64. అరువది నాలుగవ అధ్యాయము

దమయంతి సార్థవాహులతో కలిసి వెళ్లుట.

బృహదశ్వ ఉవాచ
సా నిహత్య మృగవ్యాధం ప్రతస్థే కమలేక్షణా ।
వనం ప్రతిభయం శూన్యం ఝల్లికాగణనాదితమ్ ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు - వనచరుని మరణానంతరం దమయంతి భయంతో జనశూన్యమై ఈల పురుగుల రొదతో ఉన్న ఆ అరణ్యం నుండి బయలుదేరించి. (1)
సింహద్వీపిరురువ్యాఘ్రమహిషర్క్షగణైర్యుతమ్ ।
నానాపక్షిగణాకీర్ణం మ్లేచ్ఛతస్కరసేవితమ్ ॥ 2
ఆ అరణ్యం సింహాలు, ఏనుగులు, దుప్పులు, పెద్దపులులు, అడవిదున్నలు, ఆబోతులు మొదలగు వాటితోను, రకరకాల పక్షిసమూహాలతోనూ కూడి మ్లేచ్ఛులకు, దొంగలకు నిలయమై ఉంది. (2)
శాల వేణు ధవాశ్వత్థ తిందుకేంగుద కింశుకైః ।
అర్జునారిష్టసంఛన్నం స్యందనైశ్చ సశాల్మలైః ॥ 3
జమ్బ్వామ్రలోధ్రఖదిరసాలవేత్రసమాకులమ్ ।
పద్మకామలకప్లక్షకదంబోదుంబరావృతమ్ ॥ 4
బదరీబిల్వసంఛన్నం న్యగ్రోధైశ్చ సమాకులమ్ ।
ప్రియాలతాలఖర్జూరహరీతకబిభీతకైః ॥ 5
మద్దిచెట్లు,వెదురుపొదలు, చండ్ర, రావి, తుముకి, ఇంగువ, మోదుగ, ఏరుమద్ధి, వేప. తినిశ, బూరుగ, నేరేడు, మామిడి, లొద్దుగ, మునుగుదామర, మద్ది, ప్రబ్బలి, పద్మక, ఉసిరిక, జువ్వి, కడిమి, అత్తి, రేగు, మారేడు, మర్రి, అడవిమామిడి, తాడి, ఖర్జూర, కరక్కాయ, తాండ్రచెట్లతో కూడిన ఆ అరణ్యం దట్టంగా ఉంది. (3-5)
నానాధాతుశతైర్నద్ధాన్ వివిధానపి చాచలాన్ ।
నికుంజాన్ పరిసంఘష్టాన్ దరీశ్చాద్భుతదర్శనాః ॥ 6
గైరికాది బహు ధాతువులతో కూడిన పర్వతాలు, పొదరిండ్లతో కప్పబడిన కొండచరియలు కనువిందు చేస్తున్నాయి. (6)
నదీః సరాంసి వాపీశ్చ వివిధాంశ్చ మృగద్విజాన్ ।
సా బహూన్ భీమరూపాంశ్చ పిశాచోరగరాక్షసాన్ ॥ 7
పల్వలాని తడాగాని గిరికూటాని సర్వశః ।
సరితో నిర్ఘరాశ్చైవ దదర్శాద్భుతదర్శనాన్ ॥ 8
నదులు, సరస్సులు, దిగుడుబావులు, వివిధ మృగాలు, పక్షులు, అతిభయంకరాకృతి కల పిశాచాలు, పెద్దపెద్ద పాములు, రాక్షసులు, దొరువులు, చెరువులు, వలయాకారంగా ఉన్న పర్వతాలు, నదులు, సెలయేళ్ళు మొదలైన అద్భుత దృశ్యాలను దమయంతి కనులార చూసింది. (8)
యూథశో దదృశే చాత్ర విదర్భాదిపనందినీ ।
మహిషాంశ్చ వరాహాంశ్చ ఋక్షాంశ్చ వనపన్నగాన్ ॥ 9
తేజసా యశసా లక్ష్మ్యా స్థిత్యా చ పరయా యుతా ।
వైదర్భీ విచరత్యేకా నలమన్వేషతీ తదా ॥ 10
తేజోవంతురాలు, యశస్విని, సహజశోభతో ప్రకాశించే దమయంతి గుంపులుగా సంచరించే అడవిదున్నలను, అడవిపందులను, ఎలుగుబంట్లు, అడవిపాములు, మొదలైన వాటిని చూచింది. అరణ్యంలో నలుని వెదకుతూ ఒక్కతియే తిరుగుతోంది. (9,10)
నాబిభ్యత్ సా నృపసుతా భైమీ తత్రాథ కస్యచిత్ ।
దారుణామటవీం ప్రాప్య భర్తృవ్యసనపీడితా ॥ 11
భర్తృవియోగదుఃఖంతో ఉన్న దమయంతి ఆ భయంకరారణ్యంలో దేనికీ భయపడటంలేదు. (11)
విదర్భతనయా రాజన్ విలలాప సుదుఃఖితా ।
భర్తృశోకపరీతాంగీ శిలాతలమథాశ్రితా ॥ 12
నలునికోసం విదర్భరాజతనయ ఎంతగానో దుఃఖించింది. భర్తృశోకంతో దమయంతి ఒకరాతిపై కూర్చొని విలపించింది. (12)
దమయంత్యువాచ
వ్యూఢోరస్కో మహాబాహో నైషధానాం జనాధిప ।
క్వ ను రాజన్ గతోఽస్యద్య విసృజ్య విజనే వనే ॥ 13
అశ్వమేధాదిభిర్వీర క్రతుభిర్భూరిదక్షిణైః ।
కథమిష్ట్వా నరవ్యాఘ్ర మయి మిథ్యా ప్రవర్తసే ॥ 14
బలిష్ఠమైన వక్షస్థలయా, ఆజానుబాహువులూ కల నిషధరాజా! ఈ నిర్జనారణ్యంలో నన్నొక్కతినే వదలి ఎక్కడకు వెళ్ళావు? అధికమైన దక్షిణలతో ఎన్నో అశ్వమేధాది యజ్ఞాలను చేసిన నరశ్రేష్ఠుడా! నీవెందుకు నాపట్ల అసత్యమార్గాన్ని త్రొక్కావు? (13,14)
యత్ త్వయోక్తం నరశ్రేష్ఠ తత్ సమక్షం మహాద్యుతే ।
స్మర్తుమర్హసి కల్యాణ వచనం పార్థివర్షభ ॥ 15
మహారాజా! లోకపాలుర ఎదుట పల్కిన మాటలను ఒక్కసారి స్మరింపవయ్యా! (15)
యచ్చోక్తం విహగైర్హంసైః సమీపే తవ భూమిప ।
మత్సమక్షం యదుక్తం చ తదవేక్షితుమర్హసి ॥ 16
హంసలు నీకు చెప్పినమాటలు, నా చెంతకు వచ్చినపుడు నీవు నాకు చెప్పినమాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. (16)
చత్వార ఏకతో వేదాః సాంగోపాంగాః సవిస్తరాః ।
స్వధీతా మనుజవ్యాఘ్ర సత్యమేకం కిలైకతః ॥ 17
ఒక ప్రక్క సాంగోపాంగంగా నాలుగువేదాలూ చదివావు. పురుషశ్రేష్ఠుడా! ఒక్కసత్యం మాత్రం ఏకాకి యైంది కదా! సత్యాన్ని మాత్రం మరోప్రక్కకు పెట్టావు. (17)
తస్మాదర్హసి శత్రుఘ్న సత్యం కర్తుం నరేశ్వర ।
ఉక్తవానసి యద్ వీర మత్సకాశే పురా వచః ॥ 18
శత్రుసంహారకా! నీవు సత్యం ఆచరింపదగినవాడవు. పూర్వం నాచెంత చెప్పిన మాటలను చెయ్యి. (18)
హా వీర నల నామాహం నష్టా కిల తవానఘ ।
అస్యామటవ్యాం ఘోరాయాం కిం మాం న ప్రతిభాషసే ॥ 19
వీరా! నీదృష్టిలో 'దమయంతి' అనే పేరు తొలగిపోయిందా? ఈ భయంకరారణ్యంలో నాకు బదులు పల్కవేమిటి? (19)
కర్షయత్యేష మాం రౌద్రః వ్యాత్తాస్యో దారుణాకృతిః ।
అరణ్యరాట్ క్షుధావిష్టః కిం మాం న త్రాతుమర్హసి ॥ 20
భయంకరాకృతి కల అజగరం ఆకలితో నన్ను పట్టి మ్రింగబోయే సమయంలోనైనా నన్నెందుకు రక్షింపవు? (20)
న మే త్వదన్యా కాచిద్ధ్ ప్రియాస్తీత్యబ్రవీః సదా ।
తామృతాం కురు కల్యాణ పురోక్తాం భారతీం నృప ॥ 21
నీవు తప్ప మరొక ప్రియురాలు లేదని నాతో నీవు చెప్పావే! పూర్వం నాతో చెప్పిన ఆ మాటను నిజం చెయ్యి! (21)
ఉన్మత్తాం విలపంతం మాం భార్యామిష్టాం నరాధిప ।
ఈప్సితామీప్సితోఽసి త్వం కిం మాం న ప్రతిభాషసే ॥ 22
నీవే నా సర్వస్వమని పల్కిన నీవు ఈనాడు పిచ్చెక్కి ఏడుస్తున్న నీ ప్రియభార్యతో ఎందుకు మాట్లాడవు? (22)
కృశాం దీనాం వివర్ణాం చ మలినాం వసుధాధిప ।
వస్త్రార్థప్రావృతామేకాం విలపంతీమనాథవత్ ॥ 23
యూథభ్రష్టామివైకాం మాం హరిణీం పృథులోచన ।
న మానయసి మామార్య రుదంతీమరికర్శన ॥ 24
కృశించిన దాన్ని, దీనురాలను. కళతగ్గిన దానిని. సగం చీరనే ధరించి అనాథవలె ఏడుస్తున్న దానిని. గుంపునుండి విడిపోయి ఏకాకిని యైన లేడిని పోలిన నన్నెందుకు ఆదరింపవయ్యా! ఆర్యపుత్రా!! (23,24)
మహారాజ మహారణ్యే అహమేకాకినీ సతీ ।
దమయంత్యభిభాషే త్వాం కిం మాం న ప్రతిభాషసే ॥ 25
మహారాజా! ఈ మహారణ్యంలో నీభార్యనైన నేను దమయంతిని. ఒంటరిదానవై నీతోనే మాట్లాడుతున్నాను. కాని నీవు మాత్రమ్ మాట్లాడటం లేదు. (25)
కులశీలోపసంపన్న చారుసర్వాంగశోభన ।
నాద్య త్వాం ప్రతిపశ్యామి గిరావస్మిన్ నరోత్తమ ॥ 26
నరోత్తమా! ఉత్తమకులశీలాలు కలవాడవు. అందమైన సర్వావయవశోభ కల నిన్నిప్పుడు ఈ కొండపై ఎక్కడని చూడగలను. (26)
వనే చాస్మిన్ మహాఘోరే సింహవ్యాఘ్రనిషేవితే ।
శయానముపవిష్టం వా స్థితం వా నిషధాధిప ॥ 27
సింహవ్యాఘ్రాలకు నిలయమైన ఈ ఘోరారణ్యంలో ఎక్కడ పరున్నావో! ఎక్కడ కూర్చున్నావో! ఎక్కడున్నావో! ఎవర్ని అడగను? (27)
ప్రస్థితం వా నరశ్రేష్ఠ మమ శోకవివ్వర్ధన ।
కం ను పృచ్ఛామి దుఃఖార్త త్వదర్థే శోకకర్శితా ॥ 28
నీకోసమే బాధపడుతున్నాను. శోకంతో కృశించిపోతున్నాను నన్నీవిధంగా శోకంలో ముంచి నీవెక్కడకి వెళ్ళావని ఎవర్ని అడుగుతాను? (28)
కచ్చిద్ దృష్టస్త్వయారణ్యే సంగత్యేహ నలో నృపః ।
కో ను మే వాథ ప్రష్టవ్యః వనేఽస్మిన్ ప్రస్థితం నలమ్ ॥ 29
అరణ్యం నుండి బయలుదేరిన నీగురించి "నలుడను మహారాజును మీరు చూశారా? వారిని కలిశారా?" - అని అడుగ తగిన వారెవరో తెలియటం లేదు. (29)
అభిరూపం మహాత్మానం పరవ్యూహవినాశనమ్ ।
యమన్వేషసి రాజానం నలం పద్మనిభేక్షణమ్ ॥ 30
అయం స ఇతి కస్యాద్య శ్రోష్యామి మధురాం గిరమ్ ।
రూపవంతుడు, మహాత్ముడు, శత్రువ్యూహాన్ని ఛేదింపగలవాడు, పద్మాలవంటి కన్నులు గలవాడు అయిన ఏ నలమహారాజును గురించి నీవు వెతుకుతున్నావో - ఆ నలుడితడేనమ్మా! - అనే మధురవాక్కును ఇపుడెవరివలన వినగలనో? (30 1/2)
అరణ్యరాడయం శ్రీమాన్ చతుర్దంష్ట్రో మహాహనుః ॥ 31
శార్దూలోఽభిముఖోఽభ్యేతి వ్రజామ్యేనమశంకితా ।
భవాన్ మృగాణామధిపః త్వమస్మిన్ కాననే ఫ్రభుః ॥ 32
నాలుగు కోరలు, పెద్దదవడలు కల్గి ఈ అరణ్యరాజ్యానికే రాజయిన పెద్దపులి నా ఎదురుగా వచ్చినా ఏమాత్రం సందేహింపకుండా నేను దాని చెంతకే వెళ్తాను. "నీవు మృగరాజువు. ఈ అరణ్యానికి నీవు రాజువు. నీవే శరణ్యుడవు. (31,32)
విదర్భరాజతనయాం దమయంతీతి విద్ధి మామ్ ।
నిషధాధిపతేర్భార్యాం నలస్యామిమిత్రఘాతినః ॥ 33
నేను విదర్బరాజకుమార్తెను. నన్ను దమయంతినిగా తెలిసికో! శత్రుంజయుడైన నలునకు భార్యను. నలుడు నిషధదేశప్రభువు! (33)
పతిమన్వేషతీమేకాం కృపణాం శోకకర్శితామ్ ।
ఆశ్వాసయ మృగేంద్రేహ యది దృష్టస్త్వయా నలః ॥ 34
శోకకర్శితనై, దీనురాలనై, నా భర్తను వెదకుతున్నాను. మృగరాజా! నీవు, నాభర్త నలుని చూస్తే నాకు చెప్పి నన్నూరడించు. (34)
అథవా త్వం వనపతే నలం యది న శంససి ।
మం ఖాదయ మృగశ్రేష్ఠ దుఃఖాదస్మాద్ విమోచయ ॥ 35
నాభర్త సమాచారాన్ని తెల్పి నాకు ఊరట కల్గింపలేకపోతే నన్ను తిను. దాంతో నాబాధ తీరుతుంది. (35)
శ్రుత్వారణ్యే విలపితం న మామాశ్వాసయత్యయమ్ ।
యాత్యేతాం స్వాదుసలిలామ్ ఆపగాం సాగరంగమామ్ ॥ 36
అరణ్యంలో నారోదన విని ఈ సింహం నన్నూరడించటం లేదు. మధురజలాలతో కూడిన నదివైపు వెళ్లిపోతోంది. (36)
ఇమం శిలోచ్చయం పుణ్యం శృంగైర్బహుభిరుచ్చ్రితైః ।
విరాజద్భిరివానేకైః నైకవర్ణైర్మనోరమైః ॥ 37
అత్యున్నతమైన అనేక శిఖరాలతో ఉన్న ఈ పర్వతరాజం, ఎంతో పుణ్యప్రదమైంది. ఈ పర్వత శిఖరాలు మనోజ్ఞమైన వివిధవర్ణాలతో ప్రకాశిస్తున్నాయి. (37)
నానాధాతుసమాకీర్ణం వివిధోపలభూషితమ్ ।
అస్యారణ్యస్య మహతః కేతుభూతమివోత్థితమ్ ॥ 38
గైరికాద్యనేక ధాతువులతో, వివిధవర్ణశిలలతో అలంకరింపబడిన ఈ ఎత్తైన పర్వతం ఈ పెద్ద అరణ్యానికే ఒక ధ్వజంలా ఉంది. (38)
సింహశార్దూలమాతంగవరాహర్ క్షమృగాయుతమ్ ।
పతత్రిభిర్బహువిధైః సమంతాదనునాదితమ్ ॥ 39
సింహాలు, పెద్దపులులు, ఏనుగులు, అడవిపందులు మొదలైన వానితోను రకరకాలైన పక్షులధ్వనులతోను ఈ గిరి మార్ర్మోగుతోంది. (39)
కింశుకాశోకవకుల పున్నాగైరుపశోభితమ్ ।
కర్ణికారధవప్లక్షైః సుపుష్పైరుపశోభితమ్ ॥ 40
మోదుగు, అశోక, పొగడ, పున్నాగ, కొండగోగు, చండ్ర, జువ్వి మొదలైన అనేక పుష్పాలతో ఈ పర్వతం శోభిస్తోంది. (40)
సరిద్భిః సవిహంగాభిః శిఖరైశ్చ సమాకులమ్ ।
గిరిరాజమిమం తావత్ పృచ్ఛామి నృపతిం ప్రతి ॥ 41
నదులతోను, పక్షులతోను పర్వతశిఖరాలు సమాకులాలై ఉన్నాయి. ఈ పర్వతరాజును, నలుని జాడ గురించి అడుగుతానిప్పుడు. (41)
భగవన్నచలశ్రేష్ఠ దివ్యదర్శన విశ్రుత ।
శరణ్య బహుకల్యాణ నమస్తేఽస్తు మహీధర ॥ 42
దేవతామూర్తిలా కనిపిస్తున్న పర్వతరాజా! బహుకళ్యాణ నిలయిడవైన నీవు శరణు వేడతగినవాడవని నమస్కరిస్తున్నాను. (42)
ప్రణమామ్యభిగమ్యాహం రాజపుత్రీం నిబోధ మామ్ ।
రాజ్ఞః స్నుషాం రాజభార్యాం దమయంతీతి విశ్రుతామ్ ॥ 43
నీదగ్గరకు వచ్చి నమస్కరించిన నేను ఒక రాజపుత్రిని - ఒకరాజుకోడలిని - ఒకరోజు భార్యను. దమయంతి అని ప్రసిద్ధికెక్కిన దానను. (43)
రాజా విదర్భాధిపతిః పితా మమ మహారథః ।
భీమో నామ క్షితిపతిః చాతుర్వర్ణ్యస్య రక్షితా ॥ 44
నా తండ్రి భీమరాజు. విదర్భ దేశానికి ప్రభువు. మహారథుడైన భీమరాజు నాలుగు వర్ణాల ధర్మాలను చక్కగా పరిరక్షిస్తున్నాడు. (44)
రాజసూయాశ్వమేధానాం క్రతూనాం దక్షిణావతామ్ ।
ఆహర్తా పార్థివశ్రేష్ఠః పృథుచార్వంచితేక్షణః ॥ 45
భూరిదక్షిణలతో ఎన్నో అశ్వమేధయాగాలను చేశాడు. పెద్దపెద్ద అందమైన కనులు కలవాడు. (45)
బ్రహ్మణ్యః సాధువృత్తశ్చ సత్యవాగనసూయకః ।
శీలవాన్ వీర్యసంపన్నః పృథుశ్రీర్ధర్మవిచ్ఛుచిః ॥ 46
వేదధర్మాలు బాగా తెలిసినవాడు. సత్ప్రవర్తన కలవాడు. సత్యమే పలుకుతాడు. అసూయలేదు - సచ్ఛీలుడు - పరాక్రమం. మహాసంపద కల ధర్మవేత్త - శుచియైనవాడు. (46)
సమ్యగ్ గోప్తా విదర్భాణాం నిర్జితారిగణః ప్రభుః ।
తస్య మాం విద్ధి తనయాం భగవంస్త్వాముపస్థితామ్ ॥ 47
విదర్భరాజ్యాన్ని రక్షిస్తున్నాడు - నిశ్శాత్రవమొనర్చి పరిపాలించే ఆ భీమరాజు కూతురని నన్ను తెలిసికో. అలాంటి నేను నీసమీపంలో ఉన్నాను. (47)
నిషధేషు మహారాజః శ్వశురో మే నరోత్తమః ।
గృహీతనామా విఖ్యాతో వీరసేన ఇతి స్మ హ ॥ 48
మా మామగారు నిషధరాజ్యానికి మహారాజైన వీరసేనుడు. వారు సార్థకనామధేయులు. (48)
తస్య రాజ్ఞః సుతో వీరః శ్రీమాన్ సత్యపరాక్రమః ।
క్రమప్రాప్తం పితుః స్వం యః రాజ్యం సమనుశాస్తి హ ॥ 49
ఆ వీరసేనసుతుడు పరాక్రమసంపన్నుడై క్రమప్రాప్తమైన నిషధరాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నాడు. (49)
నాలో నామారిహా శ్యామః పుణ్యశ్లోక ఇతి శ్రుతః ।
బ్రహ్మణ్యో వేడవిద్ వాగ్మీ పుణ్యకృత్ సోమపోఽగ్నిమాన్ ॥ 50
శత్రుంజయుడైన నలమహారాజు పుణ్యశ్లోకుడుగా ప్రసిద్ధి పొందాడు. వేదవేత్త. వాఙ్ నైపుణ్యం కలవాడు. పుణ్యకర్మలను చేస్తాడు. సోమపానం చేసిన నిత్యాగ్నిహోత్రి. (50)
యష్టా దాతా చ యోద్ధా చ సమ్యక్ చైవ ప్రశాసితా ।
తస్య మామబలాం శ్రేష్ఠాం విద్ధి భార్యామిహాగతామ్ ॥ 51
త్యక్తశ్రియం భర్తృహీనామ్ అనాథాం వ్యసనాన్వితామ్ ।
అన్వేషమాణాం భర్తారం త్వం మాం పర్వతసత్తమ ॥ 52
యజ్ఞకర్తగా, దాతగా, యుద్ధవీరుడుగా, నలుడు ప్రసిద్ధిచెందాడు. ఈ అబల - భర్తృహీన, ధనహీన, అనాథ ఇలాంటి నేను నలుని భార్యయగు దమయంతిని గిరిరాజా! భర్తను వెతుక్కుంటూ నీ సమీపానికి వచ్చాను. (51,52)
సముల్లిఖద్భిరేతైర్హి త్వయా శృంగశతైర్నృపః ।
కచ్చిద్ దృష్టోఽచలశ్రేష్ఠ వనేఽస్మిన్ దారుణే నలః ॥ 53
పర్వతరాజమా! ఉన్నతాలైన అనేక శిఖరాలతో ఆకాశంలో గీతలు గీసే నీవు ఈ భయంకారణ్యంలో నలుని చూశావా? (53)
గజేంద్రవిక్రమో ధీమాన్ దీర్ఘబాహురమర్షణః ।
విక్రాంతః సత్త్వవాన్ వీరః భర్తా మమ మహాయశాః ॥ 54
నిషధానామధిపతిః కచ్చిద్ దృష్టస్త్వయా నలః ।
విలపంతీం కిమేకాం మాం పర్వతశ్రేష్ఠ విహ్వలామ్ ॥ 55
గిరా నాశ్వాసయస్యద్య స్వాం సుతామివ దుఃఖితామ్ ।
మదపుటేనుగులాంటి బలం కలవాడు, బుద్ధిమంతుడు. ఆజానుబాహువు, యశస్వి, వీరుడైన నాభర్త నిషధదేశప్రభువు. నలుడనే పేరుగలవాడు. మీరెక్కడైనా నలుని చూశారా?
పర్వతశ్రేష్ఠుడా! ఏకాకిని, దుఃఖంతోనున్న నీకుమార్తె వలె ఉన్న నన్ను ఎందుకు ఆదరించటం లేదు! (54, 55 1/2)
వీర విక్రాంత ధర్మజ్ఞ సత్యసంధ మహీపతే ॥ 56
యద్యస్యస్మిన్ వనే రాజన్ దర్శయాత్మానమాత్మనా ।
ధర్మాలు తెలిసినవాడవు, సత్యవాక్ పాలకుడవు, వీరులను ఆక్రమించే రాజా! ఈ అరణ్యంలోనే ఉంటే కన్పించవయ్యా! ( 56 1/2)
కదా సుస్నిగ్ధగంభీరాం జీమూతస్వనసన్నిభామ్ ॥ 57
శ్రోష్యామి నైషధస్యాహం వాచం తానుమృతోపమామ్ ।
మేఘగర్జనను పోలి మృదుగంభీరాలై అమృతోపమానాలైన నలుని మాటలను వినగల్గటం ఎప్పుడో కదా! (57 1/2)
వైదర్భీత్యేవ విస్పష్టాం శుభాం రాజ్ఞో మహాత్మనామ్ ॥ 58
ఆమ్నాయసారిణీమృద్ధాం మమ శోకవినాశినీమ్ ।
వైదర్భరీతివలె సుస్పష్టమైనది, శుభదాయిని, నాఆవేదనను పోగొట్టకల్గినది, వేదప్రసారం చేసే నీమధురవాక్కు ఎప్పుడు నేను వినగలను! (58 1/2)
భీతామాశ్వాసయత మాం నృపతే ధర్మవత్సల ॥ 59
ధర్మవాత్సల్యం గల రాజా! భయపడుతున్న నన్ను ఊరడించు. (59)
ఇతి సా తం గిరిశ్రేష్ఠమ్ ఉక్త్వా పార్థివనందినీ ।
దమయంతీ తతో భూయః జగామ దిసముత్తరామ్ ॥ 60
ఈవిధంగా దమయంతి పర్వతరాజుకు విన్నవించి అక్కడనుండి మళ్లీ బయలుదేరి ఉత్తరదిక్కుగా వెళ్ళింది. (60)
సా గత్వా త్రీనహోరాత్రాన్ దదర్శ పరమాంగనా ।
తాపసారణ్యమతులం దివ్యకాననశోభితమ్ ॥ 61
దమయంతి మూడు రాత్రింబవళ్ళు పయనించి దివ్యారణ్యాన్ని పోలి ప్రకాశించే ఒక తాపసారణ్యాన్ని చూసింది. (61)
వసిష్ఠభృగ్వత్రిసమైః తాససైరుపశోభితమ్ ।
నియతైః సంయుతాహారైః దమశౌచసమన్వితైః ॥ 62
ఆ తాపసారణ్యం వసిద్ఠ, భృగు అత్రి సమానులైన మహర్షుల తపస్సులచే ప్రకాశిస్తోంది. సమ్యుతాహారులు, ఇంద్రియ నిగ్రహం కల్గినవారు, పవిత్రులు.... (62)
అబ్బక్షైర్వాయుభక్షైశ్చ పత్రాహారైస్తథైవ చ ।
జితేంద్రియైర్మహాభాగైః స్వర్గమార్గదిదృక్షుభిః ॥ 63
స్వర్గమార్గం చూడాలనే కోరికతో జల, వాయు భక్షకులచట ఉన్నారు. కొందరు ఆకులే ఆహారంగా తినేవారు. జితేంద్రియులగు మహాత్ములు. వీరంతా అచట ఉన్నారు. (63)
వల్కలాజినసంవీతైః మునిభిః సంయుతేంద్రియైః ।
తాపసాధ్యుషితం రమ్యం దదర్శాశ్రమమండలమ్ ॥ 64
జితేంద్రియులై నారచీరలు ధరించిన మునులతోను, తపోధనుల ఉనికితోను, రమ్యమై ప్రకాశించే ఆ ఆశ్రమ సమూహాలను చూచింది. (64)
నానామృగగణైర్జుష్టం శాఖామృగగణాయుతమ్ ।
తాపసైః సముపేతం చ సా దృష్ట్వైవ సమాశ్వసత్ ॥ 65
అనేక మృగగణాలతో పరివ్యాప్తమై కోతులగుంపులతోకూడి తాపసులకు నివాసమైన ఆ ఆశ్రమాన్ని చూచిన దమయంతి సంతృప్తిగా ఊపిరి పీల్చుకొంది. (65)
సుభ్రూః సుకేశీ సుశ్రోణీ సుకుచా సుద్విజాననా ।
వర్చస్వినీ సుప్రతిష్ఠా స్వసితాయతలోచనా ॥ 66
మంచికనుబొమలు, మంచి కేశాలు, చక్కని పిరుదులు, మంచి ఉరోజాలు, మంచి పలువరుస, నల్లని విశాలమైన నేత్రాలు కల్గి సహజ వర్చస్వినియైన ఆమె... (66)
సా వివేశాశ్రమపదం వీరసేనసుతప్రియా ।
యోషిద్రత్నం మహాభాగా దమయంతీ తపస్వినీ ॥ 67
వీరసేనుని కుమారరత్నమగు నలునకు ప్రియతమయు, తపస్వినియు, స్త్రీలలో రత్నం వంటి సాధ్వి దమయంతి ఆశ్రమంలోనికి ప్రవేశించింది. (67)
సాభివాద్య తపోవృద్ధాన్ వినయావనతా స్థితా ।
స్వాగతం త ఇతి ప్రోక్తా తైః సర్వైస్తాపసోత్తమైః ॥ 68
దమయంతి, తపోవృద్ధులకు నమస్కరించి వినయంతో శిరస్సువంచింది. తాపసోత్తములంతా ఆమెకు స్వాగతం పలికారు. (68)
పూజాం చాస్యా యథాన్యాయం కృత్వా తత్ర తపోధనాః ।
ఆస్యతామిత్యథోచుస్తే బ్రూహి కిం కరవామహే ॥ 69
తపోధనులంతా ఆమెకు తగినవిధంగా గౌరవించి ఆసీనురాలవు కమ్మని కోరారు. తర్వాత తాము ఏం చెయ్యాలో చెప్పమని కోరారు. (69)
తానువాచ వరారోహా కచ్చిద్ భగవతామిహ ।
తపఃస్వగ్నిషు ధర్మేషు మృగపక్షిషు చానఘాః ॥ 70
కుశలం వో మహాభాగాః స్వధర్మాచరణేషు చ ।
తైరుక్తా కుశలం భద్రే సర్వత్రేతి యశస్విని ॥ 71
దమయంతి తాపసులనుద్దేశించి -
మహాభాగులారా! స్వధర్మాచరణంలో మీరు కుశలులే కదా! మీ తపస్సులు అగ్నికార్యాలు, మృగపక్షుల యెడల మీరు నిర్వర్తించే ధర్మాలు సక్రమంగా నెరవేరుతున్నాయా? - అని అడిగిందే తడవుగా వారు మాకెల్లరకు కుశలమే - అని పలికారు. (70,71)
బ్రూహి సర్వానవద్యాంగి కా త్వం కిం చ చికీర్షసి ।
దృష్ట్వైవ తే పరం రూపం ద్యుతిం చ పరమామిహ ॥ 72
విస్మయో నః సముత్పన్నః సమాశ్వసిహి మా శుచః ।
అస్యారణ్యస్య దేవీ త్వమ్ ఉతాహోఽస్య మహీభృతః ॥ 73
సర్వోత్కృష్టమైన శరీరం కలదానా! నీవు ఎవ్వతెవు? నీవేమి చేయదలచితివి? తేజోవంతమైన నీరూపం మాకెల్లరకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. నీవు దుఃఖింపకు. ఊరడిల్లు. నీవేమైన వన దేవతవా? లేక ఈ పర్వతరాజునకు దేవేరివా? చెప్పు. (72,73)
అస్యాశ్చ నద్యాః కల్యాణి వద సత్యమనిందితే ।
సాబ్రవీత్ తానృషీన్ నాహమ్ అరణ్యస్యాస్య దేవతా ॥ 74
న చాప్యస్య గిరేర్విప్రాః నైవ నద్యాశ్చ దేవతా ।
మానుషీం మాం విజానీత యూయం సర్వే తపోధనాః ॥ 75
కళ్యాణీ! నీవు ఈ నదీ దేవతవా? - యథార్థాన్ని తెల్పుమని అడిగారు. అపుడు దమయంతి వారితో 'తపోధనులారా! మీరు భావించినవిధంగా నేను అరణ్యదేవతను గాని, గిరిదేవతనుగాని, నదీదేవతను గాని కాదు. మీరెల్లరూ నన్ను మనుజకాంతగా తెలిసికొనం'డని పల్కింది. (74,75)
విస్తరేణాభిధాస్యామి తన్మే శృణుత సర్వశః ।
విదర్భేషు మహీపాలః భీమో నామ మహీపతిః ॥ 76
తపోధనులారా! నావృత్తాంతం అంతా సవిస్తరంగా చెపుతాను. వినండి!
విదర్భదేశాన్ని పాలిమ్చే మహారాజు భీముడనే పేరుగల మహీపతి. (76)
తస్య మాం తనయాం సర్వే జానీత ద్విజసత్తమాః ।
నిషధాధిపతిర్ధీమాన్ నలో నామ మహాయశాః ॥ 77
వీరః సంగ్రామజిద్ విద్వాన్ మమ భర్తా విశాంపతిః ।
దేవతాభ్యర్చనపరః దివ్జాతిజనవత్సలః ॥ 78
ఆ భీమరాజునకు పుత్రికనుగా నన్ను తెలిసికొనండి. బుద్ధిమంతుడు, యశస్వి, వీరుడు, యుద్ధవిజేత, పండితుడు - అయిన నలుడనే మహారాజు నాభర్త. ఆయన సదా దేవతల నారాధించేవాడు. బ్రాహ్మణులపై వాత్సల్యం కలవాడు. (77,78)
గోప్తా నిషధవంశస్య మహాతేజా మహాబలః ।
సత్యవాన్ ధర్మవిత్ ప్రాజ్ఞః సత్యసంధోఽరిమర్దనః ॥ 79
బ్రహ్మణ్యో దైవతపరః శ్రీమాన్ పరపురంజయః ।
నలో నామ నృపశ్రేష్ఠః దేవరాజసమద్యుతిః ॥ 80
మమ భర్తా విశాలాక్షః పూర్ణేందువదనోఽరిహా ।
ఆహార్తా క్రతుముఖ్యానాం వేదవేదాంగపారగః ॥ 81
నిషధవంశరక్షకుడైన ఆ నలమహారాజు గొప్పతేజోవంతుడు. మహాబలసంపన్నుడు. సత్యాన్నే పలికేవాడు. ధర్మాలు తెలిసిన ప్రాజ్ఞుడు. శత్రుంజయుడు, బ్రాహ్మణుడు, దైవతపరుడు, శ్రీమంతుడు, శత్రురాజ్యవిజేత, అశ్వమేధాది యజ్ఞాలు చేసినవాడు. వేదవేదాంగ పారగుడు. విశాలాక్షుడు. పూర్ణేందువదనుడు. శత్రుంజయుడు. ఇంద్రునితో తులతూగేవాడు. ఇట్టి నలమహారాజు నా నాథుడు. (79-81)
సపత్నానాం మృధే హంతా రవిసోమసమప్రభః ।
స కైశ్చిన్నికృతిప్రజ్ఞైః అనార్యైరకృతాత్మభిః ॥ 82
ఆహూయ పృథివీపాలః సత్యధర్మపరాయణః ।
దేవనే కుశలైర్జిహ్మైః హృతం రాజ్యం వసూని చ ॥ 83
సూర్యచంద్రసమతేజోవంతుడైన నలుడు, యుద్ధాల్లో శత్రునిహంత. ఇట్టి నలమహారాజును, దుర్మార్గచరులై దుష్కృత్యాలు చేసే కొందరు పనిగట్టుకొని ఆహ్వానించి, జూదంలో కుటిలమైన మార్గాలలో ఓడించి, సమస్త రాజ్యాన్ని, ధనాన్ని హరించారు. (82,83)
తస్య మామవగచ్ఛధ్వం భార్యాం రాజర్షభస్య వై ।
దమయంతీతి విఖ్యాతాం భర్తుర్దర్శనలాలసామ్ ॥ 84
ఆ విధంగా రాజ్యాన్ని కోల్పోయిన రాజశ్రేష్ఠుడైన నలుని భార్యనగు దమయంతిని నేను. నేను భర్తృదర్శనం కోరుతున్నాను. (84)
సా వనాని గిరీంశ్చైవ సరాంసి సరితస్తథా ।
పల్వలాని చ సర్వాణి తథారణ్యాని సర్వశః ॥ 85
అన్వేషమాణా భర్తారం నలం రణవిశారదమ్ ।
మహాత్మానం కృతాస్త్రం చ విచరామీహ దుఃఖితా ॥ 86
భర్తను వెదక్కుంటూనే ఈ అరణ్యాలను, పర్వతాలను, నదులను, సరస్సులను పరికిస్తూ మహాత్ముడు, అస్త్ర పరిజ్ఞాత అయిన ఆ నలుని కోసం దుఃఖితనై తిరుగుతున్నాను. (85,86)
కచ్చిద్ భగవతాం రమ్యం తపోవనమిదం నృపః ।
భవేత్ ప్రాప్తో నలో నామ నిషధానాం జనాధిపః ॥ 87
యత్కృతేఽహమిదం బ్రహ్మన్ ప్రపన్నా భృశదారుణమ్ ।
వనం ప్రతిభయం ఘోరం శార్దూలమృగసేవితమ్ ॥ 88
శార్దూలాదిక్రూరమృగ నివాసమై, అతిదారుణమైన ఈ ఘోరారణ్యమంతా నలునికై వెదకుతూ, ఇపుడీ సుందరమైన తపోవనాన్ని చేరాను. భగవత్ స్వరూపులైన మీసన్నిధికి నిషధాధీశుడైన నలుడు ఎపుడయినా వచ్చాడా? (87,88)
యది కైశ్చిదహోరాత్రైః న ద్రక్ష్యామి నలం నృపమ్ ।
ఆత్మానం శ్రేయసా యోక్ష్యే దేహ స్యాస్య విమోచనాత్ ॥ 89
నాభర్త నలుని కొన్ని రోజులలో చూడలేకపోతే ఈ దేహాన్ని చాలించటం శ్రేయస్కరమని భావిస్తున్నాను. (89)
కో ను మే జీవితేనార్థః తమృతే పురుషర్షభమ్ ।
కథం భవిష్యామ్యద్యాహం భర్తృశోకాభిపీడితా ॥ 90
నా జీవిత పరమార్థమైన భర్త లేకుండా ఈజీవితం వ్యర్థం. భర్తృశోకాభిపీడితనై నేనెలా ఉండగలను? (90)
తథా విలపతీమేకామ్ అరణ్యే భీమనందినీమ్ ।
దమయంతీమథోచుస్తే తాపసాః సత్యదర్శినః ॥ 91
అరణ్యంలో తపోవనం చేరి విలపిస్తున్న భీమపుత్రిని దమయంతిని చూచి, సత్యద్రష్టలైన అచటి తాపసులు దమయంతితో ఇలా అన్నారు. (91)
ఉదర్కస్తవ కల్యాణి కల్యాణో భవితా శుభే ।
వయం పశ్యామ తపసా క్షిప్రం ద్రక్ష్యసి నైషధమ్ ॥ 92
కళ్యాణీ! మేం తపోదృష్టితో చూశాం! త్వరలోనే నీవు నలుని చూస్తావు. భవిష్యత్తు నీకు శుభదాయకమవుతుంది. (92)
నిషధానామధిపతిం నలం రిపునిపాతినమ్ ।
భైమి ధర్మభృతాం శ్రేష్ఠం ద్రక్ష్యసే విగతజ్వరమ్ ॥ 93
దమయంతీ! శత్రుంజయుడు, ధార్మికులలో శ్రేష్ఠుడు, నిషధాధిపయైన నలుని త్వరలోనే పాపరహితునిగ దర్శిస్తావు. (93)
విముక్తం సర్వపాపేభ్యః సర్వరత్నసమన్వితమ్ ।
తదేవ నగరం శ్రేష్ఠం ప్రశాసతమరిందమమ్ ॥ 94
ద్విషతాం భయకర్తారం సుహృదాం శోకనాశనమ్ ।
పతిం ద్రక్ష్యసి కల్యాణి కల్యాణాభిజనం నృపమ్ ॥ 95
సర్వపాపాల నుండి విముక్తుడై, శత్రుంజయుడై, సర్వరత్న సమన్వితమైన తన నిషధరాజ్యాన్నే పరిపాలిస్తాడు. నలుడు శత్రుభయంకరుడు, మిత్రుల శోకాన్ని నాశనం చేసేవాడు. కళ్యాణకారకమైన పరివారంతో కూడిన ఆ నలుని నీవు చూడగలవు. (95)
ఏవముక్త్వా నలస్యేష్టాం మహిషీం పార్థివాత్మజామ్ ।
అంతర్హితాస్తాపసాస్తే సాగ్నిహోత్రాశ్రమాస్తథా ॥ 96
నలుని పట్టమహిషియైన దమయంతితో ఈ విధంగా చెప్పిన తాపసులంతా అగ్నిహోత్రసహితమైన ఆశ్రమాలతో అంతర్ధానమయ్యారు. (96)
సా దృష్ట్వా మహదాశ్చర్యం విస్మితా హ్యభవత్ తదా ।
దమయంత్యనవద్యాంగీ వీరసేననృపస్నుషా ॥ 97
వీరసేనమహారాజునకు కోడలైన దమయంతి ఇదంతా చూచి మహాశ్చర్యాన్ని పొంది విస్మయంతో నవ్వుకొంది. (97)
కిం ను స్వప్నో మయా దృష్టః కోఽయం విధిరిహాభవత్ ।
క్వ ను తే తాపసాః సర్వే క్వ తదాశ్రమమండలమ్ ॥ 98
ఏమి? నేను కల కన్నానా? నేను చూసినదంతా స్వప్నమేనా? ఆ ఆశ్రమాలెక్కడ? ఆ తాపసులు ఎక్కడ? విధి ఇలా ఉంది! (98)
క్వ సా పుణ్యజలా రమ్యా నదీ ద్విజనిషేవితా ।
క్వ ను తే హ నగా హృద్యాః ఫలపుష్పోపశోభితాః ॥ 99
పుణ్యజలాలతో ప్రవహించే ఆ అందమైన నది ఎక్కడ? వివిధ పక్షి గణాలతో సేవింపబడుతూ, ఫలపుష్పాలతో శోభించే ఆ పర్వతాలెక్కడ? (99)
ధ్యాత్వా చిరం భీమసుతా దమయంతీ శుచిస్మితా ।
భర్తృశోకపరా దీనా వివర్ణవదనాభవత్ ॥ 100
శుచిస్మితయైన దమయంతి చాలాకాలం ఇదంతా తలుస్తూనే ఉంది. భర్తృశోకంతో దీనురాలైన ఆమె ముఖం పాలిపోయింది. (100)
సా గత్వాథాపరాం భూమిం బాష్పసందిగ్ధయా గిరా ।
విలలాపాశ్రుపూర్ణాక్షీ దృష్ట్వాశోకతరుం తతః ॥ 101
దమయంతి ఆ ప్రదేశాన్నుండి మరోప్రదేశానికి చేరింది. కన్నీరు మున్నీరు అయి డగ్గుత్తికతో ఒక అశోకవృక్షాన్ని చూచి విలపించింది. (101)
ఉపగమ్య తరుశ్రేష్ఠమ్ అశోకం పుష్పితం వనే ।
పల్లవాపీడితం హృద్యం విహంగైరనునాదితమ్ ॥ 102
ఆ వనమంతా పక్షుల కిలకిలా రావాలతో మార్ర్మోగుతోంది. చివురుటాకులతో మనోజ్ఞంగా పుష్పించిన అశోకవృక్షం చెంత చేరింది దమయంతి. (102)
అహో బతాయమగమః శ్రీమానస్మిన్ వనాంతరే ।
ఆపీడైర్బహుభిర్భాతి శ్రీమాన్ పర్వతరాడివ ॥ 103
ఈ వనంలో ఈ అశోకవృక్షం చిగురుటాకులతోను, పుష్పసమృద్ధితోను అనేకశిఖరాలతోను ఉన్న పర్వత రాజువలె ప్రకాశిస్తోంది. (103)
విశోకాం కురు మాం క్షిప్రమ్ అశోక ప్రియదర్శన ।
వీతశోకభయాబాధం కచ్చిత్ త్వం దృష్టవాన్ నృపమ్ ॥ 104
నలం నామారిదమనం దమయంత్యాః ప్రియం పతిమ్ ।
నిషధానామధిపతిం దృష్టవానపి మే ప్రియమ్ ॥ 105
ప్రియదర్శనవైన అశోకవృక్షమా! దమయంతికి ప్రియుడూ, అప్తి, నిషధాధీశుడూ, శత్రువులమదాన్ని అణచేవాడూ, శోకభయ బాధారహితుడు అయిన నలుడనే రాజును నీవేమైనా చూశావా? (104,105)
ఏకవస్త్రార్థసంవీతం సుకుమారతనుత్వచమ్ ।
వ్యసనేనార్దితం వీరమ్ అరణ్యమిదమాగతమ్ ॥ 106
వ్యసనపీడితుడై, చీరముక్కతో సుకుమారదేహాన్ని కప్పుకొన్న ఒక వీరుని ఈ అరణ్యంలో ఉన్నట్లుగా చూశావా? (106)
యథా విశోకా గచ్ఛేయమ్ అశోకనగ తత్ కురు ।
సత్యనామా భవాశోక అశోకః శోకనాశనః ॥ 107
నీవు అశోకవృక్షానివి. అశోకమంటేనే శోకాన్ని పోగొట్టేది. నన్ను శోకం లేనిదానినిగా చేయతగిన పనిచేసి అశోకమనే పేరును సార్థకం చేసుకో! (107)
ఏవం సాశోకవృక్షం తమ్ ఆర్తా వై పరిగమ్య హ ।
జగామ దారుణతరం దేశం భైమీ వరాంగనా ॥ 108
ఈ విధంగా బాధాపరితప్తమైన దమయంతి ఆ అశోకవృక్షానికి ప్రదక్షిణం చేసి అచటి నుండి అంతకన్న దారుణమైన మరొకప్రదేశానికి వెళ్ళింది. (108)
సా దదర్శ నగాన్ నైకాన్ నైకాశ్చ సరితస్తథా ।
నైకాంశ్చ పర్వతాన్ రమ్యాన్ నైకాంశ్చ మృగపక్షిణః ॥ 109
కందరాంశ్చ నితంబాంశ్చ నదీశ్చాద్భుతదర్శనాః ।
దదర్శ తాన్ భీమసుతా పతిమన్వేషతీ తదా ॥ 110
గత్వా ప్రకృష్టమధ్వానం దమయంతీ శుచిస్మితా ।
దదర్శాథ మహాసార్థం హస్త్వశ్వరథసంకులమ్ ॥ 111
ఉత్తరంతం నదీం రమ్యాం ప్రసన్నసలిలాం శుభామ్ ।
సుశీతతోయాం విస్తీర్ణాం హ్రదినీం వేతసైర్వృతామ్ ॥ 112
అచట నుండి బయలుదేరిన దమయంతి తన భర్తను వెదకుతూ మార్గమధ్యంలో అనేకపర్వతాలను, నదులను, వివిధ మృగాలను, పక్షులను, కొండచరియలను, అచటి నుమ్డి పడి ప్రవహించే సెలయేళ్లను చూస్తూ చూస్తూ కొంచెం సంతోషంతో నడకసాగిస్తూ రమ్యమై, ప్రసన్నమై చల్లనైన జలంతో, ప్రబ్బలి తీగలతో నిండిన నదిని దాటుతూ రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన వానితో కూడిన వ్యాపారుల సమూహాన్ని చూచి సంతోషాన్ని పొందింది. (109-112)
ప్రోద్ఘుష్టాం క్రౌంచకురరైః చక్రవాకోపకూజితామ్ ।
కూర్మగ్రాహఝషాకీర్ణాం విపులద్వీపశోభితామ్ ॥ 113
క్రౌంచపక్షుల అరుపులతోను, చక్రవాకపక్షుల కూజితాలతోను మార్ర్మోగుతూ తాబేళ్ళు, మొసళ్ళతో కూడి విశాలమైన ద్వీపంలా ఉన్న ఆ సార్థవాహసమూహాన్ని - (113)
సా దృష్ట్వైవ మహాసార్థం నలపత్నీ యశస్వినీ ।
ఉపసర్ప్య వరారోహా జనమధ్యం వివేశ హ ॥ 114
చూచి, నలపత్నియైన దమయంతి మెల్లగా వారిని సమీపించి జనసమూహంలో ప్రవేశించింది. (114)
ఉన్మత్తరూపా శోకార్తా తథా వస్త్రార్ధసంవృతా ।
కృశా వివర్ణా మలినా పాంసుధ్వస్తశిరోరుహా ॥ 115
ఉన్మాదినివలె శోకసంతప్తమై, సగం చీరతో శరీరాన్ని కప్పుకొని తేజోహీనయై, ధూళిధూసరితమైన శిరోజాలు కల్గి కృశించియున్నది ఆమె. (115)
తాం దృష్ట్వా తత్ర మనుజాః కేచిద్ భీతాః ప్రదుద్రువుః ।
కేచిచ్చింతాపరా జగ్ముః కేచిత్ తత్ర విచుక్రుశుః ॥ 116
ఆ దమయంతిని చూచి కొందరు భయపడి పరుగులెత్తారు. మరికొందరు ఆలోచనలో పడ్డారు. మరికొంతమంది పెద్దగా అరచారు. (116)
ప్రహసంతి స్మ తాం కేచిద్ అభ్యసూయంతి చాపరే ।
అకుర్వత దయాం కేచిత్ పప్రచ్ఛుశ్చాపి భారత ॥ 117
కొందరామెను చూచి పెద్దగా నవ్వారు. కొందరు అసూయపడ్డారు. మరికొందరు జాలిపడ్డారు. కొందరామెను ఈవిధంగా ప్రశ్నించారు. (117)
కాసి కక్యాసి కల్యాణి కిం వా మృగయసే వనే ।
త్వాం దృష్ట్వా వ్యథితాః స్మేహ కచ్చిత్ త్వమసి మానుషీ ॥ 118
కళ్యాణీ! నీవెవ్వరిదానవు? దేనికోసం వెదకుతున్నావు? నిన్ను చూచి మేం చాలా బాధపడుతున్నాం. నీవు మానవకాంతవేనా? (118)
వద సత్యం వనస్యాస్య పర్వతస్యాథవా దిశః ।
దేవతా త్వం హి కల్యాణి త్వాం వయం శరణం గతాః ॥ 119
నీవు ఈ పర్వతానికి గాని, అరణ్యానికి గాని సంబంధించిన దేవతవా? నిజం చెప్పు! నిన్ను మేం శరణుపొందుతున్నాం. (119)
యక్షీ వా రాక్షసీ వా త్వమ్ ఉతాహోఽసి వరాంగనా ।
సర్వథా కురు నః స్వస్తి రక్ష వాస్మాననిందితే ॥ 120
యథాయం సర్వథా సార్థః క్షేమీ శీఘ్రమితో వ్రజేత్ ।
తథా విధత్స్వ కల్యాణి యథా శ్రేయో హి నో భవేత్ ॥ 121
నీవు యక్షజాతికి చెందినదానవా? లేక రాక్షసజాతికి చెందినదానవా? మాకెల్లరకు మంచిని కలుగజేసి రక్షించు. మాకు చెడు జరుగకుండా సుఖంగా గమ్యాన్ని చేరేలా తగినవిధంగా సహకరించు. (120,121)
తథోక్తా తేన సార్థేన దమయంతీ నృపాత్మజా ।
ప్రత్యువాచ తతః సాధ్వీ భర్తృవ్యసనపీడతా ॥ 122
ఆ సార్థవాహసమూహం ఈవిధంగా పల్కినంతనే భర్త కన్పించలేదనే బాధతో దమయంతీ వారికి ఇలా బదులు పల్కింది. (122)
సార్థవాహం చ సార్థం చ జనా యే చాత్ర కేచన ।
యువస్థవిరబాలాశ్చ సార్థస్య చ పురోగమాః ॥ 123
మానుషీం మాం విజానీత మనుజాధిపతేః సుతామ్ ।
నృపస్నుషాం రాజభార్యాం భర్తృదర్శనలాలసామ్ ॥ 124
వ్యాపారులారా! మీలో యువకులు, వృద్ధులు, బాలురు ఉన్నారు. మీరంతా నన్ను మానవకాంతగానే భావించండి. నేనొక మహారాజు పుత్రికను. మరొకరాజుకి కోడలను. రాజ పట్టమహిషిని. కనిపించని భర్తను చూడాలనే ఆసక్తితో ఉన్నదానను. (123,124)
విదర్భరాణ్మమ పితా భర్త రాజా చ నైషధః ।
నలో నామ మహాభాగః తం మృగ్యామ్యపరాజితమ్ ॥ 125
నాతండ్రి విదర్భను పాలించే రాజు. నిషధరాజ్యపాలకుడైన నలమహారాజే నాభర్త. ఎన్నడూ ఓటమి నెరుగని నాభర్తను వెదకుతున్నాను. (125)
యది జానీత నృపతిం క్షిప్రం శంసత మే ప్రియమ్ ।
నలం పురుషశార్దూలమ్ అమిత్రగణసూదనమ్ ॥ 126
శత్రుగణాలను నశింపజేసే పురుషశ్రేష్ఠుడైన నాభర్త నలుని గురించి మీకేమైనా తెలిస్తే నాకు తెలియజేయండి. (126)
తామువాచానవద్యాంగీం సార్థస్య మహతః ప్రభుః ।
సార్థవాహః శుచిర్నామ శృణు కల్యాణి మద్వచః ॥ 127
ఆ సార్థవాహసమూహానికి నాయకుడైన "శుచి" అనే పేరు గలవాడు, దమయంతితో ఇలా అన్నాడు. 'కళ్యాణీ! నామాట విను! (127)
అహం సార్థస్య నేతా వై సార్థవాహః శుచిస్మితే ।
మనుష్యం నలనామానం న పశ్యామి యశస్విని ॥ 128
నేను, ఈ సార్థవాహసమూహానికి నాయకుణ్ణి. యశస్వినీ! నలుడనే పేరుగల వానిని నేను చూడలేదు. (128)
కుంజరద్వీపిమహిషశార్దూలర్క్షమృగానపి ।
పశ్యామ్యస్మిన్ వనే కృత్స్నే హ్యమనుష్యనిషేవితే ॥ 129
మానవసంచారంలేని గహనమైన ఈ అరణ్యంలో ఏనుగులు, అడవిదున్నలు, పెద్దపులులు, భల్లూకాదులను మాత్రం చూశాను. (129)
ఋతే త్వాం మానుషీం మర్త్యం న పశ్యామి మహావనే ।
తథా నో యక్షరాడద్య మణిభద్రః ప్రసీదతు ॥ 130
మానవకాంతయగు నిన్ను దప్ప, మరొక మనుష్యుని ఈ అరణ్యంలో చూడలేదు. ఇపుడు మాకు యక్షరాజైన మణిభద్రుడు ప్రసన్నుడగుగాక! (130)
సాబ్రవీద్ వణిజః సర్వాన్ సార్థవాహం చ తం తతః ।
క్వ ను యాస్యతి సార్థోఽయమ్ ఏతదాఖ్యాతుమర్హసి ॥ 131
దమయంతి వారిని 'వ్యాపారులారా! మీరంతా ఎచటకు వెళ్తున్నారో తెలుపండి'. అని అడిగింది. (131)
సార్థవాహ ఉవాచ
సార్థోఽయం చేదిరాజస్య సుబాహోః సత్యదర్శినః ।
క్షిప్రం జనపదం గంతా లాభాయ మనుజాత్మజే ॥ 132
సార్థవాహుడిలా అన్నాడు.
చేదిదేశపురాజైన సుబాహుమహారాజు గారి లాభంనిమిత్తం ఈ వ్యాపారుల సమూహం పల్లెలకు వెళ్తున్నది. (132)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి దమయంతీసార్థవాహసంగమే చతుఃషష్టితమోఽధ్యాయః ॥ 64 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున దమయంతీసార్థ వాహంగమనును అరువది నాల్గవ అధ్యాయము. (64)