39. ముప్పది తొమ్మిదవ అధ్యాయము

కిరాతార్జునుల యుద్ధము, శంకరుడు ప్రసన్నుడగుట, అర్జునుడు స్తుతించుట.

వైశంపాయన ఉవాచ
గతేషు తేషు సర్వేషు తపస్విషు మహాత్మసు ।
పినాకపాణిర్భగవాన్ సర్వపాపహరో హరః ॥ 1
కైరాతం వేషమాస్థాయ కాంచనద్రుమసన్నిభమ్ ।
విభ్రాజమానో విపులః గిరిర్మేరురివాపరః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! మహాత్ములైన ఆ తపస్వులందరూ వెళ్ళిన తర్వాత, సర్వపాపహరుడు, పినాకపాణి అయిన మహాశివుడు సువర్న వృక్షంలా ప్రకాశిమ్చే కిరాతవేషాన్ని ధరించి వేరొక మేరు పర్వతంలా విపుల శరీరంతో ప్రకాశిస్తున్నాడు. (1,2)
శ్రీమద్ ధనురుపాదాయ శరాంశ్చాశీవిషోపమాన్ ।
నిష్పపాత మహావేగః దహనో దేహవానివ ॥ 3
శోభాయమానమైన ధనుస్సును, సర్పాలవంటి బాణాలను తీసికొని అగ్ని దేహాన్ని ధరించినట్లుగా ఉన్న ఆ శివుడు మహావేగంతో భూమిమీదికి వచ్చాడు. (3)
దేవ్యా సహోమయా శ్రీమాన్ సమానవ్రతవేషయా ।
నానావేషధరైర్హృష్టైః భుతైరనుగతస్తదా ॥ 4
కిరాతవేషసంచ్ఛన్నః స్త్రీభిశ్చాపి సహస్రశః ।
అశోభత తదా రాజన్ స దేశోఽతీవ భారత ॥ 5
భరతనందనా! అతనితోపాటు అతనితో సమానమైన వేషం ధరించిన పార్వతి కూడ వచ్చింది. అనేక విధాలైన వేషాలు ధరించిన భూతగణాలు సంతోషంగా అతనిని అనుసరించాయి. కిరాతవేషాలు ధరించిన వేలకొలది స్త్రీలు కూడా వచ్చారు. వీరందరితో ఆ ప్రదేశమంతా మిక్కిలి ప్రకాశిస్తోంది. (4,5)
క్షణేన తద్ వనం సర్వం నిః శబ్దమభవత్ తదా ।
నాదః ప్రస్రవణానాం చ పక్షిణాం చాప్యుపారమత్ ॥ 6
క్షణకాలంలో వారు ప్రవేశించిన ఆ వనమంతా నిశ్శబ్దమైపోయింది. సెలయేరుల యొక్క, పక్షుల యొక్క ధ్వనులు కూడా ఆగిపోయాయి. (6)
స సన్నికర్షమాగమ్య పార్థస్యాక్లిష్టకర్మణః ।
మూకం నామ దనోఃపుత్రం దదర్శాద్భుతదర్శనమ్ ॥ 7
వారాహం రూపమాస్థాయ తర్కయంతమివార్జునమ్ ।
హంతుం పరం దీప్యమానం తమువాచాథ ఫాల్గునః ॥ 8
గాండీవం ధనురాదాయ శరాంశ్చాశీవిషోపమాన్ ।
సజ్యం ధనుర్వరం కృత్వా జ్యాఘోషేణ నినాదయన్ ॥ 9
శంకరుడు నిపుణకర్ముడైన అర్జునుని సమీపానికి వచ్చాడు. అక్కడ అద్భుతంగా కనబడుతున్న మూకుడనే పేరు గల దానవుడు సూకరాకారంలో ఉండి అర్జునుని చంపాలని ఆలోచిస్తూండడం చూశాడు. ఆ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని సర్పాలవంటిబాణాలను తీసికొని, ధనుస్సుకు నారిని సంధించి ధనిటంకారంతో దిక్కులను నినదింపచేస్తూ ఉన్నాడు. (7-9)
యన్మాం ప్రార్థయసే హంతుమ్ అనాగసమిహాగతమ్ ।
తస్మాత్ త్వాం పూర్వమేవాహం నేతాద్య యమసాదనమ్ ॥ 10
'ఇక్కడకు వచ్చిన, పాపరహితుడనైన నన్ను నీవు చంపాలని అనుకొంటున్నావు. అందువల్ల నేనే ముందుగా నిన్ను యమపురికి పంపుతాను. (10)
దృష్ట్వా తం ప్రహరిష్యంతం ఫాల్గునం దృఢధన్వినమ్ ।
కిరాతరూపీ సహసా వారయామాస శంకరః ॥ 11
అని తలంచి బాణం విడువబోతున్న దృఢధన్వి అయిన అర్జునుని కిరాతరూపంలోని శంకరుడు వారించాడు. (11)
మయైష ప్రార్థితః పూర్వమ్ ఇంద్రకీలసమప్రభః ।
అనాదృత్య చ తద్ వాక్యం ప్రజహారాథ ఫాల్గునః ॥ 12
శంకరుడిలా అన్నాడు - 'ఇంద్రకీలపర్వతంతో సమానమైన కాంతి గల ఈ సూకరాన్ని ముందుగా నేను చంపాలనుకొన్నాను' - ఆ మాటలను అర్జునుడు లక్ష్యపెట్టక ఆ పందిని బాణంతో కొట్టాడు. (12)
కిరాతశ్చ సమం తస్మిన్ ఏకలక్ష్యే మహాద్యుతిః ।
ప్రముమోచాశనిప్రఖ్యం శరమగ్నిశిఖోపమమ్ ॥ 13
మహాతేజస్వి అయిన కిరాతుడు కూడా అదే లక్ష్యం (సూకరం) పై అతనితో సమంగా పిడుగువంటి, అగ్నిశిఖవంటి బాణాన్ని విడిచిపెట్టాడు. (13)
టహు ముక్తౌ సాయకౌ తాభ్యాం సమం తత్ర నిపేతతుః ।
మూకస్య గాత్రే విస్తీర్ణే శైలసంహననే తదా ॥ 14
వారిరువురూ విడిచిన బాణాలు రెండూ ఒకేసారి పర్వతం వంటి ఆ మూకాసురుని శరీరం మీద తగిలాయి. (14)
యథాశనేర్వినిర్ఘోషః వజ్రస్యేవ చ పర్వతే ।
తథా తయోః సన్నిపాతః శరయోరభవత్ తదా ॥ 15
వారిరువురి శరాఘాతాల వల్ల పిడుగుపాటు, వజ్రపాతం వంటి ధ్వని ఆ పర్వతంలో కలిగింది. (15)
స విద్ధో బహుభిర్బాణైః దీప్తాస్యైః పన్నగైరివ ।
మమార రాక్షసం రూపం భూయః కృత్వా విభీషణమ్ ॥ 16
మండుతున్న ముఖాలు గల సర్పాల వంటి అనేక బాణాల దెబ్బలు తిని, ఆ రాక్షసుడు తన భయంకర రూపాన్ని, పొంది మరణించాడు. (16)
స దదర్శ తతో జిష్ణుః పురుషం కాంచనప్రభమ్ ।
కిరాతవేషసంచ్ఛన్నం స్త్రీసహాయమమిత్రహా ॥ 17
తమబ్రవీత్ ప్రీతమనాః కౌంతేయః ప్రహసన్నివ ।
కో భవానటతే శూన్యే వనే స్త్రీగణసంవృతః ॥ 18
అనంతరం శత్రునాశకుడు, ప్రసన్నచిత్తుడు జయశీలుడు అయిన అర్జునుడు స్వర్ణకాంతి గల తేజోవంతుడై, స్త్రీసహాయుడై, కిరాతవేషంలో ఉన్న పురుషుని చూశాడు. అతనితో అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు - శూన్యమైన ఈ వనంలో స్త్రీలతో కలిసి తిరుగుతున్న నీవెవరవు? (17,18)
న త్వమస్మిన్ వనే ఘోరే బిభేషి కనకప్రభ ।
కిమర్థం చ త్వయా విద్ధః వరాహో మత్పరిగ్రహః ॥ 19
కనకప్రభా! భయంకరమైన ఈ వనంలో నీవు భయపడటం లేదా! నాకు లక్ష్యమైన ఈ సూకరాన్ని నీవెందుకు కొట్టావు? (19)
యయాభిపన్నః పూర్వం హి రాక్షసోఽయమిహాగతః ।
కామాత్ పరిభవాద్ వాపి న మే జీవన్ విమోక్ష్యసే ॥ 20
ఈ రాక్షసుడు ముమ్దే నాదగ్గరికి వచ్చాడు. ఇతనిని నేను లక్ష్యంగా చేసుకొన్నాను. నీవు ఏదైనా కోరికతో దీన్ని చంపావా? లేక నన్నవమానించాలనా? నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. (20)
న హ్యేష మృగయాధర్మః యస్త్వయాద్య కృతో మయి ।
తేన త్వాం భ్రంశయిష్యామి జీవితాత్ పర్వతాశ్రయమ్ ॥ 21
ఇపుడు నీవు చేసిన పని వేటకు సంబంధించిన ధర్మం కాదు. ఈ దోషం కారణంగా పర్వతనివాసివైన నీ ప్రాణాలు తీస్తాను. (21)
ఇత్యుక్తః పాండవేయేన కిరాతః ప్రహసన్నివ ।
ఉవాచ శ్లక్ష్ణయా వాచా పాండవం సవ్యసాచినమ్ ॥ 22
అర్జునుడీవిధంగా పలుకగా, కిరాతుడు నవ్వుతూ పాండు నందనుడైన సవ్యసాచితో మధురంగా ఇలా పలికాడు. (22)
న మత్కృతే త్వయా వీర భీః కార్యా వనమంతికాత్ ।
ఇయం భూమిః సదాస్మాకమ్ ఉచితా వసతాం వనే ॥ 23
వీరా! నీవే వనసమీపానికి వచ్చావు. నా గురించి భయపడకు. వనవాసులమైన మాకు ఈ ప్రదేశం నిత్యం తిరగడానికి యోగ్యమైంది. (23)
త్వయా తు దుష్కరః కస్మాద్ ఇహ వాసః ప్రరోచితః ।
వయం తు బహుసత్త్వేఽస్మిన్ నివసామస్తపోధన ॥ 24
ఇక్కడ నివసించడం చాల కష్టమైంది. ఇది నీకు ఎందుకు ఇష్టమైంది? తపోధనా! అనేకప్రాణులున్న ఈ వనంలోనే మేము నివసిస్తున్నాం. (24)
భవాంస్తు కృష్ణవర్త్మాభః సుకుమారః సుఖోచితః ।
కథం శూన్యమిమం దేశమ్ ఏకాకీ విచరిష్యతి ॥ 25
కాని, నీవు అగ్నిలా ప్రకాశిస్తున్నవాడవు. సుకుమారుడవు. సుఖాలనుభవిమ్చడానికి యోగ్యుడవు. శూన్యమైన ఈ వనంలో ఒంటరిగా ఎలా తిరుగుతున్నావు? (25)
అర్జున ఉవాచ
గాండీవమాశ్రయం కృత్వా నారాచాంశ్చాగ్నిసన్నిభాన్ ।
నివసామి మహారణ్యే ద్వితీయ ఇవ పావకిః ॥ 26
అర్జునుడిలా అన్నాడు - ఈ గాండీవాన్ని, అగ్నిలా జ్వలించే బాణాలనూ ఆశ్రయించి ఈ మహావనంలో రెండవ కార్తికేయునిలా నిర్భయంగా నివసిస్తున్నాను. (26)
ఏష చాపి మయా జంతుః మృగరూపం సమాశ్రితః ।
రాక్షసో నిహతో ఘోరః హంతుం మామిహ చాగతః ॥ 27
మృగరూపంలో ఉన్న ఈ రాక్షసుడు నన్ను చంపడానికి ఇక్కడకు వచ్చాడు. అందువల్ల నేనీ భయంకరమైన రాక్షసుని చంపాను. (27)
కిరాత ఉవాచ
మయైష ధన్వనిర్ముక్తైః తాడితః పూర్వమేవ హి ।
బాణైరభిహతః శేతే నీతశ్చ యమసాదనమ్ ॥ 28
అపుడు కిరాతుడిలా అన్నాడు - నేనే ముందుగా నా ధనువు నుండి విడువబడిన బాణాలతో ఇతనిని కొట్టాను. నా బాణాల దెబ్బలకే ఇతడు క్రిందపడ్డాడు, యమపురికి వెళ్ళాడు. (28)
మమైష లక్ష్యభూతో హి మమ పూర్వపరిగ్రహః ।
మమైవ చ ప్రహారేణ జీవితాద్ వ్యపరోపితః ॥ 29
ముందుగా నేనే ఇతనిని నాబాణానికి లక్ష్యంగా చేసుకొన్నాను. ముందుగా నేనే కొట్టాను. నా బాణపు దెబ్బకే ఇతడు ప్రాణాలు కోల్పోయాడు. (29)
దోషాన్ స్వాన్ నార్హసేఽన్యస్మై వక్తుం స్వబలదర్పితః ।
అవలిప్తోఽసి మందాత్మన్ న మే జీవన్ విమోక్ష్యసే ॥ 30
మందబుద్ధీ! బలగర్వంతో నీదోషాలను ఇతరుని పై ఆరోపించడం తగదు. శక్తితో నీవు బాగా గర్విస్తున్నావు. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. (30)
స్థిరో భవస్వ మోక్ష్యామి సాయకానశనీనివ ।
ఘటస్వ పరయా శక్త్యా ముంచ త్వమపి సాయకాన్ ॥ 31
ధైర్యంగా ఇక్కడే నిలబడి ఉండు, వజ్రాయుధం వంటి బాణాలను నీపై విడుస్తాను. నీవు కూడా నీ శక్తినంతటినీ కూడదీసికో, నాపై బాణాలను విడిచిపెట్టు. (31)
తస్య తద్ వచనం శ్రుత్వా కిరాతస్యార్జునస్తదా ।
రోషమాహారయామాస తాడయామాస చేషుభిః ॥ 32
కిరాతుని మాటలు విని అర్జునుడపుడు మిక్కిలి క్రుద్ధుడయ్యాడు. అతనిని బాణాలతో కొట్టడం ప్రారంభించాడు. (32)
తతో హృష్టేన మనసా ప్రతిజగ్రాహ సాయకాన్ ।
భూయో భూయ ఇతి ప్రాహ మందమందేత్యువాచ హ ॥ 33
ప్రహరస్వ శరానేతాన్ నారాచాన్ మర్మభేదినః ।
అపుడు కిరాతుడు ఆనందించిన మనస్సుతో ఆ బాణాలను పట్టుకొన్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు - 'మూర్ఖ! మూర్ఖ! మళ్ళీ మళ్ళీ మర్మభేదులైన బాణాలతో కొట్టు' (33 1/2)
ఇత్యుక్తో బాణవర్షం చ ముమోచ సహసార్జునః ॥ 34
కిరాతుడలా అనగానే అర్జునుడు సాహసంతో అతనిపై బాణవర్షాన్ని కురిపించాడు. (34)
తతస్తౌ తత్ర సంరబ్ధౌ రాజమానౌ ముహుర్ముహుః ।
శరైరాశీవిషాకారైః తతక్షాతే పరస్పరమ్ ॥ 35
అనంతరం వారిరువురూ పరస్పరం క్రుద్ధులై సర్పాల వంటి బాణాలతో మళ్ళీ మళ్ళీ కొట్టుకొన్నారు. ఆ సమయంలో క్రోధ సంరంభంలో ఉన్న వారిద్దరూ ఎంతో శోభిల్లారు. (35)
తతోఽర్జునః శరవర్షం కిరాతే సమవాసృజత్ ।
తత్ ప్రసన్నేన మనసా ప్రతిజగ్రాహ శంకరః ॥ 36
తర్వాత అర్జునుడు కిరాతునిపై శరవర్షాన్ని కురిపించాడు. దాన్ని ప్రసన్నచిత్తంతో శంకరుడు స్వీకరించాడు. (36)
ముహూర్తం శరవర్షం తత్ ప్రతిగృహ్య పినాకధృక్ ।
అక్షతేన శరీరేణ తస్థౌ గిరిరివాచలః ॥ 37
పినాకపాణి అయిన శంకరుడు ఆ శరవర్షాన్ని ఒక ముహూర్తకాలం స్వీకరించి ఏమాత్రం దెబ్బతగలని శరీరంతో పర్వతంలా స్థిరంగా నిలిచాడు. (37)
స దృష్ట్వా బాణవర్షం తు మోఘీభూతం ధనంజయః ।
పరమం విస్మయం చక్రే సాధు సాధ్వితి చాబ్రవీత్ ॥ 38
తాను వదిలిన బాణవర్షం అలా వ్యర్థం కావడం చూసి ధనంజయుడు మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందాడు. బాగు బాగు అని పలికాడు. (38)
అహోఽయం సుకుమారాంగః హిమవచ్ఛిఖరాశ్రయః ।
గాండీవముక్తాన్ నారాచాన్ ప్రతిగృహ్ణాత్యవిహ్వలః ॥ 39
ఆహో! హిమాలయ శిఖరనివాసి అయిన ఈ సుకుమార శరీరం గల కిరాతుడు నా గాండీవం నుండి వెలువడిన బాణాలను స్వీకరిస్తున్నాడు. ఏమాత్రం వ్యాకులపడటం లేదు. దెబ్బతినటం లేదు. (39)
కోఽయం దేవో భవేత్ సాక్షాద్ రుద్రో యక్షః సురోఽసురః ।
విద్యతే హి గిరిశ్రేష్ఠే త్రిదశానాం సమాగమః ॥ 40
ఇతడు ఏదేవుడైనా అయ్యుంటాడా? సాక్షాత్తు రుద్రుడా! యక్షుడా! అమరుడా! అసురుడా! ఈ శ్రేష్ఠమైన పర్వతం మిద దేవతల రాక కూడా ఉండవచ్చు. (40)
న హి మద్బాణజాలానామ్ ఉత్సృష్టానాం సహస్రశః ।
శక్తోఽన్యః సహితం వేగమ్ ఋతే దేవ పినాకినమ్ ॥ 41
నేను వదిలిన వేలకొలది బాణసమూహాల వేగాన్ని పినాకపాణి తప్ప ఇతరుడెవడూ సహింపలేడు. (41)
దేవో వా యది వా యక్షః రుద్రాదన్యో వ్యవస్థితః ।
అహమేనం శరైసీక్ష్ణైః నయామి యమసాదనమ్ ॥ 42
ఇతడు దేవుడా! లేక యక్షుడా! రుద్రుడు కానట్లయితే, తీక్ష్ణమైన బాణాలతో ఇతనిని యమపురికి పంపుతాను. (42)
తతో హృష్టమనా జిష్ణుః నారాచాన్ మర్మభేదినః ।
వ్యసృజచ్ఛతధా రాజన్ మయూఖానివ భాస్కరః ॥ 43
రాజా! ఇలా ప్రసన్నచిత్తంతో ఆలోచించి, జయశీలుడైన అర్జునుడు సూర్యుడు కిరణాలను ప్రసరించినట్లు మర్మ భేదు లైన బాణాలను వందలకొలదీ వదిలాడు. (43)
తాన్ ప్రసన్నేన మనసా భగవాన్ లోకభావనః ।
శూలపాణిః ప్రత్యగృహ్ణాత్ శిలావర్షమివాచలః ॥ 44
లోకభావనుడైన త్రిశూలపాణి ప్రసన్నమైన మనస్సుతో పర్వతం శిలావర్షాన్ని స్వీకరించినట్లుగా ఆ బాణాలను స్వీకరించాడు. (44)
క్షణేన క్షీణబాణోఽథ సంవృత్తః ఫాల్గునస్తదా ।
భీశ్చైనమావిశత్ తీవ్రా తం దృష్ట్వా శరసంక్షయమ్ ॥ 45
ఆ తరువాత క్షణకాలంలో అర్జునుని అంబుల పొందిలోని బాణాలన్నీ క్షీణించాయి. అలా బాణాలు అయిపోవడం చూసిన అతనిని తీవ్రమైన భయం ఆవహించింది. (45)
చింతయామాస జిష్ణుస్తు భగవంతం హుతాశనమ్ ।
పురస్తాదక్షయౌ దత్తౌ తూణౌ యేనాస్య ఖాండవే ॥ 46
అపుడు జయశీలుడైన అర్జునుడు తనకు ఖాండవవనంలో ప్రత్యక్షమై అక్షయాలైన రెండు తూణీరాల నిచ్చిన అగ్ని దేవుని ధ్యానించాడు. (46)
కిం ను మోక్ష్యామి ధనుషా యన్మే బాణాః క్షయం గతాః ।
అయం చ పురుషః కోఽపి బాణాన్ గ్రసతి సర్వశః ॥ 47
హత్వా చైనం ధనుష్కోట్యా శూలాగ్రేణేవ కుంజరమ్ ।
నయామి దండధారస్య యమస్య సదనం ప్రతి ॥ 48
నా బాణాలన్నీ క్షీణించాయి. ఇక ఈ ధనుస్సును వదిలెయ్యనా? ఈ పురుషుడెవడో నా బాణాలన్నింటినీ మింగి వేస్తున్నాడు. శూలాగ్రంతో ఏనుగును చంపినట్లు ఈ ధనుష్కోటితో ఇతనిని చంపి దండధరుడైన యముని భవనానికి పంపుతాను. (47,48)
ప్రగృహ్యాథ ధనుష్కోట్యా జ్యాపాశేనావకృష్య చ ।
ముష్టిభిశ్చాపి హతవాన్ వజ్రకల్పైర్మహాద్యుతిః ॥ 49
ఈ విధంగా ఆలోచించి మహాతేజస్వి అయిన అర్జునుడు ఆ కిరాతుని ధనుష్కోటితో పట్టుకొని, వింటినారితో అతని శరీరాన్ని పట్టి లాగి, వజ్రాయుధంతో సమానమైన పిడికిళ్ళతో కొట్టాడు. (49)
సంప్రయుద్ధో ధనుష్కోట్యా కౌంతేయః పరవీరహా ।
తదప్యస్య ధనుర్దివ్యం జగ్రాహ గిరిగోచరః ॥ 50
శత్రువీరులను చంపే అర్జునుడు ధనుష్కోటితో కొట్టగా, గిరిచరుడైన కిరాతుడు ఆ దివ్య ధనువును కూడ తనలోనికి తీసికొన్నాడు. (50)
తతోఽర్జునో గ్రస్తధనుః ఖడ్గపాణిరతిష్ఠత ।
యుద్ధస్యాంతమభీప్సన్ వై వేగేనాభిజగామ తమ్ ॥ 51
అర్జునుడు తన ధనువు పోగామ్ చేతిలో ఖడ్గంతో నిలిచాడు. ఇక యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశ్యంతో వేగంగా కిరాతునికి ఎదురుగా వెళ్ళాడు. (51)
తస్య మూర్ష్ని శితం ఖడ్గమ్ అసక్తం పర్వతేష్వపి ।
ముమోచ భుజవీర్యేణ విక్రమ్య కురునందనః ॥ 52
పర్వతముల మిద కూడా కుంఠితం కాని తీక్ష్ణమైన ఖడ్గంతో తన భుజబలం కొద్దీ అర్జునుడు ఆ కిరాతుని శిరస్సుపై కొట్టాడు. (52)
తస్య మూర్ధానమాసాద్య పఫాలాసివరో హి సః ।
తతో వృక్షైః శిలాభిశ్చ యోధయామాస ఫాల్గునః ॥ 53
ఆతని శిరస్సుపై పడ్డ ఆ ఖడ్గం ముక్కలైపోయింది. ఆపైన ఫాల్గునుడు చెట్లతో, శిలలతోను యుద్ధం చేశాడు. (53)
తదా వృక్షాన్ మహాకాయః ప్రత్యగృహ్ణాదథో శిలాః ।
కిరాతరూపీ భగవాన్ తతః పార్థో మహాబలః ॥ 54
ముష్టిభిర్వజ్రసంకాశైః ధూమముత్పాదయన్ ముఖే ।
ప్రజహార దురాధర్షే కిరాతసమరూపిణి ॥ 55
అపుడు విశాలకాయంతో కిరాతరూపంలో ఉన్న శంకరుడు అర్జునుడు వేసిన వృక్షాలను, శిలలను తనలోకి తీసికొన్నాడు. అనంతరం మహాబలుడైన పార్థుడు క్రోధావేశంతో నోటినుండి పొగలు (ఆవిరులు) చిమ్ముతూ వజ్రసమానమైన పిడికిళ్ళతో కిరాత రూపంలో ఉండి ఎదిరింప శక్యంగాని శంకరుని కొట్ట నారంభించాడు. (54,55)
తతః శక్రాశనిసమైః ముష్టిభిర్భృశదారుణైః ।
కిరాతరూపీ భగవాన్ అర్దయామాస ఫాల్గునమ్ ॥ 56
అనంతరం కిరాతరూపంలో ఉన్న భగవంతుడు శంకరుడు ఇంద్రుని వజ్రాయుధంతో సమానమై దారుణాలైన పిడికిలిపోట్లతో అర్జునుని హింసించాడు. (56)
తతశ్చటచటాశబ్దః సుఘోరః సమపద్యత ।
పాండవస్య చ ముష్టీనాం కిరాతస్య చ యుధ్యతః ॥ 57
కిరాతార్జునులు ఆ విధంగా ముష్టియుద్ధం చేస్తూండగా భయంకరమైన చటచట శబ్దం రాసాగింది. (57)
సుముహూర్తం తు తద్ యుద్ధమ్ అభవల్లోమహర్షణమ్ ।
భుజప్రహారసంయుక్తం వృత్రవాసవయోరివ ॥ 58
ఇంద్ర వృత్రాసురులయుద్ధం వలె కిరాతార్జునుల బాహుయుద్ధం రోమాంచం కలిగిస్తూ ముహూర్తకాలం జరిగింది. (58)
జఘానాథ తతో జిష్ణుః కిరాతమురసా బలీ ।
పాండవం చ విచేష్టం తం కిరాతోఽప్యహనద్ బలీ ॥ 59
అటు తరువాత జయశీలుడై బలవంతుడైన అర్జునుడు కిరాతుని తన వక్షస్థలంతో (డీ) కొట్టాడు. బలవంతుడైన కిరాతుడు కూడా విపరీత చేష్టచేస్తున్న అర్జునుని కొట్టాడు. (59)
తయోర్భుజవినిష్పేషాత్ సంఘర్షేణోరసోస్తథా ।
సమజాయత గాత్రేషు పావకోఽంగారధూమవాన్ ॥ 60
ఇరువురి భుజాల రాపిడుల చేత, వక్షస్థులాల సంఘర్షణ చేత వారి శరీరాల మీద పొగతో కూడిన నిప్పుకణాలతో అగ్ని పుట్టినట్లుగా ఉంది. (60)
తత ఏనం మహాదేవః పీడ్య గాత్రైః సుపీడితమ్ ।
తేజసా వ్యక్రమద్ రోషాద్ చేతస్తస్య విమోహయన్ ॥ 61
ఆ తరువాత మహాదేవుడు బాగా హింసింపబడిన అర్జునుని తన అవయవాలచే ఇంకా పీడించి, అతనిని మోహపరిచే తేజస్సుతో, కోపంతో అతనిపై తన పరాక్రమాన్ని చూపాడు. (61)
తతోఽభిపీడితైర్గాత్రైః పిండీకృత ఇవాబభౌ ।
ఫాల్గునో గాత్రసంరుద్ధః దేవదేవేన భారత ॥ 62
భారతా! దేవదేవునిచే శరీరం పట్టు సడలిన అర్జునుడు దెబ్బతిన్న అవయవాలతో మట్టిముద్దలా కనబడుతున్నాడు. (62)
నిరుచ్ఛ్వాసోఽభవచ్చైవ సన్నిరుద్ధో మహాత్మనా ।
పపాత భూమ్యాం నిశ్చేష్టః గతసత్త్వ ఇవాభవత్ ॥ 63
మహాత్ముడైన శంకరునిచే బాగా నిరోధింపబడిన అర్జునుడు ఉచ్ఛ్వాసక్రియ క్షీణించినవాడై, నిశ్చేష్ఠుడై, ప్రాణం పోయిన వానివలె నేల మీద పడ్డాడు. (63)
న ముహూర్తం తథా భూత్వా సచేతాః పునరుత్థితః ।
రుధిరేణాప్లుతాంగస్తు పాండవో భృశదుఃఖితః ॥ 64
ముహూర్తకాలం అలా పడి ఉండి, స్పృహకల్గి మళ్ళీ లేచి, రక్తంతో తడిసిన శరీరం చూచుకొని అర్జునుడు మిక్కిలి దుఃఖించాడు. (64)
శరణ్యం శరణం గత్వా భగవంతం పినాకినమ్ ।
మౄణ్మయం స్థండిలం కృత్వా మాల్యేనాపూజయద్ భవమ్ ॥ 65
అపుడు శరణాగతవత్సలుడు పినాకధరుడు భగవంతుడుయిన శివుని శరణుజొచ్చి, మట్టితో వేదికచేసి, దానిపై పార్థివ శివ లింగం స్థాపించి, పుష్పమాలతో పూజించాడు. (65)
తచ్చ మాల్యం తదా పార్థః కిరాతశిరసి స్థితమ్ ।
అపశ్యత్ పాండవశ్రేష్ఠః హర్షేణ ప్రకృతిం గతః ॥ 66
పార్థివశివునిపై ఉంచిన మాల అర్జునునకు కిరాతుని శిరస్సుపై కనిపించింది. అలా చూసిన వెంటనే పాండవ శ్రేష్ఠుడు ఆనందంతో తన సహజస్థితికి వచ్చాడు. (66)
పపాత పాదయోస్తస్య తతః ప్రీతోఽభవద్ భవః ।
ఉవాచ చైనం వచసా మేఘగంభీరగీర్హరః ।
జాతవిస్మయమాలోక్య తపఃక్షీణాంగసంహతిమ్ ॥ 67
అర్జునుడు, వెనువెంటనే ఆ కిరాతరూపంలోని శివుని పాదాలపై పడ్డాడు. శివుడు ఆనందించాడు, అర్జునుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు తపస్సుచే క్షీణించిన, అవయవసౌష్ఠవం గల అర్జునుని చూసి, శివుడు మేఘ గంభీరస్వరంతో ఇలా పలికాడు. (67)
భవ ఉవాచ
భోభోః ఫాల్గున తుష్టోఽస్మి కర్మణాప్రతిమేన తే ।
శౌర్యేణానేన ధృత్యా చ క్షత్రియో నాస్తి తే సమః ॥ 68
భవుడిలా అన్నాడు.
ఫల్గునా! అసాధారణమైన నీ పరాక్రమం చేత నేను సంతుష్ఠుడనయ్యాను, ఇటువంటి శౌర్యంతో, ధృతితో నీతో సమానుడైన క్షత్రియుడు లేడు. (68)
సమం తేజశ్చ వీర్యం చ మమాద్య తవ చానఘ ।
ప్రీతస్తేఽహం మహాబాహో పశ్య మాం భరతర్షభ ॥ 69
అనఘా! మన ఇద్దరి తేజః పరాక్రమాలు సమానమైనవి. మహాబాహూ! భరతశ్రేష్ఠా! నీపట్ల నేను ప్రసన్నుడనయ్యాను. నన్ను చూడు. (69)
దదామి తే విశాలాక్ష చక్షుః పూర్వఋషిర్భవాన్ ।
విజేష్యసి రణే శత్రూన్ అపి సర్వాన్ దివౌకసః ॥ 70
విశాలాక్షా! నేను నీకు దివ్య దృష్టినిస్తున్నాను. నీవు పూర్వకాలంలో నరుడనే ఋషిని. నీవు యుద్ధంలో శత్రువులను, సర్వదేవతలను కూడా జయింపగలవు. (70)
ప్రీత్యా చ తేఽహం దాస్యామి యదస్త్రమనివారితమ్ ।
త్వం హి శక్తో మదీయం తద్ అస్త్రం ధారయితుం క్షణాత్ ॥ 71
నీపట్ల ప్రీతితో నేను నీకు నివారింపశక్యంకాని (పాశుపత) అస్త్రాన్ని ఇస్తాను. ఆ నా పాశుపతాస్త్రాన్ని క్షణకాలంలో నీవు ధరించడానికి సమర్థుడవు. (71)
అర్జున ఉవాచ
తతో దేవం మహాదేవం గిరిశం శూలపాణినమ్ ।
దదర్శ ఫాల్గునస్తత్ర సహ దేవ్యా మహాద్యుతిమ్ ॥ 72
వైశంపాయనుడిలా అన్నాడు - తరువాత ఫాల్గునుడు మహాతేజస్వి, శూలపాణి, గిరిశుడు అయిన మహాదేవుని ఉమాదేవితో కలిసి ఉన్నట్లు చూశాడు. (72)
స జానుభ్యాం మహీం గత్వా శిరసా ప్రణిపత్య చ ।
ప్రసాదయామాస హరం పార్థః పరపురంజయః ॥ 73
పరపురంజయుడైన పార్ధుడు మోకాళ్ళపై, నేలపై కూర్చొని, శిరసా నమస్కరించి హరుని ప్రసన్నుని చేసుకొన్నాడు. (73)
అర్జున ఉవాచ
కపర్దిన్ సర్వదేవేశ భగనేత్రనిపాతన ।
దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర ॥ 74
అర్జునుడిలా స్తుతించాడు - కపర్దీ! సర్వదేవేశా! భగనేత్రనిపాతనా! దేవదేవా! మహాదేవా! నీలగ్రీవా! జటధరా! ॥ (74)
కారణానాం చ పరమం జానే త్వాం త్ర్యంబకం విభుమ్ ।
దేవానాం చ గతిం దేవ త్వత్ర్పసూతమిదం జగత్ ॥ 75
దేవా! నీవు కారణాలన్నింటిలో శ్రేష్ఠమైన వాడివి. నీవు త్ర్యంబకుడవు. సర్వవ్యాపిని, దేవతలందరికి ఆశ్రయుడవు, ఈ జగత్తంతా నీ వల్ల ఉద్భవించింది. (75)
అజేయస్త్వం త్రిభిర్లోకైః సదేవాసురమానుషైః ।
శివాయ విద్ణురూపాయ విష్ణవే శివరూపిణే ॥ 76
దేవాసుర మనుష్యులతో కూడిన ఈ ముల్లోకాలలో నీవు అజేయుడవు. నీవు విష్ణురూపంలోని శివుడవు, శివరూపంలోని విష్ణుడవు. నీకు నమస్కారం. (76)
దక్షయజ్ఞవినాశాయ హరిరుద్రాయ వై నమః ।
లలాటక్షాయ శర్వాయ మీఢుషే శూలపాణయే ॥ 77
దక్షయజ్ఞం నాశనం చేసిన హరిహరరూపుడైన నీకు నమస్కారం. లలాటనేత్రుడవు, శర్వుడవు, శూలపాణివి, వర్షణశీలివి (మీఢువు) అయిన నీకు నమస్కారం. (77)
పినాకగోప్ర్తే సూర్యాయ మంగల్యాయ చ వేధసే ।
ప్రసాదయే త్వాం భగవన్ సర్వభూతమహేశ్వర ॥ 78
నీవు పినాకరక్షకుడవు. సూర్యస్వరూపుడవు, మంగళస్వరూపుడవు, సృష్టికర్తవు, సర్వభూతమహేశ్వరా! నన్ను అనుగ్రహింపుమని నిన్ను, కోరుతున్నాను. (78)
వి॥సం॥ మార్జాలీయాయ = కిరాతరూపుడవు. (నీల)
గణేశం జగతః శంభుం లోకకారణకారణమ్ ।
ప్రధానపురుషాతీతం పరం సూక్ష్మతరం హరమ్ ॥ 79
భూతగణాధిపుడవు, జగత్తునకు కళ్యాణకారకుడవు, లోకకల్యాణ కారణుడవు, ప్రకృతి పురుషులకతీతమైన మిక్కిలి సూక్ష్మతరుడవు, హరుడవు - నీకు నమస్కారం. (79)
వ్యతిక్రమం మే భగవన్ క్షంతుమర్హసి శంకర ।
భగవన్ దర్శనాకాంక్షీ ప్రాప్తోఽస్మీమం మహాగిరిమ్ ॥ 80
భగవంతుడా! శంకరా! నా అపరాధాన్ని క్షమించటానికి నీవే తగుదువు. భగవంతుడా! నిన్ను చూడగోరి ఈ మహాగిరికి వచ్చాను. (80)
దయితం తవ దేవేశ తాపసాలయముత్తమమ్ ।
ప్రసాదయే త్వాం భగవన్ సర్వలోకనమస్కృతమ్ ॥ 81
దేవేశా! ఈ గిరి శిఖరం నీకు చాల ప్రీతిపాత్రమైనది. శ్రేష్ఠమైనది. తాపసుల నిలయం, సర్వలోకాలచే నమస్కరింపబడిన నిన్ను అనుగ్రహింపుమని కోరుతున్నాను. (81)
న మే స్యాదపరాధోఽయం మహాదేవాతిసాహసాత్ ।
కృతో మయాయమజ్ఞానాద్ విమర్దో యస్త్వయా సహ ।
శరణం ప్రతిపన్నాయ తత్ క్షమస్వాద్య శంకర ॥ 82
మహాదేవా! మిక్కిలి సాహసంతో నేను నీతో యుద్ధం చేశాను. ఇందులో నా అపరాధం లేదు. నీతో ఈ యుద్ధం అజ్ఞానం వల్ల చేశాను. శంకరా! ఇపుడు నేను నీ శరణుకోరి వచ్చాను. నా సాహసాన్ని క్షమించు. (82)
వైశంపాయన ఉవాచ
తమువాచ మహాతేజాః ప్రహస్య వృషభధ్వజః ।
ప్రగృహ్య రుచిరం బాహుం క్షాంతమిత్యేవ ఫాల్గునమ్ ॥ 83
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! మహాతేజస్వి, వృషభధ్వజుడు అయిన శంకరుడు అర్జునుని అందమైన చేతిని స్పృశించి ఫల్గునునితో 'క్షమించాను' అన్నాడు. (83)
పరిష్వజ్య చ బాహుభ్యాం ప్రీతాత్మా భగవాన్ హరః ।
పునః పార్థం సాంత్వపూర్వమ్ ఉవాచ వృషభధ్వజః ॥ 84
భగవంతుడా వృషభధ్వజుడూ అయిన హరుడు ప్రీతాత్ముడై అర్జునుని బాహువులతో కౌగిలించుకొని మరల సాంత్వన పూర్వకంగా ఇలా పలికాడు. (84)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కైరాతపర్వణి మహాదేవస్తవే ఏకోనచత్వారింశోఽధ్యాయః ॥ 39 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున కైరాతపర్వమను
ఉపపర్వమున మహాదేవస్తవమను ముప్పది తొమ్మిదవ అధ్యాయము. (39)