122. నూట ఇరువది రెండవ అధ్యాయము

చ్యవనమహర్షి సుకన్యను పొందుట.

లోమశ ఉవాచ
భృగోర్మహర్షేః పుత్రోఽభూత్ చ్యవనో నామ భారత ।
సమీపే సరసస్తస్య తపస్తేపే మహాద్యుతిః ॥ 1
స్థాణుభూతో మహాతేజాః వీరస్థానేన పాండవ ।
అతిష్ఠత చిరం కాలమ్ ఏకదేశే విశాంపతే ॥ 2
లోమశుడు చెపుతున్నాడు. పాండవా! భృగుమహర్షి కుమారుడు చ్యవనుడు ఈ సరోవర తీరంలో తపస్సు చేశాడు. ఆయన శరీరం చాలాకాంతితో నిండి ఉంది. తేజస్వియగు చ్యవనుడు వీరాసనంలో కూర్చుండి కొయ్యలా ఉండిపోయాడు. అతడు ఒకేచోట చాలాకాలం కూర్చున్నాడు. (1,2)
స వల్మీకోఽభవదృషిః లతాభిరివ సంవృతః ।
కాలేన మహతా రాజన్ సమాకీర్ణః పిపీలికైః ॥ 3
రాజా! మెల్లమెల్లగా కొంతకాలానికి అతని శరీరాన్ని చీమలు చుట్టుముట్టాయి. ఒళ్ళంతా లతలు అల్లుకొన్నాయి. పైన పుట్ట ఏర్పడింది. (3)
తథా స సంవృతో ధీమాన్ మృత్పిండ ఇవ సర్వశః ।
తప్యతే స్మ తపో ఘోరం వల్మీకేన సమావృతః ॥ 4
ఈ ప్రకారంగా లతలు అల్లుకొనగా బుద్ధిమంతుడైన చ్యవనుడు మట్టిముద్ద వలె కనిపించాడు. పుట్టచే ఆవరింపబడి ఘోరమైన తపస్సు చేయసాగాడు. (4)
అథ దీర్ఘస్య కాలస్య శర్యాతిర్నామ పార్థివః ।
ఆజగామ సరో రమ్యం విహర్తుమిదముత్తమమ్ ॥ 5
తరువాత చాలాకాలానికి శర్యాతి అనే రాజు ఈ ఉత్తమ, సుందరసరోవరానికి విహారానికి వచ్చాడు. (5)
తస్య స్త్రీణాం సహస్రాణి చత్వార్యాసన్ పరిగ్రహే ।
ఏకైవ చ సుతా సుభ్రూః సుకన్యా నామ భారత ॥ 6
అతని అంతఃపుర రాణులు నాలుగువేల మంది ఉన్నారు. కాని సంతానం మాత్రం ఒక్క కూతురే. ఆమె పేరు సుకన్య. (6)
సా సఖీభిః పరివృతా దివ్యాభరణభూషితా ।
చంక్రమ్యమాణా వల్మీకం భార్గవస్య సమాసదత్ ॥ 7
ఆమె సఖురాండ్రతో కలిసి, దివ్యాభరణాలు ధరించి, తిరుగుతూ భార్గవుడైన చ్యవనుడు తపస్సు చేసే పుట్టను చేరింది. (7)
సా వై వసుమతీం తత్ర పశ్యంతీ సుమనోరమామ్ ।
వనస్పతీన్ విచిన్వంతీ విజహార సఖీవృతా ॥ 8
ఆమె ఆ ప్రదేశం సుందర మవటం వలన తదేకంగా చూస్తూ సఖురాండ్రతో కలిసి చెట్ల నుంచి పువ్వులను, ఫలాలను కోస్తూ విహరించింది. (8)
రూపేణ వయసా చైవ మదనేన మదేన చ ।
బభంజ వనవృక్షాణాం శాఖాః పరమపుష్పితాః ॥ 9
తాం సఖిరహితామేకామ్ ఏకవస్త్రామలంకృతామ్ ।
దదర్శ భార్గవో ధీమాన్ చరంతీమివ విద్యుతమ్ ॥ 10
రూపం, వయస్సు, యౌవనమదం, కామభావాలతో కూడిన ఆమె పుష్పించిన వనవృక్షాలశాఖలను విరిచివేసింది. సఖులకు దూరంగా శరీరంపై ఒకే వస్త్రంతో మెరుపుతీగలా కదలుతున్న ఆమెను చ్యవనుడు చూశాడు. (9,10)
తాం పశ్యమానో విజనే స రేమే పరమద్యుతిః ।
క్షామకంఠశ్చ విప్రర్షిః తపోబలసమన్వితః ॥ 11
ఏకాంతంలో ఆమెను చూసిన వెంటనే తేజస్సు, తపోబలం, సన్ననికంఠం గల అతనికి ప్రసన్నత కలిగింది. (11)
తామాబభాషే కల్యాణీం సా చాస్య న శృణోతి వై ।
తతః సుకన్యా వల్మీకే దృష్ట్వా భార్గవచక్షుషీ ॥ 12
కౌతూహలాత్ కంటకేన బుద్ధిమోహబలాత్కృతా ।
కిం ను ఖల్విదమిత్యుక్త్వా నిర్బిభేదాస్య లోచనే ॥ 13
అక్రుధ్యత్ స తయా విద్ధే నేత్రే పరమమన్యుమాన్ ।
తతః శర్యాతిసైన్యస్య శకృన్మూత్రే సమావృణోత్ ॥ 14
తతో రుద్ధే శకృన్మూత్రే సైన్యమానాహ దుఃఖితమ్ ।
తథాగతమభిప్రేక్ష్య పర్యపృచ్ఛత్ స పార్థివః ॥ 15
తపోనిత్యస్య వృద్ధస్య రోషణస్య విశేషతః ।
కేనాపకృతమద్యేహ భార్గవస్య మహాత్మనః ॥ 16
జ్ఞాతం వా యది వాజ్ఞాతం తద్ ద్రుతం బ్రూత మా చిరమ్ ।
తమూచుః సైనికాః సర్వే న విద్మోఽపకృతం వయమ్ ॥ 17
ఆ చ్యవనమహర్షి ఆమెను పుట్టలోంచే పిలిచాడు. ఆమె అతని కంఠం సన్నగా ఉన్నందున ఆ ధ్వని వినలేదు. ఆ పుట్టల్ మెరుస్తున్న భార్గవుని కళ్లను చూచి ఆమెకు కుతూహలం ఏర్పడింది. ఆ కుతూహలంతో ఆమె బుద్ధిని మొహం ఆవరించగా 'ఇది ఏమిటి' అనుకొంటూ దగ్గరలో ఉన్న ముల్లుతో అతని కళ్ళను పొడిచింది. వెంటనే అతడు కోపంతో పైకి లేచాడు. శర్యాతి సైన్యానికి చ్యవనుడు మలమూత్రబంధనం చేశాడు. మలమూత్రాలు బంధింపబడగా ఆసేనకంతకూ దుఃఖం కలిగింది. సేనను అంతటినీ ఆ రాజు పిలిచి అడిగాడు. 'తపశ్శాలి, వృద్ధుడు, కోపపరాయణుడు, మహాత్ముడు అయిన చ్యవనునియెడ ఎవరు అపరాధం చేశారు? తెలిసి గాని తెలియకగాని ఎవరు ఆయన పట్ల అపచారం చేశారో శీఘ్రంగా చెప్పండి.' సైనికులందరూ ఒక్కసారిగా "ఆయనకు ఎవరు అపకారం చేశారో మాకు తెలియదు. (12-17)
సర్వోపాయైర్యథాకామం భవాంస్తదధిగచ్ఛతు ।
తతః స పృథివీపాలః సామ్నా చోగ్రేణ చ స్వయమ్ ॥ 18
పర్యపృచ్ఛత్ సుహృద్వర్గం పర్యజానన్నచైవ తే ।
ఆనాహార్తం తతో దృష్ట్వా తత్సైన్యమసుఖార్దితమ్ ॥ 19
పితరం దుఃఖితం దృష్ట్వా సుకన్యేదమథాబ్రవీత్ ।
మయాటంత్యేహ వల్మీకే దృష్టం సత్త్వమభిజ్వలత్ ॥ 20
ఖద్యోతవదభిజ్ఞాతం తన్మయా విద్ధమంతికాత్ ।
ఏతచ్ర్ఛుత్వా తు వల్మీకం శర్యాతిస్తూర్ణమభ్యయాత్ ॥ 21
తత్రాపశ్యత్ తపోవృద్ధం వయోవృద్ధం చ భార్గవమ్ ।
అయాచదథ సైన్యార్థం ప్రాంజలిః పృథివీపతిః ॥ 22
మీరు అన్ని ఉపాయాలు ప్రయోగిమ్చి మీ అభీష్టం మేరకు దోషిని కనిపెట్టండి.' అన్నారు. అటుపైన రాజు శర్యాతి సామ, దండోపాయాలతో ప్రయత్నించినా స్నేహితుల నుంచి కూడ అపరాధి జాడ తెలియలేదు. సైనికుల మలమూత్రావరోధకారణం తెలియక దుఃఖిస్తున్న తండ్రిని, దుఃఖిస్తున్న సైన్యాన్ని చూచి సుకన్య
తండ్రితో 'వనంలో సంచరిస్తున్న నేను మెరిసిపోయే ప్రాణికండ్లను చూసి, మిణుగురు పురుగులనుకొని, సమీపానికి పోయి, ముల్లుతో పొడిచాను.' అంది. ఇది విన్న శర్యాతి వేగంగా పుట్టవద్దకు చేరుకొన్నాడు. అక్కడ వయోవృద్ధుడు, తపోవృద్ధుడు అయిన చ్యవనుని చూసి సైన్యప్రాణరక్షణం కోసం అంజలి ఘటించి రాజు ఆయనను ప్రార్థించాడు. (18-22)
అజ్ఞానాద్ బాలయా యత్ తే కృతం తత్ క్షంతుమర్హసి ।
తతోఽబ్రవీన్మహీపాలం చ్యవనో భార్గవస్తదా ॥ 23
అపమానాదహం విద్ధః హ్యనయా దర్పపూర్ణయా ।
రూపౌదార్యసమాయుక్తాం లోభమోహబలాత్కృతామ్ ॥ 24
తామేవ ప్రతిగృహ్యాహం రాజన్ దుహితరం తవ ।
క్షంస్యామీతి మహిపాల సత్యమేతద్ బ్రవీమి తే ॥ 25
'అజ్ఞానకారణంగా తమపట్ల తప్పుచేసిన బాలికయైన నా కుమార్తెను మీరు క్షమించండి.' అపుడు రాజుతో చ్యవనుడు ఇలా పలికాడు. 'అహంకారంతో అవమానించాలని ఈమె నా కన్నులను పొడిచింది. రూపం, ఔదార్యం కల్గి, లోభమోహాలకు లొంగిన ఆమెనే వివాహమాడి క్షమించగలను. నీతో సత్యాన్ని పలుకుతున్నాను.' (23-25)
లోమశ ఉవాచ
ఋషేర్వచనమాజ్ఞాయ శర్యాతిరవిచారయన్ ।
దదౌ దుహితరం తస్మై చ్యవనాయ మహాత్మనే ॥ 26
లోమశుడు అన్నాడు - ఋషి మాటలు విన్న శర్యాతి మరో ఆలోచన లేకుండా మహాత్ముడైన చ్యవనునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. (26)
ప్రతిగృహ్య చ తాం కన్యాం భగవాన్ ప్రససాద హ ।
ప్రాప్తప్రసాదో రాజా వై ససైన్యః ప్పురమావ్రజత్ ॥ 27
ఆ కన్యను గ్రహించి చ్యవనుడు రాజును అనుగ్రహించాడు. ఆయన కృపను పొంది రాజు సైన్యంతో సహా తన పట్టణానికి తిరిగి చేరుకొన్నాడు. (27)
సుకన్యాపి పతిం లబ్ధ్వా తపస్వినమనిందితా ।
నిత్యం పర్యచరత్ ప్రీత్యా తపసా నియమేవ చ ॥ 28
సుకన్య నిందకు దూరమై, తాపసి అయిన భర్తను పొంది, తపస్సుతో, నియమాలతో భర్తను సేవించింది. (28)
అగ్నీనామతిథీనాం చ శుశ్రూషురనసూయికా ।
సమారాధయత క్షిప్రం చ్యవనం సా శుభాననా ॥ 29
అగ్నులను, అతిథులను, అసూయలేకుండా భర్తనూ సేవిస్తూ ఆ శుభానన చ్యవనుని ఆరాధించింది. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌకన్యే ద్వావింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 122 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌకన్యమను నూట ఇరువది రెండవ అధ్యాయము. (122)