74. డెబ్బది నాల్గవ అధ్యాయము
(అనుద్యూత పర్వము)
దుర్యోధనుడు పాండవులను మరల జూదమునకు పిలిపించుటకు ధృతరాష్ట్రుని ఒప్పించుట.
జనమేజయ ఉవాచ
అనుజ్ఞాతాంస్తాన్ విదిత్వా సరత్నధనసంచయాన్।
పాండవాన్ ధార్తరాష్ట్రానాం కథమాసీన్మనస్తథా॥ 1
జనమేజయుడిలా అన్నాడు. పాండవులకు వారి రత్నధన సమూహాలతో పాటు ఖాండవప్రస్థానికి వెళ్ళటానికి అనుమతి లభించిందని తెలిసి ధార్తరాష్ట్రు లెలా భావించారు? (1)
వైశంపాయన ఉవాచ
అనుజ్ఞాతాంస్తాన్ విదిత్వా ధృతరాష్ట్రేణ ధీమతా।
రాజన్ దుఃశాసనః క్షిప్రం జగామ భ్రాతరం ప్రతి॥ 2
దుర్యోధనం సమాసాద్య సామాత్యం భరతర్షభ।
దుఃఖార్తో భరతశ్రేష్ఠమ్ ఇదం వచనమబ్రవీత్॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! ధీమంతుడయిన ధృతరాష్ట్రుడు పాండవులు వెళ్లటానికి అనుమతించాడని తెలిసి దుశ్శాసనుడు వెంటనే అన్న దగ్గరకు పోయాడు. భరతర్షభా! అమాత్యులతో కలిసి ఉన్న దుర్యోధనుని సమీపించి దుఃఖార్తితో భరతశ్రేష్ఠునితో ఈ విధంగా పలికాడు. (2,3)
దుఃశ్శాసన ఉవాచ
దుఃఖేనైతత్ సమానీతం స్థవిరో నాశయత్యసౌ।
శత్రుసాద్ గమయద్ ద్రవ్యం తద్ బుధ్యధ్వం మహారథాః॥ 4
దుశ్శాసనుడిలా అన్నాడు. మహారథులారా! మనం కష్టపడి ధనాన్ని సాధించాం. కానీ ఈ ముసలి అంతా నాశనం చేస్తున్నాడు. ధనాన్ని అంతా శత్రువులపాలు జేశాడు. గ్రహించండి. (4)
అథ దుర్యోధనః కర్ణః శకునిశ్చాపి సౌబలః।
మిథః సంగమ్య సహితాః పాండవాన్ ప్రతిమానివః॥ 5
వైచిత్రవీర్యం రాజానం ధృతరాష్ట్రం మనీషిణమ్।
అభిగమ్య త్వరాయుక్తాః శ్లక్ష్ణం వచనమబ్రువన్॥ 6
ఆ తర్వాత అభిమానవంతులైన దుర్యోధనుడు, కర్ణుడు, సౌబలుడైన శకుని పాండవులపై ప్రతీకారం తీర్చుకొనటానికి అందరూ కలిసి ఆలోచించారు. ఆపై తొందరగా వెళ్లి ధృతరాష్ట్రునితో మధురంగా ఇలా అన్నారు. (5,6)
(దుర్యోధన ఉవాచ
అర్జునేన సమో వీర్యః నాస్తి లోకే ధనుర్ధరః।
యోఽర్జునేనార్జునస్తుల్యః ద్విబాహుర్బహుబాహునా॥
దుర్యోధనుడిలా అన్నాడు. లోకంలో అర్జునునితో సాటిరాగల విలుకాడు లేడు. రెండు భుజాలు గల ఈ అర్జునునకు వేయి బాహువులు గల ఆ కార్తవీర్యార్జునుడే సాటి.
శృణు రాజన్ పురా చింత్యాన్ అర్జునస్య చ సాహసాన్।
అర్జునో ధన్వినాం శ్రేష్ఠః దుష్కృతం కృతవాన్ పురా।
ద్రుపదస్య పురే రాజన్ ద్రౌపద్యాశ్చ స్వయంవరే।
అర్జునుడు గతంలో ఊహకందని సాహసకృత్యాల నెన్నింటినో చేశాడు. రాజా! విను. ఆ అర్జునుడు ద్రుపదుని నగరంలోనూ, ద్రౌపదీస్వయంవర సందర్భంలోనీ ఇతరులకు అసాధ్యమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు.
స దృష్ట్వా పార్థివాన్ సర్వాన్ క్రుద్ధాన్ పార్థో మహాబలః॥
వారయిత్వా శరైస్తీక్ష్ణైః అజయత్ తత్ర స స్వయమ్।
జిత్వా తు తాన్ మహీపాలాన్ సర్వాన్ కర్ణపురోగమాన్॥
లేభే కృష్ణాం శుభాం పార్థః యుద్ధ్వా వీర్యబలాత్ తదా।
సర్వక్షత్రసమూహేషు అంబా భీష్మో యథా పురా॥
మహాబలుడైన ఆ అర్జునుడు కోపించిన రాజులనందరినీ చూచి ఎక్కడివారినక్కడే నిలువరించి తానొక్కడై జయించాడు. అప్పుడు కర్ణుడు మొదలుగా గల రాజులందరితో యుద్ధం చేసి గెలిచి పరాక్రమబలంతో శుభప్రద అయిన ద్రౌపదిని పొందాడు. అది గతంలో సర్వక్షత్రియసమూహంలో భీష్ముడు అంబను గెలిచిన రీతిగా కనిపించింది.
తతః కదాచిత్ బీభత్సుః తీర్థయాత్రాః యయౌ స్వయమ్।
అథోలూపీం శుభాం జాతాం నాగరాజసుతాం తదా॥
నాగేష్వవాప చాగ్రేషు ప్రార్థితోఽథ యథాతథమ్।
తతో గోదావరీం వేణ్ణాం కావేరీం చావగాహత।
తరువాత ఒకసారి అర్జునుడు ఒంటరిగా తీర్థయాత్రకు వెళ్ళాడు. ఆ సమయంలో నాగలోకానికి పోయి పరమ సౌందర్యవతి అయిన నాగకన్యక ఉలూపిని ఆమె కోరికపై యథా శాస్త్రంగా పరిణయమాడాడు. ఆ తరువాత గోదావరీ. వేణ్ణా, కావేరీ నదులలో స్నానమాడాడు.
స దక్షిణం సముద్రాంతం గత్వా చాప్సరసాం చ వై।
కుమారతీర్థమాసాద్య మోక్షయామాస చార్జునః॥
గ్రాహరూపాన్వితాః పంచ అతిశౌర్యేణ వై బలాత్॥
అర్జునుడు సముద్రతీరంలోని కుమారతీర్థానికి పోయి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ మకరరూపాలు ధరించిన అయిదుగురు అప్సరసలను బలపూర్వకంగా ఉద్ధరించాడు.
కన్యాతీర్థం సమభ్యేత్య తతో ద్వారవతీం యయౌ।
తత్ర కృష్ణదేశత్ సః సుభద్రాం ప్రాప్య ఫల్గునః।
తామారోప్య రథోపస్థే ప్రయయౌ స్వపురీం ప్రతి॥
ఆ తరువాత కన్యాకుమారీ తీర్థానికి పోయి ఆపై వెనుదిరిగి ద్వారకకు వెళ్ళాడు. అక్కడ కృష్ణుని ఆదేశంతో ఫాల్గునుడు సుభద్రను తీసికొని రథంపై కూర్చొనబెట్టుకొని తన నగరానికి వెళ్ళిపోయాడు.
భూయః శృణు మహారాజ ఫల్గునస్య తు సాహసమ్।
దదౌ చ వహ్నేర్బీభత్సుః ప్రార్థితం ఖాండవం వనమ్॥
లబ్ధమాత్రే తు తేనాథ భగవాన్ హవ్యవాహనః।
భక్షితుం ఖాండవం రాజన్ తతః సముపచక్రమే॥
మహారాజా! ఆ అర్జునుని సాహసాన్ని ఇంకా చెపుతాను విను. అగ్నిదేవుడు యాచించగా ఖాండవవనాన్ని ఆయనకిచ్చాడు. రాజా! అర్జునుడు ఇచ్చీ ఇవ్వగానే అగ్ని ఖాండవవనాన్ని దహింపనారంభించాడు.
తతస్తం భక్షయంతం వై సవ్యపాచీ విభావసుమ్।
రథీ ధన్వీ శరాన్ గృహ్య స కలాపయుతః ప్రభుః॥
పాలయామాస రాజేంద్ర స్వవీర్యేణ మహాబలః॥
రాజేంద్రా! అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహింప నారంభించినప్పుడు ఆ అగ్ని ఇచ్చిన రథాన్ని, వింటినీ, బాణాలను కవచాన్ని స్వీకరించి మహాబలుడై ప్రభావశాలియై అర్జునుడు ఆ అగ్నిని రక్షింపసాగాడు.
తతః శ్రుత్వా మహేంద్రస్తం మేఘాంస్తాన్ సందిదేశ హ।
తేనోక్తా మేఘసంఘాస్తే వవర్షురతివృష్టిభిః॥
ఆ విషయం విని మహేంద్రుడు మేఘాలకు ఆదేశాలనిచ్చాడు. ఆయన ఆదేశం మేరకు మేఘాలు అతివృష్టిగా కురిశాయి.
తతో మేఘగణాన్ పార్థః శరవ్రాతైః సమంతతః।
ఖగమైర్వారయామాస తదాశ్చర్యమివాభవత్॥
అప్పుడు అర్జునుడు ఆకాశంలో అన్నివైపుల శరసమూహాలను ప్రయోగించి మేఘాలను వారించాడు. అది ఆశ్చర్యం.
వారితాన్ మేఘసంఘాంశ్చ శ్రుత్వా క్రుద్ధః పురందరః।
పాండురం గజమాస్థాయ సర్వదేవగణైర్వృతః॥
యయౌ పార్థేన సంయోద్ధుం రక్షార్థం ఖాండవస్య చ॥
మేఘాలు నిరోధింపబడిన విషయం విని దేవేంద్రుడు క్రుద్ధుడై తెల్లని ఏనుగునెక్కి సర్వదేవగణాలు తనచుట్టు నిలువగా ఖాండవరక్షణకై అర్జునునితో యుద్ధం చేయటానికి వెళ్ళాడు.
రుద్రాశ్చ మరుతశ్చైవ వసవశ్చాశ్వినౌ తదా।
ఆదిత్యాశ్చైవ సాధ్యాశ్చ విశ్వేదేవాశ్చ భారత॥
గంధర్వాశ్చైవ సహితా అన్యే సురగణాశ్చ యే।
తే సర్వే శాస్త్రసంపన్నాః దీప్యమానాః స్వతేజసా।
ధనంజయం జిఘాంసంతః ప్రపేతుర్విబుధాధిపాః॥
భారతా! అప్పుడు రుద్రులు, మరుత్తులు, వసువులు, అశ్వినులు, ఆదిత్యులు, సాధ్యులు, విశ్వేదేవులు, గంధర్వులు, తదితర దేవగణాలు ఒక్కటిగా కలిసి అర్జునుని చంపాలని వచ్చారు. ఆ విబుధేంద్రులందరూ తమ తేజస్సుతో వెలుగొందుతున్నవారు. శస్త్రాస్త్రశాస్త్రసంపన్నులు.
తతో దేవగణాః సర్వే యుద్ధ్వా పార్థేన వై ముహుః।
రణే జేతుమశక్యం తం జ్ఞాత్వా తే భరతర్షభ॥
శాంతాస్తే విబుధాః సర్వే పార్థబాణాభిపీడితాః।
భరతర్షభ! అటు తర్వాత ఆ దేవగణాలన్నీ అర్జునునితో యుద్ధం చేసి, అతనిని యుద్ధంలో గెలవటం అసాధ్యమని తెలిసికొని అర్జునుని బాణఘాతాలు తిని శాంతించాయి.
యుగాంతే యాని దృశ్యంతే నిమిత్తాని మహాంత్యపి।
సర్వాణి తత్ర దృశ్యంతే సుఘోరాణి మహీపతే॥
మహారాజా! ప్రళయకాలంలో వినాశసూచకంగా కనిపించే అపశకునాలన్నీ ఆ సమయంలో కనిపించాయి.
తతో దేవగణాః సర్వే పార్థంసమభిదుద్రువుః।
అసంభ్రాంతస్తు తాన్ దృష్ట్వా స తాం దేవమయీం చమూమ్।
త్వరితః ఫాల్గునో గృహ్య తీక్ష్ణాంస్తానాశుగాంస్తదా॥
శక్రం దేనాంశ్చ సంప్రేక్ష్య తస్థౌ కాల ఇవాత్యయే॥
ఆ తరువాత దేవగణాలన్నీ అర్జునుని మీదికి ఉరికాయి. కానీ అర్జునుడు కలవరపాటు లేకుండా దేవమయమయిన ఆ సేనను చూచి శీఘ్రంగా వాడి అయిన బాణాలను తీసికొని దేవేంద్రుని దేవతలనూ చూస్తూ ప్రళయకాలయమునివలె నిశ్చలంగా నిలిచాడు.
తతో దేవగణాః సర్వే బీభత్సం సపురందరాః।
అవాకిరన్ శరవ్రాతైః మానుషం తం మహీసతే॥
రాజా! ఆపై దేవేంద్రునితో కూడిన దేవగణాలు మానవుడైన ఆ అర్జునునిపై బాణవృష్టిని కురిపించాయి.
తతః పార్థో మహాతేజాః గాండీవం గృహ్య సత్వరః॥
వారయామాస దేవానాం శరవ్రాతైః శరాంస్తదా।
అప్పుడు మహాతేజస్వి అయిన అర్జునుడు వెంటనే గాండీవాన్ని చేతబట్టి బాణాలను ప్రయోగించి దేవగణాల బాణాలను నివారించాడు.
పునః క్రుద్ధాః సురాః సర్వే మర్త్యం సంఖ్యే మహాబలాః॥
నానాశస్రైర్వవర్షుస్తం సవ్యసాచిం మహీపతే॥
రాజా! మరల మహాబలులయిన దేవతలు అందరూ కోపించి మానవుడైన సవ్యసాచిపై వివిధశస్త్రవర్షాన్ని కురిపించారు.
తాన్ పార్థః శస్త్రవర్షాన్ వై విసృష్టాన్ విబుధైస్తదా।
ద్విధా త్రిధా చ చిచ్ఛేద ఖ ఏవ నిశితైః శరైః॥
అప్పుడు దేవతలు కురిపించిన ఆ శస్త్రవృష్టిని అర్జునుడు వాడి బాణాలతో గగనతలంలోనే రెండేసి, మూడేసి ముక్కలు చేశాడు.
పునశ్చ పార్థః సంక్రుద్ధః మండలీకృతకార్ముకః।
దేవసంఘాన్ శరైస్తీక్ష్ణైః ఆర్పయద్ వై సమంతతః॥
అర్జునుడు మరల తీవ్రకోపంతో వింటిని మండలాకారంగా వంచి తీక్ష్ణబాణాలతో అన్నివైపుల దేవసమూహాలను గాయపరిచాడు.
విద్రుతాన్ దేవసంఘాంస్తాన్ రణే దృష్ట్వా పురందరః।
తతః క్రుద్ధో మహాతేజాః పార్థం బాణైరవాకిరత్॥
యుద్ధభూమినుండి పరుగెత్తుతున్న దేవగణాలను చూచి మహాతేజస్వి అయిన దేవేంద్రుడు అర్జునునిపై బాణాలను వెదజల్లాడు.
పార్థోఽపి శక్రం వివ్యాథ మానుషో విబుధాధిపమ్॥
తతః సోఽశ్మమయం వర్షం వ్యసృజద్ విబుధాధిపః।
తచ్ఛరైరర్జునో వర్షం ప్రతిజఘ్నేఽత్యమర్షణః॥
అథ సంవర్ధయామాస తద్ వర్షం దేవరాడపి।
భూయ ఏవ తదా వీర్యం జిజ్ఞాసుః సవ్యసాచివః॥
మానవుడయిన అర్జునుడు కూడ దేవాధిపతి అయిన శక్రుని గాయపరిచాడు. అప్పుడు దేవేంద్రుడు రాళ్ళవాన కురిపించాడు. దానితో అసహనానికి లోనై అర్జునుడు బాణాలతో ఆ రాళ్ళవానను నిరోధించాడు. దేవేంద్రుడు అర్జునుని పరాక్రమాన్ని ఇంకా పరీక్షింపగోరి ఆ రాళ్ళవానను మరీ ఎక్కువ చేశాడు.
సోఽశ్మవర్షం మహావేగమ్ ఇషుభిః పాండవోఽపిచ।
విలయం గమయామాస హర్షయన్ పాకశాసనమ్॥
ఆ అర్జునుడు మహేంద్రునకు ఆనందాన్ని కల్గిస్తూ మహావేగంతో ఆ రాళ్ళవానను తనబాణాలతో లయింపజేశాడు.
ఉపాదాయ తు పాణిభ్యామ్ అంగదం నామ పర్వతమ్।
పద్రుమం వ్యసృజచ్ఛక్రః జిఘాంసుః శ్వేతవాహనమ్॥
తతోఽర్జునో వేగవద్భిః జ్వలమానైరజిహ్మగైః।
బాణైర్విధ్వంసయామాస గిరిరాజం సహస్రశః॥
శక్రం చ వారయామాస శరైః పార్థో బలాద్ యుధి।
మహేంద్రుడు అర్జునుని చంపదలచినట్లుగా అంగదమనే పర్వతాన్ని చెట్లతో సహా చేతులతో పెరికి అర్జునుని మీదికి విసిరాడు. అప్పుడు అర్జునుడు అగ్నిలా మండుతున్న బాణాలను వేలకొలది నేరుగా లక్ష్యంమీదికి ప్రయోగించి ఆ శ్రేష్ఠపర్వతాన్ని ధ్వంసం చేశాడు. పార్థుడు యుద్ధంలో బలాన్నంతా వినియోగించి బాణాలతో ఇంద్రుని వారించాడు.
తతః శక్రో మహారాజ రణే వీరం ధనంజయమ్॥
జ్ఞాత్వా జేతుమశక్యం తం తేజోబలసమన్వితమ్॥
పరాం ప్రీతిం యయౌ తత్ర పుత్రశౌర్యేణవాసవః।
మహారాజా! తర్వాత ఇంద్రుడు తేజోబలసమన్వితుడై వీరుడైన ఆ అర్జునుని యుద్ధంలో గెలవటం వీలుకాదని గ్రహించి కుమారుని పరాక్రమానికి చాలా మురిసిపోయాడు.
తదా తత్ర న తస్యాసీద దివి కశ్చిన్మహాయశాః॥
సమర్థో నిర్జయే రాజన్ అపి సాక్షాత్ ప్రజాపతిః॥
రాజా! ఆ సమయంలో అక్కడ - స్వర్గలోకంలో - అర్జునుని గెలువగల ఖ్యాథిగల వీరులెవ్వరూ లేకపోయారు. సాక్షాత్తు బ్రహ్మదేవునికయినా అర్జునుని గెలువగల స్థితి లేదు.
తతః పార్థః శరైర్హత్వా యక్షరాక్షసపన్నగాన్।
దీప్తే చాగ్నౌమహాతేజాః పాతయామాస సంతతమ్॥
ప్రతిప్రేక్షయితుం పార్థం న శేకుస్తత్ర కేచన।
దృష్ట్వా నివారితం శక్రం దివి దేవగణైః సహ॥
మహాతేజస్వి అయిన అర్జునుడు యక్షరాక్షస పన్నగాలను తన బాణాలతో చంపి ప్రజ్వరిల్లే అగ్నిలో పడవేశాడు. స్వర్గవాసులనందరినీ ఇంద్రునితో సహా నిలువరించాడు. అప్పుడు అక్కడ అర్జునుని వైపి తేరిచూడగల వారెవ్వరూ లేకపోయారు.
యథా సుపర్ణః సోమార్థం విబుధానజయత్ పురా।
తథా జిత్వా సురాన్ పార్థః తర్పయామాస పావకమ్॥
తతోఽర్జునః స్వవీర్యేణ తర్పయిత్వా విభావసుమ్।
రథం ధ్వజం హయాంశ్చైవ దివ్యాస్త్రాణి సభాం చ వై॥
గాండీవం చ ధనుఃశ్రేష్ఠం తూణీ చాక్షయసాయకౌ।
ఏతాన్యవాప బీభత్సుః లేభే కీర్తిం చ భారత॥
భారతా! గతంలో అమృతంకోసం గరుత్మంతుడు దేవతలను జయించినట్లు అర్జునుడు దేవతలను గెలిచి ఖాండవ దననం ద్వారా అగ్నిని తృప్తిపరచాడు. ఈ ప్రకారంగా అర్జునుడు తన పరాక్రమంతో అగ్నిని తృప్తిపరచి రథాన్ని, ధ్వజాన్ని, గుఱ్ఱాలను, దివ్యాస్త్రాలను మేటివిల్లు అయిన గాండీవాన్ని అక్షయబాణాలు గల రెండు అమ్ములపొదులను పొందాడు. వీటితోపాటు కీర్తిని, మయుని ద్వారా ఒక సభాభవనాన్ని కూడా పొందాడు.
భూయోఽపి శృణు రాజేంద్ర పార్థో గత్వోత్తరాం దిశమ్।
విజిత్య నవవర్షాంశ్చ సపురాంశ్చ సపర్వతాన్॥
జంబూద్వీపం వశే కృత్వా సర్వం తద్ భరతర్షభ।
బలాజ్జిత్వా నృపాన్ సర్వాన్ కరే చ వినివేశ్య చ॥
రత్నాన్యాదాయ సర్వాణి గత్వా చైవ పునః పురమ్।
తతో జ్యేష్ఠం మహాత్మానం ధర్మరాజం యుధిష్ఠిరమ్॥
రాజసూయం క్రతుశ్రేష్ఠం కారయామాస భారత॥
రాజేంద్రా! ఇంకా చెపుతాను విను. అర్జునుడు ఉత్తరదిగ్యాత్ర చేసి జంబూద్వీపంలోని తొమ్మిది ప్రాంతాలను పర్వతనగరాలతో సహా గెలుచుకున్నాడు. భరతర్షభా! జంబూద్వీపాన్నంతా వశం చేసికొని రాజులనందరినీ బలప్రయోగంతో ఓడించి, పన్నులు వేసి, వివిధ రత్నాలను గైకొని తిరిగి నగరానికి వెళ్ళిపోయాడు. భారతా! తరువాత మహాత్ముడైన తన అన్న, యుధిష్ఠిరునితో ఉత్తమయాగమైన రాజసూయాన్ని చేయించాడు.
స తాన్యన్యాని కర్మాణి కృతవానర్జునః పురా।
అర్జునేన సమో వీర్యే నాస్తి లోకే పుమాన్ క్వచిత్॥
వీటితో పాటు మరెన్నో పరాక్రమకార్యాలను గతంలో చేశాడు. పరాక్రమంలో అర్జునునితో సమానుడైన మగవాడెవ్వడూ లోకంలో లేడు.
దేవదానవయక్షాశ్చ పిశాచోరగరాక్షసాః।
భీష్మద్రోణాదయః సర్వే కురవశ్చ మహారథాః॥
లోకే సర్వనృపాశ్చైవ వీరాశ్చాన్యే ధనుర్ధరా।
ఏతే చాన్యే చ బహవః పరివార్య మహీపతే॥
ఏకం పార్థం రణే యత్తాః ప్రతియోద్ధుం న శక్నుయుః॥
రాజా! దేవతలు, దానవులు, యక్షులు, పిశాచాలు, నాగులు, రాక్షసులు, కురువంశమహారథులయిన భీష్మద్రోణాదులు, లోకంలోని సమస్తరాజులు, ఇతరవీరులు, మేటి విలుకాండ్రు మరెందరో కలిసి అర్జునుని చుట్టుముట్టి సావధానులై నిలిచినా ఒంటరియై యుద్ధంలో నిలిచిన అర్జునుని ఎదిరించలేము.
అహం హి నిత్యం కౌరవ్య ఫాల్గునం ప్రతిసత్తమమ్।
అనిశం చింతయిత్వా తం సముద్విగ్నోఽస్మి తద్భయాత్॥
కౌరవ్యా! నేను మంచివారిలో మేటి అయిన అర్జునుని గూర్చి నిరంతరం ఆలోచిస్తూ భయంతో ఉద్విగ్నుడ నవుతున్నాను.
గృహే గృహే చ పశ్యామి తాత పార్థమహం సదా।
శరగాండీవ సంయుక్తం పాశహస్తమివాంతకమ్॥
అపి పార్థసహస్రాణి భీతః పశ్యామి భారత।
పార్థభూతమిదం సర్వం నగరం ప్రతిభాతి మే॥
తండ్రీ! నాకు ప్రతిఇంటిలోనూ పాశాన్ని చేతబట్టిన యమధర్మరాజువలె గాండీవంపై బాణాలు ఎక్కుపెట్టిన అర్జునుడే కనిపిస్తున్నాడు. భారతా! ఆ భాయంలో వేలకొలదీ అర్జునులు నాకు కనిపిస్తున్నారు. ఈ నగరమంతా అర్జునమయంగా నాకు కనిపిస్తోంది.
పార్థమేవ హి పశ్యామి రహితే తాత భారత।
దృష్ట్వా స్వప్నగతం పార్థమ్ ఉద్ భ్రమామి హ్యచేతనః॥
తండ్రీ! భారతా! ఏకాంతంలో కూడా నాకు అర్జునుడే కనిపిస్తున్నాడు. కలలో కూడా అర్జునుని చూచి నిశ్చేష్టుడనై బెదరిపోయి లేస్తున్నాను.
అకారాదీని నామాని అర్జునత్రస్తచేతసః।
అశ్వాశ్చార్థా హ్యజాశ్చైవ త్రాపం సంజనయంతి మే॥
అర్జునుడంటే నాకు చాలా భయం. దానితో అకారంతో మొదలయ్యే అశ్వ-అర్థ-అజ పదాలను విన్నా నాకు భయం కలుగుతోంది.
నాస్తు పార్థాదృతే తాత పరవీరాద్ భయం మమ।
ప్రహ్లాదం వా బలిం నాపి హన్యాద్ధి విజయో రణే॥
తస్మాత్ తేన మహారాజ యుద్ధమస్మజ్జనక్షయమ్।
అహం తస్య ప్రభావజ్ఞః నిత్యం దుఃఖం వహామి చ॥
తండ్రీ! అర్జునునివలన తప్ప మరే శత్రువీరులన్నా నాకు భయం లేదు. యుద్ధంలో అర్జునుడు ప్రహ్లాదుని అయినా బలిచక్రవర్తి నయినా చంపగలడు. కాబట్టి మహారాజా! అర్జునునితో యుద్ధమంటే స్వజనవినాశమే. అర్జునుని ప్రభావమేమిటో నాకు తెలుసు. అందుకే నిత్యం దుఃఖిస్తున్నాను.
పురా హి దండకారణ్యే మారీచస్య యథా భయమ్।
భవేద రామే మహావీర్యే తథా పార్థే భయం మమ॥
పూర్వం దండకారణ్యంలో మారీచునకు రాముడంటే ఎలా భయముండేదో అలాగే నాకు మహావీరుడైన అర్జునుడంటే భయం.
ధృతరాష్ట్ర ఉవాచ
జానామ్యేవ మహద్ వీర్యం జిష్ణోరేతద్ దురాసదమ్।
తాత వీరస్య పార్థస్య మా కార్తీస్త్వం తు విప్రియమ్॥
ద్యూతం వా శస్త్రయుద్ధం వా దుర్యాక్యం వా కదాచన।
ఏతేష్వేవం కృతే తస్య విగ్రహశ్చైవ వో భవేత్॥
తస్మాత్ త్వం పుత్ర పార్థేన నిత్యం స్నేహేన వర్తయ॥
యశ్చ పార్థేన సంబంధాద్ వర్తతే చ నరో భువి।
తస్య నాస్తి భయం కించిత్ త్రిషు లోకేషు భారత॥
తస్మాత్ త్వం జిష్ణునా వత్స నిత్యం స్నేహేన వర్తయ॥
ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
నాయనా! అర్జునుడు మహాపరాక్రమశాలి అని నాకు తెలుసు. అతనిని ఎదిరించటం చాలా కష్టం కాబట్టి అర్జునునికి నచ్చని పని ఏదీ చేయవద్దు. జూదమైనా, శస్త్రయుద్ధమైనా, దుర్భాషణలయినా ఎప్పుడూ చేయవద్దు. అలా జరిగితే మీకు అతనితో యుద్ధం చేయవలసివస్తుంది. కాబట్టి కుమారా! అర్జునునితో స్నేహంతోనే ప్రవర్తించు. భారతా! అర్జునునితో సత్సంబంధమున్న మనిషికి మూడు లోకాలలోనూ భయం కలుగదు. కాబట్టి నాయనా! ఆ అర్జునునితో ఎప్పుడూ స్నేహంతో మెలగు.
దుర్యోధన ఉవాచ
ద్యూతే పార్థస్య కౌరవ్య మాయయా నికృతిఃకృతా।
తస్మాద్ధి తం జహి సదా త్వన్యోపాయేన నో భవేత్॥
దుర్యోధనుడిలా అన్నాడు. కౌరవ్యా! జూదంలో మేము అర్జునునివిషయంలో కపటంగా ప్రవర్తించాము. కాబట్టి మరో ఉపాయంతో వారిని చంపగలిగితే మాకు హితం చేకూరుతుంది.
ధృతరాష్ట్ర ఉవాచ
ఉపాయశ్చ న కర్తవ్యః పాండవాన్ ప్రతి భారత।
పార్థాన్ ప్రతి పురా వత్స బహుపాయాః కృతాస్త్వయా॥
తానుపాయాన్ హి కౌంతేయాః బహుశో వ్యతిచక్రముః॥
తస్మాద్ధితం జీవితాయ నః కులస్య జనస్య చ।
త్వం చికీర్షసి చేద వత్స సమితః సహబాంధవః।
సభ్రాతృకస్త్వం పార్థేన నిత్యం స్నేహేన వర్తయ॥
ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
భారతా! పాండవుల విషయంలో ఎటువంటి ఉపాయాన్ని ప్రయోగించకూడదు. వత్సా! ఇంతకుముందు ఆ పాండవులపై నీవెన్నో ఉపాయాలను అతిక్రమించారు. కాబట్టి మనవంశం, మన పరిజనం జీవించి ఉండాలంటే నీవు, నీసోదరులూ, మిత్రులు, బంధువులు అర్జునునితో నిత్యం స్నేహంతోనే మెలగాలి.
వైశంపాయన ఉవాచ
ధృతరాష్ట్రవచః శ్రుత్వా రాజా దుర్యోధనస్తదా।
చింతయిత్వా ముహూర్తం తు విధినా చోదితోఽబ్రవీత్।)
వైశంపాయనుడిలా అన్నాడు. ధృతరాష్ట్రుని మాటలు విని దుర్యోధననరపాలుడు కొద్దిసేపు ఆలోచించి విధిప్రేరణచే ఇలా అన్నాడు.
దుర్యోధన ఉవాచ
న త్వయేదం శ్రుతం రాజన్ యజ్జగాద బృహస్పతిః।
శక్రస్య నీతిం ప్రవదన్ విద్వాన్ దేవపురోహితః॥ 7
దుర్యోధనుడిలా అన్నాడు. రాజా! పండితుడు. దేవపురోహితుడు అయిన బృహస్పతి ఇంద్రునకు నీతినుపదేశిస్తూ అన్నమాట నీవు వినలేదా? (7)
సర్వోపాయైర్నిహంతవ్యాః శత్రవః శత్రుసూదన।
పురా యుద్ధాన్ బలాద్ వాపి ప్రకుర్వంతి తవాహితమ్॥ 8
శత్రుసూదనా! మనకు కీడుచేసే శత్రువులను యుద్ధంచేసి అయినా, యుద్ధాన్ని విరమించి అయినా సర్వోపాయాలతో సంహరించాలి. (8)
తే వయం పాండవధనైః సర్వాన్ సంపూజ్య పార్థివాన్।
యది తాన్ యోధయిష్యామః కిం వై నః పరిహాస్యతి॥ 9
మేము పాండవుల ధనంతో రాజులనందరినీ సత్కరించి పాండవులతో యుద్ధం చేస్తే మనకు నగుబాటు ఏముంటుంది? (9)
అహీనాశీవిషాన్ క్రుద్ధాన్ నాశాయ సముపస్థితాన్।
కృత్వా కంఠే చ పృష్ఠే చ కః సముత్స్రష్టుమర్హతి॥ 10
మనలను కాటువేయటానికి వచ్చిన క్రూరసర్పాలను మెడలోనీ, వీపుమీదనో ధరించి అలాగే ఎవరు వదిలివేస్తారు? (10)
ఆత్తశస్త్రా రథగతాః కుపితాస్తాత పాండవాః।
నిఃశేషం నః కరిష్యంతి క్రుద్ధా హ్యాశీవిషా ఇవ॥ 11
తండ్రీ! పాండవుల కోపించి శస్త్రాలు ధరించి రథాలనెక్కి కుపితసర్పాల వలె మనలను నిశ్శేషంగా చంపివేస్తారు. (11)
సంనద్ధో హ్యర్జునో యాతి విధృత్య పరమేషుధీ।
గాండీవం ముహురాదత్తే నిఃశ్వసంశ్చ నిరీక్షతే॥ 12
గదాం గుర్వీం సముద్యమ్య త్వరితశ్చ వృకోదరః।
స్వరథం యోజయిత్వాఽఽశు నిర్యాత ఇతి నఃశ్రుతమ్॥ 13
అర్జునుడు కవచాన్ని ధరించి రెండు అమ్ములపొదులను తగిలించుకొని మాటిమాటికి గాండీవాన్ని ధరించి నిట్టూర్పులు విడుస్తూ అటు నిటు చూస్తూవెళ్లాడట. భీముడు పెద్దగదను చేతబట్టి వేగంగా తన రథాన్ని ఎక్కి గబగబా వెళ్ళాడట. అలా మేము విన్నాం. (12,13)
నకులః ఖడ్గమాదాయ చర్మ చాప్యర్ధచంద్రవత్।
సహదేవశ్చ రాజా చ చక్రురాకారమింగితైః॥ 14
నకులుడు అర్ధచంద్రాకారంలో ఉన్న డాలును, కత్తిని తీసికొని వెళ్ళాడట. సహదేవుడు, యుధిష్ఠిరుడు కూడా వారు చేయదలచిన పనిని సూచిస్తూ వెళ్ళారట. (14)
తే త్వాస్థాయ రథాన్ సర్వే బహుశస్త్రపరిచ్ఛదాన్।
అభిఘ్నంతో రథవ్రతాన్ సేనాయోగాయ నిర్యయుః॥ 15
వారంతా శస్త్రాలు మొదలయిన సామగ్రితో నిండిన రథాలనెక్కి శత్రుపక్షరథికులను సంహరించడానికి సేనను సమకూర్చుకొనటానికి వెళ్ళారు. (15)
న క్షంస్యంతే తథాస్మాభిః జాతు విప్రకృతా హి తే।
ద్రౌపద్యాశ్చ పరిక్లేశం కస్తేషాం క్షంతుమర్హతి॥ 16
మనం వారిని పరాభవించాం. దానిని వారెప్పుడూ క్షమించరు. ద్రౌపది పడిన కష్టాలకు సహించి వారిలో ఎవరు మిన్నకుండగలరు? (16)
పునర్దీవ్యామ భద్రం తే వనవాసాయ పాండవైః।
ఏవమేతాన్ వశే కర్తుం శక్ష్యామః పురుషర్షభ॥ 17
పురుషోత్తమా! నీకు మేలు జరుగుతుంది. వనవాసాన్ని పందెంగా పెట్టి మరల జూదం ఆడుతాం. ఈ రీతిగా మాత్రమే వారిని లొంగదీసికొనగలం. (17)
తే వా ద్వాదశ వర్షాణి వయం వా ద్యూతనిర్జితాః।
ప్రవిశేమ మహారణ్యమ్ అజనైః ప్రతివాపితాః॥ 18
జూదంలో ఓడిపోతే వారయినా, మేమైనా పండ్రెండు సంవత్సరాలు మృగచర్మాలు ధరించి వనంలో నివసిస్తాం. (18)
త్రయోదశం చ సజనే అజ్ఞాతాః పరివత్సరమ్।
జ్ఞాతాశ్చ పునరన్యాని వనే వర్షాణి ద్వాదశ॥ 19
నివసేమ వయం తే వా తథా ద్యూతం ప్రవర్తతామ్।
అక్షానుప్త్వా పునర్ద్యూతమ్ ఇదం కుర్వంతు పాండవాః॥ 20
పదమూడవ సంవత్సరం జనులమధ్యనే అజ్ఞాతంగా గడపాలి. అజ్ఞాతవాసం భంగమయితే మరల పండ్రెండు సంవత్సరాలు అరణ్యంలో నివసిస్తాం. వారైనా, మేమైనా, పందెంతో జూదమాడుతాం. పాండవులు పాచికలు వేసి మరల జూదమాడాలి. (19,20)
ఏతత్ కృత్యతమం రాజన్ అస్మాకం భరతర్షభ।
అయం హి శకునిర్వేద సవిద్యామక్షసంపదమ్॥ 21
రాజా! భరతర్షభా! ఇదే మనకు సర్వోత్తమ కర్తవ్యం. ఈ శకుని అక్షవిద్యలో ఆరితేరినవాడు. (21)
దృఢమూలా వయం రాజ్యే మిత్రాణి పరిగృహ్య చ।
సారవద్ విపులం సైన్యం సతృత్య చ దురాసదమ్॥ 22
మనం మిత్రులను సమకూర్చుకొని బలశాలులూ, ఎదిరింపరానివారూ అయిన సైనికులను బాగా సత్కరిస్తూ రాజ్యాన్ని గట్టి చేసికొందాం. (22)
తే చ త్రయోదశం వర్షం పారయిష్యంతి చేద్ వ్రతమ్।
జేష్యామస్తాన్ వయం రాజన్ రోచతాం తే పరంతప॥ 23
రాజా! పరంతపా! ఒకవేళ వారు పదమూడవ సంవత్సరాన్ని కూడా గడిపి ప్రతిజ్ఞను పూర్తిచేస్తే వారిని యుద్ధంలో ఓడిద్ధాం. ఇది మీకు నచ్చుతోందా? (23)
ధృతరాష్ట్ర ఉవాచ
తూర్ణం ప్రత్యానయస్వైతాన్ కామం వ్యధ్వగతానపి ।
అగచ్ఛంతు పునర్ద్యూతమ్ ఇదం కుర్వంతు పాండవాః ॥ 24
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - పాండవులు ఎంతదూరం వెళ్ళి ఉన్నా సరే వారిని వెనుకకు పిలిపించు. వారు వచ్చి ఈ క్రొత్త పందెంతో జూదమాడాలి. (24)
వైశంపాయన ఉవాచ
తతో ద్రోణః సోమదత్తః బాహ్లీకశ్చైవ గౌతమః ।
విదురో ద్రోణపుత్రశ్చ వైశ్యాపుత్రశ్చ వీర్యవాన్ ॥ 25
భూరిశ్రవాః శాంతనవః వికర్ణశ్చ మహారథః ।
మా ద్యూతమిత్యభాషంత శమోఽస్త్వితి చ సర్వశః ॥ 26
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు ద్రోణుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, కృపాచార్యుడు, విదురుడు, అశ్వత్థామ, యుయుత్సుడు, భూరిశ్రవుడు, భీష్ముడు, మహారథి అయిన వికర్ణుడు అందరూ "ఇప్పుడు జూదం వద్దు. ప్రశాంతంగా సాగనీ" అని పలికారు. (25,26)
అకామానాం చ సర్వేషాం సుహృదామర్థదర్శినామ్ ।
అకరోత్ పాండవాహ్వానం ధృతరాష్ట్రః సుతప్రియః ॥ 27
భవిష్యత్తును భావింపగలవారు, మిత్రులు తమ అనిష్టాన్ని ప్రకటిస్తూ కుమారులపై ప్రేమగల ధృతరాష్ట్రుడు పాండవులను పిలవటానికే ఆదేశించాడు. (27)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అనుద్యూతపర్వణి యుధిష్ఠిర ప్రత్యానయనే చతుఃసప్తతితమోఽధ్యాయః ॥ 74 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అనుద్యూతపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర ప్రత్యానయనమను డెబ్బది నాలుగవ అధ్యాయము. (74)
(దాక్షిణాత్య అధికపాఠము 67 1/2 శ్లోకాలతో కలిపి మొత్తము 94 1/2 శ్లోకములు)