20. ఇరువదియవ అధ్యాయము

(జరాసంధ వధ పర్వము)

ధర్మజుని అనుమతితో శ్రీకృష్ణభీమార్జునులు మగధకు వెడలుట.

వాసుదేవ ఉవాచ
పతితౌ హంసడిభకౌ కంసశ్చ సగణో హతః ।
జరాసంధస్య నిధనే కాలోఽయంసముపాగతః ॥ 1
వాసుదేవుడు పలికాడు - హంసడింభకులు నాశనం అయ్యారు. కంసుడు పరివారంతో సహా చంపబడ్డాడు. జరాసంధుని చంపటానికి తగిన సమయం ఆసన్నమైంది. (1)
న శక్యోఽసౌ రణే జేతుం సర్వైరపి సురాసురైః ।
బాహుయుద్ధేన జేతవ్యం స ఇత్యుపలభామహే ॥ 2
ఇతడు యుద్ధంలో దేవాసురులందరికి జయింప శక్యంకాడు. బాహుబలంతోనే ఇతనిని చంపాలి అని తెలిసికొన్నాం. (2)
మయి నీతిర్బలం భీమే రక్షితా చావయోర్జయః ।
మాగధం సాధయిష్యామః ఇష్టిం త్రయ ఇవాగ్నయః ॥ 3
నాలో రాజనీతి ఉంది, భీమునిలో బాహుబలం ఉంది, అర్జునునిలో రక్షణసామర్థ్యం ఉంది. యాగానికి మూడు అగ్నులు ప్రధానమైనట్లు మనం జరాసంధుని అణచివేయగలం. (3)
త్రిభిరాసాదితోఽస్మాభిః విజనే స నరాధిపః ।
న సందేహో యథా యుద్ధమ్ ఏకేనాప్యుపయాస్యతి ॥ 4
అవమానాచ్చ లోభాచ్చ బాహువీర్యాచ్చ దర్పితః ।
భీమసేనేన యుద్ధాయ ధ్రువమప్యుపయాస్యతి ॥ 5
ఏకాంతంలో మనం నిర్బంధిస్తే ఆ జరాసంధుడు నిస్సందేహంగా మనలో ఒకనితో యుద్ధానికి అంగీకరిస్తాడు. అవమానం, లోభం, బాహువీర్యం వీటితో గర్వితుడై భీమసేనునితో యుద్ధానికి సంసిద్ధుడవుతాడు. (4,5)
అలం తస్య మహాబాహుః భీమసేనో మహాబలః ।
లోకస్య సముదీర్ణస్య నిధనాయాంతకో యథా ॥ 6
విజృంభించిన లోకాన్ని యముడు తన శక్తితో నశింపచేస్తున్నట్లు గొప్పబాహుబలం, శరీరబలం కల భీముడు అతనిని పడగొట్టటానికి సమర్థుడు. (6)
యది మే హృదయం వేత్సి యది తే ప్రత్యయో మయి ।
భీమసేనార్జునౌ శీఘ్రం న్యాసభూతౌ ప్రయచ్ఛ మే ॥ 7
నాపై విశ్వాసముంటే, నా హృదయాన్ని నీవు తెలుసుకుంటే భీమసేనార్జులను న్యాసభూతులుగా (తిరిగి అప్పగించువారిగా) వెంటనే నాకు ఇయ్యి. (7)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తో భగవతా ప్రత్యువాచ యుధిష్ఠిరః ।
భీమార్జునౌ సమాలోక్య సంప్రహృష్టముఖౌ స్థితౌ ॥ 8
వైశంపాయనుడు అన్నాడు -
శ్రీ కృష్ణుని ఈ పలుకులను విని యుధిష్ఠిరుడు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసే భీమార్జునులను చూచి ఇలా అన్నాడు. (8)
యుధిష్ఠిర ఉవాచ
అచ్యుతాచ్యుత మామైవం వ్యాహరామిత్రకర్శన ।
పాండవానాం భవాన్ నాథః భవంతం చాశ్రితా వయమ్ ॥ 9
ధర్మరాజు అన్నాడు - శ్రీకృష్ణా! అచ్యుతా! శత్రునాశకా! ఈ విధంగా ఎన్నడూ పలుకవద్దు. పాండవులకు నీవే నాథుడవు. నిన్ను ఆశ్రయించే మేం ఉన్నాం. (9)
యథా వదసి గోవింద సర్వం తదుపపద్యతే ।
న హి త్వమగ్రతస్తేషాం యేషాం లక్ష్మీః పరాఙ్ముఖీ ॥ 10
నీవు పలికేదంతా సిద్ధిస్తుంది. నీవు ముందు లేకపోతే వారికి జయలక్ష్మి పరాఙ్ముఖురాలు అవుతుంది. (10)
నిహతశ్చ జరాసంధః మోక్షితాశ్చ మహీక్షితః ।
రాజసూయశ్చ మే లబ్ధః నిదేశే తవ తిష్ఠతః ॥ 11
జరాసంధుడు ఇక చనిపోయినట్లే. రాజులందరు విడిపింపబడతారు. నీ ఆదేశాన్ని పాటించే నేను రాజసూయం చేయటం తథ్యం. (11)
క్షిప్రమేవ యథా త్వేతత్ కార్యే సముపపద్యతే ।
అప్రమత్తో జగన్నాథ తథా కురు నరోత్తమ ॥ 12
త్రిభిర్భవద్భిర్హి వినా నాహం జీవితుముత్సహే ।
ధర్మకామార్థరహితః రోగార్త ఇవ దుఃఖితః ॥ 13
న శౌరిణా వినా పార్థః న శౌరిః పాండవం వినా ।
నాజేయోఽస్త్వనయోర్లోకే కృష్ణయోరితి మే మతిః ॥ 14
జగన్నాథా! నరశ్రేష్ఠా! శీఘ్రంగా ఈ పని నెరవేరేటట్లు యత్నించు. జాగరూకుడవై ఆచరించు. ధర్మార్థకామాలు లేని, దుఃఖించే రోగార్తుని జీవితం వలె మీరు ముగ్గురు లేని జీవితాన్ని నేను ఇష్టపడను. కృష్ణుడు లేని అర్జునుడు లేడు. అర్జునుడు లేని కృష్ణుడు లేడు. ఈ కృష్ణార్జునులకు జయింపశక్యం కానిది లోకంలో లేదు అని నా అభిప్రాయం. (12-14)
అయం చ బలినాం శ్రేష్ఠః శ్రీమానపి వృకోదరః ।
యువాభ్యాం సహితో వీరః కిం న కుర్యాన్మహాయశాః ॥ 15
బలవంతులలో శ్రేష్ఠుడు, తేజోవంతుడు, వీరుడు అయిన భీమసేనుడు మీఇద్దరితో కలిసి ఏపని అయినా సాధించగలడు. (15)
సుప్రణీతో బలౌఘో హి కురుతే కార్యముత్తమమ్ ।
అంధం బలం జడం ప్రాహుః ప్రణేతవ్యం విచక్షణైః ॥ 16
నేర్పరులైన సేనాపతుల ద్వారా బాగుగా నడుపబడిన సేనా సముదాయం గొప్పగొప్ప కార్యాలు సాధిస్తుంది. లేనిచో ఆ సేన గుడ్డిది, విచక్షణలేనిది అని అంటారు. కావున నీతి విశారదులచే సేన నడుపతగింది. (16)
యతో హి నిమ్నం భవతి నయంతి హి తతో జలమ్ ।
యతశ్ఛిద్రం తతశ్చాపి నయంతే ధీవరా జలమ్ ॥ 17
ఏవైపున పల్లపు ప్రదేశముంటే ఆవైపు జనులు నీటిని మళ్ళిస్తారు. ఏవైపున రంధ్రముంటుందో ఆవైపుకు ధీవరులు నీటిని మళ్ళిస్తారు. అలాగే మీరు కార్యం సాధించటానికి అనుకూలమైన పద్ధతిని అనుసరించండి. (17)
తస్మాన్నయవిధానజ్ఞం పురుషం లోకవిశ్రుతమ్ ।
వయమాశ్రిత్య గోవిందం యతామః కార్యసిద్ధయే ॥ 18
అందుచే మనం నయకోవిదుడు, లోకప్రసిద్ధుడు అయిన శ్రీకృష్ణుని ఆశ్రయించి శరణువేడి కార్యసాధనకోసం ప్రయత్నిద్దాం. (18)
ఏవం ప్రజ్ఞానయబలం క్రియోపాయసమన్వితమ్ ।
పురస్కుర్వీత కార్యేషు కృష్ణంకార్యార్థసిద్ధయే ॥ 19
ఈ విధంగా కార్యసిద్ధి కోసం అన్నిరంగాలలో బుద్ధి, నీతి, బలం, ప్రయత్నం ఉపాయం తెలిసిన గోవిందుని మనం ముందు నిలుపుకొందాం. ఇదే మనకు ఉచితమైనది. (19)
ఏవమేవ యదుశ్రేష్ఠ యావత్కార్యార్థసిద్ధయే ।
అర్జునః కృష్ణమన్వేతు భీమోఽన్వేతు ధనంజయమ్ ॥ 20
యదుశ్రేష్ఠుడా! సమస్టకార్యాలసిద్ధికై మీ సహాయం స్వీకరించటం ఉత్తమం, అర్జునుడు శ్రీకృష్ణుని అనుసరించాలి. అర్జునుని ఉత్తమం, అర్జునుడు శ్రీకృష్ణుని అనుసరించాలి. అర్జునుని భీముడు అనుసరిస్తాడు. యుద్ధనీతి, విజయం, బలం ఈ మూడింటిని సక్రమంగా కలిపి పరాక్రమం చూపిస్తే తప్పక కార్యం సిద్ధిస్తుంది. (20)
వైశాంపాయన ఉవాచ
ఏవముక్తాస్తతః సర్వే భ్రాతరో విపులౌజసః ।
వార్ష్ణేయః పాండవేయౌ చ ప్రతస్థుర్మాగధం ప్రతి ॥ 21
వైశంపాయనుడు చెప్పాడు - జనమేజయా! యుధిష్ఠిరుని వాక్యాలు విన్న తేజస్వులు శ్రీకృష్ణార్జున భీములు ముగ్గురు కలిసి మగధరాజైన జరాసంధునితో యుద్ధం చేయడానికి అతని రాజధానివైపు బయలుదేరారు. (21)
వర్చస్వినాం బ్రాహ్మణానాం స్నాతకానాం పరిచ్ఛదమ్ ।
ఆచ్ఛాద్య సుహృదాం వాక్యైః మనోజ్ఞైరభినందితాః ॥ 22
వారు మువ్వురు తేజోవంతులు, స్నాతకులు, అయిన బ్రాహ్మణుల వస్త్ఱాలను దాల్చి తమ క్షత్రియరూపాన్ని దాచుకొన్నారు. అదే సమయాన స్నేహితుల అభినందనలు తెలిపే మాటలను విన్నారు. (22)
అమర్షాదభితప్తానాం జ్ఞాత్యర్థం ముఖ్యతేజసామ్ ।
రవిసోమాగ్నివపుషాం దీప్తమాసీత్ తదా వపుః ॥ 23
హతం మేనే జరాసంధం దృష్ట్వా భీమపురోగమే ।
ఏక కార్యసముద్యంతౌ కృష్ణౌ యుద్ధేఽపరాజితౌ ॥ 24
జరాసంధునిపై కోపంతో వారు అధికంగా మండిపోసాగారు. జ్ఞాతులను ఉద్ధరించటానికి వారిలో ఆ తేజస్సు బహిర్గతమైంది. ఆ సమయాన వారు ముగ్గురు సూర్యచంద్రాగ్నుల తేజంతో మిక్కిలిగా ప్రకాశించారు. ఒకే కార్యాన్ని సాధించే తలంపుతో యుద్ధంలో పరాజయమెరుగని నరనారాయణులైన అర్జునశ్రీకృష్ణులు భీమునిముందు ఉంచుకొని జరాసంధుని తప్పక వధిస్తామనే నమ్మకం యుధిష్ఠిరునకు కలిగించారు. (23,24)
ఈశౌ హి తౌ మహాత్మానౌ సర్వకార్యప్రవర్తినౌ ।
ధర్మకామార్థలోకానాం కార్యాణాం చ ప్రవర్తకౌ ॥ 25
(కనురెప్పవేయటం, తెరవటం అనే చిన్నపనులు మొదలుకొని మహాప్రళయపర్యంతం ఉండే) అన్నిపనులు సాధింపగల సమర్థులు నరనరాయణులు. అదేవిధంగా ధర్మ, అర్థ, కామ సాధనంతో కలిగే లోకాలను మానవులకు కల్పించగల సామర్థ్యం ఉన్నవారు. (25)
కురుభ్యః ప్రస్థితాస్తే తు మధ్యేన కురుజాంగలమ్ ।
రమ్యం పద్మసరో గత్వా కాలకూటమతీత్య చ ॥ 26
గండకీం చ మహాశోణం సదానీరాం తథైవ చ ।
ఏకపర్వతకే నద్యః క్రమేణైత్యావ్రజంత తే ॥ 27
వారు ముగ్గురు కురుదేశాల నుంచి బయలుదేరి కురుజాంగలం మధ్యలోని పద్మసరోవరాణ్ణి చేరారు. కాలకూటపర్వతాన్ని దాటి ఒకేపర్వతంపై ప్రవహించే గండకి, మహాశోణ, సదానీర అనే నదులను క్రమంగా దాటి ముందుకు సాగారు. (26,27)
ఉత్తీర్య సరయూం రమ్యాం దృష్ట్వా పూర్వాంశ్చ కోసలాన్ ।
అతీత్య జగ్ముర్మిథిలాం పశ్యంతోవిపులా నదీః ॥ 28
అతీత్య గంగాం శోణం చ త్రయస్తే ప్రాఙ్ముఖాస్తదా ।
కుశచీరచ్ఛదా జగ్ముః మాగధం క్షేత్రమచ్యుతాః ॥ 29
అదే మార్గంలో సుందరమైన సరయూనదిని దాటి పూర్వకోసల దేశంలో అడుగుపెట్టారు. చాలా నదుల్ని చూస్తూ కోసలదేశాన్ని దాటి మిథిలను చేరారు. గంగను, శోణభద్రను దాటి వారు ముగ్గురూ తూర్పుముఖంగా బయలుదేరారు. దర్భలలో, వస్త్రాలతో శరీరాన్ని కప్పికొని కార్యసాధకులైన వారు మగధరాజ్య సీమలోకి ప్రవేశించారు. (28,29)
తే శశ్వద్ గోధనాకీర్ణమ్ అంబుమంతం శుభద్రుమమ్ ।
గోరథం గిరిమాసాద్య దదృశుర్మాగధం పురమ్ ॥ 30
వారు సదా గోధనంతో, జలంతో నిండి, శుభవృక్షాలు గల గోరథమనే పర్వతం చేరి; అక్కడ నుంచి మగధరాజధానిని చూశారు. (30)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి జరాసంధవధ పర్వణి కృష్ణపాండవమాగధ యాత్రాయాం వింశోఽధ్యాయః ॥ 20 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున జరాసంధవధ పర్వమను ఉపపర్వమున కృష్ణపాండవమాగధయాత్ర అను ఇరువదియవ అధ్యాయము. (20)