141. నూట నలువది ఒకటవ అధ్యాయము
ధర్మరాజు గంధమాదనమునకు పోవుటకు నిశ్చయించుట.
యుధిష్ఠిర ఉవాచ
భీమసేన యమౌ చోభౌ పాంచాలి చ నిబోధత ।
నాస్తి భూతస్య నాశో వై పశ్యతాస్మాన్ వనేచరాన్ ॥ 1
ద్రౌపదీ భీమసేన నకులసహదేవులారా! మీరు సావధానంగా వినండి. పూర్వం చేసిన పనుల ఫలం అనుభవింపక తప్పదు. మనం రాజవంశీయులం. అయినా వనసంచారం చేస్తూ ఉన్నాం. (1)
దుర్బలాః క్లేశితాః స్మేతి యద్ బ్రువామేతరేతరమ్ ।
అశక్యేఽపి వ్రజామో యద్ ధనంజయదిదృక్షయా ॥ 2
మనం దుర్బలం అయి కష్టాలు అనుభవిస్తున్నాం. అయినా ఒకరితో ఒకరు ఉత్సాహంగా మాట్లాడుకొంటున్నాం. తెలియని మార్గంలో కూడ చురుకుగా ముందుకు సాగుతున్నాం. మనం అందరి హృదయాల్లో అర్జునుని చూడాలనే ఒకే ఒక కోరిక బలంగా ఉంది. (2)
తన్మే దహతి గాత్రాణి తూలరాశిమివానలః ।
యచ్చ వీరం న పశ్యామి ధనంజయముపాంతికాత్ ॥ 3
ఇంత కష్టపడినా ధనంజయుని సమీపంనుంచైనా చూడలేకపోతున్నాను. దూదిరాశిని అగ్ని మండించినట్లు ఈ ఆలోచన నా శరీరావయవాలను మండిస్తోంది. (3)
తస్య దర్శనతృష్ణం మాం సానుజం వనమాస్థితమ్ ।
యాజ్ఞసేన్యాః పరామర్శః స చ వీర దహత్యుత ॥ 4
అతనిని చూడాలనే బలమైన కోరికతో మీ అందరితో కలిసి ఈ వనానికి వచ్చాను. దుశ్శాసనుడు ద్రౌపది జుట్టును పట్టుకుని లాగాడు. అనే విషయం గుర్తుకు వచ్చినప్పుడు నా మనస్సు శోకంతో నిండిపోతోంది. (4)
నకులాత్ పూర్వజం పార్థం న పశ్యామ్యమితౌజసమ్ ।
అజేయముగ్రధన్వానం తేన తప్యే వృకోదర ॥ 5
భయంకరమైన విల్లును ధరించి, జయింప శక్యంగాని, అమితబలసంపన్నుడు అయిన అర్జునుని చూడని కారణంగా చాలా దుఃఖం కలుగుతోంది. (5)
తీర్థాని చైవ రమ్యాణి వనాని చ సరాంసి చ ।
చరామి సహ యుష్మాభిః తస్య దర్శనకాంక్షయా ॥ 6
అర్జునుని చూడాలనే తీవ్రమైన కాంక్షతో నేను మీతో కలిసి అనేకతీర్థాలలో, సుందరారణ్యాల్లో సరోవరతీరాల్లో సంచరిస్తున్నాను. (6)
పంచవర్షాణ్యహం వీరం సత్యసంధం ధనంజయమ్ ।
యన్న పశ్యామి బీభత్సుం తేన తప్యే వృకోదర ॥ 7
ఇప్పటికి అర్జునుని చూచి అయిదు సంవత్సరాలు గడిచింది. వీరుడు, సత్యసంధుడు అయిన అర్జునుని చూడకపోవడంతో దుఃఖంతో పరితపిస్తున్నాను. (7)
తం వై శ్యామం గుడాకేశం సింహవిక్రాంతగామినమ్ ।
న పశ్యామి మహాబాహుం తేన తప్యే వృకోదర ॥ 8
చామనచాయ రంగు కలిగి, నిద్రను జయించి, సింహ పరాక్రమం, పొడవైన బాహువులూ కల అర్జునుని చూడనంతవరకు నాకు బాధ కలుగుతూ ఉంటుంది. (8)
కృతాస్త్రం నిపుణం యుద్ధేఽప్రతిమానం ధనుష్మతామ్ ।
న పశ్యామి కురుశ్రేష్ఠ తేన తప్యే వృకోదర ॥ 9
అస్త్రవిద్యాప్రవీణుడు, యుద్ధకుశలుడు, సాటిలేని ధనుర్ధరుడు అయిన అర్జునుని చూడక నాకు తీవ్రదుఃఖం కలుగుతోంది. (9)
చరంతమరిసంఘేషు కాలే క్రుద్ధమివాంతకమ్ ।
ప్రభిన్నమివ మాతంగం సింహస్కంధం ధనంజయమ్ ॥ 10
యుద్ధసమయాన శత్రుమూకలలో కోపించిన యముని వలె సంచరించే వాని మూపురం సింహం వలె ఉన్నతమై ఉంటుంది. మదగజం వలె ప్రకాశిమ్చే ఆ అర్జునుని ఇంతవరకు కలియలేదు. కావున నాకు దుఃఖం కలుగుతోంది. (10)
యః స శక్రాదనవరః వీర్యేణ ద్రవిణేన చ ।
యమయోః పూర్వజః పార్థః శ్వేతాశ్వోఽమితవిక్రమః ॥ 11
దుఃఖేన మహతావిష్టః తం న పశ్యామి ఫాల్గునమ్ ।
అజేయముగ్రధన్వానం తేన తప్యే వృకోదర ॥ 12
పరాక్రమంలో, సంపదలో ఇంద్రునితో సమానుడై నకుల సహదేవుల కంటె పెద్దయై, ఉగ్రధనుర్ధరుడై, అజేయుడై, వీరశ్రేష్ఠుడై, తిరుగులేని పరాక్రమం కల అర్జునుని దర్శనం కలుగక మిక్కిలి తపిస్తున్నాను. (11,12)
సతతం యః క్షమాశీలః క్షిప్యమాణోఽప్యణీయసా ।
ఋజుమార్గప్రపన్నస్య శర్మదాతాభయస్య చ ॥ 13
స తు జిహ్మప్రవృత్తస్య మాయయాభిజిఘాంసతః ।
అపి వజ్రధరస్యాపి భవేత్ కాలవిషోపమః ॥ 14
చిన్నవారిచే ఆక్షేపింపబడినా ఓర్పుకల సరళమార్గంలో నడుస్తూ. శరణాగతులకు అభయమిచ్చే అర్జునుడు, వక్రగమనంతో మాయతో దెబ్బతీస్తే ఇంద్రునికి కూడ యముడు అవుతాడు. విషం వలె భయంకరమైనవాడు కాగలడు. (13,14)
శత్రోరపి ప్రపన్నస్య సోఽనృశంసః ప్రతాపవాన్ ।
దాతాభయస్య బీభత్సుః అమితాత్మా మహాబలః ॥ 15
సర్వేషామాశ్రయోఽస్మాకం రణేఽరీణాం ప్రమర్దితా ।
ఆహర్తా సర్వరత్నానాం సర్వేషాం నః సుఖావహః ॥ 16
శత్రువు పట్ల కూడా ప్రసన్నుడు, దయాళువు, ప్రతాపవంతుడు. అభయప్రదాత అయిన బీభత్సుడు మనందరికి రక్షణ. యుద్ధంలో శత్రువులను బాధించగల దిట్ట. అతడు మనకు సర్వ రత్నాలు తెచ్చియిచ్చి సుఖాన్ని కలిగించాడు. (15,16)
రత్నాని యస్య వీర్యేణ దివ్యాన్యాసన్ పురా మమ ।
బహూని బహుజాతీని యాని ప్రాప్తః సుయోధనః ॥ 17
అర్జునుని పరాక్రమం వల్ల జాతిరత్నాల రాసులు మన కోశాగారాన్ని చేరాయి. వాటిని అన్నింటిని ఇప్పుడు సుయోధనుడు స్వాధీనం చేసుకొన్నాడు. (17)
యస్య బాహుబలాద్ వీర సభా చాసీత్ పురా మమ ।
సర్వరత్నమయీ ఖ్యాతా త్రిషు లోకేషు పాండవ ॥ 18
అర్జునుని బాహుబలం వల్ల నా రత్నసంబరితమయిన సభ ముల్లోకాల్లో ప్రసిద్ధిని పొందింది. (18)
వాసుదేవసమం వీర్యే కార్తవీర్యసమం యుధి ।
అజేయమమితం యుద్ధే తం న పశ్యామి ఫాల్గునమ్ ॥ 19
పరాక్రమంలో శ్రీకృష్ణునితోను, యుద్ధంలో కార్తవీర్యార్జునునితోను సమానమయి, జయింపవీలుకాని అర్జునుని చాలారోజుల నుండి చూడలేకపోయాను. (19)
సంకర్షణం మహావీర్యం త్వాం చ భీమాపరాజితమ్ ।
అనుయాతః స్వవీర్యేణ వాసుదేవం చ శత్రుహా ॥ 20
భీమా! శత్రువులను అవలీలగా చంపగల అర్జునుడు తన పరాక్రమంతో బలరామునితోనూ, అజేయుడైన శ్రీకృష్ణునితోను పోటీపడుతున్నాడు. (20)
యస్య బాహుబలే తుల్యః ప్రభావే చ పురందరః ।
జవే వాయుర్ముఖే సోమః క్రోధే మృత్యుః సనాతనఆHఅ ॥ 21
అర్జునుడు బాహుబలంతో, ప్రభావంలో ఇంద్రసముడు. వేగంలో వాయుసమానుడు. ముఖంలో చంద్రసముడు, కోపంలో ముత్యుసమానుడు. (21)
తే వయం తం నరవ్యాఘ్రం సర్వే వీర దిదృక్షవః ।
ప్రవేక్ష్యామో మహాబాహో పర్వతం గంధమాదనమ్ ॥ 22
అలాంటి నరశ్రేష్ఠుడైన అర్జునుని చూడాలని మనమంతా గంధమాదనపర్వతం చేరుకున్నాం. (22)
విశాలా బదరీ యత్ర నరనారాయణాశ్రమః ।
తం సదాధ్యుషితం యక్షైః ద్రక్ష్యామో గిరిముత్తమమ్ ॥ 23
కుబేరనలినీం రమ్యాం రాక్షసైరభిసేవితామ్ ।
పద్భిరేవ గమిష్యామః తప్యమానా మహత్ తపః ॥ 24
విశాలమయిన రేగువనం ఉన్న నరనారాయణాశ్రమం ఇదే. ఉత్తమమయిన ఈ పర్వతం మీదనే యక్షులు సదా నివసిస్తారు. ఇంతేగాక రాక్షసులనేకులు గల కుబేరుని నది ఇక్కడే ఉంది. అక్కడికి తపస్సు చేస్తూ కాలినడకనే వెడదాం. (23,24)
న చ యానవతా శక్యః గంతుం దేశో వృకోదర ।
న నృశంసేన లుబ్ధేన నాప్రశాంతేన భారత ॥ 25
ప్రయాణ సాధనాలతో ఆ ప్రదేశానికి వెళ్లటం కష్టం. లోభి, క్రూరుడు, ప్రశాంతతలేనివాడు ఆ ప్రదేశాన్ని చేరలేడు. (25)
తత్ర సర్వే గమిష్యామః భీమార్జునగవేషిణః ।
సాయుధా బద్ధనిస్త్రింశాః సార్ధం విప్రైర్మహావ్రతైః ॥ 26
అర్జునుని వెదకుతూ మనం శస్త్రాస్త్రాలు దాల్చి, వ్రతనియమం పాటించే బ్రాహ్మణులతో కలిసి ఆ ప్రదేశానికి వెడదాం. (26)
మక్షికాదంశమశకాన్ సింహాన్ వ్యాఘ్రాన్ సరీసృపాన్ ।
ప్రాప్నోత్యనియతః పార్థ నియతస్తాన్ న పశ్యతి ॥ 27
ఇంద్రియసంయమంలేనివారు, ఆ పర్వతానికి చేరితే ఈగలు, దోమలు, సింహ, వ్యాఘ్ర, సర్పాలబారిన పడతారు. ఇంద్రియనిగ్రహం ఉంటే అవి కనపడనే కనపడవు. (27)
తే వయం నియతాత్మానః పర్వతం గంధమాదనమ్ ।
ప్రవేక్ష్యామో మితాహారాః ధనంజయదిదృక్షవః ॥ 28
కావున మనం అర్జునుని చూడగోరి ఇంద్రియనిగ్రహం పాటించి, మితాహారంతో గంధమాదనపర్వతాన్ని చేరదాం. (28)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం గంధమాదనప్రవేశే ఏకచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 141 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో గంధమాదనప్రవేశము అను నూట నలువది ఒకటవ అధ్యాయము. (141)