44. నలువది నాలుగవ అధ్యాయము
భీష్ముని సమాదానము.
భీష్మ ఉవాచ
నైషా చేదిపతేర్బుద్ధిః యయా త్వాఽఽహ్వయతేఽచ్యుతమ్ ।
నూనమేష జగద్భర్తుః కృష్ణస్యైవ వినిశ్చయః ॥ 1
భీష్ముడిలా అన్నాడు - ఈ చేదిరాజు కృష్ణుని ఆహ్వానించడం నిజంగా వీని బుద్ధి కాదు. ఇది తప్పకుండా జగన్నాథుడయిన కృష్ణుని నిశ్చయమే. (1)
కో హి మాం భీమసేనాద్య క్షితావర్హతి పార్థివః ।
క్షేప్తుం కాలపరీతాత్మా యథైష కులపాంసనః ॥ 2
భీమసేనా! నన్ను అధిక్షేపించడమ్ కాలపరీత బుద్ధియై, కులకలంకుడు అయిన వీనికే చెల్లింది కాని లేకపోతే నన్ను ఈ భూమి మీద మరోరాజు ఎవడయినా అధిక్షేపించగలడా? (2)
ఏష హ్యస్య మహాబాహుః తేజోంఽశశ్చ హరేర్ర్ధువమ్ ।
తమేవ పునరాదాతుమ్ ఇచ్ఛత్యుత తథా విభుః ॥ 3
ఈ శిశుపాలుడు నిశ్చయంగా శ్రీహరి తేజోంశమే. అందుకే వీనిని ఆ హరి మళ్లీ తనలోకి లాక్కుంటాడేమో! (3)
యేనైష కురుశార్దూల శార్దూల ఇవ చేదిరాట్ ।
గర్జత్యతీవ దుర్బుద్ధిః సర్వానస్మానచింతయన్ ॥ 4
అందుకే మనలనందరినీ లెక్కచేయకుమ్డా పెద్దపులిలా గర్జిస్తున్నాడు ఈ శిశుపాలుడు. (4)
వైశంపాయన ఉవాచ
తతో న మమృషే చైద్యః తద్ భీష్మవచనం తదా ।
ఉవాచ చైనం సంక్రుద్ధః పునర్భీష్మమథోత్తరమ్ ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు - అయినా శిశుపాలుడు భీష్ముని మాటలను సహించకుండా కోపంతో మళ్లీ భీష్మునికి ఇలా సమాధానం చెప్పాడు. (5)
శిశుపాలుడు ఉవాచ
ద్విషతాం నోఽస్తు భీష్మైషః ప్రభావః కేశవస్య యః ।
యస్య సంస్తవవక్తా త్వమ్ వందివత్ సతతోత్థితః ॥ 6
భీష్మా! నీవు సదా పూనుకొని కృష్ణుని స్తుతిస్తున్నావు. కృష్ణుని ప్రభావం మా శత్రువుల మీద ఉండుగాక. (6)
సంస్తవే చ మనో భీష్మ పరేషాం రమతే యది ।
తదా సంస్తౌషి రాజ్ఞస్త్వమ్ ఇమం హిత్వా జనార్దనమ్ ॥ 7
నీకు ఇతరులను పొగడాలనే మనసు ఉంటే ఈ జనార్దనుని విడిచి ఇతర రాజులను ప్రశంసించు. (7)
దరదం స్తుహి బాహ్లీకమ్ ఇమం పార్థివసత్తమమ్ ।
జాయమానేన యేనేయమ్ అభవద్ దారితా మహీ ॥ 8
ఇడుగో ఈ దరదదేశపు రాజును స్తుతించు. రాజులలో ఉత్తముడు అయిన బాహ్లీకుని స్తుతించు - ఇతడు పుట్టినపుడు భూమి బ్రద్దలయింది. (8)
వంగాంగవిషయాధ్యక్షం సహస్రాక్షసమం బలే ।
స్తుహి కర్ణమిమం భీష్మ మహాచాపవికర్షణమ్ ॥ 9
భీష్మా! ఇడుగో ఈ కర్ణుని స్తుతించు - ఇతడు వంగ అంగదేశాలకు రాజు. బలంళొ ఇంద్రసమానుడు. పెద్దపెద్ద దివ్యధనుస్సులకు ఎక్కుపెట్టగలవాడు. (9)
యస్యేమే కుండలే దివ్యే సహజే దేవనిర్మితే ।
కవచమ్ చ మహాబాహో బాలార్కసదృశప్రభమ్ ॥ 10
వీని ఈ కుండలాలు సహజమైనవి. దేవనిర్మితమైనవి. కవచం కూడా అటువంటిదే. లేత సూర్యుని కాంతితో విరాజిల్లుతున్నాడు. (10)
వాసవప్రతిమో యేన జరాసంధోఽతిదుర్జయః ।
విజితో బాహుయుద్ధేన దేహభేదం చ లంభితః ॥ 11
ఇడుగో ఇంద్రసమానుడయిన భీముడు - ఇతడు దుర్జయుడయిన జరాసంధుని బాహుయుద్ధంలో చంపడం కాదు, చీల్చిపారేశాడు - వీనిని స్తుతించు. (11)
ద్రోనం ద్రౌణిం చ సాధు త్వం పితాపుత్రౌ మహారథౌ ।
స్తుహి స్తుత్యావుభే భీష్మ సతతం ద్విజసత్తమౌ ॥ 12
తండ్రీకొడుకులు, మహారథులూ అయిన ద్రోణాశ్వత్థామలను పొగడు - వారిద్దరూ విప్రోత్తములు. (12)
యయోరన్యతరో భీష్మ సంక్రుద్ధః సచరాచరమ్ ।
ఇమాం వసుమతీం కుర్యాద్ నిఃశేషామితి మే మతిః ॥ 13
వీరిద్దరిలో ఎవరికి కోపం వచ్చినా చరాచరమయిన ఈ భూమి నంతటినీ నిశ్శేషం చేయగలరని నా అభిప్రాయం. (13)
ద్రోణస్య హి సమం యుద్ధే న పశ్యామి నరాధిపమ్ ।
నాశ్వత్థామ్నః సమం భీష్మ న చ తౌ స్తోతుమిచ్చసి ॥ 14
ద్రోణునితో, అశ్వత్థామతోనూ సమంగా యుద్ధం చేయగల రాజును ఇంతవరకు చూడలేదు. మరి నీవు వారిద్దరినీ మాత్రం పొగడవు. (14)
పృథివ్యాం సాగరాంతాయాం యో వై ప్రతిసమో భవేత్ ।
దుర్యోధనం త్వం రాజేంద్రమ్ అతిక్రమ్య మహాభుజమ్ ॥ 15
జయద్రథం చ రాజానం కృతాస్త్రం దృఢవిక్రమమ్ ।
ద్రుమం కింపురుషాచార్యం లోకే ప్రథితవిక్రమమ్ ।
అతిక్రమ్య మహావీర్యం కిం ప్రశంససి కేశవమ్ ॥ 16
సాగరపర్యంతమయిన ఈ భూమి మీద దుర్యోధనునితో సమానమయిన భుజపరాక్రమం కల రాజోత్తముని చూడము. అలాగే స్థిర విక్రముడయిన సైంధవుడూను - కింపురుషులకు కూడా ఆచార్యుడయి ప్రసిద్ధపరాక్రమం కల ద్రుముడూ అంతే. వీరిని వదలి నీవు కేశవుని మాత్రం స్తుతిస్తున్నావు. (15,16)
వృద్ధం చ భారతాచార్యం తథా శారద్వతం కృపమ్ ।
అతిక్రమ్య మహావీర్యం కిం ప్రశంససి కేశవమ్ ॥ 17
వృద్ధుడూ, భరతవంశానికి గురువూ అయిన కృపాచార్యుని వదలి నీవు కేశవుని స్తుతిస్తున్నావు. (17)
ధనుర్ధరాణాం ప్రవరం రుక్మిణం పురుషోత్తమమ్ ।
అతిక్రమ్య మహావీర్యం కిం ప్రశంససి కేశవమ్ ॥ 18
ధనుర్ధారులయిన పురుషులలో ఉత్తముడూ, మహాపరాక్రమవంతుడూ అయిన రుక్మిని వదలి కేశవుని ప్రశంసిస్తున్నావు. (18)
భీష్మకం చ మహావీర్యం దంతవక్ర్తం చ భూమిపమ్ ।
భగదత్తం యూపకేతుం జయత్సేనం చ మాగధమ్ ॥ 19
విరాటద్రుపదౌ చోభే శకునిం చ బృహద్బలమ్ ।
విందానువిందా వావంత్యౌ పాండ్యం శ్వేతమథోత్తరమ్ ॥ 20
శంఖం చ సుమహాభాగం వృషసేనమ్ చ మానినమ్ ।
ఏకలవ్యం చ విక్రాంతం కాళింగం చ మహారథమ్ ॥ 21
అలాగే మహాపరాక్రమశాలి అయిన భీష్మకుని, రాజయిన దంతవక్ర్తుని, భగదత్తుని, యూపకేతుని, జయత్సేనుని, మగధరాజు సహదేవుని, విరాటుని, ద్రుపదుని, శకునిని, బృహద్బలుని, అవంతీరాజులు విందానువిందులనూ, పాండ్యరాజును, శ్వేతుని, ఉత్తరుని, మహాభాగుడు శంఖుని, అభిమానవంతుడు వృషసేనుని, పరాక్రమశాలి ఏకలవ్యుని, మహారథుడూ, బలశాలి అయిన కళింగరాజును వదలి కేశవుని ప్రశంసిస్తున్నావు. (19-21)
శల్యాదీనపి కస్మాత్ త్వం న స్తౌషి వసుధాధిపాన్ ।
స్తవాయ యది తే బుద్ధిః వర్తతే భీష్మ సర్వదా ॥ 22
నీకు పొగడాలని ఉంటే భీష్మా! శల్యాదులయిన రాజులున్నారుగా - వారి నెందుకు స్తుతించవు? (22)
కిం హి శక్యం మయా కర్తుం యద్ వృద్ధానాం త్వయా నృప ।
పురా కథయతాం నూనం న శ్రుతం ధర్మవదినామ్ ॥ 23
ధర్మవేత్తలు పూర్వం చెపుతూ ఉండగా నీవు వినలేదు. కాబోలు - నేనే చేయగలను? (23)
ఆత్మనిందాఽత్మపూజా చ పరనిందా పరస్తవః ।
అనాచరితమార్యాణాం వృత్తమేతచ్చతుర్విధమ్ ॥ 24
ఆత్మనింద, ఆత్మస్తుతి, పరనింద, పరస్తవం ఈ నాల్గు పనులూ సజ్జనులు ఎన్నడూ చేసి ఉండలేదు. (24)
యదస్తవ్యమిమం శశ్వద్ మోహాత్ సంస్తౌషి భక్తితః ।
కేశవం తచ్చ తే భీష్మ న కశ్చిదనుమన్యతే ॥ 25
స్తుతింపరాని కేశవుని నీవు మోహంతో, భక్తితో స్తుతిస్తున్నావు - భీష్మా! నీ ఈ పనిని ఏ రాజా అనుమతించటం లేదు. (25)
కథం భోజస్య పురుషే వర్గపాలే దురాత్మని ।
సమావేశాయసే సర్వం జగత్ కేవలకామ్యయా ॥ 26
దురాత్ముడయిన కృష్ణుడు కంసుని సేవకుడు. అతని గోవులకు మాత్రమే రక్షకుడు. వానిని నీవు కేవలం స్వార్థం కోసం లోకాని కంతకూ అంటగడుతున్నావు. (26)
అథ చైషా న తే బుద్ధిః ప్రకృతిం యాతి భారత ।
మయైవ కథితమ్ పూర్వం భులింగశకునిర్యథా ॥ 27
భారతా! నీ యీ బుద్ధి సహజంగా లేదు. నేను ముందే చెప్పాను. భూలింగ పక్షిలాగా నీ మాటలు "చెప్పేదొకటి చేసే దొకటి" అన్నట్లు ఉన్నాయి. (27)
భూలింగశకుని ర్నామ పార్శ్వే హిమవతః వరే ।
భీష్మ తస్యాః సదావాచః శ్రూయంతేఽర్థవిగర్హితాః ॥ 28
హిమవత్పర్వతానికి అటు ప్రక్క భూలింగ పక్షి ఉండేది. భీష్మా! అది ఇటువంటి నిందార్హమైన మాటలే చెప్పేది. (28)
మా సాహసమితీదం సా సతతం వాశతే కిల ।
సాహసం చాత్మనాతీవ చరంతి నావబుధ్యతే ॥ 29
'సాహసం చెయ్యకు' అని నిత్యమూ చెపుతూ ఉండేదిట. కాని అది మాత్రం సాహసం చేస్తూనే ఉండేది. అయినా ఆ విషయం దానికి తెలిసేది కాదు. (29)
సా హి మాంసార్గళం భీష్మ ముఖాత్ సింహస్య ఖాదతః ।
దంతాంతరవిలగ్నం యత్ తదాదత్తేఽల్పచేతవా ॥ 30
భీష్మా! సింహం మాంసం తింటుంటే దాని పళ్లలో ఇరుక్కున్న మాంసపు ముక్కను అది తినేది. ఎంత అల్పబుద్ధియో! (30)
ఇచ్ఛతః సా హి సింహస్య భీష్మ జీవత్యసంశయమ్ ।
తద్వత్ త్వమప్యధర్మిష్ఠ సదా వాచః ప్రభాషసే ॥ 31
ప్రాణాలకు ముప్పని తెలిసే అది అట్లా చేసేది. అలాగే నీవు కూడా సదా వాగుతూ ఉంటావు. (31)
ఇచ్ఛతాం భూమిపాలానాం భీష్మ జీవస్య సంశయమ్ ।
లోకవిద్విష్టకర్మా హి నాన్యోఽస్తి భవతా సమః ॥ 32
ఈ రాజులు తలచుకొంటే నీ జీవితం సంశయమే అని తెలిసి కూడా లోకం ద్వేషిమ్చే పనులు చేస్తున్నావు. నీ వంటి వాడెవడున్నాడు? (32)
వైశంపాయన ఉవాచ
తతశ్చేదిపతేః శ్రుత్వా భీష్మః స కటుకం వచః ।
ఉవాచేదం వచో రాజన్ చేదిరాజస్య శృణ్వతః ॥ 33
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! శిశుపాలున్ పరుషవాక్కులు విని భీష్ముడు శిశుపాలుడు వింటూ ఉండగా ఇలా అన్నాడు. (33)
ఇచ్ఛతాం కిల నామాహమ్ జీవామ్యేషాం మహీక్షితామ్ ।
సోఽహం న గణయామ్యేతాన్ తృణేనాపి నరాధిపాన్ ॥ 34
ఆహా! నేను ఈ రాజుల దయ వల్ల జీవిస్తున్నానట. ఏం మాటలు! నేను ఈ రాజులందరినీ గడ్డి పరకతో సమానంగా కూడ లెక్కచేయను. (34)
ఏవముక్తే తు భీష్మేణ తతః సంచుక్రుశుర్నృపాః ।
కేచిజ్జహృషిరే తత్ర కేచిద్ భీష్మం జగర్హిరే ॥ 35
భీష్ముడిలా అనగానే కొంతమందికి కోపం వచ్చింది. కొంతమంది సంతోషించారు. కొంతమంది అసహ్యించుకొన్నారు. (35)
కేచిదూచుర్మహేష్వాసాః శ్రుత్వా భీష్మస్య తద్ వచః ।
పాపోఽవలిప్తో వృద్ధశ్చ నాయం భీష్మోఽర్హతి క్షమామ్ ॥ 36
భీష్ముని మాటలు విని కొంతమంది ఇలా అన్నారు. ఈ వృద్ధభీష్ముడు ఇలా గర్వంతో అనరాదు. అది క్షమార్హం కాదు. (36)
హన్యతాం దుర్మతిర్భీష్మః పశువత్ సాధ్వయం నృపాః ।
సర్వైః సమేత్య సంరభ్ధైః దహ్యతాం వా కటాగ్నినా ॥ 37
ఈ భీష్ముని పశువులా అందరూ కలిసి చంపండి. లేదా గడ్డి మంటతో దహించి వేయండి. (37)
ఇతి తేషాం వచః శ్రుత్వా తతః కురుపితామహః ।
ఉవాచ మతిమాన్ భీష్మః తా నేవ వసుధాధిపాన్ ॥ 38
రాజుల ఈ మాటలు విని కురుపితామహుడు, బుద్ధిమంతుడూ, అయిన భీష్ముడు ఆ రాజులతోనే ఇలా అన్నాడు. (38)
క్తస్యోక్తస్య నేహాంతమ్ ఆహం సముపలక్షయే ।
యత్ తు వక్ష్యామి తత్ సర్వం శృణుధ్వమ్ వసుధాధిపాః ॥ 39
ప్రతీమాటకూ సమాధానం చెప్పడం మొదలుపెడితే దీనికి అంతం నాకు కనపడదు. అందుచేత రాజులారా! నేను చెప్పెది వినండి. (39)
పశువద్ ఘాతనం వా మే దహనం వా కటాగ్నినా ।
క్రియతాం మూర్ధ్ని వో న్యస్తం మయేదం సకలం పదమ్ ॥ 40
మీ అందరి తలమీద నేను నాపాదం పెట్టాను. పశువులా నన్ను చంపుతారో! గడ్డి మంటతో నన్ను దహించుతారో చేసుకోండి. (40)
ఏష తిష్ఠతి గోవిందః పూజితోఽస్మాభిరచ్యుతః ।
యస్య వస్త్వరతే బుద్ధిః మరణాయ స మాధవమ్ ॥ 41
కృష్ణమాహ్వయతామద్య యుద్ధే చక్రగదాధరమ్ ।
యాదవస్యైవదేవస్య దేహం విశతు పాతితః ॥ 42
మేము పూజించిన కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. మీ బుద్ధి మరణానికి త్వరపడుతూ ఉంటే ఈ చక్రగదాధరుడయిన కృష్ణుని యుద్ధానికిపుడే పిలవండి. యుద్ధంలో పడిపోయి ఆ కృష్ణుని దేహంలో ప్రవేశించండి. (41,42)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి భీష్మవాక్యే చతుశ్చత్వారింశోఽధ్యాయః ॥ 44 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున శిశుపాలవధపర్వమను ఉపపర్వమున భీష్మవాక్యమను నలువది నాల్గవ అధ్యాయము. (44)