62. అరువది రెండవ అధ్యాయము

నిద్రించుచున్న దమయంతిని విడిచి నలుడు వెళ్లిపోవుట.

నల ఉవాచ
యథా రాజ్యం తవ పితుః తథా మమ న సంశయః ।
న తు తత్ర గమిష్యామి విషమస్థః కథంచన ॥ 1
నలుడిలా అన్నాడు.
దమయంతీ! మీతండ్రిగారి రాజ్యం నీకెంతో నాకు కూడ అంతే! సందేహం లేదు. కాని ఈ విషమస్థితిలో వెళ్ళలేను. (1)
కథం సమృద్ధో గత్వాహం తవ హర్షవివర్ధనః ।
పరిచ్యుతో గమిష్యామి తవ శోకవివర్ధనః ॥ 2
సమృద్ధస్థితిలో వెళితే నీ సంతోషాన్ని అతిశయింప జేసేవాణ్ణి! రాజ్యభ్రష్టుడనై ఉన్న ఈ స్థితిలో వెళ్తే, నీ దుఃఖాన్ని అతిశయింప జేసినవాడనవుతాను. (2)
బృహదస్వ ఉవాచ
ఇతి బ్రువన్ నలో రాజా దమయంతీం పునః పునః ।
సాంత్వయామాస కల్యాణీమ్ వాససోఽర్దేన సంవృతామ్ ॥ 3
బృహదశ్వుడిలా అన్నాడు -
పైవిధంగా పల్కుతూ నలుడు సగం చీరతోనున్న దమయంతిని పలుమార్లు ఊరడించాడు.
తావేకవస్త్రసంవీతౌ అటమానావితస్తతః ।
క్షుత్పిపాసాపరిశ్రాంతౌ సభాం కాంచిదుపేయతుః ॥ 4
ఒకే వస్త్రం చుట్టబెట్టుకొని ఆకలిదప్పులతో అలసిన వారు ఒకసభలోకి వెళ్లారు. (సభ = విశ్రాంతి మందిరం) (4)
తాం సభాముపసంప్రాప్య తదా స నిషధాధిపః ।
వైదర్భ్యా సహితో రాజా నిషసాద మహీతలే ॥ 5
సభలోనికి వెళ్ళి నిషధాధీశుడు దమయంతితోపాటు నేలపై కూర్చున్నాడు. (5)
స వై వివస్త్రో వికటః మలినః పాంసుగుంఠితః ।
దమయంత్యా సహ శ్రాంతః సుష్వాప ధరణీతలే ॥ 6
వివస్త్రుడై, ధూళితో కప్పబడిన నలుడు అలసిపోయి నేలపైనే దమయంతితో పాటు నిద్రించాడు. (6)
దమయంత్యపి కల్యాణీ నిద్రయాపహృతా తతః ।
సహసా దుఃఖమాసాద్య సుకుమారీ తపస్వినీ ॥ 7
నలుని మాటలు విన్న సుకుమారి దమయంతి దుఃఖిస్తూనే నిద్రలోకి జారింది. (7)
సుప్తాయాం దమయంత్యాం తు నలో రాకా విశాంపతే ।
శోకోన్మథితచిత్తాత్మా న స్మ శేతే తథా పురా ॥ 8
ధర్మజా! దమయంతి నిద్రిస్తోంది. కాని శోకసంతప్తహృదయుడైన నలునికి మాత్రం పూర్వం వలె నిద్ర పట్టలేదు. (8)
స తద్ రాజ్యాపహరణం సుహృత్త్యాగం చ సర్వశః ।
వనే చ తం పరిధ్వంసం ప్రేక్ష్య చింతాముపేయివాన్ ॥ 9
రాజ్యం అపహరింపబడటం, మిత్రులను విడవటం, వనంలో జరిగిన అవమానం - అన్నీ గుర్తుకువచ్చి అతడు చింతాక్రాంతుడవుతున్నాడు. (9)
కిం ను మే స్యాదిదం కృత్వా కిం ను మే స్యాదకుర్వతః ।
కిం ను మే మరణం శ్రేయః పరిత్యాగో జనస్య వా ॥ 10
ఇది చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? అనేది తెలియటం లేదు. స్వజనాన్ని విడిచిపెట్టడమా? లేక మరణించటమా? ఏది శ్రేయస్సో తెలియటం లేదు. (10)
మామియం హ్యనురక్తైవం దుఃఖమాప్నోతి మత్కృతే ।
మద్విహీనా త్వియం గచ్ఛేత్ కదాచిత్ స్వజనం ప్రతి ॥ 11
నాయందు అనురక్తయైన దమయంతి నామూలంగా దుఃఖాన్ని పొందుతోంది. నేను లేకుంటే, ఈమె ఎప్పుడైనా తనవారిని చేరుతుంది. (11)
మయి నిఃసంశయం దుఃఖమ్ ఇయం ప్రాప్స్యత్యనువ్రతా ।
ఉత్సర్గే సంశయః స్యాత్ తు విందేతాపి సుఖం క్వచిత్ ॥ 12
నాతోనే ఉంటే దమయంతి దుఃఖాన్ని పొందుతుందనటంలో సంశయంలేదు. విడిచివెళితే ఏ కొంచెం సుఖాన్నైనా పొందవచ్చుననే సంశయం కలుగుతోంది. (12)
స నినిశ్చిత్య బహుధా విచార్య చ పునః పునః ।
ఉత్సర్గం మన్యతే శ్రేయః దమయంత్యా నరాధిప ॥ 13
ఇలా నిశ్చయించి కూడా మరల మరల ఆలోచించి నలుడు, దమయంతిని విడిచివెళ్ళడమే మంచిదని భావించాడు. (13)
న చైషా తేజసా శక్యా కైశ్చిద్ ధర్షయితుం పథి ।
యశస్వినీ మహాభాగా మద్భక్తేయం పతివ్రతా ॥ 14
యశస్విని, సాధ్వి అయిన దమయంతి - సహజతేజస్విని అవటం చేత ఈమె ఎవ్వరిచేతనూ అవమానింపబడదని తలచాడు. (14)
ఏవం తస్య తదా బుద్ధిః దమయంత్యాం న్యవర్తత ।
కలినా దుష్టభావేన దమయంత్యా విసర్జనే ॥ 15
ఇలా దమయంతిని విడిచివెళ్ళాలనే తలచాడు. కలిచే ప్రేరితుడైన నలునకు దమయంతిని విడిచే విషయంలో పైవిధమైన దుష్టభావమే కలిగింది. (15)
సోఽవస్త్రతామాత్మనశ్చ తస్యాశ్చాప్యేకవస్త్రతామ్ ।
చింతయిత్వాధ్యగాద్ రాజా వస్త్రార్ధస్యావకర్తనమ్ ॥ 16
వస్త్రహీనుడైన నలుడు దమయంతి ఏకవస్త్రయైనప్పటికి, ఆమెచీరలో సగం కట్టుకోవటానికి సన్నద్ధుడయ్యాడు. (16)
కథం వాసో వికర్తేయం న చ బుధ్యేత మే ప్రియా ।
విచింత్యైవం నలో రాజా సభాం పర్యచరత్తదా ॥ 17
తన భార్య దమయంతి చీరనెలా కత్తిరించాలో తెలియక తికమకపడుతూ అటూఇటూ కొంతసేపు ఆ సభలో తిరిగాడు నలుడు. (17)
పరిధావన్నథ నలః ఇతశ్చేతశ్చ భారత ।
ఆససాద సభోద్దేశే వికోశం ఖడ్గముత్తమమ్ ॥ 18
ఈ ప్రకారంగా అటూఇటూ తిరిగే నలునకు ఆ సభాప్రాంగణంలో ఒరలేని కత్తి ఒకటి లభించింది. (18)
తేనార్ధం వాససశ్ఛిత్త్వా నివస్య చ పరంతపః ।
సుప్తాముత్సృజ్య వైదర్భీం ప్రాద్రవద్ గతచేతనామ్ ॥ 19
నలుడు ఆ కత్తిలో దమయంతి చీరను చింపి, ఆ చీరముక్కను కట్టుకొని, నిద్రించే దమయంతిని విడిచిపెట్టి వెళ్ళాడు. (19)
తతో నివృత్తహృదయః పునరాగమ్య తాం సభామ్ ।
దమయంతీం తదా దృష్ట్వా రురోద నిషధాధిపః ॥ 20
దమయంతి నుండి మనస్సు మరల్చుకొని, తిరిగి ఆ సభకు వచ్చి ఆమెను చూస్తూనే నలుడు ఏడ్చాడు. (20)
యాం న వాయుర్న చాదిత్యః పురా పశ్యతి మే ప్రియామ్ ।
సేయమద్య సభామధ్యే శేతే భూమావనాథవత్ ॥ 21
ఇతఃపూర్వం నాప్రియసతిని సుర్యుడుగాని, వాయువుగాని చూడలేదు. అసూర్యంపస్య వంటి దమయంతి నేడు కటికనేలపై అనాథవలె నిద్రిస్తోంది. (21)
ఇయం వస్త్రావకర్తేన సంవీతా చారుహాసినీ ।
ఉన్మత్తేవ వరారోహా కథం బుద్ధ్వా భవిష్యతి ॥ 22
చారుహాసినియైన దమయంతి లేచి చింపిన చీరను చూసుకొని పిచ్చిదానివలె అవుతుందేమో? విషయం తెలిసికొని ఏమి కాగలదో? (22)
కథమేకా సతీ భైమీ మయావిరహితా శుభా ।
చరిష్యతి వనే ఘోరే మృగవ్యాలనిషేవితే ॥ 23
నేను లేకుండా దమయంతి ఒంటరియై క్రూరమృగాల నిలయమైన ఈ ఘోరారణ్యంలో ఎలా సంచరింపగలదు? (23)
ఆదిత్యా వసవో రుద్రాః అశ్వినౌ సమరుద్గణౌ ।
రక్షంతు త్వాం మహాభాగే ధర్మేణాసి సమావృతా ॥ 24
దమయంతీ! నీవు ధర్మపరాయణవు! అందుకే ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీదేవతలు, మరుద్గణాలు నిన్ను రక్షిస్తారు. (24)
ఏవముక్త్వా ప్రియాం భార్యాం రూపేణాప్రతిమాం భువి ।
కలినాపహృతజ్ఞానః నలః ప్రాతిష్ఠదుద్యతః ॥ 25
తన ప్రియురాలిని గురించి, ఆమె రూపాన్ని గురించి తలచి, కలిప్రభావంతో అజ్ఞానియై ముందుకు నడచాడు. (25)
గత్వా గత్వా నలో రాజా పునరేతి సభాం ముహుః ।
ఆకృష్యమాణః కలినా సౌహృదేనావకృష్యతే ॥ 26
కొంతదూరం వెళ్ళాక నలుడు తిరిగి వచ్చేవాడు. ఒకవైపు కలి ముందుకు లాగుతున్నాడు. మరోవైపు ఆమెమీది ప్రేమ వెనుకకు లాగుతోంది. (26)
ద్విధేవ హృదయం తస్య దుఃఖితస్యాభవత్ తదా ।
దోలేవ ముహురాయాతి యాతి చైవ సభాం ప్రతి ॥ 27
దుఃఖిస్తూన్న నలునిహృదయం ఊయలలా అటుఇటు సభలోంచి అడవిలోకి, అడవిలోంచి సభకూ ఊగిసలాడింది. (27)
అవకృష్టస్తు కలినా మోహితః ప్రాద్రవన్నలః ।
సుప్తాముత్సృజ్య తాం భార్యాం విలప్య కరుణం బహు ॥ 28
కలిప్రభావంచే మోహితుడైన నలుడు బహువిధాల రోదించి నిద్రించే దమయంతిని వదలి వెళ్ళాడు. (28)
నష్టాత్మా కలినా స్పృష్టః తత తద్ విగణయన్ నృపః ।
జగామైకాం వనే శూన్యే భార్యాముత్సృజ్య దుఃఖితః ॥ 29
కలిస్పర్శతో జ్ఞానం కోల్పోయాడు. జరుగబోయేదానిని లెక్కచెయలేదు. దమయంతిని ఒక్కతినే శూన్యవనంలో వదలి నలుడు విచారిస్తూనే వెళ్ళాడు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి దమయంతీపరిత్యాగే ద్విషష్టితమోఽధ్యాయః ॥ 62 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున దమయంతీపరిత్యాగమను అరువది రెండవ అధ్యాయము. (62)