131. నూట ముప్పది ఒకటవ అధ్యాయము

డేగకు శిబి తనశరీర మాంసము ఇచ్చి పావురమును రక్షించుట.

శ్యేన ఉవాచ
ధర్మాత్మానం త్వాహురేకం సర్వే రాజన్ మహీక్షితః ।
సర్వధర్మవిరుద్ధం త్వం కస్మాత్ కర్మ చికీర్షసి ॥ 1
విహితం భక్షణం రాజన్ పీడ్యమానస్య మే క్షుధా ।
మా రక్షీర్ధర్మలోభేన ధర్మముత్సృష్టవానసి ॥ 2
డేగ పలికింది - రాజా! రాజులు అందరిలో నీవే ధర్మాత్ముడవు అని పెద్దలు చెబుతున్నారు. కాని నీవు ధర్మానికి విరుద్ధం అయిన పని ఎలా చెయ్యాలి అనుకొంటున్నావు? ఆకలిచే బాధపడే మాకు ఈ పావురం భక్ష్యపదార్థంగా నిర్ణయింపబడింది. నీవు ధర్మలోభంతో దీన్ని రక్షించకు. నిజానికి నీవు దీనికి ఆశ్రమం ఇచ్చి ధర్మలోపం చేస్తున్నావు. (1,2)
రాజోవాచ
సంత్రస్తరూపస్త్రాణార్థీ త్వత్తో భీతో మహాద్విజ ।
మత్సకాశమనుప్రాప్తః ప్రాణగృధ్నురయం ద్విజః ॥ 3
ఏవమభ్యాగతస్యేహ కపోతస్యాబయార్థినః ।
అప్రదానే పరం ధర్మం కథం శ్యేన న పశ్యసి ॥ 4
రాజు పలికాడు - ఈ పావురం నీకు భయపడి, మిక్కిలి వణకుతూ ప్రాణరక్షణ కోరి నన్ను చేరింది. ఇది తన ప్రాణరక్షణ కోరింది. ఈ విధంగా అభయాన్ని కోరి ఆకస్మాత్తుగా వచ్చిన పావురానికి రక్షణ కల్పించడమే పరమధర్మం. దీన్ని ఎందుకు నీవు గుర్తించలేకపోతున్నావు? (3,4)
ప్రస్పందమానః సంభ్రాంతః కపోతః శ్యేన లక్ష్యతే ।
మత్సకాశం జీవితార్థీ తస్య త్యాగో విగర్హితః ॥. 5
యో హి కశ్చిద్ ద్విజాన్ హన్యాద్ గాం వా లోకస్య మాతరమ్ ।
శరణాగతం చ త్యజతే తుల్యం తేషాం హి పాతకమ్ ॥ 6
పావురం దీనంగా మాటిమాటికి వణుకుతోంది. చూడు, నా సమీపానికి ప్రాణరక్షణకై వచ్చింది. దీన్ని విడవటం వలన నింద కలుగుతుంది. బ్రాహ్మణుని చంపినవాడి పాపం, జగన్మాత గోవును చంపినవాడి పాపం, శరణు కోరిన వాడిని విడవటంతో వచ్చిన పాపమూ సమానం. (5,6)
శ్యేన ఉవాచ
ఆహారాత్ సర్వభూతాని సంభవంతి మహీపతే ।
ఆహారేణ వివర్ధంతే తేన జీవంతి జంతవః ॥ 7
డేగ పలికింది - రాజా! ప్రాణులన్నీ ఆహారంతో వృద్ధి చెందుతాయి. ఆహారాన్ని బట్టే పెరుగుదల, ప్రాణమూ ఏర్పడుతున్నాయి. (7)
శక్యతే దుస్త్యజేఽప్యర్థే చిరరాత్రాయ జీవితుమ్ ।
న తు భోజనముత్సృజ్య శక్యం వర్తయితుం చిరమ్ ॥ 8
ఏది విడవటం కష్టమో, దాన్ని విడచి చాలా రోజులు జీవించగలడు. ఆహారాన్ని విడచి మాత్రం చిరకాలం జీవించలేడు. (8)
భక్ష్యాద్ వియోజితస్యాద్య మమ ప్రాణా విశాంపతే ।
విసృజ్య కాయమేష్యంతి పంథానమకుతోభయమ్ ॥ 9
ప్రమృతే మయి ధర్మాత్మన్ పుత్రదారాది నంక్ష్యతి ।
రక్షమాణః కపోతం త్వం బహూన్ ప్రాణాన్ న రక్షసి ॥ 10
నేడు మీ కారణంగా నా భోజనం నాకు దక్కలేదు. కావున నా ప్రాణాలు నన్ను విడచి మృత్యులోకం చేరతాయి. నాకు మృత్యువు రాగా నా కుటుంబం అంతా నశిస్తుంది. ఒక్కపావురాన్ని రక్షించి చాలమందిని చంపుతున్నావు. (9,10)
ధర్మం యో బాధతే ధర్మః న స ధర్మః కుధర్మ తత్ ।
అవిరోధాత్ తు యో ధర్మః స ధర్మః సత్యవిక్రమ ॥ 11
ఎవని ధర్మం పరులధర్మాన్ని బాధిస్తుందో అది చెడ్డ ధర్మం. అసలు ధర్మమే కాదు. పరధర్మానికి విరోధం కాని ధర్మమే ధర్మం. (11)
విరోధిషు మహీపాల నిశ్చిత్య గురులాఘవమ్ ।
న బాధా విద్యతే యత్ర తం ధర్మం సముపాచరేత్ ॥ 12
రాజా! పరస్పరం ప్రతికూలధర్మాలు ఎదురుపడినప్పుడు గురు-లాఘవచర్చ చెయ్యాలి. ఇద్దరికీ బాధలేని ధర్మాన్ని ఆచరించాలి. (12)
గురులాఘవమాదాయ ధర్మాధర్మవినిశ్చయే ।
యతో భూయంస్తతో రాజన్ కురుష్వ ధర్మనిశ్చయమ్ ॥ 13
రాజా! ధర్మాధర్మనిర్ణయం చేసే సమయంలో గురు, (ఎక్కువ) లాఘవ (తక్కువ) విధానం పై దృష్టి ఉంచాలి. దేని వల్ల ఎక్కువ పుణ్యం కలుగుతుందో దాన్ని ఆచరించాలి. (13)
రాజోవాచ
బహుకల్యాణసంయుక్తం భాషసే విహగోత్తమ ।
సుపర్ణ పక్షిరాట్ కిం త్వం ధర్మజ్ఞశ్చాస్యసంశయమ్ ॥ 14
పక్షిరాజా! నీవు చాలా శుభప్రదంగా మాట్లాడుతున్నావు - నీవు గరుత్మంతుడవా? నీవు ధర్మజ్ఞుడవే. సందేహం లేదు. (14)
తథా హి ధర్మసంయుక్తం బహు చిత్రం చ భాషసే ।
న తేఽస్త్యవిదితం కించిద్ ఇతి త్వాం లక్షయామ్యహమ్ ॥ 15
నీ మాటలన్నీ చిత్రంగాను, ధర్మబద్ధంగాను ఉన్నాయి. నీకు తెలియని ధర్మం లోకంలో లేదని తెలుసుకొన్నాను. (15)
శరణైషిపరిత్యాగం కథం సాధ్వితి మన్యసే ।
ఆహారార్థం సమారంభః తవ చాయం విహంగమ ॥ 16
శరణాగతులను విడిచిపెట్టడం మంచిది అని ఎలా అనుకొంటున్నావు. ఆహారం కోసమే నీ ప్రయత్నం అంతా. (16)
శక్యశ్చాప్యన్యథా కర్తుమ్ ఆహారోఽప్యధికస్త్వయా ।
గోవృషో వా వరాహో వా మృగో వా మహిషోఽపి వా ।
త్వదర్థమద్య క్రియతాం యచ్చాన్యదిహ కాంక్షసి ॥ 17
నీ కొరకు ఆహారం వేరే రూపంలో కల్పించటానికి వీలు అవుతుంది. అది ఈ పావురం కంటే ఎక్కువే. గోవు, ఆబోతు, పంది, లేడి, దున్న ఏదైనా కోరుకో. లేదా దానితో సమానం అయిన వేరొకటి కోరుకో. (17)
శ్యేన ఉవాచ
న వరాహం న చోక్షాణం న మృగాన్ వివిధాంస్తథా ।
భక్షయామి మహారాజ కిం మమాన్యేన కేనచిత్ ॥ 18
డేగ పలికింది - నేను పందిని తినను. లేళ్ళను గాని అంతకంటె గొప్పవాటిని గాని తినను. దొరికిన ప్రాణికంటె వేరొకదానితో నాకు పని ఏమి? (18)
యస్తు మే దేవవిహితః భక్షః క్షత్రియపుంగవ ।
తముత్సృజ మహీపాల కపోతమిమమేవ మే ॥ 19
రాజోత్తమా! ఇది నాకు దేవతలచే ఇవ్వబడిన ఆహారం. దాన్ని నాకోసం విడచిపెట్టు. (19)
శ్యేనః కపోతానత్తీతి స్థితిరేషాం సనాతనీ ।
మా రాజన్ సారమజ్ఞాత్వా కదలీస్కంధమాశ్రయ ॥ 20
రాజా! డేగ పావురాలను తినటం అనాదిగా వస్తున్న ఆచారం. ధర్మతత్త్వాన్ని తెలియక అరటిబోదె (సారహీన ధర్మం) ను ఆశ్రయించవద్దు. (20)
రాజోవాచ
రాష్ట్రం శిబీనామృద్ధం వై దదాని తవ ఖేచర ।
యం వా కామయసే కామం శ్యేన సర్వం దదాని తే ॥ 21
రాజు చెప్పాడు - శిబి వంశీయుల సమృద్ధం అయిన రాజ్యాన్ని నీకు అర్పిస్తాను. ఏ వస్తువును నీవు కోరితే దాన్ని సమకూరుస్తాను. (21)
వినేమం పక్షిణం శ్యేన శరణార్థినమాగతమ్ ।
యేనేమం వర్జయేథాస్త్వం కర్మణా పక్షిసత్తమ ।
తదాచక్ష్వ కరిష్యామి న హి దాస్యే కపోతకమ్ ॥ 22
శరణు కోరి వచ్చిన ఈ పావురాన్ని మాత్రం విడువను. ఏ కోరిక తీరిస్తే దీన్ని విడుస్తావో ఆ కోరిక కోరుకో. తీరుస్తాను. పావురాన్ని మాత్రం ఇవ్వను. (22)
శ్యేన ఉవాచ
ఉశీనర కపోతే తే యది స్నేహో నరాధిప ।
ఆత్మనో మాంసముత్కృత్య కపోతతులయా ధృతమ్ ॥ 23
యదా సమం కపోతేన తవ మాంసం నృపోత్తమ ।
తదా దేయం తు తన్మహ్యం సా మే తుష్టిర్భవిష్యతి ॥ 24
డేగ పలికింది - రాజా! నీవు దీనిపై ప్రేమతో ఉన్నట్లయితే దీని శరీరమాంసానికి సమానమయిన మాంసాన్ని నీ శరీరం నుండి కోసి ఇయ్యి. ఈ త్రాసులో పావురం మాంసంతో నీ శరీర మాంసం సమానం అయితే దాన్ని ఇస్తే చాలు. నాకు తృప్తి కలుగుతుంది. (23,24)
రాజోవాచ
అనుగ్రహమిమం మన్యే శ్యేన యన్మాభియాచసే ।
తస్మాత్ తేఽద్య ప్రదాస్యామి స్వమాంసం తులయా ధృతమ్ ॥ 25
రాజు పలికాడు - డేగా! నీవు నా మాంసాన్ని కోరటమే నాపై అనుగ్రహాన్ని చూపినట్లు భావిస్తాను. ఇప్పుడే నా శరీర మాంసాన్ని కోసి, తూచి ఇస్తాను. (25)
లోమశ ఉవాచ
ఉత్కృత్య స స్వయం మాంసం రాజా పరమధర్మవిత్ ।
తోలయామాస కౌంతేయ కపోతేన సమం విభో ॥ 26
లోమశుడు పలికాడు - కౌంతేయా! శ్రేష్ఠధర్మవేత్త అయిన శిబిచక్రవర్తి తన మాంసాన్ని స్వయంగా కోసి పావురాన్ని తూచటం ప్రారంభించాడు. (26)
ధ్రియమాణః కపోతస్తు మాంసేనాత్యతిరిచ్యతే ।
పునశ్చోత్కృత్య మాంసాని రాజా ప్రాదాదుశీనరః ॥ 27
న విద్యతే యదా మాంసం కప్తేన సమంధృతమ్ ।
తత ఉత్కృత్తమాంసోఽసౌ ఆరురోహ స్వయం తులామ్ ॥ 28
మాంసం వేసేకొద్దీ రెండవపళ్ళెంలోని పావురం బరువు పెరగసాగింది. మళ్ళీమళ్ళీ కోసి వేయసాగాడు రాజు. ఎంత మాంసం శరీరం నుంచి కోసివేసినా అది పావురంతో సమానం కాలేదు. వెంటనే రాజు స్వయంగా తనే లేచి వచ్చి త్రాసుతో కూర్చున్నాడు. (27,28)
శ్యేన ఉవాచ
ఇంద్రోఽహమస్మి ధర్మజ్ఞ కపోతో హవ్యవాడయమ్ ।
జిజ్ఞాసమానౌ ధర్మం త్వాం యజ్ఞవాటముపాగతౌ ॥ 29
డేగ పలికింది - ధర్మస్వరూపా! నేను ఇంద్రుడను. ఇతడు అగ్ని. నీ ధర్మాచరణాన్ని తెలియగోరి యజ్ఞశాలకు వచ్చాము. (29)
యత్ తే మాంసాని గాత్రేభ్యః ఉత్కృత్తాని విశాంపతే ।
ఏషా తే భాస్వతీ కీర్తిః లోకానభిభవిష్యతి ॥ 30
నీ శరీరం నుంచి మాంసాన్ని కోసి సమర్పించటం వలన ప్రకాశించే నీ కీర్తి లోకాలన్నింటిని దాటి పెరుగుతోంది. (30)
యావల్లోకే మనుష్యాస్త్వాం కథయిష్యంతి పార్థివ ।
తావత్ కీర్తిశ్చ లోకాశ్చ స్థాస్యంతి తవ శాశ్వతాః ॥ 31
భూలోకంలో మనుష్యులు చెప్పుకొన్నంత వరకు నీ పేరు, నీ కీర్తి చిరస్థాయిగా ఉంటాయి. (31)
ఇత్యేవముక్త్వా రాజానమ్ ఆరురోహ దివం పునః ।
ఉశీనరోఽపి ధర్మాత్మా ధర్మేణావృత్య రోదసీ ॥ 32
విభ్రాజమానో వపుషాప్యారురోహ త్రివిష్టపమ్ ।
తదేతత్ సదనం రాజన్ రాజ్ఞస్తస్య మహాత్మనః ॥ 33
పశ్యస్వైతన్మయా సార్ధం పుణ్యం పాపప్రమోచనమ్ ।
తత్ర వై సతతం దేవా మునయశ్చ సనాతనాః ।
దృశ్యంతే బ్రాహ్మణై రాజన్ పుణ్యవద్భిర్మహాత్మభిః ॥ 34
ఆ విధంగా పలికి ఇంద్రుడు స్వర్గానికి చేరాక ఉశీనరరాజు శిబి కూడ భూమ్యాకాశాలను వ్యాపించి దేదీప్యమాన శరీరంతో స్వర్గానికి చేరాడు. రాజా! ఆ మహాత్ముని ఆశ్రమం ఇదే. ఈ పవిత్ర ఆశ్రమాన్ని నీవు నేను కలిసి చూద్దాం. దీనివల్ల పాపం నశిస్తుంది. ఆ రాజు ఎల్లప్పుడు బ్రాహ్మణులకు, సనాతన దేవతలకు, మునులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. (32-34)
ఇది శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి
లోమశతీర్థయాత్రాయాం శ్యేనకపోతీయే ఏకత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 131 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో శ్యేనకపోతీయము అను నూట ముప్పది ఒకటవ అధ్యాయము. (131)