98. తొంబది ఎనిమిదవ అధ్యాయము

ధనప్రాప్తికై అగస్త్యుడు వివిధరాజుల వద్దకు వెళ్ళుట.

లోమశ ఉవాచ
తతో జగామ కౌరవ్య సోఽగస్త్యో భిక్షితుం వసు ।
శ్రుతర్వాణం మహీపాలం యం వేదాభ్యధికం నృపైః ॥ 1
పిమ్మట ధనాన్ని అడగటానికి అగస్త్యుడు రాజు శ్రుతర్వుని సమీపానికి వెళ్ళాడు. ఆ రాజు అందరికంటె సంపన్నుడు. (1)
స విదిత్వా తు నృపతిః కుంభయోనిముపాగతమ్ ।
విషయాంతే సహామాత్యః ప్రత్యగృహ్ణాత్ సుసత్కృతమ్ ॥ 2
రాజు శ్రుతర్వుడు నావద్దకు అగస్త్యమహర్షి వస్తాడు అని తెలిసి మంత్రులతో రాజ్యపు పొలిమేరకు వచ్చి గొప్పగా గౌరవించి తనతో రాజ్యానికి తీసుకువచ్చాడు. (2)
తస్మై చార్ఘ్యం యథాన్యాయమ్ ఆనీయ పృథివీపతిః ।
పాంచాలిః ప్రయతో భూత్వా పప్రచ్ఛాగమనేఽర్థితామ్ ॥ 3
అగస్త్య ఉవాచ
విత్తార్థినమనుప్రాప్తం విద్ధి మాం పృథివీపతే ।
యథాశక్త్యవిహింస్యాన్యాన్ సంవిభాగం ప్రయచ్ఛ మే ॥ 4
అగస్త్యుడు పలికాడు.
నేను ధనార్థిని అయి మీ వద్దకు వచ్చాను. ప్రాణి హింస చేయకుండా యథాశక్తిగా ఈయగల ధనాన్ని నాకు సమర్పించండి. (4)
లోమశ ఉవాచ
తత ఆయవ్యయౌ పూర్ణౌ తస్మై రాజా న్యవేదయత్ ।
అతో విద్వన్నుపాదత్స్వ యదత్ర వసు మన్యసే ॥ 5
లోమశుడు చెప్పాడు.
రాజశ్రుతర్వుడు అప్పుడు అగస్త్యమహర్షి ఎదుట తన ఆదాయవ్యయ పట్టికను ఉంచి పలికాడు - ఈ ధనంలో మీకు ఎంత తోస్తుందో అంత తీసుకోండి అని. (5)
తత ఆయవ్యయౌ దృష్ట్వా సమౌ సమమతిర్ద్విజః ।
సర్వథా ప్రాణినాం పీడామ్ ఉపాదానాదమన్యత ॥ 6
బ్రహ్మర్షి అగస్త్యుడు బుద్ధితో గ్రహించగలవాడు. ఆదాయవ్యయవిషయాన సమత్వాన్ని గుర్తించి ఇందు కొంతగ్రహించినా ఇతరులకు కష్టం కలుగుతుంది అని తెలిసికొన్నాడు. (6)
స శ్రుతర్వాణమాదాయ బ్రధ్నశ్వమగమత్ తతః ।
స చ తౌ విషయస్యాంతే ప్రత్యగృహ్ణాద్ యథావిధి ॥ 7
అతడు శ్రుతర్వుని తీసుకొని రాజు బ్రధ్నశ్వుని వద్దకు చేరాడు. వారిద్దర్నీ రాజ్యసీమల్లోనే బ్రధ్నశ్వుడు యథావిధిగా సత్కరించి గౌరవించాడు. (7)
తయోరర్ఘ్యం చ పాద్యం చ బ్రధ్నశ్వః ప్రత్యవేదయత్ ।
అనుజ్ఞాప్య చ పప్రచ్ఛ ప్రయోజనముపక్రమే ॥ 8
వారికి అర్ఘ్యపద్యాదుల్ని నివేదించిన పిదప బ్రధ్నశ్వుడు వారి అనుజ్ఞ గైకొని రాకకు కారణం అడిగాడు. (8)
అగస్త్య ఉవాచ
విత్తకామావిహ ప్రాప్తౌ విద్ధ్యావాం పృథివీపతే ।
యతాశక్త్యవిహింస్యాన్యాన్ సంవిభాగం ప్రయచ్ఛ నౌ ॥ 9
అగస్త్యుడు పలికాడు.
ధనార్థులం అయి మేమిద్దరం మీవద్దకు వచ్చాం. ఇతరులకు నష్టం లేకుండా మీదగ్గర ఉన్న ధనాన్ని యథాశక్తి మాకు ఇవ్వండి. (9)
లోమశ ఉవాచ
తత ఆయవ్యయౌ పూర్ణౌ తాభ్యాం రాజా న్యవేదయత్ ।
అతో జ్ఞాత్వా తు గృహ్ణీతం యదత్ర వ్యతిరిచ్యతే ॥ 10
లోమశుడు పలికాడు - పిమ్మట ఆదాయవ్యయాల్ని పూర్తిగా వారిద్దరికీ నివేదించాడు. "బ్రధ్నశ్వుడు మీరు ఇరువురు దీనిలో ఎక్కువ అయిన ధనాన్ని గ్రహించండి" అన్నాడు. (10)
తత ఆయవ్యయౌ దృష్ట్వా సమౌ సమమతిర్ద్విజః ।
సర్వథా ప్రాణినాం పీడామ్ ఉపాదానాదమన్యత ॥ 11
సమబుద్ధిగల అగస్త్యుడు ఆదాయవ్యయాలను చూచి ఎక్కువధనం లేదు అని అందులో కొంతగ్రహించినా ఇతరులకు కష్టం కలుగుతుంది అని గ్రహించాడు. (11)
సమబుద్ధి గల అగస్త్యుడు ఆదాయవ్యయాలను చూచి ఎక్కువధనం లేదు అని అందులో కొంతగ్రహించినా ఇతరులకు కష్టం కలుగుతుంది అని గ్రహించాడు. (11)
పౌరుకుత్సం తతో జగ్ముః త్రసదస్యుం మహాధనమ్ ।
అగస్త్యశ్చ శ్రుతర్వా చ బ్రధ్నశ్వశ్చ మహీపతిః ॥ 12
అప్పుడు అగస్త్యుడు, బ్రధ్నశ్వుడు, శ్రుతర్వుడు ముగ్గురూ కలిసి పురుకుత్సుని కుమారుడు త్రసదస్యుని చేరారు. (12)
తససదస్యుస్తు తాన్ దృష్ట్వా ప్రత్యగృహ్ణాద్ యథావిధి ।
అభిగమ్య మహారాజ విషయాంతే మహామనాః ॥1 3
అర్చయిత్వా యథాన్యాయమ్ ఇక్ష్వాకూ రాజసత్తమః ।
సమాస్తాంశ్చ తతోఽపృచ్ఛత్ ప్రయోజనముపక్రమే ॥ 14
భూపాలశ్రేష్ఠుడు అయిన త్రసదస్యువు వారి ముగ్గుర్ని యథావిధిగా సత్కరించి రాజ్యసీమల్లో గౌరవించాడు. వారందరికీ స్వాగతసత్కారాలు పలికి వారి రాకలోని ఆంతర్యాన్ని అడిగాడు. (13,14)
అగస్త్య ఉవాచ
విత్తకామానిహ ప్రాప్తాన్ విద్ధి నః పృథివీపతే ।
యథాశక్త్యవిహింస్యాన్యాన్ సంవిభాగం ప్రయచ్ఛ నః ॥ 15
అగస్త్యుడు చెప్పాడు -
మేము ధనాన్ని కోరి మీవద్దకు వచ్చాం. మీరు ఇతరులకు కష్టం కలుగకుండ మీధనంలో కొంతభాగాన్ని మాకు ఇవ్వండి. (15)
లోమశ ఉవాచ
తత ఆయవ్యయౌ పూర్ణౌ తేషాం రాజా న్యవేదయత్ ।
ఏతజ్ జ్ఞాత్వా హ్యుపాదధ్వం యదత్ర వ్యతిరిచ్యతే ॥ 16
తత్ ఆయవ్యయౌ దృష్ట్వా సమౌ సమమతిర్ద్విజః ।
సర్వథా ప్రాణినామ్ పీడామ్ ఉపాదానాదమన్యత ॥ 17
లోమశుడు చెప్పాడు.
రాజు త్రసదస్యువు తన ఆదాయవ్యయ వివరాల్ని పూర్తిగా వారికి సమర్పించాడు. దీన్ని తెలిసి మీరు మిగిలిన ధనాన్ని తీసుకోండి అని పలికాడు. సమబుద్ధి గల అగస్త్యుడు ఆదాయవ్యయాల్ని పరిశీలించి సమానంగా ఉన్నాయి అని గ్రహించాడు. ఇందు నుంచి ఏ కొంతగ్రహించినా దానిభారం ఇతరులపై పడుతుంది అని తెలుసుకొన్నాడు. (16,17)
తతః సర్వే సమేత్యాథ తే నృపాస్తం మహామునిమ్ ।
ఇదమూచుర్మహారాజ సమవేక్ష్య పరస్పరమ్ ॥1 8
వారందరు కలిసి ఒకరువేరొకరి వైపు చూస్తూ అగస్త్యమహర్షిని ఉద్దేశించి ఇలా పలికారు. (18)
అయం వై దానివో బ్రహ్మన్నిల్వలో వసుమాన్ భువి ।
తమతిక్రమ్య సర్వేఽద్య వయం చార్థామహే వసు ॥ 19
మహర్షీ! ఇల్వలుడు అనే దానవుడు భూమిపై అందరికంటె ధనవంతుడు. మనము అందరం అతనివద్దకు పోయి నేడు కావలసిన ధనాన్ని అడుగుదాం. (19)
లోమశ ఉవాచ
తేషాం తదాసీదుచితమ్ ఇల్వలస్వైవ భిక్షణమ్ ।
తతస్తే సహితా రాజన్నిల్వలం సముపాద్రవన్ ॥ 20
లోమశుడు చెప్పాడు.
ఆ సమయాన వారికి అందరికి ఇల్వలుని యాచించటమే ఉత్తమం అని తోచింది. వారు అందరు శీఘ్రంగా ఇల్వలుని సమీపానికి వెళ్ళారు. (20)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామగస్త్యోపాఖ్యానే అష్టనవతితమోఽధ్యాయః ॥ 98 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్ర యందు అగస్త్యోపాఖ్యానము అను తొంబది ఎనిమిదవ అధ్యాయము. (98)