47. నలువది ఏడవ అధ్యాయము

లోమశుడు స్వర్గము నుండి కామ్యకవనమున కేగుట.

వైశంపాయన ఉవాచ
కదాచిదటమానస్తు మహర్షిరుత లోమశః ।
జగామ శక్రభవనం పురందరదిదృక్షయా ॥ 1
స సమేత్య నమస్కృత్య దేవరాజం మహామునిః ।
దదర్శార్థాసనగతం పాండవాం వాసవస్య హి ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! ఒకానొకప్పుడు లోమశమహర్షి ఇంద్రుని చూడాలనే కోర్కెతో ఇంద్రభవనానికి వెళ్లాడు. ఆ మహాముని దేవేంద్రుని సమీపించి నమస్కరించి ఇంద్రుని అర్ధాసనంలో కూర్చున్న అర్జునుని చూశాడు. (1,2)
తతః శక్రాభ్యనుజ్ఞాతః ఆసనే విష్టరోత్తరే ।
నిషసాద ద్విజశ్రేష్ఠః పూజ్యమానో మహర్షిభిః ॥ 3
తరువాత ఇంద్రుని ప్రార్థనచేత దర్భలు పరచబడిన ఉత్తమసింహాసనం మీద ఆ ద్విజశ్రేష్ఠుడైన మహర్షి కూర్చున్నాడు. ఆయనను మహర్షులు పూజించారు. (3)
తస్య దృష్ట్వాభవద్ బుద్ధిః పార్థమింద్రాసనే స్థితమ్ ।
కథమ్ ను క్షత్రియః పార్థః శక్రాసనమవాప్తవాన్ ॥ 4
ఇంద్రుని ఆసనం మీద కూర్చున్న పార్థుని చూడగానే అతడికి 'క్షత్రియుడైన ఈ కుంతీకుమారుడు ఇంద్రుని సింహాసనాన్ని ఎలా పొందాడు?' అనే ఆలోచన కలిగింది. (4)
కిం త్వస్య సుకృతం కర్మ కే లోకా వై వినిర్జితాః ।
స ఏవమనుసంప్రాప్తః స్థానం దేవనమస్కృతమ్ ॥ 5
ఇతడు ఏ పుణ్యకర్మ చేశాడు? ఏ ఏ లోకాలను జయించాడు? దేవతలందరిచే నమస్కరింపబడే ఈ స్థానాన్ని దేని ప్రభావం వల్ల పొందాడు? (5)
తస్య విజ్ఞాయ సంకల్పం శక్రో వృత్రనిఘాదనః ।
లోమశం ప్రహసన్ వాక్యమ్ ఇదమాహ శచీపతిః ॥ 6
అతని ఆలోచనను గ్రహించి వృత్రసంహారకుడైన ఇంద్రుడు నవ్వుతూ లోమశునితో ఇలా అన్నాడు. (6)
బ్రహ్మర్షే శ్రూయాతాం యత్ తే మనసైతద్ వివక్షితమ్ ।
నాయం కేవలమర్త్యో వై మానుషత్వముపాగతః ॥ 7
బ్రహ్మర్షీ! నీమనసులో అనుకొంటున్న దానికి సమాధానం చెపుతున్నాను. విను. ఇతడు మానవజన్మ నెత్తిన సాధారణమర్త్యుడు కాదు. (7)
మహర్షే మమ పుత్రోఽయం కుంత్యాం జాతో మహాభుజః ।
అస్త్రహేతోరిహ ప్రాప్తః కస్మాచ్చిత్ కారణాంతరాత్ ॥ 8
అహో నైనం భవాన్ వేత్తి పురాణమృషిసత్తమమ్ ।
శృణు మే వదతో బ్రహ్మన్ యోఽయం యచ్చాస్య కారణమ్ ॥ 9
మహర్షీ! మహాబాహువైన ఈ అర్జునుడు కుంతికి జన్మించిన నాకుమారుడు. ఒకానొక కారణం వల్ల అస్త్రవిద్య కోసం ఇక్కడకు వచ్చాడు. ఆహో! ఎంత ఆశ్చర్యం. పురాతనుడైన ఈ ఋషిసత్తముని నీవెరుగవా! బ్రహ్మర్షీ! ఇతడెవడో, ఇలా జన్మించడానికి గల కారణమేమిటో నేను చెపుతున్నాను విను. (8,9)
నరనారాయణౌ యౌ తౌ పురాణావ్ఱ్రుషిసత్తమౌ ।
తావిమావనుజానీహి హృషీకేశధనంజయౌ ॥ 10
పురాణపురుషులు, ఋషిసత్తములూ అయిన నరనారాయణులే ఈ శ్రీకృష్ణార్జునులుగా అవతరించారని గ్రహించు. (10)
విఖ్యాతౌ త్రిషు లోకేషు నరనారాయణావృషీ ।
కార్యార్థమవతీర్ణౌ తౌ పృథీం పుణ్యప్రతిశ్రయామ్ ॥ 11
ముల్లోకాలలోనూ, ప్రసిద్ధులైన నరనారాయణ మహర్షులు ఒకానొక కార్యాసిద్ధికై పుణ్యానికి ఆధారమైన భూతలం మీద మానవులుగా అవతరించారు. (11)
యన్న శక్యం సురైర్ద్రష్టుమ్ ఋషిభిర్వా మహాత్మభిః ।
తదాశ్రమపదం పుణ్యం బదరీనామ విశ్రుతమ్ ॥ 12
స నివాసోఽభవద్ విప్ర విష్ణోర్జిష్ణోస్తథైవ చ ।
యతః ప్రవవృతే గంగా సిద్ధచారణసేవితా ॥ 13
దేవతలచే కాని, మహాత్ములైన ఋషులచే కాని చూడటానికి శక్యం కానిదై బదరి అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన పవిత్రమైన ఆశ్రమం ఉండేది. బ్రహ్మర్షీ! సిద్ధులు, చారణులు సేవించే గంగ అక్కడ నుండే పుట్టింది. అది శ్రీమహావిష్ణువయిన కృష్ణునకు, జయశీలుడయిన అర్జునునకు నివాసస్థానం. (నారాయణునకు, నరునకు నివాసస్థానం) (12,13)
తౌ మన్నియోగాద్ బ్రహ్మర్షే క్షితౌ జాతౌ మహాద్యుతీ ।
భూమేర్భారావతరణం మహావీర్యౌ కరిష్యతః ॥ 14
బ్రహ్మర్షీ! మహాతేజస్వులైన నరనారాయణులు నాప్రార్థనపై భులోకంలో జన్మించారు. మహాశక్తిశాలులైన వారు భుమిభారాన్ని తగ్గిస్తారు. (14)
ఉద్వృత్తా హ్యసురాః కేచిత్ నివాతకవచా ఇతి ।
విప్రియేషు స్థితాస్మాకం వరదానేన మోహితాః ॥ 15
ఆ రోజుల్లో నివాతకవచులనే ఉద్ధతులైన రాక్షసులు కొందరు వరదానగర్వితులై మాకు అనిష్టాలను చేస్తూ ఉండేవారు. (15)
తర్కయంతే సురాన్ హంతుం బలదర్పసమన్వితాః ।
దేవాన్ న గణయంత్యేతే తథా దత్తవరా హి తే ॥ 16
బలగర్వంతో సురలను చంపాలని ఆలోచించే వారు. వారు దేవతలను లెక్కచేయనంతగా వరాలను పొందారు. (16)
పాతాలవాసినో రౌద్రాః దనోః పుత్రా మహాబలాః ।
సర్వదేవనికాయా హి నాలం యోధయితుం హి తాన్ ॥ 17
యోఽసౌ భూమిగతః శ్రీమాన్ విష్ణుర్మధునిఘాదనః ।
కపిలో నామ దేవోఽసౌ భగవానజితో హరిః ॥ 18
వారు పాతాలనివాసి అయిన దనువు యొక్క పుత్రులు. వారు భయంకరులు, మహాబలవంతులు, దేవతలసమూహాలన్నీ కలిసి కూడ దానవులతో యుద్ధం చేయడానికి సమర్థులుకారు. మధునిఘాదనుడైన శ్రీమహావిష్ణువు కపిలుడనే పేర భుమిపై అవతరించాడు. అతడు ఎవ్వరికీ జయింప శక్యం గాని భగవంతుడు శ్రీహరి. (17,18)
యేన పూర్వం మహాత్మానః ఖనమానా రసాతలమ్ ।
దర్శనాదేవ నిహతాః సగరస్యాత్మజా విభో ॥ 19
మహర్షీ! పూర్వకాలంలో రసాతలాన్ని త్రవ్వుతూ సగరపుత్రులు ఈ కపిలుని దృష్టిమాత్రంచేత భస్మమయ్యారు. (19)
తేన కార్యం మహత్ కార్యమ్ అస్మాకం ద్విజసత్తమ ।
పార్థేన చ మహాయుద్ధే సమేతాభ్యాం న సంశయః ॥ 20
ద్విజశ్రేష్ఠా! ఆ శ్రీహరి మాకోసం మహాకార్యాన్ని చేయగలడు. ఈ శ్రీ కృష్ణార్జునులిద్దరూ కలిసి మహాసంగ్రామంలో ఆ కార్యాన్ని సాధిస్తారు. ఇందులో సందేహం లేదు. (20)
సోఽసురాన్ దర్శనాదేవ శక్తో హంతుం సహానుగాన్ ।
నివాతకవచాన్ సర్వాన్ నాగానివ మహాహ్రదే ॥ 20
భగవంతుడైన శ్రీకృష్ణుడు దర్శనమాత్రం చేతనే నివాతకవచులనూ, వారి అనుచరులను కూడా మహాహ్రదంలోని నాగులను వలె చంపగలడు. (21)
కిం తు నాల్పేన కార్యేణ ప్రబోధ్యో మధుసూదనః ।
తేజసః సుమహారాశిః ప్రబుద్ధః ప్రదహేజ్జగత్ ॥ 22
కాని చిన్నపనికోసం మధుసూదనుని కోరడం ఉచితం కాదు. అతడు తేజస్సులమహారాశి. అతడు లేస్తే సమస్త జగత్తునూ దహిస్తాడు. (22)
అయం తేషాం సమస్తానాం శక్తః ప్రతిసమాసనే ।
తాన్ నిహత్య రణే శూరః పునర్యాస్యతి మానుషాన్ ॥ 23
శూరుడైన అర్జునుడు ఒక్కడూ ఆ సమస్తదానవులను సంహరింపగలడు. యుద్ధంలో ఆ నివాతకవచదానవులందరిని చంపి, తిరిగి మానవలోకానికి వెళ్తాడు. (23)
భవానస్మన్నియోగేన యాతు తావన్మహీతలమ్ ।
కామ్యకే ద్రస్క్ష్యసే వీరం నివసంతం యుధిష్ఠిరమ్ ॥ 24
మహామునీ! నీవు మా ప్రార్థనపై భూలోకానికి వెళ్ళు. అక్కడ కామ్యకవనంలో నివసిస్తున్న వీరుడైన యుధిష్ఠిరుని చూస్తావు. (24)
స వాచ్యో మమ సందేశాద్ ధర్మాత్మా సత్యసంగరః ।
నోత్కంఠా ఫాల్గునే కార్యా కృతాస్త్రః శీఘ్రమేష్యతి ॥ 25
ధర్మాత్ముడు, సత్యసంగరుడూ అయిన యుధిష్ఠిరునికి మా సందేశాన్ని చెప్పు. "అర్జునుని విషయంలో ఉత్కంఠ అవసరం లేదు. అస్త్రవిద్యను సాధించి శీఘ్రంగా వస్తాడు". (25)
నాశుద్ధబాహువీర్యేణ నాకృతాస్త్రేణ వా రణే ।
భీష్మద్రోణాదయో యుద్ధే శక్యాః ప్రతిసమాసితుమ్ ॥ 26
సంపూర్ణ బాహుబలం లేనివాడు కాని, అస్త్రవిద్య సంపూర్ణంగా లేనివాడు కాని యుద్ధంలో భీష్మద్రోణాదులను జయింపలేడు. (26)
గృహీతాస్త్రో గుడాకేశః మహాబాహుర్మహామనాః ।
నృత్యవాదిత్రగీతానాం దివ్యానాం పారమీయివాన్ ॥ 27
మహాబాహువు, మహామనస్కుడూ అయిన అర్జునుడు అస్త్రవిద్యను స్వీకరించి, నృత్య వాద్య గీత కళలలో కూడా పారంగతుడయ్యాడు. (27)
భవానపి వివిక్తాని తీర్థాని మనుజేశ్వర ।
భ్రాతృభిః సహితః సర్వైః ద్రష్టుమర్హత్యరిందమ ॥ 28
తీర్థేష్వాప్లుత్య పుణ్యేషు విపాప్మా విగతజ్వరః ।
రాజ్యం భోక్ష్యసి రాజేంద్ర సుఖీ విగతకల్మషః ॥ 29
మనుజేశ్వరా! శత్రుదమనా! నీవు కూడా నీసోదరులతో అన్ని తీర్థాలను సేవించు. పవిత్ర తీర్థాలలో స్నానం చేసి, పాపరహితుడవై, సంతాపరహితుడవై, కల్మషం లేనివాడవై సుఖంగా రాజ్యాన్ని అనుభవిస్తావు. (28,29)
భవాంశ్చైనం ద్విజశ్రేష్ఠ పర్యటంతం మహీతలమ్ ।
త్రాతుమర్హతి విప్రాగ్ర్య తపోబలసమన్వితః ॥ 30
ద్విజశ్రేష్ఠా! తపోబలసంపన్నుడవైన నీవు కూడా భూమండలాన్నంతా తిరుగుతున్న యుధిష్ఠిరుని రక్షిస్తూ ఉండు. (30)
గిరిదుర్గేషు చ సదా దేశేషు విషమేషు చ ।
వసంతి రాక్షసా రౌద్రాః తేభ్యో రక్షాం విధాస్యతి ॥ 31
దుర్గమపర్వతప్రాంతాలలొ,ఎగుడుదిగుడు ప్రదేశాలలోనూ, భయంకరులైన రాక్షసులు నివసిస్తూంటారు. వారి నుండి యుధిష్ఠిరుని రక్షించు." (31)
ఏవముక్తో మహేంద్రేణ బీభత్సురపి లోమశమ్ ।
ఉవాచ ప్రయతో వాక్యం రక్షేథాః పాండునందనమ్ ॥ 32
మహేంద్రుడు ఈవిధంగా చెప్పాక, అర్జునుడు కూడా ప్రయత్నపూర్వకంగా వినయంతో లోమశునికి 'పాండునందనుడైన యుధిష్ఠిరుని రక్షించండి' అని చెప్పాడు. (32)
యథా గుప్తస్త్వయా రాజా చరేత్ తీర్థాని సత్తమ ।
దానం దద్యాద్ యథా చైవ తథా కురు మహామునే ॥ 33
సత్పురుషశ్రేష్ఠా! మహామునీ! నీచే రక్షింపబడుతూ యుధిష్ఠిరుడు తీర్థాలను సేవిస్తాడు. అపుడు అతడు దానాలు చేసేటట్లుగా నీవు ఏర్పాటు చెయ్యి. (33)
వైశంపాయన ఉవాచ
తథేతి సంప్రతిజ్ఞాయ లోమశః సుమహాతపాః ।
కామ్యకం వనముద్దిశ్య సముపాయాన్మహీతలమ్ ॥ 34
వైశంపాయనుడిలా అన్నాడు. 'అట్లే' అని మాటిచ్చి మహాతపస్వి అయిన లోమశుడు కామ్యకవనానికి చేరడం కోసం భూతలానికి ప్రయాణమయ్యాడు. (34)
దదర్శ తత్ర కౌంతేయం ధర్మరాజమరిందమమ్ ।
తాపసైర్ర్భాతృభిశ్చైవ సర్వతః పరివారితమ్ ॥ 35
అతడు కామ్యకవనం చేరుకొని, అక్కడ తాపసులతో, సోదరులతో పరివేష్టించి ఉన్న ధర్మరాజును చూశాడు. (35)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి లోమశగమనే సప్తచత్వారింశోఽధ్యాయః ॥ 47 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున ఇంద్రలోకాభిగమన పర్వమను ఉపపర్వమున లోమశగమనమను నలువది ఏడవ అధ్యాయము. (47)