరుహ్యమానా సా ఖే విషక్తేవ శోభతే ।
దివ్యా హేమమయైరుచ్చైః ప్రాసాదైరుపశోభితాః ॥ 3
గుహ్యకులు దీనిని మోస్తుంటారు. ఆ సమయంలో అది ఆకాశాన్ని అంటినట్టు ప్రకాశిస్తుంది. దివ్యమైన, స్వర్ణమయమయిన ప్రాసాదాలతో అది విరాజిల్లుతుంది. (3)
మహారత్నవతీ చిత్రా దివ్యగంధా మనోరమా ।
సితాభ్రశికరాకారా ప్లవమానేవ దృశ్యతే ॥ 4
మహారత్నాలతో, చిత్రవర్ణాలతో, దివ్యగంధాలతో తెల్లని మేఘాల వంటి ఆకృతితో మనోహరమై అది గగనసీమలో ఈదులాడుతున్నట్లు కనిపిస్తుంది. (4)
దివ్యా హేమమయైరంగైః విద్యుద్భిరివ చిత్రితా ।
ఆ కుబేరసభ బంగారువన్నెలతో అలంకరింపబడిన గోడలతో మెరుపుల వలె ప్రకాశిస్తూ దివ్యంగా ఉంటుంది. (4 1/2)
తస్యాం వైశ్రవణో రాజా విచిత్రాభరణాంబరః ॥ 5
స్త్రీ సహస్రైర్వృతః శ్రీమాన్ ఆస్తే జ్వలితకుండలః ।
దివాకరనిభే పుణ్యే దివ్యాస్తరణసంవృతే ।
దివ్యపాదోపధానే చ నిషణ్ణః పరమాసనే ॥ 6
ఆ సభలో కుబేరుడు విచిత్రాభరణాలు, విచిత్రవస్త్రాలు ధరించి, ప్రజ్వలిమ్చే కుండలాలు అలంకరించుకొని దివ్యాసనాలు, దివ్యపాదపీఠాలు కలిగి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తున్న దివ్యసింహాసనంపై కూర్చొని ఉంటాడు. వేలకొలది స్త్రీలు ఆయనను చుట్టి ఉంటారు. (5,6)
మందారాణాముదారాణాం వనాని పరిలోడయన్ ।
సౌగంధికవనానాం చ గంధం గంధవహో వహన్ ॥ 7
నళిన్యాశ్చాలకాఖ్యాయాః నందనస్య వనస్య చ ।
శీతో హృదయసంహ్లాదీ వాయుస్తముపసేవతే ॥ 8
ఉదారమందార వృక్షాలను కదిలిస్తూ, సౌగంధికావన, అలకా, పుష్కరిణీ, నందనవనాల సౌరభాన్ని మోస్తూ హృదయానందకరంగా వీస్తూ చల్లనిగాలి ఆ కుబేరుని సేవిస్తుంది. (7,8)
తత్ర దేవాః సగంధర్వాః గతైరప్సరసాం వృతాః ।
దివ్యతానైర్మహారాజ గాయంతి స్మ సభాగతాః ॥ 9
రాజా! అక్కడ గంధర్వులతో, అప్సరోగణాలతో సహా దేవతలు సభాసదులై దివ్యతానాలతో గానం చేస్తుంటారు. (9)
మిశ్రకేశీ చ రంభా చ చిత్రసేనా శుచిస్మితా ।
చారునేత్రా ఘృతాచీ చ మేనకా పుంజికస్థలా ॥ 10
విశ్వాచీ సహజన్యా చ ప్రమ్లోచా ఉర్వశీ ఇరా ।
వర్గా చ సౌరభేయీ చ సమీచీ బుద్బుదా లతా ॥ 11
ఏతాః సహస్రశశ్చాన్యాః నృత్యగీతవిశారదాః ।
ఉపతిష్ఠంతి ధనదం గంధర్వాప్సరసాం గణాః ॥ 12
మిశ్రకేశి, రంభ, చిత్రసేన, శుచిస్మిత, చారునేత్ర, ఘృతాచి, మేనక, పుంజికస్థల, విశ్వాసి, సహజన్య, ప్రమ్లోచ, ఊర్వశి, ఇర, వర్గ, సౌరభేయి, సమీచి, బుద్బుద, లత మొదలయిన వేలకొలది నృత్యగీతవిశారదులయిన గంధర్వాప్సరోగణాలు కుబేరుని సేవిస్తుంటారు. (10-12)
అనిశం దివ్యవాదిత్రైః నృత్యగీతైశ్చ సా సభా ।
అశూన్యా రుచిరా భాతి గంధర్వాప్సరసాం గణైః ॥ 13
గంధర్వాప్సరోగణాల దివ్యవాద్య, నృత్య, గీతాలతో నిండి నిరంతరమూ ప్రతిధ్వనించే ఆ కుబేరసభ మనోరంజకంగా నిండుగా ప్రకాశిస్తుంది. (13)
కిన్నరా నామ గంధర్వా నరా నామ తథాపరే ॥ 14
మణిభద్రోఽథ ధనదః శ్వేతభద్రశ్చ గుహ్యకః ।
కశేరకో గండకండూః ప్రద్యోతశ్చ మహాబలః ॥ 15
కుస్తుంబురుః పిశాచశ్చ గజకర్ణో విశాలకః ।
వరాహాకర్ణస్తామ్రోష్ఠః ఫలకక్షః ఫలోదకః ॥ 16
హంసచూడః శిఖావర్తః హేమనేత్రో విభీషణః ।
పుష్పాననః పింగలకః శోణితోదః ప్రవాలకః ॥ 17
వృక్షవాస్యనికేతశ్చ చీరవాసాశ్చ భారత ।
ఏతే చాన్యే చ బహవః యక్షాః శతసహస్రశః ॥ 18
భారతా! కిన్నరులు, నరులు, గంధర్వులు, మనిభద్రుడు, ధనదుడు, శ్వేతభద్రుడు, కశేరకుడు, గండకండువు, ప్రద్యోతుడు, కుస్తుంబురుడు (పిశాచ), గజకర్ణుడు, విశాలకుడు, వరాహకర్ణుడు, తామ్రోష్ఠుడు, ఫలకక్షుడు, ఫలోదకుడు, హంసచూడుడు, శిఖావర్తుడు, హేమనేత్రుడు, విభీషణుడు, పుష్పాననుడు, పింగళకుడు, శోణితోదుడు, ప్రవాలకుడు, వృక్షవాసి, అనికేతుడు, చీరవాససుడు, మొదలుగా గల యక్షులు లక్షల కొలది ఆ సభలో నిలిచి కుబేరుని సేవిస్తారు. (14-18)
సదా భగవతీ లక్ష్మీః తత్రైవ నలకూబరః ।
అహం చ బహుశస్తస్యాం భవంత్యన్యే చ మద్విధాః ॥ 19
పూజనీయ అయిన లక్ష్మి, నలకూబరుడు, నేను నా వంటివారు మరెందరో ఆ కుబేరసభలో ఎక్కువగా ఉంటారు. (19)
బ్రహ్మర్షయో భవంత్యత్ర తథా దేవర్షయోఽపరే ।
క్రవ్యాదాశ్చ తథైవాన్యే గంధర్వాశ్చ మహాబలాః ॥ 20
ఉపాసతే మహాత్మానమ్ తస్యాం ధనదమీశ్వరమ్ ।
బ్రహ్మర్షులు, దేవర్షులు, ఇతర ఋషిగణాలు ఆ సభలో ఉంటారు. అంతే గాక ఎందరో పిశాచులు, మహాబలులయిన గంధర్వులు లోకపాలకుడైన కుబేరుని సేవిస్తుంటారు. (20 1/2)
భగవాన్ భూతసంఘైశ్చ వృతః శతసహస్రశః ॥ 21
ఉమాపతిః పశుపతిః శూలభృద్ భగనేత్రహా ।
త్రయంబకో రాజశార్దూల దేవీ చ విగతక్లమా ॥ 22
వామనైర్వికటైః కుబ్జైః క్షతజాక్షైర్మహారవైః ।
మేదోమాంసాశనైరుగ్రైః ఉగ్రధన్వా మహాబలః ॥ 23
నానాప్రహరణైరుగ్రైః వాతైరివ మహాజవైః ।
వృతః సఖాయమన్వాస్తే సదైవ ధనదం నృప ॥ 24
రాజశ్రేష్ఠా! లక్షల కొలది భూతసమూహాలు చుట్టుముట్టగా ఉగ్రధనుర్ధారి, మహాబలి, పశుపతి, శూలధారి, భగదేవతనేత్రాలను పోగొట్టినవాడు, త్రిలోచనుడు అయిన శివుడు, అలసట లేని పార్వతి - ఈ ఇద్దరూ భూతప్రేతాదులతో కలిసి తమ మిత్రుడైన కుబేరుని ఎప్పుడూ సేవిస్తుంటారు. ఆ భూతప్రేతాలు వామనులు, వికటులు, కుబ్జులు, ఎర్రటి కనులు గలవారు, గొప్ప కోలాహలం చేసేవారు, మేదోమాంసాలను తినేవారు, వివిధ శస్త్రాస్త్రాలను ధరించినవారు, గాలివలె తీవ్రవేగం కలవారు. (21-24)
ప్రహృష్టాః శతశశ్చాన్యే బహుశః సపరుచ్ఛదాః ।
గంధర్వాణాం చ పతయః విశ్వావసుర్హహాహుహూః ॥ 25
తుంబురుః పర్వతశ్చైవ శైలూషశ్చ తథాపరః ।
చిత్రసేనశ్చ గీతజ్ఞః తథా చిత్రరథోఽపి చ ॥ 26
వీరే కాక వివిధవస్త్రాభరణాలను అలంకరించుకొని ప్రసన్నచిత్తులయిన వందలకొలది గంధర్వపతులు-విశ్వావసువు, హహుడు, హుహుడు, తుంబురుడు, పర్వతుడు, శైలూషుడు, చిత్రసేనుడు, చిత్రరథుడు మొదలగువారు - ధనాధిపతి అయిన కుబేరుని సేవిస్తుంటారు. (25,26)
ఏతే చాన్యే చ గంధర్వాః ధనేశ్వరముపాసతే ।
విద్యాధరాధిపశ్చైవ చక్రధర్మా సహానుజైః ॥ 27
ఉపాచరతి తత్ర స్మ ధనానామీశ్వరం ప్రభుమ్ ॥ 28
విద్యాధరచక్రవర్తి అయిన చక్రధర్ముడు తన తమ్ములతో సహా ఆ సభలో ధనాధిపతి అయిన కుబేరుని సేవిస్తాడు. (27,28)
ఆసతే చాపి రాజానః భగవదత్తపురోగమాః ।
ద్రుమః కింపురుషేశశ్చ ఉపాస్తే ధనదేశ్వరమ్ ॥ 29
భగదత్తుడు మొదలగు రాజులు ఆ సభలో ఉంటారు. కింపురుషరాజయిన ద్రుముడు కుబేరుని ఉపాసిస్తుంటాడు. (29)
రాక్షసాధిపతిశ్చైవ మహేంద్రో గంధమాదనః ।
సహ యక్షైః సగంధర్వైః సహ సర్వైర్నిశాచరైః ॥ 30
విభీషణశ్చ ధర్మిష్ఠః ఉపాస్తే భ్రాతరం ప్రభుమ్ ।
మహేంద్రుడు, గంధమాదనుడు, ధర్మనిష్ఠుడు, రాక్షసాధిపతి అయిన విభీషణుడు, యక్ష, గంధర్వ, నిశాచరులతో కలిసి తమ సోదరుడయిన కుబేరుని సేవిస్తుంటారు. (30 1/2)
హిమవాన్ పారియాత్రశ్చ వింధ్యకైలాసమందరాః ॥ 31
మలయో దర్దురశ్చైవ మహేంద్రో గంధమాదనః ।
ఇంద్రకీలః సునాభశ్చ తథా దివ్యౌ చ పర్వతే ॥ 32
ఏతే చాన్యే చ బహవః సర్వే మేరుపురోగమాః ।
ఉపాసతే మహాత్మానం ధనానామీశ్వరం ప్రభుమ్ ॥ 33
హిమవంతం, పారియాత్రం, వింధ్యం, కైలాసం, మందరం, మలయం, దర్దురం, మహేంద్రం, గంధమాదనం, ఇంద్రకీలం, సునాభం, మేరువు మొదలుగా గల ఇతర పర్వతాలు మహనీయుడు, ధనాధిపతి అయిన కుబేర ప్రభువును సేవిస్తుంటాయి. (31-33)
నందీశ్వరశ్చ భగవాన్ మహాకాలస్తథైవ చ ।
శంఖుకర్ణముఖాః సర్వే దివ్యాః పారిషదాస్తథా ॥ 34
కాష్ఠః కుటీముఖో దంతీ విజయశ్చ తపోఽధికః ।
శ్వేతశ్చ వృషభస్తత్ర నర్దన్నాస్తే మహాబలః ॥ 35
పూజ్యుడయిన నందీశ్వరుడు, మహాకాలుడు, శంకుకర్ణుడు మొదలగు దివ్యసభ్యులు, కాష్ఠుడు, కుటీముఖుడు, దంతి, తపస్వి అయిన విజయుడు, గర్జనశీలుడయిన శ్వేతనంది ఆ సభలో ఉంటారు. (34,35)
ధనదం రాక్షసాశ్చాన్యే పిశాచాశ్చ ఉపాసతే ।
పారిషదైః పరివృతమ్ ఉపాయాంతం మహేశ్వరమ్ ॥ 36
సదా హి దేవదేవేశం శివం త్రైలోక్యభావనమ్ ।
ప్రణమ్య మూర్ధ్నా పౌలస్త్యః బహురూపముపాపతిమ్ ॥ 37
తతోఽభ్యనుజ్ఞాం సంప్రాప్య మహాదేవాద్ ధనేశ్వరః ।
ఆస్తే కదాచిద్ భగవాన్ భవో ధనపతేః సఖా ॥ 38
వివిధరాక్షసులు, పిశాచాలు కుబేరుని సేవిస్తుంటారు. దేవదేవేశుడు, త్రిభువనభావనుడు, బహురూపధారి, కళ్యాణస్వరూపుడు, ఉమాపతి అయిన మహేశ్వరుడు సహచరులతో కలిసి ఆ సభలో ప్రవేశిచినప్పుడు పులస్త్యనందనుడు, ధనాధిపతి అయిన కుబేరుడు తలవంచి ప్రణమిల్లి ఆయన అనుమతితో దగ్గర కూర్చుంటాడు. కుబేరుని మిత్రుడయిన శివుడు అప్పుడప్పుడు ఆ సభలో కనిపిస్తాడు. (36-38)
నిధిప్రవరముఖ్యౌ చ శంకపద్మౌ ధనేశ్వరౌ ।
సర్వాన్ నిధీన్ ప్రగృహ్యాథ ఉపాసతే ధనేశ్వరమ్ ॥ 39
శ్రేష్టనిధులయిన శంఖపద్మాలు రూపాలను ధరించి ఇతర నిధులతో కలిసి ధనేశ్వరుడయిన కుబేరుని సేవిస్తాయి. (39)
సా సభా తాదృశీ రమ్యా మయా దృష్టాంతరిక్షగా ।
పితామహసభాం రాజన్ కీర్తయిష్యే నిబోధ తామ్ ॥ 40
గగనసంచారిణి అయిన ఆ రమణీయ కుబేరసభను నేను చూచాను. రాజా! ఇక బ్రహ్మసభను గూర్చి చెపుతాను. విను. (40)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యానపర్వణి ధనదసభావర్ణనం నామ దశమోఽధ్యాయః ॥ 10 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున లోకపాల సభాఖ్యానపర్వమను ఉపపర్వమున ధనదసభావర్ణనమను పదవ అధ్యాయము. (10)