42. నలువది రెండవ అధ్యాయము

కోపించిన భీముని భీష్ముడు వారించుట.

శిశుపాల ఉవాచ
స మే బహుమతో రాజా జరాసంధో మహాబలః ।
యోఽనేన యుద్ధం నేయేష దాసోఽయమితి సంయుగే ॥ 1
శిశుపాలుడు ఇలా అన్నాడు. కృష్ణుని దాసునిగా భావించి వానితో యుద్ధం చేయలేదు జరాసంధుడు. అటువంటి మహాబలుడు జరాసంధుడంటే నాకు చాలా ఇష్టం. (1)
కేశవేన కృతం కర్మ జరాసంధవధే తదా ।
భీమసేనార్జునాభ్యాం చ కస్తత్ సాధ్వితి మన్యతే ॥ 2
నేర్పుగా భీమార్జునులతో కేశవుడు జరాసంధుని చంపించడం ఎవరూ మంచిపనిగా భావించడం లేదు. (2)
అద్వారేణ ప్రవిష్టేన ఛద్మనా బ్రహ్మవాదినా ।
దృష్టః ప్రభావః కృష్ణేన జరాసంధస్య భూపతేః ॥ 3
జరాసంధుని ప్రభావం కృష్ణునికి తెలిసింది. ద్వారం విడిచి మారువేషంలో బ్రాహ్మణుల్లా నగరంలో ప్రవేశించవలసి వచ్చింది. (3)
యేన ధర్మాత్మానాఽఽత్మానాం బ్రహ్మణ్యమవిజానతా ।
నేషితమ్ పాద్యమస్మై తద్ దాతుమగ్రే దురాత్మనే ॥ 4
వీని బ్రాహ్మణత్వం ఎంతటిదో తెలియక ఆ ధర్మాత్ముడు జరాసంధుడు వీనికి విప్రయోగ్యమైన పాద్యం ఇచ్చాడు. అది వీడు గ్రహించలేకపోయాడు కదా! (4)
భుజ్యతామితి తేనోక్తాః కృష్ణభీమధనంజయాః ।
జరాసంధేన కౌరవ్య కృష్ణేన వికృతం కృతమ్ ॥ 5
జరాసంధుడు ఈ ముగ్గురికీ భోజనం పెడతానంటే దాన్ని కృష్ణుడు (వికృతంగా చిత్రీకరించి) భుజించనన్నాడు. (5)
యద్యయమ్ జగతః కర్తా యథైనం మూర్ఖ మన్యసే ।
కస్మాన్న బ్రాహ్మణం సమ్యగాత్మానమవగచ్ఛతి ॥ 6
ఈ కృష్ణుడే కనుక నీవనుకున్నట్లు లోకాలకు కర్త అయితే తన్ను బ్రాహ్మణుడుగా ఎందుకు భావించలేదు? (6)
ఇదం త్వాశ్వర్యభూతం మే యది మే పాండవాస్త్వయా ।
అపకృష్టాః సతాం మార్గాత్ మన్యంతే తచ్చ సాధ్వితి ॥ 7
ఈ పాండవులను సన్మార్గం నుండి నీవు తప్పిస్తే అదే మంచిదని భావిస్తున్నారు పాండవులు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. (7)
అథ వా నైతదాశ్చర్యం యేషాం త్వమసి భారత ।
స్త్రీ సధర్మా చ వృద్ధశ్చ సర్వార్థానాం ప్రదర్శకః ॥ 8
భారతా! స్త్రీసమానధర్ముడవూ (నపుంసకుడవు), వృద్ధుడవూ అయిన నీవు ఎవరికి అన్ని విషయాల్లోనూ మార్గదర్శకం చేస్తున్నావో వారికిది ఏమీ ఆశ్చర్యం కాదు, కాకపోనూవచ్చు. (8)
వైశంపాయన ఉవాచ
తస్య తద్ వచనం శ్రుత్వా రూక్షం రూక్షాక్షరం బహు ।
చుకోప బలినాం శ్రేష్ఠః భీమసేనః ప్రతాపవాన్ ॥ 9
వైశంపాయనుడు ఇలా చెప్పాడు. శిశుపాలుని కటువాక్యాలు విని బలపరాక్రమశాలి అయిన భీమునికి చాలా కోపం వచ్చింది. (9)
తథా పద్మప్రతీకాశే స్వభావాయతవిస్తృతే ।
భూయః క్రోధాభితామ్రాక్షే రక్తేనేత్రే బభూవతుః ॥ 10
సహజంగా పద్మపత్రాల వలె విశాల సుందరాలయినవి భీముని కనులు. కోపంతో ఇపుడవి బాగా ఎఱ్ఱబడి పోయాయి. (10)
త్రిశిఖాం భ్రుకుటీం చాస్య దదృశుః సర్వపార్థివాః ।
లలాటస్థామ్ త్రికూటస్థాం గంగాం త్రిపథగామివ ॥ 11
అతని నుదురు బొమముడితో మూడుపాయలయింది. త్రికూటపర్వతం మీద మూడు పాయలై ప్రవహించిన గంగానదిలా అనిపించింది అక్కడి రాజులందరికీ. (11)
దంతాన్ సందశతస్తస్య కోపాద్ దదృశురాననమ్ ।
యుగాంతే సర్వభూతాని కాలస్యేవ జిఘత్సతః ॥ 12
క్రోధంతో పళ్లు పటపటలాడిస్తున్న భీముని ముఖం సర్వభుతాలను సంహరిస్తున్న యముని ముఖంలా భాసించింది. (12)
ఉత్పతంతం తు వేగేన జగ్రాహైనం మనస్వినమ్ ।
భీష్మ ఏవ మహాబాహుః మహాసేనమివేశ్వరః ॥ 13
వేగంగా (శిశుపాలుని మీదికి) దూకుతున్న మనస్వి అయిన భీముని భీష్ముడు పట్టుకొని ఆపాడు. ఆ దృశ్యం మహేశ్వరుడు కుమారస్వామిని పట్టి నిలిపినట్లుంది. (13)
తస్య భీమస్య భీష్మేణ వార్యమాణస్య భారత ।
గురుణా వివిధైర్వాక్యైః క్రోధః ప్రశమమాగతః ॥ 14
పితామహుడయిన భీష్ముడు సముచితవాక్యాలతో వారించాడు. దానితో భీముని కోపం ఉపశమించింది. (14)
నాతిచక్రామ భీష్మస్య స హి వాక్యమరిందమః ।
సముద్ వృత్తో ఘనాపాయే వేలామివ మహోదధిః ॥ 15
వానకాలం పూర్తి అయ్యాక సముద్రం చెలియలికట్టను దాటలేక వెనుదిరిగినట్లు శత్రుసంహారకుడయిన భీముడు భీష్ముని మాటను అతిక్రమింపలేకపోయాడు. (15)
శిశుపాలస్తు సంక్రుద్ధే భీమసేనే జనాధిప ।
నాకంపత తదా వీరః పౌరుషే స్వే వ్యవస్థితః ॥ 16
రాజా! శిశుపాలుడు మాత్రం భీముని కోపానికి ఏ మాత్రం చలించకుండా తన పౌరుషం మీదనే నిలిచాడు. (16)
ఉత్పతంతం తు వేగేన పునః పునరరిందమః ।
న స తం చింతయామాస సింహః క్రుద్ధో మృగం యథా ॥ 17
ఇంకా ఇంకా పైపైకి వస్తున్న భీముని శిశుపాలుడు ఏమీ లెక్కచేయలేదు. ఇది క్రుద్ధమైన సింహం మృగాన్ని లెక్క చేయనట్లుంది. (17)
ప్రహసంశ్చాబ్రవీద్ వాక్యం చేదిరాజః ప్రతాపవాన్ ।
భీమసేనమభిక్రుద్ధం దృష్ట్వా భీమపరాక్రమమ్ ॥ 18
ప్రతాపశాలి అయిన శిశుపాలుడు క్రుద్ధుడై పరాక్రమశాలి అయిన భీముని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. (18)
ముంచైనం భీష్మ పశ్యంతు యావదేనం నరాధిపాః ।
మత్ప్రభావవినిర్దగ్ధం పతంగమివ వహ్నినా ॥ 19
భీష్మా! వీనిని విడిచిపెట్టు. అగ్నితో మిడుత దగ్ధమయినట్లు ఇతడు నా ప్రభావంతో భస్మమయితే ఈ రాజులంతా చూస్తారు. (19)
తతశ్చేదిపతేర్వాక్యం శ్రుత్వా తత్ కురుసత్తమః ।
భీమసేనమువాచేదం భీష్మో మతిమతాం వరః ॥ 20
శిశుపాలుని ఈ మాటలు విని ప్రజ్ఞావంతుడయిన భీష్ముడు భీమునితో ఇలా అన్నాడు. (20)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి భీమక్రోధే ద్విచత్వారింశోఽధ్యాయః ॥ 42 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున శిశుపాలవధపర్వమను ఉపపర్వమున భీమక్రోధమను నలువది రెండవ అధ్యాయము. (42)