40. నలుబదవ అధ్యాయము
(శిశుపాల వధ పర్వము)
శిశుపాలుని గూర్చి భీష్ముని పలుకులు.
వైశంపాయన ఉవాచ
తతః సాగరసంకాశం దృష్ట్వా నృపతిమండలమ్ ।
సంవర్తవాతాభిహతం భీమం క్షుబ్ధమివార్ణవమ్ ॥ 1
రోషాత్ ప్రచలితం సర్వమ్ ఇదమాహ యుధిష్ఠిరః ।
భీష్మం మతిమతాం ముఖ్యం వృద్ధం కురుపితామహమ్ ।
బృహస్పతిం బృహత్తేజాః పురుహూత ఇవారిహా ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - అనంతరం సుడిగాలికి సంచలించి, భయంకరంగా సముద్రం వలె రోషంతో కదులుతూ ఉన్న ఆ రాజసమూహాన్ని చూసి ఇంద్రుడు బృహస్పతితో వలె యుధిష్ఠిరుడు బుద్ధిమంతులలో ముఖ్యుడు, వృద్ధుడు, కురుపితామహుడు అయిన భీష్మునితో ఇలా అన్నాడు. (1,2)
అసౌ రోషాత్ ప్రచలితః మహాన్ నృపతిసాగరః ।
అత్ర యత్ ప్రతిపత్తవ్యం తన్మే బ్రూహి పితామహ ॥ 3
పితామహా! ఈ రాజసముద్రం రోషంతో ఊగిపోతోంది. ఈ విషయంలో ఏం చేయాలో నీవే చెప్పవలసింది. (3)
యజ్ఞస్య చ న విఘ్నః స్యాత్ ప్రజానాం చ హితం భవేత్ ।
యథా సర్వత్ర తత్ సర్వం బ్రూహి మేఽద్య పితామహ ॥ 4
పితామహా! యజ్ఞానికి విఘ్నం కలగకూడదు. ప్రజలకు హితమూ జరగాలి. అన్ని విధాలా ఏది కర్తవ్యమో అది నాకు చెప్పు.
ఇత్యుక్తవతి ధర్మజ్ఞే ధర్మరాజే యుధిష్ఠిరే ।
ఉవాచేదం వచో భీష్మః తతః కురుపితామహః ॥ 5
ఈవిధంగా ధర్మజ్ఞుడు, యుధిష్ఠిరుడు అయిన ధర్మరాజు చెప్పగా, కురుపితామహుడైన భీష్ముడు ఇలా అన్నాడు. (5)
మా భైస్వం కురుశార్దూల శ్వా సింహం హంతుమర్హతి ।
శివః పంథాః సునీతోఽత్ర మయా పూర్వతరం వృతః ॥ 6
కురుశార్దూలా! నీవు భయపడకు. కుక్క సింహాన్ని చంపగలదా! శుభమైన మార్గాన్ని నేను మునుపే స్వీకరించాను. (6)
ప్రసుప్తే హి యథా సింహే శ్వానస్తస్మిన్ సమాగతాః ।
భషేయుః సహితాః సర్వే తథేమే వసుథాధిపాః ॥ 7
వృష్ణిసింహస్య సుప్తస్య తథామీ ప్రముఖే స్థితాః ।
సింహం నిద్రిస్తూంటే చుట్టూరా చేరి కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అలాగే వృష్ణివంశసింహమ్ కృష్ణుడు నిద్రిస్తుంటే ఈ రాజులంతా మొరుగుతున్నారు. (7 1/2)
భషంతే తాత సంక్రుద్ధాః శ్వానః సింహస్య సంనిధౌ ॥ 8
న హి సంబుధ్యతే యావత్ సుప్తః సింహ ఇవచ్యుతః ।
తేన సింహీకరోత్యేతాన్ నృసింహశ్చేదిపుంగవః ॥ 9
పార్థివాన్ పార్థివశ్రేష్ఠః శిశుపాలోఽప్యచేతనః ।
సర్వాన్ సర్వాత్మనా తాత నేతుకామో యమక్షయమ్ ॥ 10
ధర్మరాజా! సింహం లేల్కొనే వరకూ కుక్కలు అలాగే మొరుగుతూ ఉంటాయి. సింహం లాంటి అచ్యుతుడు మేల్కొనే వరకూ ఈ పురుషపుంగవుడు శిశుపాలుడు రాజులందరినీ సింహాలుగా చేస్తూ ఉంటాడు. తెలివిమాలిన శిశుపాలుడు రాజులందరినీ యమలోకానికి లాక్కు పోదామనుకొంటున్నాడు. (8-10)
నూనమేతత్ సమాదాతుమ్ పునరిచ్ఛత్యధోక్షజః ।
యదస్య శిశుపాలస్య తేజస్తిష్ఠతి భారత ॥ 11
ఈ శిశుపాలుని తేజస్సును మళ్లీ తనలోకి తీసుకోవాలని శ్రీకృష్ణుడు భావిస్తున్నాడు. (11)
విప్లుతా చాస్య భద్రం తే బుద్ధిర్బుద్ధిమతామ్ వర ।
చేదిరాజస్య కౌమ్తేయ సర్వేషాం చ మహీక్షితామ్ ॥ 12
బుద్ధిమంతుడా! ధర్మజా! నీకు శుభమగుగాక - ఇపుడీ శిశుపాలుని బుద్ధి, ఇతరరాజుల బుద్ధులు సంచలించాయి. (12)
ఆదాయం చ నరవ్యాఘ్రః యం యమిచ్ఛత్యయం తదా ।
తస్య విప్లవతే బుద్ధిః ఏవం చేదిపతేర్యథా ॥ 13
పురుషోత్తముడు తనలోకి తీసుకుందామనుకున్న వారి బుద్ధులు శిశుపాలుని బుద్ధివలె ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. (13)
చతుర్విధానాం భూతానాం త్రిషు లోకేషు మాధవః ।
ప్రభవశ్చైవ సర్వేషాం నిధనం చ యుధిష్ఠిర ॥ 14
ధర్మజా! మూడులోకాల్లోను ఉన్న నాల్గు రకాల ప్రాణులకు కూడా జనన మరణాలకు ఆ మాధవుడే కారకుడు. (14)
వైశంపాయన ఉవాచ
ఇతి తస్య వచః శ్రుత్వా తతశ్చేదిపతిర్నృపః ।
భీష్మం రూక్షాక్షరా వాచః శ్రావయామాస భారత ॥ 15
భీష్ముని మాటలు విని శిశుపాలుడు భీష్ముని దురుసుగా ఇలా అన్నాడు. (15)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి యుధిష్ఠిరాశ్వాసనే చత్వురింశోఽధ్యాయః ॥ 40 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున శిశుపాలవధపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరాశ్వాసనము అను నలువదవ అధ్యాయము. (40)