105. నూట ఐదవ అధ్యాయము

అగస్త్యుడు సముద్ర జలము త్రాగుట - దేవతలు దైత్యసంహారము చేయుట.

లోమశ ఉవాచ
సముద్రం స సమాసాద్య వారుణిర్భగవానృషిః ।
ఉవాచ సహితాన్ దేవాన్ ఋషీంశ్చైవ సమాగతాన్ ॥ 1
అహం లోకహితార్థం వై పిబామి వరుణాలయమ్ ।
భవద్భిర్యదనుష్ఠేయం తచ్ఛీఘ్రం సంవిధీయతామ్ ॥ 2
లోమశుడు పలికాడు - సముద్రతటాన్ని చేరి మిత్రావరుణుని కుమారుడైన అగస్త్యుడు ఒకచోటికి చేరిన ఋషులు, దేవతలు అందర్నీ ఉద్దేశించి పలికాడు, 'నేను లోక కళ్యాణానికై సముద్రజలాన్ని అంతటినీ త్రాగుతాను. ఇంతలో మీరు చేయాల్సిన పనిని పూర్తిచేయండి.' (1,2)
ఏతావదుక్త్వా వచనం మైత్రావరుణిరచ్యుతః ।
సముద్రమపిబత్ క్రుద్ధః సర్వలోకస్య పశ్యతః ॥ 3
ఎన్నడూ మర్యాదలు అతిక్రమించని అగస్త్యుడు కోపించి, అందరూ చూస్తుండగనే సముద్రజలాన్ని అంతటినీ త్రాగివేశాడు. (3)
పీయమానం సముద్రం తం దృష్ట్వా సేంద్రాస్తదామరాః ।
విస్మయం పరమం జగ్ముః స్తుతిభిశ్చాప్యపూజయన్ ॥ 4
ఇంద్రాదిదేవతలు సముద్రజలపానం చేసిన అగస్త్యుని చూసి ఆశ్చర్యం పొందారు. స్తోత్రలతో ఆయనను పూజించారు. (4)
త్వం నస్త్రాతా విధాతా చ లోకానాం లోకభావన ।
త్వత్ర్పసాదాత్ సముచ్ఛేదం న గచ్ఛేత్ సామరం జగత్ ॥ 5
నీవే మా రక్షకుడవు. లోకాన్ని రాక్షించే శక్తి కలవాడవు. నీ అనుగ్రహంచే అమరులతో కూడిన లోకం నాశనాన్ని పొందరు. (5)
స పూజ్యమానస్త్రిదశైర్మహాత్మా
గంధర్వతూర్యేషు నదత్సు సర్వశః ।
దివ్యైశ్చ పుష్పైరవకీర్యమాణో
మహార్ణవం నిఃసలిలం చకార ॥ 6
గంధర్వుల వాద్యాలు మ్రోగుతున్నాయి. దివ్యపుష్పవృష్టి పడుతోంది. అగస్త్యుడు దేవతలచే పూజింపబడి మహాసముద్రజలాన్ని శూన్యం చేశాడు. (6)
దృష్ట్వా కృతం నిఃసలిలం మహార్ణవం
సురాః సమస్తాః పరమప్రహృష్టాః ।
ప్రగృహ్య దివ్యాని వరాయుధాని
తాన్ దానవాన్ జఘ్నురదీనసత్త్వాః ॥ 7
సముద్రజలం అంతా ఇంకిపోగా దేవతలు ఆనందభరితులు అయ్యారు. భయంలేకుండా దివ్యాయుధాలు గ్రహించి దానవులందర్నీ చంపివేశారు. (7)
తే వధ్యమానాస్త్రిదశైర్మహాత్మభిః
మహాబలైర్వేగిభిరున్నదద్భిః ।
న సేహిరే వేగవతాం మహాత్మనాం
వేగం తదా ధారయితుం దివౌకసామ్ ॥ 8
సింహగర్జనలు చేస్తూ బుద్ధిమంతులు, మహాబలులు అయిన దేవతలు దైత్యులను చంపుతుండగా దైత్యులు దేవతల వేగానికి తట్టుకోలేకపోయారు. (8)
తే వధ్యమానాస్త్రిదశైః దానవా భీమనిఃస్వనాః ।
చక్రుః సుతుములం యుద్ధం ముహూర్తమివ భారత ॥ 9
త్రిదశులచే వధింపబడుతున్న దానవులు భయంకర ధ్వనిచేస్తూ రెండు ఘడియలు పాటు ఘోరయుద్ధాన్ని చేశారు. (9)
తే ఫూర్వం తపసా దగ్ధాః మునిభిర్భావితాత్మభిః ।
యతమానాః పరం శక్త్యా త్రిదశైర్వినిఘాదితాః ॥ 10
మనసుతోనే ఋషులు వారిని పూర్వమే సంహరించారు. తమశక్తిని అంతటిని ఉపయోగించిన దేవతలు తరువాత వారిని చంపారు. (10)
తే హేమనిష్కాభరణాః కుండలాంగదధారిణః ।
నిహతా బహ్వశోభంత పుష్పితా ఇవ కింశుకాః ॥ 11
బంగారు మాలలు కలిగి, కుండలాలు, అంగదాలు కలవారు దేవతలు చంపగా ఎఱ్ఱటి కింశుకవృక్షాల వలె ప్రకాశించారు. (11)
హతశేషాస్తతః కేచిత్ కాలేయా మనుజోత్తమ ।
విదార్య వసుధాం దేవీం పాతాలతలమాస్థితాః ॥ 12
చావగా మిగిలిన కొందరు కాలేయులు భూమిని చీల్చుకొని పాతాళంలోకి ప్రవేశించారు. (12)
విహతాణ్ దానవన్ దృష్ట్వా త్రిదశా మునిపుంగవమ్ ।
తుష్టువుర్వివిధైర్వాక్యైః ఇదం వచనమబ్రువన్ ॥ 13
దానవులందరూ నశించిన పిమ్మట దేవతలు అగస్త్యుని స్తోత్రాలతో కీర్తించి, ఇలా పలికారు. (13)
త్వత్ర్పసాదాన్మహాభాగ లోకైః ప్రాప్తం మహత్ సుఖమ్ ।
త్వత్తేజసా చ నిహతాః కాలేయాః క్రూరవిక్రమాః ॥ 14
'మీ దయచే లోకాలకు చాలా సుఖం కలిగింది. మీ తేజస్సుచే భయంకరులైన కాలకేయులు నశించారు. (14)
పూరయస్వ మహాబాహో సముద్రం లోకభావన ।
యత్ త్వయా సలిలం పీతం తదస్మిన్ పునరుత్సృజ ॥ 15
సముద్రాన్ని తిరిగి జలంతో పూరించండి. మీరు త్రాగిన జలాన్ని తిరిగి విడిచిపెట్టండి.' (15)
ఏవముక్తః ప్రత్యువాచ భగవాన్ మునిపుంగవః ।
(తాంస్తదా సహితాన్ దేవాన్ అగస్త్యః సపురందరాన్ ।)
జీర్ణం తద్ధి మయా తోయమ్ ఉపాయోఽన్యః ప్రచింత్యతామ్ ॥ 16
పూరణార్థం సముద్రస్య భవద్భిర్యత్నమాస్థితైః ।
ఏతచ్ర్ఛుత్వా తు వచనం మహర్షేర్భావితాత్మనః ॥ 17
విస్మితాశ్చ విషణ్ణాశ్చ బభూవః సహితాః సురాః ।
పరస్పరమనుజ్ఞాప్య ప్రణమ్య మునిపుంగవమ్ ॥ 18
మునిశ్రేష్ఠుడై అగస్త్యుడు వారిమాటలు విని ఇంద్రాది దేవతలతో ఇలా అన్నాడు - 'సముద్రజలమంతా నేను జీర్ణం చేసుకొన్నాను. తిరిగి నింపటానికి వేరొక ఉపాయాన్ని ఆలోచించండి' అగస్త్యుని మాటల్ని విని దేవతలు మిక్కిలి ఆశ్చర్యాన్ని, విషాదాన్ని పొందారు. పరస్పరం మాట్లాడుకొని వారంతా అగస్త్యునికి నమస్కరించారు. (16-18)
ప్రజాః సర్వా మహారాజ విప్రజగ్ముర్యథాగతమ్ ।
త్రిదశా విష్ణునా సార్ధమ్ ఉపజగ్ముః పితామహమ్ ॥ 19
ప్రజలంతా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెడలిపోయారు. దేవతలు విష్ణువుతో కలిసి బ్రహ్మదేవుని సమీపానికి చేరారు. (19)
పూరణార్థం సముద్రస్య మంత్రయిత్వా పునః పునః ।
(తే ధాతారముపాగమ్య త్రిదశాః సహ విష్ణునా ।)
ఊచుః ప్రాంజలయః సర్వే సాగరస్యాభిపూరణమ్ ॥ 20
సముద్రాన్ని జలంతో నింపటానికి మరల ఆలోచించి దేవతలు విష్ణువుతో కలిసి బ్రహ్మ సమీపానికి చేరి 'అంజలి ఘటించి' సాగరపూరణాన్ని గురించి ప్రార్థించారు. (20)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామగస్త్యోపాఖ్యానే పంచాధికశతతమోఽధ్యాయః ॥ 105 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున లోమశతీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో అగస్త్యోపాఖ్యానము అను నూట ఐదవ అధ్యాయము. (105)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి 21 శ్లోకాలు)