35. ముప్పది ఐదవ అధ్యాయము

భీమసేనుడు యుధిష్ఠిరుని యుద్ధమునకు ఉత్సాహపరచుట.

భీమసేన ఉవాచ
సంధిం కృత్వైవ కాలేన హ్యంతకేన పతత్రిణా ।
అనంతేనాప్రమేయేణ స్రోతసా సర్వహారిణా ॥ 1
ప్రత్యక్షం మన్యసే కాలం మర్త్యః సన్ కాలబంధనః ।
ఫేనధర్మా మహారాజ ఫలధర్మా తథైవ చ ॥ 2
భీమసేనుడిలా అన్నాడు - మహారాజా! నీటిలోని నురగవలె, చెట్టునున్న పండువలె నీవు కాలం బంధించిన మరణధర్మం గల మనుష్యుడవు. కాలం అన్నింటిని అంతం చేసేది. అందరినీ సంహరించేది. బాణంలా వేగంగా కదిలేది. అనంతమైంది. అప్రమేయమైంది. జలప్రవాహంలా ప్రవాహశీమైంది. అటువంటి కాలాన్ని దుర్యోధనునితో సంధిచేసికొని, ప్రత్యక్షం చేసుకోవాలనుకొంటున్నావు. (1,2)
నిమిషాదపి కౌంతేయ యస్యాయురపచీయతే ।
సూచ్యేవాంజనచూర్ణస్య కిమితి ప్రతిపాలయేత్ ॥ 3
కానీ, కుంతీనందనా! సూదిమొనకి కొంచెం కొంచెం కాటుక పొడి అంటి క్షీణించినట్లుగా, ఒక్కొక్క నిమిషం గడుస్తూ ఆయువు క్షీణిస్తూ ఉంటుంది. అటువంటి క్షణభంగురమైన జీవితంలో మానవుడు సమయం కోసం ఎలా నిరీక్షించగలడు? (3)
యో నూనమమితాయుః స్యాద్ అథవాపి ప్రమాణవిత్ ।
స ఖాలం వై ప్రతీక్షేత సర్వప్రత్యక్షదర్శివాన్ ॥ 4
ఆయువునకు పరిమితిలేనివాడు, లేదా తనకెంత ఆయువు ఉందో నిశ్చయంగా తెలిసినవాడు, అన్నింటిని ప్రత్యక్షంగా చూడగల్గినవాడు కాలం కోసం నిరీక్షించగలడు. (4)
ప్రతీక్ష్యమాణః కాలో నః సమా రాజంస్త్ర్రయోదశ ।
ఆయుషోఽపచయం కృత్వా మరణాయోపనేష్యతి ॥ 5
రాజా! మనం పదమూడు సంవత్సరాలు తగిన సమయం కోసం నిరీక్షించాలి. ఈ పదమూడు సంవత్సరాలు మన ఆయువు తగ్గుతుంది. మనం మృత్యువుకి మరికొంత చేరువౌతాం. (5)
శరీరిణాం హి మరణం శరీరే నిత్యమాశ్రితమ్ ।
ప్రాగేవ మరణాత్ తస్మాద్ రాజ్యాయైవ ఘటామహే ॥ 6
దేహధారులందరికీ మృత్యువు వారి శరీరంలోనే నిత్యమూ ఉంటుంది. అందువల్ల మరణానికన్న ముందే రాజ్యంకోసం కర్మను ఆచరిద్దాం. (6)
యో న యాతి ప్రసంఖ్యానమ్ అస్పష్టో భూమివర్ధనః ।
అయాతయిత్వా వైరాణి సోఽవసీదతి గౌరివ ॥ 7
ఎవరిప్రభావం కప్పబడిపోయి లోకానికి తెలియరాదో, అట్టివాడు భూమికి భారంగా మాత్రమే మిగులుతాడు. అతడు తనలోని వైరాలను తొలగించుకోకుండా ఎద్దులా దుఃఖం పొంది నశిస్తాడు. (7)
యో న యాతయతే వైరమ్ అల్పసత్త్వోద్యమః పుమాన్ ।
అఫలం జన్మ తస్యాహం మన్యే దుర్జాతజాయినః ॥ 8
బలం, ప్రయత్నం తక్కువగా ఉన్నవాడు తనలోని వైరాన్ని బయటకు పంపకపోతే, అతడి జన్మ నిష్ఫలమే. అతడి జన్మం మిక్కిలి దయనీయమైంది. (8)
హైరణ్యౌ భవతో బాహూ శ్రుతిర్భవతి పార్థివీ ।
హత్వా ద్విషంతం సంగ్రామే భుంక్ష్వ బాహుజితం వసు ॥ 9
రాజా! నీరెండు బాహువులు సువర్ణంపై అధికారం కలవి. నీకీర్తి పృథుచక్రవర్తితో సమానమైంది. యుద్ధంలో శత్రువును చంపి, బాహుబల సముపార్జితమైన ధనాన్ని అనుభవించు. (9)
హత్వా వై పురుషో రాజన్ నికర్తారమరిందమ ।
అహ్నాయ నరకం గచ్ఛేత్ స్వర్గేణాస్య స సమ్మితః ॥ 10
రాజా! శత్రుదమనా! తన్ను మోసగించిన శత్రువును చంపినవాడు నరకంలో పడినాసరే, అది అతనికి స్వర్గతుల్యమైందే అవుతుంది. (10)
అమర్షజో హి సంతాపః పావకాద్ దీప్తిమత్తరః ।
యేనాహమభిసంతప్తః న నక్తం న దివా శయే ॥ 11
అసహనం వల్ల కలిగిన సంతాపం అగ్నికంటె కూడా ఎక్కువ మంట పుట్టిస్తుంది. అటువంటి అసహనంతో తపిస్తూ నేను రాత్రింబవళ్ళు నిద్రించడం లేదు. (11)
అయం చ పార్థో బీభత్సుః వరిష్ఠో జ్యావికర్షణే ।
ఆస్తే పరమసంతప్తః నూనం సింహ ఇవాశయే ॥ 12
కుంతీనందనుడై ధనుర్విద్యలో శ్రేష్ఠుడైన ఈ అర్జునుడు గుహలోని సింహంలా మిక్కిలి సంతప్తుడై ఉన్నాడు. (12)
యోఽయమేకోఽభిమనుతే సర్వాన్ లోకే ధనుర్భృతః ।
సోఽయమాత్మజమూష్మాణం మహాసస్తీవ యచ్ఛతి ॥ 13
లోకంలోని ధనుర్ధారులందరినీ ఎదిరించగల ఒకే ఒక్క వీరుడు అర్జునుడు. ఇతడు గజరాజువలె క్రోధం వల్ల కలిగిన సంతాపాన్ని నిగ్రహింపలేకపోతున్నాడు. (13)
నకులః సహదేవశ్చ
వృద్ధా మాతా చ వీరసూః ।
తవైవ ప్రియమిచ్ఛంతః ఆసతే జడమూకవత్ ॥ 14
నకులసహదేవులు, వీరమాత కుంతి నీ ప్రియాన్ని కోరుతూ జడులవలె, మూగవారివలె మాట్లాడకుండా ఉంటున్నారు. (14)
సర్వే తే ప్రియమిచ్ఛంతి బాంధవాః సహ సృంజయైః ।
అహమేకశ్చ సంతప్తః మాతా చ ప్రతివింధ్యతః ॥ 15
సృంజయవంశీయవీరులతో బాటుగా, బంధువులందరూ నీ ప్రియాన్ని కోరుకొంటున్నారు. నేనొకణ్ణి, ప్రతివింధ్యునితల్లి ద్రౌపది - మేమిద్దరం మాత్రం సంతాపాన్ని పొందుతున్నాం. (15)
ప్రియమేవ తు సర్వేషాం యద్ బ్రవీమ్యుత కించన ।
సర్వే హి వ్యసనం ప్రాప్తాః సర్వే యుద్ధాభినందనః ॥ 16
నేను చెప్పేది అందరికీ ఇష్టమే. మనమంతా కష్టంలో ఉన్న వారమే. అందువల్ల అందరూ యుద్ధాన్ని అభినందిస్తారు. (16)
నాతః పాపీయసీ కాచిద్ ఆపద్ రాజన్ భవిష్యతి ।
యన్నో నీచైరల్పబలైః రాజ్యమాచ్ఛిద్య భుజ్యతే ॥ 17
రాజా! మనకంటె అల్పబలంకల నీచులు దుర్యోధనాదులు రాజ్యం అపహరించి అనుభవిస్తున్నారు. ఇంతకంటె పాపాత్మకమై, మిక్కిలి దుఃఖాన్ని కలిగించే విపత్తు ఇంకేం ఉంటుంది? (17)
శీలదోషాద్ ఘృణావిష్టః ఆనృశంస్యాత్ పరంతప ।
క్లేశాంస్తితిక్షసే రాజన్ నాన్యః కశ్చిత్ ప్రశంసతి ॥ 18
పరంతపా! నీవు స్వభావదోషం వల్ల దయాపరుడవవటం వల్ల, మృదుస్వభావంతో ఇంతటి కష్టాలను సహిస్తున్నావు. అందువల్ల నిన్నెవరూ ప్రశంసించటం లేదు. (18)
శ్రోత్రియస్యేవ తే రాజన్ మందకస్యావిపశ్చితః ।
అనువాకహతా బుద్ధిః నైషా తత్త్వార్థదర్శినీ ॥ 19
రాజా! నీబుద్ధి అర్థజ్ఞానం లేకుండా కేవలం వేదాక్షరాలను ఉచ్చరించే మందబుద్ధి అయిన శ్రోత్రియునివలె గురువచనానుసరణం చేత నష్టమైంది. గురూపదేశత్త్వాన్ని తెలిసినవాడు కాని, తెలియజెప్పేవాడు కాని లేడు. (19)
ఘృణీ బ్రాహ్మణరూపోఽసి కథం క్షత్రేఽభ్యజాయథాః ।
అస్యాం హి యోనౌ జాయంతే ప్రాయశః క్రూరబుద్ధయః ॥ 20
దయాళుడవైన నీవు బ్రాహ్మణునిలా ఉన్నావు. అసలు క్షత్రియవంశంలో ఎలా పుట్టావో తెలియదు. క్షత్రియజాతిలో సాధారణంగా క్రూరమైన బుద్ధి కలవారు జన్మిస్తారు. (20)
అశ్రౌషీస్త్వం రాజధర్మాన్ యథా వై మనురబ్రవీత్ ।
క్రూరాన్ నికృతిసంపన్నాన్ విహితానశమాత్మకాన్ ॥ 21
ధార్తరాష్ట్రాన్ మహారాజ క్షమసే కిం దురాత్మనః ॥
కర్తవ్యే పురుషవ్యాఘ్ర కిమాస్సే పీఠసర్పవత్ ॥ 22
బుద్ధ్యా వీర్యేణ సంయుక్తః శ్రుతేనాభిజనేన చ ।
మహారాజా! మనువు చెప్పిన రాజధర్మాలు నీవు విని ఉన్నావు. క్రూరులు, మోసగ్రాండ్రు, మనహితానికి వ్యతిరేకంగా ఆచరించేవారూ, శాంతిలేని చిత్తం కలవారూ, దురాత్ములూ అయిన ధార్తరాష్ట్రులను ఎందుకు క్షమిస్తున్నావు? బుద్ధి, బలం, శాస్త్రజ్ఞానం, ఆభిజాత్యం కలిగి ఉన్న నీవు కొండచిలువలూ ఏమీ చెయ్యకుండా ఎందుకున్నావు? (21,22 1/2)
తృణాణాం ముష్టినైకేన హిమవంతం చ పర్వతమ్ ॥ 23
ఛన్నమిచ్ఛసి కౌంతేయ యోఽస్మాన్ సంవర్తుమిచ్ఛసి ।
కుంతీనందనా! అజ్ఞాతవాస సమయంలో మనలను కనబడకుండా ఉంచాలనుకొన్నవాడు దుర్యోధనుడు. వాడిని నీవు కప్పిపుచ్చాలనుకొంటున్నావు. ఇది ఎలా ఉందంటే పిడికెడు గడ్డిపోచలతో హిమవతర్వతాన్ని కప్పుదామనుకొంటున్నట్లే ఉంది. (23 1/2)
అజ్ఞాతచర్యా గూఢేన పృథివ్యాం విశ్రుతేన చ ॥ 24
దివీవ పార్థ సూర్యేణ న శక్యా చరితుం త్వయా ।
పృథానందనా! ఈ భూమండలమంతా ప్రసిద్ధిపొందిన నీవు ఆకాశంలో సూర్యునిలా అజ్ఞాతంగా సంచరించలేవు. (24 1/2)
బృహచ్ఛాల ఇవానూపే శాఖాపుష్పపలాశవాన్ ॥ 25
హస్తీ శ్వేత ఇవాజ్ఞాతః కథం జిష్ణుశ్చరిష్యతి ।
జలసమృద్ధి ఉన్నచోట పత్రపుష్పశాఖలతో శోభిల్లుతున్న సాలవృక్షంలా, తెల్లఏనుగు ఐరావతంగా జయశీలుడైన అర్జునుడు అజ్ఞాతంగా ఎలా ఉండగలడు? (25 1/2)
ఇమౌ చ సింహసంకాశౌ భ్రాతరౌ సహితౌ శిశూ ॥ 26
నకులః సహదేవశ్చ కథం పార్థ చరిష్యతః ।
కంతీకుమారా! సింహవిక్రములైన నీచిన్న తమ్ములు నకులసహదేవులు అజ్ఞాతంగా ఎలా ఉండగలరు? (26 1/2)
పుణ్యకీర్తీ రాజపుత్రీ ద్రౌపదీ వీరసూరియమ్ ॥ 27
విశ్రుతా కథమజ్ఞాతా కృష్ణా పార్థ చరిష్యతి ।
పార్థా! వీరజనని, పవిత్రకీర్తి, రాజకుమారి అయిన ద్రౌపది లోకంలో విఖ్యాతి కలది. ఈమె అజ్ఞాతంగా ఎలా చరింపగలదు? (27 1/2)
మాం చాపి రాజన్ జానంతి హ్యాకుమారమిమాః ప్రజాః ॥ 28
నాజ్ఞాతచర్యాం పశ్యామి మేరోరివ నిగూహనమ్ ।
మహారాజా! నన్ను కూడా బాలురతో సహా ప్రజలందరూ ఎరుగుదురు. మేరు పర్వతాన్ని
దాచడం సాధ్యంకానట్లే, నన్ను ఆజ్ఞాతంగా ఉంచడం సాధ్యం కాదనుకొంటున్నాను. (28 1/2)
తథైవ బహవోఽస్మాభిః రాష్ట్రేభ్యో విప్రవాసితాః ॥ 29
రాజానో రాజపుత్రాశ్చ ధృతరాష్ట్రమనువ్రతాః ।
న హి తేఽప్యుపశామ్యంతి నికృతా వా నిరాకృతాః ॥ 30
మరొకమాట కూడా ఉంది. మనం కూడా చాలమంది రాజులను, రాజకుమారులను వారి రాజ్యాల నుండి వెళ్ళగొట్టాం. వారంతా ధృతరాష్ట్రునితో చేతులు కలిపారు. ఇపుడు వారంతా మనతో శాంతంగా వ్యవహరించరు. (29,30)
అవశ్యం తైర్నికర్తవ్యమ్ అస్మాకం తత్పైషిభిః ।
తేఽప్యస్మాసు ప్రయుంజీరన్ ప్రచ్ఛన్నాన్ సుబహూంశ్చరాన్ ।
ఆచక్షీరంశ్చ నో జ్ఞాత్వా తతః స్యాత్ సుమహద్ భయమ్ ॥ 31
వారంతా దుర్యోధనుడి ప్రీతికోసం అజ్ఞాతంగా ఉన్న మనలను గుర్తించాలనుకొంటారు. అందుకోసం మనపై వారివారి గూఢచారులను ప్రయోగిస్తారు. వారు మనలను గుర్తించి దుర్యోధనుడికి చెప్తారు. అపుడు మనం పెద్దభయంకరమైన సంకటంలో పడతాం. (31)
అస్మాభిరుషితాః సమ్యగ్ వనే మాసాస్త్రయోదశ ।
పరిమాణేన తాన్ పశ్య తావతః పరివత్సరాన్ ॥ 32
ఇప్పటికి మనం పదమూడు నెలలు వనవాసం బాగానే చేశాం. ఈ పదమూడు మాసాలను పరిమాణం చేత పదమూడు సంవత్సరాలుగా గుర్తించు. (32)
అస్తి మాసః ప్రతినిధిః యథా ప్రాహుర్మనీషిణః ।
పుతికామివ సోమస్య తథేదం క్రియతామితిః ॥ 33
మాసం సంవత్సరానికి ప్రతినిధి అని మనీషులు చెపుతారు. యజ్ఞంలో సోమలతకు బదులుగా పూతికను ఇచ్చినట్లుగా నీవు ఈ పదమూడు మాసాలను పదమూడు సంవత్సరాలుగా స్వీకరించు. (33)
వి॥సం॥ "సోమాభావే పూతికానాభిషుణుయాత్" అని వేదం. పూతికాః సోమస్య ప్రతినిధయః- సీమానికి బదులు పూతికలు వాడుతారు. (నీల)
చి॥సం॥ "యో మాసః స సంవత్సరః" అను శ్రుతివచనాన్ని బట్టి సంవత్సరానికి ప్రతినిధిగా నెలను స్వీకరించవచ్చు. (కాబట్టి పదమూడు నెలల అరణ్యవాసం పదమూడు సంవత్సరాల అరణ్యవాసానికి సరిపోతుంది) (నీల)
అథవానడుహే రాజన్ సాధవే సాధువాహినే ।
సౌహిత్యదానాదేతస్మాద్ పనసః ప్రతిముచ్యత్ ॥ 34
రాజా! లేదా మంచివారిని మోసే ఒక మంచి ఎద్దునకు బాగా పుష్టిగా ఆహారాన్ని ఇవ్వడం ద్వారా నీవు ఈ పాపం నుండి విముక్తుడవు అవుతావు. (34)
తస్మాచ్ఛత్రువధే రాజన్ క్రియతాం నిశ్చయస్త్వయా ।
క్షత్రియస్య హి సర్వస్య నాన్యో ధర్మోఽస్తి సంయుగాత్ ॥ 35
అందువల్ల, రాజా! శత్రుసంహారానికి నిశ్చయం చెయ్యి. క్షత్రియులకు యుద్ధంకంటె వేరొక ధర్మం లేదు. (35)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి భీమవాక్యే పంచత్రింశోఽధ్యాయః ॥ 35 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున భీమ వాక్యమను ముప్పది అయిదవ అధ్యాయము. (35)