133. నూట ముప్పది మూడవ అధ్యాయము

అష్టావక్రుడు ద్వారపాలకునితో, జనకునితో మాట్లాడుట.

అష్టావక్ర ఉవాచ
అందస్య పంథా బధిరస్య పంథాః
స్త్రియః పంథా భారవాహస్య పంథాః ।
రాజ్ఞః పంథా బ్రాహ్మణేనాసమేత్య
సమేత్య తు బ్రాహ్మణస్యైవ పంథాః ॥ 1
అష్టావక్రుడు పలికాడు. - బ్రాహ్మణుడు మార్గంలో లేనప్పుడు, అంధునికి, చెవిటివానికి, స్త్రీలకు, బరువుమోసేవానికి, రాజుకూ మార్గం ఇవ్వాలి. బ్రాహ్మణుడు ఆ మార్గంలోకి వస్తే ముందుగా అతనికే మార్గం కల్పించాలి. (1)
రాజోవాచ
పంథా అయం తేఽద్య మయాతిదిష్టో
యేనేచ్ఛసి తేన కామం వ్రజస్వ ।
న పావకో విద్యతే వై లఘీయాన్
ఇంద్రోఽపి నిత్యం నమతే బ్రాహ్మణానామ్ ॥ 2
రాజు పలికాడు - నేను నీకోసం మార్గాన్ని ఇస్తున్నాను. ఏ దారి నీకిష్టమైతే దానిలో సంచరించు. అగ్ని చిన్నదైనా తేలికగా చూడరాదు. బ్రాహ్మణులకు ఇంద్రుడైనా నమస్కరిస్తాడు. (2)
అష్టావక్ర ఉవాచ
ప్రాప్తౌ స్వ యజ్ఞం నృప సందిదృక్షూ
కౌతూహలం నౌ బలవన్నరేంద్ర ।
ప్రాప్తావిహావామతిథీ ప్రవేశం
కాంక్షావహే ద్వారపతేస్తవాజ్ఞామ్ ॥ 3
అష్టావక్రుడు పలికాడు - మేము ఇద్దరం నీ యజ్ఞం చూడాలని వచ్చాం. మాకు కోరిక చాలాబలంగా ఉంది. మేము అతిథులుగా వచ్చాం. నీ యజ్ఞంలో ప్రవేశించడానికి ద్వారపాలకునికి అనుజ్ఞ ఇయ్యి అని కోరుతున్నాం. (3)
ఐంద్రద్యుమ్నే యజ్ఞదృశావిహావాం
వివక్షూ వై జనకేంద్రం దిదృక్షూ ।
తౌ వై క్రోధవ్యాధినా దహ్యమానౌ
అయం చ నౌ ద్వారపాలో రుణద్ధి ॥ 4
మేము ఇరువురం ఈ యజ్ఞాన్ని దర్శించడానికి వచ్చాం. పైగా జనకునితో కలిసి మాట్లాడ గోరుతున్నాం. ఈ ద్వారపాలుడు మమ్ము అడ్డగిస్తున్నాడు. మేం కోపంతో మండిపోతున్నాం. (4)
ద్వారపాల ఉవాచ
బందేః సమాదేశకరా వయం స్మ
నిబోధ వాక్యం చ మయేర్యమాణమ్ ।
న వై బాలాః ప్రవిశ్యంత్యత్ర విప్రాః
వృద్ధాః విదగ్ధాః ప్రవిశ్యంత్యత్ర విప్రాః ॥ 5
ద్వారపాలకుడు పలికాడు.
మేము బంది ఆజ్ఞను పాలించేవారం. మేం చెప్పే మాట మీరు వినండి. యజ్ఞశాలలో బ్రాహ్మణబాలకులు ప్రవేశింప వీలుకాదు. వృద్ధులు, బుద్ధిమంతులు అయిన బ్రాహ్మణులే ప్రవేశించాలి. (5)
అష్టావక్ర ఉవాచ
యద్యత్ర వృద్ధేషు కృతః ప్రవేశః
యుక్తం ప్రవేష్టుం మమ ద్వారపాల ।
వయం హి వృద్ధాశ్చరితవ్రతాశ్చ
వేదప్రభావేణ సమన్వితాశ్చ ॥ 6
అష్టావక్రుడు పలికాడు - ఈ యజ్ఞశాల వృద్ధుల కోసం తెరిస్తే అప్పుడు అయినా మమ్మల్ని ప్రవేశించనివ్వాలి. మేము వృద్ధులం. తపస్సంపన్నులం, బ్రహ్మచర్య నియమంతో ఉన్నాం. వేదప్రభావం మాపై ఉంది. (6)
శుశ్రూషవశ్చాపి జితేంద్రియాశ్చ
జ్ఞానాగమే చాపి గతాః స్మ నిష్ఠామ్ ।
న బాల ఇత్యవమంతవ్యమాహుః
బాలోఽప్యగ్నిర్దహతి స్పృశ్యమనః ॥ 7
మేం పెద్దవారిని సేవిస్తాం. ఇంద్రియనిగ్రహం, కల వాళ్లం, జ్ఞానశాస్త్రంలో ఆరితేరినవారం. వయస్సును బట్టి చిన్నవాడని బ్రాహ్మణులను అవమానింపరాదు. చిన్న అగ్నికణం కూడ తాకినప్పుడు కాలుతుంది. (7)
ద్వారకపాల ఉవాచ
సరస్వతీమీరయ వేద జుష్టామ్
ఏకాక్షరాం బహురూపాం విరాజమ్ ।
అంగాత్మానం సమవేక్ష్యస్వ బాలం
కిం శ్లాఘసే దుర్లభో వై మనీషీ ॥ 8
ద్వారపాలకుడు పలికాడు. ఏకాక్షర బ్రహ్మను బోధించే అనేక రూపాలు గల సరస్వతీరూపమైన వాక్కు నీకు తెలిస్తే చెప్పు. నీవు నిన్ను బాలకునిగా తెలుసుకో. స్వయంగా ఎందుకు ప్రశంసించుకొంటున్నావు? విద్వాంసుడు ఈ లోకంలో దుర్లభుడు. (8)
అష్టావక్ర ఉవాచ
న జ్ఞాయతే కాయవృద్ధ్యా వివృద్ధిః
యథా ష్ఠీలా శాల్మలేః సంప్రవృద్ధా ।
హ్రస్వోఽల్పకాయః ఫలితో వివృద్ధః
యశ్చాఫలస్తస్య న వృద్ధభావః ॥ 9
అష్టావక్రుడు పలికాడు. - శరీరం పెరిగితే జ్ఞానం పెరగదు. బూరుగు విత్తనం పెరిగేకొద్దీ సారం లేనిది అవుతుంది. చిన్న చెట్టైనా పండ్లు, కాయలు ఎక్కువగా ఉంటే అదే పెద్ద చెట్టు. ఫలాలు లేని చెట్లు పెరిగినా వ్యర్థమే. (9)
ద్వారపాల ఉవాచ
వృద్ధేభ్య ఏవేహ మతిం స్మ బాలా
గృహ్ణంతి కాలేన భవంతి వృద్ధాః ।
న హి జ్ఞానమల్పకాలేన శక్యం
కస్మాద్ బాలః స్థవిర ఇవ ప్రభాషసే ॥ 10
ద్వారపాలకుడు పలికాడు - బాలకులు వృద్ధుల నుంచే బుద్ధిని నేర్చుకొని కాలంతో వృద్ధులు అవుతారు. కొలదికాలంలో జ్ఞానం సంపాదించటం అసంభవం. నివు బాలుడవై వృద్ధునివలె ఎందుకు మాట్లాడుతున్నావు? (10)
అష్టావక్ర ఉవాచ
న తేన స్థవిరో భవతి యేనాస్య పలితం శిరః ।
బాలోఽపి యః ప్రజానాతి తం దేవాః స్థవిరం విదుః ॥ 11
అష్టావక్రుడు పలికాడు. జుట్టు నెరిసినంత మాత్రాన వృద్ధుడు కాలేడు. బాలుడైనా జ్ఞాని అయితే దేవతలు అతనిని వృద్ధుడని కీర్తిస్తున్నారు. (11)
న హాయనైర్న పలితైః న విత్తేన న బంధుభిః ।
ఋషయశ్చక్రిరే ధర్మం యోఽనూచానః స నో మహాన్ ॥ 12
వయస్సుచే, ధనంచే, బంధువులు ఎక్కువగా ఉండటంచే వృద్ధుడుగా లెక్కింపబడడు. అనూచానంగా మహర్షులు ఏర్పరచిన ధర్మమార్గమే మాకు గొప్పది. (12)
దిదృక్షురస్మి సంప్రాప్తః బందినం రాజసంసది ।
నివేదయస్వ మాం ద్వాఃస్థ రాజ్ఞే పుష్కరమాలినే ॥ 13
రాజసభలో బందిని చూడగోరి వచ్చాను. ద్వారాపాలకా! కమలాల మాలనుభరించే జనకునికి నా రాకను తెలియజెయ్యి. (13)
ద్రష్టాస్యద్య వదతోఽస్మాన్ ద్వారపాల మనీషిభిః ।
సహ వాదే వివృద్ధే తు బందినం చాపి నిర్జితమ్ ॥ 14
నేడు నీవు విద్వాంసులతో శాస్త్రచర్చ చేసే మమ్ములను చూస్తావు. వాద ముదిరి బంది కూడా ఓడిపోవటం గమనిస్తావు. (14)
పశ్యంతు విప్రాః పరిపూర్ణవిద్యాః
సహైవ రాజ్ఞా సపురోధముఖ్యాః ।
ఉతాహో వాప్యుచ్చతాం నీచతాం వా
తూష్ణీంభూతేష్వేవ సర్వేష్వథాద్య ॥ 15
వేదవేదాంగనిపుణులైన బ్రాహ్మణులు, పురోహితులు జనకుడు, విద్వాంసులు నా శ్రేష్ఠత్వాన్నిగాని, లఘుత్వాన్నిగాని నేడు గుర్తిస్తారు. (15)
ద్వారపాల ఉవాచ
కథం యజ్ఞం దశవర్షో విశేస్త్వం
వినీతానాం విదుషాం సంప్రవేశమ్ ।
ఉపాయతః ప్రయతిష్యే తవాహం
ప్రవేశనే కురు యత్నం యథావత్ ॥ 16
ద్వారపాలకుడు అన్నాడు.
వినయవంతులై, నేర్పుగల వారికి మాత్రమే వీలైన సభలో పదేళ్ళవయస్సు గల నీవు ఎలా ప్రవేశిస్తావు. నేను ఏదో ఒక ఉపాయంతో నిన్ను లోపల ప్రవేశపెట్టటానికి ప్రయత్నిస్తాను. యజ్ఞశాల వెలుపల ఉన్న రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళి నీ విద్వత్తును ప్రదర్శించుమని చెప్పాడు. (16)
(ఏష రాజా సంశ్రవణే స్థితస్తే
స్తుహ్యేనం త్వం వచసా సంస్కృతేన ।
స చానుజ్ఞాం దాస్యతి ప్రీతియుక్తః
ప్రవేశనే యచ్చ కించిత్ తవేష్టమ్ ॥)
యజ్ఞమండపంలో రాజు నీమాటలు వినగలిగే దూరంలో ఉన్నాడు. స్తోత్రాలతో అతనిని ప్రసన్నం చేసుకో. అతడు అనుగ్రహించి నీకు ప్రవేశం కల్పిస్తాడు. ఆ పై నీకోరికను కూడ తీరుస్తాడు.
అష్టావక్ర ఉవాచ
భో భో రాజన్ జనకానాం వరిష్ఠ
త్వం వై సమ్రాట్ త్వయి సర్వం సమృద్ధమ్ ।
త్వం వా కర్తా కర్మణాం యజ్ఞియానాం
యయాతిరేకో నృపతిర్వా పురస్తాత్ ॥ 17
అష్టావక్రుడు పలికాడు. నీవు జనక వంశంలో శ్రేష్ఠుడివి. చక్రవర్తివి. నీయందే సంపద సమృద్ధిగా ఉంది. ఈనాటి కాలంలో యజ్ఞకర్మలను నీవే ఆచరిస్తున్నావు. పూర్వకాలంలో యయాతి మాత్రమే నీవంటివాడు. (17)
వృద్ధాన్ బందీ వదవిదో నిగృహ్య
వాదే భగ్నానప్రతిశంకమానః ।
త్వయాభిసృష్టైః పురుషైరాప్తకృద్భిః
జలే సర్వాన్ మజ్జయతీతి నః శ్రుతమ్ ॥ 18
నీవద్ద బంది అనే ప్రసిద్ధ విద్వాంసుడు ఉన్నాడు. వాదవివాదాల్లో పడిన బ్రాహ్మణులను శాస్త్రచర్చలో ఏదో ఒకవిధంగా ఓడిస్తాడు. నీమనుష్యులతోనే నిస్సందేహంగా నీటిలో మునిగేలా చేస్తాడు అని మేం విన్నాం. (18)
సోఽహం శ్రుత్వా బ్రాహ్మణానాం సకాశాద్
బ్రహ్మాద్వైత కథయితుమాగతోఽస్మి ।
క్వాసౌ బందీ యావదేనం సమేత్య
నక్షత్రాణీవ సవితా నాశయామి ॥ 19
నేను బ్రాహ్మణుల ద్వారా ఈ సమాచారాన్ని తెలిసికొని అద్వైత బ్రహ్మపదార్థ చర్చకై వచ్చాను. ఆ బంది ఎక్కడ ఉన్నాడు? సూర్యుడు నక్షత్రాలను కాంతిహీనం చెసినట్లు నేను అతనిని ఓడిస్తాను. (19)
రాజోవాచ
ఆశంససే బందినం వై విజేతుమ్
అవిజ్ఞాయ త్వం వాక్యబలం పరస్య ।
విజ్ఞాతవీర్యైః శక్యమేవం ప్రవక్తుం
దృష్టశ్చాసౌ బ్రాహ్మణైర్వేదశీలైః ॥ 20
రాజు పలికాడు.
నీవు వాదంలో తలపడే వాని శక్తి తెలియక కుతూహలపడుతున్నావు. ప్రతివాదుల శక్తి తెలిసినవాడే ఇలా మాట్లాడాలి. వేదవేదాంగాలు చదివిన చాలా మంది బంది ప్రభావాన్ని గుర్తించారు. (20)
ఆశంససే త్వం బందినం వై విజేతుమ్
అవిజ్ఞాయ తు బలం బందినోఽస్య ।
సమాగతా బ్రాహ్మణాస్తేన పూర్వం
న శోభంతే భాస్కరేణేవ తారాః ॥ 21
బంది వాదబలాన్ని తెలియక జయించాలి అని భావిస్తున్నావు. ఇంతకు పూర్వం బంది వద్దకు వచ్చినవారంతా సూర్యుని ముందు తారల వలె ఓడిపోయి వెళ్ళారు. (21)
ఆశంసంతో బందినం జేతుకామాః
తస్యాంతికం ప్రాప్య విలుప్తశోభాః ।
విజ్ఞానమత్తా నిఃసృతాశ్చైవ తాత
కథం సదస్యైర్వచనం విస్తరేయుః ॥ 22
జ్ఞానోన్మత్తులైన బ్రాహ్మణులు ఎంతమందో బందిని జయించాలని వచ్చి, అతని శక్తి ముందు నిలువలేక ఓడిపోయారు. ఓడినవారు మారుపలుకక సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. వారు సభాసదులతో ఏ ముఖంతో మాట్లాడుతారు? (22)
అష్టావక్ర ఉవాచ
వివాదితోఽసౌ న హి మాదృశైర్హి
సింహీకృతస్తేన వదత్యభీతః ।
సమేత్య మాం నిహతః శేష్యతేఽద్య
మార్గే భగ్నం శకటమివాచలాక్షమ్ ॥ 23
అష్టావక్రుడు అన్నాడు.
మా వంటి వారు బందికి ఎదురుపడలేదు. అందుకే భయం లేక సింహంలా ఉన్నాడు. నేడు నా చేతిలో ఓడి, మౌనంగా ఉండిపోతాడు. కదలని ఇరుసుతో విరిగిన బండి చక్రంలా మారిపోతాడు. (23)
రాజోవాచ
త్రింశకద్వాదశాంశస్య చతుర్వింశతిపర్వణః ।
యస్త్రిషష్టిశతారస్య వేదార్థం స పరః కవిః ॥ 24
రాజు చెప్పాడు - ఎవడు ముప్పది అవయవాలు, పన్నెండు అంశాలు, ఇరవై నాలుడు పర్వాలు, మూడు వందల అరవై అరల పదార్థాలు తెలుసుకుంటాడో వాడే జ్ఞాని. (24)
అష్టావక్ర ఉవాచ
చతుర్వింశతిపర్వ త్వాం షణ్నాభి ద్వాదశప్రధి ।
తత్ త్రిషష్టి శతారం వై చక్రం పాతు సదాగతి ॥ 25
అష్టావక్రుడు చెప్పాడు - పన్నెండు అమావాస్యలు, పన్నెండు పూర్ణిమలు ఇరవై నాలుగు పర్వాలు, ఋతురూపాలు అయిన ఆరునాభులు, మాసాలు పన్నెండు అంశాలు, దినాలు మూడు వందల అరవై, ఇలానిరంతరం తిరిగే కాల చక్రమే నిన్ను రక్షిస్తుంది. (25)
రాజోవాచ
వడవే ఇవ సంయుక్తే శ్యేనపాతే దివౌకసామ్ ।
కస్తయోర్గర్భమాధత్తే గర్భం సుషువతుశ్చ కమ్ ॥ 26
రాజు పలికాడు - రెండు గుర్రాల వలె కలిసి ఉండి డేగవలె హఠాత్తుగా ఆకాశంలోంచి దిగుతాయో ఆ రెండింటి గర్భాన్ని ఏ దేవతలు ధరిస్తారు. వారు దేన్ని పుట్టిస్తారు? (26)
అష్టావక్ర ఉవాచ
మా స్మ తే తే గృహే రాజన్ శాత్రవాణామపి ధ్రువమ్ ।
వాతసారథిరాగంతా గర్భం సుషువతశ్చ తమ్ ॥ 27
అష్టావక్రుడు అన్నాడు - ఆ రెండు నీశత్రువుల ఇండ్లపై కూడ పడవు. వాయువు సారథిగా కల మేఘం ఈ రెంటి గర్భాన్ని ధరిస్తుంది. ఆ రెండు మళ్ళీ మేఘరూపమైన గర్భాని పుట్టిస్తాయి. (27)
రాజోవాచ
కింస్విత్ సుప్తం న నిమిషతి కింస్విజ్జాతం న చోపతి ।
కస్య స్విద్ధృదయం నాస్తి కిం స్విద్ వేగేణ వర్ధతే ॥ 28
నిద్రిమ్చే సమయంలో కండ్లు మూయనిది ఏది? పుట్టినా దేనికి నడిచే సక్తి ఉండదు?, దేనికి హృదయం ఉండదు?, ఏది వేగంగా పెరుగుతుందో తెలుపు? (28)
అష్టావక్ర ఉవాచ
మత్స్యః సుప్తో న నిమిషతి అండం జాతం న చోపతి ।
అశ్మనో హృదయం నాస్తి వేగేన వర్ధతే ॥ 29
చేప నిద్రిస్తున్నా కళ్ళు తెరిచే ఉంచుతుంది. గుడ్డు జన్మించినా కదల లేదు. రాతికి హృదయం లేదు. నది వేగంతో పెరుగుతూ ఉంటుంది. (29)
రాజోవాచ
న త్వాం మన్యే మానుషం దేవసత్త్వం
న త్వం బాలః స్థవిరః సమ్మతో మే ।
న తే తుల్యో విద్యతే వాక్ర్పలాపే
తస్మాద్ ద్వారం వితరామ్యేష బందీ ॥ 30
రాజు పలికాడు. - నీ శక్తి అమామషం, దైవికం. నీవు బాలుడవు అయినా నాదృష్టిలో వృద్ధుడవే. వాద ప్రతివాదాల్లో నిన్ను మించినవాడు లేడు. నీకు యజ్ఞమండపంలో ప్రవేశం కల్పింపబడుతోంది. నీవు కలవాలి అనుకొన్న బంది ఇతడే. (30)
ఇది శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి
లోమశతీర్థయాత్రాయామష్టావక్రీయే ద్వాత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 133 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో అష్టావక్రీయము అను నూట ముప్పది మూడవ అధ్యాయము. (133)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 31 శ్లోకాలు.)