71. డెబ్బది యొకటవ అధ్యాయము

ఋతుపర్ణుడు విదర్భకు వెళ్ళుట.

బృహదశ్వ ఉవాచ
శ్రుత్వా వచః సుదేవస్య ఋతుపర్ణో నరాధిపః ।
సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచా బాహుకం ప్రత్యభాషత ॥ 1
బృహదశ్వుడిలా అన్నాడు. సుదేవుని మాటలు విన్న ఋతుపర్ణమహారాజు ఋతుపర్ణమహారాజు బాహుకునితో మృదువుగా ఇలా మాట్లాడాడు. (1)
విదర్భాన్ యాతుమిచ్ఛామి దమయంత్యాః స్వయంవరమ్ ।
ఏకాహ్నా యయతత్త్వజ్ఞ మన్యసే యది బాహుక ॥ 2
బాహుకా! దమయంతీ స్వయంవరానికి విదర్భకు వెళ్ళాలనుకొంటున్నాను - నీవు అశ్వహృదయాన్ని తెలిసినవాడవు. ఒకరోజే సమయమని తెలుసుకదా! (2)
ఏవముక్తస్య కౌంతేయ తేన రాజ్ఞా నలస్య హ ।
వ్యదీర్యత మనో దుఃఖాత్ ప్రదధ్యౌ చ మహామనాః ॥ 3
ధర్మరాజా! ఋతుపర్ణుడు నలునితో ఇలా పలికిన పిదప నలుని హృదయం దుఃఖంతో కోతకోసినట్లయింది. (3)
దమయంతీ వదేదేతత్ కుర్యాద్ దుఃఖేన మోహితా ।
అస్మదర్థే భవేద్ వాయమ్ ఉపాయశ్చింతితో మహాన్ ॥ 4
నలుడు ఈవిధంగా మనస్సులో భావించాడు. దమయంతి ఈవీధంగా చెప్పి ఉంటుందా? దుఃఖంలో అజ్ఞానంతో ఇలా చేసిందేమో? లేదా నన్ను రప్పించటానికి ఇదే ఉపాయమని తలచిందా? (4)
నృశంసం బత వైదర్భీ భర్తృకామా తపస్వినీ ।
మయా క్షుద్రేణ నికృతా కృపణా పాపబుద్ధినా ॥ 5
స్త్రీస్వభావశ్చలో లోకే మమ దోషశ్చ దారుణః ।
స్యాదేవమపి కుర్యాత్ సా వివాసాద్ గతసౌహృదా ॥ 6
భర్తయందు గాఢమైన అనురాగం కలది దమయంతి. భర్తనే తలచుకొంటూ కాలం గడిపే తపస్విని. నేనా క్షుద్రుడను. పాపబుద్ధికలవాడను. నావల్లనే ఈవిధంగా జరిగింది. ఈ నేను పెద్ద తప్పు చేశాను. లోకంలో స్త్రీ స్వభావం చంచలమైంది. వియోగం వల్ల నాయందలి గాఢమైన ప్రేమను విడచిందేమో! (5,6)
మమ శోకేన సంవిగ్నా నైరాశ్యాత్ తనుమధ్యమా ।
నైవం సా కర్హిచిత్ కుర్యాత్ సాపత్యా చ విశేషతః ॥ 7
దమయంతికి నావలన కల్గిన శోకంతో, నిరాశకల్గినా సంతానవతియైన యామె ఇలా ఎన్నడూ చేసియుండదే! (7)
యదత్ర సత్యం వాసత్యం గత్వా వేత్స్యామి నిశ్చయన్ ।
ఋతుపర్ణస్య వై కామమ్ ఆత్మార్థం చ కరోమ్యహమ్ ॥ 8
ఇందులోని సత్యాసత్యాలను అచటికే వెళ్ళి తెలిసికొంటాను. విదర్భకు వెళ్లటం ఋతుపర్ణుని కోరికపై అయినా నాప్రయోజనం కూడ నెరవేర్చుకొంటాను. (8)
ఇతి నిశ్చిత్య మనసా బాహుకో దీనమానసః ।
కృతాంజలిరువాచేదమ్ ఋతుపర్ణం జనాధిపమ్ ॥ 9
ప్రతిజానామి తే వాక్యం గమిష్యామి నరాధిప ।
ఏకాహ్నా పురుషవ్యాఘ్ర విదర్భనగరీం నృప ॥ 10
బాహుకుడీ విధంగా నిశ్చయించుకొని దైన్యంతో అంజలిబద్ధుడై 'మహారాజా! మీ మాట ప్రకారం ఒక్క రోజులోనే విదర్భనగరాన్ని చేరగలం' అని విన్నవించాడు. (9,10)
తతః పరీక్షా మశ్వానాం చక్రే రాజన్ స బాహుకః ।
అశ్వశాలాముపాగమ్య భాంగాసురినృపాజ్ఞయా ॥ 11
తర్వాత బాహుకుడు అశ్వశాలకు వెళ్ళి ఋతుపర్ణమహారాజు ఆజ్ఞానుసారం అశ్వాలను పరీక్షించాడు. (11)
స త్వర్యమాణో బహుశః ఋతుపర్ణేన బాహుకః ।
అశ్వాన్ జిజ్ఞాసమానో వై విచార్య చ పునః పునః ।
అధ్యగచ్ఛత్ కృశానశ్వాన్ సమర్థానధ్వని క్షమాన్ ॥ 12
ఋతుపర్ణమహారాజుచే త్వరపెట్టబడిన బాహుకుడు ఉత్తమాశ్వాలను గుర్తింపదలచి, పలుమార్లు ఆలోచించి, దుర్బలంగా కనిపిస్తున్నా వేగంగా ప్రయాణించగల అశ్వాలను ఎన్నుకొన్నాడు. (12)
తేజోబలసమాయుక్తాన్ కులశీలసమన్వితాన్ ।
వర్జితాన్ లక్షణైర్హీనైః పృథుప్రోథాన్ మహాహనూన్ ॥ 13
తేజస్సు, బలం కలిగి, ఉత్తమజాతిలో పుట్టిన, హీనలక్షణాలు లేని, పెద్దముక్కురంధ్రాలు కల గుర్రాలను ఎంచుకొన్నాడు. (13)
శుద్ధాన్ దశభిరావర్తైః సింధుజాన్ వాతరంహసః ।
దృష్ట్వా తానబ్రవీద్ రాజా కించిత్ కోపసమన్వితః ॥ 14
సింధు దేశంళొ పుట్టి, పదిసుడులతో నిర్దుష్టాలై. వాయువేగం గల ఆ గుర్రాలను చూచి మహారాజు కొంచెం కోపంతో ఇలా పలికాడు. (14)
కిమిదం ప్రార్థితం కర్తుం ప్రలబ్ధవ్యా న తే వయమ్ ।
కథమల్పబలప్రాణాః వక్ష్యంతీమే హయా మమ ।
మహదధ్వానమపి చ గంతవ్యం కథమీదృశైః ॥ 15
బాహుకా! మేము నిన్ను కోరినది ఇదియా? వీటితో మేం గమ్యం చేరలేము. ఈ గుఱ్ఱాలు బక్కచిక్కి బలహీనంగా ఉన్నాయి! ఇలాంటి కృశించిన గుర్రాలతో మనం అంతదూరానికి ఎలా వెళ్ళగలం? - అని ఋతుపర్ణుడు కోపంతో ప్రశ్నించాడు. (15)
బాహుక ఉవాచ
ఏకో లలాటే ద్వౌ మూర్ధ్ని ద్వౌ ద్వౌ పార్శ్వోపపార్శ్వయోః ।
ద్వౌ ద్వౌ వక్షసి విజ్ఞేయౌ ప్రయాణే చైక ఏవ తు ॥ 16
బాహుకుడిలా అన్నాడు.
ఒకటి నుదిటియందు, రెండు తలపై, రెండేసి పార్శ్వ ఉపపార్శ్వాలలో రెండురెండు వక్షస్థలమందు (సుడులు) గల అశ్వమే బాగా ప్రయాణించేదిగా తెలిసికో తగింది. (16)
ఏతే హయా గమిష్యంతి విదర్భాన్ నాత్ర సంశయః ।
యానన్యాన్ మన్యసే రాజన్ బ్రూహి తాన్ యోజయామి తే ॥ 17
ఈ గుఱ్ఱాలు ఒక్క రోజులోనే విదర్భదేశానికి వెళ్ళగలవు. సందేహం లేదు. రాజా! మీరు, ఇతర అశ్వాలేమయినా మంచివనుకుంటే ఆ గుర్రాలనే రథానికి కడతాను. (17)
ఋతుపర్ణ ఉవాచ
త్వమేవ హయతత్త్వజ్ఞః కుశలో హ్యసి బాహుక ।
యాన్ మన్యసే సమర్థాంస్త్వం క్షిప్రం తానేవ యోజయ ॥ 18
ఋతుపర్ణుడిలా అన్నాడు.
బాహుకా! గుర్రాల శారీరక మానసిక తత్త్వాలను బాగా తెలిసిన నేర్పరివి నీవు. నీవు సమర్థాలని తలచిన గుర్రాలనే రథానికి పూన్చు. (18)
తతః సదశ్వాంశ్చతురః కులశీలసమన్వితాన్ ।
యోజయామాస కుశలః జవయుక్తాన్ రథే నలః ॥ 19
మహారాజుమాటలు విన్న తర్వాత, బాహుకుడు కులశీలాలు కల్గి వేగంగా పయనింప గల నాల్గు మంచి గుర్రాలను రథానికి పూన్చాడు. (19)
తతో యుక్తం రథం రాజా సమారోహత్ త్వరాన్వితః ।
అథ పర్యపతన్ భూమౌ జానుభిస్తే హయోత్తమాః ॥ 20
ఋతుపర్ణమహారాజు త్వరగా రథాన్ని అధిరోహించాడు. ఆ ఉత్తమాశ్వాలు మోకాళ్ళతో భూమిని తాకాయి. (20)
తతో నరవరః శ్రీమాన్ నలో రాజా విశాంపతే ।
సాంత్వయామాస తానశ్వాన్ తేజోబలసమన్వితాన్ ॥ 21
ధర్మరాజా! తర్వాత నలుడు తేజోబలసమన్వితాలైన ఆ అశ్వాలను ఊరడించాడు. (21)
రశ్మిభిశ్చ సముద్యమ్య నలో యాతుమియేష సః ।
సూతమారోప్య వార్ ష్ణేయం జవమాస్థాయ వై పరమ్ ॥ 22
తే చోద్యమానా విధివద్ బాహుకేన హయోత్తమాః ।
సముత్పేతురథాకాశం రథినం మోహయన్నివ ॥ 23
బాహుకుడు పగ్గాలను పట్టి బయలుదేరాలని తలంచాడు. బాహుకునిచే అదలింపబడిన ఆ ఉత్తమశ్వాలు ఆకాశంపై కెగసి పరుగులు తీస్తూ రథంలో ఉన్న ఋతుపర్ణమహారాజును ఆశ్చర్యచకితుని చేశాయి. (22,23)
తథా తు దృష్ట్వా తానశ్వాన్ వహతో వాతరంహసః ।
అయోధ్యాధిపతిః శ్రీమాన్ విస్మయం పరమం యయౌ ॥ 24
ఆ విధంగా పైకెగసి వాయువేగంతో పయనించే ఆ గుర్రాలను చూసి, అయోధ్యాధిపతియైన ఋతుపర్ణుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. (24)
రథఘోషం తు తం శ్రుత్వా హయసంగ్రహణం చ తత్ ।
వార్ ష్ణేయశ్చింతయామాస బాహుకస్య హయజ్ఞతామ్ ॥ 25
కిం ను స్యాన్మాతలిరయం దేవరాజస్య సారథిః ।
తథా తల్లక్షణం వీరే బాహుకే దృశ్యతే మహత్ ॥ 26
రథం యొక్క ధ్వనిని విన్న వార్ష్ణేయుడు, బాహుకుని గుర్రాల ఎన్నికను, అశ్వహృదయతత్త్వజ్ఞతను గురించి ఆలోచించాడు.
ఈ బాహుకుడు ఇంద్రుని రథసారధియైన మాతలికాదు కదా! ఇతని యందు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి.
వి॥ వార్ష్ణేయుడు = గతంలో ఋతుపర్ణుని అశ్వశిక్షకుడు
శాలిహోత్రోఽథ కిం ను స్యాత్ హయానాం కులతత్త్వవిత్ ।
మానుషం సమనుపాప్తః వపుః పరమశోభనమ్ ॥ 27
గుర్రాల జాతిని, వాని తత్త్వాన్ని బాగుగా తెలిసిన శాలి హోత్రుడా ఏమి? ఆతడే మనుష్యరూపాన్ని పొందాడేమో? (27)
ఉతాహోస్విద్ భవేద్ రాజా నలః పరపురంజయః ।
సోఽయం నృపతి రాయాతః ఇత్యేవం సమచింతయత్ ॥ 28
లేదా శత్రుంజయుడైన నలమహారాజేనా? ఆ నలమహారాజే ఈ రూపంలో వచ్చాడా? - అని, వార్ష్ణేయుడు ఇంకా ఇలా భావించాడు. (28)
అథ చేహ నలో విద్యాం వేత్తి తామేవ బాహుకః ।
తుల్యం హి లక్షయే జ్ఞానం బాహుకస్య నలస్య చ ॥ 29
భూలోకంలో అశ్వశాస్త్రం తెలిసినవాడు నలమహారాజు. ఆ విద్యయే బాహుకునకు తెలియును. ఈ విషయంలో నలునకు బాహుకునకు సామ్యం కనిపిస్తోంది! (29)
అపి చేదం వయస్తుల్యం బాహుకస్య నలస్య చ ।
నాయం నలో మహావీర్యః తద్విద్యశ్చ భవిష్యతి ॥ 30
అంతేకాక, నలుడూ బాహుకుడూ సమవయస్కులు. మహాపరాక్రమవంతుడైన నలుడు మాత్రం ఇతడు కాడు. కాని విద్య మాత్రం అదే. (30)
ప్రచ్ఛన్నా హి మహాత్మానః చరంతి పృథివీమిమామ్ ।
దైవేన విధినా యుక్తాః శాస్త్రోకైశ్చ నిరూపణైః ॥ 31
విధివశంచేత గాని, దైవప్రేరణచే గాని, మహాత్ములు కొందరు ప్రచ్ఛన్నరూపంతో పృథివిపై సంచరిస్తూంటారని శాస్త్రవాక్యాలు నిరూపిస్తాయి. (31)
భవేన్న మతిభేదో మే గాత్ర వైరూప్యతాం ప్రతి ।
ప్రమాణాత్ పరిహీనస్తు భవేదితి మతిర్మమ ॥ 32
బాహుకుని శరీరం యొక్క విరూపాన్ని గురించి సందిగ్ధస్థితి లేకపోయినట్లయితే ప్రమాణహీనమైనా సరే, నలుడనియే నా మానస్సుకు తోస్తుంది. (32)
వయః ప్రమాణం తత్తుల్యం రూపేణ తు విపర్యయః ।
నలం సర్వగుణైర్యుక్తం మన్యే బాహుకమంతతః ॥ 33
ఇరువురికి వయస్సు సమానమైనప్పటికీ రూపంలో తేడా ఉంది. నా మనస్సులో మాత్రం సర్వగుణసమన్వితుడైన నలుడే ఈ బాహుకుడనిపిస్తోంది. (33)
ఏవం విచార్య బహుశః వార్ ష్నేయః పర్యచింతయత్ ।
హృదయేన మహారాజ పుణ్యశ్లోకస్య సారథిః ॥ 34
ధర్మరాజా! పుణ్యశ్లోకుడైన ఋతుపర్ణుని రథసారథియగు వార్ష్ణేయుడు బాహుకుని గూర్చి ఇలా పలివిధాల ఆలోచించాడు. (34)
ఋతుపర్ణశ్చ రాజేంద్ర బాహుకస్య హయజ్ఞాతామ్ ।
చింతయన్ ముముదే రాజా సహవార్ ష్ణేయసారథిః ॥ 35
ధర్మజా! సారధి వార్ష్ణేయునితో కూడిన ఋతుపర్ణమహారాజు బాహుకుని హయతత్త్వజ్ఞతను గూర్చి బాగా యోచించి చాలా సంతోషించాడు. (35)
ఐకాగ్ర్యం చ తథోత్సాహం హయసంగ్రహణం చ తత్ ।
పరం యత్నం చ సంప్రేక్ష్య పరాం ముదమవాప హ ॥ 36
బాహుకుని ఏకాగ్రతను, ఉత్సాహాన్ని, గుర్రాల ఎన్నికల్లో నేర్పరితనాన్ని, ఉత్కృష్టమైన ఆతని ప్రయత్నాన్ని చూసి, ఋతుపర్ణమహారాజు ఎంతో సంతోషాన్ని పొందాడు. (36)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి ఋతుపర్ణవిదర్భగమనే ఏకసప్తతితమోఽధ్యాయః ॥ 71 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నలోపాఖ్యానపర్వమను ఉపపర్వమున నలదమయంతుల సంతానమును ఋతుపర్ణవిదర్భగమనమను డెబ్బది యొకటవ అధ్యాయము. (71)