30. ముప్పదియవ అధ్యాయము
ద్రౌపది యుధిష్ఠిరుని, ధర్మాదులను ఆక్షేపించుట.
ద్రౌపద్యువాచ
నమో ధాత్రే విధాత్రే చ యౌ మోహం చక్రతుస్తవ ।
పితృపైతామహే వృత్తే వోఢవ్యే తేఽన్యథా మతిః ॥ 1
ద్రౌపది ఇలా అంది - రాజా! నీబుద్ధికి మోహాన్ని కలిగించిన ఆవిధి, ప్రారబ్ధాలకు ఒక నమస్కారం. పితృపైతామహమైన రాజ్యాన్ని నీవు వహించవలసి ఉండగా, నీ బుద్ధి మరొకవిధంగా ఉంది. (1)
కర్మభిశ్చింతితో లోకః గత్యాం గత్యాం పృథగ్విధః ।
తస్మాద్ కర్మాణి నిత్యాని లోభాన్మోక్షం యియాసతి ॥ 2
నేహ ధర్మానృశంస్యాభ్యాం న క్షాంత్యా నార్జవేన చ ।
పురుషః శ్రియమాప్నోతి న ఘృణిత్వేన కర్హిచిత్ ॥ 3
లోకంలో జనులకు వేరువేరు కర్మలు నిర్దేశింపబడి ఉన్నాయి. అందువల్ల కర్మలు నిత్యాలు (అనుభవంచే గాని అవి నశింపవు.) కాని మానవులు లోభంచేత మోక్షాన్ని పొందాలనుకొంటారు. ఈ లోకంలో ధర్మం చేతగాని, మృదుస్వభావం చేత కాని, సహనం చేత కాని, ఋజువర్తనం చేత కాని, దయచేత కాని మానవుడు ఎప్పుడూ ఐశ్వర్యాన్ని పొందడు. (2,3)
త్వాం చ వ్యసనమభ్యాగాద్ ఇదం భారత దుఃసహమ్ ।
యత్ త్వం నార్హసి నాపీయే భ్రాతరస్తే మహౌజసః ॥ 4
భారతా! ఈ సహనం కారణంగానే ని విటువంటి దుఃసహమైన సంకటస్థితిని పొందావు. నీవుకాని, మహాతేజస్వులైన నీ సోదరులైనా కాని ఇట్టి కష్టాన్ని పొందటానికి యోగ్యులు కారు. (4)
న హి తేఽధ్యగ్మజ్జాతు తదానీం నాద్య భారత ।
ధర్మాత్ ప్రియతరం కించిదపి చేజ్జీవితాదిహ ॥ 5
భరతకులతిలకా! అప్పుడు కాని ఇప్పుడు కాని న్కు, నీ సోదరులకు ధర్మం కంటె ప్రియమైనదేదీ లెదు. ధర్మం జీవితం కంటే కూడా గొప్పదిగా భావింపబడుతుంది. (5)
ధర్మార్థమేవ తే రాజ్యం ధర్మార్థం జీవితం చ తే ।
బ్రాహ్మణా గురవశ్చైవ జానంత్యపి చ దేవతాః ॥ 6
ధర్మం కొరకే నీకు రాజ్యం. నీ జీవితం కూడా ధర్మం కొరకే. బ్రాహ్మణులు, గురువులు, దేవతలు కూడా ఈ విషయం ఎరుగుదురు. (6)
భీమసేనార్జునౌ చోభౌ మాద్రేయౌ చ మయా సహ ।
త్యజేస్త్వమితి మే బుద్ధిః న తు ధర్మం పరిత్యజేః ॥ 7
నీవు నాతోపాటు భీమార్జున నకుల సహదేవులను కూడా విడిచిపెడతావు. ధర్మాన్ని మాత్రం విడువవు. ఇది నా దృఢవిశ్వాసం. (7)
రాజానం ధర్మగోప్తారం ధర్మో రక్షతి రక్షితః ।
ఇతి మే శ్రుతమార్యాణాం త్వాం తు మన్యే న రక్షతి ॥ 8
రక్షింపబడిన ధర్మం ధర్మరక్షకుడైన రాజును రక్షిస్తుంది అని పెద్దలనుండి విన్నాను. కాని నిన్నుమాత్రం రక్షించటంలేదని భావిస్తున్నాను. (8)
అనన్యా హి నరవ్యాఘ్ర నిత్యదా ధర్మమేవ తే ।
బుద్ధిః సతతమన్వేతిచ్ఛాయేవ పురుషం నిజా ॥ 9
నరోత్తమా! తన నీడ తన్ను నిత్యం అనుసరించినట్లుగా నీబుద్ధి ఎల్లపుడూ అనన్యభావంతో ధర్మాన్నే అనుసరిస్తుంది.(9)
నావమంస్థా హి సదృశాన్ నావరాన్ శ్రేయసః కుతః ।
అవాప్య పృథివీం కృత్స్నాం న తే శృంగమవర్ధత ॥ 10
నీవు సమానులను కాని, నీకంటె తక్కువ వారినికాని ఎపుడూ అవమానించలేదు. ఇక నీకంటె గొప్పవారినెలా అవమానిస్తావు? ఈ సమస్త భూమండలాన్ని పొంది కూడా నీకు కొమ్ములు మొలవలేదు. (10)
స్వాహాకారైః స్వధాభిశ్చ పూజాభిరపి చ ద్విజాన్ ।
దైవతాని పితౄంశ్చైవ సతతం పార్థ సేవసే ॥ 11
పృథానందనా! నీవు స్వాహాకారాలతో దేవతలను,స్వధాకారాలతో పితృదేవతలను, పూజలతో బ్రాహ్మణులను నిత్యమూ సేవిస్తున్నావు. (11)
బ్రాహ్మణాః సర్వకామైస్తే సతతం పార్థ తర్పితాః ।
యతయో మోక్షిణశ్చైవ గృహస్థాశ్చైవ భారత ॥ 12
భుంజతే రుక్మపాత్రీభిః యత్రాహం పరిచారికా ।
ఆరణ్యకేభ్యో లౌహాని భాజనాని ప్రయచ్ఛసి ।
నాదేయం బ్రాహ్మణేభ్యస్తే గృహే కించన విద్యతే ॥ 13
పార్థా! నీవు బ్రాహ్మణులను వారివారి కోర్కెలనన్నింటిని తీర్చి తృప్తిపరిచావు. అదే విధంగా యతులను, ముముక్షువులను, గృహస్థులను నేను వడ్డించగా బంగారు పాత్రలలో భోజనం పెట్టి తృప్తిపరిచావు.
అరణ్యంలో ఉన్నవారికి నీవు బంగారుపాత్రల నిచ్చావు. నీ ఇంటిలో బ్రాహ్మణులకు ఇవ్వదగని వస్తువంటూ ఏదీలేదు. (12,13)
యదిదం వైశ్వదేవం తే శాంతయే క్రియతే గృహే ।
తద్ దత్త్వాతిథిభుతేభ్యః రాజన్ శిష్టేన జీవసి ॥ 14
రాజా! శాంతికొరకై నీవు వైశ్యదేవం చేసి అతిథులకు, ప్రాణులకు అన్నంపెట్టి, వారు తినగా మిగిలిన దానిని తిని నీవు జీవిస్తున్నావు. (14)
ఇష్టయః పశుబంధాశ్చ కామ్యనైమిత్తిశ్చ యే ।
వర్తంతే పాకయజ్ఞాశ్చ యజ్ఞకర్మ చ నిత్యదా ॥ 15
ఇష్టులు, పశుబంధాలు, కామ్యయజ్ఞాలు, నైమిత్తిక యాగాలు, పాకయజ్ఞాలు, నిత్యయజ్ఞాలు అన్నీ యథావిధిగా నీవు చేస్తున్నావు. (15)
అస్మిన్నపి మహారణ్యే విజనే దస్యుసేవితే ।
రాష్ట్రాదపేత్య వసతః ధర్మ స్తేనావసీదతి ॥ 16
రాజ్యానికి దూరంగా, దారిదోపిడీదారులుండే నిర్జనమైన ఈ మహారణ్యంలో నివసిస్తూ కూడ నీవు ధర్మకార్యాలను లోపం లేకకుండా ఆచరిస్తున్నావు. (16)
భారత! ఆకాశం వలె ఈశ్వరుడు కూడ ప్రాణులందరిలోనూ వ్యాపించి, వారికర్మానుసారంగా మంచి చెడులను/పుణ్య పాపాలను చేయిస్తాడు. (24)
శకునిస్తంతుబద్ధీ వా నియతోఽయమనీశ్వరః ।
ఈశ్వరస్య వశే తిష్ఠేద్ నాన్యేషాం నాత్మనః ప్రభుః ॥ 25
త్రాళ్ళతో బంధింపబడిన పక్షిలా మానవుడు కర్మబంధంలో ఉండటం చేత పరాధీయుడే కాని స్వతంత్రుడు కాదు. ఈశ్వరుని అధీనంలో ఉంటాడు. ఇతరులకు అధీనుడు కాదు. స్వాధీనుడు కూడా కాదు. (25)
మణిః సూత్ర ఇవ ప్రోతః నస్యోత ఇవ గోవృషః ।
స్రోతసో మధ్యమాపన్నః కూలాద్ వృక్ష ఇవచ్యుతః ॥ 26
ధాతురాదేశమన్వేతి తన్మయో హి తదర్పణః ।
నాత్మాధీనో మనుష్యోఽయం కాలం భజతి కంచన ॥ 27
సూత్రానికి గ్రుచ్చబడిన మణిలా, ముక్కు త్రాడుతో బంధింపబడిన ఎద్దులా, ఒడ్డు నుండి కూలి ప్రవాహంలో పడిన చెట్టులా, మానవుడు ఈశ్వరుని ఆదేశాన్ని అనుసరిస్తాడు. ఈశ్వరరూపుడైన మనుష్యుడు ఈశ్వరుని అధీనంలోనే ఉంటున్నాడు. ఈ మానవుడు ఏ సమయంలోనూ కూడా స్వతంత్రుడుగా లేడు. (26,27)
అజ్ఞో జంతురనీశోఽయమ్ ఆత్మనః సుఖదుఃఖయోః ।
ఈశ్వరప్రేరితో గచ్ఛేత్ స్వర్గం నరకమేవ చ ॥ 28
ఈ జీవుడు (ప్రాణి) అజ్ఞాని. తన సుఖదుఃఖాల విషయంలో కూడ అసమర్థుడు. ఈశ్వరప్రేరితుడై స్వర్గానికి లేదా నరకానికి వెళ్తున్నాడు. (28)
యథా వాయోస్తృణాగ్రాణి వశం యాంతి బలీయసః ।
ధాతురేవం వశం యాంతి సర్వభూతాని భారత ॥ 29
భారతా! బలమైన వాయువునకు గడ్డిపోచలు వశమైనట్లుగా, ప్రాణులన్నీ ఈశ్వరుని అధీనంలోకి వెళుతున్నాయి. (29)
ఆర్యే కర్మణి యుంజానః పాపే వా పునరీశ్వరః ।
వ్యాప్య భూతాని చరతే న చాయమితి లక్ష్యతే ॥ 30
మానవుడు మంచి పని చేస్తున్నా, చెడ్డపనిచేస్తున్నా ఈశ్వరుడు అతని యందు వ్యాప్తమై ఉంటాడు. కాని అతడు అక్కడున్నట్లుగా గుర్తింపబడడు. (30)
హేతుమాత్రమిదం ధాతుః శరీరం క్షేత్రసంజ్ఞితమ్ ।
యేన కారయతే కర్మ శుభాశుభఫలం విభుః ॥ 31
శరీరం క్షేత్రం. ఇది ఈశ్వరునికి సాధనం మాత్రమే. దీనిద్వారా ఈశ్వరుడు ప్రాణుల చేత శుభాశుభ ఫలనిమిత్తమైన కర్మను చేయిస్తాడు. (31)
పశ్య మాయాప్రభావోఽయమ్ ఈశ్వరేణ యథా కృతః ।
యో హంతి భూతైర్భూతాని మోహయిత్వాఽఽత్మమాయయా ॥ 32
ఈశ్వరుడు చేసే ఈ మాయను చూడు. తన మాయచేత ప్రాణులను మోహపరిచి, ప్రాణుల ద్వారా ప్రాణులను చంపుతాడు. (32)
అన్యథా పరిదృష్టాని మునిభిస్తత్త్వదర్శిభిః ।
అన్యథా పరివర్తంతే వేగా ఇవ నభస్వతః ॥ 33
తత్త్వదర్శులైన మునులు వస్తువుల స్వరూపాన్ని వేరొక విధంగా చూస్తారు. సూర్యకిరణాలు మరుభూమిలో నీరులా కనబడినట్లుగా వారి దృష్టికి అంతా వేరుగా ఉంటుంది. (33)
అన్యధైవ హి మన్యంతే పురుషాస్తాని తాని చ ।
అన్యథైవ ప్రభుస్తాని కరోతి నకరోతి చ ॥ 34
లోకంలో జనులు ఆయా వస్తువులను వేరువేరుగా చూస్తారు. కాని శక్తిశాలి అయిన ఈశ్వరుడు వాటిని చేయగలడు. వికృతిపరచగలడు. (సృష్టింపగలడు, నాశనం చేయగలడు). (34)
యథా కాష్ఠేన వా కాష్ఠమ్ అశ్మానం చాశ్మనా పునః ।
అయసా చాప్యయశ్ఛింద్యాద్ నిర్విచేష్టమచేతనమ్ ॥ 35
ఏవం స భగవాన్ దేవః స్వయంభూః ప్రపితామహః ।
హినస్తి భూతైర్భూతాని ఛద్మ కృత్వా యుధిష్ఠిర ॥ 36
యుధిష్ఠిరా! అచేతనమైన కర్రను కర్రచేత, రాయిని రాయిచేత, ఇనుమును ఇనుముచేత ఛేధించినట్లుగా భగవంతుడు, స్వయంభువు, ప్రపితామహుడు అయిన ఈశ్వరుడు మాయచేసి ప్రాణులను ప్రాణులచేత హింసిస్తాడు. (35,36)
సంప్రయోజ్య వియోజ్యాయం కామకారకరః ప్రభుః ।
క్రీడతే భగవాన్ భూతైః బాలః క్రీడనకైరివ ॥ 37
చిన్న కుర్రవాడు ఆటబొమ్మలతో ఆడుకొన్నట్లుగా తన ఇచ్ఛప్రకారం చేయగల సమర్థుడైన ఈశ్వరుడు కలుపుతూ, విడదీస్తూ ప్రాణులతో ఆడుకొంటాడు. (37)
న మాతృపితృవద్ రాజన్ ధాతా భుతేషు వర్తతే ।
రోషాదివ ప్రవృత్తోఽయం యథాయమితరో జనః ॥ 38
రాజా! ఈశ్వరుడు ప్రాణుల పట్ల తల్లిదండ్రుల వలె ప్రవర్తించడు. ఇతరుల వలె కోపంతో వ్యవహరిస్తాడు. (38)
ఆర్యాన్ శీలవతో దృష్ట్వా హ్రీమతో వృత్తికర్శితాన్ ।
అనార్యాన్ సుఖినశ్చైవ విహ్వలామీవ చింతయా ॥ 39
ఎందుకంటే పూజ్యులు, శ్రేష్ఠులు, శీలవంతులు, లజ్జాశీలురు జీవిక కొరకు (బ్రతుకు తెరువుకోసం) కష్టపడుతూంటారు. అనార్యులు సుఖంగా జీవిస్తారు. ఇదంతా చూస్తూంటే నాకు బాధ కలుగుతోంది. (39)
తవేమామాపదం దృష్ట్వా సమృధ్ధిం చ సుయోధనే ।
ధాతారం గర్హయే పార్థ విషమం యోఽనుపశ్యతి ॥ 40
పృథానందనా! నీవు ఇలా విపత్తులో ఉండటం, సుయోధనుడు భోగభాగ్యాలతో ఉండటం చూసి, నేను విధిని నిందిస్తున్నాను. అతడు విషమదృష్టితో చూస్తున్నాడు. (40)
ఆర్యశాస్త్రాతిగే క్రూరే లుబ్ధే ధర్మాపచాయిని ।
ధార్తరాష్ట్రే శ్రియం దత్త్వా ధాతా కిం ఫలమశ్నుతే ॥ 41
పెడ్దలు చెప్పిన శాస్త్రరీతిని అతిక్రమించిన క్రూరుడు, ధర్మంతప్పినవాడు అయిన సుయోధనునికి సంపదనిచ్చిన ఆ ఈశ్వరుడు ఏం ప్రయోజనం పొందగలడు? (41)
కర్మ చేత్ కృతమన్వేతి కర్తారం నాన్యమృచ్ఛతి ।
కర్మణా త్న పాపేన లిప్యతే నూనమీశ్వరః ॥ 42
కర్మ చేసినవాడిని అనుసరించేదయితే వేరొకరిని అనుసరించనిదే అయితే, అపుడు ఈశ్వరునికి కూడా అతడు చేసిన పాపకర్మలు అంటుకొంటాయి. (42)
అథ కర్మ కృతం పాపం న చేత్ కర్తారమృచ్ఛతి ।
కారణం బలమేవేహ జనాన్ శోచామి దుర్బలాన్ ॥ 43
ఒకవేళ చేసిన పాపకర్మ కర్తను అనుసరించక పోయినట్లయితే దానికి కారణం బలమే. (ఈశ్వరుడు శక్తిశాలి కాబట్టి అతడిని అతని పాప కర్మలు చేరవు). అందువల్ల దుర్బలులైన జనులను గురించి బాధపడుతున్నాను. (43)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్రౌపదీ వాక్యే త్రింశోఽధ్యాయః ॥ 30 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున ద్రౌపదీవాక్యమను ముప్పదియవ అధ్యాయము. (30)