96. తొంబది ఆరవ అధ్యాయము

వాతాపి, ఇల్వలుల చరిత్ర, అగస్త్యుని వివాహవృత్తాంతము.

వైశంపాయన ఉవాచ
తతః సంప్రస్థితో రాజా కౌంతేయో భూరిదక్షిణః ।
అగస్త్యాశ్రమమాసాద్య దుర్జయాయామువాస హ ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు.
రాజు యుధిష్ఠిరుడు గయాక్షేత్రం నుంచి బయలుదేరి అగస్త్యాశ్రమాన్ని చేరి దుర్జయమణీమతీ నగరాన నివసించసాగాడు. (1)
తత్రైవ లోమశం రాజా పప్రచ్ఛ వదతాం వరః ।
అగస్త్యేనేహ వాతాపిః కిమర్థముపశామితః ॥ 2
యుధిష్ఠిరుడు లోమశుని ప్రశ్నించాడు - అగస్త్యమహర్షి ఈ ప్రదేశాన వాతాపిన ఎట్లు నశింపచేశాడు? (2)
ఆసీద్వా కిం ప్రభావశ్చ స దైత్యో మానవాంతకః ।
కిమర్థం చోదితో మన్యుః అగస్త్యస్య మహాత్మనః ॥ 3
మనుజుల్ని నాశనం చేయగల ఆ రాక్షసుని ప్రభావం ఎలాంటిది? మహాత్ముడైన అగస్త్యుని హృదయంలో అతనిపై ఎట్లు కోపం కలిగింది? (3)
లోమశ ఉవాచ
ఇల్వలో నామ దైతేయః ఆసీత్ కౌరవనందన ।
మణిమత్యాం పురి పురా వాతాపిస్తస్య చానుజః ॥ 4
లోమశుడు చెప్పాడు.
మణిమతీనగరాన పూర్వకాలంలో ఇల్వలుడనే దైత్యరాజు ఉండేవాడు. అతని చిన్నసోదరుడే వాతాపి. (4)
స బ్రాహ్మణం తపోయుక్తమ్ ఉవాచ దితినందనః ।
పుత్రం మే భగవానేకమ్ ఇంద్రతుల్యం ప్రయచ్ఛతు ॥ 5
తస్మై స బ్రాహ్మణో నాదాత్ పుత్రం వాసవసమ్మితమ్ ।
చుక్రోధ సోఽసురస్తస్య బ్రాహ్మణస్య తతో భృశమ్ ॥ 6
తదాప్రభృతి రాజేంద్ర ఇల్వలో బ్రహ్మహాసురః ।
మన్యుమాన్ భ్రాతరం ఛాగం మాయావీ హ్యకరోత్ తతః ॥ 7
మేషరూపీ చ వాతాపిః కామరూప్యభవత్ క్షణాత్ ।
సంస్కత్య చ భోజయతి తతో విప్రం జిఘాంసతి ॥ 8
ఒకరోజున దితికుమారుడు ఇల్వలుడు ఒక తాపసబ్రాహ్మణుని అడిగాడు - మీరు నాకు ఇంద్రసమానుడైన పుత్రుని అనుగ్రహించండి. వెంటనే ఆ విప్రుడు అతని ఇంద్రసమానుడు అయిన పుత్రుని ఇవ్వలేదు. ఈ కారణంగా ఆ రాక్షసునికి ఆ బ్రాహ్మణునిపై కోపం కలిగింది. అప్పటి నుంచి క్రోధపూర్ణుడు ఇల్వలుడు బ్రాహ్మణుల్ని నాశనం చేయసాగాడు. అతడు మాయతో తనసోదరుని మేకలా చేసేవాడు. వాతాపికి స్వేచ్ఛానుసారం రూపాల్ని ధరించ గల సామర్థ్యం ఉమ్డేది. క్షణకాలంలో అతనికి మేక, గొఱ్ఱె మొదలగు రూపాలు వచ్చేవి. ఆ జంతువుగా మారిన వాతాపిని చంపి వండి ఆ బ్రాహ్మణునికి ఇల్వలుడు తినిపించేవాడు. ఆ పై బ్రాహ్మణుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. (5-8)
స చాహ్వయతి యం వాచా గతం వైవస్వతక్షయమ్ ।
స పునర్దేహమాస్థాయ జీవన్ స్మ ప్రత్యదృశ్యత ॥ 9
ఇల్వలుడు యమలోకానికి పోతున్న వానిని ఆ పేరుతో పిలిస్తే వాడు తిరిగి బతికి వచ్చేవాడు. (9)
తతో వాతాపిమసురం ఛాగం కృత్వా సుసంస్కృతమ్ ।
తం బ్రాహ్మణం భోజయిత్వా పునరేవ సమాహ్వయత్ ॥ 10
ఆ రోజున వాతాపిని మేకగా చేసి ఇల్వలుడు ఆ మాంసాన్ని వండి ఆ బ్రాహ్మణునికి తినిపించి తిరిగి వాతాపీ! అని పిలిచేవడు. (10)
తామిల్వలేన మహతా స్వరేణ వాచమీరితామ్ ।
శ్రుత్వాతిమాయో బలవాన్ క్షిప్రం బ్రాహ్మణకంటకః ॥ 11
తస్య పార్శ్వం వినిర్భిద్య బ్రాహ్మణస్య మహాసురః ।
వాతాపిః ప్రహసన్ రాజన్ నిశ్చక్రామ విశాంపతే ॥ 12
మాయావి ఇల్వలునిచే ఉచ్చైఃస్వరంతో పిలిచిన పిలుపుకు వాతాపి తిరిగి ఆ తిన్న బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని నవ్వుతూ బయటకు వచ్చేవాడు. (11,12)
ఏవం స బ్రాహ్మణాన్ రాజన్ భోజయిత్వా పునః పునః ।
హింసయామాస దైతేయ ఇల్వలో దుష్టచేతనః ॥ 13
ఈవిధంగా బ్రాహ్మణుల్ని చంపి తిరిగి వండుకుని ఇద్దరూ ఆరగించేవారు. (13)
అగస్త్వశ్చాపి భగవాన్ ఏతస్మిన్ కాల ఏవ తు ।
పితౄన్ దదర్శ గర్తే వై లంబమానానధోముఖాన్ ॥ 14
ఈ రోజుల్లో పూజ్యుడు అగస్త్యుడు ఉత్తరగతులు లేక గోతిలో అధోముఖంగా వ్రేలాడే తన పితరుల్ని చూశాడు. (14)
సోఽపృచ్ఛల్లంభమానాంస్తాన్ భవంత ఇవ కంపితాః ।
(కిమర్థం వేహ లంబధ్వం గర్తే యూయమధోముఖాః ।)
సంతానహేతోరితి తే ప్రత్యూచుర్ర్బహ్మవాదినః ॥ 15
అలాంటి పితరులను అగస్త్యుడు ఇలా ప్రశ్నించాడు. మీరు ఇక్కడ అధోముఖంగా వ్రేలాడటానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు పితరులు ఇలా బదులు పలికారు."సంతానం కొనసాగకపోవడం వలన మాకీ దుర్గతి పట్టింది" అన్నారు. (15)
తే తస్మై కథయామాసుర్వయం తే పితరః స్వకాః ।
గర్తమేతమనుప్రాప్తాః లంబామః ప్రసవార్థినః ॥ 16
మేము మీ పితృదేవతలం. నీకు సంతానం లేని కారణంగా ఇలా వ్రేలాడుతున్నాం. (16)
యది నో జనయేథాస్త్వమ్ అగస్త్యాపత్యముత్తమమ్ ।
స్యాన్నోఽస్మాన్నిరయాన్మోక్షః త్వం చ పుత్రాప్నుయా గతిమ్ ॥ 17
నీవు మాకొరకు వివాహమాడి సత్సంతానాన్ని పొందితే మాకీ దుర్గతి నశిస్తుంది. నీవూ దీనివలన సద్గతి పొందగలవు. (17)
స తానువాచ తేజస్వీ సత్యధర్మపరాయణః ।
కరిష్యే పితరః కామం వ్యేతు వో మానసో జ్వరః ॥ 18
సత్యధర్మపరాయణుడు తేజస్వి అగస్త్యుడు వారితో ఇలా పలికాడు - మీ కోరికను నేను తీర్చగలను. మీ మానసిక వ్యథ తొలగు గాక! (18)
తతః ప్రసవసంతానం చింతయన్ భగవానృషిః ।
ఆత్మనః ప్రసవస్యార్థే నాపశ్యత్ సదృశీం స్త్రియమ్ ॥ 19
పిమ్మట అగస్త్యుడు సంతానాభిలాషియై తనకు తగిన పుత్రుల్ని గర్భధారణ చేయగల పత్నికోసం వెదకసాగాడు. కాని అతనికి అలాంటి యోగ్యురాలు కనపడలేదు. (19)
స తస్య తస్య సత్త్వస్య తత్ తదంగమనుత్తమమ్ ।
సంగృహ్య తత్సమైరంగైః నిర్మయే స్త్రియముత్తమామ్ ॥ 20
అప్పుడు అగస్త్యమహర్షి ఒక్కొక్క ప్రాణియొక్క ఉత్తమ అవయవాలన్నింటిని ఒక చోటికి చేర్చి వాటితో ఒక సుందరమైన స్త్రీని తయారుచేశాడు. (20)
స తాం విదర్భరాజస్య పుత్రార్థం తప్యతస్తపః ।
నిర్మితామాత్మనోఽర్థాయ మునిః ప్రాదాన్మహాతపాః ॥ 21
అదే సమయాన విదర్భరాజు పుత్రుల కోసం తపస్సు చేస్తూ ఉంటే అగస్త్యుడు తను నిర్మించిన స్త్రీని అతనికి సమర్పించాడు. (21)
సా తత్ర జజ్ఞే సుభగా విద్యుత్ సౌదామనీ యథా ।
విభ్రాజమానా వపుషా వ్యవర్ధత శుభాననా ॥ 22
ఆ సుందరకన్య విదర్భరాజగృహంలో మెరుపులా ఆవిర్భవించింది. ఆమె దివ్యశరీరంతో ప్రకాశిస్తోంది. ఆమె ముఖం చాల అందంగా ఉంది. ఆ కన్య ఆ అంతఃపురంలో దినదిన ప్రవర్ధమానం అవుతోంది. (22)
జాతమాత్రాం చ తాం దృష్ట్వా వైదర్భః పృథివీపతిః ।
ప్రహర్షేణ ద్విజాతిభ్యో న్యవేదయత భారత ॥ 23
విదర్భరాజు ఆమె జనన విషయాన్ని బ్రాహ్మణులందరికీ శుభవార్తగా వినిపించి ఆనందించాడు. (23)
అభ్యనందంత తాం సర్వే బ్రాహ్మణా వసుధాధిప ।
లోపాముద్రేతి తస్యాశ్చ చక్రిరే నామ తే ద్విజాః ॥ 24
ఆ సమయాన రాజును వారు అందరు అభినందించి ఆ కన్యకు లోపాముద్ర అని నామకరణం చేశారు. (24)
వవృధే సా మహారాజ బిభ్రతీ రూపముత్తమమ్ ।
అప్స్వివోత్పలినీ శీఘ్రమ్ అగ్నేరివ శికా శుభా ॥ 25
ఉత్తమ సౌందర్యరాశి ఆ లోపాముద్ర నీటిలోని తామరతీగలా యజ్ఞవేదిలో వెలిగే అగ్నిశిఖలా శీఘ్రంగా పెరగసాగింది. (25)
తాం యౌవసస్థాం రాజేంద్ర శతం కన్యాః స్వలంకృతాః ।
దాస్యః శతం చ కల్యాణీమ్ ఉపాతస్థుర్వశానుగాః ॥ 26
యౌవనంలో ప్రవేశించిన ఆమెను వస్త్రభూషణాలంకారాలు గల వందమంది స్త్రీలు దాసీలు స్వయంగా ఆమె చుట్టూ తిరుగుతూ, అలంకరిస్తూ సేవలు చేయసాగారు. (26)
సా స్మ దాసీశతవృతా మధ్యే కన్యాశతస్య చ ।
ఆస్తే తేజస్వినీ కన్యా రోహిణీవ దివి ప్రభా ॥ 27
దాసీల, కన్యల నడుమ ప్రకాశించే ఆ కన్య ఆకాశంలోని సూర్యకాంతివలె, నక్షత్రాల్లో రోహిణి వలె వెలిగిపోతోంది. (27)
యౌవనస్థామపి చ తాం శీలాచారసమన్వితామ్ ।
వ వవ్రే పురుషః కశ్చిద్ భయాత్ తస్య మహాత్మనః ॥ 28
అగస్త్యుని మీద భయంతో యౌవనదశలో ఉన్న ఆమెను సదాచారశీలాలు గల ఆ స్త్రీని ఎవరూ వరించ సాహసించలేదు. (28)
సా తు సత్యవతీ కన్యా రూపేణాప్సరసోఽప్యతి ।
తోషయామాస పితరం శీలేన స్వజనం తథా ॥ 29
ఆ రాజకుమారి సౌందర్యంలో అప్సరసల్ని మించి ఉంది. శీల, స్వభావాదులచే తల్లిదండ్రుల్ని, బంధువుల్ని సంతృప్తిపరుస్తోంది. (29)
వైదర్భీం తు తథాయుక్తాం యువతీం ప్రేక్ష్య వై పితా ।
మనసా చింతయామాస కస్మై దద్యామిమాం సుతామ్ ॥ 30
అలా ఉంటున్న వైదర్భి (లోపాముద్రను) ని చూసి తండ్రి "ఈమెను ఎవరికి ఇయ్యాలి?" అని మనసులో ఆలోచించాడు. (30)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం అగస్త్యోపాఖ్యానే షణ్ణవతితమోఽధ్యాయః ॥ 96 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్ర యందు అగస్త్యోపాఖ్యానము అను తొంబది ఆరవ అధ్యాయము. (96)
(దాక్షిణాత్య అధికాపాఠము 1/2 శ్లోకము కలిపి మొత్తము 30 1/2 శ్లోకములు)